డీలిమిటేషన్‌పై దక్షిణాది రాష్ట్రాలు ఏకమయ్యాయి: రేవంత్‌ రెడ్డి | CM Stalin And Others Delimitation JAC meeting Live Updates | Sakshi
Sakshi News home page

డీలిమిటేషన్‌పై దక్షిణాది రాష్ట్రాలు ఏకమయ్యాయి: రేవంత్‌ రెడ్డి

Published Sat, Mar 22 2025 10:26 AM | Last Updated on Sat, Mar 22 2025 2:19 PM

CM Stalin And Others Delimitation JAC meeting Live Updates

Delimitation JAC meeting Updates..

👉కేటీఆర్‌ కామెంట్స్‌: ఇది కేవలం పార్లమెంటులో ప్రాతినిధ్యానికి సంబంధించిన అంశం మాత్రమే కాదని.. నిధులు కేంద్రీకృతం కావడంతో పాటు.. ఆర్థిక నియంతృత్వానికి దారితీస్తుందని దక్షిణాది భవిష్యత్తును కాలరాస్తుందని కేటీఆర్‌ వివరించారు. దేశం ప్రజాస్వామిక దేశమైనా… భిన్న అస్తిత్వాలు, సంస్కృతులు కలిగిన ఒక సమాఖ్య రాష్ట్ర అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. కేసీఆర్ ఆధ్వర్యంలో 14 సంవత్సరాలపాటు తెలంగాణ ఉద్యమం నడిపించారు. తమిళనాడు ప్రజల నుంచి అనేక అంశాలు స్ఫూర్తి తీసుకుంటాము. అస్తిత్వం కోసం, హక్కుల కోసం కొట్లాడటంలో తమిళనాడు స్ఫూర్తినిచ్చింది. ద్రవిడ ఉద్యమం సమైక్య దేశంలో తమ హక్కులు సాధించుకోవడానికి రాష్ట్రాలకు ఒక దిక్సూచి లెక్క పనిచేస్తుంది.

..కేంద్ర ప్రభుత్వ ప్రస్తుత డిలిమిటేషన్ వల్ల అనేక నష్టాలు జరుగుతున్నాయి. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ వివక్షపూరిత విధానాల వలన దక్షిణాదికి అనేక నష్టాలు జరుగుతున్నాయి. దేశ అభివృద్ధి కోసం పని చేసినందువలన ఈ రోజు నష్టం జరుగుతుంది. మనమంతా ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నాం. ప్రజాస్వామ్యం మంద బలం ఆధారంగా నడవరాదు. మందబలం ఉన్నందువలన నియంతత్వం రావద్దు. దేశ అభివృద్ధిలో ముందు వరుసలో ఉన్న రాష్ట్రాలకు నష్టం కలిగిస్తూ… దేశాన్ని వెనక్కి నెడుతున్న రాష్ట్రాలకి ఈ డిలిమిటేషన్ విధానం లాభం చేకూరుస్తుంది. పరిపాలన ఆర్థిక అభివృద్ధిలో దక్షిణాది రాష్ట్రాలు దేశానికి ఆదర్శంగా ఉన్నాయి కానీ దానివల్లనే తీవ్రమైన నష్టాన్ని ఎదుర్కొంటున్నాయి.

👉దేశానికి 36% జిడిపిలో భాగస్వామ్యం ఉన్న దక్షిణాది రాష్ట్రాలు శిక్షింపబడుతున్నాయి. డీలిమిటేషన్ అంశం కేవలం పార్లమెంట్ ప్రాతినిధ్యం తగ్గడానికి పరిమితం కాదు. ఆర్థికపరమైన నిధుల కేటాయింపుల్లో కూడా తీవ్రమైన నష్టం జరగబోతుంది. వీటి కేటాయింపుల్లో కూడా అధికారం పూర్తిగా కేంద్రీకృతమై నియంతృత్వం వైపు దారితీసే అవకాశం ఉన్నది. ఆర్థిక వనరుల కేంద్రీకృతం జరగడం వలన భవిష్యత్తులోనూ ప్రస్తుతం ఉన్న దక్షిణాది రాష్ట్రాలకు జరుగుతున్న నిధుల కేటాయింపులు అన్యాయం మరింతగా పెరుగుతుంది.

👉దక్షిణాది రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వ వివక్ష కొత్త కాదు. కానీ ఈ మధ్యకాలంలో ఈ వివక్ష అన్యాయం మరింత పెరిగింది. ప్రస్తుతం బీజేపీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం దీన్ని మరింత పెంచేలా డీ లిమిటేషన్ అంశాన్ని ముందుకు తీసుకువచ్చింది. కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన బుల్లెట్ రైలు వంటి ప్రాజెక్టులన్ని ఉత్తరాదికే పరిమితం అవ్వడం ఇందుకు ఒక ఉదాహరణ. బీజేపీ సారధ్యంలోని కేంద్రం ఈ విధంగా దక్షిణాది రాష్ట్రాలకు జరుగుతున్న అన్యాయంపైన పుండుపైన ఉప్పురుద్దినట్టుగా వ్యవహరిస్తున్నది

👉ఆదర్శవంతమైన సమైక్య రాష్ట్ర దేశంలో ఒక ప్రాంతం ఇంకో ప్రాంతం పైన ఆదిపత్యం చలాయించే విధంగా ఉండరాదన్నది ప్రజాస్వామ్యస్ఫూర్తి. ఇది కేవలం ఉత్తర దక్షిణాది రాష్ట్రాల వ్యవహారం కాదు అభివృద్ధి చెందిన రాష్ట్రాలు ప్రాంతాలకు నష్టం జరుగుతున్న అంశం. కేవలం జనాభా ఆధారంగా సీట్ల పెరుగుదల గనుక జరిగితే దేశ సమాఖ్య స్ఫూర్తికి తీవ్ర విఘాతం కలిగే ప్రమాదం ఉన్నది. మనమంతరం భారతీయులం…అయితే మనందరికీ ఆయా ప్రాంతాల అస్తిత్వం ఉందన్న విషయాన్ని మర్చిపోవద్దు. విభిన్న భాషలు సాంస్కృతిక అస్తిత్వాలతో కూడిన ఒక సమైక్య దేశం అన్న విషయాన్ని మర్చిపోకూడదు. వెనుకబడిన రాష్ట్రాలకు నిధులు ఇచ్చే అంశాన్ని మేము ఏమి వ్యతిరేకించడం లేదు కానీ… నిధుల కేటాయింపుల వివక్షను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం.

👉1971 తర్వాత ఉన్న పార్లమెంటు సీట్లు కేటాయింపు తర్వాత జరిగిన జనాభా నియంత్రణ వలన ఈరోజు దక్షిణాదికి నష్టం జరగడం అన్యాయం. జనాభా నియంత్రణను దేశ అభివృద్ధి కోసం దక్షిణాది రాష్ట్రాలు పాటించాయి. ఉత్తరాది రాష్ట్రాలు జనాభా నియంత్రణలో విఫలమైనందువలన వారికి ఈ రోజు డీలిమిటేషన్‌లో​ లబ్ధి జరగడం ఏ విధంగా కూడా సరైంది కాదు. ఇది దేశాన్ని వెనుక వేసిన వాళ్లకి రివార్డు ఇవ్వడం లాంటిది. దేశానికి స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాలు పూర్తి చేసుకోబోయే 2047 నాటికి సూపర్ పవర్ కావాలి అంటే అభివృద్ధి సాధించిన రాష్ట్రాలకు ప్రోత్సాహం లభించాలి కానీ శిక్ష కాదు. డిలిమిటేషన్ అనేది ఆర్థిక అభివృద్ధి పరిపాలన అభివృద్ధి వంటి అంశాల పైన జరగాలి కానీ కేవలం పరిపాలన పైన కాదు. ఈ అంశంలో జరుగుతున్న నష్టం పైన మాట్లాడకుంటే చరిత్ర మనల్ని క్షమించదు. భవిష్యత్తు తరాలు ఈరోజు మన మౌనాన్ని తప్పకుండా ప్రశ్నిస్తాయి.

👉తమిళనాడు సీఎం స్టాలిన్‌ మాట్లాడుతూ.. డీలిమిటేషన్‌ కారణంగా పార్లమెంట్‌లో మన ప్రాతినిధ్యం తగ్గిపోతుంది. మన గొంతు వినిపించే వాళ్లు తగ్గిపోతారు. మన అభిప్రాయానికి విలువ లేకుండా పోతుంది. భవిష్యత్‌ శ్రేయస్సుకు భంగం కలుగుతుంది. స్త్రీల హక్కులకు కూడా భంగం కలుగుతుంది. 

👉తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ కామెంట్స్‌..‘దక్షిణాది రాష్ట్రాల్లో కుటుంబ నియంత్రణ అమలైంది. ఉత్తరాది రాష్ట్రాల్లో కుటుంబ నియంత్రణ అమలుకాలేదు. ఆర్థిక అభివృద్ధి, జీడీపీ, ఉద్యోగ కల్పనలో దక్షిణాది ముందుంది. బాగా పని చేసిన మనకు శిక్ష వేస్తారా?. న్యాయబద్దం కాని డీలిమిటేషన్‌పై మనం బీజేపీని అడ్డుకోవాలి. ఇది రాజకీయ అసమానతలకు దారి తీస్తుంది. డీలిమిటేషన్‌ రాజకీయంగా దక్షిణాదిని పరిమితం చేస్తుంది. గతంలో వాజ్‌పేయి కూడా లోక్‌సభ సీట్లు పెంచకుండానే డీలిమిటేషన్‌ చేశారు. దక్షిణాది నుంచి వెళ్తుంది ఎక్కువ.. వస్తున్నది తక్కువ. పన్నుల రూపంలో తెలంగాణ నుంచి రూపాయి వెళ్తే వస్తున్నది మాత్రం 42 పైసలే. బీహార్‌ రూపాయి పన్ను కడితే.. ఆరు రూపాయాలు పోతున్నాయి. యూపీకి రూపాయికి రెండు రూపాయల మూడు పైసలు వెనక్కు వస్తున్నాయి. దక్షిణాది రాజకీయంగా గొంతు వినిపించే అవకాశాన్ని కోల్పోతుంది. మనం ద్వితీయ శ్రేణి పౌరులుగా మారతాం. డీలిమిటేషన్‌పై దక్షిణాది రాష్ట్రాలు ఏకమయ్యాయి.

👉తమిళనాడు రాజధాని చెన్నై వేదికగా డీలిమిటేషన్‌పై సీఎం స్టాలిన్‌ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కేరళ సీఎం పినరాయ్ విజయన్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, టీపీసీసీ చీఫ్‌ మహేష్‌ కుమార్‌ గౌడ్‌, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బీజేడీ ప్రతినిధి  హాజరయ్యారు. ఈ భేటీకి బెంగాల్‌ తృణముల్‌ కాంగ్రెస్‌ దూరంగా ఉంది.

👉ఇక, ఈ సమావేశంలో డీలిమిటేషన్‌పై నేతలు చర్చించనున్నారు. ఫెయిర్‌ డీలిమిటేషన్ నినాదంతో సమావేశం జరగనుంది. జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్‌ను ఆయా పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. 1971 నాటి జనాభా లెక్కల ఆధారంగానే డీలిమిటేషన్ జరపాలని డిమాండ్ చేస్తున్నాయి. కుటుంబ నియంత్రణ కఠినంగా అమలు చేయడం వల్ల దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా తగ్గి, నియోజకవర్గాలు నష్టపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. నియోజకవర్గాల పునర్విభజన న్యాయంగా జరగాలని పార్టీ నేతలు డిమాండ్‌ చేస్తున్నారు. 

 

👉అఖిలపక్ష సమావేశంలో పాల్గొనేందుకు ఇప్పటికే రాష్ట్రాలు ముఖ్యమం‍త్రులు, కీలక నేతలు చెన్నైకి చేరుకున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement