hindi language
-
హిందీ మాట్లాడేవాళ్లు... టాయిలెట్లు కడుగుతున్నారు
చెన్నై/పట్న: తమిళనాడుకు చెందిన అధికార డీఎంకే ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి దయానిధి మారన్ కొన్ని నెలల క్రితం చేసిన వ్యాఖ్యలపై ప్రస్తుతం రగడ మొదలైంది. తమిళనాడులో బీజేపీ, డీఎంకే మధ్య మాటల యుద్ధం సాగుతోంది. హిందీ రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్, బిహార్ కారి్మకులు తమిళనాడులో మరుగుదొడ్లు కడుగుతున్నారంటూ మారన్ ఈ ఏడాది మార్చి నెలలో ఓ కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. మారన్ వైఖరిని బీజేపీ నేతలు తప్పుపడుతున్నారు. బిహార్ ఉపముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ సైతం స్పందించారు. మార్చి జరిగిన కార్యక్రమంలో దయానిధి మారన్ మాట్లాడుతూ... తమిళ భాషతోపాటు ఆంగ్ల భాషను తమ పార్టీ ప్రోత్సహిస్తోందని, తమిళనాడు ప్రజలు ఆయా భాషలను చక్కగా నేర్చుకుంటున్నారని చెప్పారు. తమిళనాడుకు చెందిన సుందర్ పిచాయ్ ఇప్పుడు గూగుల్ కంపెనీకి సీఈఓగా ఎదిగాడని గుర్తుచేశారు. ఒకవేళ సుందర్ పిచాయ్ హిందీ నేర్చుకొని ఉంటే నిర్మాణ రంగంలో సాధారణ కారి్మకుడిగా పని చేసుకుంటూ ఉండేవాడని అన్నారు. తమిళనాడు విద్యార్థులు ఇంగ్లిష్ నేర్చుకొని ఐటీ కంపెనీల్లో పెద్ద హోదాల్లో ఉద్యోగాలు సంపాదిస్తున్నారని, మెరుగైన వేతనాలు పొందుతున్నారని తెలిపారు. హిందీ మాత్రమే నేర్చుకుంటున్న ఉత్తరప్రదేశ్, బిహార్ వాసులు తమిళనాడుకు వలస వచ్చి నిర్మాణ రంగంలో పని చేస్తున్నారని, రోడ్లు ఊడుస్తున్నారని, టాయిలెట్లు కడుగుతున్నారని చెప్పారు. హిందీ మాత్రమే నేర్చుకుంటే పరిస్థితి ఇలాగే ఉంటుందని అన్నారు. మారన్ మాట్లాడిన వీడియో క్లిప్ సామాజికమాధ్యమాల్లో వైరల్‌గా మారింది. డీఎంకే రంగు బయటపడింది: బీజేపీ హిందీ రాష్ట్రాల ప్రజల గురించి ప్రస్తావిస్తూ మారన్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందీ మాట్లాడేవారిని, ఉత్తర భారతీయులను అవమానించడం డీఎంకే నేతలకు అలవాటుగా మారిందని బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా ‘ఎక్స్’లో విమర్శించారు. ఆ పార్టీ నుంచి ఒకరి తర్వాత ఒకరు రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. డీఎంకే నాయకులు సనాతన ధర్మంపై దాడి చేశారని చెప్పారు. ఇంత జరుగుతున్నా విపక్ష ‘ఇండియా’ కూటమి నేతలు నోరువిప్పడం లేదని ఆక్షేపించారు. ఇతరులను కించపర్చడం తగదని డీఎంకే నేతలకు హితవు పలికారు. మారన్ వ్యాఖ్యలు కొన్ని నెలల క్రితం నాటివే అయినప్పటికీ డీఎంకే అసలు రంగు మళ్లీ బయటపడిందని తమిళనాడు బీజేపీ ఉపాధ్యక్షుడు నారాయణన్ తిరుపతి పేర్కొన్నారు. ఉత్తర భారతీయులను అవమానించేలా, దూషించేలా డీఎంకే పెద్దలు తరచుగా మాట్లాడుతున్నారని ఆక్షేపించారు. భవిష్యత్తులోనూ వారు వైఖరి మార్చుకుంటారన్న నమ్మకం తనకు లేదన్నారు. అన్ని రాష్ట్రాలూ సమానమే: డీఎంకే బీజేపీ నేతలు ఉద్దేశపూర్వకంగా తప్పుడు వీడియోను వ్యాప్తిలోకి తీసుకొస్తున్నారని డీఎంకే అధికార ప్రతినిధి జె.కాన్స్టాండైన్ రవీంద్రన్ ఆరోపించారు. సమతావాద సమాజానికి తమ పార్టీ కట్టుబడి ఉందని చెప్పారు. ఒక రాష్ట్రం ఎక్కువ, మరో రాష్ట్రం తక్కువ అనేది తమ విధానం కాదని, అన్ని రాష్ట్రాలూ సమానమేనని అన్నారు. మారన్ ఏనాడూ చెప్పని మాటలను చెప్పినట్లుగా బీజేపీ నాయకులు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ‘‘మాతృ భాషతోపాటు ఆంగ్లమూ నేర్చుకుంటే మంచి అవకాశాలు లభిస్తాయన్నది మారన్ ఉద్దేశం. ఇంగ్లిష్ నేర్చుకున్నవారికి ఇండియాలోనే గాక ప్రపంచమంతటా డిమాండ్ ఉంది. మారన్ చెప్పిందీ అదే’’ అన్నారు. పరస్పరం గౌరవించుకోవాలి: తేజస్వి దయానిధి మారన్ వ్యాఖ్యలను బిహార్ ఉప ముఖ్యమంత్రి, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ ఆదివారం ఖండించారు. తమ పార్టీ తరహాలోనే డీఎంకే కూడా సామాజిక న్యాయాన్ని నమ్ముతుందని చెప్పారు. అలాంటి పార్టీ నేత ఇతర రాష్ట్రాల వారిని అవమానించేలా మాట్లాడడం శోచనీయమని అన్నారు. కుల అసమానతలు, కొన్ని కులాల వారే ప్రమాదకరమైన పనులు చేయడం గురించి ప్రస్తావించి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. కానీ, ఉత్తరప్రదేశ్, బిహార్ ప్రజలందరినీ ఇందులోకి లాగడం సమంజసం కాదని చెప్పారు. ఇతర రాష్ట్రాల ప్రజలను గౌరవించాలని సూచించారు. పరస్పరం గౌరవించుకోవడం సముచితమని తేజస్వి యాదవ్ పేర్కొన్నారు. తాము ఇతరులను గౌరవిస్తామని, వారి నుంచి గౌరవాన్ని కోరుకుంటున్నామని ఉద్ఘాటించారు. -
India with Jessica: ఎక్కడో పుట్టి... ఎక్కడో పెరిగి
మన దేశంలో పుట్టిన చాలామందికి హిందీ మాట్లాడటం రాదు. కొంతమందికి అర్థమైనప్పటికీ మాట్లాడలేరు. అమెరికా నుంచి వచ్చిన జెస్సికా మాత్రం హిందీలో అనర్గళంగా మాట్లాడేస్తుంది. ఇలా పలకాలి అని హిందీ పాఠాలు కూడా చెబుతోంది. మనదేశానికి వచ్చే విదేశీయులకు హిందీతోపాటు సంస్కృతీ సంప్రదాయాలను పరిచయం చేస్తూ నెటిజనుల మన్ననలను అందుకుంటోంది ఈ ‘బిహారీ బహూ’. పదిహేడేళ్లుగా ఇండియాతో చక్కని బంధాన్ని కొనసాగిస్తోన్న జెస్సికా గురించి ఆమె మాటల్లోనే... ‘‘నేను చికాగోలో పుట్టాను. అమ్మానాన్న ఇరు కుటుంబాలకు చెందిన తాత, బామ్మలతో కలిసి ఉండే ఉమ్మడి కుటుంబం మాది. అక్కాచెల్లెళ్లు, అన్నదమ్ములతో కలిసి స్కూలుకు వెళ్లి చదువుకునేదాన్ని. ఆదివారం వచ్చిందంటే... కుటుంబమంతా కలిసి గడుపుతాం. నాన్న అంతర్జాతీయ వ్యాపారి కావడంతో తరచూ చైనా, కొరియాలు వెళ్తుండేవారు. ఆయన్ని చూసి నేను కూడా అలా తిరగాలని అనుకునేదాన్ని. కాలేజీ చదువుకోసం 18 ఏళ్ల వయసులో చికాగో నుంచి వేరే రాష్ట్రానికి వెళ్లాను. నాలుగేళ్లపాటు హాస్టల్లో ఉన్నాను. ‘చైనా, ఇండియాలలో ఆర్థికమాంద్యం వస్తుంది’ అని కాలేజీలో ఎక్కువమంది విద్యార్థులు మాట్లాడుకునేవారు. అది విన్న నాకు ఇండియా వెళ్లి అక్కడి పరిస్థితులు చూడాలనిపించేది. ఏడాదిలో తిరిగి వచ్చేస్తాను అనుకున్నా.. కాలేజీ చదువు పూర్తయిన తరువాత తెలిసిన వాళ్ల ఐటీ కంపెనీ హరిద్వార్‌లో ఉంటే.. అక్కడ ఇంటర్న్‌షిప్ చేయడానికి ఇండియా వచ్చాను. ఇంటర్న్‌షిప్‌తోపాటు భారతీయులు, వారి భాషల గురించి తెలుసుకోవచ్చని అనుకున్నాను. అనుకున్నట్టుగానే ఇరుగు పొరుగు నుంచి కూరగాయలు విక్రయించేవాళ్ల వరకు అందరితో పరిచయం ఏర్పడింది. అందరూ చక్కగా కలిసి పోయేవారు. ఏడాదిలో ఇంటర్న్‌షిప్ పూర్తయిన తరువాత అదే కంపెనీలో ఉద్యోగంలో చేరాను. అలా ఏడాదిలో తిరిగి వెళ్లకుండా ఇక్కడే ఉండిపోయాను. కొంతమంది స్నేహితుల ద్వారా అభిషేక్ పరిచయం అయ్యాడు. నేను ఇక్కడ ఉంటే.. అభిషేక్ అమెరికాలో చదువుకుంటున్నాడు. ఇద్దరం మంచి స్నేహితులుగా మారాం. నేను మా ఇంటికి వెళ్లినప్పుడల్లా అభిషేక్‌ను కలిసేదాన్ని. అలా మా ఇద్దరి స్నేహం ప్రేమగా మారి పెళ్లి వరకు వచ్చి బిహార్ కోడలిని అయ్యాను. అత్తమామల అనురాగం చూసి... హరిద్వార్‌లో ఉండే రోజుల్లో ఇక్కడి అత్తమామలు కుటుంబ పెద్దలుగా కోడళ్లు, మనవళ్లను చూసే విధానం నాకు బాగా నచ్చింది. అభిషేక్‌ను పెళ్లిచేసుకోవడానికి అది కూడా ఒక కారణం. మేము పెళ్లి చేసుకుంటామని మా నాన్నని అడిగాం. ‘చదువుకున్నాడు, సంపాదిస్తున్నాడు. నిన్ను బాగా చూసుకుంటాడు కాబట్టి పెళ్లిచేసుకో’ అని నాన్న చెప్పారు. అభిషేక్ కుటుంబ సభ్యుల్లో సగం మంది అమెరికాలో నివసిస్తుండడంతో వారి గురించి బాగా అర్థం చేసుకోవడం కూడా నాన్న ఒప్పుకోవడానికి ఒక కారణం. అభిషేక్ తల్లిదండ్రులు విదేశీ అమ్మాయిని కోడలుగా ఒప్పుకోవడానికి మొదట్లో భయపడ్డారు. ఎలాంటి అమ్మాయో అని సందేహించినప్పటికీ మా కుటుంబం గురించి తెలుసుకుని పెళ్లికి సమ్మతించడంతో 2010లో మా వివాహం జరిగింది. జీవితాంతం ఆధారపడాల్సిందే... పెళ్లి అయిన తరువాత అమెరికాలో కొన్నిరోజులు, ఇండియాలో కొన్ని రోజులు ఉండేవాళ్లం. ఆరేళ్ల తరువాత బిహార్‌కి వచ్చి స్థిరపడ్డాం. మాకు ఇద్దరు పిల్లలు బాబు, పాప. ప్రపంచంలో కూతురికంటే కొడుకులనే మరింత ప్రేమగా చూసుకుంటారు. ఇండియాలో ఇది కాసింత ఎక్కువే. అమ్మాయిలకు ఇంట్లో పనులన్నీ చక్కబెట్టేలా అన్నీ నేర్పిస్తారు. అబ్బాయిలకు మాత్రం ఏమీ నేర్పించరు. కొంతమంది తల్లులు అయితే ‘మా అబ్బాయికి కప్పు టీ పెట్టడం కూడా రాదు’ అని గర్వంగా చెబుతుంటారు. ఇలా అయితే వాళ్లు స్వయంసమృద్ధిని సాధించలేరు. జీవితాంతం ఇతరుల మీద ఆధారపడి జీవించాల్సిందే. అందుకే నేను నా పిల్లలకు లింగభేదం లేకుండా అన్నీ నేర్పిస్తున్నాను. నేర్చుకుని నేర్పిస్తున్నా... హరిద్వార్‌లో ఉన్నప్పుడే హిందీ నేర్చుకున్నాను. కోర్సు కూడా చేశాను. బిహార్‌కి వచ్చిన తరువాత నా హిందీ బాగా మెరుగుపడింది. బిహారీలు మాట్లాడే హిందీ సరిగాలేదని, వారి మాటలు విని నవ్వుతుంటారు చాలామంది. కానీ ఇక్కడ మాట్లాడే హిందీలో సంస్కృతం, భోజ్‌పూరి, మైథిలి, ఆంగిక వంటి భాషలు కూడా కలుస్తాయి. అందుకే బిహారీలు మాట్లాడే హిందీ కొంచెం విభిన్నంగా ఉంటుంది. బిహారీలు మాట్లాడే హిందీపై చాలామందికి ఉండే చిన్నచూపు, వివక్ష పోవాలని నా వీడియోల్లో.. బిహారీ స్టైల్ హిందీనే మాట్లాడుతున్నాను. ఇండియా విత్ జెస్సికా ఇక్కడ ఉండే భారతీయులకు, విదేశాల్లో ఉండే ఇండియన్స్‌కు హిందీ నేర్పిస్తున్నాను. అమెరికా, కెనడాలలో స్థిరపడిన ఎంతోమంది భారతీయుల పిల్లలకు హిందీలో మాట్లాడడం తెలీదు. ఇది వాళ్లకు పెద్ద సమస్య. అందుకే నేను హిందీ నేర్పిస్తున్నాను. నాలుగున్నరేళ్ల క్రితం ‘ఇండియా విత్ జెస్సికా’ పేరిట యూట్యూబ్ ఛానల్, ఇన్స్టాగ్రామ్ అకౌంట్ తెరిచాను. వీటిద్వారా భారతీయ సంస్కృతీ సంప్రదాయాలను పరిచయం చేస్తున్నాను. కొన్నిసార్లు వివిధ రకాల అంశాలపై మాట్లాడడానికి అతిథిగా కూడా వెళ్తున్నాను. అమెరికా అమ్మాయి ఇండియా గురించి మాట్లాడడం, అందులో హిందీలో అనర్గళంగా మాట్లాడుతుంది అని తెలిసిన వాళ్లంతా ఆశ్చర్యంగా నా క్లాసులు వినడానికి ఆసక్తి చూపిస్తున్నారు. కొంతమంది డబ్బుల కోసం లిప్‌సింక్ వీడియోలు పోస్టు చేస్తుంటారు. నేను అవేమీ చేయడం లేదు. కేవలం తెలియని సమాచారం ఇవ్వడమే నా లక్ష్యం. అందుకే ఫాలోవర్స్ గురించి కూడా పట్టించుకోను. కొంతమంది మెసేజులకు జవాబులు చెప్పడం లేదని తిడుతుంటారు. నన్ను సెలెబ్రిటీలా చూస్తున్నారు. కానీ నేను సెలబ్రిటీని కాదు. ఇద్దరు పిల్లలకు తల్లిని, వాళ్లకు నేర్పించాలి. వంట చేయాలి, ఇంటిని చూసుకోవాలి. నాకంటూ వ్యక్తిగత జీవితం ఉంది. నేను అందరిలానే సామాన్యమైన వ్యక్తిని’’ అని ఎంతో నిరాడంబరంగా చెబుతోంది జెస్సికా. -
హిందీపై అమిత్ షా సందేశం హాస్యాస్పదం
చెన్నై: హిందీ భాష దేశంలోని ఇతర భాషల వైవిధ్యాన్ని ఏకం చేస్తోందని, అన్ని భాషలను, యాసలను గౌరవిస్తోందని ‘హిందీ దివస్’ సందర్భంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఇచి్చన సందేశాన్ని తమిళనాడు మంత్రి, డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ గురువారం తప్పుపట్టారు. హిందీని బలవంతంగా రుద్దే ప్రయత్నం చేయొద్దని సూచించారు. అమిత్ షా సందేశం హాస్యాస్పదంగా ఉందని విమర్శించారు. కేవలం నాలుగైదు రాష్ట్రాల్లో మాట్లాడే భాష దేశాన్ని ఎలా ఏకం చేస్తుందని ఉదయనిధి స్టాలిన్ ప్రశ్నించారు. ఈ మేరకు ‘ఎక్స్’లో పోస్టు చేశారు. -
థాయ్ విద్యార్థినిపై అత్యాచార యత్నం.. హిందీ నేర్పిస్తానని ఇంటికి..
గచ్చిబౌలి (హైదరాబాద్): హిందీ భాష నేర్చుకునేందుకు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ)కి వచ్చిన థాయ్‌లాండ్ విద్యార్థినిపై ఒక ప్రొఫెసర్ అత్యాచార యత్నం చేశాడు. హిందీపాఠాలు నేర్పి స్తానంటూ తన ఇంటికి తీసుకెళ్లి.. కూల్‌డ్రింక్‌లో మద్యం కలిపి ఇచ్చి లైంగికదాడికి ప్రయత్నించాడు. వర్సిటీలో బాధితురాలితోపాటు చదివే విద్యార్థుల ద్వారా విషయం తెలుసుకున్న ప్రొఫెసర్లు గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఇదే సమయంలో ప్రొఫెసర్ తీరుపై ఆందోళన వ్యక్తం చేస్తూ విద్యార్థి సంఘాలు ధర్నాకు దిగాయి. వర్సిటీ అధికారులు సదరు ప్రొఫెసర్‌ను సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించడంతో ధర్నా విరమించారు. ఈ కేసు వివరాలను మాదాపూర్ ఏసీపీ రఘునందన్‌రావు వెల్లడించారు. హిందీ నేర్పిస్తానంటూ.. థాయ్‌లాండ్‌కు చెందిన విద్యార్థిని (24) హెచ్‌సీయూలో ఎంఏ హిందీ చదువుతోంది. 25రోజులుగా హెచ్‌సీయూలోని ఇంటర్నేషనల్ స్టడీస్ హస్టల్లో ఉంటోంది. వర్సిటీ హిందీ విభాగం ప్రొఫెసర్ రవి రంజన్ ఆమెపై కన్నువేశాడు. హిందీ నేర్పిస్తానని, తన నివాసానికి రావాలని కోరాడు. శుక్రవారం క్లాసులు ముగిశాక సాయంత్రం 4 గంటల సమయంలో తన కారులో ఎక్కించుకుని మసీదుబండ ప్రాంతంలోని తన ఫ్లాట్‌కు తీసుకువెళ్లాడు. పాఠాలు చెప్తూ కూల్‌డ్రింక్‌లో మద్యం కలిపి థాయ్‌లాండ్ విద్యార్థినికి ఇచ్చాడు. తర్వాత ఆమెపై అత్యాచారానికి ప్రయత్నించాడు. తీవ్రంగా ప్రతిఘటించిన ఆమె.. వెంటనే థాయ్‌లాండ్‌లోని ప్రొఫెసర్‌కు ఫోన్ చేసి రవి రంజన్ అసభ్యంగా ప్రవర్తిస్తున్న విషయం చెప్పింది. థాయ్‌లాండ్ ప్రొఫెసర్ వెంటనే రవి రంజన్‌కు ఫోన్ చేసి విద్యార్థినిని వదిలేయాలని తీవ్రంగా మందలించాడు. దీనితో భయపడిన రవి రంజన్.. రాత్రి 9 గంటల సమయంలో విద్యార్థినిని వర్సిటీ హస్టల్ సమీపంలో వదిలివెళ్లిపోయాడు. బాధిత విద్యార్థిని ఈ విషయాన్ని తోటి విద్యార్థులకు చెప్పడంతో వెంటనే వర్సిటీ క్యాంపస్‌లోని హెల్త్ సెంటర్లో చేర్పించారు. విషయం తెలుసుకున్న అసొసియేట్ ప్రొఫెసర్ అలోక్ మరో ఇద్దరు హెల్త్ సెంటర్ వద్దకు వచ్చారు. అయితే థాయ్ విద్యార్థినికి హిందీ, ఇంగ్లిష్ రాకపోవడంతో ఏం జరిగిందో సరిగా చెప్పలేకపోయింది. దీనితో వారు థాయ్ ప్రొఫెసర్ సాయంతో ఆమెపై అత్యాచార యత్నం జరిగినట్టు తెలుసుకున్నారు. దీనిపై శనివారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఐపీసీ 354, 354ఏ సెక్షన్ల కింద ప్రొఫెసర్ రవి రంజన్‌పై కేసు నమోదు చేసి, అదుపులోకి తీసుకున్నారు. థాయ్ విద్యార్థిని స్టేట్మెంట్ రికార్డ్ చేశామని, షాక్‌లో ఉన్న ఆమె తేరుకున్నాక మరోసారి స్టేట్మెంట్ రికార్డ్ చేస్తామని.. అవసరమైతే సెక్షన్లు మార్చుతామని మాదాపూర్ ఏసీపీ రఘునందన్‌రావు తెలిపారు. అట్టుడికిన క్యాంపస్ ప్రొఫెసర్ రవిరంజన్ ఘాతుకం తెలిసిన హెచ్‌సీయూ విద్యార్థి సంఘాలు భగ్గుమన్నాయి. వర్సిటీ ప్రధాన ద్వారం లోపల స్టూడెంట్ యూనియన్, ఏబీవీపీ ధర్నాకు దిగాయి. ప్రొఫెసర్, యూనివర్సిటీ మేనేజ్మెంట్ తీరును నిరసిస్తూ ఆందోళన చేశాయి. హెచ్‌సీయూ రిజిస్ట్రార్ దేవేశ్ నిగమ్, వీసీ సర్రాజు, ఇతర అధికారులు విద్యార్థులతో చర్చలు జరిపారు. ప్రొఫెసర్ రవి రంజన్‌ను సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ ఘటనపై వర్సిటీ స్వయంగా ఫిర్యాదు చేస్తుందని హమీ ఇచ్చారు. దీనితో విద్యార్థి సంఘాలు ధర్నా విరమించాయి. మహిళా సాధికారత ఉపన్యాసంతో! థాయ్ విద్యార్థినిపై అత్యాచార యత్నానికి పాల్పడిన ప్రొఫెసర్ రవి రంజన్ ఇటీవల మహిళా సాధికారతపై ఉపన్యాసం ఇచ్చినట్టు విద్యార్థులు చెప్తున్నారు. ఆయన మాట్లాడిన మాటలకు, చేతలకు ఎక్కడా పొంతన లేదంటూ మండిపడ్డారు. పోలాండ్‌లో ప్రొఫెసర్‌గా పనిచేసిన రవి రంజన్.. 2018లో హెచ్‌సీయూలో చేరినట్టు చెప్తున్నారు. బాధితురాలికి న్యాయం జరిగేదాకా పోరాటం హెచ్సీయూకు ఇప్పటివరకు మంచిపేరు ఉంది. కానీ ప్రొఫెసర్ రవి రంజన్ చర్య సమాజాన్ని సిగ్గుపడేలా చేసింది. థాయ్ విద్యార్థినిపై జరిగిన అత్యాచార యత్నాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. బాధిత విద్యార్థినికి న్యాయం చేయాలి. అప్పటిదాకా పోరాడుతాం. – అభిషేక్ నందన్, హెచ్‌సీయూ స్టూడెంట్స్ యూనియన్ అధ్యక్షుడు రవి రంజన్‌పై కఠిన చర్యలు చేపట్టాలి ప్రొఫెసర్లను తండ్రులుగా, అన్నలుగా భావిస్తారు. అలాంటి వారు కంచే చేను మేసినట్టుగా అత్యాచార యత్నం చేయడం సిగ్గుచేటు. ప్రొఫెసర్ రవి రంజన్‌పై కఠిన చర్యలు తీసుకోవాలి. వర్సిటీలోని వేధింపుల సెల్లో మూడు ఫిర్యాదులు పెండింగ్‌లో ఉన్నాయి. వాటిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి. దేశవ్యాప్తంగా యూనివర్సిటీల్లో ఇలాంటి వేధింపుల కేసులెన్నో పెండింగ్‌లో ఉన్నాయి. వాటిపై చర్యలు తీసుకోవాలి. – మహేశ్ నమాని, ఏబీవీపీ నేషనల్ కన్వీనర్ -
స్థానిక భాషల్లో వైద్య విద్యా?
భారతదేశంలో సుమారు 600 వైద్య కళాశాలలు ఉన్నాయి. విద్యార్థులకు తమ రాష్ట్రం వెలుపలి కాలేజీల్లో అడ్మిషన్లను పొందే స్వేచ్ఛ ఉంది. ఇంగ్లిష్ ఉపయోగాన్ని త్యజించడం వల్ల అలాంటి అవకాశం వీరికి కష్టమవుతుంది. హిందీ మీడియం విద్యార్థి ఇకపై కర్ణాటక లేక మహారాష్ట్రలో చదవటం కష్టమైపోతుంది. అక్కడ బోధనా మాధ్యమం ఇంగ్లిష్ లేదా స్థానిక భాషలో ఉంటుంది. ఇలాంటి విద్యార్థులు విదేశీ డిగ్రీ చదవడం ఇంకా కష్టసాధ్యమైన విషయం. హిందీ వైద్య పాఠ్యపుస్తకాలను ప్రారంభించడాన్ని మన విద్యా రంగంలో పునరుజ్జీవనం, పునర్నిర్మాణంగా కేంద్ర పాలకులు కొనియాడుతున్నారు. కానీ నిజమైన పునరుజ్జీవనం భారతీయ భాషల్లో కొత్తదైన మూల జ్ఞానాన్ని సృష్టించడంతోనే సాధ్యపడుతుంది. ఇంగ్లిష్ నుంచి హిందీలోకి అనువదించిన మూడు సెట్ల వైద్య పాఠ్య పుస్తకాలను గత వారాంతంలో భోపాల్‌లో అట్టహాసంగా విడుదల చేశారు. మధ్య ప్రదేశ్‌లో ఎంబీబీఎస్ కోర్సు కోసం హిందీని బోధనా మాధ్యమంగా ప్రవేశపెట్టడానికి చేసిన ప్రయత్నంలో ఈ పాఠ్యపుస్తకాలు భాగం. నూతన విద్యావిధానం అమలుచేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రక టించిన ఆదేశాన్ని మధ్యప్రదేశ్ ప్రభుత్వం పాటిస్తోంది. ఇతర అంశా లతోపాటు, భారతీయ భాషల్లో సాంకేతిక, వైద్య కోర్సుల బోధనను నూతన విద్యావిధానం నొక్కి చెబుతోంది. వృత్తివిద్యా కోర్సుల కోసం జాయింట్ ఎంట్రెన్స్ పరీక్షలు వంటి అన్ని ప్రధానమైన పోటీ పరీక్షలను ఇప్పటికే ఇంగ్లిష్తో పాటు 12 భారతీయ భాషల్లో నిర్వ హిస్తున్నారు. యూనివర్సిటీలలో గ్రాడ్యుయేషన్ కోర్సులలో ప్రవేశం కోసం ఇటీవలే ప్రారంభించిన కామన్ యూనివర్సిటీ ఎంట్రెన్స్ పరీక్షలో కూడా ఈ విధానాన్నే అమలు పరుస్తున్నారు. ఉన్నత విద్య స్థాయిలో భారతీయ భాషల్లో బోధన పూర్తిగా కొత్త విషయం కాదు. దేశవ్యాప్తంగా విద్యా సంస్థలు వివిధ భారతీయ భాషల్లో పీహెచ్డీ స్థాయి వరకు కోర్సులను ప్రతిపాదిస్తున్నాయి. ఆయుర్వేదిక్ వైద్య కోర్సులను హిందీ, ఇతర భారతీయ భాషల్లో బోధిస్తున్నారు. కొన్ని సంవత్సరాల క్రితం, తమిళనాడు ప్రభుత్వం తమిళంలో వైద్య విద్యా బోధన చేయాలనే ప్రతిపాదనను ముందుకు తెచ్చింది. గతంలో ఉస్మానియా యూనివర్సిటీలో 1918 నుంచి 1948 వరకు ఉర్దూలో మెడిసిన్, ఇంజినీరింగ్ కోర్సులను బోధించారు. భోపాల్‌లో పాఠ్య పుస్తకాలను విడుదల చేసిన సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పినట్లుగా హిందీలో ఎంబీబీఎస్ కోర్సుల వెనుక లాజిక్ ఏమిటంటే– ఇంగ్లిషులో కంటే మాతృభాషలో విద్యా బోధన చేస్తే ఆలోచించడం, మననం చేయడం, హేతుపూర్వకంగా ఆలోచించడం, నిర్ణయాలు తీసుకోవడం వంటి అభిజ్ఞా నైపుణ్యాలు నేర్చుకోవడంలో పిల్లలు మెరుగ్గా ఉంటారన్నదే. మాతృభాషల్లో విద్యాబోధన వల్ల ప్రయోజనాలు ఉన్నప్పటికీ, ఈ మార్పును మరీ తొందరగా మొదలెట్టినట్లు కనిపిస్తోంది. సాంకే తిక, శాస్త్రీయ అంశాలకు సంబంధించిన పాఠ్యపుస్తకాలను అనువదిం చడంలో అతిపెద్ద సమస్య ఏమిటంటే, శాస్త్రీయ పదజాలాన్ని ఉపయో గించడమే. ఇంగ్లిష్‌లోని మూల పదజాలాన్ని అలాగే ఉంచాలా, భార తీయ భాషల్లోకి అనువదించవచ్చా? భోపాల్‌లో విడుదల చేసిన మూడు మెడికల్ పుస్తకాల (అనాటమీ, బయోకెమిస్ట్రీ, ఫిజియాలజీ) టైటిల్సు చూసినట్లయితే, ఇంగ్లిష్‌లో సుపరిచితమైన పదాలను యథా తథంగా తీసుకున్నట్లు కనిపిస్తోంది. అంటే వివరణాత్మక విషయాన్ని హిందీలో అందుబాటులో ఉంచుతారు. అది సంస్కృతీకరించిన హిందీలా కాకుండా, వాడుక భాషలోనే ఉంటుందని ఆశిద్దాము. ఏవిధంగా చూసినా సరే, వైద్య పుస్తకాలను అనువదించటం కష్టమైన ప్రయత్నం. ఎందుకంటే ఈ వైద్యవిద్యా పట్టభద్రులు మానవుల ప్రాణాలతో వ్యవహరిస్తారు. పైగా పాఠ్యపుస్తకాలు అనేవి వైద్య కోర్సులో ఒక భాగం మాత్రమే. పాఠ్యపుస్తకాలతోపాటు, వంద లాది రిఫరెన్స్ పుస్తకాలు, మాన్యువల్స్ కూడా వీరు తిరగేస్తారు. ఇవి చాలావరకు ఇంగ్లిష్‌లోనే ఉంటాయి. ఒక డాక్టర్ శిక్షణ, బాధ్యతల నిర్వహణలో ఇవి చాలా ముఖ్యమైనవి. హిందీ, ఇతర భారతీయ భాషల్లో శిక్షణ పొందిన వైద్యులకు తదుపరి చదువులు, కెరీర్ అవకా శాలు సవాలుగా నిలుస్తాయి. ఎందుకంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్టడీస్, సూపర్ స్పెషలైజేషన్, మెడికల్ రీసెర్చ్ వంటివి ఇంగ్లిష్‌లోనే కొనసాగుతాయి. వైద్య బోధనను భారతీయ భాషల్లోనే చేయాలని ఆతృత ప్రదర్శిస్తున్నవారు వీటిని కూడా అనువదించి ఇస్తారా, ఇది ఎలా సాధ్యపడుతుంది అనేది స్పష్టం కావడం లేదు. పాఠ్యపుస్తకాలు, ‘కోర్స్‌వేర్’తో పాటు శిక్షణ పొందిన టీచర్లు, పరీక్ష యంత్రాంగం, బహు భాషా రీసెర్చ్ జర్నల్స్ వగైరాలు కూడా అవసరమే. జాతీయ వైద్య కమిషన్ లేక రాష్ట్ర వైద్య విద్యా విభాగాలు దీనికి సంబంధించి ఏదైనా బ్లూప్రింట్‌ను రూపొందించి ఉంటే దాన్ని ప్రజలకు అందు బాటులో ఉంచాలి. ప్రస్తుతం, భారతదేశంలో 600 వైద్య కళాశాలలు ఉన్నాయి. విద్యార్థులకు తమ రాష్ట్రం వెలుపలి కాలేజీల్లో అడ్మిషన్లను పొందే స్వేచ్ఛ ఉంది. ఇంగ్లిష్ ఉపయోగాన్ని త్యజించడం వల్ల అలాంటి అవకాశం వీరికి కష్టమవుతుంది. ఉదాహరణకు, మధ్యప్రదేశ్ నుండి హిందీ మీడియం డిగ్రీ ఉన్న ఒక విద్యార్థి ఇకపై కర్ణాటక లేక మహా రాష్ట్రలోని కాలేజీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదవటం కష్టమైపోతుంది. ఎందుకంటే అక్కడ బోధనా మాధ్యమం ఇంగ్లిష్ లేదా స్థానిక భాషలో ఉంటుంది. ఈ పరిస్థితుల్లో ఇలాంటి విద్యార్థులు విదేశీ డిగ్రీ చదవడం ఇంకా కష్టసాధ్యమైన విషయంగా ఉంటుంది. ఉస్మానియా యూనివర్సిటీలో వైద్య విద్యలో కోర్సులు బోధిస్తు న్నప్పుడు విద్యార్థులందరికీ ఇంగ్లిష్‌లో ప్రావీణ్యం ఉండటం తప్పని సరిగా ఉండేది. పాఠ్యపుస్తకాలు కూడా ఆంగ్లంలో ఉండేవి. ఉర్దూలో బోధన ప్రారంభం కావడానికి ముందే, ఒక అనువాద బ్యూరోని ఏర్ప ర్చారు. శాస్త్రీయ పదజాలంతో వ్యవహరించడానికి అనువాద మెథడా లజీ వృద్ధిచేశారు. రవీంద్రనాథ్ టాగూరు సహా దేశమంతటి నుంచి విద్యా నిపుణులను సంప్రదించేవారు. ప్రస్తుత సందర్భంలో అలాంటి పథకం లేదు. విద్యార్థి బృందంతో సహా విద్యతో సంబంధమున్న ప్రతి ఒక్కరితోనూ విస్తృత సంప్రదింపులు జరపడం కూడా ఇప్పుడు లేకుండా పోయింది. పలు భారతీయ భాషల్లోకి పాఠ్య పుస్తకాలు అనువదించినట్లయితే, అనుకూలత లేదా సమరూపతకు హామీ ఇవ్వ డానికి సాంకేతిక పదాలను ప్రామాణీకరించాలి. మాతృభాషలో సాంకేతిక కోర్సులను బోధించడాన్ని సమర్థించే వారు జపాన్ను ఉదాహరణగా చూపుతున్నారు. జపనీస్ భాషలో బోధన ద్వారా జపాన్ గొప్ప సాంకేతిక, పారిశ్రామిక ముందంజ వేయగలిగిందని చెబుతున్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం కూడా అప్పట్లో జపాన్ నుండి ప్రేరణ పొందింది. 1920లలో హైదరాబాద్ పబ్లిక్ ఇన్స్ట్రక్షన్ డైరెక్టర్ సయ్యద్ రాస్ మసూద్‌ను జపనీస్ సాంకేతిక విద్యా నమూనా అధ్యయనం కోసం జపాన్ పంపించారు. చైనా, రష్యా, జర్మనీ కూడా తమతమ భాషల్లోనే సాంకే తిక విద్యలను బోధించేవి. ఇవి దశాబ్దాలపాటు శాస్త్ర సంబంధ పదజాలాన్ని అభివృద్ధి చేసుకున్నాయి. ఈ దేశాలకూ, భారతదేశానికీ మధ్య ఉన్న ప్రధాన వ్యత్యాసం ఏమిటంటే, అవి చాలావరకు ఏక భాషా సమాజాలు. భారత్ బహు భాషల నిలయం. ఐఐటీ, ఐఐఎం వంటి ఉన్నత విద్యాసంస్థల్లో కూడా భారతీయ భాషల్లో కోర్సులను ప్రవేశపెడతామని కేంద్ర హోంమంత్రి సెల విచ్చారు. ఇంజినీరింగ్ విద్యను భారతీయ భాషల్లోనే బోధించడానికి పది రాష్ట్రాల్లో సన్నాహాలు చేస్తున్నామని అమిత్ షా చెప్పారు. తమిళం, తెలుగు, మరాఠీ, బెంగాలీ, మలయాళం, గుజరాతీ భాష ల్లోకి ఇంజినీరింగ్ పుస్తకాలను అనువదిస్తున్నట్లు తెలిపారు. భారతీయ భాషల్లో బోధనలో పదజాలం, ఇతర సమస్యలతో పాటు అలాంటి ఇంజినీరింగ్ కోర్సులు కీలక రంగాల్లో పోటీతత్వాన్ని హరింప జేస్తాయి. ప్రత్యేకించి ఔట్ సోర్సింగ్ పరిశ్రమలో పోటీ ఎంతగా ఉంటుందో తెలిసిందే. సాఫ్ట్వేర్, ఐటీ ఆధారిత సేవల్లో భారత్ అగ్రగామిగా ఉండటానికి ఆంగ్లంతో సుపరిచితమైన ఇంజినీరింగ్ వర్క్ ఫోర్స్ కారణం అని చెప్పాల్సి ఉంటుంది. ప్రత్యేకించి ఇతర దేశాలు కూడా పోటీ పడుతున్నప్పుడు, సాధారణ ఉద్యోగాల స్థానంలో యాంత్రికీకరణ వేగంగా ప్రవేశిస్తున్నప్పుడు ఈ మార్కెట్లో భారత్ తన స్థానాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కోల్పోకూడదు. హిందీ వైద్య పాఠ్యపుస్తకాలను ప్రారంభించడాన్ని మన విద్యా రంగంలో పునరుజ్జీవనం, పునర్నిర్మాణంగా కొనియాడుతున్నారు. నిజమైన పునరుజ్జీవనం అనేది భారతీయ భాషల్లో కొత్తదైన మూల జ్ఞానాన్ని సృష్టించడంతోనే సాధ్యపడుతుంది. దినేశ్ సి. శర్మ వ్యాసకర్త వైజ్ఞానిక అంశాల వ్యాఖ్యాత (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
విజయ్‌పై బాలీవుడ్ నటి సంచలన కామెంట్స్, హిందీని అవహేళన చేశాడంటూ..
‘రౌడీ’ హీరో విజయ్ దేవరకొండ బాలీవుడ్ నటి మలోబిక బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా నిలిచాయి. గతంతో విజయ్ హిందీ భాషను అవమానించేలా మాట్లాడాడంటూ బెంగాలీ నటి, సింగర్ అయిన మలోబిక బెనర్జీ తెలిపింది. రీసెంట్గా ఓ చానల్‌తో ముచ్చటించిన ఆమె ఈ సందర్భంగా లైగర్ మూవీ గురించి ప్రస్తావించింది. ఒకప్పుడు హిందీ భాషపై అనుచిత వ్యాఖ్యలు చేసి అవమానించిన విజయ్, ఇప్పుడు అదే భాషలో సినిమా తీశాడంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఈ మేరకు ఆమె మాట్లాడుతూ.. ‘‘విజయ్‌తో నేను కలిసి ‘నీ వెనకాలే నడిచి’ మ్యూజిక్ వీడియోలో నటించాం. చదవండి: Samantha Shocking Look: సామ్ సర్జరీ చేసుకుందా? ఇలా మారిపోయిందేంటి! అప్పటికే విజయ్ నటించిన అర్జున్ రెడ్డి మూవీ హిట్ కావడంతో అతడు పాపులర్ అయ్యాడు. ఆ మ్యూజిక్ వీడియో షూటింగ్ సమయంలోనే విజయ్‌తో నాకు పరిచయం ఏర్పడింది. నాకు మంచి స్నేహితుడయ్యాడు. సెట్లో మేం సరదాగా మాట్లాడుకునేవాళ్లం. అప్పటికి విజయ్‌కి హిందీ పూర్తిగా రాదు. అందుకే తనేప్పుడు తెలుగులోనే మాట్లాడేవాడు. కానీ నేను మాత్రం ఎక్కువగా హిందీలోనే మాట్లాడేదాన్ని. ఇక నేను హిందీలో మాట్లాడుతుంటే విజయ్ నవ్వుకునేవాడు. తనకు హిందీ పెద్దగా అర్థం కాదని, అది హెబ్రూ భాషలా అనిపిస్తుందంటూ అవహేళన చేశాడు. అలాంటి విజయ్ హిందీలో సినిమా తీశాడని తెలిసి షాకయ్యా. ఎందుకంటే ఒకప్పుడు హిందీని అవమానించేలా మాట్లాడిన వ్యక్తి.. అదే భాషలో సినిమా తీశాడు. చదవండి: పెళ్లిలో నటి పూర్ణ వేసుకున్న బంగారం ఎంతో తెలుసా? కొన్నేళ్లకు లైగర్ టీజర్లో విజయ్‌ని చూసి నవ్వుకున్నా’’ అని చెప్పుకొచ్చింది. అయితే ఈ విషయాన్ని లైగర్ ప్రమోషన్స్ సమయంలోనే చెబుదాం అనుకున్నానని, అయితే విజయ్ తనకు మంచి స్నేహితుడు కావడంతో ఆ పని చేయలేకపోయానంది. అంతేకాదు విజయ్ టీజర్‌ను సోషల్ మీడియా షేర్ చేసి ‘వెల్కమ్ టూ బాలీవుడ్’ అనే మెసేజ్ కూడా పెట్టానంది. ఆ తర్వాత తెలిసిందేంటంటే హిందీలో విజయ్‌కి ఎక్కువ డైలాగ్స్ లేవని తెలిసిందని పేర్కొంది. అయితే ఏది ఏమైనప్పటికి విజయ్ చాలా మంచి మనిషి అని, చాలా ప్రొఫెషనల్‌గా ఉంటాడంటూ చివరిలో ఆమె వ్యాఖ్యానించింది. కాగా ఎన్నో అంచనాల మధ్య ఆగస్ట్ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన లైగర్ చిత్రం బాక్సాఫిసు ఘోర పరాజయం పొందిన సంగతి తెలిసిందే. -
ఐరాస తీర్మానంలో హిందీ
ఐరాస: ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభ శుక్రవారం బహుభాషల వినియోగంపై ఆమోదించిన తీర్మానంలో మొదటిసారిగా హిందీని కూడా చేర్చింది. 193 దేశాలతో కూడిన సర్వప్రతినిధి సభలో ఈ ప్రతిపాదనకు భారత్ సహా 80కి పైగా దేశాలు మద్దతిచ్చాయి. ఆరు అధికార భాషలైన ఇంగ్లిష్, ఫ్రెంచి, చైనీస్, స్పానిష్, అరబిక్, రష్యన్ తో´ ాటు అనధికారిక భాషలైన హిందీ, స్వాహిలీ, పర్షియన్, బంగ్లా, ఉర్దూలను కూడా ఐరాస ఉత్తరప్రత్యుత్తరాల్లో వాడాలని తీర్మానం పేర్కొంది. ఐరాస తన కార్యకలాపాల్లో సమగ్రత సాధించేందుకు బహుళ భాషలను సమంగా స్వీకరించాలని భారత్ పేర్కొంది. ఐరాస గ్లోబల్ కమ్యూనికేషన్స్ ఉత్తర ప్రత్యుత్తరాలకు ఈ భాషలను కూడా ఉపయోగించడాన్ని ప్రశంసించింది. -
PM Modi: ప్రధాని కామెంట్లపై కిచ్చా సుదీప్ స్పందన
బెంగళూరు: హిందీ భాషాధిపత్య వ్యవహారం.. రాజకీయంగా ముఖ్యంగా దక్షిణాది నుంచి తీవ్ర అభ్యంతరాలకు కారణం అయ్యింది. ఈ విషయంలో కన్నడ స్టార్ నటుడు సుదీప్, బాలీవుడ్ సీనియర్ నటుడు అజయ్ దేవగన్ మధ్య జరిగిన ట్వీట్ల రచ్చ జరిగింది. ఒకానొక దశలో ఇది ఉద్రిక్తతలకు దారి తీస్తుందేమో అనిపించింది. ఇదిలా ఉంటే.. తాజాగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ హిందీ భాష ఆదిపత్య రగడపై పరోక్షంగా స్పందించారు. దేశంలోని ప్రతి భాషను బీజేపీ సంప్రదాయ ప్రతిబింబంగానే చూస్తుందని, ప్రతీ భాషను గౌరవిస్తుందని అన్నారు. భాషా ప్రతిపాదికన వివాదాలు ప్రేరేపించే అంశాల పట్ల ప్రజలను అప్రమత్తం చేయాల్సిన అవసరం ఉందని ఎన్డీఏ ఎనిమిదేళ్ల పాలన సందర్భంగా బీజేపీ కార్యకర్తలను ఉద్దేశించి మోదీ ప్రసంగించారు. ఈ తరుణంలో.. ప్రధాని ఇలాంటి ప్రకటన చేయడాన్ని స్వాగతిస్తున్నట్లు నటుడు కిచ్చా సుదీప్ తెలిపారు. ‘‘ప్రతీ ఒక్కరూ తమ భాషను గొప్పగా భావించాలి. ఆయన(ప్రధాని) ఇలా మాట్లాడటాన్ని గౌరవిస్తున్నా. ఇది అన్ని భాషలకు సంబంధించి విషయం. కేవలం కన్నడ గురించి మాత్రమే నేనేం మాట్లాడలేదు. ప్రతీ భాషను గౌరవించాల్సిన అవసరం ఉంది. నరేంద్ర మోదీని కేవలం ఒక రాజకీయవేత్తగా మాత్రమే చూడొద్దు.. ఈ వ్యాఖ్యలతో ఆయన్ని ఒక నేతగా చూడాల్సిన అవసరం ఉంది’’ అని సుదీప్ అభిప్రాయపడ్డాడు. ఏదో చర్చ జరగాలనో, గొడవలు జరగాలనో నేను ప్రారంభించలేదు. ఎలాంటి ఎజెండా లేకుండానే అలా జరిగిపోయింది. నా అభిప్రాయం మాత్రమే వినిపించా. ఇప్పుడు ప్రధాని నోట నుంచి ఇలాంటి ప్రకటన రావడం సంతోషంగా ఉంది అని ఓ జాతీయ మీడియా ఇంటర్వ్యూలో సుదీప్ చెప్పుకొచ్చాడు. చదవండి: చిచ్చు పెట్టిన ‘హిందీ’ భాష -
హిందీ మాట్లాడేవాళ్లు పానీపూరి అమ్ముకుంటున్నారు
హిందీ భాషపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై ఇప్పటికీ కౌంటర్లు వస్తూనే ఉన్నాయి. ఆయన వ్యాఖ్యలను మొదటి నుంచి తమిళనాడు సర్కార్, సీఎం స్టాలిన్ ఖండించిన విషయం తెలిసిందే. తాజాగా తమిళనాడు విద్యాశాఖ మంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. వివరాల ప్రకారం.. కోయంబత్తూర్‌లోని భారతీయర్ యూనివర్సిటీలో శుక్రవారం జరిగిన స్నాతకోత్సవ కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి కే పొన్నుడి మాట్లాడుతూ.. హిందీ మాట్లాడేవారు కోయంబత్తూర్‌లో పానీపూరీలు అమ్ముకుంటున్నారని ఎద్దేవా చేశారు. హిందీ భాష మరిన్ని ఎక్కువ ఉద్యోగాలు కల్పించేదే అయితే ఉత్తర భారతీయులు ఇక్కడ(తమిళనాడులో) పానీ పూరీ ఎందుకు అమ్ముకుంటున్నారని ప్రశ్నించారు. ఈ క్రమంలోనే తమిళనాడు ప్రజలు ఇంగ్లీష్, తమిళ్ మాట్లాడుతారని అన్నారు. అలాగే, తాము అంతర్జాతీయ భాషగా ఇంగ్లీష్ నేర్చుకుంటుండగా ఇతర భాషలతో పనేముందని మంత్రి ఆయన ప్రశ్నించారు. మరో అడుగుముందుకేసి.. హిందీ కేవలం ఆప్షనల్ ల్యాంగ్వేజ్ మాత్రమేనని, దాన్ని నేర్చుకోవడం తప్పనిసరి కాదని కుండబద్దలుకొట్టారు. తమిళ విద్యార్ధులు ఏ భాష నేర్చుకునేందుకైనా సిద్ధంగా ఉంటారని చెప్పారు. అంతకు ముందు.. హిందీ జాతీయ భాష కాదంటూ కన్నడ సూపర్‌స్టార్ కిచ్చా సుదీప్ కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. ఇది కూడా చదవండి: మీ ఇంటిని కూల్చివేస్తామంటూ బీజేపీ చీఫ్‌కు వార్నింగ్ -
జిప్మర్లో హిందీ రగడ
సాక్షి, చెన్నై: కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలోని జిప్మర్ (జవహర్లాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్‌గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్, రీసెర్చి)లో పాలనా వ్యవహారాలన్నీ హిందీలోనే జరగాలన్న ఆదేశాలు కలకలం రేపుతున్నాయి. తమిళనాడుతో పాటు పుదుచ్చేరిలోనూ హిందీ, సంస్కృత భాషలను ఆది నుంచి వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జిప్మర్ ఇచ్చిన హిందీ ఉత్తర్వులపై తమిళాభిమానుల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. బలవంతంగా హిందీని రుద్దాలన్న కేంద్ర ప్రభుత్వ యత్నాలను అడ్డుకుంటామని డీఎంకే ఎంపీ కనిమొళి హెచ్చరించారు. పుదుచ్చేరిలో బీజేపీ– ఎన్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న విషయం తెలిసిందే. -
ఆయుష్మాన్ ఖురానా, జేడీ చక్రవర్తి మధ్య హిందీ భాషపై చర్చ..
Anek Trailer: Ayushmann Khurrana Gripped By Hindi Language Row: విలక్షణమైన నటనతో అబ్బురపరిచే బాలీవుడ్ యంగ్ హీరోల్లో ఆయుష్మాన్ ఖురానా ఒకరు. విక్కీ డోనర్, అంధాదున్, ఆర్టికల్ 15, డ్రీమ్ గర్ల్, బాలా, చంఢీగర్ కరే ఆషికీ వంటి తదితర చిత్రాలతో ఆకట్టుకున్నాడు. తాజాగా ఆయుష్మాన్ ఖురానా నటించిన చిత్రం 'అనేక్'. ఈ చిత్రంలో తొలిసారిగా ఒక సీక్రెట్ పోలీస్ పాత్రలో అలరించనున్నాడు ఆయుష్మాన్ ఖురానా. ఈ మూవీకి ముల్క్, ఆర్టికల్ 15, తప్పడ్ వంటి చిత్రాలను తెరకెక్కించిన అనుభవ్ సిన్హా దర్శకత్వం వహించారు. నార్త్ ఈస్ట్ ఇండియా బార్డర్లో నెలకొన్న రాజకీయ సంఘర్షణల నేపథ్యంగా ఈ సినిమా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. అనేక్ మూవీ ట్రైలర్‌ను గురువారం (మే 5) విడుదల చేశారు. ఈ ట్రైలర్లో ఒక మిషన్‌ను జాషవా (ఆయుష్మాన్ ఖురానా) అనే పోలీసు ఎలా చేధించాడో చూపించారు. అంతేకాకుండా ఈ ట్రైలర్లో హిందీ భాష గురించి ప్రస్తావించడం విశేషం. బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్, కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ ట్విటర్ వార్ గొడవ కారణంగా హిందీ భాషను ప్రస్తావించినట్లు తెలుస్తోంది. ఈ మూవీలో తెలంగాణ పోలీసుగా జేడీ చక్రవర్తి నటిస్తున్నాడు. ఆయుష్మాన్ ఖురానా, జేడి చక్రవర్తి మధ్య వచ్చిన హిందీ భాషకు సంబధించిన చర్చ ఆకట్టుకుంటుంది. చదవండి: హిందీ భాషపై సంచలన వ్యాఖ్యలు, అజయ్, సుదీప్ మధ్య ట్వీట్ల వార్ 'హిందీ భాషను సరళంగా మాట్లాడటం వల్లే నార్త్ ఇండియన్‌గా నిర్ణయిస్తారా ?' అని ఆయుష్మాన్ అడిగిన ప్రశ్నకు జేడీ చక్రవర్తి 'నో' అని చెబుతాడు. దానికి 'కాబట్టి ఇది హిందీ గురించి కాదు' అని ఆయుష్మాన్ బదులిస్తాడు. తర్వాత 'ఒక మనిషిని ఇండియన్‌గా ఎలా డిసైడ్ చేస్తారు' అనే డైలాగ్ ఆకట్టుకుంటుంది. హిందీ భాష, నార్త్ ఇండియన్ వంటి అంశాలపై ప్రస్తావించిన 'అనేక్' ట్రైలర్ పై సినీ ప్రముఖులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. ఈ సినిమా మే 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. చదవండి: అజయ్ దేవగణ్, సుదీప్‌ల ట్విటర్ వార్‌పై సోనూసూద్ ఆసక్తికర వ్యాఖ్యలు var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1711356039.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
హిందీ భాష వివాదంపై సుహాసిని స్పందన, ట్రోల్స్ చేస్తున్న నెటిజన్లు
Suhasini Respond On Hindi Language War: ప్రస్తుతం సినీ పరిశ్రమంలో హిందీ భాష వివాదం హాట్‌టాపిక్‌గా నిలిచింది. కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ హిందీ జాతీయ భాష కాదంటూ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. దీంతో సుదీప్, బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్‌ల మధ్య ట్విటర్ వార్ నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ వార్‌పై సౌత్, నార్త్ సినీ సెలెబ్రెటీలు స్పందిస్తు తమ అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా సీనియర్ నటి సుహాసిని హిందీ భాష వివాదంపై స్పందించారు. చదవండి: ‘లైగర్’కి రికార్డు డీల్స్, డిజిటల్, ఆడియో రైట్స్‌కు కళ్లు చెదిరే ఆఫర్స్ నటులు అన్న తర్వాత అన్ని భాషలను నేర్చుకోవాలని ఆమె అన్నారు. హిందీ భాష చాలా బాగుంటుందని, అది కూడా నేర్చుకోవాలని ఆమె సూచించారు. హిందీ వాళ్లు మంచి వాళ్లని, వాళ్లతో మాట్లాడాలంటే హిందీ నేర్చుకోవాలని చెప్పారు. అలాగే తమిళం వాళ్లు కూడా మంచి వాళ్లేనని, హిందీ వాళ్లు కూడా తమిళంలో మాట్లాడితే సంతోషంగా ఉంటుందని సుహాసిని వ్యాఖ్యానించారు. తమ ఇంట్లో పని చేసే వాళ్లలో కొంతమంది తెలుగు మాట్లాడతారని, మరికొంతమంది హిందీ మాట్లాడతారన్నారు. చదవండి: లెటెస్ట్ అప్డేట్: ఈ నెలలోనే ఓటీటీకి ఆర్ఆర్ఆర్, ఆ రోజు నుంచే స్ట్రీమింగ్! ఆ తర్వాత ఆ భాషే కావాలి.. ఈ భాషే కావాలంటే మనకు తిండి దొరకని పరిస్థితి ఏర్పడుతుందని సుహాసిని అభిప్రాయపడ్డారు. అందుకే అందరూ అన్ని భాషలు నేర్చుకోవాలన్నారు. దీంతో సుహాసిని వ్యాఖ్యలపై తమిళ యువత ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. తన వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా వేదికగా సుహాసినిని ట్రోల్ చేస్తున్నారు. హిందీ భాష మాట్లాడాలనిపిస్తే హిందీ సినిమాలే చేసుకుంటూ బాలీవుడ్లోనే ఉండాల్సిందంటూ సుహాసినిపై సటైరికల్ కామెంట్స్ చేస్తున్నారు. -
అనుసంధాన భాషగా హిందీ అవసరం లేదా?
జాతీయోద్యమ కాలం నుంచీ ఒక ఉమ్మడి భాషగా హిందీ వ్యాపించిన వాస్తవాన్ని కాదనలేం. మరీ ముఖ్యంగా హిందీ సినిమాల జనాదరణ (పాటలతో పాటు) మూలంగా దేశం నలుమూలలా హిందీ భాషను అర్థం చేసుకోగల వాతావరణం ఏర్పడింది. సాహిత్యపరంగా ప్రేమ్‌చంద్, రాహుల్ సాంకృత్యాయన్, జయశంకర్ ప్రసాద్, దిన్కర్ నిరాలా వంటి రచయితలు – కవులు, తెలుగుతోపాటు ఇతర భారతీయ భాషల్లోనూ పాఠకుల ఆదరణ పొందారు. ప్రస్తుతం హిందీ దేశవ్యాప్తంగా ఒక అధికార భాషగా లేదా అనుసంధాన భాషగా వాడుకలో ఉన్నప్పటికీ... హిందీయేతర ప్రాంతీయులకు ముఖ్యంగా దక్షిణాది ప్రాంతాలకు అభ్యంతరాలు కొనసాగుతూనే ఉన్నాయి. మరోవైపు ఇంగ్లిష్ ప్రాబల్యం పెరిగిన తర్వాత, హిందీ వెనుకబడిపోయింది. ఇక అసలు వివాదమెక్కడంటే భారతీయ భాషల్లో గుర్తింపు పొందిన (ఇంగ్లిష్తో సహా) 23 భాషలన్నీ జాతీయ భాషలే అనే యథార్థాన్ని హిందీవాదులు విస్మరించడం! ఫలితంగా హిందీ భాష ఆధిపత్యమనే ప్రమాదమున్నదని... ముఖ్యంగా తమిళనాడులో వ్యతిరేకత పెరిగింది. అయినా అక్కడే చెన్నైలో ‘దక్షిణ భారత హిందీ ప్రచార సభ’ చేసిన భాషా సేవను తక్కువగా అంచనా వేయలేం. జాతీయ సమైక్యతకు హిందీ ఒక వాహికగా ఉండగలదనే నమ్మకమే ఆ ప్రచారానికి దోహదపడింది. ఇక ప్రాంతాల పరస్పర సంబంధాల రీత్యా, మన ఫెడరల్ వ్యవస్థకు అనుగుణంగా త్రిభాషా సూత్రాన్ని అమలు చేశారు. కానీ ఆచరణలో మాత్రం దక్షిణాది వారంతా మాతృభాషతోపాటు హిందీ –ఇంగ్లిష్ నేర్చుకొంటే... ఉత్తరాది వాళ్లు మాత్రం తమ హిందీతో పాటు ఇంగ్లిష్తో సరిపెట్టుకొన్నారు. ప్రయోగ రీత్యా హరియాణా– పంజాబ్, బిహార్–ఉత్తరప్రదేశ్ తదితర ప్రాంతాల్లో దక్షిణాది భాష లను అక్కడి కొన్ని విద్యాలయాల్లో బోధించినా ప్రోత్సాహం లభించలేదు. ఈ వైరుద్ధ్యం వల్ల ఈనాటికీ దక్షిణాది–ఉత్తరాది ప్రజల మధ్య భాషాపరంగా ఒక అగాథం మిగిలిపోయింది. బహుభాషా రాష్ట్రాలుగా ఉన్న ఈ దేశంలో... ప్రాంతీయంగా అక్కడి భాష అధి కార భాషగా ఉన్నప్పటికీ చాలావరకు ఇంగ్లిష్‌లోనే పరిపాలన సాగుతున్న యథార్థాన్ని కాదనగలమా? తమిళనాడు మరికొన్ని రాష్ట్రాలు తప్ప ఇతరత్రా అక్కడి ప్రజల భాషలో అధికార తతంగ మంతా ఇంగ్లిష్‌లోనే కొనసాగుతోంది. మరోవైపు హిందీని కేంద్ర ప్రభుత్వం రైల్వే విభాగాల్లో, బ్యాంకు, పోస్టల్ సర్వీసుల్లో సమాంతరంగా ప్రవేశపెట్టి అధికార భాషగా చాలాకాలం కిందటే అమలు చేసింది. ఇక్కడే ఒక ఆచరణా త్మక వాస్తవాన్ని గుర్తించక తప్పదు. కేంద్ర–రాష్ట్ర సంబంధాల్లో, కేంద్ర పాలనలో మిగతా 22 భాషలను అధికార భాషలుగా అమలు చేయడం ఆచరణలో అసాధ్యం. అందువల్ల ఉమ్మడి భాషలుగా ఇంగ్లిష్–హిందీ భాషలు మన వ్యవహారంలో అనుసంధానంగా కొనసాగుతున్నాయి. ఈ వాస్తవాన్ని తిరస్కరించి, హిందీ పట్ల ద్వేషం పెంచుకోవడం భారతీయ భాషల పట్ల అపచారమే! బ్రిటిష్ సామ్రాజ్య వ్యాప్తి ద్వారా ఇంగ్లిష్ (మనదేశంలో వలస పాలన) ఇండియాలోకి ప్రవేశించిన తర్వాత ఆ భాషను మనం సామ్రాజ్యవాద భాష అని తిరస్కరించామా? ఒకప్పుడు లోహియా సోషలిస్టులు ‘అంగ్రేజీ హఠావో’ (ఇంగ్లిష్‌ను తొలగించండి) అని ఉద్యమించినా, ఉపాధి రీత్యా, సాంకేతిక తదితర విద్యాబోధనా మాధ్యమంగా ఇంగ్లిష్ అనివార్యమై ప్రాథమిక స్థాయి నుంచే దానిని నేర్చుకోవాలనే స్థితికి చేరుకున్నాం. మరో అతి ముఖ్యమైన అంశం– అనుసంధాన భాషగా హిందీ ఈ దేశంలో అత్యధిక ప్రజలు మాట్లాడుతున్న భాష. భాషా పరంగా అతి సులువుగా నేర్చుకోవచ్చు. ఒక రచయితగా నేను ఈరోజు హిందీలో కూడా రచనలు చేయగలుగుతున్నాను. హైస్కూలు స్థాయి నుంచి ‘త్రిభాషా సూత్రం’లో భాగంగా హిందీ రెండో భాషగా నేర్చు కోవడం వల్ల అది సాధ్యమైంది. గతంలో ఉర్దూ పదాల కలయికతో ‘హిందూస్తానీ’ భాషగా ప్రజల్లోకి వెళ్లిన హిందీని, ఉత్తరాది భాషా దురభిమానులు పనిగట్టుకుని సంస్కృతభూయిష్టంగా, పరిమితు ల్లోకి నెట్టివేశారు. అందువల్లే హిందుత్వ ఛాదస్తుల ప్రమాదం మరిం తగా భాషాపరంగా ఉందని చాలామంది భయపడుతున్నారు. ఇతరత్రా హిందీ మెజారిటీ ప్రజల భాష అనే వాదన పట్ల కొన్ని అభ్యంతరాలున్న మాట కూడా వాస్తవం. ‘ది పీపుల్స్ లింగ్విస్టిక్ సర్వే ఆఫ్ ఇండియా’ ప్రధాన సంపాదకుడు, ప్రముఖ భాషావేత్త, జీఎన్ దెవీ వివరణ ప్రకారం– 2011లో నమోదైన (సంఖ్యాపరంగా) హిందీ భాషీయులు 52.83 కోట్లు. అయితే ఈ హిందీ అనే ప్రాంతా లలోనే భోజ్‌పురి, మైథిలి, ఛత్తీస్‌గఢ్, రాజస్థానీ, పవాడీ మొదలైన స్థానిక భాషలు కలిసి ఉన్నాయి. వీటిని తీసివేస్తే, హిందీ అనేది 32 శాతానికి దిగి వస్తున్నదని దెవీ వాదన. (క్లిక్: ఆంగ్లంతోనే అనుసంధానం) హిందీ ఆధునికమైన భాష. ఇతర ప్రాచీన భాషలతో పోల్చితే వయస్సులో చిన్నదే. దెవీ భావిస్తున్నట్టు హిందీ అందమైన భాష. సాహిత్యపరంగా గౌరవ స్థానాన్ని సాధించుకున్నది. హిందీ సినిమా జనామోదం వల్ల దేశానికి ఎంతో ఖ్యాతిని, విదేశీ మారకాన్ని సంతరించి పెట్టింది. భౌగోళికంగా, చారిత్రక కారణాల వల్ల, పాలనా సౌలభ్య రీత్యా హిందీని అనుసంధాన భాషగా గౌరవించాలి. ఇంగ్లి ష్‌తో పాటు హిందీ అవసరాన్ని గత వందేళ్ల చరిత్ర నిరూపించింది. (చదవండి: ఒక్క భాషకు పెత్తనమా?) - నిఖిలేశ్వర్ ప్రముఖ కవి, రచయిత -
హిందీ భాష వివాదంపై కంగనా షాకింగ్ కామెంట్స్
Kangana Ranaut Response On Hindi Language Controversy: కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్, బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్‌ల మధ్య నెలకొన్న ట్విటర్ వార్ గురించి తెలిసిందే. హిందీ జాతీయ భాష కాదని సుదీప్ చేసిన వ్యాఖ్యలు పరిశ్రమలో వివాదస్పదమయ్యాయి. ఈ వివాదంపై ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు స్పందించగా.. తాజాగా బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ స్పందించింది. ఈ సందర్భంగా ఆమె హిందీ జాతీయ భాష కాదంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. చదవండి: హీరోయిన్ రష్మిక రోజూ ఏం తింటుందో తెలుసా? ఆమె లేటెస్ట్ మూవీ ‘ధాకడ్’ నుంచి ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో కంగనా మీడియాతో మాట్లాడుతూ హిందీ భాష వివాదంపై స్పందించింది. ‘హిందీ కంటే సంస్కృతం పాతది. సంస్కృతం జాతీయ భాషగా ఉండాలి. అయితే, హిందీని జాతీయ భాషగా తిరస్కరించడం పరోక్షంగా కేంద్ర ప్రభుత్వాన్ని, భారత రాజ్యాంగాన్ని అగౌరవపరచడమే’ అని ఆమె అభిప్రాయపడింది. అయితే మొదట మన భాష, మూలాలు, సంస్కృతి గురించి గర్వపడే హక్కు మనందరికీ ఉందని వ్యాఖ్యానించింది. చదవండి: ‘ఆచార్య’ ఫస్ట్‌డే కలెక్షన్స్ ఎంతంటే.. ఈ మేరకు ఆమె ‘మన దేశం సాంస్కృతికంగా, భాషల వారీగా చాలా వైవిధ్యమైనది. కాబట్టి వాటిని తీసుకురావడానికి మనకు ఒక ఉమ్మడి భాష అవసరం. భారత రాజ్యాంగాన్ని రూపొందించినప్పుడు హిందీని జాతీయ భాషగా చేశారు. నిజానికి హిందీ కంటే తమిళం పాత భాష. కానీ పురాతనమైనది సంస్కృత భాష. కాబట్టి, నా అభిప్రాయం ప్రకారం, సంస్కృతం జాతీయ భాషగా ఉండాలి కానీ హిందీ కాదు’ అని కంగనా వివరణ ఇచ్చింది. అనంతరం హిందీని జాతీయ భాషగా ఎందుకు ఎంచుకున్నారనేదానికి తన దగ్గర సమాధానం లేదని, కానీ ఇప్పుడు దానిని పాటించకపోతే రాజ్యాంగాన్ని తిరస్కరించినట్లవుతుందని కంగనా పేర్కొంది. -
కిచ్చా సుదీప్ చెప్పింది కరెక్ట్.. కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై
కన్నడ స్టార్ కిచ్చా సుదీప్, బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్ మధ్య తలెత్తిన హిందీ భాషా వివాదం ప్రస్తుతం కర్ణాటక ముఖ్యమంత్రి వరకు చేరింది. కన్నడ సూపర్‌స్టార్ సుదీప్‌కు మద్దతుగా సీఎం బసవరాజ్ బొమ్మై నిలిచారు. ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భాషా ప్రాతిపదికన రాష్ట్రాలు ఏర్పడ్డాయని, కాబట్టి ప్రాంతీయ భాషలు చాలా ముఖ్యమైనవని పేర్కొన్నారు. సుదీప్ మాటలు సరైనవేనని, దానిని అందరూ అర్థం చేసుకొని గౌరవించాలని సీఎం బొమ్మై సూచించారు. కాగా ఇప్పటికే కర్ణాటక మాజీ సీఎం సిద్ధ రామయ్య, కాంగ్రెస్ నేత డీకే శివకుమార్ కిచ్చ సుదీప్‌కు అండగా నిలిచారు. బాలీవుడ్, కన్నడ సూపర్ స్టార్ల మధ్య హిందీ వార్ నడుస్తున్న విషయం తెలిసిందే. ముందుగా ఓ సినిమా ఈవెంట్లో పాల్గొన్న సుదీప్.. దక్షిణాది సినిమాలు బాక్సాఫిస్ వద్ద రికార్డులు బద్దలు కొడుతున్నాయని, హిందీలోకి డబ్ అయి బాలీవుడ్ సినిమాల కంటే ఎక్కువ వసూళ్లు రాబడుతున్నాయని అన్నారు. అలాగే ఇకపై హిందీ జాతీయ భాషగా ఉండబోదని చెప్పారు. దీంతో సుదీప్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దూమారం రేపాయి. .@KicchaSudeep मेरे भाई, आपके अनुसार अगर हिंदी हमारी राष्ट्रीय भाषा नहीं है तो आप अपनी मातृभाषा की फ़िल्मों को हिंदी में डब करके क्यूँ रिलीज़ करते हैं? हिंदी हमारी मातृभाषा और राष्ट्रीय भाषा थी, है और हमेशा रहेगी। जन गण मन । — Ajay Devgn (@ajaydevgn) April 27, 2022 సుదీప్ వ్యాఖ్యలపై బాలీవుడ్ సూపర్ స్టార్ అజయ్ దేవగణ్ వ్యంగ్యంగా స్పందించారు. బ్రదర్ కిచ్చా సుదీప్... మీ అభిప్రాయం ప్రకారం హిందీ జాతీయ భాష కానప్పుడు... మీ మాతృభాష సినిమాలను హిందీలోకి ఎందుకు డబ్ చేస్తున్నారని ప్రశ్నించారు. హిందీ ఇంతకమందు, ఇప్పుడు, ఎప్పటికీ మన జాతీయ భాషే. జన గణ మన' అని ట్వీట్ చేశారు. మరోవైపు వీరిద్దరి మాటల యుద్ధంపై పలువురు తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. చదవండి👉 Kichcha Sudeep Vs Ajay Devgan: చిచ్చు పెట్టిన హిందీ భాష, స్టార్ హీరోల మధ్య ట్వీట్ల వార్ And sir @ajaydevgn ,, I did understand the txt you sent in hindi. Tats only coz we all have respected,loved and learnt hindi. No offense sir,,,but was wondering what'd the situation be if my response was typed in kannada.!! Don't we too belong to India sir. 🥂 — Kichcha Sudeepa (@KicchaSudeep) April 27, 2022 మరోవైపు తాను మాట్లాడిన మాటలు ట్రాన్స్లేషన్ పొరపాటు వలన తప్పుగా అర్థం చేసుకున్నారనీ సుదీప్ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ‘అజయ్ సార్.. మీరు హిందీలో చేసిన ట్వీట్ నాకు అర్థం అయ్యింది. అందరం హిందీని గౌరవిస్తాము. కాబట్టి హిందీని ప్రేమించాము, నేర్చుకున్నాను. గౌరవించాము. మనమందరం నేను హిందీ భాషను గౌరవిస్తాను, ప్రేమిస్తాను, కేవలం ట్రాన్స్లేషన్ వల్ల పొరపాటు జరిగింది. కానీ నేను ఇప్పుడు కన్నడలో రిప్లై ఇస్తే పరిస్థితి ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నా. మనమంతా కూడ భారతదేశానికి చెందిన వాళ్లమే కదా సార్’ అంటూ రీట్వీట్ చేశారు. Hello @ajaydevgn sir.. the context to why i said tat line is entirely different to the way I guess it has reached you. Probably wil emphasis on why the statement was made when I see you in person. It wasn't to hurt,Provoke or to start any debate. Why would I sir 😁 https://t.co/w1jIugFid6 — Kichcha Sudeepa (@KicchaSudeep) April 27, 2022 అలాగే ‘ మన దేశంలోని ప్రతి భాషను నేను ప్రేమిస్తాను సార్. నేను ఆ మాటలను పూర్తిగా భిన్నమైన సందర్భంలో చెప్పాను. అది మీ దగ్గరకు వేరే రకంగా చేరింది. త్వరలో మిమ్మల్ని కలుస్తానని ఆశిస్తున్నాను. అప్పుడు అసలేం జరిగిందో మీకు వివరిస్తాను. ఇది ఎవరినీ బాధపెట్టడానికి, రెచ్చగొట్టడానికి లేదా ఇలాంటి చర్చను ప్రారంభించడానికి కాదు. ఇక ఈ అంశం ఇక్కడితో ముగిసిపోవాలని ఆశిస్తున్నాను. అనువాదం, వివరణలు, దృక్కోణాలు అసలు మేటర్ సర్… పూర్తి విషయం తెలియకుండా స్పందించకపోవడానికి కారణం అదే దీనికి నేను మిమ్మల్ని నిందించను. ఒక సృజనాత్మక కారణంతో నేను మీ నుంచి ట్వీట్‌ను స్వీకరించి ఉంటే బహుశా అది సంతోషకరమైన క్షణం అయ్యేది” అంటూ సుదీర్ఘ వివరణ ఇచ్చాడు. -
హిందీ భాషపై సంచలన వ్యాఖ్యలు, అజయ్, సుదీప్ మధ్య ట్వీట్ల వార్
హిందీ భాషపై కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దూమారం రేపుతున్నాయి. హిందీ జాతీయ భాష కాదంటూ సుదీప్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీశాయి. దీంతో ఆయనకు ఓ వర్గం నెటిజన్ల నుంచి వ్యతిరేకత వస్తోంది. కాగా ఆయన తాజా చిత్రం విక్రాంత్ రోణ ప్రమోషన్లో భాగంగా సుదీప్ కేజీయఫ్ 2పై ప్రశంసలు కురిపిస్తూ బాలీవుడ్ ఇండస్ట్రీపై సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి విధితమే. ఈ క్రమంలో ఆయన హిందీ భాషపై కూడా తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. చదవండి: పునీత్ పేరును పచ్చబొట్టు వేయించుకున్న నటి నమ్రత దీంతో సుదీప్ వ్యాఖ్యలపై స్పందించిన స్టార్ హీరో అజయ్ దేవగన్ ఆయనకు కౌంటర్ ఇచ్చాడు. సుదీప్‌ను ట్యాగ్ చేస్తూ ‘హిందీ జాతీయ భాష కాకపోతే మీ సినిమాలను హిందీలో డబ్ చేసి ఎందుకు విడుదల చేస్తున్నారు. హిందీ ఇప్పటికీ, ఎప్పటికీ మన మాతృ భాషే, జాతీయ భాషే, జనగణమన’ అంటూ సుదీప్‌ను ప్రశ్నించాడు. దీంతో అజయ్ దేవగన్ ట్వీట్‌కు సుదీప్ స్పందిస్తూ.. ‘హలో అజయ్ సార్. నా వ్యాఖ్యలకు అర్థం అది కాదు. మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు. మిమ్మల్ని వ్యక్తిగతం కలిసినప్పుడు దీనికి మీకు వివరణ ఇస్తాను’ అని చెప్పుకొచ్చాడు. .@KicchaSudeep मेरे भाई, आपके अनुसार अगर हिंदी हमारी राष्ट्रीय भाषा नहीं है तो आप अपनी मातृभाषा की फ़िल्मों को हिंदी में डब करके क्यूँ रिलीज़ करते हैं? हिंदी हमारी मातृभाषा और राष्ट्रीय भाषा थी, है और हमेशा रहेगी। जन गण मन । — Ajay Devgn (@ajaydevgn) April 27, 2022 అలాగే మరో ట్వీట్లో భారతదేశంలోని అన్ని భాషలపై తనకు గౌరవం ఉందని, ఇక్కడితే ఈ టాపిక్‌ను వదిలేయాలనుకుంటున్నాను అంటూ సుదీప్ వరస ట్వీట్స్ చేశాడు. ‘ఎలాంటి అపార్థాలు చోటు చేసుకోకుండా దీనికి స్పష్టత ఇచ్చినందుకు ధన్యవాదాలు మై ఫ్రెండ్. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ అంతా ఒక కుటుంబం అని నా అభిప్రాయం. మనమంత దేశంలోని అన్ని భాషలను గౌరవించాలి’ అంటూ అంటూ సుదీప్ ట్వీట్‌కు అజయ్ రిప్లై ఇచ్చాడు. ఇలా ఇద్దరి మధ్య ట్వీట్ వార్ నెలకొంది. I love and respect every language of our country sir. I would want this topic to rest,,, as I said the line in a totally different context. Mch luv and wshs to you always. Hoping to seeing you soon. 🥳🥂🤜🏻🤛🏻 — Kichcha Sudeepa (@KicchaSudeep) April 27, 2022 కాగా సుదీప్.. 'ఒక కన్నడ సినిమాను పాన్ ఇండియాగా తెరకెక్కించారని ఎవరో అంటున్నారు. ఒక చిన్న కరెక్షన్ చేయాలనుకుంటున్నా. హిందీ ఇక నుంచి ఏమాత్రం జాతీయ భాష కాదు. నేడు బాలీవుడ్ ఎన్నో పాన్ ఇండియా సినిమాలను నిర్మిస్తోంది. తెలుగు, తమిళంలో డబ్ చేసేందుకు ఎంతో కష్టపడుతున్నారు. కానీ అవి అంతగా విజయం సాధించలేకపోతున్నాయి. కానీ ఈరోజు మనం తీస్తున్న సినిమాలను ప్రపంచం మొత్తం చూస్తున్నాయి.' అని కామెంట్ చేసిన సంగతి తెలిసిందే. -
కేజీఎఫ్ 2 ఎఫెక్ట్: హిందీ భాషపై కిచ్చా సుదీప్ సంచలన వ్యాఖ్యలు..
Kiccha Sudeep Says Hindi Is No More A National Language: దర్శక ధీరుడు రాజమౌళి చెక్కిన 'ఈగ' చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్. 'ఈగ' సినిమాలో విలన్‌గా మెప్పించి ఎంతో ఆకట్టుకున్నారు. అంతేకాకుండా పాత్రలో కొత్తదనం ఉంటే చాలు వెంటనే సినిమా చేసేస్తాడు. హీరోగానే కాదు.. కథలో తన ప్రాముఖ్యాన్ని బట్టి క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా చేస్తుంటారు. ‘బాహుబలి’, ‘సైరా: నరసింహారెడ్డి’ వంటి చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేసి తనదైన నటనతో మెప్పించాడు. ప్రస్తుతం సుదీప్ హీరోగా విక్రాంత్ రోణ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. పాన్ ఇండియాగా తెరకెక్కుతున్న ఈ మూవీ జూలై 28న విడుదల కానుంది. ఇదిలా ఉంటే తాజాగా కేజీఎఫ్ 2 సినిమాపై ప్రశంసల వర్షం కురిపిస్తూ బాలీవుడ్ సినీ ఇండస్ట్రీపై సంచలన కామెంట్స్ చేశాడు కిచ్చా సుదీప్. ఓ ప్రెస్ మీట్లో సుదీప్ మాట్లాడుతూ 'ఒక కన్నడ సినిమాను పాన్ ఇండియాగా తెరకెక్కించారని ఎవరో అంటున్నారు. ఒక చిన్న కరెక్షన్ చేయాలనుకుంటున్నా. హిందీ ఇక నుంచి ఏమాత్రం జాతీయ భాష కాదు. నేడు బాలీవుడ్ ఎన్నో పాన్ ఇండియా సినిమాలను నిర్మిస్తోంది. తెలుగు, తమిళంలో డబ్ చేసేందుకు ఎంతో కష్టపడుతున్నారు. కానీ అవి అంతగా విజయం సాధించలేకపోతున్నాయి. కానీ ఈరోజు మనం తీస్తున్న సినిమాలను ప్రపంచం మొత్తం చూస్తున్నాయి.' అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. మరీ సుదీప్ వ్యాఖ్యలపై బాలీవుడ్ నుంచి ఎవరైనా స్పందిస్తారో చూడాలి. చదవండి: కిచ్చా సుదీప్ 3డీ మూవీ.. రిలీజ్ ఎప్పుడంటే ? Kannada Actor @KicchaSudeep said ,"correct it,Hindi is no more the National Language, its no more a National language"! In a film launch & a huge applause from the crowd & the media. Hope the efforts of Kannada activists are reaching the intended places.👏👏#stophindilmposition pic.twitter.com/qpj06HJseG — ರವಿ-Ravi ಆಲದಮರ (@AaladaMara) April 23, 2022 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1531341776.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
భాషా సమస్యను భావోద్వేగాలతో చూడొద్దు..
ఏయూక్యాంపస్ (విశాఖతూర్పు): భాషా సమస్యను భావోద్వేగాలతో కాకుండా వాస్తవిక, సామాజిక దృష్టి కోణంలో పరిశీలించాలని ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం, ఆంధ్రప్రదేశ్ హిందీ అకాడమీ అధ్యక్షుడు ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ చెప్పారు. ఏయూ హిందీ విభాగంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. మాతృభాషపై అమితమైన పట్టు సాధించాలని, జాతీయ స్థాయిలో రాణించాలంటే హిందీ, అంతర్జాతీయ స్థాయిలో రాణింపునకు ఆంగ్ల భాష పరిజ్ఞానం అవసరమన్నారు. త్రిభాషా సూత్రాన్ని భారత్‌లో ఎప్పట్నుంచో అమల్లో ఉందని, దానిని పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్‌లో అమలు చేస్తున్నట్టు తెలిపారు. ఇటీవల నిర్వహించిన అధికార భాషా సంఘం సమావేశంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మాట్లాడుతూ హిందీ నేర్చుకోవాలని, పలకరించుకునే సందర్భాల్లో హిందీ భాషను ఉపయోగించాలని చెప్పడంలో తప్పులేదన్నారు. అమెరికాలో 2006లో అప్పటి యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ అధ్యక్షుడు బుష్ నేతృత్వంలో ఐదు విదేశీ భాషలను నేర్చుకోవాలని నిర్ణయం తీసుకుందని, వాటిలో హిందీ ఒకటనే విషయం మరువరాదన్నారు. మైనారిటీ ప్రభుత్వాన్ని పీవీ నరసింహారావు విజయవంతంగా నడిపాడంటే ఆయనకు హిందీ భాష రావడం కూడా ఓ కారణమన్నారు. భాషకు సీఎం జగన్ పట్టాభిషేకం రాష్ట్రంలో ఎన్నడూ ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి భాషల అభివృద్ధికి పాటుబడుతున్నారని యార్లగడ్డ తెలిపారు. తెలుగు అకాడమీని ప్రారంభించడం, అధికార భాషా సంఘాన్ని వెంటనే ఏర్పాటు చేయడం, ఆంగ్ల మాధ్యమాన్ని బోధన భాషగా, ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు తెలుగు చదవాలని, హిందీ అకాడమీ ప్రారంభించడం, ఉర్దూను ద్వితీయ భాషగా బోధించేలా నిర్ణయం తీసుకోవడం వంటివి భాషల వికాసానికి ఉపయుక్తంగా నిలుస్తున్నాయని లక్ష్మీప్రసాద్ వివరించారు. -
ఆధిపత్యధోరణి బెడిసికొట్టడం ఖాయం
సాక్షి, హైదరాబాద్: ‘అన్ని రాష్ట్రాలవారు ఇంగ్లిష్ కాదు, హిందీ మాత్రమే మాట్లాడాలి‘ అని కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. ‘అమిత్ షా గారూ.. భిన్నత్వంలో ఏకత్వమే మన బలం. భారతదేశం రాష్ట్రాల సమాఖ్య. వసుధైక కుటుంబానికి అసలైన నిర్వచనం. ఏం తినాలో, ఏది ధరించాలో, ఎవరిని పూజించాలో, ఏ భాషలో మాట్లాడాలనే అంశాల్లో దేశ ప్రజలకు మనం స్వేచ్ఛ ఎందుకు ఇవ్వకూడదు‘ అని ప్రశ్నించారు. భాషోన్మాదం, ఆధిపత్య ధోరణి ఎదురుతన్నడం ఖాయమని హెచ్చరించారు. ‘మొత్తానికి ప్రధాని మోదీ నాయకత్వంలో భారత్ నంబర్ వన్ స్థానానికి చేరింది. డాలర్ విలువ, కొనుగోలు శక్తి తదితరాలతో పోల్చి చూస్తే ఎల్పీజీ సిలిండర్ ధరల్లో భారత్ ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉంది. పెట్రోల్, డీజిల్ ధరల్లో మూడు, ఎనిమిదో స్థానంలో ఉంది‘ అని కేటీఆర్ మరో ట్వీట్లో వ్యంగ్యాస్త్రాలు విసిరారు. -
KTR: అమిత్ షాకు కేటీఆర్ కౌంటర్
సాక్షి, హైదరాబాద్: బీజేపీ, టీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ట్విట్టర్లో కౌంటర్ ఇచ్చారు. శనివారం ట్విట్టర్ వేదికగా.. దేశంలో ఏ భాష మాట్లాడాలో దేశ ప్రజలను ఎందుకు నిర్ణయించుకోనివ్వకూడదు. భాషా దురాభిమానం, ఆధిపత్యం బూమరాంగ్ అవుతుంది. ఏం తినాలో, ఏం వేసుకోవాలో, ఎవరిని ప్రార్థించాలో మీరే చెబుతారా..? రాష్ట్రాల సమాఖ్య నిజమైన వసుధైక కుటుంబం. నేను మొదట భారతీయుడిని. ఆ తర్వాతే గర్వించదగ్గ తెలుగువాడిని, తెలంగాణ వ్యక్తిని. నా మాతృభాష తెలుగు. ఇంగ్లీష్, హిందీ, కొంచెం ఉర్దూలో కూడా మాట్లాడగలను. దేశంలో హిందీని మాత్రమే మాట్లాడాలి అనడం, ఇంగ్లీష్ భాషను నిషేధించడం వంటివి యువతకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయి’’ అని అన్నారు. Unity in diversity is our strength dear @AmitShah Ji. India is a union of states & a true ‘Vasudhaika Kutumbam’ Why don’t we let people of our great nation decide what to eat, what to wear, who to pray to and what language to speak! Language chauvinism/hegemony will boomerang pic.twitter.com/AwMae3Clra — KTR (@KTRTRS) April 9, 2022 అంతకు ముందు అమిత్ షా.. వేర్వేరు రాష్ట్రాలకు చెందిన ప్రజలు మాట్లాడుకొనేప్పుడు ఇంగ్లీష్, స్థానిక భాషల్లో కాకుండా హిందీలోనే తప్పక మాట్లాడాలని పిలుపునివ్వడం తీవ్ర వివాదాస్పదమైంది. ఇది ‘భారతదేశ భిన్నత్వంపై దాడి’ అని ప్రతిపక్షాలు విమర్శించాయి. -
అమిత్ షాకు ఏఆర్ రెహమాన్ కౌంటర్!
బీజేపీ సీనియర్ నేత, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ‘హిందీ కామెంట్లు’ సోషల్ మీడియాలో సెగలు పుట్టిస్తున్నాయి. వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రజలు.. ఒకరినొకరు హిందీలోనే పలకరించుకోవాలని, ఇంగ్లిష్‌లో సంభాషించుకోవడానికి వీల్లేదంటూ వ్యాఖ్యానించారు షా. ఈ కామెంట్లపై వ్యతిరేకత మొదలుకాగా, మరోవైపు రాజకీయమైన విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సంగీత దర్శకుడు, ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సదరు వ్యాఖ్యలపై ఒక ఫొటోతో అమిత్ షా కామెంట్లకు కౌంటర్ ఇచ్చారు. ‘ప్రియమైన తమిళం..’ అంటూ భాషాభిమానం ప్రదర్శిస్తూ ఓ ఫొటోను షేర్ చేశారాయన. ఆ ఫొటో తమిళ దేవతకు చెందింది. ట్విటర్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ మూడింటిలోనూ ఆయన ఆ ఫొటోను షేర్ చేశారు. లెజెండరీ సంగీత దర్శకుడు ఎంఎస్ విశ్వనాథన్ కంపోజ్ చేసిన, మనోమణియమ్ సుందరం పిళ్లై రాసిన తమిళ జాతీయ గీతంలోని పదాలను ఆ ఫొటోపై ఉంచారు ఏఆర్ రెహమాన్. మన ఉనికికి మూలం ప్రియమైన అని 20వ తమిళ కవి భరతిదశన్ రాసిన ‘తమిళియక్కమ్’ కవితా సంకలనంలోని ఓ లైన్‌ను ఆ ఫొటోపై క్యాప్షన్‌గా ఉంచారాయన. pic.twitter.com/W9PDIwHigy — A.R.Rahman (@arrahman) April 8, 2022 అయితే రెహమాన్ ఇలా భాషకు సంబంధించిన చర్చల్లో.. కామెంట్ చేయడం ఇదేం కొత్త కాదు. జూన్ 2019లో ప్రతి రాష్ట్రంలోనూ మూడు భాషల పాలసీని తప్పనిసరి చేయాలంటూ కేంద్రం ఓ ప్రతిపాదన సిద్ధం చేసింది. ఆ టైంలో ‘అటానమస్’ కేంబ్రిడ్జి డిక్షనరీలోని పదం అంటూ ట్వీట్ చేసి.. తమిళనాడు అటానమస్ #autonomousTamilNadu హ్యాష్‌ట్యాగ్ ద్వారా పెద్ద చర్చకే దారి తీశారు. అలాగే హిందీ కంపల్సరీ అనే ప్రతిపాదనను సైతం కేంద్రం వెనక్కి తీసుకున్నప్పుడు.. మంచి నిర్ణయం. హిందీ తమిళనాడులో తప్పనిసరేం కాదు అంటూ మరో ట్వీట్ చేశారు ఏఆర్ రెహమాన్. AUTONOMOUS | meaning in the Cambridge English Dictionary https://t.co/DL8sYYJqgX — A.R.Rahman (@arrahman) June 4, 2019 గురువారం జరిగిన పార్లమెంటరీ అధికార భాషా కమిటీ 37వ సమావేశంలో అమిత్ షా మాట్లాడుతూ.. ప్రభుత్వాన్ని నడిపే మాధ్యమమే అధికార భాష అని, దీని వల్ల హిందీకి ప్రాధాన్యత పెరుగుతుందని ప్రధాని నరేంద్ర మోదీ నిర్ణయించారని చెప్పారు. అంతేకాదు ఇకపై దేశం ఐక్యంగా ఉండాలంటే ఇతర రాష్ట్రాల వాళ్లు హిందీలోనే మాట్లాడుకోవాలంటూ సూచించారాయన. ఈ వ్యాఖ్యలపై వరుసగా కౌంటర్లు పడుతూనే ఉన్నాయి. బీజేపీ ప్రభుత్వం దేశ ‘బహుత్వ గుర్తింపు’ను దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తోందని, షా కామెంట్లు ఐక్యత్వాన్ని దెబ్బ తీసేలానే ఉన్నాయని పేర్కొన్నారు తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్. చదవండి: సారూ అదేం పని.. సోషల్ మీడియాలో ట్రోలింగ్! -
చైనాతో కటీఫ్.. భారత్‌తో దోస్తీ!
ప్రముఖ సాఫ్ట్వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ఆధ్వర్యంలోని ‘లింక్డిన్’ అడుగులు భారత్ వైపు పడ్డాయి. హిందీ మాట్లాడేవాళ్ల కోసం లింక్డిన్‌ని హిందీ భాషలో అందుబాటులోకి తెచ్చింది. ప్రొఫెషనల్ నెట్‌వర్క్‌లలో టాప్ పొజిషన్లో ఉన్న లింక్డిన్.. గురువారం నుంచి హిందీ సేవలను ప్రారంభించినట్లు పేర్కొంది. తద్వారా ప్రపంచవ్యాప్తంగా 25 ప్రధాన భాషల్లో సేవలు అందిస్తున్నట్లయ్యింది. మొబైల్, డెస్క్‌టాప్ వెర్షన్లలో లింక్డిన్ మెంబర్స్ ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చు. చైనాతో పొసగకే! ఇదిలా ఉంటే చైనా ప్రభుత్వం ఆంక్షల వల్ల వరుసగా ఎంఎన్‌సీలు ఆ దేశాన్ని వీడుతున్న విషయం తెలిసిందే. ఈ దెబ్బకు చైనాలో మిగిలిన ఏకైక అతిపెద్ద విదేశీ కంపెనీ మైక్రోసాఫ్ట్. అయితే ఆ నిబంధనల వల్ల లింక్డిన్ నిర్వహణ కష్టసాధ్యంగా మారిందని ప్రకటించుకున్న విషయం తెలిసిందే. అయితే 54 మిలియన్ల యూజర్ల కోసం.. ఇన్జాబ్స్ (లింక్డ్ ఇన్‌లో మాదిరి యూజర్లు తమ అభిప్రాయాలను పంచుకొలేరు) పేరుతో ఓ ప్రత్యామ్నాయ వేదికను ఏర్పాటు చేయించింది. ఈ తరుణంలో చైనాను వీడేందుకే.. భారత్ వైపు అడుగులు వేస్తోందని, ఇందులో భాగంగానే ఇక్కడి యూజర్లను ఆకర్షించేందుకే ‘హిందీ’ అడుగు వేసినట్లు విశ్లేషిస్తున్నారు. ఇక లాక్‌డౌన్‌తో సంబంధం లేకుండా.. గత మూడేళ్లలో 20 మిలియన్ల మంది లింక్డిన్ యూజర్లు పెరిగారు భారత్‌లో. దీంతో భారత్‌లో యూజర్లను పెంచుకునేందుకు ఉవ్విళ్లూరుతోంది మైక్రోసాఫ్ట్. బిజినెస్ అండ్ ఎంప్లాయిమెంట్ ఒరియెంటెడ్ ఆన్లైన్ సర్వీస్ ‘లింక్డిన్’.. 2003లో మే5న అమెరికా నుంచి తన కార్యకలాపాల్ని ప్రారంభించింది. వెబ్సైట్, యాప్‌ల రూపంలో సర్వీసులు అందిస్తోంది. ఇక 2014లో చైనాలో కార్యకలాపాల్ని ప్రారంభించిన లింక్డిన్.. అమెరికా తర్వాత చైనాలోనే అతిపెద్ద మార్కెట్‌ను కలిగి ఉంది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో చైనా మార్కెట్ నుంచి నెమ్మదిగా జరుగుతూ.. భారత్‌కు చేరువవుతుండడం విశేషం. చదవండి: చైనా ముందే చెప్పింది.. అయినా వినలేదు! -
అక్కడ ఇంగ్లిష్! ఇక్కడేమో హిందీనా?
భారతదేశంలో ఇంగ్లిష్ భాష జీవం పోసుకొని 2021 అక్టోబర్ 5 నాటికి 204 ఏళ్లవుతుంది. ఇంగ్లిష్ వల్లే, ప్రపంచం నలుమూలల్లో ఉన్న మానవులు మరింతగా అనుసంధానమయ్యారు. పరస్పరం జ్ఞానాన్ని పెంచుకున్నారు. కానీ కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో, విద్యా సంస్థల్లో పీహెచ్డీ సిద్ధాంత పత్రాలను కూడా హిందీలోనే రాసి సమర్పించేలా హిందీని బోధనా మాధ్యమంగా మార్చేందుకు బీజేపీ నేతృత్వంలోని కేంద్రప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అదేసమయంలో ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు, విద్యా సంస్థలు, పాఠశాలలు, కాలేజీల్లో ఇంగ్లిష్‌నే బోధించేలా, పరిశోధనను కూడా ఇంగ్లిష్‌లోనే చేసేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధానాలు రూపొందించాయి. ఇది దళిత, బీసీ, శూద్ర, ఆదివాసీ యువతకు ఇంగ్లిష్‌ను దూరం చేయడంలో భాగమే. భారతదేశంలో ఇంగ్లిష్ భాష జీవం పోసుకొని 2021 అక్టోబర్ 5 నాటికి 204 సంవత్సరాలవుతుంది. ప్రతి ఏటా ఆ రోజున భారతీయ ఇంగ్లిష్ దినోత్సవం ఘనంగా జరుపుకోవడం గత కొన్నేళ్లుగా కొనసాగుతోంది. 1817 అక్టోబర్ 5న కోల్‌కతాలో మొట్టమొదటి ఇంగ్లిష్ మీడియం పాఠశాల ప్రారంభమైంది మొదలుకొని ఇంగ్లిష్ భాషను లేకుండా చేయడానికి భారతదేశం ఎన్నడూ అనుమతించలేదు. ఇండియాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగానూ నేడు ఇంగ్లిష్ వృద్ధి చెందుతోంది. ఇంగ్లిష్ మాట్లాడే దేశాలను సవాలు చేస్తున్న చైనా... మాండరిన్ భాషతో పాటు ఇంగ్లిష్‌ని కూడా తన సొంతం చేసుకుంది. భారత్, చైనా రెండూ తమ మాతృభాషలతోపాటు ఇంగ్లిష్‌ని తమ పిల్లలందరికీ బోధించినట్లయితే, (ఉదాహరణకు తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లాగా) ఎవరూ ఊహించలేనంత వేగంగా అది అంతర్జాతీయ అనుసంధానాన్ని, శాస్త్ర పరిజ్ఞానాన్ని మార్చివేస్తుంది. చాలా కాలం క్రితం ఒక ఇజ్రాయెల్ ప్రవక్త, ప్రపంచమంతా ఒకే భాషను మాట్లాడే రోజు వస్తుందని జోస్యం చెప్పారు. అయితే ఆ భాష ఏది అని ఆయన అప్పట్లో చెప్పలేదు. ఇప్పుడు ఆ భాష ఇంగ్లిషేనని మనం చెప్పవచ్చు. భూమండలంలోని అత్యధిక సంఖ్యాక ప్రజలు మాట్లాడుతున్న, రాస్తున్న, అర్థం చేసుకుంటున్న భాష ఇంగ్లిష్ మాత్రమే. ప్రపంచంలో మాట్లాడే, రాసే భాషలకు నాలుగు వేల సంవత్సరాల చరిత్ర ఉంది. అయితే ఇంగ్లిష్ వల్లే, ప్రపంచం నలుమూలల్లో ఉన్న మానవులు మరింతగా అనుసంధానమయ్యారు. పరస్పరం జ్ఞానాన్ని పెంచుకున్నారు. మానవ చరిత్రలో ఇంతకుముందెన్నడూ ఇలాంటి గుణాత్మక మార్పు జరగలేదు. చరిత్రలో చాలాకాలం పాటు అనేక తెగలు అతి చిన్న బృందాలతో భావవ్యక్తీకరణ చేసుకునే భాషా యంత్రాంగాలతో జీవించేవి. ఒకే ప్రాంతంలో లేదా ఒకే దేశంలోని ఇతర భాషా బృందాలతో ఇవి వ్యక్తీకరణ సామర్థ్యాన్ని కలిగి ఉండేవి కాదు. కానీ ప్రపంచంలోని ప్రతి దేశంలోనూ ఇలాంటి పరిమిత స్థాయిలోని అనేక బృందాల్లోకి ఇప్పుడు ఇంగ్లిష్ భాష కొద్దో గొప్పో చొచ్చుకుపోయింది. ఇలాంటి అనేక భాషా బృందాలకు పదాలు, వాక్యాల రూపంలో చేరువైన ఇంగ్లిష్ భాష... వారిని ఇంతవరకు తమకు తెలియని స్థలాల్లోని పెద్ద పెద్ద మార్కెట్లతో కూడా భావ ప్రసారం జరుపుకొనేలా చేసింది. పరస్పరం భావ వ్యక్తీకరణ, భావ ప్రసారం చేసుకోలేని వేలాది చిన్న చిన్న భాషా బృందాల ఉనికికి భారతదేశం ఒక ప్రామాణిక ఉదాహరణగా నిలుస్తుంది. తమకు సమీపంలోనే ఉంటున్న ఇతర భాషా బృందాలకు, పట్టణ మార్కెట్లకు పెద్దగా పరిచయం కాకుండానే మనుగడ సాగిస్తున్న తెగలు, పర్వత ప్రాంతాల్లో నివసించే భాషా బృందాలు భారతదేశంలో అనేకం ఉన్నాయి. ఇతర సంస్కృతులకు, జీవన విధానాలకు పరిచయం కాకుండానే నివసిస్తున్న భారతీయ ఉత్పాదక ప్రజారాశులకు భాషే ప్రధాన అవరోధం. కానీ కేవలం 200 సంవత్సరాలలోపే ఈ భాషాపరమైన అవరోధాన్ని ఇంగ్లిష్ తొలగించివేసింది. ప్రత్యేకించి గత 30 ఏళ్లుగా ప్రపంచీకరణ, దేశ ప్రజలను ప్రపంచ మార్కెట్లతో అనుసంధానించడంతో ప్రజల భావ వ్యక్తీకరణలో చాలా మార్పులొచ్చాయి. పాఠశాలల్లో విద్యార్థులకు క్రమబద్ధమైన ఇంగ్లిష్ నేర్పింది ప్రభుత్వాలు కాదు. ప్రపంచవ్యాప్తంగా నిరక్షరాస్యులకు, వివిధ భాషా బృందాలకు ఇంగ్లిష్ నేర్పుతూవచ్చింది మార్కెట్ మాత్రమే. ఒక భాషగా ఇంగ్లిష్‌ని మాట్లాడటం, రాయడం తెలీనప్పటికీ సమాజానికీ లేదా మార్కెట్‌కీ ప్రాణాధారమైన విషయాలను మనం ఇంగ్లిష్ ద్వారానే తెలుసుకుంటూ వస్తున్నాము. ఆ భాష తెలీకున్నా వాటర్, ఫుడ్, బస్, ట్రెయిన్, సాల్ట్, రైస్, టికెట్, మిల్క్, టీ, బెడ్, ఫోన్, లిక్కర్, ప్లేట్ వంటి ఎన్నో ఇంగ్లిష్ పదాలను మనం సాధారణ అవగాహనతో అర్థం చేసుకుంటున్నాము. ప్రపంచంలోని నలుమూలల్లో ఇంగ్లిష్ ఇలాంటి పదాలతో చొచ్చుకుపోయింది. అత్యంత వెనుకబడిన ప్రాంతంలోని తెలుగు మాట్లాడే ఓ కుగ్రామంలోని సగటు నిరక్షరాస్యుడైన కూలీకి కూడా ఇప్పుడు కనీసం 250 నుంచి 300 వరకు ఇంగ్లిష్ పదాలు తెలుసు. దేశవ్యాప్తంగా రిక్షా తోలేవారు, ఆటో డ్రైవర్లు, టాక్సీ డ్రైవర్లు, ధాన్యం, కూరగాయలు అమ్మేవారు, కార్మికులకు కూడా ఇంగ్లిష్ పదాలతో పరిచయమైపోయింది. మరే స్థానికేతర భాషా పదాలు కూడా ఇంగ్లిష్ లాగా జనజీవితంలో ఈ స్థాయిలో ప్రవేశించలేదు. భారతదేశంలో ఎక్కువమంది ప్రజలు మాట్లాడే, రాసే భాష హిందీ అని తెలుసు. కానీ దేశం నలుమూలల్లో హిందీ కంటే ఎక్కువగా ఇంగ్లిష్ పదాలే ఎక్కువ మంది ప్రజల వాడుకలోకి వచ్చేశాయి. వివిధ యాసలతో కూడిన సాధారణ సంభాషణకు సంబంధించి 250 నుంచి 300 పదాలను తెలుసుకుంటే చాలు... మనకు తెలియని మార్కెట్లో కూడా ఇతరులతో భావ వ్యక్తీకరణ సాధ్యమవుతుంది. కాబట్టి భారతీయ గ్రామం నుంచి ఒక కూలీని మనం ఆఫ్రికన్ లేదా లాటిన్ అమెరికన్ దేశంలోకి పంపించినట్లయితే, అక్కడి స్థానిక భాషను నేర్చుకోకపోయినా అతిముఖ్యమైన ఇంగ్లిష్ మార్కెట్ పదాల సహాయంతో వాళ్లు ఆ దేశాల్లో మనగలుగుతారు. ఇక స్థానిక భాషను కూడా నేర్చుకుని ఇంగ్లిష్‌ని మెరుగుపర్చుకుంటే మరింత మెరుగ్గా జీవించగలరు. కొన్ని పదాలను తెలుసుకోవడం ద్వారా యావత్ ప్రపంచంలో ఇంత సులభంగా జీవించగల, మనుగడ సాధించగల అవకాశాన్ని ఇంగ్లిష్ తప్ప మరే భాషా కల్పించడం లేదు. ఇంగ్లిష్ పదాలు, భాష ప్రపంచంలోని నలుమూలలకు ఇంత విస్తృతంగా ఎలా విస్తరించాయి అంటే ప్రపంచీకరణ మార్కెట్టే అని చెప్పాలి. చారిత్రకంగా సంస్కృతంపై నియంత్రణ సాధిస్తూవచ్చిన బ్రాహ్మణులు, ఇతర ద్విజ కులస్థులు... ఇప్పుడు వారు ఏ పార్టీలో లేదా ఏ సంస్థలో ఉన్నప్పటికీ ఇంగ్లిష్‌పై అదుపు సాధించేందుకు ప్రయత్నిస్తున్నారు. పురాతనకాలంలో సంస్కృతం లాగా, నాణ్యమైన ఇంగ్లిష్ ఇప్పటికే వీరికి ఆలంబనగా మారిపోయింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేసిన ఇటీవలి స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగం ద్వారా రాష్ట్రీయ స్వయం సేవక్, భారతీయ జనతా పార్టీలు ఒక విషయాన్ని స్పష్టం చేశాయి. అదేమిటంటే శూద్రులు, దళితులు, ఆదివాసీలు, ఇతర పేదప్రజల పిల్లలు మాతృభాషలోనే చదువుకోవాలట! ఇంగ్లిషేతర భాషే విద్యా మాధ్యమంగా ఉండాలట! చివరకు కేంద్ర విశ్వవిద్యాలయాల్లో, విద్యా సంస్థల్లో పీహెచ్డీ సిద్ధాంత పత్రాలను కూడా హిందీలోనే రాసి సమర్పించేలా హిందీని బోధనా మాధ్యమంగా మార్చేందుకు బీజేపీ నేతృత్వంలోని కేంద్రప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అదేసమయంలో ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు, విద్యా సంస్థలు, పాఠశాలలు, కాలేజీల్లో ఇంగ్లిష్‌నే బోధించేలా, పరిశోధనను కూడా ఇంగ్లిష్‌లోనే చేసేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధానాలు రూపొందించాయి. దేశంలో అగ్రవర్ణాల (బ్రాహ్మణులు, బనియాలు, కాయస్థులు, ఖాత్రీలు, క్షత్రియులు) యాజమాన్యంలోని గుత్త పారిశ్రామిక కంపెనీలు అశోక, అమిటీ, ఓపీ జిందాల్ వంటి అత్యున్నత ప్రైవేట్ విశ్వవిద్యాలయాలను నెలకొల్పాయి. ఇవి ఇంగ్లిష్ మాధ్యమంలో బోధించేందుకు యూరో–అమెరికన్ సిలబస్‌ని చేపడుతున్నాయి. మరోవైపున ప్రభుత్వ విద్యాసంస్థలన్నింటినీ ప్రాంతీయ భాషలో ప్రధానంగా హిందీ మీడియంలో బోధన చేసేలా కేంద్ర ప్రభుత్వం పథక రచన చేస్తోంది. దీని పర్యవసానంగా దళితులు, ఓబీసీలు, శూద్రులు, ఆదివాసీ యువత పూర్తిగా చలనరహితంగా ఉండిపోతారు. మెరుగైన విద్యా, జీవన అవకాశాల కోసం ఇక వారు ఎక్కడికీ వెళ్లలేరు. ఉత్పాదక కులాల నుంచి ఇంగ్లిష్ చదవగల, రాయగల మేధావులు ఉద్భవించకూడదని ఆర్ఎస్ఎస్, బీజేపీ కోరుకుంటున్నాయి. కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, విద్యా సంస్థల్లో చదువుకుంటున్న యువత భారతీయ ఇంగ్లిష్ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవాలి. సంపన్న అగ్రవర్ణ యువతతో సమానంగా అంతర్జాతీయ భాషను నేర్చుకుంటున్న దళిత, ఆదివాసీ, శూద్ర యువతకు వ్యతిరేకంగా పథక రచన చేస్తున్న శక్తులను ఆ విధంగా ఓడించగలగాలి. ప్రొ. కంచ ఐలయ్య షెపర్డ్ వ్యాసకర్త ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త -
యూనియన్ బ్యాంకుకు రాజభాష కీర్తి పురస్కారం
న్యూఢిల్లీ: హిందీ భాషను విజయవంతంగా అమలు చేసినందుకు 2018–19, 2019–20, 2020–21 సంవత్సరాలకు గాను యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియా ‘రాజభాష కీర్తి పురస్కార్’ను దక్కించుకుంది. బ్యాంకు ఎండీ, సీఈవో రాజ్‌కిరణ్ రాయ్ బుధవారం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని అందుకున్నారు. నేషనలైజ్డ్ బ్యాంకు విభాగంలో.. 2019–20లో మొదటి బహుమతిని, 2020–21 లో తృతీయ బహుమతిని అందుకుంది. హౌస్ మేగజైన్ విభాగంలో 2018–19లో.. సంస్థ అంతర్గత మేగజైన్ ‘యూనియన్ శ్రీజన్’కు రెండో బహుమతి లభించింది. ఇలా అధికారిక భాష అమలులో 5 అవార్డులను దక్కించుకున్నట్టు యూనియన్ బ్యాంకు ప్రకటించింది. -
తమిళనాడులో హిందీ దుమారం
సాక్షి, చెన్నై: రాష్ట్రంలో మళ్లీ హిందీ భాష వివాదాన్ని రేపింది. ఆయుష్మాన్ భారత్ కార్యదర్శి రాజేష్ కోట్చే తీరుపై తమిళ పార్టీలు, సంఘాలు తీవ్రంగా ధ్వజమెత్తుతున్నాయి. ఈ వ్యవహారంపై సీఎం స్పందించాలని డిమాండ్ చేస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం హిందీ రాదన్న కారణంగా సీఐఎస్ఎఫ్ అధికారి డీఎంకే ఎంపీ కనిమొళిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన విషయం తెలిసిందే. ఈ పరిస్థితుల్లో తమిళ డాక్టర్లను అవమానించేలా ఆయుష్మాన్ భారత్ కార్యదర్శి రాజేష్ కోట్చే వ్యవహరించిన తీరు తమిళనాట ఆగ్రహాన్ని రేపింది. తమకు హిందీ రాదని, ఆంగ్లంలో ప్రసంగించాలని తమిళ డాక్టర్లు విజ్ఞప్తి చేశారు. హిందీ రాకుంటే బయటకు వెళ్లాలని రాజేష్ కొట్చే హెచ్చరించడాన్ని తమిళులు తీవ్ర అవమానంగా భావిస్తున్నారు. ఇంకెంత కాలం ఈ అవమానం రాజేష్‌పై తమిళనాడు నేతలు, తమిళాభిమానులు మండి పడుతున్నారు. డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్, ఎండీఎంకే నేత వైగో, ఎంపీ కనిమొళి, తమిళనాడు కాంగ్రెస్ అధ్యక్షుడు కేఎస్ అళగిరి, తమిళ మానిల కాంగ్రెస్ అ«ధ్యక్షుడు, ఎంపీ జీకే వాసన్, డీఎండీకే అధినేత విజయకాంత్ దీనిపై స్పందించారు. ఆంగ్లం రాని వ్యక్తిని కార్యదర్శిగా ఎలా నియమించారని ›ప్రశ్నించారు. ఇంకెంత కాలం తమిళుల్ని అవమానిస్తారని ధ్వజమెత్తారు. చర్యలకు కేంద్రానికి సిఫారసు చేయాలని పట్టుబట్టారు. డీఎంకే ఎంపీ కనిమొళి, ధర్మపురి ఎంపీ సెంథిల్ కుమార్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. సినీ రచయిత వైరముత్తు సైతం ఖండించారు. సీఎం దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకునే చూస్తామని మంత్రి సెల్లూరురాజు అన్నారు. -
ఆమెకు హిందీ తెలుసు; నిజంగా సిగ్గుచేటు!
చెన్నై: ‘‘నాకు హిందీ మాట్లాడటం వచ్చా? రాదా? అన్నది కాదు ఇక్కడ సమస్య. హిందీ వస్తేనే నన్ను భారతీయురాలిగా గుర్తిస్తాననడం సిగ్గుచేటు’’ అంటూ డీఎంకే నేత, లోక్‌సభ ఎంపీ కనిమొళి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో హిందీ అనువాదకురాలిగా పనిచేశారంటూ తన గురించి వ్యాఖ్యలు చేసిన బీజేపీ నేత హెచ్ రాజా తీరుపై మండిపడ్డారు. హిందీ భాషకు జాతీయతకు ముడిపెట్టడం సరికాదంటూ హితవు పలికారు. కాగా కేరళలోని కోళీకోడ్ ఎయిర్‌పోర్టు వద్ద ఎయిరిండియా విమాన ప్రమాద ఘటన నేపథ్యంలో అక్కడికి వెళ్లిన కనిమొళికి చేదు అనుభవం ఎదురైన విషయం తెలిసిందే. అక్కడ విధులు నిర్వర్తిస్తున్న సీఐఎస్ఎఫ్కు చెందిన ఓ మహిళా జవాను ‘మీరు భారతీయులేనా?’అని తనను ప్రశ్నించినట్లు ఈ తూతుక్కుడి ఎంపీ ట్విటర్ వేదికగా వెల్లడించారు. హిందీ భాష వ్యతిరేకోద్యమానికి నిలయమైన తమిళనాడులో ఈ విషయంపై ఆగ్రహజ్వాలలు వ్యక్తమయ్యాయి. రాజకీయ దుమారం రేగింది.(ఎన్ఈపీ 2020: తమిళనాడు కీలక నిర్ణయం) ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నేత పి. చిదంబరం, ఆయన కుమారుడు కార్తి చిదంబరంతో పాటు పలువురు తమిళనేతలు సీఎస్ఐఎఫ్ తీరును ఖండిస్తూ ఆమెకు మద్దతు తెలిపారు. అయితే తమిళనాడు బీజేపీ నేత హెచ్ రాజా మాత్రం కనిమొళి ట్వీట్‌పై అనుమానాలు వ్యక్తం చేశారు. ‘‘భారత ఉప ప్రధాని దేవీలాల్ తమిళనాడుకు వచ్చినపుడు ఆయన హిందీ ప్రసంగాన్ని కనిమొళి తమిళంలోకి అనువదించారు. కాబట్టి తనకు హిందీ తెలియదని చెప్పడం పచ్చి అబద్ధం అని తేలింది. ఎన్నికలు ఇంకా సమీపించలేదు కదా’’అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. (కేరళలో కనిమొళికి చేదు అనుభవం) ఇందుకు ఆమె సైతం అదే స్థాయిలో ఘాటుగా బదులిచ్చారు. బుధవారం విలేకరులతో మాట్లాడుతూ.. ‘‘ నేనెవరికీ హిందీ అనువాదకురాలిగా పనిచేయలేదు. తెలియని భాషలో నేనెలా మాట్లాడగలను? నా విద్యాభ్యాసం అంతా తమిళ, ఆంగ్ల భాషల్లోనే సాగింది. ఢిల్లీలో ఉన్నా నాకు హిందీ రాదు. ఈ విషయం చాలా మంది రాజకీయ నాయకులకు కూడా తెలుసు. అయినా ఇక్కడ సమస్య భాష గురించి కాదు. భాషను జాతీయతతో ముడిపెట్టడం గురించి. ఒకే భాష, ఒకే మతం, ఒకే సిద్ధాంతం పాటిస్తేనే భారతీయులా. ఈ విషయాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నా. కొందరు ఈ విషయం గురించి రాజకీయం చేయడం సిగ్గుమాలిన చర్య’’ అంటూ కనిమొళి కౌంటర్ ఇచ్చారు. -
నన్ను ఎగతాళి చేశారు
సినిమా: హిందీ భాషపై నటి కంగనారనౌత్ ప్రేమను ఒలకబోస్తోంది. ఆంగ్లం వద్దు హిందీనే ముద్దు అని అంటోంది. ఏదో ఇక చర్చనీయాంశ వ్యాఖ్యలతో వార్తల్లో ఉండడం ఈ అమ్మడి నైజంగా మారింది. బాలీవుడ్లో ప్రముఖ కథానాయకిగా వెలిగిపోతున్న ఈ జాణ ఇప్పటికే కోలీవుడ్, టాలీవుడ్‌ల్లో నటించేసింది. తాజాగా హిందీ చిత్రం పంగాతో తెరపైకి రానుంది. కాగా త్వరలో మరోసారి తలైవి చిత్రం ద్వారా ఉత్తరాదితో పాటు దక్షిణాది ప్రేక్షకులను అలరించడానికి సిద్ధం అవుతోంది. అవును ప్రఖ్యాత నటీమణి, దివంగత ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్‌లో నటిస్తోంది. ఇందుకోసం తగిన శిక్షణ కూడా తీసుకున్నట్లు కంగనారనౌత్ పేర్కొంది. కాగా ఇటీవల హిందీ భాషాదినోత్సం సందర్భంగా ఒక వీడియోను సామాజిక మాధ్యమాలకు విడుదల చేసింది. धन्यवाद करते है उन सब का जिन्होंने हमारे साथ अंग्रेज़ी से #पंगा लिया। ये रहे उन प्रश्नों के जवाब! कितने सही मिले आपको? हमें बताये!#KanganaRanaut #PangaStories #Panga#विश्व_हिंदी_दिवस pic.twitter.com/5g7P3v68NP — Team Kangana Ranaut (@KanganaTeam) January 11, 2020 అందులో హిందీ మన జాతీయ భాష అని అయితే ఈ భాషలో మాట్లాడడానికి మన దేశం చాలా సంకోచిస్తోందని పేర్కొంది. ఆంగ్ల భాషకు చెందిన ఏబీసీడీలను నమ్మకంగా చెబుతున్నారని, అదే హిందీ భాషలో మాట్లాడడానికి సంకట పడుతున్నారని అంది. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలు ఆంగ్ల భాషను బ్రహ్మాండంగా మాట్లాడుతున్నారని ఆనందపడుతున్నారని, మరి కొందరు తమ ఆంగ్ల భాష బలహీనంగా ఉందని అవమానంగా భావిస్తున్నారని అంది. అయితే అలాంటి పరిస్థితే హిందీ భాషలో ఉంటే కించిత్ కూడా చింతించడం లేదని అంది. సినిమా వర్గం తన ఆంగ్ల భాష ఉచ్చారణను చూసి ఎగతాళి చేశారని చెప్పింది. తాను మాత్రం హిందీ భాషకే ప్రాముఖ్యతనిస్తున్నానని చెప్పింది. తద్వారా తాను ఉన్నత స్థాయికి చేరుకోగలనని, సక్సెస్‌లు అందుకోగలనని చెప్పింది. ఈ సందర్భంగా తల్లిదండ్రులకు తాను చెప్పేదొక్కటేనని మీ పిల్లలకు హిందీ భాషను నేర్పించండి అని చెప్పింది. దేశీయ నూనెతో చేసే పరోటా రుచి పిజ్జా, బర్గర్లలో ఉండదని అంది. అదేవిధంగా మా (అమ్మ)లో ఉన్న మాధుర్యం మామ్‌లో ఉండదని కంగనారనౌత్ పేర్కొంది. ఈ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. -
హిందీ ఆధిపత్యం ప్రమాదకరం
కొన్ని వారాల క్రితం అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉండే సిలికాన్ వ్యాలీ ఏరియాలోని పలు ప్రాంతాల్లో నేను ఉపన్యాసాలు ఇస్తూ గడిపాను. ఇది ప్రపంచ ఐటీ హబ్ అనీ, గత కొంతకాలంగా అపెల్ ఫోన్, గూగుల్ తదితర అత్యంత ప్రముఖ సంస్థల ఆవిష్కరణలకు కేంద్రమనీ మనందరికీ తెలుసు. ఇంటర్నెట్ విప్లవానికి దారితీసిన ఎలెక్ట్రానిక్స్ రంగంలో అనేక నూతన ఆవిష్కరణలు ఈ ప్రాంతంలోనే చోటు చేసుకున్నాయి. సిలికాన్ వ్యాలీలోని ఐటీ, ఎలెక్ట్రానిక్ ఇంజనీరింగ్‌కి సంబంధిం చిన వివిధ రంగాల్లో దక్షిణ భారతీయులు ఉత్తర భారతీయుల కంటే అధికంగా ఉన్నారు. ప్రముఖ ఐటీ, ఎలెక్ట్రానిక్ కంపెనీల్లో హిందీ కౌ–బెల్ట్ (హిందీ భాషా ప్రాంతం) అని చెబుతున్న ఉత్తర భారతీయుల ప్రాతినిధ్యం చాలా తక్కువ. అమెరికాలోని అతి పెద్ద ఐటీ కంపెనీల్లో ఇద్దరు అత్యున్నత స్థాయి ఎగ్జిక్యూటివ్‌లు సత్య నాదెళ్ల, సుందర్ పిచాయ్ దక్షిణ భారతదేశం నుంచే వచ్చారు. ఎందుకు? హిందీ వల్ల కాకుండా ఇంగ్లిష్ వల్లే ఇది సాధ్యమైంది. దక్షిణ భారతీయులు తమ ప్రాంతీయ భాషలైన తమిళం, మలయాళం, తెలుగు, కన్నడ భాషలతో పాటు ఇంగ్లిష్‌ని ప్రత్యేక శ్రద్ధతో నేర్చుకుంటారు. ఇ.వి. రామస్వామి నాయకర్ ప్రారంభించిన హిందీ వ్యతిరేక ద్రవిడ కజగం ఉద్యమం వల్ల తమిళనాడులో హిందీని పూర్తిగా త్యజించి ప్రధానంగా రెండు భాషలనే నేర్చుకోవడం మొదలైంది. కేరళలో అధిక సంఖ్యలో క్రిస్టియన్ ఇంగ్లిష్ మీడియం పాఠశాలలున్న కారణంగా హిందీని తోసిపుచ్చి ఇంగ్లిష్ మీడియంనే ముందుకు తీసుకుపోయే తనదైన మోడల్ని అభివృద్ధి పర్చుకున్నారు. ఇక తమిళనాడు, కేరళ నమూనాలతో తెలుగు రాష్ట్రాలు, కర్ణాటక కూడా ప్రభావితమయ్యాయి. భారతదేశంలో మొట్టమొదటి దళిత రాష్ట్రపతి కేఆర్ నారాయణన్, భారతదేశ మొట్టమొదటి దళిత ప్రధాన న్యాయమూర్తి కేజీ బాలకృష్ణన్ కేరళ నుంచే వచ్చారు. వారు ఏదో ఆయాచితంగా ఎన్నికైన వారు కాదు. అత్యున్నత స్థానాలకు చేరుకోవడానికి ముందే వారు ఎంతో పేరు పొందారు. ఎందుకు? హిందీ వల్ల కాదు కానీ ఇంగ్లిష్ వల్లే అది సాధ్యమైంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలుగు సబ్జెక్టును తప్పనిసరి చేస్తూనే అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం బోధనను ప్రవేశపెట్టడానికి కొత్త ముందడుగు వేశారు. ఉత్తర భారత ముఖ్యమంత్రి ఎవరూ ఈ సాహసానికి పాల్ప డలేరు. గుజరాత్లో ఇంగ్లిష్ విద్యా స్థాయిలు చాలా ఘోరంగా ఉన్నాయి. ఏ ఉత్తర భారతీయ రాష్ట్రం కంటే ప్రత్యేకించి హిందీ ప్రాంతం కంటే దక్షిణ భారత్‌లో విద్యాభివృద్ధి నమూనాలు అత్యున్నత స్థాయిలో ఉంటున్నాయి. భారతీయ గిరిజనులలో ఈశాన్య భారత రాష్ట్రాలు ముందంజలో ఉన్నాయి. ఈ ప్రాంతంలో ఇంగ్లిష్ మీడియం కారణంగా అక్కడి యువత అత్యుత్తమ విద్యా సంస్థల్లో ప్రవేశించారు. ఇంగ్లిష్ వారి ప్రధాన బోధనా భాషగా కొనసాగినట్లయితే, వచ్చే కొన్ని దశాబ్దాల్లో వీరు అనేక రంగాల్లో ఆధిపత్యం చలాయించబోతున్నారు. ఈశాన్య ప్రాంతంలో ఈ అభివృద్ధిపట్ల ఆర్ఎస్ఎస్/బీజేపీ నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నాయి. అక్కడ హిందీని రుద్దితే రాజకీయంగా వీరి పని ముగిసిపోతుంది. ఇప్పుడు అమిత్ షా, బీజేపీ/ఆరెస్సెస్ ప్రభుత్వం కాలాన్ని వెనక్కు తిప్పి దక్షిణ భారత్‌లో, ఈశాన్య ప్రాంతంలో తదితర ప్రాంతంలో హిందీని ప్రోత్సహించడానికి ప్లాన్ చేస్తోంది. ఇంగ్లిష్‌ను భారతదేశం నుంచి మెల్లమెల్లగా నిర్మూలించాలని చూస్తున్నారు. హిందీ ప్రాంతంలోని విద్యా స్థాయిలు, ప్రమాణాలకు మొత్తం భారతదేశాన్ని తీసుకుపోవాలన్నదే వీరి లక్ష్యం. ఒకసారి దక్షిణ భారత్, ఈశాన్య ప్రాంతం హిందీ ప్రాంతంగా మారిపోయిన తర్వాత, హిందు–హిందీ రాష్ట్రాన్ని (దేశం) నెలకొల్పాలనే తమ లక్ష్యాన్ని చేరుకున్న్టట్లు ప్రకటించాలన్నది వారి కోరిక. హిందూ–హిందీ–హిందూస్తాన్ జాతిని నెలకొల్పాలనీ, దేశం పేరును ఇండియా అనే భారత్‌నుంచి (రాజ్యాంగ పీఠికలో ఇలాగే ఉన్నందువల్ల) హిందూస్తాన్‌గా మార్చాలని బీజేపీ/ఆరెస్సెస్ పెట్టుకున్న దీర్ఘకాలిక లక్ష్యం అందరికీ తెలిసిందే. ఈ నేలకు హిందూస్థాన్ అనే పేరు పెట్టింది ముస్లిం పాలకులు. దీన్ని మతరాజ్యంగా మార్చాలనే వారు ఆ పేరు పెట్టాలనుకుంటున్నారు. ఈ మొత్తం పథకంలో పాకిస్తాన్‌ను ఒక నమూనాగా చూపెడుతూ ముస్లిం దేశాలతో పోటీపడటమే వీరి డైరెక్షన్. యూరప్, అమెరికాతో ప్రపంచ స్థాయిలో స్పర్థాత్మక స్ఫూర్తిలో చాలా ముందంజలో ఉన్న చైనాతో లేక దక్షిణాఫ్రికాతో పోటీ పడటం వీరి ఉద్దేశం కాదు. మన దక్షిణభారత్ తరహాలో ఇంగ్లిష్ నేర్చుకోవడమే చైనా, దక్షిణాఫ్రికాల ప్రస్తుత లక్ష్యంగా ఉంది. ఆధునికీకరణకు అలాగే అధునికానంతర దశకు ప్రధాన లింక్ భాషే. ఆఫ్రికాలోని ఫ్రెంచ్ వలస దేశాలు అభివృద్ధి క్రమంలో ఉన్న స్థానిక భాషల్ని నేర్చుకోవాలని పట్టుబట్టడం లేదు. మాజీ ప్రెంచ్ వలసదేశాల్లో చాలావరకు ఫ్రెంచ్ నుంచి ఇంగ్లిష్‌పై దృష్టి మళ్లిస్తున్నాయి. ఇంగ్లిష్ భాషా కమ్యూనికేషన్, టెక్నో ఆర్థిక వ్యవస్థ అభివృద్ధితో ప్రపంచంతో సమ్మిళితం కావడం మూలాన ఈ దేశాల ఆర్థికాభివృద్ధి వేగంగా సాగుతోంది. భాషాపరంగా, సాంస్కృతిక పరంగా బలపడుతున్న ఈ అంతర్జాతీయ దశను అర్థం చేసుకోవడంలో బీజేపీ/ఆరెస్సెస్ నేతలకు ఎలాంటి చిత్తశుద్ధీ లేనట్లుంది. అనేక ప్రాంతాలతో కలిసి పనిచేసేందుకు ప్రయత్నిస్తున్న ఇజ్రాయెల్ సైతం హిబ్రూతో పాటు ఇంగ్లిష్ విద్యను ప్రోత్సహిస్తూ ఉమ్మడి సాంస్కృతిక మార్పుకు సిద్ధమవుతున్నాయి. ఇక భారత్‌లో బీజేపీ/ఆరెస్సెస్‌కు పూర్తిగా ఆర్థిక వనరుల్ని సమకూరుస్తున్న పారిశ్రామికవర్గం హిందీని ఏమాత్రం పరిగణనలోకి తీసుకోవడం లేదు. ఉత్తర భారత్‌లో భాషాపరమైన, సాంస్కృతిక పరమైన వర్గ విభేదాలు దక్షిణభారత్ కంటే ఎక్కువగా ఉంటున్నాయి. దక్షిణాదిలో అన్ని తరగతుల ప్రజానీకం తమ ప్రాంతీయ భాషతోపాటు ఇంగ్లిష్‌ను నేర్చుకోవలసిన అవసరాన్ని గుర్తించాయి. అందుకే దక్షిణాదిలో భాషా, సాంస్కృతిక పరమైన అంతరం తగ్గుముఖం పడుతోంది. అదే ఉత్తరాదిలో ఈ అంతరం చాలా ఎక్కువ. అందుకే ఆర్థిక వనరులు, సాంస్కృతిక వనరులకు చెందిన దారిద్య్రం మొరటైన, కఠినమైన రూపంలో సాగుతోంది. సంపన్నుల పిల్లలకోసం ప్రపంచ స్థాయి ఇంగ్లిష్ మీడియం స్కూళ్లను నడుపుతున్న అగ్రశ్రేణి పారిశ్రామిక వేత్తలను ఉత్తర భారత్‌లో హిందీ మీడియంకు మారాలని అమిత్ షా ఒత్తిడి చేయగలరా? ఇక ఉత్తరాది, దక్షిణాది హిందీ మీడియం స్కూళ్లలో తమ పిల్లలను చేర్పించవలసిందిగా తన పార్టీనేతలను షా ఆదేశించగలరా? దక్షిణ భారత్, ఈశాన్య భారత్‌లో హిందీ నేర్చుకోవాలని చెప్పి ఆయన ఎవరిని వంచించాలని అనుకుంటున్నారు? కచ్చితంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న నిరుపేద గ్రామీణ పిల్లలను మాత్రమే ఆయన వంచించగలరు. అందుకే హిందుత్వ శక్తులు ప్రేరేపిస్తున్న భాషాపరమైన సెంటిమెంట్ల పట్ల దళితులు, ఓబీసీలు, చివరకు అగ్రకుల శూద్రులు కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి. వీరి పిల్లలు ఇప్పుడిప్పుడే ఆధునిక నాగరిక, అంతర్జాతీయీకరించిన సంస్కృతులకు అలవాటు పడుతున్నారు. వీరు గనుక ఒకదేశం, ఒక భాష, ఒక సంస్కృతి అనే హిందుత్వ ప్రచార సిద్ధాంతాన్ని మోసినట్లయితే, వీరి పిల్లలు తిరిగి మధ్యయుగాల దారిద్య్రం, అజ్ఞానం, అసమానత్వంలోకి దిగజారిపోవడం తథ్యం. హిందీ ప్రాంతంలోని జనాలకు దక్షిణ భారత్ ప్రజలకూ మధ్య శాస్త్రీయ దృక్పథానికి సంబంధించిన స్థాయిలను అలా పోల్చి చూద్దాం. శా్రస్రీయ చింతనలో దక్షిణ భారత్ చాలా ముందంజలో ఉంది. అంటే దక్షిణాదిలో మూఢనమ్మకాలు, అజ్ఞానం, దోపిడీ లేవని అర్థం కాదు. కానీ దక్షిణాదిలో విజ్ఞాన స్థాయిలు, సామాజిక, ఆర్థిక, రాజకీయ సమానత్వం పట్ల నమ్మకం చాలా ఎక్కువగా ఉంటాయి. ఒక పరిమిత బృందానికి చెందిన ప్రజలు లేక ఒక చిన్ని ప్రాంతం, లేక ఒక చిన్న జాతి మాట్లాడే భాష మాత్రమే తెలిసి ఉన్న పిల్లలకంటే పదసంపదలో సమృద్ధిని కలిగిన అంతర్జాతీయంగా వ్యక్తీకరించగలిగిన భాషను నేర్చుకున్న పిల్లలు మరింత ఆత్మవిశ్వాసం, విజ్ఞాన స్థాయిలను కలిగి ఉంటారు. సామాజిక, ప్రాకృతిక శాస్త్రాల బోధనను బలహీనపర్చడం ద్వారా బీజేపీ/ఆరెస్సెస్ ఇప్పటికే మన విశ్వవిద్యాలయాలకు బాగా నష్టం కలిగించాయి. అన్ని జ్ఞానాలకూ మాతృక పౌరాణిక శాస్త్రమే అంటూ వీరు తీసుకొస్తున్న కొత్త సిద్దాంతాన్ని చూసి ఇప్పటికే ప్రపంచంమంతా విరగబడి నవ్వుతోంది. ప్రపంచంలోని అన్ని శాస్త్రీయ ఆవిష్కరణలను మన పురాణగ్రంథాలే చెప్పేశాయని వీరు ప్రకటిస్తారు. కుహనా శాస్త్రవేత్తలను వీరు డీఎన్ఏ, పురావస్తు శాస్త్ర నిపుణులుగా నమ్మించాలని చూస్తారు. అంతర్జాతీయ సైంటిస్టులు మానవ వలసల గురించి చేసిన సిద్దాంతాలు అన్నీ తప్పుడువే అని వాదిస్తారు. ఈ చెత్తను శాస్త్ర ప్రపంచం జోక్‌గా పరిగణిస్తోంది. ఇప్పుడు వీరి రాజకీయ నేతలు.. అన్ని భాషలనూ వదిలిపెట్టి హిందీని తప్పక నేర్చుకోవాలని మనకు చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు. అప్పుడు మాత్రమే భరతఖండం సువర్ణ భూమిగా మారుతుందని అంటున్నారు. అదృష్టవశాత్తూ దక్షిణ భారతీయులందరూ అమిత్ షా ప్రవచించిన హిందీ– హిందూ– హిందూస్తాన్ అసంగత సిద్ధాంతానికి వ్యతిరేకంగా తిరగబడ్డారనుకోండి. మన పిల్లల భవిష్యత్తును సురక్షితంగా ఉంచాలంటే, తమిళనాడులాగే ద్విభాషా సూత్రానికే మనం కూడా కట్టుబడి ఉండాలి. మన శాస్త్రీయ దృక్పధాన్ని బలోపేతం చేసుకోవడం ద్వారానే భారత్ మరోసారి చైనా వంటి శరవేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాలకు వలసగా మారబోదు. ప్రొ‘‘ కంచ ఐలయ్య షెపర్డ్ వ్యాసకర్త డైరెక్టర్, సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ సోషల్ ఎక్స్‌క్లూజన్ అండ్ ఇంక్లూజివ్ పాలసీ -
దేశమంతా ఎన్నార్సీ : అమిత్ షా
రాంచీ/జమ్తారా : కేంద్ర హోంమంత్రి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సంచలన ప్రకటన చేశారు. జాతీయ పౌర రిజిస్టర్(ఎన్నార్సీ)ని తాము దేశమంతా అమలుచేస్తామని ప్రకటించారు. భారత్‌లో అక్రమంగా ఉంటున్న విదేశీయులను వెళ్లగొడతామన్నారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి అఖండ మెజారిటీ కట్టబెట్టడం ద్వారా దేశవ్యాప్తంగా ఎన్నార్సీ అమలుకు ప్రజలు ఆమోదం తెలిపారని వ్యాఖ్యానించారు. జార్ఖండ్‌లోని రాంచీలో బుధవారం అమిత్ షా మాట్లాడుతూ..‘అస్సాంలోనే కాదు దేశవ్యాప్తంగా ఎన్నార్సీని అమలుచేస్తామని మా ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పాం. ఎన్నార్సీని దేశవ్యాప్తంగా చేపట్టి ప్రజల పేర్లను రిజిస్టర్లో నమోదుచేస్తాం. అక్రమ వలసదారులపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటాం. ఈ జాబితాలోని వారిని తరిమేస్తాం’ అని తెలిపారు. అమెరికాలో సెటిలవ్వగలరా? 2019 లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ప్రతీ బహిరంగ సభ, ర్యాలీలో తాను ఎన్నార్సీని ప్రస్తావించానని అమిత్ తెలిపారు. ‘ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఇలావెళ్లిపోయి అలా స్థిరపడలేరు. నేను మిమ్మల్ని(సభికుల్ని) అడుగుతున్నా. మీరిప్పుడు అమెరికాకు వెళ్లి స్థిరపడగలరా? వీలుకాదు కదా. మీరు రష్యా, నెదర్లాండ్స్, ఇంగ్లండ్.. ఇలా ఎక్కడకు వెళ్లి స్థిరపడేందుకు ప్రయత్నించినా కుదరదు. మరి భారత్‌లో ఎవరైనా ఎలా స్థిరపడగలరు? దేశాలు ఇలా నడవవు. భారత ప్రజల కోసం జాతీయ పౌర రిజస్టర్(ఎన్నార్సీ) అమలు చేయాల్సిన సమయం వచ్చేసింది’ అని షా వెల్లడించారు. ఎన్నార్సీలో పేర్లు లేని నిరుపేదలు అప్పీల్ చేసుకునేందుకు వీలుగా ఉచిత న్యాయసాయం అందిస్తున్నట్లు షా పేర్కొన్నారు. అస్సాంలో ఇటీవల విడుదల చేసిన ఎన్నార్సీలో 19 లక్షల మందిని విదేశీయులుగా ప్రకటించిన సంగతి తెలిసిందే. హిందీని రుద్దట్లేదు హిందీ దినోత్సవం సందర్భంగా తాను చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంపై అమిత్ స్పందించారు. భారత్‌లో ఎక్కడా హిందీని బలవంతంగా అమలుచేయాల్సిందిగా తాను చెప్పలేదన్నారు. మాతృభాష తర్వాత హిందీని రెండో భాషగా నేర్చుకోవాలని కోరానన్నారు. ప్రాంతీయ భాషలను ప్రోత్సహించాల్సిన అవసరాన్ని తాను ప్రస్తావించానన్నారు. ‘నేను హిందీయేతర రాష్ట్రం నుంచే వచ్చాను. నా మాతృభాష గుజరాతీ. నన్ను విమర్శిస్తున్నవారు ఎవరైనా ముందు నేనిచ్చిన ప్రసంగాన్ని పూర్తిగా వినాలి. అలాకాకుండా ఎవరైనా దీన్ని రాజకీయం చేయాలనుకుంటే, అది వాళ్లిష్టం’ అని షా వ్యాఖ్యానించారు. మాతృభాషలో విద్యాబోధన సాగితేనే పిల్లల మనోవికాసం సరైనరీతిలో ఉంటుందని హోంమంత్రి అభిప్రాయపడ్డారు. కానీ దేశంలో ఒకే జాతీయ భాష ఉండాల్సిన అవసరముందనీ, ప్రజలు మరో భాషను నేర్చుకోవాలంటే అందుకు మాధ్యమంగా హిందీయే ఉండాలని షా స్పష్టం చేశారు. -
భాషా వివాదం!
ఎప్పటిలాగే హిందీపై పెను వివాదం రేగింది. ఈసారి కేంద్ర హోంమంత్రి అమిత్ షా అందుకు కారకులయ్యారు. ‘హిందీ దివస్’ సందర్భంగా మొన్న శనివారం ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ దేశానికి ఉమ్మడి భాషగా హిందీ ఉండాలని, అప్పుడే మహాత్మా గాంధీ, సర్దార్ పటేల్ కన్న కలలు నెరవేరతాయని చెప్పడం ఈ వివాదానికి మూలం. అయితే హిందీని ద్వితీయ భాషగానైనా నేర్చుకోవాలన్నదే తన ఉద్దేశమని షా వివరణ ఇచ్చారు. మన దేశానికి జాతీయ భాష లేదు. కేంద్ర స్థాయిలో అధికార భాషగా హిందీ, ఇంగ్లిష్ ఉన్నాయి. రాష్ట్రాల్లో అక్కడి ప్రాంతీయ భాషలు అధికార భాషలుగా ఉంటున్నాయి. 1960 ప్రాంతంలో హిందీ భాషను ‘రుద్దడాన్ని’ తీవ్రంగా వ్యతిరేకిస్తూ దక్షిణాది రాష్ట్రాల్లో, మరీ ముఖ్యంగా తమిళనాడులో పెద్దయెత్తున ఆందోళనలు పెల్లు బికాయి. ఆ తర్వాత 1963లో అధికార భాషల చట్టం వచ్చింది. అధికార లావాదేవీలన్నిటా హిందీతో పాటు ఇంగ్లిష్‌ను కూడా వినియోగించడం తప్పనిసరి చేస్తూ ఆ చట్టం తీసుకొచ్చారు. తెలుగు, కన్నడం, తమిళం, మలయాళం, ఒడియా, గుజరాతీ, పంజాబీ, బెంగాలీ వంటి 22 భాషల్ని ఆయా ప్రాంతాల్లో అధికార భాషలుగా రాజ్యాంగంలోని ఎనిమిదో షెడ్యూల్ గుర్తించింది. హిందీ అధికార భాషగా లేని రాష్ట్రాలతో కేంద్రం ఇంగ్లిష్‌లో ఉత్తరప్రత్యుత్తరాలు జరపాలని నిర్దేశిస్తూ 1967లో అధి కార భాషల చట్టాన్ని సవరించారు. దేశంలో జనసాంద్రత ఎక్కువగా ఉండే డజను రాష్ట్రాల్లో మాతృ భాష హిందీయేనని పదేళ్లకోసారి జరిగే జనాభా లెక్కల సేకరణలో తేలుతుంటుంది. అలాగని ఆ రాష్ట్రాల్లో అన్నిచోట్లా దాన్ని ఒకేలా మాట్లాడరు. అక్కడ హిందీకి దగ్గరగా ఉండే బ్రజ్ భాష, ఛత్తీస్‌గఢీ, హర్యాన్వీవంటి 49 రకాల పలుకుబడులున్నాయి.‘ప్రామాణిక హిందీ’ పాఠ్యపుస్తకాలకూ, ప్రభుత్వ లావాదేవీలకూ మాత్రమే పరిమితం. 1805లో బ్రిటిష్ వలసపాలకుల ఆదేశాలమేరకు కోల్‌కతాలోని ఫోర్ట్ విలియం కళాశాలలో పనిచేసే నలుగురు మున్షీలు ఈ ‘ప్రామాణిక హిందీ’ని రూపొందించారు. మొత్తంగా హిందీయేతర భాషలు మాట్లాడేవారు దేశంలో 60 శాతంమంది ఉంటే... హిందీ, దానికి దగ్గరగా ఉండే భాషలు మాట్లాడేవారు 40 శాతంమంది. వాస్తవాలిలా ఉంటే హిందీ భాష మాత్రమే దేశాన్ని ఏకం చేయగలదనడం అవివేకం. ఇప్పుడు అమిత్ షా ప్రకటనను ఇతర పార్టీలతోపాటు కాంగ్రెస్ కూడా వ్యతిరేకిస్తున్నదిగానీ...ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇదే తరహాలో హిందీకి అగ్రాసనం వేయాలని ప్రయత్నించింది. 2008లో దేశంలో హిందీ వినిమయాన్ని పెంచడం కోసం అప్పటి యూపీఏ ప్రభుత్వం చేసిన ప్రతి పాదనలే దీనికి రుజువు. మెట్రిక్, ఆ పైస్థాయి అభ్యర్థులకు ఉద్యోగ నియామకాల కోసం నిర్వహించే పోటీ పరీక్షల్లో హిందీ ప్రశ్నపత్రం తప్పనిసరిగా ఉండాలన్నది ఆ ప్రతిపాదనల్లో ఒకటి. అప్పటి ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఆ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ ప్రతిపాదన వల్ల హిందీ భాషా ప్రాంత అభ్యర్థులు మాత్రమే లబ్ధి పొందుతారని, ఇతర రాష్ట్రాల వారు నష్టపోతారని స్పష్టం చేశారు. యూపీఏ ప్రభుత్వానికి తమ పార్టీయే నేతృత్వం వహిస్తున్నా ఆయన నిర్మొహమాటంగా తన అభిప్రాయం చెప్పారు. మొత్తానికి దక్షిణాది రాష్ట్రాల నుంచి వ్యతి రేకత రావడంతో ఆ ప్రతిపాదన మూలనబడింది. ఈమధ్య విడుదలైన జాతీయ విద్యావిధానం ముసాయిదాలో సైతం హిందీకి అగ్ర తాంబూలం ఇచ్చే ప్రతిపాదన ఉంది. దాని ప్రకారం ఆరో తరగతి మొదలుకొని హిందీ భాషా ప్రాంతాల పిల్లలు హిందీ, ఇంగ్లిష్‌తోపాటు మరో ఆధునిక భాష నేర్చుకోవచ్చు. హిందీయేతర ప్రాంతాల విద్యార్థులు మాత్రం హిందీ, ఇంగ్లిష్‌లతోపాటు స్థానిక భాష నేర్చుకోవచ్చునని ఆ ప్రతిపాదన అంటున్నది. సారాంశంలో ఈ ప్రతిపాదన హిందీని తప్పనిసరి చేస్తున్నది. మన రాజ్యాంగం త్రిభాషా సూత్రాన్ని గుర్తించింది. అధికార భాషల చట్టం కూడా ఈ విషయంలో స్పష్టతతో ఉంది. కానీ పాలకులు మాత్రం ఎప్పటికప్పుడు హిందీని ఉన్నత పీఠం ఎక్కిం చాలని ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఒకే భాష మాట్లాడేవారి మధ్య సదవగాహన, సహోదరత్వం వంటివి పెంపొందుతాయన్నది వాస్తవమే. కానీ ప్రాంతీయ భాషలకు విలువీయకుండా, వాటి నెత్తిన మరో భాషను రుద్దుతామంటేనే పేచీ వస్తుంది. మన దేశంలో భిన్న భాషలు, సంస్కృతులు, సంప్రదా యాలు వర్థిల్లుతున్నాయి. ఈ భిన్నత్వంలో ఏకత్వమే మన దేశ విశిష్టత. ఫలానా భాష నేర్చుకోమని లేదా నేర్చుకోరాదని నిర్బంధంగా అమలు చేస్తే అది తమ భాషా సంస్కృతులకు ముప్పు కలగ జేస్తుందన్న సంశయం కలుగుతుంది. స్వాతంత్య్రోద్యమ సమయంలో సైతం ఈ భాషా సమస్య ఎంత రగడ సృష్టించిందో మరిచిపోకూడదు. హిందీని ఉమ్మడి భాషగా ప్రకటించాలని బ్రిటిష్ ప్రభు త్వాన్ని కోరుతూ భారత జాతీయ కాంగ్రెస్ మహాసభలో పురుషోత్తందాస్ టాండన్ నేతృత్వంలో కొందరు ఉత్తరాది రాష్ట్రాల నాయకులు తీర్మానం తీసుకొచ్చేందుకు ప్రయత్నించినప్పుడు ఎన్జీ రంగా తదితరులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఇవాళ చదువుల నిమిత్తమో, ఉపాధికోసమో ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లాల్సి రావటం తప్పనిసరైంది. కనుక దేశ పౌరులంతా హిందీతోసహా ఏ భాషనైనా ఇష్టంతో, ప్రేమతో నేర్చుకోవడాన్ని పాలకులు ప్రోత్సహించాలి. దక్షిణాదివారికి పొరుగు రాష్ట్రంలోని ప్రాంతీయ భాష... ఉత్తరాదివారికి దక్షిణాది రాష్ట్రాల్లోని భాషలు నేర్చుకుంటే వాటివల్ల ప్రయోజనమే తప్ప చేటు కలగదు. దేశంలో హిందీ చలనచిత్రాలు, సీరియళ్లు, నెట్ఫ్లిక్స్వంటి సామాజిమాధ్యమాల ద్వారా విడుదలవుతున్న చిత్రాలు హిందీని దేశ ప్రజలకు అలవాటు చేస్తున్నాయి. అక్కడి సంస్కృతీ సంప్ర దాయాలపై అవగాహన కలిగిస్తున్నాయి. భాషను నేర్చుకోవడం తప్పనిసరి చేసినా... ఉద్యోగా వకాశాలకు షరతుగా మార్చినా ఆందోళనలు చెలరేగుతాయి. ఆ భాషపై విముఖతను పెంచుతాయి. ఒక భాష ఉన్నతమైనదనడం ఇతర భాషలను తక్కువ చేయడమే అవుతుంది. కనీసం ఇప్పుడు దేశంలో చెలరేగిన వ్యతిరేకత చూశాకైనా నేతలు హిందీ దురభిమానాన్ని కట్టిపెట్టాలి. -
హిందీ వివాదం.. వెనక్కి తగ్గిన షా
న్యూఢిల్లీ: హిందీని జాతీయ భాషగా చేయాలన్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా వ్యాఖ్యలపై దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారం చెలరేగుతోన్న సంగతి తెలిసిందే. అమిత్ షా నిర్ణయాన్ని అన్ని దక్షిణాది రాష్ట్రాలు ముక్త కంఠంతో ఖండించాయి. ఆఖరికి బీజేపీ పాలిత రాష్ట్రమైన కర్ణాటకలో కూడా షా వ్యాఖ్యల పట్ల వ్యతిరేకత వ్యక్తమయ్యింది. ఈ నేపథ్యంలో జాతీయ భాషగా హిందీ అంశంలో అమిత్ షా వెనక్కి తగ్గారు. ప్రాంతీయ భాషలను వదిలి హిందీని జాతీయ భాషగా మార్చాలని తాను ఎప్పుడు చెప్పలేదన్నారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ.. ‘హిందీని జాతీయ భాషగా మార్చి ప్రాంతీయ భాషలను పక్కకు పెట్టాలని నేను ఎప్పుడు అనలేదు. కాకపోతే మాతృభాషతో పాటు రెండో భాషగా హిందీని నేర్చుకోవాలని మాత్రమే సూచించాను. నేను నాన్ హిందీ రాష్ట్రం గుజరాత్‌కు చెందిన వాడినే కదా. కానీ కొందరు నా వ్యాఖ్యలను వక్రీకరించి.. రాజకీయం చేయలని భావిస్తున్నారు. ఇక దీన్ని వారి విజ్ఞతకే వదిలేస్తున్నాను’ అన్నారు. హిందీని జాతీయ భాషగా చేయాలన్న అమిత్ షా వ్యాఖ్యలపై కేరళ, పుదుచ్చేరి రాష్ట్రాల నేతలతో పాటు సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం బలవంతంగా తమ మీద హిందీని రుద్దితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. (చదవండి: షా వ్యాఖ్యలు షాకిచ్చాయ్..) -
హిందీపై అమిత్ షా వర్సెస్ రజనీకాంత్
చెన్నై: ఒక దేశం ఒక భాష అంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై ప్రముఖ సినీ నటుడు, రాజకీయ నాయకుడు రజనీకాంత్ ఎట్టకేలకు స్పందించారు. భారత్‌ను ఏకం చేయగల సత్తా హిందీకే ఉందన్న షా వ్యాఖ్యలతో ఆయన విభేదించారు. హిందీని జాతీయ భాషగా చేయాలన్న అమిత్ షా వ్యాఖ్యలను ఎవరూ ఆమోదించబోరని రజనీకాంత్ స్పష్టం చేశారు. దక్షిణ భారత దేశంలో ముఖ్యంగా తమిళనాడులో హిందీని బలవంతంగా రుద్దితే ఒప్పుకునేది లేదని ఆయన పేర్కొన్నారు. హిందీని జాతీయ భాషగా చేయాలన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలపై తీవ్ర దుమారం చెలరేగుతున్న సంగతి తెలిసిందే. కేంద్రం తమపై హిందీని బలవంతంగా రుద్దేందుకు ప్రయత్నిస్తోందంటూ తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి రాష్ట్రాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. హోం మంత్రి ప్రకటన తమ మాతృభాషను అమితంగా ప్రేమించే హిందీయేతర ప్రాంతాల ప్రజలపై దండయాత్ర ప్రకటించడమేనని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ పేర్కొన్నారు. అమిత్ షా వ్యాఖ్యలపై దక్షిణాది రాష్ట్రాల్లో తీవ్ర వ్యతిరేకత, విమర్శలు వచ్చాయి. స్టాలిన్, కమల్ హాసన్, మమతా బెనర్జీ వంటి పలువురు నేతలు కూడా షా వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. -
కన్నడ విషయంలో రాజీపడబోం
బెంగళూరు/ చెన్నై: భారత్‌కు ఒకే జాతీయ భాష ఉండాలనీ, ఆ లోటును హిందీ భర్తీ చేయగలదన్న హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలపై కర్ణాటక సీఎం, బీజేపీ నేత యడియూరప్ప స్పందించారు. తమ రాష్ట్రంలో కన్నడే ప్రధాన భాష అని, కన్నడ ప్రాధాన్యత విషయంలో తాము రాజీపడబోమని స్పష్టం చేశారు. ‘మన దేశంలోని అన్ని అధికార భాషలు సమానమే. ఇక కన్నడ విషయానికొస్తే అది రాష్ట్ర ప్రధాన భాష. కన్నడ భాషను ప్రోత్సహించడంతో పాటు రాష్ట్ర సంస్కృతి విషయంలో మేం రాజీ పడబోం’ అని తెలిపారు. షా, సుల్తాన్లు మార్చలేరు: కమల్ హాసన్ హిందీని తమపై బలవంతంగా రుద్దే ప్రయత్నాలను వ్యతిరేకిస్తామని మక్కల్ నీది మయ్యం పార్టీ అధినేత కమల్ హాసన్ ప్రకటించారు. ‘భారత్ గణతంత్ర దేశంగా అవతరించగానే మనదేశంలో భిన్నత్వంలో ఏకత్వం కొనసాగుతుందని హామీ లభించింది. దీన్ని ఏ షా(అమిత్ షా), సుల్తాన్, సామ్రాట్లు కూడా మార్చలేరు. మేం అన్ని భాషలను గౌరవిస్తాం. కానీ మా మాతృభాష మాత్రం ఎప్పటికీ తమిళమే’ అని అన్నారు. -
అమిత్ షాతో విభేదించిన కర్ణాటక సీఎం
సాక్షి, బెంగళూరు: ఒక దేశం ఒక భాష అంటూ కేంద్ర హోంమంత్రి, బీజేపీ జాతీయ కార్యదర్శి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై దేశ వ్యాప్తంగా తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో వ్యతిరేక స్వరాలు బలంగా వినిపిస్తున్నాయి. దీనిపై ఇప్పటికే డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌తో పాటు ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప.. అమిత్ షా హిందీ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. కేంద్ర నిర్ణయంతో ఏకీభవించేదిలేదని తేల్చిచెప్పారు. ‘దేశంలోని భాషలన్నీ సమానమే. దానిలో భాగంగానే కర్ణాటకకు కూడా కన్నడ చాలా ముఖ్యం. హిందీని అమలుచేయలన్న కేంద్ర నిర్ణయంతో ఏకీభవించేదిలేదు’ అంటూ యడియూరప్ప స్పష్టం చేశారు. తమపై హిందీని బలవంతంగా రుద్దాలని చూస్తే మరో ప్రతిఘటన ఎదుర్కొక తప్పదని మక్కళ్నిధీమయ్యం అధినేత కమల్‌హాసన్ కేంద్ర ప్రభుత్వాన్ని ఇదివరకే హెచ్చరించారు. కాగా హిందీ దివస్ సందర్భంగా అమిత్ షా ప్రసంగిస్తూ.. భారత్‌లో అత్యధికులు మాట్లాడే హిందీ భాష దేశాన్ని ఐక్యమత్యంగా ఉంచడానికి తోడ్పడుతుందని పేర్కొన్న విషయం తెలిసిందే. షా వ్యాఖ్యలపై పలు రాష్ట్రాలు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నాయి. All official languages in our country are equal. However, as far as Karnataka is concerned, #Kannada is the principal language. We will never compromise its importance and are committed to promote Kannada and our state's culture. — CM of Karnataka (@CMofKarnataka) September 16, 2019 -
అమిత్ షా ప్రకటన అసమంజసం: మధు
చల్లపల్లి (అవనిగడ్డ): దేశంలో హిందీ భాషను అన్ని రాష్ట్రాల్లో మాట్లాడాలనే విధంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన ప్రకటన సరికాదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు అన్నారు. ఆదివారం కృష్ణా జిల్లా చల్లపల్లిలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ 2022 నాటికి భారతదేశం మొత్తం హిందీ భాష అమలు జరగాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్టు అమిత్ షా ప్రకటించడాన్ని తీవ్రంగా ఖండించారు. సమాఖ్య స్ఫూర్తితో రాష్ట్రాల యూనియన్‌గా కొనసాగుతున్న భారతదేశ ఫెడరల్ విధానానికి బీజేపీ తూట్లు పొడుస్తోందన్నారు. దేశంలో ఎవరి భాష వారికి అత్యంత ముఖ్యమైందని, భాషల మధ్య భేదాలను రాజ్యాంగం ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించబోదన్నారు. -
హిందీయేతర ప్రజలపై యుద్ధ ప్రకటనే
తిరువనంతపురం/చెన్నై/పుదుచ్చేరి/న్యూఢిల్లీ: దేశాన్ని ఏకం చేయగల సత్తా ఉన్న ఏకైక భాష హిందీ అంటూ హోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై దుమారం చెలరేగుతోంది. కేంద్రం తమపై హిందీని బలవంతంగా రుద్దేందుకు ప్రయత్నిస్తోందంటూ తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి రాష్ట్రాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. హోం మంత్రి ప్రకటన తమ మాతృభాషను అమితంగా ప్రేమించే హిందీయేతర ప్రాంతాల ప్రజలపై దండయాత్ర ప్రకటించడమేనని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ పేర్కొన్నారు. దేశం ఎదుర్కొంటున్న సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే, కేంద్రం ఈ వివాదాస్పద అంశాన్ని తెరపైకి తెచ్చిందని ఫేస్బుక్లో ఆరోపించారు. భాషా ప్రాతిపదికన ప్రజల్లో వైషమ్యాలు సృష్టించి, విడదీయడానికి బీజేపీ ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ నేత రమేశ్ చెన్నితాల ఆరోపించారు. దేశ మంతటా ఒకే భాషను అమలు చేయాలన్న ప్రయత్నాలు ఐక్యతకు, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని సీపీఎం పేర్కొంది. రాజ్యాంగం 8వ షెడ్యూల్లో పేర్కొన్న జాతీయ భాషలన్నిటినీ సమానంగా గౌరవించాలని కేంద్రాన్ని కోరింది. ప్రతిపక్షాలు ఏకం కావాలి: స్టాలిన్ కేంద్రం హిందీని ప్రజలపై బలవంతంగా రుద్దాలని చూస్తోందని డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ విమర్శించారు. చెన్నైలో ఆయన మాట్లాడుతూ.. నీట్‌తోపాటు రైల్వే, తపాలా శాఖలు నిర్వహించే పోటీ పరీక్షల్లో తమిళనాడు వివక్షకు గురవుతోందని ఆరోపించారు. హిందీని జాతీయ భాషగా మార్చాలన్న కేంద్రం ప్రయత్నాలపై గతంలో మాదిరిగానే అన్ని పార్టీలు ఐక్యంగా పోరాడాలన్నారు. హిందీని ఉమ్మడి భాషగా మార్చాలన్న కేంద్రం ప్రయత్నాలను పుదుచ్చేరి సీఎం నారాయణ స్వామి ఖండించారు. -
ఒక దేశం ఒకే భాషపై మరోసారి వివాదం
-
షా వ్యాఖ్యలు షాకిచ్చాయ్..
న్యూఢిల్లీ: ఏకీకృత భాషగా హిందీని అమలు చేయడం ద్వారా దేశ పౌరులందరినీ ఏకతాటిపైకి తీసుకురావచ్చన్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే అమిత్ షా వ్యాఖ్యలపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఆగ్రహం వ్యక్తం చేయగా.. తాజాగా డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ సైతం ఈ వ్యాఖ్యలపై మండిపడ్డారు. ‘బలవంతంగా హిందీ భాషను రుద్దడాన్ని వ్యతిరేకిస్తూ మేం నిరంతరం ఆందోళన వ్యక్తం చేస్తూనే ఉన్నాం. ఈ రోజు అమిత్ షా చేసిన వ్యాఖ్యలు మాకు షాక్ ఇచ్చాయి. ఈ వ్యాఖ్యలు దేశ ఐక్యతను దెబ్బతీస్తాయి. అమిత్ షా తన వ్యాఖ్యలను వెనుకకు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం’ అని స్టాలిన్ పేర్కొన్నారు. తీవ్ర ఆందోళనకు గురిచేసిన షా వ్యాఖ్యలపై ఎల్లుండి పార్టీ ఎగ్జిక్యూటివ్ సమావేశంలో చర్చించి.. తదుపరి కార్యాచరణ చేపడతామని స్టాలిన్ పేర్కొన్నారు. శనివారం హిందీ దివస్ సందర్భంగా అమిత్ షా ప్రసంగిస్తూ..భారత్‌లో అత్యధికులు మాట్లాడే హిందీ భాష దేశాన్ని ఐక్యమత్యంగా ఉంచడానికి తోడ్పడుతుందని పేర్కొన్నారు. అదే విధంగా..‘ భారతదేశంలో అనేక భాషలు ఉన్నాయి. ప్రతీ భాష దేనకదే ప్రత్యేకతను కలిగి ఉంది. అయితే ప్రపంచంలో భారత్ గుర్తింపు కోసం ఒక భాష మాట్లాడాల్సిన ఆవశ్యకత ఉంది. ఈరోజు దేశాన్ని ఒక్కటిగా ఉంచే భాష ఏదైనా ఉందంటే అది హిందీ మాత్రమే. స్వాతంత్ర్య సమరయోధులు మహాత్మా గాంధీ, వల్లభబాయ్ పటేల్ ఆశయాలను నెరవేర్చాలంటే మాతృభాషతో పాటు హిందీ భాష వాడకాన్ని పెంచాలి’ అని ట్విటర్ వేదికగా భారత ప్రజలకు విఙ్ఞప్తి చేశారు. చదవండి: దేశమంటే..హిందీ, హిందూ, హిందుత్వ కాదు: ఒవైసీ -
హిందీపై కేంద్రం వెనక్కి
న్యూఢిల్లీ: హిందేయేతర రాష్ట్రాల్లో హిందీ భాషను తప్పనిసరిగా బోధించాలన్న నిబంధనపై కేంద్రం వెనక్కి తగ్గింది. శనివారం విడుదలయిన జాతీయ విద్యా విధానం ముసాయిదాలో హిందీయేతర రాష్ట్రాల్లో హిందీ భాషను తప్పనిసరిగా బోధించాలని ప్రతిపాదించారు.దీనిపై తమిళనాడు, కర్ణాటక సహా దక్షిణాది రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమయింది. హిందీని బలవంతంగా రుద్దేందుకు జరుగుతున్న ఈ ప్రయత్నానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తామని డీఎంకే వంటి పార్టీలు హెచ్చరించాయి. దాంతో కేంద్రం ముసాయిదాలోంచి ఈ నిబంధనను తొలగించింది. సవరించిన నూతన జాతీయ విద్యా విధానం ముసాయిదాను సోమవారం విడుదల చేసింది.‘ తాము నేర్చుకుంటున్న మూడు భాషల్లో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ భాషలను మార్చుకోవాలనుకునే విద్యార్ధులు 6, 7 గ్రేడుల్లో (తరగతులు) ఆ పని చేయవచ్చు. మాధ్యమిక పాఠశాల బోర్డు పరీక్షల్లో మూడు భాషల్లోనూ ప్రావీణ్యాన్ని ప్రదర్శించగలిగిన విద్యార్ధులు ఆరు లేదా ఏడు తరగతుల్లో భాషను మార్చుకోవచ్చు.’అని సవరించిన ముసాయిదాలో పేర్కొన్నారు. భాషా నైపుణ్యంపై బోర్డు నిర్వహించే పరీక్షల్లో కేవలం ప్రాథమిక స్థాయిలోనే పరీక్ష ఉంటుందని తెలిపింది. హిందీయేతర ప్రాంతాల్లో హిందీని తప్పనిసరి భాషగా బోధించాలని ఇంతకు ముందు ముసాయిదాలో పేర్కొన్నారు. దీనిని తమిళనాడులోని డీఎంకే పార్టీ తీవ్రంగా వ్యతిరేకించింది. తాము ఐదు దశాబ్దాలుగా ద్విభాషా సిద్ధాంతాన్ని అమలు చేస్తున్నామని, ఇప్పుడు త్రిభాషా సిద్ధాంతం పేరుతో తమపై బలవంతంగా హిందీని రుద్దడానికి ప్రయత్నిస్తే సహించబోమని డీఎంకే నేత స్టాలిన్ హెచ్చరించారు. బీజేపీ మిత్రపక్షమైన పీఎంకే కూడా ఈ ప్రతిపాదనను తొలగించాలని డిమాండు చేసింది. ఇది కేవలం ముసాయిదా మాత్రమేనని, అందరి అభిప్రాయాలు స్వీకరించిన తర్వాతే తుది విధానం రూపొందిస్తామని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ చెప్పినా వ్యతిరేకత ఆగలేదు. దాంతో ఆ ప్రతిపాదనను తొలగించి కొత్త ముసాయిదాను కేంద్రం విడుదల చేసింది. హిందీ నిబంధనను తొలగించడం పట్ల డీఎంకే హర్షం వ్యక్తం చేసింది. తమ పార్టీ అధినేత కరుణానిధి సజీవంగానే ఉన్నారనడానికి కేంద్రం సవరణే నిదర్శనమన్నారు. కరుణానిధి 95వ జయంతి సందర్భంగా స్టాలిన్ పార్టీ జిల్లా కార్యదర్శులు,ఎంపీలు, ఎమ్మెల్యేలనుద్దేశించి ప్రసంగిస్తూ ఈ విషయం చెప్పారు. త్రిభాషా సిద్ధాంతం ప్రతిపాదనను తిరస్కరిస్తూ సమావేశం తీర్మానం ఆమోదించింది. జాతీయ విద్యా విధానం ముసాయిదా నుంచి హిందీ తప్పనిసరి నిబంధనను తొలగించడం పట్ల కాంగ్రెస్ నేత మర్రి శశిధర్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థి ఫలానా భాష వల్ల తనకు లాభముందని అనుకుంటే ఆ భాష నేర్చుకోవచ్చని అంతేకాని వారిపై బలవంతంగా ఏ భాషనూ రుద్దరాదని హైదరాబాద్‌లో అన్నారు. గతంలో త్రిభాషా సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టడానికి జరిగిన ప్రయత్నాలు, దానికెదురైన వ్యతిరేకతలను ఆయన గుర్తు చేశారు. దక్షిణాదిన హిందీ భాషను ప్రచారం చేస్తున్న దక్షిణ హిందీ ప్రచార సభను మరింత పటిష్టం చేయాలని ఆయన సూచించారు. బలవంతంపు హిందీ భాష ప్రతిపాదనను తొలగించడం పట్ల కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సంతోషం వ్యక్తం చేశారు.‘ త్రిభాషా సిద్ధాంతం అవసరం లేదు. మాకు కన్నడ, ఇంగ్లీషు ఉన్నాయి. అవి చాలు. కన్నడకే అత్యధిక ప్రాధాన్యం ఇస్తాం’అని మైసూరులో అన్నారు. -
అమెజాన్ ఇండియా సరికొత్త ప్రయోగం
న్యూఢిల్లీ : ఫ్లిప్‌కార్ట్‌కు గట్టి పోటీగా... దేశీయ కస్టమర్లను మరింత ఆకట్టుకోవడానికి అమెజాన్ చేయని ప్రయత్నాలు లేవు. తాజాగా అమెజాన్ ఇండియా మరో కొత్త ప్రయోగం చేసింది. హిందీ లాంగ్వేజ్ సపోర్టుతో తన వెబ్‌సైట్‌ను కస్టమర్ల ముందుకు తీసుకొచ్చింది. తన ఆండ్రాయిడ్ యాప్, మొబైల్ సైట్ యూజర్లకు ఈ లాంగ్వేజ్ సపోర్టు ఇవ్వనుంది. హిందీ లాంగ్వేజ్ సపోర్టును అమెజాన్ తన వెబ్సైట్లో తీసుకురావడం దేశీయ మార్కెట్ ప్రాధాన్యతను తెలియజేస్తుందని ఈ-కామర్స్ మార్కెట్ వర్గాలు చెప్పాయి. దేశీయంగా మరింత మంది కస్టమర్లను ఆకట్టుకునే ప్రయత్నంలో భాగంగా అమెజాన్ హిందీ లాంగ్వేజ్ సపోర్టును తీసుకొచ్చింది. దీంతో ఇక నుంచి అమెజాన్ ఇండియా కస్టమర్లు హిందీలోనే ప్రొడక్ట్ సమాచారాన్ని, డీల్స్‌ను, డిస్కౌంట్లను తెలుసుకోవచ్చు. ఆర్డర్లను ప్లేస్ చేసుకోవడం, ఆర్డర్లకు చెల్లించడం, అకౌంట్ సమాచారాన్ని మేనేజ్ చేయడం, ఆర్డర్లను ట్రాక్ చేయడం, ఆర్డర్ హిస్టరీ ప్రతి ఒక్కటీ హిందీ భాషలోనే చేపట్టుకోవచ్చు. అమెజాన్ ఇండియా ఆండ్రాయిడ్ యాప్, మొబైల్ వెబ్సైట్లలో ఈ కొత్త లాంగ్వేజ్ ఆప్షన్‌ను, ఎడమవైపు ఉన్న మెనూ బార్లో చూడవచ్చు. దీని కోసం కొత్తగా అమెజాన్ యాప్‌ను అప్డేట్ చేసుకోవాల్సినవసరం లేదు. సర్వర్ సైడే దీన్ని అప్డేట్ చేయనున్నారు. ఇంగ్లీష్ లోంచి హిందీలోకి మారే ఆప్షన్‌ను లాంగ్వేజ్ బటన్ కల్పిస్తోంది. ప్రస్తుతం టాప్ ప్రొడక్ట్‌ల సమాచారం, ముఖ్యమైన షాపింగ్ సమాచారం మాత్రమే హిందీలో లభ్యమవుతున్నాయి. అయితే సెర్చ్ ఫీచర్, డెలివరీ అడ్రస్‌కు మాత్రం ఇంగ్లీష్ అవసరం. మరిన్ని షాపింగ్ ఫీచర్లను హిందీలో అందించేందుకు అమెజాన్ సిద్దమవుతోంది. ఒక్కసారి మీరు ఎక్కువగా సెర్చ్ చేసే లాంగ్వేజ్‌ను ఎంపిక చేసుకున్న తర్వాత, అది సేవ్ అయి, తర్వాత అమెజాన్ ఇండియా సైట్లోకి వెళ్లేటప్పుడు అదే లాంగ్వేజ్‌లో సైట్ దర్శనమిస్తుంది. మరిన్ని లాంగ్వేజ్ల సపోర్టును కూడా అమెజాన్ త్వరలో ప్రవేశపెట్టబోతుంది. సుమారు 50 శాతం మంది కస్టమర్లు ఇంగ్లీష్ కాకుండా ఇతర భాషలో షాపింగ్ చేయడానికి ప్రాధాన్యత ఇవ్వనున్నట్టు కంపెనీ గుర్తించింది. వీరి కోసమే హిందీ లాంగ్వేజ్ సపోర్టును అమెజాన్ ఇండియా ప్రవేశపెట్టింది. -
చదివేస్తున్నారు
కైసా హై? క్యా కర్తా హై? అని హిందీ లాంగ్వేజ్‌లో బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీని ప్రశ్నలు అడిగితే తమిళంలో ఆన్సర్స్ చెబుతున్నారు. ఎందుకంటే రజనీకాంత్‌కు దీటుగా డైలాగ్స్ చెప్పాలని తమిళ డైలాగ్స్ ప్రిపేర్ అవుతున్నారాయన. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా ఓ సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఇందులో త్రిష, సిమ్రాన్ కథానాయికలుగా నటిస్తున్నారు. నవాజుద్దీన్ సిద్ధిఖీ కీలక పాత్రలో కనిపించన్నారు. 19 ఏళ్ల సినీ ప్రస్థానంలో బాలీవుడ్లో ఎన్నో డిఫరెంట్ రోల్స్ చేసిన ఆయన ఈ సినిమాతో కోలీవుడ్‌కి ఎంట్రీ ఇస్తుండటం విశేషం. ‘‘నా తొలి తమిళ సినిమాకు డైలాగ్స్ ప్రిపేర్ అవుతున్నాను. సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో కలిసి పనిచేస్తున్నందుకు ఆనందంగా ఉంది’’ అని ఓ ఫొటోను షేర్ చేశారు సిద్ధిఖీ. ఫొటో చూస్తుంటే నవాజుద్దీన్ శ్రద్ధగా చదివేస్తున్నట్లు అనిపిస్తోంది కదూ. ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది. -
దక్షిణాదిలో హిందీని విస్తృతం చేయాలి
హైదరాబాద్: జాతీయ భాష హిందీని ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా నేర్చుకోవాలని కేంద్ర మానవ వనరుల సహాయమంత్రి సత్యపాల్ సింగ్ అన్నారు. బోయిన్‌పల్లిలో కేంద్రీయ హిందీ సంస్థాన్ నూతన భవన నిర్మాణానికి ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీతో కలసి ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడుతూ.. హిందీ భాష నేర్చుకోవడానికి అత్యంత సులువుగా ఉండటంతోపాటు ఇతర భారతీయ, విదేశీ భాషలనూ నేర్చుకోవడంలోనూ ఉపయోగకరంగా ఉంటుందన్నారు. హిందీ భాషను దక్షిణాదిలోనూ విస్తృతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. సంస్థాన్ భవన నిర్మాణం త్వరగా పూర్తయ్యేందుకు స్థానిక ఎంపీ మల్లారెడ్డి, ఎమ్మెల్యే సాయన్న చొరవ తీసుకోవాలన్నారు. కేంద్ర సంస్థలకు స్థలమిచ్చేందుకు సిద్ధం రాష్ట్రంలో నిర్మించనున్న కేంద్ర సంస్థల కార్యాలయాలు, ఇతర భవనాలకు స్థలాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ అన్నారు. భాషాభివృద్ధికి సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారని తెలిపారు. రాష్ట్రంలో ప్రధాన భాషలైన తెలుగు–ఉర్దూ పరస్పర తర్జుమాకు 66 మంది ట్రాన్స్‌లేటర్లను నియమించినట్లు చెప్పారు. అధికారిక కార్యకలాపాల నిర్వహణకు హిందీ–తెలుగు–ఉర్దూ తర్జుమాకు అవసరమైన సిబ్బంది ఏర్పాటు అంశాన్ని పరిశీలించాలని కేంద్ర మంత్రిని కోరారు. 1976లో ప్రారంభమైన కేంద్రీయ హిందీ సంస్థాన్ ఆధ్వర్యంలో 16వేల మంది టీచర్లకు హిందీలో శిక్షణ ఇచ్చినట్లు సంస్థాన్ వైస్ చైర్మన్ కమల్ కిషోర్ గోయెంకా తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి, కేంద్రీయ హిందీ సంస్థాన్ డైరెక్టర్ నంద కిశోర్ పాండే, బోర్డు సభ్యులు పాల్గొన్నారు. -
తప్పుగా మాట్లాడితే దండించలేను : ఉప రాష్ట్రపతి
సాక్షి, న్యూఢిలీ : ప్రతి రాజ్యసభ సభ్యుడు హిందీ భాషలో తప్పనిసరిగా మాట్లాడాలని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు. దేశ సమైక్యత, సౌభ్రాతృత్వం కాపాడాలంటే ప్రతి భారతీయుడు తమ మాతృభాషతోపాటు ఏదైనా ఒక భారతీయ భాష నేర్చుకోవాలని సూచించారు. భాష వినియోగంలో ఏవైనా తప్పులు దొర్లినా కూడా మిమ్మల్ని దండించడానికి రాజు సిద్ధంగా లేడు’ అని సభ్యులనుద్దేశించి వెంకయ్య సరదాగా వ్యాఖ్యానించారు. హిందీని ప్రచారం చెయ్యడానికి బదులు.. ప్రతి ఒక్కరు ఆ భాషను తరచుగా ఉపయోగించాలని అన్నారు. రోజూవారి కార్యకలాపాలలో హిందీకి ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. నాకూ హిందీ కొత్తే.. ‘ మొదటిసారి ఢిల్లీకి వచ్చినపుడు నాకు హిందీ రాదు. అయినా ఇష్టంతో నేర్చుకున్న. హిందీయేతర రాష్ట్రాలకు ప్రాతినిథ్యం వహిస్తున్న రాజ్యసభ సభ్యులు హిందీ భాషని నేర్చుకోండి. హిందీలోనే మాట్లాడండి. భాష నేర్చుకునేటప్పుడు పొరపాటు మాటలు చోటుచేసుకోవడం మామూలే. వాటికి భయపడితే ఏ భాషనూ నేర్చుకోలేం. గ్రామర్ తప్పులకు భయపడకుండా, స్వేచ్ఛగా మాట్లాడండి’ అని మంగళవారం జరిగిన హిందీ ప్రచార సభలో వెంకయ్య అన్నారు. మాతృభాష పట్ల సరైన అవగాహన ఉన్నప్పుడు.. ఇతర భాషలు నేర్చుకోవడం తేలికవుతుందని అన్నారు. ఉత్తర భారతం నుంచి రాజ్యసభకు ప్రాతినిథ్యం వహిస్తున్న ఎంపీలు ఏదైనా ఒక దక్షిణ భారత భాషను నేర్చుకోవాలని సూచించారు. తమకు బాగా వచ్చిన ఏదైనా భారతీయ భాషలో రాజ్యసభలో సభ్యులు మాట్లాడేవిధంగా కొన్ని నియమాలు రూపొందిస్తున్నామని వెంకయ్య తెలిపారు. హిందీ భాషకు ప్రచారం కల్పించే ఉద్దేశంతో ‘హిందీ సలహ్కార్ సమితి’ సమావేశం మూడున్నరేళ్ల క్రితం (2014 డిసెంబరు) నిర్వహించారు. ఇకనుంచి ప్రతి ఏడాది రెండుసార్లు ఈ సమావేశం నిర్వహిస్తామని వెంకయ్యనాయుడు తెలిపారు. -
సుష్మా వర్సెస్ శశిథరూర్
సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ శశిథరూర్, కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఐక్యరాజ్య సమితిలో హిందీని అధికార భాషగా గుర్తించాలన్న సుష్మా ప్రతిపాదనపై థరూర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు బుధవారం వీరిద్దరి మధ్య లోక్‌సభలో వాగ్వాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. సుష్మా ఏం చెప్పారంటే... హిందీని ఇప్పటిదాకా ఐరాసలో అధికార భాషగా గుర్తించలేకపోవటంపై చాలా మంది ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. కానీ, అదంతా సులువైన అంశం కాదు. సభ్యుల మద్దతుతోపాటు ఆ క్రమంలో ఆర్థికంగా కూడా చాలా వెచ్చించాల్సి ఉంటుంది. 40 కోట్ల రూపాయలు కాదు.. 400 కోట్ల రూపాయాలు వెచ్చించేందుకు కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఈ మేర ప్రయత్నాలు ప్రారంభించాం కూడా. భారత్ చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న దేశాలు అండగా నిలుస్తామని హామీ కూడా ఇచ్చాయి అని ఆమె వివరించారు. ఇంతలో శశిథరూర్ కలగజేసుకుని సుష్మా ప్రసంగంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘‘హిందీ మన జాతీయ భాష కాదు. అధికార భాష మాత్రమే. అసలు ఐరాసలో మనం అధికార భాషను కలిగి ఉండాల్సిన అవసరం ఏంటి? ఐరాసలో పని చేసిన అనుభవంతో నేను చెబుతున్నా 22 దేశాల్లో మాట్లాడే అరబిక్నే చేర్చనప్పుడు.. హిందీని చేరుస్తారనుకోవటం మూర్ఖత్వమే అవుతుంది. ఏదో ప్రధాని, విదేశాంగ శాఖ మంత్రి హిందీలో అక్కడ ప్రసంగించారని గర్వంగా చెప్పుకుంటున్నారు. కానీ, భారతీయులు దాన్ని గొప్పగా భావించటం లేదు. ప్రధాని తమిళ వ్యక్తి అయితే.. తమిళ్ మాట్లాడితే.. ఆ భాషను ఐరాసలో అధికార భాష చేయాలని ప్రతిపాదిస్తారా? అంటూ థరూర్ మండిపడ్డారు. అయితే సుష్మా మాత్రం శశిథరూర్ వ్యాఖ్యలను తేలికగా తీసుకున్నారు. 129 దేశాలకు మద్దతు తెలపాలని కోరినట్లు లోక్‌సభకు ఆమె వివరించారు. -
హిందీ అందరూ నేర్చుకోవాలి
సాక్షి, హైదరాబాద్ : దేశంలో ప్రతి పౌరుడు హిందీ భాష నేర్చుకోవాల్సిన అవసరం ఉందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. అమీర్‌పేటలో ఆదివారం నిర్వహించిన దక్షిణ భారత హిందీ ప్రచార సభ విశారద స్నాతకోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. భాష భావాన్ని వ్యక్తీకరించేందుకు, మానసిక వికాసానికి దోహదపడుతుందన్నారు. ప్రతి ఒక్కరూ మాతృభాష నేర్చుకోవాలని.. మాట్లాడాలని సూచించారు. తల్లి, జన్మభూమి, మాతృభాష, మాతృదేశాన్ని మరిచిపోవద్దని వెంకయ్యనాయుడు విజ్ఞప్తి చేశారు. దేశంలో హిందీ ఎక్కువగా మాట్లాడుతారని.. అర్థం చేసుకుంటారని అన్నారు. ఈ నేపథ్యంలో హిందీ భాషను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. 1935లో విజయవాడలో దక్షిణ భారత హిందీ ప్రచారసభ స్థాపితమైందని, దీని ద్వారా అధ్యాపకులు, ప్రచారకులు తయారయ్యారని తెలిపారు. హిందీ ప్రచార సభల వల్ల లక్షలాది మంది విద్యార్థులు ప్రయోజనం పొందుతున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, బీజేపీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. -
నో చాన్స్!
సాక్షి, చెన్నై: రాష్ట్రంలోకి హిందీ, సంస్కృతం అనుమతించే ప్రసక్తే లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వ కొత్త విద్యా విధానం విషయంలో తమ స్పష్టతను రాష్ట్ర పాఠశాల, ఉన్నత విద్యా శాఖల మంత్రులు బెంజిమిన్, అన్భళగన్‌లు తెలియ జేశారు. అసెంబ్లీ వేదికగా మంత్రులు హామీని డీఎంకే ఆహ్వానించింది. అదే సమయంలో ప్రత్యేక తీర్మానానికి పట్టుబడుతూ, డీఎంకే పంపిన విజ్ఞప్తిపై స్పీకర్ ధనపాల్ పరిశీలన జరుపుతున్నారు. తమిళులకు భాషాభిమానం ఎక్కు వే అన్న విషయం తెలిసిందే. అందుకే ఇక్కడ, హిందీ, సంస్కృతంకు చోటు లేదని చెప్పవచ్చు. ఆ రెండు భాషల్ని అనుమతించే ప్రసక్తే లేదని ఆది నుంచి ఇక్కడి రాజకీయ పక్షాలు స్పష్టం చేస్తూ వస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ఇటీవల కేంద్ర ప్రభుత్వం కొత్త విద్యా విధానంకు సిద్ధం కావడంతో, బలవంతంగా హిందీ, సంస్కృతం రుద్దే ప్రయత్నం జరుగుతున్నదన్న ఆందోళనలు బయలు దేరాయి. దీనికి వ్యతిరేకంగా పోరు బాటు సైతం సాగుతూవస్తున్నది. ఈ నేపథ్యంలో మంగళవారం అసెంబ్లీలో ప్రాథమిక, ఉన్నత విద్యా శాఖలకు కేటాయింపులపై జరిగిన చర్చలో కేంద్ర ప్రభుత్వ కొత్త విద్యా విధానం ప్రస్తావనకు వచ్చింది. డీఎంకే సభ్యుడు తంగం తెన్నరసు రాష్ట్రంలోని విద్యా విధానాలు, కేటాయింపుల గురించి ప్రసంగాల్ని హోరెత్తిస్తూ, కేంద్ర ప్రభుత్వ కొత్త విద్యా విధానంలో రాష్ట్ర ప్రభుత్వ స్పష్టతను ప్రకటించాలని డిమాండ్ చేశారు. కేంద్రం ప్రకటించిన కమిటీలో అధికారులే ఉన్నారంటూ వ్యాఖ్యానించారు. ఇందుకు ఉన్నత విద్యా శాఖ మంత్రి అన్భళగన్ స్పందించారు. కొత్త విద్యావిధానానికి సంబంధించిన కొన్ని అం శాలు కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చి ఉన్నాయని వివరించారు. వీటిని పరిశీలించి, అందుకు తగ్గ సమాధానా లు, అభిప్రాయాలను అమ్మ జయలలిత సకాలంలో ప్రకటిస్తారని పేర్కొన్నారు. తమిళనాడు సంక్షేమం, తమిళ భాషాభ్యున్నతి, సంస్కృతి సంప్రదాయాల ప రిరక్షణ దిశగా తమ ప్రభుత్వం ముందు కు సాగుతుందే గానీ, వాటిని కాలరాసే ప్రయత్నాలను అనుమతించ బోదని స్పష్టం చేశారు. తమిళనాడులోకి హిందీ, సంస్కృతంను బలవంతంగా రుద్దేందు కు తగ్గ అవకాశాలను తాము ఇచ్చే ప్ర సక్తే లేదన్నారు. తమిళనాడులోని విద్యా విధానం, ఇక్కడ అవకాశాలు తదితర అంశాలను కేంద్రం దృష్టికి తమ అభిప్రాయాల ద్వారా తీసుకెళ్తామన్నారు. ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, హిందీ, సంస్కృతంలకు ఇక్కడ అవకాశాలు కల్పించబోమని మరో మారు స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని పాఠశాల విద్యా శాఖ మంత్రి బెంజిమిన్ పేర్కొంటూ, ఆ రెండింటికి అనుమతి లేదని వ్యాఖ్యానించారు. ఇక, అన్భళగన్ తన ప్రసంగంలో మదురై, చెన్నై , అన్నావర్సిటీలకు వీసీల నియా మకంకుగాను ఎంపిక కమిటీ నియమించామని ప్రకటించారు. ఈ కమిటీ ఇచ్చే నివేదికను గవర్నర్‌కు పంపించడం జరుగుతుందని, ఆ తర్వాతే వీసీల నియామకం ఉంటుందని వివరించారు. ఇక, హిందీ, సంస్కృతాన్ని రాష్ట్రంలోకి అనుమతించేందుకు అవకాశాలు ఇవ్వం అని అసెంబ్లీ వేదికగా మంత్రులు స్పష్టం చేయడాన్ని ప్రధాన ప్రతి పక్ష నేత ఎంకే స్టాలిన్ ఆహ్వానించారు. అదే సమయంలో తాము ఇచ్చిన ప్రత్యేక తీర్మానం అంశాన్ని పరిగణించాలని స్పీకర్‌ను కోరారు. ఈ విజ్ఞప్తి పరిశీలనలతో ఉన్నట్టు ఈసందర్భంగా స్పీకర్ ధనపాల్ ప్రకటించారు. ముందుగా ప్రశ్నోత్తరాల సమయంలో మంత్రి ఎడపాడి పళని స్వామి ఓ ప్రశ్నకు సమాధానం ఇస్తూ, నాగపట్నం జిల్లాలోని వెట్టారులో చెక్ డ్యాంల నిర్మాణానికి పరిశీలన జరుపుతున్నామని ప్రకటించారు. ఇక, పంచాయతీ యూనియన్ల విభజన ప్రక్రియ గురించి మరో మంత్రి ఎస్పీ వేలుమణి ప్రసంగిస్తూ, జిల్లాల కలెక్టర్లు ఇచ్చే నివేదిక ఆధారంగా నియమ నిబంధనల మేరకు విభజన పర్వం సాగుతుందన్నారు. ఇక, కొత్త జిల్లాల ఏర్పాటు గురించి మంత్రి ఆర్బీ ఉదయకుమార్ ప్రసంగిస్తూ, ప్రస్తుతానికి అలాంటి యోచన లేదు అని స్పష్టం చేశారు. సభలో ఒకరు ప్రసంగిస్తున్న సమయంలో మరొకరు అడ్డు పడే విధంగా సాగుతున్న వ్యవహారంపై సీఎం జయలలిత స్నేహ పూర్వక సూచనను సభలో చేయడం విశేషం. ప్రతి పక్ష సభ్యులు ఏదేని అంశాలపై చర్చ సాగిస్తున్నప్పుడు, ఆ చర్చ ముగిసే వరకు మధ్య మధ్యలో ప్రశ్నలు వేయడం మానుకుంటే మంచిదని, ప్రభుత్వం చేసిందా.చేస్తుందా..? సమాధానం ఎవరు ఇస్తారు..? ఇలా మధ్య మధ్యలో ప్రశ్నలను సంధించడం వలను సమాధానాలు ఇచ్చేందుకు అప్పటికప్పుడే మంత్రులు సిద్ధం అవుతున్నారని సూచించారు. -
మూడు జంటల కథ
గ్లిట్టర్స్ ఫిల్మ్ అకాడమీ బ్యానర్‌పై గతంలో ‘బమ్ ధమ్’ చిత్రాన్ని నిర్మించిన దీపక్ బల్దేవ్ తొలి ప్రయత్నంగా ‘ఫుల్ మూన్’ అనే చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ప్రకాష్ ఠాకూర్ సమర్పణలో గ్లిట్టర్స్ బ్యానర్‌పై తెలుగు, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ‘బ్యాడ్ డెసిషన్స్ మేక్ బెటర్ స్టోరీస్’ అనేది ఉపశీర్షిక. దీపక్ బల్దేవ్ మాట్లాడుతూ - ‘‘మంచి కథ, కథనంతో ఈ చిత్రాన్ని నిర్మించనున్నాం. రెగ్యులర్ షూటింగ్ ఈ నెలాఖరు నుంచి డెహ్రడూన్, సిమ్లా, కసోల్‌లలో జరుగుతుంది. మూడు జంటల కథతో తెరకెక్కనున్న ఈ చిత్రంలో కెనడాకి చెందిన షీక అనే అమ్మాయి ఓ కథానాయికగా నటించనుంది’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: అభిలాష్. -
అంతర్జాతీయ భాషగా హిందీ
మనదేశంలో కోట్లాది ప్రజల గుండెచప్పుడును వినిపించే భాష హిందీ. హిందీ జాతీయ భాషగా, రాజభాషగా, అంతర్జాతీయ భాషగా గుర్తింపు పొందింది. 180 విశ్వవిద్యాలయాల్లో హిందీకి సంబంధించి అధ్యయనం, పరిశోధనలు జరుగుతున్నాయి. బంగ్లాదేశ్, నేపాల్, మారిషస్, ఫిజీ, జపాన్, గయానా, సురినామ్, ట్రినిడాడ్, హాలెండ్, హాంకాంగ్, థాయిలాండ్, సింగపూర్, జాంబియా, హుడాంగా, కెనడా, హోలాండ్, స్విట్జర్లాండ్, హంగేరి, రష్యా, చైనా, ఖతర్, అమెరికా మొదలగు దేశాల్లో హిందీ తన విలక్షణ శైలితో వెలుగొందుతోంది. నేడు అన్ని సామాజిక వర్గాల్లో హిందీ ప్రాముఖ్యత పెరుగు తోంది. ఇందులో విశేషంగా భారతీయ సినిమా రంగం పాత్ర కనిపి స్తుంది. నేడు అమెరికాలో హిందీ తరగతులు నిర్వహిస్తున్నారు. దీని ద్వారా ఎంతో మంది అమెరికావాసులు హిందీ నేర్చుకుంటున్నారు. హిందీని శాస్త్ర, సాంకేతిక రంగాలకు సంబంధించిన శబ్దకోశాలచే సన్నద్ధం చేస్తూ మరోవైపు ప్రసార, ప్రచార రంగాలకు కూడా విస్తరింపజేస్తున్నారు. సాంకేతిక విజ్ఞానంలో వచ్చిన మార్పులతో ప్రతి ఇంట్లో ప్రతి గ్రామంలో శ్రవ్య, దృశ్య సాధనాల ద్వారా హిందీ ప్రచారంలోనూ ప్రగతిలోనూ విశేషమైన ప్రగతి కనిపిస్తుంది. హిందీ ఒక సమృద్ధమైన, సంపన్నమైన భాష. దీనికి వ్యాకరణం. లిపి, శబ్ద సంపద ఉంది. జనాభా దృష్ట్యా చూస్తే హిందీ మాట్లాడే వారి సంఖ్య ఇంగ్లిష్, చైనీస్ తర్వాత మూడోస్థానంలో ఉంది. ప్రసార మాధ్యమంలో కూడా హిందీ తన సుస్థిరమైన స్థానాన్ని సాధించింది. ఇంటర్నెట్, కంప్యూటర్ నిపుణులు దేవనాగరి లిపిని అత్యధికంగా సమర్థించి స్వీకరించారు. ఒక లక్షా 75 వేల హిందీ శబ్దాలు ఇంటర్నెట్లో నిక్షిప్తం చేశారు. భారత్ సంస్కృత భాష సహకారంతో హిందీలో 8 లక్షల శబ్దాలు కొత్తగా ఆవిష్కరించారు. కంప్యూటర్, మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, సినిమా, అన్ని చానల్స్ హిందీలో ప్రసారం చేస్తున్నారు. నేడు చాలా కార్యక్రమాలు డబ్బింగ్ ద్వారా హిందీలో ప్రసారం అవుతున్నాయి. సెప్టెంబర్ 14ను హిందీ దివస్(హిందీ భాషా దినోత్సవం)గా దేశమంతటా ఘనంగా జరుపుకుంటారు. కన్నడ, మలయాళం, తమిళం, ఒరియా, తెలుగు, అస్సామీ, గుజరాతీ, పంజాబీ, మరాఠీ, మణిపురి ఇలా భాష ఏదైనా అందరికీ అర్థమయ్యేది హిందీ. హిందీ.. ఇది కేవలం భాష కాదు. కోట్లాది భారతీయుల హృదయ స్పందన. మన ఆత్మగౌరవం. మన సనాతన సంస్కార సాఫల్యాలకు ప్రతిబింబం. ‘హిందీసే హమ్ హిందుస్తానీ హై హమ్’. (నేడు హిందీ భాషా దినోత్సవం) డా॥హిందీ అధ్యాపకులు, ప్రభుత్వ జూనియర్ కళాశాల, వెల్దుర్తి, మెదక్ జిల్లా. మొబైల్ : 9848768286 -
‘డిజిటల్’లో హిందీ రాజ్యం
యాప్స్ తయారీ ద్వారా కంపెనీలకు లబ్ధి: మోదీ * హిందీని విస్మరించటం దేశానికి నష్టదాయకం * ప్రపంచ హిందీ సదస్సులో ప్రధాని మోదీ భోపాల్: రాబోయే రోజుల్లో డిజిటల్ ప్రపంచంలో ఇంగ్లిష్, చైనీస్, హిందీ భాషలు రాజ్యమేలుతాయని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేర్కొన్నారు. భాషా మార్కెట్ భారీగా ఉంటుందని.. దానిపై సత్వరమే యాప్స్ (అప్లికేషన్లు) తయారు చేయటం ద్వారా కంపెనీలు లాభపడవచ్చని సూచించారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 6,000 భాషల్లో 90 శాతం భాషలు గతించిన ఆనవాళ్లుగా మిగిలిపోయే ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తుండటాన్ని ప్రస్తావిస్తూ.. అంతరించిపోతున్న భాషలను పరిరక్షించటానికి చర్యలు చేపట్టాలని కూడా ప్రధాని పిలుపునిచ్చారు. గురువారం భోపాల్‌లో పదో ప్రపంచ హిందీ సదస్సును మోదీ ప్రారంభిస్తూ ప్రసంగించారు. హిందీ ప్రాముఖ్యతను, దానిని సుసంపన్నం చేయాల్సిన అవసరాన్ని ఉద్ఘాటిస్తూ.. హిందీని విస్మరించటం దేశానికి నష్టదాయకమని పేర్కొన్నారు. ‘‘నా మాతృభాష గుజరాతీ అయినప్పటికీ.. నాకు హిందీ తెలియకపోతే నా పరిస్థితి ఏమై ఉండేదని నేను అప్పుడప్పుడూ అనుకుంటుంటాను. ఏ భాషను అయినా తెలుసుకోవటం వల్ల ఉండే బలమేమిటనేది నాకు బాగానే తెలుసు. దున్నపోతులను కొనుగోలు చేసేందుకు గుజరాత్ వచ్చే ఉత్తరప్రదేశ్ వ్యాపారులకు టీ అమ్ముతూ నేను హిందీ నేర్చుకున్నాను’’ అని తెలిపారు. మారిషస్, మంగోలియా, చైనా, రష్యా తదితర దేశాల్లో హిందీకి పెరుగుతున్న ప్రజాదరణను తాను వీక్షించానని చెప్పారు. హిందీ భాషను విదేశాల్లో విస్తరించటంలో బాలీవుడ్ సినిమాల పాత్ర ఎంతో ఉందన్నారు. దేశంలో మాట్లాడే వివిధ ప్రాంతీయ భాషల్లోని మంచి పదాలను హిందీలో చేర్చటానికి కార్యసదస్సులు నిర్వహిస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. ‘హిందీ మహాకుంభ మేళా’గా మోదీ అభివర్ణించిన ఈ సదస్సులో 40 దేశాల నుంచి ప్రతినిధులు పాల్గొన్నారు. అంతకుముందు విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మాస్వరాజ్ మాట్లాడుతూ.. విశ్వ హిందీ సదస్సు ఇతర సదస్సులకన్నా భిన్నమైనదని పేర్కొన్నారు. హిందీ భాష సాహిత్య కోణాలపై మాత్రమే కాకుండా.. వివిధ రంగాల్లో ఈ భాషను విస్తరించటానికి గల అవకాశాలపై ఈ సదస్సులో దృష్టి కేంద్రీకరించటం జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌చౌహాన్ కూడా మాట్లాడారు. ఈ సందర్భంగా సదస్సు జ్ఞాపకార్థం పోస్టల్ స్టాంపును మోదీ ఆవిష్కరించారు. -
హిందీ కోసమే పుట్టి.. భాషను ప్రచారం చేస్తూ..
దక్షిణ భారత హిందీ ప్రచారసభ... ఎంతోమందికి హిందీ భాషను అందచేసిన సంస్థ... త్వరలో వందేళ్లు పూర్తి చేసుకోబోతున్న సంస్థ... గురువారం నుంచి హిందీ ఉత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో ఒక్కసారి దక్షిణ భారత హిందీ ప్రచారసభ గురించి తెలుసుకుందాం.. మద్రాసు ప్రావిన్స్... ఒకనాడు దక్షిణాది వారంతా ఉన్న ప్రాంతం. ఉత్తరాదిలో హిందీ భాషను విస్తృతంగా మాట్లాడతారు. ఆ సమయంలో స్వాతంత్య్ర పోరాటం ఉద్ధృతంగా జరుగుతోంది. ఉత్తరాది వారితో కలిసి, దక్షిణాది వారు కూడా ఉద్యమంలో పాల్గొనాలంటే ఒకే భాష ఆవశ్యకత ఉంది. దక్షిణాది రాష్ట్రాలలో హిందీ భాషను ప్రచారం చేసే లక్ష్యంతో మాత్రమే ఈ సభను 1918లో మద్రాసులో మహాత్మాగాంధీ స్థాపించారు. గాంధీజీ తన తుదిశ్వాస వరకు దక్షిణ భారత హిందీప్రచార సభకు అధ్యక్షులుగా కొనసాగారు. ఈ సభకు మొట్టమొదటి ప్రచారకులుగా గాంధీజీ కుమారుడైన దేవదాస్ గాంధీ వ్యవహరించారు. మొట్టమొదటి హిందీపాఠాన్ని గాంధీయే చెప్పారు. క్రమంగా హిందీ శిక్షణ పాఠశాలలను ఆంధ్ర తమిళనాడు ప్రాంతాలకు విస్తరించారు. ఉద్యమం ఏకభాష ప్రాతిపదికగా నడపడానికే జాతీయభాషగా హిందీ ప్రచారం ప్రారంభించారు. ఇలా చేయడం వల్ల ఉద్యమం తీవ్రరూపం దాల్చుతుందని, ఆంగ్లేయులను సులువుగా తరిమిగొట్టగలమని నాటి జాతీయ నాయకులు భావించారు. స్థానిక నాయకులను ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేయడం వల్ల హిందీప్రచారం మరింత విస్తృతంగా జరుగుతుందని గాంధీజీ భావించారు. అందులో భాగంగానే హిందీ ప్రచార ఉద్యమం గోఖలే అధ్యక్షతన అనిబిసెంట్ ప్రారంభించారు. 1920 వరకు ఈ కార్యాలయం మద్రాసులోని జార్జ్‌టౌన్‌లో ఉంది. ఆ తర్వాత కొంత కాలానికి మైలాపూర్, అక్కడ నుంచి ట్రిప్లికేన్‌కి మారింది. నాటి నుంచి 1936 వరకు ఈ సభ ఆ ప్రాంతంలోనే ఉంది. 1936 లో ఈ శాఖలను విస్తరించి, ఉద్యమ తీవ్రతను పెంచాలని భావించారు ఉద్యమ నాయకులు. అప్పుడే ఈ సభను ట్రిప్లికేన్ నుంచి టి.నగర్‌లోని తణికాచలం రోడ్డులోని, ఏడు ఎకరాల విస్తీర్ణం గల ప్రాంతంలోకి తరలించారు. ఈ భవనానికి జనాబ్ అబ్దుల్ హమీద్‌ఖాన్ శంకుస్థాపన రాయి వేశారు. సరిగ్గా అక్టోబరు 7, 1936 లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్‌కి అధ్యక్షులుగా ఉన్న పండిట్ జవహర్లాల్ నెహ్రూ ప్రారంభించారు. ఈ సభలో1922 నుంచి ప్రాథమిక పరీక్షలు నిర్వహించారు. డిగ్రీ స్థాయిలో రాష్ట్రభాష విశారద పరీక్షను నిర్వహించి, 1931లో స్నాతకోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా కాకా కాలేకర్ ప్రసంగించారు. రెండో ప్రపంచ యుద్ధానంతరం 1946లో ఈ సభ రజతోత్సవం చేసుకుంది. ఈ ఉత్సవాలకు గాంధీజీ అధ్యక్షత వహించారు. గాంధీజీ విచ్చేయడాన్ని చారిత్రాత్మకంగా భావించి, ఈ సందర్భంగా ఆయన గౌరవార్థం, ఆయన ప్రసంగించిన ప్రాంతంలో గాంధీ మంటపం నిర్మించాలని తలచారు. అనుకున్నట్లుగానే జూన్ 9, 1963 నాటికి గాంధీ మంటప నిర్మాణం పూర్తయింది. ఆ మంటపాన్ని మొరార్జీ దేశాయ్ ప్రారంభించారు. 'గాంధీ పదవిదాన్' మంటపం నగరంలో ఒక చిహ్నంగా నిలిచింది. గాంధీమహాత్మునికి సంబంధించిన కార్యక్రమాలను, స్నాతకోత్సవ కార్యక్రమాన్ని నేటికీ ఇక్కడే నిర్వహిస్తున్నారు. 1993లో, దేశప్రధాని, ప్రచార సభ అధ్యక్షులు అయిన పి.వి.నరసింహారావు ప్లాటినం జూబ్లీ ఉత్సవాలను అమృతోత్సవాలుగా న్యూఢిల్లీలోని తన నివాసంలో ఘనంగా జరిపారు. 80 మంది ప్రారంభమైన ఈ సంస్థలో రెండేళ్లకే వేలకొలదీ విద్యార్థులు చేరారు. ప్రస్తుతం 6000 కేంద్రాలలో 7000 మందికి పైగా పనిచేస్తున్నారు. ప్రస్తుతం దక్షిణభారత హిందీ ప్రచార సభ శతసంవత్సరానికి పరుగులు తీస్తోంది. దక్షిణ భారత హిందీ ప్రచార సభకు అధ్యక్షులుగా వ్యవహరించినవారు... 1918 - 1948 గాంధీ 1948 - 1965 బాబూ రాజేంద్రప్రసాద్ 1965 - 1966 లాల్‌బహదూర్ శాస్త్రి 1966 - 1984 ఇందిరాగాంధీ 1984 - 1991 రాజీవ్ గాంధీ 1991 - 1997 పి.వి.నరసింహారావు 1997 - 1998 డా.బి.డి.జెట్టి 1998 - 2001 ఆర్.వెంకట్రామన్ 2001 - 2003 జస్టిస్ రంగనాథ్ మిశ్రా 2003 - 2005 ఎం. మహదేవ్ 2005 - 2009 ఎం.వి.రాజశేఖరన్ ప్రస్తుతం డా. జస్టిస్ వి.ఎస్.మలిమథ్ - డా. పురాణపండ వైజయంతి, సాక్షి, చెన్నై -
రజనీగంధ ఫూల్ తుమ్హారే...
సంగీతం / యోగేష్ అందరికీ ఈ పాట గుర్తుండే ఉంటుంది. బాసూ చటర్జీ దర్శకత్వం వహించిన ‘రజనీగంధ’ సినిమాలోనిది. అమోల్ పాలేకర్, విద్యా సిన్హా నటించారు. ఈ పల్లవినిగానీ పాటను గానీ వింటే ఇందులో ఉర్దూ ప్రభావం చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే దీనిని రాసింది యోగేష్. ఉర్దూ సాహిత్యం నుంచి వచ్చిన మజ్రూ సుల్తాన్‌పురి, హస్రత్ జైపురి, సాహిర్ వంటి గీత రచయితలు ఉర్దూ ప్రయోగం ఎక్కువ చేసేవారు. కాని ఇందీవర్, యోగేష్‌లాంటి వాళ్లు మాత్రం శుద్ధ హిందీని ఎక్కువగా వాడేవారు. యోగేష్‌ది లక్నో. చిన్న వయసులోనే తండ్రి చనిపోవడంతో హిందీ భాష మీద ఉన్న అభిమానంతో బొంబాయి చేరుకున్నాడు. చాలా కాలం పాటల రచయితగా అవకాశం రాలేదు. చివరకు హృషికేశ్ ముఖర్జీ తన ‘ఆనంద్’ సినిమాలో అవకాశం ఇచ్చాడు. అందులో గుల్జార్ వంటి హేమాహేమీలు రాసిన ‘మైనే తేరే లియే హీ సాత్ రంగ్ కే సప్నే చునే’లాంటి పాటలు ఉన్నాయి. కాని యోగేష్ రాసిన ‘జిందగీ కైసి హై పహేలీ’.... ‘కహీ దూర్ జబ్ దిన్ ఢల్ జాయే’... పాటలకు ఎక్కువ పేరు వచ్చింది. ‘ఆనంద్’కు సంగీతం అందించిన సలీల్ చౌధురికి యోగేష్ రచనా శైలి నచ్చడంతో బాసూ చటర్జీకి చెప్పి ‘ఛోటీ సి బాత్’లో అవకాశం ఇప్పిస్తే అందులో యోగేష్ రాసిన ‘నాజానే క్యూ హోతాహై యే జిందగీ కే సాథ్’.... ‘జానేమన్ జానేమన్ తేరే దో నయన్’... పాటలు హిట్ అయ్యాయి. ఆ తర్వాత ‘రిమ్జిమ్ గిరె సావన్’... ‘కయి బార్ యూ భి దేఖాహై’... వంటి హిట్ పాటలు ఎన్నో రాశాడు. గాయకుడు ముఖేశ్‌కు ఒకే ఒక్కసారి జాతీయ అవార్డు వచ్చింది. అది యోగేశ్ రాసిన ‘కయి బార్ యూ భి దేఖాహై’... పాటకే. ఇది కూడా ‘రజనీగంధ’ సినిమాలోనిదే. యోగేశ్‌కు ప్రస్తుతం 70 సంవత్సరాలు. -
ఉర్దూ ప్యాలెస్
పంజాబీ సాహిత్యం నుంచి ఉర్దూ భాష ఆవిర్భవించిందని సాహితీకారుల అభిప్రాయం. దిల్లీలో అధికంగా మాట్లాడే ఖడీబోలీ - హిందీ భాషల నుంచి ఉర్దూ వ్యాప్తి చెందిందని మరికొందరి వాదన. ఉర్దూ సాహిత్యాన్ని ప్రోత్సహించడానికి, దక్షిణాది ప్రాంతాల్లో వాడుక భాషలైన ఉర్దూ-తెలుగు-హిందీ సాహిత్యాలపై తగిన తులనాత్మక పరిశోధనలకోసం ‘ఉర్దూ ప్యాలెస్’(ఐవాన్-ఇ-ఉర్దూ)ను డాక్టర్ సయ్యద్ ఖాద్రీజోర్ స్థాపించారు. పంజగుట్టలో నిమ్స్ ఆస్పత్రికి ఎదురుగా ఈ ప్యాలెస్ ఉంది. హైదరాబాద్‌ను పాలించిన మహ్మద్ కులీ కుతుబ్‌షాను ప్రముఖ కవి పండితుడుగా ఉర్దూ భాషాభిమానులు కీర్తిస్తారు. 16వ శతాబ్దంలో ఉర్దూ రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో వాడుక భాషగా పరిఢవిల్లింది. ఉర్దూ రచయితలను ప్రోత్సహించడానికి, ఉర్దూ సాహిత్యంపై పరిశోధనలు, దక్కను ప్రాంత చర్రిత, సాహిత్య-సంస్కృతులను చాటి చెప్పేందుకు ఓ ప్రత్యేక సంస్థను నెలకొల్పాలని మొయినుద్దీన్ ఖాద్రీజోర్ 1920లోప్రతిపాదించారు. ఆ ప్రతిపాదనల మేరకు ఇదారా-ఇ-అదబియాత్-ఇ-ఉర్దూ(ఉర్దూ సాహిత్య సంస్థ), ఐవాన్-ఇ-ఉర్దూ(ఉర్దూ ప్యాలెస్) లను 1931 జనవరి 25న నెలకొల్పారు. 1955లో సంస్థ రజతోత్సవాల సందర్బంగా శాశ్వత భవనాల నిర్మాణం కోసం ఖాద్రీజోర్ భార్య తన తరపున పంజగుట్టలోని వెయ్యి గజాల స్థలాన్ని ఉచితంగా ఇచ్చారు. ఈ భవన సముదాయానికి ఆనాటి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు శంకుస్థాపన చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున సాయం కూడా అందజేశారు. మూడువైపుల క్రైస్తవ చర్చి మాదిరి అరవై అడుగుల ఎత్తై టవర్లు కనబడతాయి. ఎల్లోరా గుహల మాదిరిగా 12 అడుగుల ఎత్తులో ప్రవేశ ద్వారం, ఆ ద్వారం పైభాగాన తామర పూలను పోలిన లతాకృతుల చెక్కడాలు చక్కగా కనిపిస్తాయి. కర్ణాటక-బహమనీ, స్పానిష్-మూరిష్ ఆర్కిటెక్చర్ కూడా భవననిర్మాణంలో కనిపిస్తుంది. ఆకర్షణీయమైన ఉర్దూ ప్యాలెస్‌లోని లోపలిభాగంలో చక్కని ఆడిటోరియం ఉంది. లైబ్రరీ, మ్యూజియం, రీసెర్చ్ స్కాలర్స్ కోసం రిఫరెన్స్ గ్రంథాలయం కూడా ఉంది. ఇక్కడ ఉన్న గ్రంథాలయంలో 40వేలకు పైగా గ్రంథాలున్నాయి. ఉర్దూ, పర్షియన్, అరబిక్, హిందీ, పంజాబీలో చాలా అరుదుగా దొరికే చారిత్రక ఆధార రాతప్రతులు కూడా ఇక్కడ ఉన్నాయి. వీటిని ఆరు సంపుటాలలో గ్రంథస్థం చేశారు. వీటిలో 16వ శతాబ్దం నాటి నవాబుల ఫర్మానాలు, నాటి ప్రముఖుల చేవ్రాలుతో ఉన్న లేఖలు, ఆనాటి చారిత్రక చిత్రాలు, భాషాసాహిత్యపరమైన మ్యాపులు, చార్టులు, రాతిశిలా ఫలకాలు, ఫొటో ఆల్బమ్స్... ఇలా అమూల్యమైన సమాచారం ఉంది. ఈ సంస్థ 1938 నుంచి ‘సబ్రాస్’ అనే మాసపత్రికను ప్రచురిస్తోంది. ప్రతిఏటా మహ్మద్ కులీకుతుబ్ షాహీల రాజ్యస్థాపక దినోత్సవాన్ని ఉర్దూప్యాలెస్ ఘనంగా నిర్వహిస్తోంది. ఈ సంస్థ స్థాపనలో కీలకపాత్ర పోషించిన డాక్టర్ సయ్యద్ జోర్ ఉస్మానియా, కశ్మీర్ విశ్వవిద్యాలయాల్లో ఉర్దూ ఆచార్యులుగా పనిచేశారు. ఈయన అనేక గ్రంథాలు రాశారు. దక్కను ప్రాంత చరిత్ర, సంస్కృతులపై జోర్ చేసిన రచనలు నేటికీ ఉపయోగపడుతున్నాయి. 80 సంవత్సరాల చరిత్రను తమలో దాచుకున్న ఈ గ్రంథాలయంలోని పుస్తకాలను కంప్యూటరీకరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గత కాలపు గుర్తులు చెదిరిపోకుండా తగిన మరమ్మతులు చేపట్టి సంస్థను ఆధునీకరించాల్సిన అవసరమూ ఉంది. కవులు, రచయితలు, రీసెర్చ్ స్కాలర్స్, చరిత్ర-భాషా సంస్కృతి అభిమానులు, ఉర్దూ విద్యార్థులతో ఇవన్-ఇ-ఉర్దూ భవనం నిత్యం బిజీగా ఉండే ఉర్దూ ప్యాలెస్‌ను ఒక్కసారైనా సందర్శించాలి. ఔత్సాహికుల కోసం... కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ‘నేషనల్ కౌన్సిల్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఉర్దూ లాంగ్వేజ్’ ద్వారా డీటీపీ కమ్ గ్రాఫిక్ డిజైన్స్, కాలిగ్రఫీల్లో పరీక్షలు ఏడాదిలో రెండు దఫాలు నిర్వహిస్తున్నారు. డిప్లొమా ఇన్ మల్టీ లింగ్వల్స్, డెస్క్‌టాప్ పబ్లిషింగ్‌లో శిక్షణ ఇస్తున్నారు. ఉర్దూ నేర్చుకోవాలనే తృష్ణ ఉన్నవారికోసం ప్రత్యేక పరీక్షలు ప్రతిఏటా రెండు దఫాలుగా నిర్వహిస్తోంది. ఈ పరీక్షలకు ప్రతి ఏటా 40 నుంచి 50 వేల మంది హాజరవుతున్నారు. రాష్ట్రస్థాయిలో ఏడో తరగతితో సమానమైన ఉర్దూ మహిన్, మెట్రిక్యులేషన్‌తో సమానమైన ఉర్దూ అలిమ్, ఇంటర్మీడియట్ స్థాయి ఉన్న ఉర్దూ ఫజిల్ పరీక్షలను కండక్ట్ చేస్తున్నారు. ముస్లిం యువతకు ఇవి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. -
ప్రజల అనుసంధానంలో హిందీ కీలకం: ప్రణబ్
న్యూఢిల్లీ: ప్రభుత్వం, ప్రజలను అనుసంధానించడంలో హిందీ భాష కీలకమైన పాత్ర పోషిస్తోందని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అన్నారు. సామాజిక, సాంస్కృతిక ఐక్యతా చిహ్నంగా హిందీ భాషను అభివర్ణించారు. శనివారం ఢిల్లీలో కేంద్ర హోంశాఖ నిర్వహించిన రాజభాష అవార్డుల కార్యక్రమంలో రాష్ట్రపతి పాల్గొని మాట్లాడారు. సామాజిక సంక్షేమ కార్యక్రమాలు విజయవంతం కావాలంటే వాటిని ప్రజలకు మాతృభాషలో అందించాలని సూచించారు. -
సొంత భాషలకు సాంత్వన
రాజ్యాంగం నిర్దేశించిన త్రిభాషా సూత్రాన్ని కూడా ఖాతరు చేయకుండా హిందీ భాష వ్యాప్తి మీదే ఆయా ప్రభుత్వాలు ఆసక్తి చూపిస్తున్నాయి. ఇదే హిందీయేతర భాషల ఉనికిని ఇబ్బందులలోకి నెట్టింది. స్థానిక భాషలను విద్యా సంస్థలలోనూ నిర్లక్ష్యం చేయడం పరిపాటి అయింది. ‘ప్రతీ రెండు వారాలకు ఒక భాష వంతున కనుమరుగైపోతున్న దశలో నేడు మనం ఉన్నాం. ఒక భాషను- తల్లి భాషను కోల్పోవడమంటే దాని ఉనికిపైనే ఎదిగిన యావత్తు విజ్ఞాన సంపదను పోగొట్టుకోవడమే. మనం ఒక భాషను చేజార్చుకోవడమంటే దానిని అంటి పెట్టుకుని పెరుగుతూ వచ్చిన స్థల, కాలాల పరిజ్ఞానం గురించీ, శతాబ్దాలుగా తృష్ణను పెంచుతున్న భావ సంపదనూ కోల్పో వడమే. ఒక భాషను కోల్పోవడమంటే శతాబ్దాలుగా, సహస్రాబ్దాలుగా మాన వుడు రుతువుల గురించీ, సాగర సంపదను గురించీ, వృక్ష, జంతుజాలాల గురిం చీ, ఫలపుష్పాదుల గురించీ, ప్రకృతి నియమాలను క్రమబద్ధం చేసిన వైజ్ఞానిక, గణిత, తాత్విక సంపదలను గురించి... ఒకటేమిటి? దృశ్యాదృశ్యమైన సకల సంపదనూ కోల్పోయినట్టే. భాష చచ్చిపోతే అక్షరాలు నిలబడవు. అవి లేనప్పుడు అర్థాలు చూపే పదకోశాలు ఉండవు. పదాలు జారిపోతే పద్యం ఉండదు. చదివేవాడు లేకపోతే తల్లిభాషలో పాఠమూ ఉండదు. ఒక సమాజం తన భాషే తన పురోగతికి ఆటంకమై పోయిందని నిర్ణయించుకున్నపుడు కూడా భాషల ఉనికే ప్రమాదంలో చిక్కుకుంటుంది.’ నేషనల్ జాగ్రఫిక్ సొసైటీ (లివింగ్టంగ్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఎన్డేంజర్డ్ లాంగ్వేజెస్ సంయుక్త సర్వేక్షణ నివేదిక) రాష్ట్రాల అధికార (మాతృ) భాషల ప్రస్తుత ప్రతిపత్తిని గురించి సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ నెల ఏడున వెలువరించిన తీర్పు గురించి చాలా మందికి తెలిసే ఉండాలి. దేశ ప్రజలకు భాషల ఎంపికలో సంపూర్ణ స్వేచ్ఛ ఉందనీ, ఆయా రాష్ట్రాలలో ఉండే స్థానిక భాషలను ప్రజల సౌకర్యార్థం అధికార భాషలుగా ప్రకటించుకుని, అమలు చేసుకునే హక్కు ఉందనీ ఆ తీర్పులో ధర్మాసనం స్పష్టం చేసింది. అధికారిక ఉత్తర ప్రత్యుత్తరాలు, అడ్వర్టైజ్మెంట్లు, సైన్‌బోర్డులకు ఆ భాషనే ఉపయోగించాలి. కానీ రాష్ట్రాల అధికార భాషలనూ, ముఖ్యంగా రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్ గుర్తించిన భాషలనూ విద్య, పాలనా వ్యవహారాలలో విరివిగా ప్రవేశపెట్టి ప్రజలకు ప్రయో జనం చేకూర్చవలసిన దశలో హైకోర్టులూ, సుప్రీంకోర్టూ వివిధ సందర్భాలలో చేసిన ప్రతికూల వ్యాఖ్యలు, తీర్పుల ఫలితంగా వాటిలో ఏకాభిప్రాయం కరువై గందర గోళం ఏర్పడింది. దాదాపు దశాబ్ద కాలం నుంచి ఇదే పరిస్థితి. కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన పలు రాజకీయ పార్టీల వ్యవహార సరళి కూడా ఇందుకు దోహదం చేసింది. విద్య, పాలనా రంగాలలో మాతృభాష ప్రాధా న్యాన్ని హిందీ భాషా ప్రయోజనాల త్రాసుతో తూచే పద్ధతిని ఆయా కేంద్ర ప్రభుత్వాలు తెచ్చాయి. కానీ 120 కోట్ల భారతీయులలో హిందీ మాట్లాడేవారు 45 కోట్లు మాత్రమే. అయినా రాజ్యాంగం నిర్దేశించిన త్రిభాషా సూత్రాన్ని కూడా ఖాతరు చేయకుండా హిందీ భాష వ్యాప్తి మీదే ఆయా ప్రభుత్వాలు ఆసక్తి చూపిస్తున్నాయి. ఇదే హిందీయేతర భాషల ఉనికిని ఇబ్బందులలోకి నెట్టింది. స్థానిక భాషలను విద్యా సంస్థలలోనూ నిర్లక్ష్యం చేయడం పరిపాటి అయింది. ఆఖరికి హైకోర్టు, కింది స్థాయి న్యాయస్థానాలలో కూడా మాతృభాషను వినియోగించకుండా కక్షిదారులు తమ మీద అభియోగాలను తమకు తెలిసిన భాషలో తెలుసుకునే అవకాశం లేకుండా చేస్తున్నారు. హైకోర్టుల సంగతి అటుంచి, కింది కోర్టులలో (సివిల్, క్రిమినల్) వాద ప్రతివాదాలూ, తీర్పులూ మాతృభాషలలోనే ఉండాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ప్రత్యేక ఆదేశాలు (జీవో నం. 485, సం.1974) ఇచ్చి 30 ఏళ్లు గడచిపోతున్నాయి. కానీ ఇంతవరకు వాటి అతీగతీ లేదు. ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టు తాజాగా ఇచ్చిన తీర్పు ఏ సందర్భంగా వెలువరిం చిందన్న అంశం ఆసక్తికరంగా మారింది. రాష్ట్రాల విభజన సమయంలో రాష్ట్రపతి ఒక భాషను అధికార భాషగా ప్రకటించాలన్న నిబంధన ఉన్నంత కాలం మాతృ భాషలకు పూర్తి న్యాయం జరిగే అవకాశం లేదు. రాష్ట్రాలు అమలు చేయవలసిన భాషను గురించి రాష్ట్రపతి ‘సంతృప్తికి లోబడే’ అధికార భాషగా ప్రకటించాలన్న నిబంధన అది. 1951 నాటి ఉత్తర ప్రదేశ్ అధికార భాషా చట్టానికి ఒక సవరణ (1989) వచ్చింది. ఈ సవరణ చెల్లదని ఉత్తర ప్రదేశ్ సాహిత్య సమ్మేళన్ వ్యాజ్యం దాఖలు చేసింది. దీనిని విచారించిన తరువాత ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. రాష్ట్రాలలో అధికార భాషను అమలు జరిపేందుకు శాసనసభలకు అధి కారం ఉందని ఆ తీర్పులో సుప్రీంకోర్టు పేర్కొన్నది. తన నిర్ణయం రాజ్యాంగం లోని 345 అధికరణకు లోబడి ఉన్నదేనని కూడా అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. అధికార కార్యకలాపాలకు ఒకటి లేదా అంతకు మించి భాషలను వినియోగించుకునే అంశం మీద శాసనసభలు నిర్ణయం తీసుకోవచ్చునని ఆ అధికరణం చెబుతోంది. ఇంతకూ 345 అధికరణంలో కనిపించే ‘హిందీ’ ప్రస్తావన రాష్ట్రాల మధ్య అనుసంధానంగా వినియోగించుకోవడానికి సంబంధించినదేగానీ, ఆయా రాష్ట్రాలలో ఉన్న స్థానిక భాషలను శాసించేందుకు కాదని కూడా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లోథా అధ్యక్షతన ఏర్పాటైన ధర్మాసనం వివరణ కూడా ఇచ్చింది. ఈ దృష్ట్యా యూపీ శాసనసభ అధికార భాష హిందీతో పాటు, ఉర్దూను రెండవ అధికార భాషగా (మన రాష్ట్రంలో మాదిరిగానే) ప్రవేశపెడుతూ తెచ్చిన సవరణ (1989) సబబేనని సుప్రీం పేర్కొన్నది. అలాగే ప్రభుత్వ సర్వీసుల (పబ్లిక్ సర్వీస్ కమిషన్) కమిషన్ నిర్వహించే పరీక్షలలో తెలుగు మాధ్యమంలో ఉత్తీర్ణులయ్యే అభ్యర్థులకు 5 శాతం ఉద్యోగాలు కేటాయించా లంటూ వచ్చిన పిటిషన్‌ను పరిశీలించి, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. కానీ దీనిని తెలుగేతర అభ్యర్థులు సుప్రీంకోర్టులో సవాలు చేశారు. ఆ కేసులో స్థానిక విద్యార్థుల దరఖాస్తును సుప్రీంకోర్టు కొట్టివేసింది. అప్పటి నుంచి స్థానికులు నష్టపోతున్నారు. కర్ణాటక ప్రభుత్వం కూడా కన్నడ మాధ్యమంలో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు ఐదు శాతం ఉద్యోగాలను కేటాయించా లని నిర్ణయించినప్పటికీ అక్కడి హైకోర్టు కొట్టివేసింది. దీనిని కూడా సుప్రీంకోర్టు సమర్థించింది. కన్నడ మాతృభాషగా ఉన్న పిల్లలకు 1 నుంచి 4వ తరగతి వరకు ఆ భాషలోనే బోధించాలని కర్ణాటక ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఇందుకు నిరాకరించే ఎయిడెడ్, అన్ఎయిడెడ్ పాఠశాలలను మూసివేయాలని కూడా ఆదేశించింది. ఈ నిర్ణయాన్ని కూడా ప్రైవేటు యాజమాన్యాలు సుప్రీంకోర్టులో సవాలు చేసి, కొట్టివేయించాయి. దీనితో కర్ణాటక ప్రభుత్వం రూటు మార్చి ‘గ్రామీణాభివృద్ధి పథకం’ కింద విద్యార్థులకు వెసులుబాటుగా కన్నడ మాధ్యమంలో ఉత్తీర్ణులయ్యే అభ్యర్థులకు 5 శాతం ఉద్యోగాలను కేటాయిస్తూ జీవోలు జారీ చేసింది. అయితే ఇప్పుడు రాష్ట్రాల అధికార భాషలను నిర్ణయించే హక్కు ఆయా శాసనసభలకు ఉందంటూ ఇచ్చిన తీర్పు, ఇంతకు ముందు కంటే ఇప్పుడు స్థానిక భాషలకు అధికార భాషలుగా చలామణీ అయ్యే అవకాశాన్ని మెరుగు పరిచింది. స్థానిక భాషల వినియోగంలో తలెత్తిన గందరగోళానికి లా కమిషన్ కూడా కొంత వరకు బాధ్యత వహించాలి. సుప్రీంకోర్టు, హైకోర్టులలో ఇంగ్లిష్‌కు తప్ప ఇతర భాషలకు ప్రాధాన్యం ఇవ్వరాదని ఆ కమిషన్ భావన. నిజానికి రాజ్యాంగం చలామణీలోకి వచ్చిన పదిహేనేళ్ల తరువాత రాష్ట్రాల మాతృభాషల ప్రతిపత్తిని సమీక్షించేందుకు జాతీయ కమిషన్‌ను రాష్ట్రపతి విధిగా నియమించాలన్న ఆదేశం వాస్తవమేనని ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘానికి కేంద్రం రాసిన లేఖలో (30.8.2007) పేర్కొన్నది. కానీ 1955లో తొలి కేంద్రీయ అధికార భాషా సంఘం ఏర్పడిన తరువాత 1960 ఏప్రిల్‌లో ఏర్పడవలసిన రెండో కేంద్రీయ అధికార భాషా సంఘం అసలు వెలుగు చూడకుండానే జాగ్రత్త పడ్డారు. జాతీయ అధికార భాషగా హిందీని రాష్ట్రాలపై రుద్దే వెంపర్లాటలోనూ, అనుసంధాన భాషగా ఇంగ్లిష్‌ను ప్రోత్సహించే అత్యుత్సాహంలోనూ స్థానిక భాషల విస్తృతిని కుంటు పరిచారు. శతాబ్దాల, సహస్రాబ్దాల చరిత్ర కలిగిన తెలుగుకు కూడా అదే గతి పట్టించారు. అయితే ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, బీహార్లలో అల హాబాద్, జబల్పూర్, పాట్నా, జోధ్‌పూర్ హైకోర్టులలో మాత్రం హిందీని అనుమతించడం దీనికి కొసమెరుపు. ఇది కూడా మన అధికార భాషా సంఘానికి కేంద్ర హోంశాఖ రాసిన లేఖ ద్వారానే బయటపడింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఆశాజనకమైనదే. (వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు) ఏబీకే ప్రసాద్ -
హిందీ రాజ్!
సంపాదకీయం భిన్న భాషా ప్రాంతాలున్న మన దేశంలో ఏదో ఒక భాషను ఆధిపత్య స్థానంలో ప్రతిష్టించబూనుకోవడం సాధ్యపడదు. ఇది పదే పదే రుజువవుతున్నా ఆ బాపతు ప్రయత్నాలు మాత్రం ఆగడంలేదు. ఈమధ్య కేంద్ర హోంమంత్రిత్వ శాఖ జారీచేసిన రెండు సర్క్యులర్లు ఆ కోవలోనివే. సామాజిక మీడియాలో ప్రభుత్వ సమాచార వెల్లడికి హిందీని ఉపయోగించాలని ఒక సర్క్యులర్ సూచించగా...అధికార కార్యకలాపాలన్నీ హిందీలో నెరపే సిబ్బందికి నగదు పారితోషికాలిస్తా మంటూ మరో సర్క్యులర్ ఆశ చూపుతున్నది. ఈ రెండూ కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు అనుబంధంగా ఉండే అధికార భాషా విభాగం జారీచేసినవే. హిందీ పేరు చెబితే ఒంటికాలిపై లేచే తమిళనాడే ఈసారి కూడా ఈ సర్క్యులర్లను వ్యతిరేకించడంలో అగ్రభాగాన ఉన్నది. ఆ రాష్ట్రానికి చెందిన అధికార, ప్రతిపక్షాలన్నీ ఏకమై కేంద్రం ప్రయత్నాన్ని తీవ్రంగా వ్యతిరేకించాయి. 1960 ప్రాంతాల్లో హిందీ భాషకు వ్యతిరేకంగా దక్షిణాది రాష్ట్రాల్లో మరీ ముఖ్యంగా తమిళనాడులో పెల్లుబికిన ఆగ్రహావేశాలు ఎవరూ మరిచిపోలేరు. ఆ ఆందోళన పర్యవసానంగా 1963లో అధికార భాషల చట్టం అమల్లోకి వచ్చింది. అధికార లావాదేవీలన్నిటా హిందీతోపాటు ఇంగ్లిష్‌ను కూడా తప్పనిసరిగా వినియోగించాలని ఈ చట్టం నిర్దేశిస్తున్నది. ఆ చట్టానికి 1967లో మరో సవరణ వచ్చిచేరింది. హిందీ అధికార భాషగా లేని రాష్ట్రాలతో కేంద్ర ప్రభుత్వం ఇంగ్లిష్ మాధ్యమంలోనే ఉత్తరప్రత్యుత్త రాలు జరపాలని ఆ సవరణ సూచిస్తున్నది. మన రాజ్యాంగంలోని ఎనిమిదో షెడ్యూలు 22 భాషలను జాతీయ భాషలుగా గుర్తించింది. హిందీతోపాటు ఇంగ్లిష్‌ను కూడా అధికార భాషగా పరిగణించింది. భాష విషయంలో మన రాజ్యాంగమూ, చట్టమూ ఇంత స్పష్టంగా ఉన్నప్పుడు ఆ అంశంపై న్యాయంగానైతే వివాదం తలెత్తకూడదు. కానీ అమలుపర్చవలసినవారిలో ఉన్నబండబారిన మనస్తత్వమో, అజ్ఞానమో తెలియదుగానీ... రెండు మూడేళ్లకొకమారు భాషా వివాదం మనకు తప్పడంలేదు. హిందీ భాష వాడకాన్ని పెంచడానికంటూ 2008లో కేంద్రం చేసిన ప్రతిపాదనలను చాలా రాష్ట్రాలు వ్యతిరేకిం చాయి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నియామకాల కోసం మెట్రిక్, ఆపై స్థాయి అభ్యర్థులకు నిర్వహించే పోటీ పరీక్షల్లో తప్పనిసరిగా హిందీ ప్రశ్నపత్రం ఉండాలని ఆ ప్రతిపాదనల్లో పేర్కొన్నారు. అందులో ఉత్తీర్ణులు కానివారిని అనర్హులుగా పరిగణించాలని నిర్ణయించారు. కేంద్రంలో తమ పార్టీ నేతృత్వంలోని ప్రభుత్వమే అధికారంలో ఉన్నా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఈ ప్రతిపాదనలను నిర్ద్వంద్వంగా తోసిపుచ్చారు. ఇవి అమల్లోకొస్తే హిందీ భాషా ప్రాంతీ యులు, ఆ మాధ్యమంలో చదివినవారు మాత్రమే లబ్ధిపొందుతారని... మన రాష్ట్రానికి చెందినవారు నష్టపోతారని ఆయన స్పష్టంగా చెప్పారు. ఒక భాష అధికారానికీ, ఆధిపత్యానికీ చిహ్నంగా మారినప్పుడు ఇతర భాషలు మాట్లాడేవారిలో సహజంగానే ఆ భాషపై వ్యతిరేకత ఏర్పడుతుంది. అనుమానాలు బయలుదేరతాయి. అది తమ భాషా సంస్కృతులను నాశనం చేస్తుందేమోనన్న భయాందోళనలు కలుగు తాయి. ఈ భయాందోళనలు మనకు స్వాతంత్య్రం రాకముందునుంచీ ఉన్నాయి. జాతీయోద్యమ సమయంలో ఉత్తరాది రాష్ట్రాల నాయకులు హిందీని ‘ఉమ్మడి భాష’గా ప్రకటించాలని భారత జాతీయ కాంగ్రెస్‌లో చేయని ప్రయత్నమంటూ లేదు. పురుషోత్తందాస్ టాండన్ నేతృత్వాన కొందరు నేతలు హిందీ అనుకూల తీర్మానం చేయించడానికి ప్రయత్నించినప్పుడు మన రాష్ట్రానికి చెందిన ఎన్ జి రంగావంటివారు దాన్ని తీవ్రంగా ప్రతిఘటించారు. ఆనాటికి మద్రాసు ప్రెసిడెన్సీగా ఉన్న తమిళనాడులో హిందీకి వ్యతిరేకంగా ఆందోళనలు చెలరేగాయి. మనదగ్గర ప్రముఖ కథా రచయిత శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి కూడా హిందీ భాష పెత్తనాన్ని గట్టిగా ప్రశ్నించారు. జాతీయోద్యమంలో పనిచేసేవారు ఈ విషయంలో స్పష్టత సాధించాలని కోరారు. భాషా వివాదానికి ఇంత చరిత్ర ఉన్నప్పుడు, దానితో మెజారిటీ ప్రాంత ప్రజల మనోభావాలు ముడిపడి ఉన్నప్పుడు ఎంత సున్నితంగా వ్యవహరిం చాలో అధికారంలో ఉన్నవారు గుర్తుంచుకోవాలి. ఇప్పుడు జారీ అయిన రెండు సర్క్యులర్లూ తాము అధికారాన్ని స్వీకరించకముందు జారీ అయ్యాయని ఎన్డీయే ప్రభుత్వం వివరణని చ్చింది. ఇది ఎన్డీయే ప్రభుత్వ నిర్వాకం అనుకోవడంవల్ల కావొచ్చు... కాంగ్రెస్ నేతలు ఈ సర్క్యులర్లపై విరుచుకుపడ్డారు. అంటే పాలకు లెవరైనా వారితో ప్రమేయం లేకుండా అధికారులే ఇలాంటి సర్క్యులర్ లు జారీచేస్తున్నారనుకోవాలి. హిందీని ఏకపక్షంగా రుద్దడం తమ అభిమతం కాదని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ వివరణనిచ్చారు. ఎప్పటిలాగే ఇంగ్లిష్ అనుసంధాన భాషగా ఉంటుందని హామీ ఇచ్చారు. మన దేశంలో 1,625 భాషలు మాట్లాడేవారున్నారు. మనం హిందీ భాషా ప్రాంతాలుగా చెప్పుకునే చాలా రాష్ట్రాల్లో బ్రజ్‌భాషా, ఛత్తీస్‌గఢీ, హర్యాన్వి వంటివి ఎన్నో ఉన్నాయి. వీటన్నిటినీ హిందీ మాండలికాలుగా గుర్తించడంవల్ల హిందీ భాష మాట్లాడేవారి జనాభా మిగిలిన భాషలు మాట్లాడేవారికన్నా అధికంగా కనిపిస్తుంది. కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వుల్లో వాడే హిందీ జటిలంగా, కృత్రిమంగా ఉంటున్నదని హిందీ మాతృభాషగా కలవారు సైతం ఆరోపిస్తుంటారు. భాష ఉద్దేశమే భావ వినిమయం అయినప్పుడు దాన్ని జటిలం చేయడంలో అర్ధమేముంది? కనుక ముందు సామాన్యులకు అవగతమయ్యే తీరులో హిందీని రాయడమెలాగో సదరు సర్క్యులర్ రచయితలు నేర్చుకోవాలి. అంతేకాదు... ఇతర భాషలనూ, సంస్కృతులనూ, సంప్రదాయాలనూ గౌరవించడం నేర్చుకోవాలి. పెత్తందారీతనంతో, అధికార దర్పంతో మరొకరిపై బలవంతంగా ఏ భాషనైనా రుద్దడానికి ప్రయత్నిస్తే దేశ సమగ్రతకూ, సమైక్యతకూ అది విఘాతం కలిగిస్తుందని గుర్తించాలి. -
మణిశర్మ నిర్మాతగా త్రీడీ సినిమా
సంగీత దర్శకుడు మణిశర్మ నిర్మాతగా మారారు. ‘వస్తాడు నా రాజు’ ఫేమ్ హేమంత్ మధుకర్ దర్శకత్వంలో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఆయన నిర్మించిన చిత్రం ‘ముంబాయి 125 కి.మీ’. కరణ్వీర్ బోరా, విదిత ప్రతాప్‌సింగ్, వీణామాలిక్, అపర్ణా బాజ్‌పాయ్ ఇందులో ముఖ్యతారలు. దర్శకుడు మాట్లాడుతూ -‘‘త్రీడీ హారర్ చిత్రమిది. మొత్తం తలకోన, ముంబై అడవుల్లో చిత్రీకరించాం. మణిశర్మ సంగీతం ఈ సినిమాకు మెయిన్ హైలైట్. ఈ నెలాఖరున హైదరాబాద్‌లో పాటలు విడుదల చేయబోతున్నాం’’ అని తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: మనోజ్ షా.