నా ప్రియమైన స్నేహితుడా.. మీ పోరాటం అసామాన్యం | Kamal Haasan Praised TN CM Stalin Over Three Languages Row | Sakshi
Sakshi News home page

నా ప్రియమైన స్నేహితుడా.. మీ పోరాటం అసామాన్యం

Published Fri, Feb 28 2025 4:53 PM | Last Updated on Fri, Feb 28 2025 5:55 PM

Kamal Haasan Praised TN CM Stalin Over Three Languages Row

చెన్నై: తమిళనాట రాజకీయాల్లో ఇవాళ కీలక పరిణామం చోటు చేసుకుంది. నటుడు, మక్కల్‌ నీది మయ్యమ్‌(MNM) పార్టీ అధినేత కమల్‌ హాసన్‌.. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌(MK Stalin)తో భేటీ అయ్యారు. ఈ విషయాన్ని ఎక్స్‌లో పోస్ట్‌ చేసిన కమల్‌.. మూడు భాషల పాలసీకి వ్యతిరేకంగా స్టాలిన్‌ పోరాడటాన్ని అభినందించారు.

నూతన జాతీయ విద్యా విధానం(National Education policy)లో భాగంగా.. కేంద్రం తీసుకొచ్చిన మూడు భాషల పాలసీని తమిళనాడు సీఎం స్టాలిన్‌ తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో డీఎంకే-బీజేపీ మధ్య మాటల యుద్ధమే జరుగుతోంది. అయితే తమిళ భాషా పరిరక్షణకు స్టాలిన్‌ చేస్తున్న పోరాటం అసామాన్యమైందని కమల్‌ హాసన్‌ అంటున్నారు. 

‘‘నా ప్రియమైన స్నేహితుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్‌ను కలిశా. తమిళనాడు, తమిళ భాష, తమిళ సంప్రదాయం అన్నివైపులా ఒత్తిళ్లు ఎదుర్కొంటున్న వేళ.. డీఎంకే దిగ్గజాల పోరాటపటిమనే స్టాలిన్‌ కనబరుస్తున్నారు. తమిళనాడుకు ఓ కోటగా ఆయన రక్షణ కల్పిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన్ని అభినందిస్తూ.. ఆయురారోగ్యాలతో జీవించాలని కోరుకుంటున్నా’’ అని కమల్‌ ట్వీట్‌ చేశారు. అంతకుముందు.. 

ఎన్‌ఈపీను కమల్‌ హాసన్‌(Kamal Haasan) సైతం బహిరంగంగా వ్యతిరేకించిన సంగతి తెలిసిందే. తన ఎంఎన్‌ఎం పార్టీ వార్షికోత్సవ సమావేశంలో ప్రసంగిస్తూ.. ‘‘భాష కోసం గతంలో తమిళులం ప్రాణాలొదిలేశాం. ఆ విషయంలో మాతో ఆటలొద్దూ’’ అంటూ కేంద్రానికి హెచ్చరిక పంపారాయన. 

👉ఇదిలా ఉంటే.. 2026 నుంచి అమల్లోకి రానుంది నూతన జాతీయ విద్యా విధానం(NEP). ఈ పాలసీలో ‘త్రిభాష’ను అమలు చేయాలని ఎన్డీయే ప్రభుత్వం భావిస్తోంది. అయితే ఇది ప్రాంతీయ భాషలను అణచివేసే ప్రయత్నమని స్టాలిన్‌ ఆరోపిస్తున్నారు. అంతేకాదు.. ఎన్‌ఈపీ అమలు చేస్తేనే రాష్ట్రానికి ఇవ్వాల్సిన నిధులను ఇస్తామని కేంద్రం బ్లాక్‌మెయిల్‌ చేస్తోందని.. అయినా తాము వెనక్కి తగ్గబోమని స్టాలలిన్‌ చెబుతున్నారు. 

👉మరోవైపు ఈ ఆరోపణలను ఖండించిన కేంద్రం.. హిందీ అమలు తప్పనిసరేం కాదని చెబుతోంది. రాజకీయ లబ్ధి కోసమే తమిళనాడు ప్రభుత్వం, అక్కడి పార్టీలు ఎన్‌ఈపీపై అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని మండిపడుతున్నాయి. మరోవైపు బీజేపీ తమిళనాడు చీఫ్‌ అన్నామలై.. డీఎంకే ప్రభుత్వానికి సవాళ్లు విసురుతున్నారు. అయితే త్రిభాషను వ్యతిరేకిస్తూ తమిళనాడు బీజేపీ నుంచి పలువురు రాజీనామాలు చేస్తుండడం గమనార్హం. 

👉 2018, ఫిబ్రవరి 21వ తేదీన కమల్‌ హాసన్‌ మక్కల్‌ నీది మయ్యమ్‌ పార్టీని మధురైలో స్థాపించారు. అప్పటి నుంచి ఏ ఎన్నికల్లోనూ ఆ పార్టీ ప్రభావం చూపెట్టలేకపోయింది. అయితే కిందటి ఏడాది సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమికి మద్ధతు ప్రకటించింది ఎన్‌ఎంఎం. కూటమి భాగస్వామి డీఎంకే తరఫున కమల్‌ హాసన్‌ ప్రచారంలో పాల్గొనగా.. అన్ని లోక్‌సభ స్థానాలను కూటమి క్లీన్‌ స్వీప్‌ చేసింది.  దీంతో.. కమల్‌ హాసన్‌ను రాజ్యసభను పంపుతారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 

ఇదీ చదవండి: భాషా యుద్ధం.. అనవసర భయమా? లేక..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement