అన్నాదురై వర్ధంతి ఘన నివాళి
Published Tue, Feb 4 2014 3:45 AM | Last Updated on Sat, Sep 2 2017 3:18 AM
సాక్షి, చెన్నై: ద్రవిడ పార్టీ ఆవిర్భావ కర్త, మాజీ ముఖ్యమంత్రి అన్నాదురై వర్ధంతిని పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా పలు కార్యక్రమాలకు డీఎంకే, అన్నాడీఎంకే, డీఎండీకేలు వేర్వేరుగా పిలుపునిచ్చాయి. దీంతో ఆయా పార్టీల నేతలు వాడ వాడలా అన్నా చిత్ర పటాలకు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. పేదలకు అన్నదానం చేశారు. అన్నా ప్రసంగాల్ని గుర్తు చేస్తూ హోరెత్తించారు
శాంతి ర్యాలీ: డీఎంకే నేతృత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా శాంతి ర్యాలీలు నిర్వహించారు. నేతలు మౌన ప్రదర్శనతో తమ తమ ప్రాంతాల్లోని అన్నా విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. చెన్నైలో పార్టీ ప్రధాన కార్యదర్శి అన్భళగన్, కోశాధికారి ఎంకే స్టాలిన్ నేతృత్వంలో భారీ ర్యాలీ నిర్వహించారు. పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు వాలాజా రోడ్డు నుంచి మెరీనా తీరం వెంబడి అన్నా సమా ధి వరకు మౌన ప్రదర్శన నిర్వహించారు. అన్నా సమాధి వద్ద పార్టీ అధినేత కరుణానిధి పుష్పాంజలి ఘటించారు. అనంతరం అన్భళగన్, స్టాలిన్ నివాళులర్పించారు. ఆ పార్టీ నేతలు దురై మురుగన్, సద్గున పాండియన్, కేంద్ర మాజీ మంత్రులు దయానిధి మారన్, టీఆర్ బాలు, జగత్క్ష్రకన్, ఎ రాజా, ఎంపీలు టీకేఎస్ ఇళంగోవన్, తిరుచ్చి శివా, మాజీ మేయర్ ఎం సుబ్రమణ్యం తదితరులు నివాళులర్పించిన వారిలో ఉన్నారు.
సీఎం నివాళి: అన్నాడీఎంకే నేతృత్వంలో రాష్ట్రంలో సహపంక్తి భోజనాలు నిర్వహించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జే జయలలిత అన్నా సమాధి వద్ద పుష్పాంజలి ఘటించారు. పార్టీ ప్రిసీడియం చైర్మన్ మధుసూదన్ మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు అన్నా సమాధి వద్దకు చేరుకుని ఘన నివాళులర్పించారు. అన్నా ప్రసంగాలు, ఆయన సేవల్ని స్మరించుకున్నారు. మంత్రులు ఓ పన్నీర్ సెల్వం, నత్తంవిశ్వనాథన్, వలర్మతి, సెంథిల్ బాలాజీ, బీవీ రమణ, మోహన్, పళనియప్పన్, చిన్నయ్య, మేయర్ సైదై దురైస్వామి, ఎంపీలు శశికళ పుష్పా, ఏకే సెల్వ రాజ్, రత్న వేలు, విజిలా సత్యానందన్, ముత్తుకరుప్పన్, సెమ్మలై తదితరులు నివాళులర్పించిన వారిలో ఉన్నారు. అనంతరం పలు చోట్ల ఉన్న ఆలయాలకు మంత్రులు చేరుకున్నారు. ప్రజలతో కలసి సహ పంక్తి భోజనాల్లో కూర్చున్నారు. థౌజండ్ లైట్స్ పరిధిలోని రాయపేటలో ఉన్న సిద్ధిబుద్ది వినాయక ఆలయంలో కౌన్సిలర్ శివరాజ్ నేతృత్వంలో సహపంక్తి భోజన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో మంత్రి వలర్మతి పాల్గొన్నారు.
డీఎండీకే : డీఎండీకే నేతృత్వంలో రాష్ట్రంలోని ఆయా జిల్లాలోని పార్టీ కార్యాలయాల్లో వర్ధంతి కార్యక్రమాలు జరిగాయి. కోయంబేడులోని పార్టీ కార్యాలయంలో అధినేత విజయకాంత్, ఎమ్మెల్యేలు పాల్గొని నివాళులర్పించారు. పుదియ నిధి కట్చి నేత ఏసీ షణ్ముగం, అఖిల భారత మువ్వేందర్ మున్నని కళగనం నేత సేతు రామన్, ఎంజియార్ కళగం నేత ఆర్‌ఎం వీరప్పన్ అన్నా సమాధి వద్ద పుష్పాంజలి ఘటించిన వారిలో ఉన్నారు.
Advertisement
Advertisement