
అభిప్రాయం
మత, భాష, ప్రాంతీయ ఉన్మాదాలు భారతదేశ సమగ్రతకు, సమైక్యతకు గొడ్డలి పెట్టు అనే విషయంలో దేశ హితాన్ని కోరే అందరి వ్యక్తుల అభిప్రాయం ఒకే విధంగా ఉంటుంది. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ హిందీ భాషపై అవాకులు చవాకులు పేలడం దేశంలో పెద్ద చర్చనీయాంశమైంది. ‘త్రిభాషా సూత్రం’ అమలులో భాగంగా హిందీనీ విద్యాలయాల్లో బోధించ డాన్ని వ్యతిరేకించడం తమిళ రాజకీయాలలో ఒక భాగమే.
దేశంలో తెలివైన విద్యార్థులకు మంచి విద్యను అందించడానికి, విద్యార్థుల్లో ‘ఈ దేశం నాది’ అనే భావనను నిర్మాణం చేయడానికి రాజీవ్ గాంధీ ప్రభుత్వం 1986లో ‘నవోదయ’ విద్యాలయాలను ఏర్పాటు చేసింది. ఈ పాఠశాలలు తమిళనాడుకు అవసరం లేదని ద్రవిడ పార్టీల నాయకులు అడ్డు కున్నారు. ఆ పాఠశాలల్లో హిందీని ఒక భాషగా బోధించడమే ఇందుకు కారణం. ‘సర్వ శిక్షా అభియాన్’ నిధులను తమిళనాడు రాష్ట్రానికి ఇవ్వడం విషయంలో కేంద్రానికి– రాష్ట్రానికి మధ్య చోటుచేసుకున్న వివాదం కారణంగా త్రిభాషా సూత్రం తమిళనాడు రాష్ట్రంలో అమలు చేయడం వీలు కాదని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ బహిరంగ ప్రకటన చేయడంతో త్రిభాషా సూత్రం అమలు విషయంపై రాద్ధాంతం మళ్లీ తెరపైకి వచ్చింది.
దక్షిణ భారతంలో ఉన్న ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, కేరళ రాష్ట్రాలలో ఈ విషయంపై అభ్యంతరాలు లేవు. త్రిభాషా సూత్రం అమలులో భాగంగా దక్షిణాదిలో రాష్ట్ర భాష, ఇంగ్లీషు, హిందీ బోధించేటట్లు; ఉత్తరాదిలో హిందీ, ఇంగ్లీషు, ఏదైనా దక్షిణాది రాష్ట్రాల భాష (తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం ఏదో ఒకటి) బోధించేటట్లు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల ఏకాభి ప్రాయంతో నాటి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. అయితే తమిళులు దీన్ని వ్యతిరేకించారు.
తమిళనాడులో హిందీ వ్యతిరేక ఉద్యమం ఈనాటిది కాదు. 1937లో ‘ద్రావిడార్ కళగం’ పేరుతో ఈవీ రామస్వామి తమిళ ప్రజలను రెచ్చగొట్టి, ‘ఉత్తరాది వారి భాష హిందీ మనకెందు’కంటూ, తమిళ ప్రజల్లో హిందీ భాషపై ద్వేషాన్ని నూరి పోశారు. తమిళనాడులోని జస్టిస్ పార్టీ కూడా ఈ హిందీ వ్యతిరేక ఉద్యమానికి అండగా నిలిచింది. అగ్నికి ఆజ్యం పోసింది.
ఉద్యమం తీవ్ర రూపం దాల్చడంతో అప్పటి రాజ గోపాలాచారి నేతృత్వంలోని మద్రాస్ ప్రెసిడెన్సీ ప్రభుత్వం రాజీనామా చేయడంతో ఉద్యమం చల్లారింది. స్వాతంత్య్రానంతరం కేంద్ర ప్రభుత్వం గట్టి పట్టుదలతో ఇంగ్లీషు స్థానంలో హిందీని జాతీయ భాషగా ప్రవేశపెట్టాలని ఆలోచించడంతో 1965లో ‘ద తమిళనాడు స్టూడెంట్స్ యాంటీ హిందీ యాజిటేషన్ కౌన్సిల్’ పేరుతో తమిళ నాయకులు పెద్ద ఎత్తున హింసాత్మక ఉద్యమాన్ని లేవదీశారు.
ఉద్యమాన్ని అణచడానికి పారా మిలటరీ దళం రంగ ప్రవేశం చేయడంతో 500 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. కోట్ల రూపాయల ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేయబడ్డాయి. నాటి ప్రధానమంత్రి లాల్ బహుదూర్ శాస్త్రి బలవంతంగా హిందీని తమిళ ప్రజలపై రుద్దే అవకాశం లేదని ప్రకటించడంతో ఉద్యమం ఆగి పోయింది.
ఈ ఉద్యమ ప్రభావంతో 1967 ఎన్నికల్లో తమిళనాడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకు పోయింది. ఉత్తరాది ప్రజలు ఆర్య సంస్కృతికి చెందిన వారనీ, వారి భాష హిందీ అనీ, ఆ భాషను మాట్లాడటం తమిళుల ఆత్మగౌరవానికి భంగం అనే భావనను తమిళ ప్రజల మనసులో బాగా చొప్పించారు బ్రిటిష్ పాలకులు.
పాశ్చాత్య కోణంలో హిందూ సంస్కృతిని దునుమాడడమే ధ్యేయంగా పెట్టుకున్న ఈవీ రామ స్వామి బ్రిటిష్ పాలకులకు ఒక పనిముట్టుగా దొరికారు. ఆయన ప్రియ శిష్యుడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి శ్రీరామునిపై, రామాయణంపై దుర్వా్యఖ్యలు చేయడం, ఆయన మనుమడు ఉదయనిధి ఒక మంత్రి హోదాలో సనాతన ధర్మాన్ని డెంగ్యూ, మలేరియా లాంటిదని మాట్లాడటం బ్రిటిష్ వాళ్ళు నూరి పోసిన ఆర్య ద్రావిడ వాద ప్రభావమే! తమిళులే హిందీని వ్యతిరేకించడం వెనుక దాగి ఉన్న రహస్యం ఇదే!
ఉల్లి బాలరంగయ్య
వ్యాసకర్త సామాజిక, రాజకీయ విశ్లేషకులు
Comments
Please login to add a commentAdd a comment