వస్తున్నా
సాక్షి, చెన్నై: కార్యకర్తలను స్వయంగా కలుసుకుని అభిప్రాయ సేకరణకు డీఎంకే కోశాధికారి ఎంకే స్టాలిన్ సిద్ధమయ్యారు. గురువారం నుంచి తన పర్యటనకు శ్రీకారం చుట్టనున్నారు. కాంచీపురం జిల్లా నేతలతో కాటాన్ కొళత్తూరులో సమాలోచనలు జరపనున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో డిపాజిట్లు గల్లంతు కావడంతో పార్టీలో పూర్తి స్థాయి ప్రక్షాళనకు డీఎంకే అధినేత ఎం కరుణానిధి నిర్ణయించారు. పార్టీ పరంగా జిల్లాలను విభజించారు. జిల్లాల సంఖ్యను 65కు పెంచారు. పార్టీ పరంగా యూనియన్, నగరాల విభజన పర్వం శరవేగంగా సాగుతోంది. ఇప్పటికే అన్ని జిల్లాల కమిటీలను రద్దు చేసిన దృష్ట్యా, కొత్తగా కమిటీల ఎంపిక మీద దృష్టి కేంద్రీకరించారు.
తొలుత వార్డు స్థాయి కమిటీలకు సంస్థాగత ఎన్నికల ద్వారా కార్యవర్గాల ఏర్పాటు ప్రక్రియ సాగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లోపు పార్టీని పూర్తి స్థాయిలో పటిష్ట వంతం చేయడం లక్ష్యంగా అధినేత కరుణానిధికి కోశాధికారి ఎంకే స్టాలిన్ తీవ్రంగా కసరత్తుల్లో మునిగి ఉన్నారు. ఈ పరిస్థితుల్లో జిల్లా కమిటీల్ని సంస్థాగత ఎన్నికల ద్వారా ఎంపిక చేయడం అన్నది సాహసంతో కూడుకున్న పనే. ఈ ఎన్నికలు పార్టీలో పదవుల విషయంలో చిచ్చు రగ్చిలిన పక్షంలో పెను నష్టాన్ని చవి చూడాల్సి వస్తుందన్న విషయాన్ని అధినేతలు పరిగణనలోకి తీసుకున్నారు. దీంతో పార్టీ కార్యకర్తలు, నాయకులు, అనుబంధ విభాగాల అభిప్రాయాల సేకరణకు సిద్ధమయ్యారు. కరుణానిధి వారసుడిగా పార్టీ బలోపేతం లక్ష్యంగా దూసుకెళ్తోన్న స్టాలిన్, స్వయంగా కార్యకర్తలను కలుసుకుని అభిప్రాయూలు సేకరించనున్నారు.
అభిప్రాయ సేకరణ: రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ వర్గాల అభిప్రాయ సేక రణకు సిద్ధమైన స్టాలిన్ గురువారం నుంచి తన వ్యూహాలకు పదును పెట్టే పనిలో పడ్డారు. తొలుత కాంచీపురం జిల్లా నుంచి తన అభిప్రాయ సేకరణ చేపట్టనున్నారు. ఒక రోజంతా ఆ జిల్లా నాయకులు, కార్యకర్తలతోనే గడపనున్నారు. కాటాన్ కొళత్తూరులోని ఎస్‌ఆర్‌ఎం హోటల్లో ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు అభిప్రాయాలను సేకరించనున్నారు.
పార్టీ యువజన, విద్యార్థి, మహిళ, సాంస్కృతిక, న్యాయవాద, కార్మిక, వ్యవసాయ తదితర అనుబంధ విభాగాల నాయకులు, కార్యకర్తలతోపాటుగా జిల్లా స్థాయి నాయకులు, ప్రతినిధులతో సంప్రదింపులు జరపనున్నారు. అదే రోజు సాయంత్రం ఆరు గంటలకు చెంగల్పట్టులోని ఏవీఎన్ కల్యాణ మండపంలో జరిగే పార్టీ జిల్లా స్థాయి నాయకులు, కార్యకర్తల సమావేశంలో ప్రసంగించనున్నారు. స్టాలిన్ రాకకు కాంచీపురం జిల్లా నేత, మాజీ మంత్రి తాము అన్భరసన్ నేతృత్వంలో ఏర్పాట్లు వేగవంతంగా సాగుతున్నాయి.