
అభిప్రాయం
ఒక కుటుంబం నుంచి, సమాజం నుంచి, ఒక దేశం వరకు వైవిధ్యాలు అనేకం ఉంటాయి. వాటిని వైరుద్ధ్యాలుగా మారకుండా చూసుకోవటంలోనే విజ్ఞత ఉంటుంది. ఆ విధంగా చూసినపుడు, లోక్‌సభ నియోజక వర్గాల పునర్విభ జనపై తలెత్తిన వివాదం ఒక వైవిధ్య స్థితి నుంచి వైరుద్ధ్య స్థాయికి చేరుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఈ అంశంపై ఈ నెల 22న చెన్నైలో జరిగిన సమావేశం దేశానికంతా ఒక హెచ్చరిక వంటిదని చెప్పాలి.
నియోజక వర్గాల పునర్విభజనతో ముడిపడి మరొక రెండు అంశాలు కూడా ఉన్నాయన్నది గుర్తించవలసిన విషయం. ఒకటి – హిందీ భాషను హిందీయేతర రాష్ట్రాలపై బలవంతంగా రుద్దుతున్నారనే ఫిర్యాదు. ఈ విషయం చెన్నైలో చర్చకు రాలేదు. కానీ ఎప్పటినుంచో ఉన్నదే. రెండవది – దక్షిణ–ఉత్తర భారతాల మధ్య సాధారణ రూపంలోనే ఉన్నాయనే విభేదాలు. ఈ భావన నియోజక వర్గాల పునర్విభజనకు, హిందీ భాషకు పరిమితమైనది కాదు.
ఇటువంటి భావనలకు గల చరిత్ర మూడు దశలలో కనిపిస్తుంది. ఒకటి– ఉత్తరాది వారికి దక్షిణాది వారిపట్ల ఎప్పుడూ చిన్నచూపేనన్నది. రెండు – దాక్షిణాత్యుల రంగురూపులు, భాషా సంస్కృతులు, ఆహార విహారాల పట్ల స్వాతంత్య్రానికి ముందు నుంచే ఉన్నదనే ఈసడింపు దృష్టి. మూడవది–ఈ రెండింటికన్నా ప్రమాదకరమైనది, ప్రాచీనమైనది. అది ఆర్య–ద్రవిడ వాదనలు.
వివాదాలకు ఆస్కారం ఇచ్చేలా...
మరే దేశంలోనూ లేనంతటి వైవి«ధ్యాలు ఇక్కడ ఉన్నాయి. సాంస్కృతికంగా, విశ్వాసాలపరంగా ఒక ఏక రూపత, కనీసం స్థూలమైన విధంగా, అనాదిగా ఉండిన ప్పటికీ, బ్రిటిష్ వలస పాలన ముగిసినాక చరిత్రలో మొదటిసారిగా మొత్తం నాలుగు చెరగులకూ కలిపి భౌగోళికంగా, రాజకీయంగా దేశానికి ఏకరూపత సిద్ధించింది. వైవిధ్యాలను సరిహద్దులు చెరిపివేసి ఒకటి చేసే ప్రయత్నాలు 1885లో కాంగ్రెస్ వ్యవస్థాపన కాలం నుంచి మొదలై, 1947లో స్వాతంత్య్ర సాధన, 1950 నుంచి రాజ్యాంగం అమలు, 1951–52లో మొదటి సార్వత్రిక ఎన్నికలతో ఒక రూపానికి వచ్చాయి.
వైవిధ్యాలు వైరు ద్ధ్యాలుగా మారగల అవకాశాలకు ఆ విధంగా ముగింపు పలికినట్లయింది. కనీసం అందుకు ఒక బలమైన ప్రాతిప దిక సూత్రరీత్యా ఏర్పడింది. దానిని అదే ప్రకారం స్థిర పరచి మరింత పటిష్ఠం చేయవలసిన బాధ్యతను చరిత్ర పాలకులకు అప్పగించింది. అందుకు పునాదుల స్థాయిలో భంగపాట్లు జరిగాయని అనలేముగానీ, వేర్వేరు సాయుల్లో జరుగుతూ వస్తున్న దాని పర్యవసానమే ప్రస్తుత వివాదాలు.
ఇటువంటి వివాదాలకు కేంద్ర ప్రభుత్వం ఆస్కార మివ్వనట్లయితే చెన్నై సమావేశపు అవసరమే ఉండేది కాదు. ఆ సమావేశం దరిమిలా కేంద్ర హోంమంత్రి
అమిత్ షా ఏమీ స్పందించలేదుగానీ, దక్షిణాదికి చెందిన ముగ్గురు బీజేపీ మంత్రులు మాట్లాడుతూ, విభజనకు సంబంధించి ఇంకా నిర్ణయం జరగలేదు, విధివిధానాలు రూపొందలేదు, ప్రకటనేమీ వెలువడలేదు, అటువంటపుడు ఈ సమావేశాలు, విమర్శలు ఎందుకని ప్రశ్నించారు.
విధివిధానాల రూపకల్పన, ప్రకటన జరగక పోవచ్చు. కానీ నష్టపోతా మనుకునే రాష్ట్రాలకు స్థూలమైన అభిప్రాయాలు కలగకుండా ఎట్లా ఉంటాయి? వారు ఆ విషయమై మాట్లాడకుండా ఎట్లా ఉంటారు?
ఇటువంటి విషయాలలో చర్చలు ఒక ప్రజాస్వామిక రాజకీయ వ్యవస్థలో ముందునుంచే జరుగుతాయి తప్ప, అంతా ముగిసిపోయే వరకు ఆగవు. విషయం వివాదాస్పదమవుతున్న సూచనలు కనిపించినప్పుడు చర్చలు మరింత అవసరం. కానీ అమిత్ షా అదేమీ చేయకుండా, దక్షిణాదికి ఎటువంటి నష్టం ఉండ దనీ, అక్కడి స్థానాలు ఇప్పటికన్నా పెరుగుతాయనటం మొదలుపెట్టారు. ఇందులో ఒక చాతుర్యం ఉంది.
ఉత్తరాది, దక్షిణాది రాష్ట్రాలు రెండింటికీ స్థానాలు ఇప్పటికన్న పెరిగినా, దక్షిణాదికన్న ఉత్తరాదికి పెరిగేవి చాలా ఎక్కువని, ఆ విధంగా రెండు ప్రాంతాల మధ్య గల ప్రస్తుత వ్యత్యాసం బాగా ఎక్కువవుతుందని అంచనా. అమిత్‌షా ఈ కోణాన్ని దాచిపెడుతున్నారు. అట్లాగాక ఏ వ్యత్యాసమూ, నష్టమూ ఉండదనుకుంటే ఆయన ఆ మాటను దక్షిణ రాష్ట్రాలను సమావేశపరచి వివరించాలి.
సమావేశం అవసరం!
చెన్నైలో జరిగిన సంయుక్త కార్యాచరణ కమిటీ సమావేశానికి పార్టీ తేడాలు లేకుండా పలువురు హాజరయారంటేనే, విభజన ప్రతిపాదనలు ఎటువంటి అనుమానాలను కలిగిస్తున్నాయో అర్థమవుతుంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ పాల్గొనటం. ఎందుకంటే, దేశమంతటాగల ఆ పార్టీ ఇటువంటి వైఖరి తీసుకుంటే వారికి ఉత్తరాదిన వ్యతిరేకత రాగలదనీ, ఆ భయంతో వారు హాజరు కాకపోవచ్చుననీ బీజేపీ అంచనా వేసింది. కానీ విభజనకు వ్యతిరేకంగా పార్టీ అధ్యక్షుడు ఖర్గే ముందుగానే మాట్లాడారు.
ఇందులో రెండవవైపున చూస్తే, విభజనకు అనుకూలించటం వల్ల బీజేపీ దక్షిణాదిన నష్టపోగలదనే అభిప్రాయం ఉన్నా, ఆ పార్టీ అదే వైఖరికి కట్టుబడి ఉంటున్నది. దీనిని బట్టి ఇరువురూ, ఆయా ప్రాంతాలలో ప్రజాభిప్రాయాలు ఎట్లున్నా తమ వైఖరులను మార్చుకోదలచలేదని అర్థమవుతున్నది. దాని పర్యవసానాలు ఏమిటన్నది తర్వాతి విషయం. అది సూత్రబద్ధమైన వైఖరి అనుకుంటే మాత్రం ఆ మేరకు వారిని మెచ్చుకోవాలి.
ఈ వైవిధ్యాలన్నీ వైరుద్ధ్యాలుగా మారి తీవ్ర స్థాయికి వెళ్ళకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం వెంటనే అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, పార్టీలను సమావేశపరచాలి. ఈ విషయమై తమ అభిప్రాయాన్ని ఒక తీర్మానంగా ఆమోదించిన చెన్నై సమావేశం, ఆ తీర్మాన ప్రతిని ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల కాలంలోనే ప్రధాని మోదీకి అందజేయగలమని ప్రకటించింది.
ఆయన ఆ సందర్భాన్ని అవకాశంగా తీసుకుని ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయటం మంచిదవుతుంది. చెన్నైలో తీర్మానించినట్లు విభజనను 25 సంవత్సరాల వరకు గాక, దక్షిణాదికి ఆమోదయోగ్యమయే ప్రత్యామ్నాయాన్ని కనుగొనే వరకు నిరవధికంగా వాయిదా వేయటం మంచిది.
టంకశాల అశోక్
వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు