
చెన్నై: తమిళనాడులో అన్నా డీఎంకే, బీజేపీల పొత్తుపై ఆ రాష్ట్ర సీఎం , డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ నిప్పులు చెరిగారు. ఇదొక ఓడిపోయే అవినీతి కూటమి అంటూ ధ్వజమెత్తారు. రాష్ట్ర స్వయంప్రతిపత్తిని తాకట్టు పెట్టి అధికారం కోసం అర్రులు చాస్టున్న కూటమి, బీజేపీ చేతిలో బందీగా మారిన బానిస పార్టీ అంటూ మండిపడ్డారు. అన్నాడీఎంకేతో బీజేపీ పొత్త పెట్టుకున్న సంగతి తెలిసిందే.
అన్నా డీఎంకేతో పొత్తు విషయాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా నిన్న(శుక్రవారం) అధికారికంగా ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో(2026 అసెంబ్లీ ఎన్నికల్లో) ప్రభుత్వ ఏర్పాటే లక్ష్యంగా ఈ కూటమి ఏర్పడినట్లు అమిత్ షా పేర్కొన్నారు.
దీనిపై స్టాలిన్ మాట్లాడుతూ.. ‘ రెండు పార్టీల సిద్ధాంతాల్లో క్లారిటీ అనేది లేదు. ఏదో పొత్తు పెట్టుకోవాలి కాబట్టి.. అన్నా డీఎంకేతో సంధి కుదుర్చుకున్నారు. నీట్ అంశాన్ని ఏఐఏడీఎంకే వ్యతిరేకించింది. ఇదే తరహాలో రాష్ట్రంలో త్రి భాషా విధానంలో హిందీ భాషను రుద్దే అంశాన్ని, వక్ప్ యాక్ట్ ను, డీలిమిటేషన్ అంశాన్ని కూడా అన్నాడీఎంకే వ్యతిరేకించింది. మరి అటువంటప్పుడు బీజేపీతో అన్నాడీఎంకే ఎలా పొత్తు పెట్టుకుంది.
ఇరు పార్టీలు పొత్తు పెట్టుకునేటప్పుడు కామన్ మినిమమ్ ప్రాగ్రామ్(సీఎంపీ) అనేది ఒకటి ఉంటుంది కదా. మరి వీటి గురించి హోంమంత్రి అమిత్ షా ఏమీ మాట్లాడలేదు. అలాగే అన్నాడీఎంకే నేతలు కూడా ఏమీ నోరు విప్పలేదు. ఏదో ప్రెస్ మీట్ పెట్టి పొత్తు కుదుర్చుకున్నారు. అదే పనిగా డీఎంకేపై, నాపై వ్యక్తిగత విమర్శలు గుప్పించారు. నీట్ ను సీబీఐ దర్యాప్తు చేస్తుంది కదా.. అటువంటప్పుడు రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు ఎందుకు చేశారు అమిత్ షా. సీబీఐ అనేది కేంద్రం చేతుల్లోనే కదా ఉండేది’ అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు స్టాలిన్.