
అభిప్రాయం
‘స్టాలిన్ దున్నపోతు ఈనిందని అందరికీ ఆహ్వానాలు పంపితే దక్షిణాదికి చెందిన ప్రాంతీయ పార్టీల నేతలు ఆ దూడను కట్టేయడానికి చెన్నైకి పరుగులు పెట్టారు.’ లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనలో దక్షిణాదికి అన్యాయం జరిగిపోతోందంటూ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఏర్పాటు చేసిన సమావేశం అచ్చంగా ఇలాగే జరిగింది. అన్యాయం జరిగిపోతోందని బీజేపీని గుడ్డిగా వ్యతిరేకించడమే పనిగా పెట్టుకున్న పార్టీలు ఆ సమావేశానికి వెళ్లాయి.
చెన్నైలో ఓ స్టార్ హోటల్‌లో కోట్లు ఖర్చు పెట్టి నిర్వహించిన సమావేశంలో ఒక్కరంటే ఒక్కరైనా ఎలా అన్యాయం జరుగుతుందో చర్చించారా? జనాభా లెక్కల ప్రకారం నియోజకవర్గాల విభజన జరుగుతుందనీ, దక్షిణాదిలో జనాభా తగ్గి పోయారనీ, ఉత్తరాదిలో పెరిగిపోయారనీ, అందుకే దక్షిణాదికి సీట్లు తగ్గుతాయనీ వీరంతా ఓ నిర్ణయానికి వచ్చేశారు.
నిజానికి ఈ ప్రక్రియలో ఇంతవరకూ ఒక్క అడుగు కూడా పడలేదు. ముందుగా జనాభా లెక్కలు పూర్తి చేయాలి. అప్పుడే ఉత్తరాదిలో ఎంత పెరిగారు, దక్షిణాదిలో పెరిగారా, తగ్గారా అన్న స్పష్టత వస్తుంది. ఆ తర్వాత నియోజకవర్గాల పునర్విభజన కమిషన్ ఏర్పాటవుతుంది. జనాభా లెక్కల ప్రకారమే పునర్విభజన చేస్తారన్నది కూడా అపోహే! అలా అయితే ఈశాన్య రాష్ట్రాలకు 25 లోక్‌సభ సీట్లు ఉండేవా?
ఏ రాష్ట్రానికీ అన్యాయం జరగదని పదే పదే చెబుతున్న ప్రధాని, కేంద్ర హోంమంత్రి... ఏ రాష్ట్రానికీ ఒక్క సీటు కూడా తగ్గదని వివిధ సందర్భాల్లో స్పష్టం చేశారు. 2023లో రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ డీలిమిటేషన్ ప్రక్రియను 2026 తర్వాత జనగణన డేటా ఆధారంగా చేపట్టాలని ప్రభుత్వం యోచి స్తోందని ప్రకటించారు. ప్రతి ఓటరుకూ సమాన ప్రాతి నిధ్యం లభించేలా చేస్తామన్నారు.
ప్రాంతీయ అభివృద్ధికి దోహదపడేలా డీలిమిటేషన్ ఉంటుందన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్థానిక జనాభా వైవిధ్యం, గిరిజన సముదాయాల ప్రాతినిధ్యాన్ని కాపాడేలా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ‘డీలిమిటేషన్ అనేది కేవలం స్థానాల సంఖ్యను పెంచడం లేదా తగ్గించడం కాదు, ప్రజాస్వామ్యంలో సమానత్వాన్ని స్థాపించే ప్రక్రియ’ అని స్పష్టం చేశారు
రాజకీయ అలజడి కోసమే...
అయినా దక్షిణాదిలోని కొన్ని ప్రాంతీయ పార్టీలు కాకి లెక్కలను ప్రచారం చేస్తున్నాయి. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలకు 42 లోక్‌సభ స్థానాలుంటే, పునర్విభజన తరు వాత 34 అవుతాయని చెబుతున్నారు. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాలకు ప్రస్తుతం 129 స్థానాలుంటే వీటి సంఖ్య 103కు పడిపోయే అవకాశం ఉందని చెబుతున్నారు.
ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజ స్థాన్, బిహార్ రాష్ట్రాలలోని స్థానాల సంఖ్య 174 నుంచి 204 స్థానాలకు చేరుకుంటుందని అంటున్నారు. నిజానికి ఈ లెక్కలు ఇచ్చింది ఓ విదేశీ సంస్థ. ‘కార్నెగీ ఎండోమెంట్ ఫర్ ఇంటర్నేషనల్ పీస్’ అనే సంస్థ ‘ఇండియాస్ ఎమర్జింగ్ క్రైసిస్ ఆఫ్ రిప్రజెంటేషన్’ అనే నివేదిక సిద్ధం చేసింది. ఈ నివేదిక తప్ప, డీలిమిటేషన్ సీట్లపై మరో రిపోర్టు లేదు.
కేంద్రం నుంచి అసలు లేదు. అయినా ఓ విదేశీ సంస్థ రిపోర్టును పట్టుకుని దేశంలో రాజకీయ అలజడి రేపడానికి డీఎంకే ప్రయత్నిస్తూంటే, ఆ పార్టీ ట్రాప్‌లో ఇతర పార్టీలు పడుతున్నాయి. డీలిమిటేషన్ ప్రక్రియ ఇంకా ప్రారంభం కాలేదనీ, ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయమూ తీసు కోలేదనీ కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి కూడా స్పష్టం చేశారు. లోకసభ నియోజకవర్గాల పునర్విభజన గతంలో 2002లో ప్రారంభమైంది.
2008లో అమలులోకి వచ్చింది. ఈ ప్రక్రియ భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 82 ప్రకారం జరిగింది. 2002లో డీలిమిటేషన్ చట్టం ఆమోదించిన తర్వాత, సుప్రీంకోర్టు న్యాయమూర్తి నేతృత్వంలో ఒక కమిషన్ ఏర్పాటు చేశారు. ఈ కమిషన్‌లో ఎన్నికల కమిషన్ సభ్యులు, రాష్ట్రాల నుండి ప్రతినిధులు ఉన్నారు. 2001 జనాభా లెక్కల ఆధారంగా ప్రతి రాష్ట్రంలో లోక్‌సభ, శాసనసభ నియోజకవర్గాల సంఖ్యను సమన్వయం చేశారు.
దీని ప్రకారం, జనాభా పెరుగుదలకు అనుగుణంగా నియోజకవర్గాల సరిహద్దులు సవరించారు. మొత్తం లోక్‌సభ స్థానాల సంఖ్య మాత్రం మారలేదు. నియోజకవర్గాల పునర్విభజన కమిషన్ వివిధ రాష్ట్రాల్లో స్థానిక ప్రజా ప్రతినిధులు, రాజకీయ పార్టీలు, పౌరుల నుండి సూచనలు స్వీకరించింది. ఈ సూచనలను పరిగణనలోకి తీసుకుని, సరిహద్దులను ఖరారు చేశారు. ఇప్పుడు కూడా అలాగే జరుగుతుంది. ఇంకా విస్తృత సంప్రతింపులకు కమిటీలు వేస్తారు.
పరుష వ్యాఖ్యలు ఎందుకు?
ఉత్తరాదివాళ్ళు పందుల్ని కన్నట్లుగా పిల్లల్ని కంటున్నారనీ, అక్కడ బహుభర్తృత్వం ఉంటుందనీ డీఎంకేకు చెందిన మంత్రి దురై మురుగన్ వ్యాఖ్యానించారు. ఉత్తరాదివారిని కించపరిచి తమిళనాడు డీఎంకే నేతలు ఏం సాధించాలనుకుంటున్నారు? ఉత్తరాది వారిలో దక్షిణాదిపై ఏకపక్షంగా వ్యతిరేకత పెంచే కుట్రలో భాగంగానే ఇలాంటి పనులు చేస్తున్నారు. తమిళనాడు డీఎంకే పాలన నాలుగేళ్లు నిండ కుండానే ప్రజా వ్యతిరేకత మూటగట్టుకుంది. అందుకే ఉత్తరాదిపై విషం చిమ్మి, వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో దక్షిణాది సెంటిమెంటుతో గెలవాలనుకుంటున్నారు.
హక్కుల కోసం పోరాటం చేయడం ప్రజాస్వామ్య హక్కు. కానీ ప్రాంతాల వారీగా భావోద్వేగాలు కలిగి ఉండే సమస్యల పట్ల పోరాడేటప్పుడు, విభజనవాదం చెలరేగే ప్రమాదం ఉంది. ప్రత్యేక ద్రవిడ దేశం కావాలని గతంలో కొంత మంది తమిళ నేతలు ప్రకటనలు కూడా చేశారు. ఇలాంటి విభ జనవాదుల మధ్య దేశాన్ని సమైక్యంగా ఉంచుకోవడం ఇప్పుడు అత్యంత ముఖ్యం. ప్రత్యేక దేశం అనే మాట వినిపించిందంటే, అది విభజన వాదమే! దీన్ని ఏ మాత్రం ప్రోత్సహించకుండా,దక్షిణాది తన ప్రాధాన్యాన్ని కాపాడుకునేందుకు పోరాటం చేస్తే అది మంచి ప్రజాస్వామ్య విధానం అవుతుంది.
ఎస్. విష్ణువర్ధన్ రెడ్డి
వ్యాసకర్త బీజేపీ ఏపీ ఉపాధ్యక్షుడు