M. Karunanidhi
-
చెన్నైతో ‘రాణి’కి అనుబంధం.. కమల్‌హాసన్ సినిమా షూటింగ్..
సాక్షి, చెన్నై: బ్రిటన్ రాణి ఎలిజబెత్‌కు చెన్నైతో ప్రత్యేక అనుబంధం ఉంది. ఇక్కడికి ఆమె రెండు సార్లు వచ్చి వెళ్లారు. ఆమె మృతిపై సీఎం ఎంకే స్టాలిన్‌తో పాటు పలువురు నేతలు సంతాపం తెలిపారు. బ్రిటన్ను సుదీర్ఘ కాలం పాలించిన రాణిగా చరిత్రలోకి ఎక్కిన ఎలిజబెత్ గురువారం స్కాట్లాండ్లోని బల్మోరల్ కోటలో తుది శ్వాస విడిచిన విషయం తెలిసిందే. ఆమె మరణ సమాచారంతో చెన్నైలోని బ్రిటీష్ రాయబార కార్యాలయం వద్ద అధికారులు నివాళులర్పించారు. తమ సంతాపం తెలియజేశారు. అలాగే, బ్రిటీష్ ఎడ్యుకేషన్ సెంటర్లలోనూ సంతాప కార్యక్రమాలు జరిగాయి. రాణి చిత్ర పటం వద్ద అంజలి ఘటించారు. ఎలిజబెత్‌తో కామరాజర్, కరుణానిధి.. ఎలిజబెత్‌తో కమలహాసన్ సంతాపం అత్యధిక కాలం రాణిగా అధికారంలో కొనసాగిన ఆమె లేరన్న సమాచారం దిగ్భ్రాందికి గురి చేసిందని స్టాలిన్ పేర్కొన్నారు. తన తండ్రి, దివంగత మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి ఆమెతో భేటీ అయిన జ్ఞాపకాలను గుర్తు చేశారు. రాణి ఎలిజబెత్ జీవితంలో ఎక్కువ కాలం ప్రజలతో మమేకమయ్యారని వ్యాఖ్యానించారు. సినీ నటుడు , మక్కల్ నీది మయ్యం పార్టీ అధినేత కమలహాసన్ సంతాపం తెలిపారు. తన చిత్రం మరుద నాయగం షూటింగ్ కోసం ఆమె వచ్చారని గుర్తు చేశారు. కామరాజర్‌తో కరచాలనం ఇదిలా ఉండగా, రాణి ఎలిజబెత్ చెన్నైకు రెండు సార్లు వచ్చారు. ఆమె ఢిల్లీకి వచ్చినప్పుడల్లా చెన్నైకు వచ్చి వెళ్లారు. ఆ మేరకు చెన్నైతో ఆమెకు అనుంబంధం ఉంది. 1997లో ఎంజీఆర్ ఫిల్మ్‌నగర్‌లో కమలహాసన్ మరుదనాయగం చిత్రం షూటింగ్‌ను వీక్షించేందుకు ఆమె వచ్చారు. అప్పటి సీఎం కరుణానిధి, కమలహాసన్‌లతో ఎలిజబెత్ ఎక్కువ సేపు మాట్లాడారు. అయితే, ఈ చిత్రం షూటింగ్ నేటికి పెండింగ్‌లోనే ఉంది. అంతకు ముందు 1961లో చెన్నైకు వచ్చారు. అప్పటి తమిళనాడు గవర్నర్ విష్ణురాం, సీఎం కామరాజర్, మంత్రి భక్తవత్సలం ఆమెకు ఆహ్వానం పలికారు. తన కుమారుడి బర్తడే ఆ సమయంలో ఇక్కడే ఆమె జరిపినట్టు సమాచారం. -
తన పేరు మార్పుపై సీఎం స్టాలిన్ ఆసక్తికర వ్యాఖ్యలు
సాక్షి, చెన్నై: తన తండ్రి కలైంజ్ఞర్ కరుణానిధి.. ‘అయ్యాదురై’ అని తనకు నామకరణం చేయాలని తొలుత నిర్ణయించినా, చివరకు స్టాలిన్‌గా ప్రకటించారని సీఎం ఎంకే స్టాలిన్ ఓ వివాహ వేడుకలో వివరించారు. డీఎంకే ప్రధాన కార్యాలయం అన్నా అరివాలయం కలైంజర్ అరంగంలో ఆదివారం గృహ నిర్మాణ బోర్డు చైర్మన్ పూచ్చి మురుగన్ ఇంటి వివాహ వేడుక జరిగింది. వధువరుల్ని ఆశీర్వదించినానంతరం సీఎం స్టాలిన్ మాట్లాడుతూ, తమ ఇంట్లో ముక్కా ముత్త, ముక్కా అళగిరి అంటూ అందరికీ తమిళ పేర్లు పెట్టినట్టు వివరించారు. అయితే, తనకు మాత్రం స్టాలిన్ అని నామకరణం చేశారని పేర్కొంటూ, ఈ పేరు వెనుక ఉన్న కథను ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకున్నారు. వాస్తవానికి తాను పుట్టగానే అయ్యాదురై అని పేరు పెట్టాలని దివంగత మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి నిర్ణయించారని వివరించారు. ద్రవిడ సిద్ధాంతకర్త పెరియార్‌ను స్మరిస్తూ అయ్యా అని, ద్రవిడ పార్టీల ఆవిర్భావ కర్త అన్నా దురైను స్మరిస్తూ దురై అన్న పదాలను ఎంపిక చేసి తనకు అయ్యాదురై అని నామకరణం చేయడానికి సిద్ధం చేసి ఉంచారని తెలిపారు. అయితే అదే సమయంలో రష్యా అధ్యక్షుడు స్టాలిన్ మరణించడంతో చెన్నైలో సంతాప సభ జరిగిందని వివరించారు. చదవండి: (స్టాలిన్‌కు మద్రాస్ హైకోర్టులో ఊరట.. 18 కేసులు రద్దు) ఇందులో దివంగత నేత కరుణానిధి ప్రసంగిస్తున్న సమయంలో ఆయన చేతికి ఓ పేపర్‌ను ముఖ్య నాయకులు అందించారని పేర్కొన్నారు. అప్పుడు తనకు ఓ కుమారుడు పుట్టాడని, ఆ బిడ్డకు స్టాలిన్ అని నామకరణం చేస్తున్నట్టు ఆ వేదిక మీదే తన పేరును కరుణానిధి ప్రకటించారని వెల్లడించారు. ఇదే విషయాన్ని పలుమార్లు తన వద్ద తండ్రి కరుణానిధి ప్రస్తావించే వారని తెలిపారు. కాగా ఈ గడ్డలో పుట్టే ప్రతి బిడ్డకు తమిళ పేరే పెట్టాలని విజ్ఞప్తి చేశారు. ఇక చివరకు తనకు దేవుళ్లలో మురగన్ అంటే అభిమానం ఎక్కువేనని వ్యాఖ్యలు చేస్తూ తన ప్రసంగాన్ని ముగించారు. -
ఆరోగ్యంగా కరుణ
సాక్షి, చెన్నై: డీఎంకే అధినేత ఎం.కరుణానిధి సంపూర్ణ ఆరోగ్యవంతులయ్యారు. రెండు, మూడు రోజుల్లో డీఎంకే కార్యాలయంలో అన్నా అరివాలయానికి ఆయన వచ్చే అవకాశాలు ఉన్నట్టు ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.అలర్జీ కారణంగా ఏర్పడ్డ దద్దుర్లతో డీఎంకే అధినేత ఎం.కరుణానిధి అనారోగ్యం బారిన పడ్డ విషయం తెలిసిందే. నెల రోజులుగా ఆయన గోపాలపురం ఇంటి నుంచే చికిత్స పొందుతూ వచ్చారు. డీఎంకే కోశాధికారి ఎంకే స్టాలిన్, ఎంపీ కనిమొళి, డీఎంకే బహిష్కృత నేత అళగిరి తదితర కుటుంబీకులు తప్ప, మరెవ్వర్నీ గోపాలపురంలోకి అనుమతించ లేదు. ఈ పరిస్థితుల్లో దద్దుర్లు మానడంతో కరుణానిధి ఆరోగ్యవంతులు అయ్యారు. ఇందుకు తగ్గ సంకేతాలను డీఎంకే వర్గాలు ఇస్తున్నాయి. కరుణ ఆరోగ్యవంతుడు కావడంతో, పార్టీ వ్యవహారాల మీద ఇంటి నుంచే దృష్టి పెట్టి ఉన్నారని చెబుతున్నారు. అందుకే చిల్లర కోసం జనం పడుతున్న పాట్లను నిరసిస్తూ ఈ నెల 24న రాష్ట్ర వ్యాప్తంగా మానవహారానికి పిలుపునిచ్చి ఉన్నారని చెబుతున్నారు. రెండు మూడు రోజుల్లో ఆయన గోపాలపురం నుంచి రాష్ట్ర పార్టీ కార్యాలయం అరివాలయం వచ్చే అవకాశాలు ఉన్నట్టు పేర్కొంటున్నారు. -
టార్గెట్ ‘కరుణ’!
- సభా హక్కుల ఉల్లంఘన - ఫిర్యాదుపై సమీక్ష - క్రమశిక్షణా సంఘం సమాలోచన సాక్షి, చెన్నై : అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉన్న డీఎంకే అధినేత ఎం.కరుణానిధిని అధికార పక్షం టార్గెట్ చేసింది. సభకు రాకుండానే, అసెంబ్లీ వ్యవహారాల్లో తలదూర్చే విధంగా వ్యవహరిస్తున్నారని వచ్చిన ఫిర్యాదును స్పీకర్ ధనపాల్ పరిగణనలోకి తీసుకున్నారు. దీన్ని క్రమ శిక్షణా సంఘానికి పంపించారు. ఆ సంఘం ఆయన ప్రకటనల తీరుపై సమీక్షించి నివేదిక సిద్ధం చేస్తోంది. అన్నాడీఎంకే సర్కారు అధికారంలోకి వచ్చాక, అసెంబ్లీలో ప్రతి పక్షాల గళాన్ని నొక్కేస్తోందన్న ఆరోపణలు ఉన్నాయి. ధిక్కరిస్తే చర్యలు తప్పదన్నట్టుగా సస్పెన్షన్ వేటులు పడుతున్నాయి. ఇందుకు ప్రధాన ప్రతిపక్ష నేత విజయకాంత్, ఆ పార్టీ సభ్యులపై విధిస్తూ వస్తున్న సస్పెన్షన్లు ఉదాహరణగా తీసుకోవచ్చు. ఇక, సభ జరిగినప్పుడల్లా ప్రతి రోజూ డీఎంకే వాకౌట్ల పర్వాన్ని కొనసాగిస్తూనే వస్తున్నది. తమకు మాట్లాడే అవకాశమివ్వడం లేదని, తమ తీర్మానాలపై చర్చ సాగించడం లేదని ఆరోపిస్తూ ఈ పర్వాన్ని ఆ పార్టీ సభ్యులు కొనసాగిస్తూ వస్తున్నారు. సింగిల్ డిజిట్ సభ్యుల్ని కల్గిన ప్రతిపక్ష పార్టీలే సభ వ్యవహారాల్లో కలుసుకుంటున్నాయి. కాగా, మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎం.కరుణానిధి అన్నాడీఎంకే సర్కారు అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అసెంబ్లీ మందిరంలోకి అడుగు పెట్టలేదు. తిరువారూర్ నుంచి ఆయన అసెంబ్లీకి ఎన్నికైన విషయం తెలిసిందే. వీల్ చైర్లో ఉన్న తనకు కూర్చునేందుకు వీలుగా సభలో ప్రత్యేక స్థలం కేటాయించాలన్న ఆయన అభ్యర్థను అధికార పక్షం పట్టించుకోలేదు. దీంతో సభ జరిగినప్పుడు ఏదో ఒక రోజున లాబిలో ఉన్న పుస్తకంలో సంతకం చేసి అటే బయటకు వెళ్తుండం జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో అసెంబ్లీకి రాకుండానే, ఆయన సభా వ్యవహారాల్లో తలదూర్చుతూ, ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణను అన్నాడీఎంకే వర్గాలు తెరమీదకు తెచ్చాయి. ఇటీవల సభలో మంత్రి చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన కరుణానిధిపై సభ హక్కుల ఉల్లంఘన చర్యలు తీసుకోవాలన్న డిమాండ్‌తో స్పీకర్‌కు ఫిర్యాదు చేరింది. సభా హక్కుల ఉల్లంఘన అసెంబ్లీలో గృహ నిర్మాణ శాఖ మంత్రి వైద్యలింగం చేసిన ప్రసంగాన్ని ఖండిస్తూ, అందులోని తప్పుల తడక, అనుచిత వ్యాఖ్యల్ని ఎత్తి చూపుతూ డీఎంకే అధినేత ఎం.కరుణానిధి గత నెల ముఫ్పైన ఓ ప్రకటన విడుదల చేశారు. దీనిని పరిగణలోకి తీసుకున్న మంత్రి వైద్యలింగం డీఎంకే అధినేత ఎం.కరుణానిధిని టార్గెట్ చేశారు. అసెంబ్లీలో తాను చేసిన ప్రసంగాన్ని ఖండించే విధంగా, అసెంబ్లీ వ్యవహారాల్ని ధిక్కరించే రీతిలో కరుణానిధి ప్రకటన ఉందంటూ స్పీకర్ ధనపాల్కు మంత్రి వైద్యలింగం ఫిర్యాదు చేశారు. సభలో సందించాల్సిన ప్రశ్నల్ని, సభలోనే లేల్చుకోవాల్సిన అంశాల్ని బజారుకీడ్చే రీతిలో కరుణానిధి విమర్శలు ఆరోపణలు ఉన్నాయని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిని పరిగణించి స్పీకర్ ధనపాల్ విచారణకు ఆదేశించారు. సమాలోచన అసెంబ్లీ క్రమ శిక్షణా సంఘానికి అధ్యక్షులుగా డెప్యూటీ స్పీకర్ పొల్లాచ్చి వి.జయరామన్ వ్యవహరిస్తున్నారు. సభ్యులుగా ఆర్థిక మంత్రి పన్నీరు సెల్వం, ప్రధాన ప్రతిపక్ష నేత విజయకాంత్, పలువురు అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యే విజయ ధరణి, డీఎండీకే తరపున ఎమ్మెల్యే బాబు మురుగవేల్, డీఎంకే తరపున కంబం రామకృష్ణన్‌లతో పాటుగా సీపీఐ, సీపీఎం సభ్యులు కూడా వ్యవహరిస్తున్నారు. స్పీకర్ ధనపాల్ నుంచి వచ్చిన ఫిర్యాదుపై సమాలోచించింది చర్యకు ఆ సంఘం సిద్ధమయింది. సోమవారం సాయంత్రం అసెంబ్లీ ఆవరణలో డెప్యూటీ స్పీకర్ పొల్లాచ్చి వి.జయరామన్ అధ్యక్షతన కమిటీ సమావేశమయింది. ప్రధాన ప్రతి పక్ష నేత సభకు రావడం లేదు కాబట్టి, ఆ పార్టీ ఎమ్మెల్యే బాబు మురుగవేల్ సస్పెన్షన్ వేటు కారణంగా సమావేశానికి దూరం కాక తప్పలేదు. మెజారిటీ శాతం మంది అన్నాడీఎంకే సభ్యులే ఈ సంఘంలో ఉండడంతో కరుణానిధి ప్రకటనపై తీవ్రంగానే స్పందించి ఉంటారన్నది గమనార్హం. కరుణానిధి వ్యాఖ్యల్ని నిశితంగా పరిశీలించి, నివేదికసిద్ధం చేస్తున్నారు. ఈ నివేదికను స్పీకర్ ధనపాల్కు సమర్పించి, తదనంతరం కరుణానిధిపై చర్యకు రంగం సిద్ధ చేస్తున్నారు. అయితే, ఏ ప్రాతిపదికన కరుణానిధిపై చర్య తీసుకుంటారోనన్నది వేచి చూడాల్సిందే. -
కన్నీళ్లు పెట్టిన కరుణ
సాక్షి, చెన్నై : డీఎంకే అధినేత ఎం.కరుణానిధి విలపించారు. తన సోదరి ఇక లేదన్న సమాచారంతో కన్నీళ్ల పర్యంతం అయ్యారు. శోక సంద్రంలో మునిగిన ఆయన్ను పీఎంకే అధినేత రాందాసు, డీఎంకే వర్గాలు ఓదార్చే యత్నం చేశాయి. షణ్ముగ సుందరత్తమ్మాల్(99) భౌతిక కాయానికి గురువారం అంత్యక్రియలు జరగనున్నాయి. ముత్తు వేలర్, అంజుగత్తమ్మాల్ దంపతుల కుమారుడు డీఎంకే అధినేత ఎం కరుణానిధి అన్న విషయం తెలిసిందే. ఆయనకు ఇద్దరు అక్కయ్యలు. పెద్ద అక్కయ్య పెరియ నాయకీ ఎప్పుడో కాలం చెందారు. రెండో అక్కయ్య షణ్ముగ సుందరత్తమ్మాల్ అంటే, కరుణానిధికి ప్రాణం. ఆమె మాటను నేటికి కూడా ఆయన జవదాటరు. ఆమె అంటే, కరుణానిధికి గౌరవం, మర్యాద, ఆప్యాయత ప్రేమా అభిమానులు ఎక్కువే. కుటుంబ పెద్ద గా ఆమెను భావిస్తుంటారు. కరుణ కుటుం బంలో ఎదురైన అనేక సంక్లిష్ట పరిస్థితుల్ని ఆమె దారిలో పెట్టారని చెప్పవచ్చు. షణ్ముగ సుందరత్తమ్మాల్ పెద్దకుమారుడే కేంద్ర మాజీ మంత్రి, దివంగత నేత మురసోలి మారన్. అందుకే మేనల్లుడు మురసోలి మారన్ అంటే కరుణకు ఎంతో ఇష్టం. ఆయన బతికి ఉన్నంత కాలం కరుణ వెన్నంటి ఉన్నారని చెప్పవచ్చు. ఇక, మురసోలి మారన్, మల్లికా మారన్ల పిల్లలే కేంద్ర మాజీ మంత్రి దయానిధి మారన్ , సన్ టీవీ గ్రూప్ అధినేత కళానిధి మారన్. కరుణానిధి కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉంటూ వచ్చిన షణ్ముగత్తమ్మాల్ (99) కొంతకాలంగా వయోభారంతో బాధ పడుతున్నారు. గోపాల పురంలోని ఇంట్లో ఉంటూ వైద్య సేవలు పొందుతూ వచ్చారు. కన్నీళ్లు పెట్టిన కరుణ: బుధవారం ఉదయం పద కొండు గంటలకు షణ్ముగ సుందరత్తమ్మాల్ మరణించిన సమాచారం కరుణానిధిని శోక సంద్రంలో ముంచేసింది. వయో భారంతో బాధపడుతున్న అక్కయ్యను వా రంలో ఓ మారైనా కలిసి వెళ్లే కరుణానిధి , ఇక ఆమె లేరన్న సమచారంతో దిగ్భ్రాంతికి గురి అయ్యారు. పార్టీ కోశాధికారి, తనయుడు స్టాలిన్‌తో కలసి ఆమె ఇంటికి చేరుకుని భౌతిక కాయాన్ని చూస్తూ కన్నీళ్ల పర్యంతం అయ్యారు. ఆమె చేతుల్ని పట్టుకుని బోరున విలపించారు. ఆయన్ను ఓదార్చడం ఎవరి తరం కాలేదు. కరుణానిధి సైతం వయోభారంతో ఉన్న దృష్ట్యా, ఆయన్ను అక్కడి నుంచి మరో గదికి వెంటనే తీసుకెళ్లి పోయారు. అనంతరం ఆమె భౌతిక కాయాన్ని కుటుంబీ కులు, ఆప్తుల సంద ర్శనార్థం గోపాల పురం ఇంట్లో ఉంచారు. సమాచారం అందుకున్న షణ్ముగ సుందరత్తమ్మాల్ చిన్న కుమారుడు మురసోలి సెల్వం, కోడలు సెల్వి, మనవళ్లు, మనవరాళ్లు, కుటుంబీకులు దయానిధి మారన్, కళానిధి మారన్, మూక్తా తమిళరసు, అమృతం, డిఎంకే నాయకులు దురై మురుగ న్, టీ ఆర్ బాలు, ఎ రాజ, విపీ దురై స్వామి, అన్భలగన్, శేఖర్ బాబు, ఎం సుబ్రమణియన్ తదితరులు ఆమె భౌతిక కాయానికి నివాళులర్పించారు. నేడు అంత్యక్రియలు : షణ్ముగ సుందరత్తమ్మాల్ భౌతిక కాయానికి గురువారం అం త్యక్రియలు జరగనున్నాయి. గోపాల పురం ఇంటి నుంచి ఉదయం పది గంటలకు ఊరేగింపుగా భౌతిక కాయాన్ని బీసెంట్ నగర్ వ్మశాన వాటికకు తీసుకెళ్లనున్నారు. సోదరిని కోల్పోయి తీవ్ర విషాదంలో మునిగిన కరుణానిధిని పలువురు నాయకులు పరామర్శించి ఓదార్చే పనిలో పడ్డారు. పీఎంకే అధినేత రాందాసు ఓ ప్రకటన ద్వారా తన సానుభూతి తెలియజేశారు. అక్కయ్య అంటే కరుణానిధి ఎంతో మర్యాద, ప్రేమ,ఆప్యాయతల్ని కల్గి ఉన్నారన్నారు. కష్టాల్లో కరుణానిధి వెన్నంటి ఆమె ఉన్నారని, ఆమె లేని లోటు ఆయనకు తీర్చలేనిదిగా పేర్కొన్నారు. -
సీట్లు లేవు
సాక్షి, చెన్నై: డీఎంకే అధినేత ఎం కరుణానిధి పార్టీ సీనియర్లకు, మాజీ మంత్రులకు షాక్ ఇచ్చారు. జిల్లా కార్యదర్శుల ఎన్నికల్లో పోటీ చేసే నాయకులకు అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో సీట్లు ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చారు. కేవలం 18 మంది మాజీలకు మాత్రమే మళ్లీ జిల్లా కార్యదర్శుల ఎన్నికల్లో పోటీకి అవకాశం కల్పించారు. తాము అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయబోమని, తమ బంధు మిత్రులకు సీట్లు ఇవ్వాలని ఒత్తిడి తెచ్చే ప్రసక్తే లేదని లోక్‌సభ ఎన్నికల్లో డిపాజిట్ల గ ల్లంతు కరుణానిధిని డీలా పడేలా చేసింది. పార్టీకి పూర్వ వైభవం తెచ్చే విధంగా జిల్లాల శాఖల్ని విభజించే పనిలో పడ్డారు. ఇది వరకు పార్టీ పరంగా 35గా ఉన్న జిల్లాల సంఖ్యను 65కు చేర్చారు. యూనియన్, నగర, డివిజన్, జిల్లా స్థాయి కార్యవర్గాల ఎంపిక ను ఎన్నికల ద్వారా నిర్వహించేందుకు నిర్ణయించారు. అయితే, ఈ ఎన్నికలు వివాదాలకు దారి తీసి పార్టీ పరువు బజారుకెక్కేందుకు మార్గంగా మారింది. జిల్లా స్థాయి కార్యదర్శుల ఎంపిక మాత్రమే జరగాల్సి ఉంది. ఒక్కో జిల్లాలో ఇద్దరు ముగ్గురు నేతలు బరిలో ఉండడంతో వివాదాలు మరింత తారా స్థాయికి చేరే పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో పరిస్థితి కట్టడి చేయడంతో పాటుగా నేతలకు షాక్ ఇచ్చే విధంగా కరుణానిధి వ్యూహాత్మకంగా వ్యవహరించారు. పార్టీకి సేవల్ని అందించిన కేవలం 18 మంది నాయకులకు మాత్రం మళ్లీ జిల్లా కార్యదర్శుల ఎన్నికల్లో పోటీకి అవకాశం ఇచ్చారు. ఇక జిల్లా కార్యదర్శుల ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందే వాళ్లకు ఎమ్మెల్యే, ఎంపీ సీట్లు లేవని తేల్చారు. అలాగే, వారి బంధు మిత్రులకు సైతం సీట్లు ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చుతూ ఎన్నికల బరిలో నిలబడే వారి నుంచి హామీ పత్రం స్వీకరించేందుకు నిర్ణయించారు. పార్టీ వర్గాల్ని తీవ్రంగా మందలిస్తూనే, పార్టీ తీసుకున్న నిబంధనల మేరకు నడచుకునే వాళ్లకే జిల్లా కార్యదర్శులు, రాష్ట్ర పార్టీ పదవుల్లో పోటీకి అవకాశం ఇస్తామని బుధవారం కరుణానిధి ప్రకటించడంతో డీఎంకే వర్గాలకు షాక్ తగిలింది. బాధ్యులు మీరే: లోక్‌సభ ఎన్నికల్లో డీఎంకే డిపాజిట్లు గల్లంతు కావడానికి కారణాలను విశ్లేషిస్తూ పలు పత్రికలు, మీడియాల్లో వచ్చిన కథనాల్ని గుర్తు చేశారు. పార్టీ అభ్యర్థుల ఓటమికి అనేక జిల్లాల కార్యదర్శలే కారణం అంటూ పలు పత్రికలు కథనాలు ప్రచురించాయన్నారు. అదే, ఇతర పార్టీల్లో అయితే, అలాంటి నేతలకు ఉద్వాసనలు పలికారని, తాను అలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి, తప్పు చేసిన వాళ్లను సైతం క్షమించానన్నారు. తాజాగా పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా,ప్రజా స్వామ్యబద్దంగా జరుగుతున్న ఎన్నికల్ని వివాదం చేయడాన్ని చూస్తూ ఊరుకోనని హెచ్చరించారు. అందుకే తాను , పార్టీ ప్రధాన కార్యదర్శి అన్భళగన్, కోశాధికారి ఎంకే స్టాలిన్ చర్చించి ఒక నిర్ణయానికి వచ్చామన్నారు. 18 మందికే అవకాశం : పార్టీ పరంగా 65 జిల్లాలు ఏర్పాటు చేశామన్నారు. ఇది వరకు కార్యదర్శులుగా ఉన్న వాళ్లు, మాజీ మంత్రులుగా, ఎంపీలుగా పదవుల్ని అనుభవించిన వాళ్లు సైతం కార్యదర్శుల పదవికి పోటీ పడుతున్నారని వివరించారు. పాత వాళ్లే మళ్లీ మళ్లీ ఎన్నికవుతుంటే, ఇక కొత్త వాళ్లకు ఎలా అవకాశం ఇవ్వగలమని ప్రశ్నించారు. అందుకే జిల్లా కార్యదర్శుల పదవులకు పోటీ చేసే వాళ్లకు అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో సీట్లు ఇవ్వకూడదన్న నిర్ణయానికి వచ్చామన్నారు. పార్టీ కోసం సేవల్ని అందిస్తూ ముందుకు సాగుతున్న 18 మంది నాయకులకు మాత్రమే మళ్లీ పోటీ చేసే అవకాశం ఇచ్చామని, వీరు చట్ట సభల ఎన్నికల్లో పోటీ చేయరని స్పష్టంచేశారు. మిగిలిన చోట్ల అసెంబ్లీ, ఎంపీ సీట్లు వద్దు అనుకునే వాళ్లు జిల్లా కార్యదర్శులకు పోటీ చేసుకోవచ్చని సూచించారు. జిల్లా కార్యదర్శుల పదవులకు, రాష్ట్ర పార్టీలోని కొన్ని పదవులకు పోటీ చేయదలచిన వాళ్లు తాము అసెంబ్లీ, ఎంపీ సీట్లను ఆశించేది లేదని హామీ పత్రాన్ని పార్టీకి అందించాల్సి ఉంటుందన్నారు. కరుణ ప్రకటన పార్టీ వర్గాల్ని డోలాయమానంలో పడేసింది. జిల్లా కార్యదర్శుల పదవుల్లో గెలిచినా, సీట్లు ఇవ్వబోమని కరుణానిధి స్పష్టం చేయడంతో ఇక పదవి కన్నా, ఎంపీ, ఎమ్మెల్యే సీట్లే ముఖ్యం అన్నట్టుగా ఆ ఎన్నికల నుంచి తప్పుకునేందుకు కొందరు నేతలు సిద్ధమవుతున్నారు. పార్టీ కార్యాలయ నిర్వాహక ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్న ఎంఆర్కే పన్నీరు సెల్వం ఆ పదవి నుంచి తప్పుకునేందుకు సిద్ధమైనట్టు, ఆ పదవిని కేఎన్ నెహ్రు చేపట్టనున్నట్లు అరివాళయంలో చర్చ బయల్దేరింది. -
ఒక్క కోర్టు తీర్పుతో రాజకీయాల్లో పెనుమార్పులు!
చెన్నై: ముఖ్యమంత్రి జే.జయలలిత ఆదాయానికి మంచి ఆస్తులున్నాయనే ఆరోపణలతో నమోదైన కేసులో బెంగళూరు కోర్టు వెల్లడించే తీర్పు తమిళనాడు రాజకీయాలను ప్రభావితం చేస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. 18 సంవత్సరాలుగా కోర్టు విచారణలో ఉన్న ఈ కేసులో జయలలిత, మరో ముగ్గురుపై తీర్పును శనివారం కర్నాటక రాజధాని బెంగళూరులోని ఓ ప్రత్యేక కోర్టు వెల్లడించనుంది. ఒకవేళ జయలలితకు వ్యతిరేకంగా కోర్టు తీర్పు వెలువడితే తమిళనాడు రాజకీయాల్లో పెనుమార్పులు వచ్చే అవకాశం ఉందని, అంతేకాకుండా 2016లో పార్టీ విజయావకాశాలు, ఆమె ఇమేజ్ దెబ్బతినడం ఖాయమని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ కుట్రలో బలయ్యానని ఆరోపణలు చేస్తున్న జయలలితకు అనుకూలంగా తీర్పు వస్తే డీఎంకే పరిస్తితి మరింత దెబ్బతినే విధంగా ఉంటుందంటున్నారు. 1996లో ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో జయలలిత 66 కోట్ల రూపాయలు..లెక్కకు మించి ఉన్నాయని డీఎంకే అధినేత ఎం కరుణానిధి కేసు నమోదు చేశారు. -
వస్తున్నా
సాక్షి, చెన్నై: కార్యకర్తలను స్వయంగా కలుసుకుని అభిప్రాయ సేకరణకు డీఎంకే కోశాధికారి ఎంకే స్టాలిన్ సిద్ధమయ్యారు. గురువారం నుంచి తన పర్యటనకు శ్రీకారం చుట్టనున్నారు. కాంచీపురం జిల్లా నేతలతో కాటాన్ కొళత్తూరులో సమాలోచనలు జరపనున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో డిపాజిట్లు గల్లంతు కావడంతో పార్టీలో పూర్తి స్థాయి ప్రక్షాళనకు డీఎంకే అధినేత ఎం కరుణానిధి నిర్ణయించారు. పార్టీ పరంగా జిల్లాలను విభజించారు. జిల్లాల సంఖ్యను 65కు పెంచారు. పార్టీ పరంగా యూనియన్, నగరాల విభజన పర్వం శరవేగంగా సాగుతోంది. ఇప్పటికే అన్ని జిల్లాల కమిటీలను రద్దు చేసిన దృష్ట్యా, కొత్తగా కమిటీల ఎంపిక మీద దృష్టి కేంద్రీకరించారు. తొలుత వార్డు స్థాయి కమిటీలకు సంస్థాగత ఎన్నికల ద్వారా కార్యవర్గాల ఏర్పాటు ప్రక్రియ సాగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లోపు పార్టీని పూర్తి స్థాయిలో పటిష్ట వంతం చేయడం లక్ష్యంగా అధినేత కరుణానిధికి కోశాధికారి ఎంకే స్టాలిన్ తీవ్రంగా కసరత్తుల్లో మునిగి ఉన్నారు. ఈ పరిస్థితుల్లో జిల్లా కమిటీల్ని సంస్థాగత ఎన్నికల ద్వారా ఎంపిక చేయడం అన్నది సాహసంతో కూడుకున్న పనే. ఈ ఎన్నికలు పార్టీలో పదవుల విషయంలో చిచ్చు రగ్చిలిన పక్షంలో పెను నష్టాన్ని చవి చూడాల్సి వస్తుందన్న విషయాన్ని అధినేతలు పరిగణనలోకి తీసుకున్నారు. దీంతో పార్టీ కార్యకర్తలు, నాయకులు, అనుబంధ విభాగాల అభిప్రాయాల సేకరణకు సిద్ధమయ్యారు. కరుణానిధి వారసుడిగా పార్టీ బలోపేతం లక్ష్యంగా దూసుకెళ్తోన్న స్టాలిన్, స్వయంగా కార్యకర్తలను కలుసుకుని అభిప్రాయూలు సేకరించనున్నారు. అభిప్రాయ సేకరణ: రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ వర్గాల అభిప్రాయ సేక రణకు సిద్ధమైన స్టాలిన్ గురువారం నుంచి తన వ్యూహాలకు పదును పెట్టే పనిలో పడ్డారు. తొలుత కాంచీపురం జిల్లా నుంచి తన అభిప్రాయ సేకరణ చేపట్టనున్నారు. ఒక రోజంతా ఆ జిల్లా నాయకులు, కార్యకర్తలతోనే గడపనున్నారు. కాటాన్ కొళత్తూరులోని ఎస్ఆర్ఎం హోటల్లో ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు అభిప్రాయాలను సేకరించనున్నారు. పార్టీ యువజన, విద్యార్థి, మహిళ, సాంస్కృతిక, న్యాయవాద, కార్మిక, వ్యవసాయ తదితర అనుబంధ విభాగాల నాయకులు, కార్యకర్తలతోపాటుగా జిల్లా స్థాయి నాయకులు, ప్రతినిధులతో సంప్రదింపులు జరపనున్నారు. అదే రోజు సాయంత్రం ఆరు గంటలకు చెంగల్పట్టులోని ఏవీఎన్ కల్యాణ మండపంలో జరిగే పార్టీ జిల్లా స్థాయి నాయకులు, కార్యకర్తల సమావేశంలో ప్రసంగించనున్నారు. స్టాలిన్ రాకకు కాంచీపురం జిల్లా నేత, మాజీ మంత్రి తాము అన్భరసన్ నేతృత్వంలో ఏర్పాట్లు వేగవంతంగా సాగుతున్నాయి. -
విచారణకు రండి!
సాక్షి, చెన్నై: కేంద్ర టెలికాం మంత్రిగా ఉన్న సమయంలో డీఎంకే అధినేత ఎం కరుణానిధి మనవడు దయానిధి మారన్ అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు ఆరోపణలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ, వ్యక్తిగతంగా 363 బీఎస్ఎన్ఎల్ కనెక్షన్లను ఆయన కలిగి ఉన్న ట్టు ప్రచారం సాగింది.సొమ్ము ఒకడిది సోకు మరొకడిది అన్నట్టుగా ప్రభుత్వ కనెక్షన్లను తన సోదరుడు కళానిధి మారన్ నేతృత్వంలోని సన్ గ్రూప్‌కు ఉపయోగించినట్టుగా ప్రతిపక్షాలు గళాన్ని విప్పాయి. ఈ తంతుతో ప్రభుత్వ ఆదాయానికి రూ.440 కోట్ల మేరకు గండి పడినట్లు వెలుగు చూసింది. అయితే, అధికారం తమ గుప్పెట్లో ఉండడంతో వ్యవహరాన్ని చడీచప్పుడు కాకుండా తొక్కిపెట్టేశారు. నిజాలు ఏదో ఒక రోజు బయటపడక తప్పదన్నట్టుగా 2జీ స్పెక్ట్రమ్ వ్యవహారాన్ని విచారిస్తున్న సీబీఐకు తీగ లాగితో డొంక కదిలిన చందంగా మారన్ కనెక్షన్ల వ్యవహారంలో ఆధారాలు చిక్కాయి. గత ఏడాది ఇందుకు సంబంధించిన చార్జ్‌షీట్ సీబీఐ కోర్టులో దాఖలైంది. సంక్లిష్టం : కేంద్రంలో ఇన్నాళ్లు యూపీఏ అధికారంలో ఉండటంతో తప్పులన్నీ చేసి హాయిగా నిద్రబోయిన మారన్ బ్రదర్స్‌కు ఇప్పుడు అధికార మార్పు సంక్లిష్ట పరిస్థితుల్లోకి నెట్టేసింది. ఆ చార్జ్ షీట్ ఆధారంగా సీబీఐ విచారణ వేగవంతం చేసింది. పది రోజులుగా చెన్నైలో తిష్ట వేసి ఉన్న సీబీఐ ప్రత్యేక బృందం సన్ గ్రూపులో పనిచేస్తున్న, పని చేసిన సిబ్బందిని విచారిస్తున్నది. సన్ గ్రూప్‌లో గతంలో పనిచేసిన సక్సేనా ఇచ్చిన కొన్ని ఆధారాలు, వివరాలు సీబీఐకు వరంగా మారినట్టు సమాచారం. దీంతో మారన్ బ్రదర్స్‌ను విచారణకు పిలిచేందుకు సీబీఐ సిద్ధం అయింది. ఉన్నతాధికారులు ఆదేశాలు ఇవ్వడంతో ఆ బ్రదర్స్‌ను తమ విచారణకు ఆహ్వానించే పనిలో పడ్డారు. ఈనెల 16న చెన్నైలో విచారణకు రావాలంటూ ఆ ఇద్దరికీ సమన్లు జారీ చేశారు. కొన్ని రకాల ప్రశ్నలను సైతం ఆ సమన్ల ద్వారా సీబీఐ సంధించినట్టు సమాచారం. ఆ ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చే రీతిలో ఆధారాలను విచారణలో బ్రదర్స్ సమర్పించాల్సి ఉంది. అయితే, బ్రదర్స్ ఇద్దరూ విచారణకు హాజరయ్యేనా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. బ్రెజిల్‌కు జంప్: సాకర్ సంగ్రామం బ్రెజిల్ వేదికగా గురువారం ఆరంభం అయింది. దీంతో ఈ బ్రదర్స్ ఆ సంగ్రామాన్ని తిలకించేందుకు బ్రెజిల్ వెళ్లినట్టుగా సంకేతాలు వెలువడుతున్నాయి. కొన్నాళ్లు బ్రెజిల్ ఉండి ఫుట్‌బాల్ మ్యాచ్‌లను తిలకించేందుకు ముందస్తుగానే ఈ ఇద్దరు ఏర్పాట్లు చేసుకున్నట్టుగా డీఎంకే వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే, తమను ఎలాగూ విచారణకు సీబీఐ పిలుస్తుందన్న సమాచారంతో కొన్నాళ్లు వారి కంటపడకుండా ఉండేందుకే ఈ బ్రదర్స్ బ్రెజిల్ చెక్కేసి ఉంటారన్న చర్చ కూడా మొదలైంది. -
స్టాలిన్ యూటర్న్
-
స్టాలిన్ యూటర్న్... రాజీనామా ఓ డ్రామా: ఆళగిరి
చెన్నై: డీఎంకే పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా సమర్పించిన ఆపార్టీ నేత, కరుణానిధి కుమారుడు ఎంకే స్టాలిన్ యూటర్న్ తీసుకున్నారు. స్టాలిన్ రాజీనామాతో చెన్నైలో హైడ్రామా నడించింది. రాజీనామాను ఉపసంహరించుకోవాలని పార్టీ హైకమాండ్ ఒత్తిడి మేరకు స్టాలిన్ యూటర్న్ తీసుకున్నారు. స్టాలిన్ రాజీనామా ఓ డ్రామా అని డిఎంకే పార్టీ బహిషృత నేత ఎంకే అళగిరి ఆరోపించారు. రాజీనామా ప్రకటించగానే స్టాలిన్ నివాసానికి పార్టీ అధినేత కరుణానిధి, సీనియర్ నేతలు చేరుకుని.. రాజీనామాను ఉపసంహరింప చేశారు. తమ ఒత్తిడి మేరకు రాజీనామాపై స్టాలిన్ మనసు మార్చుకున్నారని సీనియర్ నేత దురై మురుగన్ మీడియాకు తెలిపారు. -
పార్టీ పదవులకు స్టాలిన్ రాజీనామా!
-
పార్టీ పదవులకు స్టాలిన్ రాజీనామా!
చెన్నై: లోకసభ ఎన్నికల్లో పార్టీ దారుణమైన ఫలితాలను సాధించడానికి నైతిక బాధ్యత వహిస్తూ డీఏంకే కోశాధికారి, కరుణానిధి కుమారుడు ఎంకే స్టాలిన్ పార్టీ పదవులకు రాజీనామా చేశారు. స్టాలిన్ తన పదవులకు రాజీనామా చేశారని పార్టీకి చెందిన ఓ సీనియర్ నేత మీడియాకు వెల్లడించారు. తాజా లోకసభ ఎన్నికల్లో తమిళనాడులో డీఎంకే పార్టీ తుడిచిపెట్టుకుపోయిన సంగతి తెలిసిందే. తమిళనాడులో జయలలిత నాయకత్వంలోని ఏఐఏడీఎంకే పార్టీ 37 సీట్లు గెలుచుకోగా, బీజేపీ, పీఎంకే పార్టీలు చెరో స్థానాన్ని సొంతం చేసుకున్నారు. -
కనిమొళికి అస్వస్థత, ఆస్పత్రిలో చేరిక
చెన్నై: డీఎంకే పార్టీ అధినేత ఎం కరుణానిధి కుమార్తె, రాజ్యసభ సభ్యురాలు కనిమొళి అనారోగ్యంతో చెన్నైలోని కావేరి ఆస్పత్రిలో చేరారు. తీవ్ర ఒత్తిడి, అలసట కారణంగా కనిమొళి అస్వస్థతకు లోనయ్యారని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి బాగానే ఉంది. ఆందోళన పడాల్సిన అవసరం లేదు. సోమవారం డిశ్చార్జి చేస్తాం అని వైద్యులు తెలిపారు. ఫ్లూయిడ్ థెరపీని అందిస్తున్నామని..పరిస్థితి మెరుగైందని, కనిమొళికి విశ్రాంతి అవసరమని కావేరి ఆస్పత్రి విడుదల చేసిన బులెటిన్ తెలిపారు. ఆదివారం సాయంత్రం కనిమొళిని కరుణానిధి ఆస్పత్రిలో కలిశారు.