సాక్షి, చెన్నై: తన తండ్రి కలైంజ్ఞర్ కరుణానిధి.. ‘అయ్యాదురై’ అని తనకు నామకరణం చేయాలని తొలుత నిర్ణయించినా, చివరకు స్టాలిన్‌గా ప్రకటించారని సీఎం ఎంకే స్టాలిన్ ఓ వివాహ వేడుకలో వివరించారు. డీఎంకే ప్రధాన కార్యాలయం అన్నా అరివాలయం కలైంజర్ అరంగంలో ఆదివారం గృహ నిర్మాణ బోర్డు చైర్మన్ పూచ్చి మురుగన్ ఇంటి వివాహ వేడుక జరిగింది. వధువరుల్ని ఆశీర్వదించినానంతరం సీఎం స్టాలిన్ మాట్లాడుతూ, తమ ఇంట్లో ముక్కా ముత్త, ముక్కా అళగిరి అంటూ అందరికీ తమిళ పేర్లు పెట్టినట్టు వివరించారు. అయితే, తనకు మాత్రం స్టాలిన్ అని నామకరణం చేశారని పేర్కొంటూ, ఈ పేరు వెనుక ఉన్న కథను ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకున్నారు.
వాస్తవానికి తాను పుట్టగానే అయ్యాదురై అని పేరు పెట్టాలని దివంగత మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి నిర్ణయించారని వివరించారు. ద్రవిడ సిద్ధాంతకర్త పెరియార్‌ను స్మరిస్తూ అయ్యా అని, ద్రవిడ పార్టీల ఆవిర్భావ కర్త అన్నా దురైను స్మరిస్తూ దురై అన్న పదాలను ఎంపిక చేసి తనకు అయ్యాదురై అని నామకరణం చేయడానికి సిద్ధం చేసి ఉంచారని తెలిపారు. అయితే అదే సమయంలో రష్యా అధ్యక్షుడు స్టాలిన్ మరణించడంతో చెన్నైలో సంతాప సభ జరిగిందని వివరించారు.
చదవండి: (స్టాలిన్‌కు మద్రాస్ హైకోర్టులో ఊరట.. 18 కేసులు రద్దు)
ఇందులో దివంగత నేత కరుణానిధి ప్రసంగిస్తున్న సమయంలో ఆయన చేతికి ఓ పేపర్‌ను ముఖ్య నాయకులు అందించారని పేర్కొన్నారు. అప్పుడు తనకు ఓ కుమారుడు పుట్టాడని, ఆ బిడ్డకు స్టాలిన్ అని నామకరణం చేస్తున్నట్టు ఆ వేదిక మీదే తన పేరును కరుణానిధి ప్రకటించారని వెల్లడించారు. ఇదే విషయాన్ని పలుమార్లు తన వద్ద తండ్రి కరుణానిధి ప్రస్తావించే వారని తెలిపారు. కాగా ఈ గడ్డలో పుట్టే ప్రతి బిడ్డకు తమిళ పేరే పెట్టాలని విజ్ఞప్తి చేశారు. ఇక చివరకు తనకు దేవుళ్లలో మురగన్ అంటే అభిమానం ఎక్కువేనని వ్యాఖ్యలు చేస్తూ తన ప్రసంగాన్ని ముగించారు.
Comments
Please login to add a commentAdd a comment