
అభిప్రాయం
మతం, కులం, భూమి... ఇండియాలో ఇవి ఉద్రిక్తమైన అంశాలు. భాష కూడా ఇలాంటిదే. కేవలం రాజకీయ ప్రసంగాలకు చర్చలకు పరిమితమై ఉండి నట్లయితే, పెద్దగా పట్టించుకోవలసిన అవసరం లేదు. కానీ అది స్వాతంత్య్రా నికి పూర్వం, ఆ తర్వాత కూడా ఉద్యమాలను లేవదీసింది. భౌగోళిక సరి హద్దులను మార్చేసింది. ప్రాంతీయ అధినేతల తలరాతలు మార్చేసింది. ఉదాహరణకు సి రాజగోపాలాచారిని మద్రాస్ ప్రెసిడెన్సీ ప్రధాన మంత్రి పీఠం నుంచి పడదోసింది.
భాషతో ఆడుకునే ఉన్మాదులకు తమిళనాడు పురిటిగడ్డగా మారింది. ఒకప్పుడు వేర్పాటువాదానికి ఊపిరిపోసింది. ఇప్పుడు అధికారం కాపాడుకోవడానికి సాధనంగా మార్చుకుంటున్నారు. ఈ రాష్ట్రంలో వచ్చే ఏడాదే ఎన్నికలు జరగబోతున్నాయి. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్... మోదీ ప్రభుత్వ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ (ఎన్‌ఈపీ–2020)ని తెర మీదకు తెచ్చారు. కేంద్రం నుంచి సమగ్ర శిక్షా స్కీము కింద వచ్చే రూ 2,152 కోట్ల నిధులను వదులుకోడానికి సిద్ధపడి మరీ ఆయన ఎన్‌ఈపీని తిరస్కరించారు. రాష్ట్రంలోని 14,500 మోడల్ స్కూళ్లను అప్ గ్రేడ్ చేయడం... ఈ కేంద్ర ప్రాయోజిత పథకం ఉద్దేశం.
కేంద్రం ఎన్‌ఈపీని శిలాశాసనంలా రూపుదిద్దింది. పథకంలో గొప్పగా పొందుపరచిన ‘ఆశయాలు’ డీఎంకేకి మోసపూరితాలుగా కనబడుతున్నాయి. 1968 ఎన్‌ఈపీలోని త్రిభాషా సూత్రాన్నే ఎన్‌ఈపీ– 2020 ద్వారా తిరిగి ప్రవేశపెడుతున్నామని ఢిల్లీ పెద్దలు చెబుతున్నారు. అయితే, హిందీని రాష్ట్రాలపై రుద్దే దురుద్దేశపూర్వక ప్రయత్నంగా డీఎంకే దాన్ని పరిగణిస్తోంది.
నిజానికి ఎన్‌ఈపీ– 2020 పాతదానితో పోల్చితే చాలా వరకు వెసులు బాటు కల్పిస్తోంది. ఏ రాష్ట్రం మీదా ఏ భాషనూ రుద్దే ప్రసక్తి లేదని స్పష్టం చేసింది. పిల్లలు నేర్చు కోవలసిన మూడు భాషలు ఏవన్నదీ ఆ యా రాష్ట్రాల, ప్రాంతాల, పిల్లల ఇష్టానికే విడిచి పెట్టింది. కాకుంటే, ఈ మూడింటిలో రెండు మాత్రం దేశంలోని ‘నేటివ్‘ భాషలు అయ్యుండాలి. అంటే రాష్ట్ర భాషకు అదనంగా మరొక భారతీయ భాషను నేర్వవలసి ఉంటుంది. అది హిందీయే కానవసరం లేదు.
రాజకీయ పెనం మీద హిందీ
నిజానికి డీఎంకే, కేంద్రం మధ్య ఘర్షణకు మూలం ఇది కాదు. తమిళనాడు రాజకీయ పెనం మీద హిందీ ఎప్పుడూ చిటపటలాడుతూనే ఉంటుంది. అయినా, స్టాలిన్ సహజంగానే ఎన్‌ఈపీని తోసిపుచ్చినప్పుడు కేంద్రం ఆయనతో చర్చలు జరిపి ఉండాలి. అలా కాకుండా రెచ్చగొట్టే విధానం అవలంబించడమే ప్రస్తుత పరిస్థితికి దారి తీసింది.
కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్వయంగా ముందు నిలిచి కయ్యానికి కాలు దువ్వారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత భాషా ప్రాతిపదికగా రాష్ట్రాల పునర్ విభజన జరగాలన్న ఉద్యమాన్ని ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఆయన స్వరాష్ట్రం ఒడిశా ముందుండి నడిపిన విషయం ఆయనకు గుర్తు లేకపోవడం నిందార్హం.
ఏ రాష్ట్రం కూడా రాజ్యాంగం కంటే ఎక్కువ కాదని హెచ్చరిస్తూ, డీఎంకే ప్రభుత్వం రాజ్యాంగానికి లోబడి నడుచుకోవాలని హితవు పలికారు. ఇది జరిగి నెల గడవక ముందే, మార్చి 11న పార్లమెంటు ప్రశ్నోత్తరాల సమయంలో ‘నిజాయితీ లేని’, ‘మోసకారి’ పార్టీ అని డీఎంకేని నిందించారు. దీనికి స్పందనగా, మంత్రి ‘పొగరుబోతు’ అని స్టాలిన్ వ్యాఖ్యానించారు. ప్రధాన్ ఆ తర్వాత తన వ్యాఖ్యలు వెనక్కు తీసుకున్నారు. అయినా ఫలితం లేదు. అప్పటికే ఇరు పక్షాలూ బరిలోకి దిగాయి. తమిళనాడు ప్రతిపక్ష నేత పళనిస్వామి ఈ పోరులో డీఎంకేకు మద్దతు పలికారు.
ఎప్పుడో 1937 లోనే అప్పటి మద్రాస్ ప్రెసిడెన్సీ ప్రధాన మంత్రి రాజగోపాలాచారి (రాజాజీ) సెకండరీ స్కూళ్లలో హిందీని తప్పనిసరి చేయడంతో జస్టిస్ పార్టీ మండిపడింది. తలముత్తు, నటరాజన్ అనే ఇద్దరు యువ ఉద్యమకారులు పోలీసుల ఘర్షణల్లో ప్రాణాలు కోల్పోయారు. భాష కోసం ప్రాణా లొడ్డిన అమరులుగా వారు నివాళులు అందుకున్నారు. తర్వాత రాజాజీ రాజీనామా చేశారు. బ్రిటిష్ పాలకులు నాటి హిందీ నిర్బంధం ఉత్తర్వును ఉపసంహరించారు.
1965కి వద్దాం. హిందీని అధికార భాషగా అమలు చేసేందుకు కేంద్రం పెట్టిన డెడ్ లైన్ దగ్గర పడింది. మరోసారి తమిళనాడు భగ్గుమంది. రాష్ట్రం అంతటా హింస చెలరేగింది. 70 మంది అసువులు బాశారు. 1967లో అధికార భాషల (సవరణ) చట్టాన్ని, 1968లో అధికార భాషల తీర్మానాన్ని పార్లమెంటు ఆమోదించిన సందర్భంలోనూ ఉద్యమం తిరిగి ప్రాణం పోసుకుంది. హిందీకి అదనంగా ఇంగ్లీష్‌ను కూడా కమ్యూనికేషన్ భాషగా కొనసాగించేందుకు, హిందీ ఒక్కటే అధికారిక లింకు భాషగా ప్రకటించిన తొలి విధానాన్ని వాయిదా వేసేందుకు ఈ చట్టం వీలు కల్పించింది.
మూడు భాషల ఫార్ములాను తిరస్కరిస్తూ అప్పటి డీఎంకే ముఖ్యమంత్రి అన్నాదురై నాయకత్వంలో 1968 జనవరి 26న రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేసింది. తమిళాన్ని, ఇతర భాషలను అధికార భాషలుగా క్లాసిఫై చేసేవరకు ఇంగ్లీషు ఒక్కటే ఏకైక అధికార భాషగా కొనసాగితీరాలని, ఆ మేరకు రాజ్యాంగ సవరణ చేయాలని నాటి రాష్ట్ర ప్రభుత్వం తెగేసి చెప్పింది.
అయితే ఒక మాట. గతంలోకీ ఇప్పటికీ తమిళుల స్పందనలో మార్పు కనబడుతోంది. అప్పట్లో హిందీ–తమిళ్ జగడం తమిళ ఓటర్లను భావోద్వేగంతో కదిలించేది. నేడు మరొక కోణం తెర మీదకు వచ్చింది. అది ఆర్థికం. తమిళనాడు ఆర్థిక సంస్కరణల నుంచి పూర్తి ప్రయోజనం పొందింది. ప్రముఖ ఉత్పత్తి కేంద్రంగా ఆవిర్భవించింది. రాజకీయ పోరాటాలు స్థానికులు, వలసదారుల మద్య సామాజిక సంబంధాలను ప్రభావితం చేయలేక పోవడం ఒక సానుకూల పరిణామం. ‘మరాఠీ మనూస్’ (మరాఠీ మాట్లాడే మనుషుల) తరహా యుద్ధోన్మాదం లేదు. అయినప్పటికీ, భాష ఒక సెన్సిటివ్ ఇష్యూనే!
రాధికా రామశేషన్
వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్
(‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో)
Comments
Please login to add a commentAdd a comment