
విచారణకు రండి!
సాక్షి, చెన్నై: కేంద్ర టెలికాం మంత్రిగా ఉన్న సమయంలో డీఎంకే అధినేత ఎం కరుణానిధి మనవడు దయానిధి మారన్ అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు ఆరోపణలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ, వ్యక్తిగతంగా 363 బీఎస్‌ఎన్‌ఎల్ కనెక్షన్లను ఆయన కలిగి ఉన్న ట్టు ప్రచారం సాగింది.సొమ్ము ఒకడిది సోకు మరొకడిది అన్నట్టుగా ప్రభుత్వ కనెక్షన్లను తన సోదరుడు కళానిధి మారన్ నేతృత్వంలోని సన్ గ్రూప్‌కు ఉపయోగించినట్టుగా ప్రతిపక్షాలు గళాన్ని విప్పాయి. ఈ తంతుతో ప్రభుత్వ ఆదాయానికి రూ.440 కోట్ల మేరకు గండి పడినట్లు వెలుగు చూసింది. అయితే, అధికారం తమ గుప్పెట్లో ఉండడంతో వ్యవహరాన్ని చడీచప్పుడు కాకుండా తొక్కిపెట్టేశారు. నిజాలు ఏదో ఒక రోజు బయటపడక తప్పదన్నట్టుగా 2జీ స్పెక్ట్రమ్ వ్యవహారాన్ని విచారిస్తున్న సీబీఐకు తీగ లాగితో డొంక కదిలిన చందంగా మారన్ కనెక్షన్ల వ్యవహారంలో ఆధారాలు చిక్కాయి. గత ఏడాది ఇందుకు సంబంధించిన చార్జ్‌షీట్ సీబీఐ కోర్టులో దాఖలైంది.
సంక్లిష్టం : కేంద్రంలో ఇన్నాళ్లు యూపీఏ అధికారంలో ఉండటంతో తప్పులన్నీ చేసి హాయిగా నిద్రబోయిన మారన్ బ్రదర్స్‌కు ఇప్పుడు అధికార మార్పు సంక్లిష్ట పరిస్థితుల్లోకి నెట్టేసింది. ఆ చార్జ్ షీట్ ఆధారంగా సీబీఐ విచారణ వేగవంతం చేసింది. పది రోజులుగా చెన్నైలో తిష్ట వేసి ఉన్న సీబీఐ ప్రత్యేక బృందం సన్ గ్రూపులో పనిచేస్తున్న, పని చేసిన సిబ్బందిని విచారిస్తున్నది. సన్ గ్రూప్‌లో గతంలో పనిచేసిన సక్సేనా ఇచ్చిన కొన్ని ఆధారాలు, వివరాలు సీబీఐకు వరంగా మారినట్టు సమాచారం. దీంతో మారన్ బ్రదర్స్‌ను విచారణకు పిలిచేందుకు సీబీఐ సిద్ధం అయింది. ఉన్నతాధికారులు ఆదేశాలు ఇవ్వడంతో ఆ బ్రదర్స్‌ను తమ విచారణకు ఆహ్వానించే పనిలో పడ్డారు. ఈనెల 16న చెన్నైలో విచారణకు రావాలంటూ ఆ ఇద్దరికీ సమన్లు జారీ చేశారు.
కొన్ని రకాల ప్రశ్నలను సైతం ఆ సమన్ల ద్వారా సీబీఐ సంధించినట్టు సమాచారం. ఆ ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చే రీతిలో ఆధారాలను విచారణలో బ్రదర్స్ సమర్పించాల్సి ఉంది. అయితే, బ్రదర్స్ ఇద్దరూ విచారణకు హాజరయ్యేనా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. బ్రెజిల్‌కు జంప్: సాకర్ సంగ్రామం బ్రెజిల్ వేదికగా గురువారం ఆరంభం అయింది. దీంతో ఈ బ్రదర్స్ ఆ సంగ్రామాన్ని తిలకించేందుకు బ్రెజిల్ వెళ్లినట్టుగా సంకేతాలు వెలువడుతున్నాయి. కొన్నాళ్లు బ్రెజిల్ ఉండి ఫుట్‌బాల్ మ్యాచ్‌లను తిలకించేందుకు ముందస్తుగానే ఈ ఇద్దరు ఏర్పాట్లు చేసుకున్నట్టుగా డీఎంకే వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే, తమను ఎలాగూ విచారణకు సీబీఐ పిలుస్తుందన్న సమాచారంతో కొన్నాళ్లు వారి కంటపడకుండా ఉండేందుకే ఈ బ్రదర్స్ బ్రెజిల్ చెక్కేసి ఉంటారన్న చర్చ కూడా మొదలైంది.