Annadurai
-
ఒన్రే కులం, ఒరువనే దేవన్
స్వాతంత్య్రోద్యమంలో పాల్గొనకుండా, స్వాతంత్య్రం అనంతరం భారతదేశంలో తొలి నాయకుడిగా అవతరించినవారు అన్నాదురై. ఆయన పేరు చివర ఎం.ఎ. అనే రెండు అక్షరాలు ఎప్పుడూ కనిపించేవి. దానితోనే ఆయన గౌరవాన్ని అందుకునేవారు. బ్రాహ్మణేతర జస్టిస్ పార్టీలో ఉన్నతస్థాయి నేతల ఉపన్యాసాలను తమిళంలోకి అనువదించడం ద్వారా అన్నాదురై రాజకీయ జీవితం మొదలైంది. 1937–39 మధ్యలో జరిగిన తొలి హిందీ వ్యతిరేక ఉద్యమం ఆయన భాషా నైపుణ్యాన్ని తొలిసారిగా ఘనంగా చాటి చెప్పింది. ఆ భాషా కౌశలాన్ని ఆయన ఆ తర్వాత సినిమా స్క్రిప్టుల రచనకు కూడా ఉపయోగించారు. పెరియార్ ఇ.వి. రామస్వామి ఆయనను తన కుడి భుజంగా మార్చుకున్నారు! అయితే అనతికాలంలోనే అన్నాదురై ఆయనను స్థానభ్రంశం చెందించి, తానే అధినాయకుడిగా అవతరించారు. బహుశా అన్నాదురై విజయ రహస్యం పెరియార్ ఆలోచనలను, శక్తిమంతమైన భావజాలాన్ని సమర్థంగా ముందుకు నడిపించడంలోనే దాగుంది. పెరియార్ చెప్పిన నాస్తికతను ఆయన మధ్య యుగాల నాటి తమిళ సాధువు తిరుమలర్ మాటగా, ‘ఒన్రే కులం, ఒరువనే దేవన్’ (ఒకే కులం, ఒకే దేవుడు)’గా ప్రచారం చేశారు. వినాయకుడి విగ్రహాల ధ్వంసానికి పెరియార్ పిలుపునిస్తే, అన్నా దానికి భిన్నంగా తను విగ్రహాన్ని పగలగొట్టను, కొబ్బరికాయనూ కొట్టనని చెప్పి ప్రాచుర్యం సంపాదించారు. 1950 లో ద్రావిడ మున్నేట్ర కళగం (డి.ఎం.కె)ను స్థాపించి రాష్ట్ర పరిధిలో తమిళ జాతీయతను భద్రంగా ఎదిగేలా చేసిన అన్నాదురై, ద్వితీయ శ్రేణి నాయకత్వాన్ని బాగా ప్రోత్సహించారు. 60 ఏళ్ల కన్నా ముందే చనిపోవడంతో ఆయన ఉజ్వల భవితకు అకస్మాత్తుగా తెరపడింది. ఆయన చనిపోయినప్పుడు అంతిమయాత్రలో లక్షలాది మంది పాల్గొన్నారు. నిజానికి అది గిన్నిస్ రికార్డులోకి ఎక్కవలసిన ఘటన అని కూడా చాలా మంది చెబుతుంటారు. ఆకట్టుకునే జీరస్వరం గల ఈ అయిదుంపావు అడుగుల నాయకుడు రాజకీయంగా ఎదిగిన క్రమంలో ఆధునిక తమిళనాడు చరిత్రే దాగుంది! . (చదవండి: పోరు బాట.. అగ్గిబరాటా) -
తన పేరు మార్పుపై సీఎం స్టాలిన్ ఆసక్తికర వ్యాఖ్యలు
సాక్షి, చెన్నై: తన తండ్రి కలైంజ్ఞర్ కరుణానిధి.. ‘అయ్యాదురై’ అని తనకు నామకరణం చేయాలని తొలుత నిర్ణయించినా, చివరకు స్టాలిన్‌గా ప్రకటించారని సీఎం ఎంకే స్టాలిన్ ఓ వివాహ వేడుకలో వివరించారు. డీఎంకే ప్రధాన కార్యాలయం అన్నా అరివాలయం కలైంజర్ అరంగంలో ఆదివారం గృహ నిర్మాణ బోర్డు చైర్మన్ పూచ్చి మురుగన్ ఇంటి వివాహ వేడుక జరిగింది. వధువరుల్ని ఆశీర్వదించినానంతరం సీఎం స్టాలిన్ మాట్లాడుతూ, తమ ఇంట్లో ముక్కా ముత్త, ముక్కా అళగిరి అంటూ అందరికీ తమిళ పేర్లు పెట్టినట్టు వివరించారు. అయితే, తనకు మాత్రం స్టాలిన్ అని నామకరణం చేశారని పేర్కొంటూ, ఈ పేరు వెనుక ఉన్న కథను ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకున్నారు. వాస్తవానికి తాను పుట్టగానే అయ్యాదురై అని పేరు పెట్టాలని దివంగత మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి నిర్ణయించారని వివరించారు. ద్రవిడ సిద్ధాంతకర్త పెరియార్‌ను స్మరిస్తూ అయ్యా అని, ద్రవిడ పార్టీల ఆవిర్భావ కర్త అన్నా దురైను స్మరిస్తూ దురై అన్న పదాలను ఎంపిక చేసి తనకు అయ్యాదురై అని నామకరణం చేయడానికి సిద్ధం చేసి ఉంచారని తెలిపారు. అయితే అదే సమయంలో రష్యా అధ్యక్షుడు స్టాలిన్ మరణించడంతో చెన్నైలో సంతాప సభ జరిగిందని వివరించారు. చదవండి: (స్టాలిన్‌కు మద్రాస్ హైకోర్టులో ఊరట.. 18 కేసులు రద్దు) ఇందులో దివంగత నేత కరుణానిధి ప్రసంగిస్తున్న సమయంలో ఆయన చేతికి ఓ పేపర్‌ను ముఖ్య నాయకులు అందించారని పేర్కొన్నారు. అప్పుడు తనకు ఓ కుమారుడు పుట్టాడని, ఆ బిడ్డకు స్టాలిన్ అని నామకరణం చేస్తున్నట్టు ఆ వేదిక మీదే తన పేరును కరుణానిధి ప్రకటించారని వెల్లడించారు. ఇదే విషయాన్ని పలుమార్లు తన వద్ద తండ్రి కరుణానిధి ప్రస్తావించే వారని తెలిపారు. కాగా ఈ గడ్డలో పుట్టే ప్రతి బిడ్డకు తమిళ పేరే పెట్టాలని విజ్ఞప్తి చేశారు. ఇక చివరకు తనకు దేవుళ్లలో మురగన్ అంటే అభిమానం ఎక్కువేనని వ్యాఖ్యలు చేస్తూ తన ప్రసంగాన్ని ముగించారు. -
అన్నాకు ఘన నివాళి
సాక్షి, చెన్నై: దివంగత తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి అన్నాదురై 50వ వర్ధంతిని ఆదివారం వాడవాడలా ద్రవిడ పార్టీలు ఘనంగా జరుపుకున్నాయి. డీఎంకే, అన్నాడీఎంకే, డీఎండీకే, ఎండీఎంకే, ద్రవిడ కళగంల నేతలు మెరీనా తీరంలోని అన్నా సమాధి వద్దకు తరలివచ్చి పుష్పాంజలి ఘటించారు. డీఎంకే నేతృత్వంలో శాంతి ర్యాలీలు నిర్వహించారు. అన్నా చిత్ర పటానికి సీఎం పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీరు సెల్వం నివాళులర్పించారు. అన్నాడీఎంకే నేతృత్వంలో ఆలయాల్లో సహఫంక్తి భోజనాలు ఏర్పాటుచేశారు. అన్నాడీఎంకే నేతృత్వంలో.. అన్నాడీఎంకే నేతృత్వంలో రాష్ట్రంలో అన్నా వర్ధంతిని పురస్కరించుకుని వాడవాడల్లో కార్యక్రమాలు నిర్వహించారు. అలాగే, సహఫంక్తి భోజనాలు నిర్వహించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీరు సెల్వం తమ నివాసాల వద్ద అన్నా చిత్ర పటానికి పుష్పాంజలి ఘటించారు. అనంతరం పార్టీ ప్రిసీడియం చైర్మన్ మధుసూదనన్ మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలతో కలసి మెరీనా తీరంలోని అన్నా సమాధి వద్దకు చేరుకుని ఘన నివాళులర్పించారు. అన్నా ప్రసంగాలు, ఆయన సేవల్ని నెమరువేసుకున్నారు. కేపీ మునుస్వామి, వైద్యలింగం వంటి నేతలు, మంత్రి జయకుమార్లతో పాటుపార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు పలువురు తరలి వచ్చి అన్నాకు నివాళులర్పించారు. తదుపరి మంత్రులు, ప్రజాప్రతినిధులు, అన్నాడీఎంకే వర్గాలు పలుచోట్ల ఉన్న ఆలయాలకు చేరుకుని, ప్రజలతో కలసి సహఫంక్తి భోజనాలు చేశారు. కేకే నగర్‌లోని శక్తి వినాయక ఆలయంలో సీఎం పళనిస్వామి పూజలుచేశారు. అక్కడ ప్రజలతో కలిసి సహçపంక్తి భోజనం చేశారు. తిరువాన్మియూరులోని మరుందీశ్వర ఆలయంలో డిప్యూటీ సీఎం పన్నీరుసెల్వం పూజలు చేశారు. సహపంక్తి భోజన కార్యక్రమానికి హాజరయ్యారు. మంత్రులు దాదాపుగా 30 మంది చెన్నైలోని వివిధ ఆలయాల్లో పూజల అనంతరం ప్రజలతో కలిసి సంహపంక్తి భోజనాలు చేశారు. -
దళితులకు దగ్గరి బంధువు కరుణానిధి
సాక్షి, న్యూఢిల్లీ : అన్నాదురై మరణంతో 1969లో ఎం. కరుణానిధికి తమిళనాడు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లభించింది. అప్పటి వరకు అన్నాదురై మంత్రి వర్గంలో హిందీ వ్యతిరేక, ఢిల్లీ వ్యతిరేక ఉద్యమాల స్ఫూర్తి కలిగిన వారు, విద్యావేత్తలు, వాక్ఛాతుర్యం కలిగిన వారు, యువకులు ఉండేవారు. ఆ తర్వాత 1969 నుంచి 1976 వరకు వరుసగా ముఖ్యమంత్రిగా ఉన్న కరుణానిధి తన మంత్రివర్గంలోకి, ముఖ్యంగా అధికార యంత్రాంగంలోకి ఈ రంగాలతోపాటు వెనకబడిన వర్గాలు, మరీ ఎక్కువ వెనకబడిన వర్గాల వారు, దళితులను తీసుకున్నారు. పాలనా వ్యవహారాల్లో కిందిస్థాయి పార్టీ కార్యకర్తలకు ప్రత్యక్ష భాగస్వామ్యం కల్పించారు. పంచాయతీ స్థాయి, జిల్లా స్థాయి పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎప్పటికప్పుడు ప్రజల సమస్యలను తెలుసుకొని వాటిని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లాలి. వాటి పరిష్కారం కోసం కృషి చేయాలి. ప్రజా సమస్యల పరిష్కార సలహా కమిటీల్లో అధికారులతోపాటు పార్టీ నాయకులకు కూడా కరుణానిధి ప్రభుత్వం అవకాశం కల్పించింది. అధికారులుగానీ, పార్టీ నాయకులుగానీ అవినీతికి పాల్పడకుండా ఈ సలహా సంఘాలు పర్యవేక్షణ సంస్థలుగా పనిచేసేవి. 1969 నుంచి 1976 మధ్య తమిళనాడు పబ్లిక్ కమిషన్ సర్వీస్ నియామకాల తీరును పరిశీలించగా, అంతకుముందు ఎన్నడు లేని విధంగా వెనకబడిన వర్గాలు, బాగా వెనకబడిన వర్గాల వారు, దళితులు ఎక్కువ మంది ప్రభుత్వ ఉద్యోగాల్లోకి వచ్చారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల వారికి ఉద్యోగాలు రావడం విశేషం. పోలీసులు, రెవెన్యూ అధికారుల్లో దళితులకు ఎక్కువ ఉద్యోగాలు లభించాయి. రాష్ట్రంలోని సామాజిక వర్గాలు, వాటి సంఖ్యా బలం, ఇప్పటికే ఉద్యోగాల్లో వారి ప్రాతినిధ్యం ఎంత ? అన్న అంశాలను పరిగణలోకి తీసుకొని ఏ వర్గం వారికి ఎన్ని ఉద్యోగాలో ముందుగా ఓ ప్రణాళికను రచించి దానికి అనుగుణంగా నియామక ప్రక్రియను పూర్తి చేయడం వల్ల వెనకబడిన వర్గాల వారికి, దళితులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎక్కువ అవకాశం లభించింది. రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగంలో అన్ని వర్గాల ప్రజలకు సరైన ప్రాతినిధ్యం కల్పించినప్పుడే సమాజంలో కూడా వారికి సరైన ప్రాతినిధ్యానికి బాటలు వేయవచ్చన్నది కరుణానిధి ఆచరించిన సిద్ధాంతం. దళితులకు, బీసీలకు సామాజిక హక్కులను సాకారం చేయాలంటూ 1925లో జరిగిన కాంచీపురం కాంగ్రెస్‌లో పెరియార్ రామస్వామి ఇచ్చిన పిలుపును స్ఫూర్తిగా తీసుకొనే వారి అభ్యున్నతికి కరుణానిధి ప్రాధాన్యత ఇచ్చినట్లు కనిపిస్తోంది. కరుణానిధి నాటి యంత్రాంగం గ్రామీణాభివృద్ధియే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తూ పంచాయతీ స్థాయి, సమతి స్థాయి కార్యక్రమాలనే ఎక్కువగా అమలు చేసింది. బ్రిటీష్ కాలం నాటి నుంచి పరిపాలనారంగంలో కలెక్టర్లదే ప్రధాన పాత్ర. జిల్లా డీఎంకే నాయకులకు నేరుగా ఇటు జిల్లా కలెక్టర్లు, అటు పార్టీ అదిష్టాన నేతలతో నేరుగా మాట్లాడే అవకాశం ఉండేది. అందుకని రోజువారి పాలనా వ్యవహారాల్లో జిల్లా పార్టీ నాయకులు జోక్యం చేసుకునే వారు. గ్రామీణస్థాయి నుంచి వచ్చిన ఉద్యమం కారణంగా డిఎంకే బలపడడంతో దిగువ స్థాయిలో కూడా పార్టీకి ప్రాధాన్యత ఏర్పడింది. 1971లో జరిగిన ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో డీఎంకే ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ జిల్లా నాయకులు మరింతగా బలపడ్డారు. జిల్లా అభివృద్ధిలో కలెక్టర్‌తోపాటు జిల్లా డిఎంకే నాయకుడు ప్రత్యక్ష ప్రధాన పాత్రదారుడయ్యారు. ఇటు పార్టీది, అటు ప్రభుత్వ యంత్రాంగానిది ఒకటే లక్ష్యం. రాష్ట్రాభివృద్ధి. అందులోనూ అన్ని వర్గాల ప్రజలకు సమాన న్యాయం జరగడం. (గమనిక: ‘ది ద్రావిడియన్ ఇయర్స్’ పేరిట ఎస్. నారాయణ్ రాసిన పుస్తకంలోని కొన్ని అంశాలివి. నారాయణ్, కరుణానిధి ప్రభుత్వ యంత్రాంగంలో పనిచేయడమే కాకుండా ఆ తర్వాత వాజపేయి ప్రధానికి ఉన్నప్పుడు ఆయనకు ఆర్థిక సలహాదారుగా పనిచేశారు) -
తుది వీడ్కోలు..!
వ్యక్తి ఆరాధన తమిళనాట తీవ్రస్థాయిలో ఉంటుంది. తాము ప్రేమించేనేత మరణిస్తే తట్టుకోలేక పెద్ద సంఖ్యలో అభిమానులు మృతిచెందిన సంఘటనలు గతంలో చూశాం. అలాగే ఆ నేతల చివరి చూపుల కోసం లక్షలాది మంది తరలివచ్చి అంతిమయాత్రల్లో పాల్గొన్న దృశ్యాలు తమిళనాడులో కనిపిస్తాయి. అభిమానం ఎంతగా ఉందంటే అన్నాదురై అంతిమయాత్రలో పాల్గొన్న వారి సంఖ్య గిన్నెస్‌బుక్‌లో కూడా రికార్డ్ అయ్యింది. అన్నా మొదలుకుని కరుణానిధి వరకు ఈ అంతిమయాత్రలు సాగిన తీరు ఇలా ఉంది. అన్నాదురై: తమ భావాలు, అభిప్రాయాలతో, చేపట్టిన కార్యక్రమాలు, పనులతో ప్రజలపై చెరగని ముద్ర వేసిన రాజకీయ ప్రముఖులు, నేతలకు మనదేశంలో నీరాజనాలు పట్టడం చూస్తుంటాం. ఇలాంటి నేతలు మరణించినపుడు వారి అంతిమయాత్రలో లెక్కకు మించి సంఖ్యలో ప్రజలు పాల్గొని శ్రద్ధాంజలి ఘటించడం తెలిసిందే. ద్రవిడోద్యమ దిగ్గజంగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవడంతో పాటు, తమిళ హక్కులు, సంస్కతి పరిరక్షణలో తుదికంటా పోరాడి తమిళనాడులోని వివిధ వర్గాల ప్రజలపై ప్రభావం చూపిన మాజీ సీఎం అన్నాదురై 59 ఏళ్ల వయసులో కేన్సర్‌తో మరణించారు. 1969 ఫిబ్రవరి 3న జరిగిన ఆయన అంతిమయాత్రకు కోటిన్నర మంది ప్రజలు హాజరుకావడంతో ‘అత్యధిక సంఖ్యలో ప్రజలు పలికిన తుది వీడ్కోలు’గా గిన్నెస్ ప్రపంచరికార్డ్ నమోదైంది. చెన్నైలో అన్నాదురై భౌతికకాయంతో కూడిన శవపేటికను లక్షలాది మంది అనుసరిస్తున్న ఫోటోలు దీనికి సాక్ష్యంగా నిలిచాయి. ఎంజీఆర్: తమిళనాడులో డీఎంకే రాజకీయాలు, భావజాల వ్యాప్తికి సినీమాధ్యమం ద్వారా కృషి చేసిన వారిలో అన్నాదురై, ఎం.కరుణానిధి, ఎంజీ.రామచంద్రన్ ప్రముఖులు. అయితే సినిమా తెరపై వాటిని తన నటనరూపంలో చూపి ఎంజీఆర్ ప్రజలకు ఎంతో దగ్గరయ్యారు. సమాజంలోని వివిధ వర్గాల ప్రజల సమస్యలు ఎత్తిచూపుతూ, వారితో మమేకమయ్యేలా రూపొందించిన పాత్రలు (కథ,స్క్రీన్ ప్లే కరుణానిధి) ఆయనను అగ్రస్థానంలో నిలబెట్టాయి. ఆ తర్వాత ఆయన డీఎంకేతో విభేదించి సొంతంగా ఏఐడీఎంకేను స్థాపించి సీఎం పీఠాన్ని అధిరోహించారు. కొన్నేళ్ల తర్వాత అనారోగ్యం బారిన పడి తిరిగి కోలుకోలేదు. 1987 డిసెంబర్ 24న 71 ఏళ్ల వయసులో ఆయన కన్నుమూశారు. ఆయన మరణం తమిళనాడు వ్యాప్తంగా తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. పోలీసులు కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులివ్వాల్సి వచ్చింది. అంతిమయాత్రలో చెలరేగిన హింసలో 29 మంది మరణించారు. 47 మంది పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. ఆయన మరణాన్ని తట్టుకోలేక 30 మంది అభిమానులు ఆత్మహత్య చేసుకున్నారు. ఎంజీఆర్ భౌతికకాయాన్ని ఉంచిన వాహనాన్ని అనుసరించినవారు, అంతిమయాత్రలో పాల్గొన్న వారు కలిపి దాదాపు పది లక్షల మంది ఉండొచ్చునని ఓ అంచనా. జయలలిత: సినీనటిగా జీవితం ప్రారంభించిన జె.జయలలిత, ఆ తర్వాత రాజకీయాల్లోనూ ఎంజీఆర్ సన్నిహితురాలిగా మారి ఎన్నో ఎత్తుపళ్లాలు చవిచూశారు. అటు ప్రతిపక్షపాత్రతో పాటు సీఎం పదవిని చేపట్టాక, అనేక సంక్షేమపథకాల అమలు ద్వారా పేదవర్గాల ప్రజలకు దగ్గరయ్యారు. విప్లవనాయకి (పురచ్చి తలైవి)గా ప్రజల ఆదరాభిమానాలు చూరగొన్నారు. తమిళ రాజకీయాల్లో భాగంగా చోటు చేసుకున్న పరిణామాల్లో ఎన్నికల్లో గెలుపోటములు చవిచూశారు. మళ్లీ సీఎంగా ఎన్నికై ఎన్నో కొత్త పథకాలు ప్రవేశపెట్టారు. అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో చేరిన ఆమె అక్కడే తుదిశ్వాస విడిచారు. చెన్నై మెరీనా బీచ్‌లో జరిగిన అంతిమయాత్రలో దాదాపు పదిలక్షల మంది పాల్గొన్నట్టుగా అంచనా వేస్తున్నారు. కరుణానిధి: తమిళనాడు రాజకీయాలను సుదీర్ఘకాలం పాటు ప్రభావితం చేసిన మాజీ సీఎం ఎం.కరుణానిధి 94 ఏళ్ల వయసులో అనారోగ్యంతో మరణించారు. ఐదుసార్లు సీఎంగా, 13 పర్యాయాలు ఎమ్మెల్యేగా, ఓ పర్యాయం ఎమ్మెల్సీగా, దాదాపు 50 ఏళ్ల పాటు డీఎంకే పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించిన ఆయన ఆ రాష్ట్ర రాజకీయాలపై తనదైన ముద్ర వేశారు. మెరీనా బీచ్‌లోనే కరుణానిధి భౌతికకాయాన్ని ఖననం చేసేందుకు డీఎంకే పట్టుబట్టడంతో ఈ అంశంపై కోర్టు గుమ్మం తొక్కాల్సి వచ్చింది. చివరకు న్యాయస్థానం దానికి అనుకూలంగానే ఆదేశాలిచ్చింది. కరుణానిధి భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం రాజాజీ హాలు వద్ద ఉంచిన సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఇద్దరు మృతి చెందినట్టు పలువురు గాయపడినట్లు వార్తాసంస్థలు వెల్లడించాయి. అక్కడ పెద్దసంఖ్యలో గుమికూడిన వారి నియంత్రణకు పోలీసులు లాఠీచార్జీ జరపడంతో తోపులాటలు చోటుచేసుకున్నాయి. ఆ తర్వాత ఈ అంతిమయాత్ర చెన్నై నగర వీధుల మీదుగా మెరీనా బీచ్‌కు చేరుకుంది. దేశ రాజకీయాల్లో అత్యంత సీనియర్‌నేతల్లో ఒకరైన కరుణానిధి అంతిమయాత్రలో లక్షల్లో ప్రజలు పాల్గొన్నట్టుగా అంచనావేస్తున్నారు. మెరీనా తీరంలోనే మాజీ సీఎంలు అన్నాదురై, ఎంజీఆర్, జయలలిత సమాధుల పక్కనే కరుణానిధి పార్ధివదేహాన్ని కూడా ఖననం చేశారు. - (సాక్షి నాలెడ్జ్ సెంటర్) -
చెల్లి కోసం వచ్చి పెళ్లయిన అక్కని తీసుకెళ్లాడు
సాక్షి ప్రతినిధి, చెన్నై: పెళ్లిచూపులకు వెళ్లడం, అమ్మాయి నచ్చితే వివాహం చేసుకోవడం, లేకుంటే మరో సంబంధానికి వెళ్లడం మగవారికి మామూలే. అయితే ఓ ప్రబుద్ధుడు చిన్నకూతురిని చేసుకునేందుకు పెళ్లిచూపులకు వచ్చి పెళ్లయి బిడ్డ తల్లయిన పెద్దమ్మాయిని లేపుకెళ్లాడు. చెన్నైలో చోటుచేసుకున్న ఈ విచిత్రం వివరాలు ఇలా ఉన్నాయి. చెన్నై మైలాపూరు ఏకాంబరం పిళ్లై వీధికి చెందిన ఓ వ్యక్తికి 26, 22 ఏళ్ల వయసులో ఇద్దరు కుమార్తెలున్నారు. పెద్దమ్మాయికి పెళ్లయి మూడేళ్ల కుమారుడు ఉన్నాడు. రెండో కుమార్తెకు పెళ్లి చేయాలని నిశ్చయించుకున్న ఆయన సంబంధాలు వెతకడం ప్రారంభించాడు. ఈ ఏడాది జనవరిలో అన్నాదురై (28) అనే వ్యక్తి పెళ్లిచూపులకు వచ్చి అమ్మాయిని చూశాడు. ఇదే సమయంలో పెద్దమ్మాయితో మాట కలిపి వెళ్లిపోయాడు. పెళ్లిచూపుల గురించి అమ్మాయి తండ్రికి ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. అయితే పెద్దమ్మాయితో టచ్‌లో ఉన్నాడు. ఇదిలా ఉండగా, బుధవారం సాయంత్రం 4 గంటల సమయంలో తన మూడేళ్ల కుమారుడిని వెంటబెట్టుకుని అన్నాదురైతో అక్క ఇల్లు వదిలి లేచిపోయింది. పెద్దకుమార్తె అన్నాదురైతో లేచిపోయిందని ఆలస్యంగా తెలుసుకున్న తండ్రి మైలాపూరు పోలీసులకు గురువారం ఫిర్యాదుచేశాడు. తన చిన్నకుమార్తె పెళ్లిచూపులకు వచ్చిన అన్నాదురైతో పెద్ద కుమార్తె లేచిపోయిందని, వెళ్తూ వెళ్తూ ఇంటిలోని ఐదు సవర్ల నగలు, రూ.2లక్షలు నగదును తీసుకుని మూడేళ్ల కుమారుడితో సహా పారిపోయిందని పేర్కొన్నాడు. ప్రేమజంట కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. -
ఏ పార్టీ నుంచి ఆక్షేపణ రాలేదు
తమిళసినిమా: అన్నాదురై చిత్రానికి ఏ రాజకీయ పార్టీ నుంచి ఎలాంటి ఆక్షేపణ రాలేదని ఆ చిత్ర కథానాయకుడు విజయ్‌ఆంటోని తెలిపారు. ఈయనకు జంటగా డయానా సంబిక నటించిన ఈ చిత్రాన్ని నటి రాధికాశరత్‌కుమార్ ఆర్.స్టూడియోస్, ఫాతిమా విజయ్అంటోని, విజయ్‌ఆంటోని ఫిలిం కార్పొరేషన్ సంస్థలు కలిసి నిర్మించారు. నవ దర్శకుడు శ్రీనివాసన్ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని పిక్చర్ బాక్స్ కంపెనీ అధినేత అలెగ్జాండర్ తమిళనాడు హక్కులను కొనుగోలు చేసి గురువారం 400 థియేటర్లలో విడుదల చేశారు. విజయ్‌ఆంటోని చిత్రాల్లో అత్యధిక థియేటర్లలో విడుదలైన చిత్రం ఇదే అవుతుందని ఆయన గురువారం చెన్నైలో చిత్ర యూనిట్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు. అనంతరం చిత్ర కథానాయకుడు విజయ్‌ఆంటోని మాట్లాడుతూ రాధిక నిర్మాతగా తాను నటుడిగా చిత్రం చేస్తామని ఊహించలేదన్నారు. ఒక మంచి కథా చిత్రానికి పాటలు అవసరం లేదని ఆయన అన్నారు. అదే విధంగా మునుపటి మాదిరి ఇప్పుడు ఆడియోకు ఆదాయం రావడం లేదని పేర్కొన్నారు.అందుకు ఈ చిత్ర పాటలను తన వెబ్సైట్ ద్వారా ఫ్రీగా డౌన్టోడ్ చేసుకోనేలా వసతి కల్పించానని తెలిపారు. అన్నాదురై చాలా పాపులర్ పేరు అని ఆ పేరును చిత్రానికి పెట్టడం వల్ల ఎలాంటి సమస్యలు తలెత్తలేదా?అని అడుగుతున్నారని, ఇందులో తాను ద్విపాత్రాభినయం చేశానని చెప్పారు.అన్న పాత్ర పేరు అన్నాదురై, తమ్ముడి పాత్రపేరు తంబిదురై అని తెలిపారు. అయితే సెన్సార్ సభ్యులు ఈ పేరు గురించి అడిగారని, అందుకు తగిన వివరణ ఇవ్వడంతో వారు సంతృప్తి చెందారని అన్నారు.అయితే ఇప్పటి వరకూ ఏ రాజ కీయ పార్టీ ఈ టైటిల్‌కు ఆక్షేపణ తెలపలేదని విజయ్‌ఆంటోని తెలిపారు. -
‘ఆ టైటిల్‌కు ఏ పార్టీ అభ్యంతరం తెలపలేదు’
సాక్షి, చెన్నై: అన్నాదురై చిత్రానికి ఏ రాజకీయ పార్టీ నుంచి ఎలాంటి అభ్యంతరాలు రాలేదని హీరో విజయ్ ఆంటోని తెలిపారు. డయానా చంపికా హీరోయిన్గా నటించిన ఈ చిత్రాన్ని నటి రాధిక శరత్‌కుమార్ ఆర్.స్టూడియోస్, విజయ్ ఆంటోని ఫిలిం కార్పొరేషన్ సంస్థలు కలిసి నిర్మించారు. దర్శకుడు శ్రీనివాస్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. విజయ్ ఆంటోనీ చిత్రాలలో అత్యధిక థియేటర్లతో విడుదలైన చిత్రం ఇదే అవుతుందని గురువారం చిత్ర యూనిట్ విలేకరుల సమావేశంలో పేర్కొంది. ఈ చిత్రంపై హీరో విజయ్‌ఆంటోని మాట్లాడుతూ.. రాధిక నిర్మాతగా తాను నటుడిగా చిత్రం చేస్తామని ఊహించలేదన్నారు. ఇందులో తన పాత్రకు న్యాయం చేశానని.. తనకు రాని విషయాల గురించి ప్రయత్నించనని చెప్పారు. ఒక మంచి కథా చిత్రానికి పాటలు అవసరం లేదని అన్నారు. అదే విధంగా గతంలో మాదిరి ఇప్పుడు ఆడియోకు ఆదాయం రావడం లేదని పేర్కొన్నారు. అందుకు ఈ చిత్ర పాటనలు తన వెబ్సైట్ ద్వారా ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోనేలా అవకాశం కల్పించానని తెలిపారు. అన్న పాత్ర పేరు అన్నాదురై, తమ్ముడి పాత్రపేరు తంబిదురై అని తెలిపారు. మొదట ఈ చిత్రానికి కులసామి అని పేరు అనుకున్నమని.. అయితే పిచ్చైక్కారన్ చిత్రంలో అరుళ్ పాత్ర మాదిరిగానే అన్నాదురై పాత్ర చాలా మంచిగా ఉండటంతో ఆ పేరును నిర్ణయించామని తెలిపారు. అయితే సెన్సార్ సభ్యులు ఈ పేరు గురించి అడిగారని, అందుకు తగిన వివరణ ఇవ్వడంతో వారు సంతృప్తి చెందారని చెప్పారు. అయితే ఇప్పటి వరకూ ఏ రాజకీయ పార్టీ వారు ఈ టైటిల్‌కు అభ్యంతరం తెలపలేదని విజయ్ ఆంటోని తెలిపారు. ఇదే చిత్రం తెలుగులో ఇంద్రసేన పేరుతో విడుదలైన విషయం తెలిసిందే. -
మరో నటుడిని ఊహించలేం
సాక్షి సినిమా: అన్నాదురై చిత్రంలో కథానాయకుడిగా విజయ్‌ఆంటోనిని మినహా వేరొకరిని ఊహించలేమని అంటున్నారు ఆ చిత్ర దర్శకుడు శ్రీనివాసన్. విజయ్‌ఆంటోని హీరోగా నటించిన తాజా చిత్రం అన్నాదురై. నటి రాధికాశరత్‌కుమార్ ఆర్.స్టూడియోస్, ఫాతిమా విజయ్‌ఆంటోని ఫిలిం కార్పోరేషన్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం అన్నాదురై. డయానాచంపిక, మహిమ హీరోయిన్లుగా నటించిన ఇందులో రాధారవి, కాళీవెంకట్, నళినికాంత్ ముఖ్యపాత్రలను పోషించారు. విజయ్అంటోని సంగీతం అందించిన ఈ చిత్రం ఈ నెల 30న విడుదలకు ముస్తాబవుతోంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు శ్రీనివాసన్ మాట్లాడుతూ చాలా ఆసక్తిగా, కొంచెం అలజడిగానూ ఉందన్నారు. ఇలాంటి అనుభూతి కోసం చాలాకాలంగా ఎదురు చూస్తున్నానని చెప్పారు. ఒక దర్శకుడికి ప్రముఖ కథానాయకుడు, అనుభవజ్ఞులైన నటీనటులు, ప్రతిభావంతులైన సాంకేంతిక వర్గం లభిస్తే ఆది చిత్రానికి బలం అవుతుందన్నారు. ఇందులో విజయ్‌ఆంటోని పవర్ఫుల్ నటన అదనపు ఆకర్షణగా నిలుస్తుందని పేర్కొన్నారు. తాను దర్శకుడు వసంతబాలన్ వద్ద క్లాస్, సుశీంద్రన్ వద్ద కమర్షియల్‌ను, భూపతిపాండియన్ వద్ద హ్యూమరస్, ఎళిల్ వద్ద ప్రణాళిక ప్రకారం చిత్రాన్ని ఎలా పూర్తి చేయాలన్న విషయాలను నేర్చుకున్నానని తెలిపారు. అన్నాదురై చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం కావడం గర్వంగా ఫీలౌతున్నానని శ్రీనివాసన్ పేర్కొన్నారు. -
‘అన్నా’ నుంచి ‘అమ్మ’ వరకూ...
-
‘అన్నా’ నుంచి ‘అమ్మ’ వరకూ...
- ఆరాధ్య ‘దైవాల’ కోసం తమిళుల ఆవేదన - ద్రవిడ రాజకీయాల ఆద్యుడు అన్నాదురై అంతిమయాత్రలో కోటిన్నర మంది.. - ఎంజీఆర్ మరణించిప్పుడు వందల మంది ఆత్మహత్య - కరుణానిధి అరెస్టయినప్పుడూ ఆత్మార్పణలు - ఇప్పుడు అమ్మ జయలలిత కోసం ఆక్రందనలు.. (సాక్షి నాలెడ్జ్ సెంటర్) దాదాపు 47 ఏళ్ల కిందట.. అన్నాదురై మరణించినప్పుడు ఆయన అంతిమ యాత్రలో కోటిన్నర మంది పాల్గొన్నారు. అంతకు ముందు గొప్పనేతలైన మహాత్మాగాంధీ, అబ్రహంలింకన్ అంతిమయాత్రల్లో కూడా ఇంతమంది హాజరుకాలేదు. ఆయన మీద అభిమానంతో ఎన్నో గుండెల ఆగిపోయాయి. మూడు దశాబ్దాల కిందట.. అమెరికాలోని న్యూయార్క్ నగరంలో గల బ్రూక్లిన్ ఆస్పత్రిలో ఎంజీఆర్ కన్నుమూసినపుడు తమిళనాడు శోకసంద్రమైంది. ఆయన ఆస్పత్రిలో ఉన్నపుడు.. తమ ‘దేవుడి’ క్షేమం కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు పూజలు, ప్రార్థనల్లో నిమగ్నమయ్యారు. ఆయన మరణ వార్త తెలియగానే ఎంతో మంది చనిపోగా.. కొందరు ఆత్మహత్య చేసుకున్నారు. నాడు గురువు కోసం పరితపించిన తమిళ గుండె.. ఇప్పుడు ఆయన శిష్యురాలైన తమ ‘అమ్మ’ కోసం చెరువుగా మారుతోంది!! తమిళ జనం అంతే.. ఎవరినైనా ప్రేమిస్తే గుండె లోతుల్లోంచి ప్రేమిస్తారు! ఆ వ్యక్తిని తమ జీవన సర్వస్వంగా.. దేవుడికంటే ఎక్కువగా ఆరాధిస్తారు! వారు లేకుంటే తమకు బతుకే లేదన్నంతగా కొలుస్తారు! తమ ఆరాధ్య నేతలు కన్నుమూస్తే.. తామూ జీవితం చాలించేంతగా పరితపిస్తారు!! తమిళులు తమ నాయకులను ఇంతగా ఆరాధించడానికి వారి వారి గుణగణాలే కాదు.. సాహితీ, సాంస్కృతిక రంగంలో వారి వారి విశిష్టతలు, వారు అనుసరించే విధివిధానాలు కూడా కారణమే! మరీ ముఖ్యంగా.. తమిళ సంస్కృతికి, సంప్రదాయాలకు, సాహిత్యానికి పెద్ద పీట వేయటం.. ప్రాధాన్యం ఇవ్వడం ఈ వ్యక్తి ఆరాధనకు కేంద్ర బిందువని విశ్లేషకుల అంచనా. అలాగే.. ఆయా నాయకులు తమ విశిష్టతను మరింతగా ప్రచారంలోకి తీసుకురావడానికి.. ప్రజల్లో వ్యక్తిగతంగా అభిమానాన్ని పెంపొందించుకోవడానికి నిరంతరం ప్రయత్నిస్తుంటారు. అన్నాదురై: తమిళనాడులో ద్రవిడ రాజకీయాల ఆద్యుల్లో ప్రముఖుడు.. తమిళనాడులో ద్రవిడ మున్నేట్ర కజగం పార్టీ వ్యవస్థాపకుడు సి.ఎన్.అన్నాదురై. ద్రవిడ రాజకీయ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చిన నాయకుడు. 1967- 1969 మధ్య తమిళనాడు ముఖ్యమంత్రిగా పనిచేశారు. అన్నా ఒక గొప్ప ప్రసంగకర్తగా, నాటకరచయితగా కూడా ప్రఖ్యాతి గాంచారు. ఆయన సీఎంగా ఉండగానే.. క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ 1969 ఫిబ్రవరి 3వ తేదీన కన్నుమూశారు. ఆయన అంతిమయాత్రలో కోటిన్నర మంది అభిమానులు పాల్గొన్నారు. ప్రపంచ చరిత్రలో అప్పటికి అదే అతి భారీ అంతిమయాత్ర. అంతకుముందు గొప్ప నేతలైన మహాత్మా గాంధీ అంతిమ యాత్రలో కానీ, అబ్రహాం లింకన్ అంత్యక్రియలకు కానీ.. ఇంత భారీగా జనం హాజరుకాలేదు. అన్నా కన్నుమూసినపుడు ఎంతో మంది అభిమానులు గుండె ఆగి చనిపోయారు. ఇంకా ఎంతో మంది ఆత్మహత్య చేసుకున్నారు. ఎంజీఆర్: అన్నాదురై తర్వాత ఆయన పార్టీకే చెందిన ఎంజీఆర్‌ను తమిళులు ఎంతగానో అభిమానించారు. తమిళ సినీ రంగాన్ని పరిపాలించిన ఎంజీఆర్.. డీఎంకేలో చేరిన తర్వాత ఆ పార్టీ నుంచి చీలిపోయి అన్నా డీఎంకేను స్థాపించి అధికారంలోకి వచ్చారు. ఎంజీఆర్ ఆవేశపూరితమైన శక్తిమంతమైన ప్రసంగీకుడిగా ఖ్యాతిగడించారు. ‘నా రక్తంలో రక్తమైన తమిళ ప్రజలారా...’ అంటూ ఆయన ఆరంభించే ప్రసంగం తమిళులను ఉర్రూతలూగించేది. ఎంజీఆర్ అధికారంలో ఉన్నపుడు పేదలకు మధ్యాహ్న భోజన పథకం, మహిళలకు ప్రత్యేక బస్సులు ప్రవేశపెట్టారు. ఆయన వరుసగా రెండోసారి ముఖ్యమంత్రిగా ఉన్నపుడు 1987లో అనారోగ్యంతో అమెరికాలో కన్నుమూశారు. ఎంజీఆర్‌ను కిడ్నీ చికిత్స కోసం అమెరికా తరలించినపుడే.. 100 మందికి పైగా నిప్పంటించుకుని ఆత్మాహుతి చేసుకున్నారు. అదే సంవత్సరం డిసెంబర్ 24న ఎంజీఆర్ తుదిశ్వాస విడిచినపుడు మరో 31 మంది ఆత్మహత్య చేసుకున్నారు. జయలలిత కోసం: ఎంజీఆర్‌ను ఎంతగానో ఆరాధించిన తమిళులు.. ఆయన వారసురాలిగా జయలలితను భావించారు. సినిమా రంగంలో ఎంతో ఖ్యాతి గల ఆమె.. రాజకీయంగానూ తనదైన విశిష్టతను ప్రతిష్టించుకున్నారు. బహు భాషా కోవిదురాలైన జయ అనర్గళంగా ప్రసంగించగలరు. రచయిత్రి కూడా. తమిళులకు పురుచ్చి తలైవి(విప్లవ నాయకి)గా.. వారి గుండెల్లో అమ్మగా స్థానం పొందారు. 2011-16 మధ్య జయలలిత తనను తమిళులు పిలుచుకునే ‘అమ్మ’ పేరుతో క్యాంటీన్లు ప్రారంభించారు. పలు ప్రభుత్వ పథకాలకు అదే పేరు పెట్టి ఉప్పు, బేబీకేర్ కిట్లు తదితరాలు అందించారు. 2014లో జయలలితను అరెస్ట్ చేసినపుడు 16 మంది ఆత్మాహుతి చేసుకున్నారు. ఇప్పుడు ఆమె కన్నుమూయడంతో తమిళులు మరోసారి తమ ఆరాధ్య నాయకురాలి కోసం గుండెలు అవిసేలా రోదిస్తున్నారు. కరుణానిధి అరెస్టయినపుడూ.. డీఎంకే అధ్యక్షుడు కరుణానిధిని కూడా తమిళులు ఎంతగానో ఆరాధిస్తారు. అన్నాదురై స్థాపించిన డీఎంకే నుంచి ఎంజీఆర్ చీలిపోయిన తర్వాత కరుణానిధి పార్టీ సారథిగా కొనసాగుతున్నారు. కరుణానిధి కవిగా, నవలా రచయితగా, సినీ గేయ రచయితగా, సంభాషణల రచయితగా పేరుగాంచారు. 1986లో తమిళనాడులో రెండోసారి హిందీ వ్యతిరేక నిరసనలు చెలరేగిన తర్వాత.. కరుణానిధిని అరెస్ట్ చేసినపుడు 21 మంది ఆత్మహత్య చేసుకున్నారు. అందులో ఎక్కువ మంది నిప్పంటించుకుని చనిపోయారు. 2006-11 మధ్య డీఎంకే అధికారంలో ఉన్నపుడు కరుణానిధి పేద కుటుంబాల కోసం.. తన బిరుదునే పేరుగా పెట్టి ‘కళైంగర్ ఆరోగ్య బీమా పథకం’ ప్రవేశపెట్టారు. -
రాజకీయ నేత కుమారుడి హత్య
తిరుచ్చి సమీపంలో ఉద్రిక్తత టీనగర్: తిరుచ్చి సమీపాన రాజకీయ నేత కుమారుడు హత్యకు గురయ్యాడు. తిరుచ్చి తెన్నూరు మారియమ్మన్ ఆలయం వీధికి చెందిన అన్నాదురై(43) పందిరి కాంట్రాక్టర్. పుదియ తమిళగం పార్టీ తిరుచ్చి దక్షిణ జిల్లా కార్యకర్తల విభాగం కార్యదర్శిగా ఉన్నాడు. ఇతని భార్య జయ, కుమారుడు ప్రభు అలియాస్ ప్రభాకరన్(23). ఇతను కెమికల్ కంపెనీలో కారు డ్రైవర్. ఇతనికి భార్య, ఏడాది వయసుగల కుమారుడు ఉన్నారు. ఇదే ప్రాంతానికి చెందిన రాజా(27) స్నేహితులు. కొన్ని రోజుల క్రితం టాస్మాక్ దుకాణంలో రాజా, ప్రభు మద్యం తాగారు. ఆ సమయంలో ఇద్దరికి జరిగిన గొడవలోప్రభు, రాజాపై దాడి చేశాడు. ఆదివారం రాత్రి ప్రభు బైక్‌లో నిలుచుని తండ్రి అన్నాదురైతో మాట్లాడుతున్నాడు. ఆ సమయంలో అక్కడికి వచ్చిన రాజా, అతని స్నేహితులు దినేష్‌కుమార్ (22), పాండియరాజన్ (22) ప్రభుపై కత్తులతో దాడి చేశారు. దీన్ని అడ్డుకున్న అతని తండ్రి అన్నాదురైపై కూడా దాడి జరిపారు. దీన్ని గమనించిన జయ వారిని అడ్డుకోడానికి ప్రయత్నించింది. ఆ సమయంలో వారు జయను కిందకు తోసి పరారయ్యారు. ఇందులో ఆమెకు స్వల్పంగా గాయాలయ్యాయి. ఆమె కేకలు విన్న స్థానికులు రక్తపు మడుగులో పడిన ఇద్దరిని ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ ప్రభు మృతిచెందాడు. అన్నాదురైకు వైద్య చేస్తున్నారు. దీంతో ప్రభు బంధువులు ఆస్పత్రికి చేరుకోవడంతో అక్కడ ఉద్రిక్తత ఏర్పడింది. ప్రభుపై తిల్లైనగర్ పోలీసు స్టేషన్లో ఐదు కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. టాస్మాక్ దుకాణంలో ప్రభు, రాజాపై దాడి జరిపినందున అతనిపై ప్రతీకారం తీర్చుకోవడానికి రాజా వేచిచూసినట్లు, ఆదివారం రాత్రి అతన్ని హతమార్చినట్లు తెలిసింది. దీంతో రాజా, దినేష్‌కుమార్, పాండియరాజన్లను పోలీసులు అరెస్టు చేసి విచారణ జరుపుతున్నారు. -
వారిద్దరికీ భారతరత్న ఇవ్వాలి: కరుణానిధి
చెన్నై: మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయికి కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారం ప్రకటించడాన్ని డీఎంకే అధినేత ఎం. కరుణానిధి స్వాగతించారు. మోదీ సర్కారు తీసుకున్న నిర్ణయాన్ని ప్రశంసించారు. తనపై వాజపేయికి ఎంతో అభిమానం కనబరిచే వారని గుర్తు చేసుకున్నారు. పెరియార్ గా సుపరిచితులైన ద్రావిడ నాయకుడు ఈవీ రామస్వామి, మాజీ ముఖ్యమంత్రి అన్నాదురైకు భారతరత్న ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆగస్టు 24న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాసినట్టు కరుణానిధి వెల్లడించారు. -
అన్నాదురై వర్ధంతి ఘన నివాళి
సాక్షి, చెన్నై: ద్రవిడ పార్టీ ఆవిర్భావ కర్త, మాజీ ముఖ్యమంత్రి అన్నాదురై వర్ధంతిని పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా పలు కార్యక్రమాలకు డీఎంకే, అన్నాడీఎంకే, డీఎండీకేలు వేర్వేరుగా పిలుపునిచ్చాయి. దీంతో ఆయా పార్టీల నేతలు వాడ వాడలా అన్నా చిత్ర పటాలకు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. పేదలకు అన్నదానం చేశారు. అన్నా ప్రసంగాల్ని గుర్తు చేస్తూ హోరెత్తించారు శాంతి ర్యాలీ: డీఎంకే నేతృత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా శాంతి ర్యాలీలు నిర్వహించారు. నేతలు మౌన ప్రదర్శనతో తమ తమ ప్రాంతాల్లోని అన్నా విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. చెన్నైలో పార్టీ ప్రధాన కార్యదర్శి అన్భళగన్, కోశాధికారి ఎంకే స్టాలిన్ నేతృత్వంలో భారీ ర్యాలీ నిర్వహించారు. పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు వాలాజా రోడ్డు నుంచి మెరీనా తీరం వెంబడి అన్నా సమా ధి వరకు మౌన ప్రదర్శన నిర్వహించారు. అన్నా సమాధి వద్ద పార్టీ అధినేత కరుణానిధి పుష్పాంజలి ఘటించారు. అనంతరం అన్భళగన్, స్టాలిన్ నివాళులర్పించారు. ఆ పార్టీ నేతలు దురై మురుగన్, సద్గున పాండియన్, కేంద్ర మాజీ మంత్రులు దయానిధి మారన్, టీఆర్ బాలు, జగత్క్ష్రకన్, ఎ రాజా, ఎంపీలు టీకేఎస్ ఇళంగోవన్, తిరుచ్చి శివా, మాజీ మేయర్ ఎం సుబ్రమణ్యం తదితరులు నివాళులర్పించిన వారిలో ఉన్నారు. సీఎం నివాళి: అన్నాడీఎంకే నేతృత్వంలో రాష్ట్రంలో సహపంక్తి భోజనాలు నిర్వహించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జే జయలలిత అన్నా సమాధి వద్ద పుష్పాంజలి ఘటించారు. పార్టీ ప్రిసీడియం చైర్మన్ మధుసూదన్ మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు అన్నా సమాధి వద్దకు చేరుకుని ఘన నివాళులర్పించారు. అన్నా ప్రసంగాలు, ఆయన సేవల్ని స్మరించుకున్నారు. మంత్రులు ఓ పన్నీర్ సెల్వం, నత్తంవిశ్వనాథన్, వలర్మతి, సెంథిల్ బాలాజీ, బీవీ రమణ, మోహన్, పళనియప్పన్, చిన్నయ్య, మేయర్ సైదై దురైస్వామి, ఎంపీలు శశికళ పుష్పా, ఏకే సెల్వ రాజ్, రత్న వేలు, విజిలా సత్యానందన్, ముత్తుకరుప్పన్, సెమ్మలై తదితరులు నివాళులర్పించిన వారిలో ఉన్నారు. అనంతరం పలు చోట్ల ఉన్న ఆలయాలకు మంత్రులు చేరుకున్నారు. ప్రజలతో కలసి సహ పంక్తి భోజనాల్లో కూర్చున్నారు. థౌజండ్ లైట్స్ పరిధిలోని రాయపేటలో ఉన్న సిద్ధిబుద్ది వినాయక ఆలయంలో కౌన్సిలర్ శివరాజ్ నేతృత్వంలో సహపంక్తి భోజన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో మంత్రి వలర్మతి పాల్గొన్నారు. డీఎండీకే : డీఎండీకే నేతృత్వంలో రాష్ట్రంలోని ఆయా జిల్లాలోని పార్టీ కార్యాలయాల్లో వర్ధంతి కార్యక్రమాలు జరిగాయి. కోయంబేడులోని పార్టీ కార్యాలయంలో అధినేత విజయకాంత్, ఎమ్మెల్యేలు పాల్గొని నివాళులర్పించారు. పుదియ నిధి కట్చి నేత ఏసీ షణ్ముగం, అఖిల భారత మువ్వేందర్ మున్నని కళగనం నేత సేతు రామన్, ఎంజియార్ కళగం నేత ఆర్ఎం వీరప్పన్ అన్నా సమాధి వద్ద పుష్పాంజలి ఘటించిన వారిలో ఉన్నారు. -
అన్నాదురై జయంతి సందర్భంగాఘన నివాళి
అన్నాదురై జయంతి సందర్భంగా ప్రజలు, నాయకులు ఘనంగా నివాళులర్పించారు. వాడవాడలా ఆయన చిత్రపటాలు ఏర్పాటు చేసి పుష్పాంజలి ఘటించారు. ముఖ్యమంత్రి జయలలిత, డీఎంకే అధినేత కరుణానిధి, డీఎండీకే అధినేత విజయకాంత్‌లు అన్నా విగ్రహాల వద్ద నివాళులర్పించారు. సాక్షి, చెన్నై:రాష్ట్ర ప్రజల ఆరాధ్యనేత అన్నాదురై. సెప్టెంబర్ 15న పార్టీలకతీతంగా అన్నా జయంతి నిర్వహిస్తుంటారు. ఆదివారం అన్నా 105వ జయంతి కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నివాళులర్పించారు. ఆయా పార్టీల నేతృత్వంలో వేర్వేరుగా కార్యక్రమాలు జరిగాయి. ఆయా ప్రాంతాల్లో అన్నా చిత్రపటాల్ని ఉంచి పూలమాలలు వేశారు. అన్నా సేవలు స్మరించుకున్నారు. పేదలకు అన్నదానం, సాయం పంపిణీ చేశారు. నేతల నివాళి: అన్నా జయంతిని పురస్కరించుకుని ముఖ్యమంత్రి జయలలిత, మంత్రులు పన్నీర్ సెల్వం, పళనియప్పన్, వైద్యలింగం, మోహన్, మునుస్వామి తదితరులు అన్నాసాలైలోని అన్నా విగ్రహం వద్దకు చేరుకున్నారు. ముఖ్యమంత్రి జయలలిత అన్నా విగ్రహానికి పూలమాలలు వేశారు. ఆయన చిత్రపటం వద్ద పుష్పాంజలి ఘటించారు. వళ్లువర్‌కోట్టంలోని అన్నా విగ్రహం వద్ద డీఎంకే నేతృత్వంలో వేడుకలు జరిగాయి. డీఎంకే అధినేత కరుణానిధి, కోశాధికారి స్టాలిన్, ఎంపీ కనిమొళి, మాజీ మంత్రి దయానిధి మారన్, పార్టీ సీనియర్ నేత దురై మురుగన్, ఎమ్మెల్యే అన్భళగన్ తదితరలు పుష్పాంజలి ఘటించారు. డీఎండీకే కార్యాలయంలో జరిగిన వేడుకల్లో విజయకాంత్, ఆ పార్టీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. అన్నాకు ఘనంగా నివాళులర్పించారు. మార్కెట్లోకి అమ్మ వాటర్ అన్నా జయంతిని పురస్కరించుకుని ప్రతి ఏటా ఏదో ఒక పథకానికి ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. ఈ ఏడాది చల్లటి నీళ్లను ప్రయాణికులకు అందించేందుకు శ్రీకారం చుట్టింది. అమ్మ మినరల్ వాటర్ పేరుతో సిద్ధం చేసిన ఈ బాటిళ్లను ముఖ్యమంత్రి జయలలిత మార్కెట్లోకి విడుదల చేశారు. ఆదివారం ఉదయం సచివాలయంలో జరిగిన కార్యక్రమంలో రూ.10 అందజేసి తొలి బాటిల్‌ను రవాణాశాఖ మంత్రి సెంథిల్ బాలాజీ నుంచి ముఖ్యమంత్రి జయలలిత అందుకున్నారు. అనంతరం ఈ బాటిళ్లను ఆమె పరిచయం చేశారు. ఏడుగురు ప్రయాణికులకు ఈ బాటిళ్లను అందజేసి విక్రయాలకు శ్రీకారం చుట్టారు. లీటర్ బాటిల్ రూ.10 చొప్పున ప్రభుత్వ బస్సుల్లో, ప్రధాన బస్టాండ్లలో తొలి విడతగా విక్రయించనున్నారు.