ఉదయసూర్యుని (డీఎంకే చిహ్నం) కిరణాల ధాటికి రాష్ట్రంలోని రెండాకులు (అన్నాడీఎంకే చిహ్నం) విలవిల్లాడుతున్నాయి. రెండాకుల నీడను వీడి, దినకరన్ పంచన చేరిన విజయకాంత్ ఇకపై ఉదయసూర్యుడి కోసం ఢంకా (డీఎండీకే చిహ్నం) భజాయించాలనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.
సాక్షి ప్రతినిధి, చెన్నై: నటుడు విజయకాంత్ అధ్యక్షతన డీఎండీకే ఏర్పడిన తరువాత రెండు అసెంబ్లీ ఎన్నికలను ఒంటరిగా ఎదుర్కొంది. 2011 అసెంబ్లీ ఎన్నికల సమయంలో అన్నాడీఎంకే కూటమిలో చేరింది. అధికార అన్నాడీఎంకే తరువాత అత్యధిక స్థానాల్లో గెలుపొందడం ద్వారా ప్రధాన ప్రతిపక్షస్థానం హోదాను పొందింది. ఆ తరువాత జయలలితతో విబేధించి 2016 అసెంబ్లీ ఎన్నికల్లో డీఎండీకే సహా పలుపార్టీలు ఏకమై ప్రజా సంక్షేమ కూటమిని ఏర్పాటు చేసుకుని బరిలోకి దిగి అందరూ బోల్తాపడ్డారు. గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే కూటమి నుంచి వైదొలిగిన డీఎంకేడీకే, టీటీవీ దినకరన్ నేతృత్వంలోని ఏఎంఎంకే కూటమిలో చేరింది. అయితే ఆ కూటమి కనీసం ఒక్కసీటులో కూడా గెలుపొందలేదు.
అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే డీఎంకే కూటమిలో డీఎండీకే చేరుతుందని కొందరు అంచనా వేసినా అది జరగలేదు. ఎన్నికలు ముగిసిన తరువాత డీఎండీకే తరఫున విజయకాంత్ బావమరిది ఎల్‌కే సుధీష్, కుమారుడు విజయ్ ప్రభాకరన్ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఆ తరువాత సీఎం స్టాలిన్ అనారోగ్యంతో ఉన్న విజయకాంత్‌ను ఇంటికి వెళ్లి పరామర్శించారు. అప్పుడు కరోనా నివారణ కోసం సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ.10 లక్షలను విజయకాంత్ అందజేశారు. ఈ పరిణామాలతో డీఎంకే, డీఎండీకే కార్యకర్తలు, నిర్వాహకుల మధ్య స్నేహపూర్వక వాతావరణం నెలకొంది. మరికొన్ని నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనుండగా డీఎంకే కూటమిలో డీఎండీకే చేరుతుందనే సంకేతాలు వెలువడుతున్నాయి.
డీఎండీకే శ్రేణుల కూడా ఇదే ఆశిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒంటరిగా పోటీచేసి ఏమీ సాధించలేమని డీఎండీకే నేత ఒకరు వ్యాఖ్యానించారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే డీఎంకే కూటమిలో చేరాలని భావించాం, అయితే చివరి రోజుల్లో ఆ నిర్ణయం మారిపోయిందని సీనియర్ నేత ఒకరు పెదవి విరిచారు. అన్ని పార్టీలతోపాటూ డీఎండీకే కూడా స్థానిక సంస్థల ఎన్నికలకు సమాయత్తం అవుతోంది.
అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన చేదు అనుభవాలు స్థానిక ఎన్నికల్లో చవిచూడరాదని డీఎండీకే గట్టిగా భావిస్తోంది. డీఎంకే కూటమిలో చేరి స్థానిక ఎన్నికల బరిలో దిగేందుకు నిర్ణయించుకున్న డీఎండీకే అధినేత విజయకాంత్, ఆయన సతీమణి, కోశాధికారి ప్రేమలత త్వరలో పార్టీ నిర్వాహకులతో సమావేశం అవుతున్నట్లు సమాచారం. అదే సమావేశంలో డీఎంకే కూటమిలో డీఎండీకే చేరడంపై అధికారికంగా ప్రకటిస్తారని తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment