
రాంచీ/జమ్‌తారా : కేంద్ర హోంమంత్రి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సంచలన ప్రకటన చేశారు. జాతీయ పౌర రిజిస్టర్(ఎన్నార్సీ)ని తాము దేశమంతా అమలుచేస్తామని ప్రకటించారు. భారత్‌లో అక్రమంగా ఉంటున్న విదేశీయులను వెళ్లగొడతామన్నారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి అఖండ మెజారిటీ కట్టబెట్టడం ద్వారా దేశవ్యాప్తంగా ఎన్నార్సీ అమలుకు ప్రజలు ఆమోదం తెలిపారని వ్యాఖ్యానించారు. జార్ఖండ్‌లోని రాంచీలో బుధవారం అమిత్ షా మాట్లాడుతూ..‘అస్సాంలోనే కాదు దేశవ్యాప్తంగా ఎన్నార్సీని అమలుచేస్తామని మా ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పాం. ఎన్నార్సీని దేశవ్యాప్తంగా చేపట్టి ప్రజల పేర్లను రిజిస్టర్‌లో నమోదుచేస్తాం. అక్రమ వలసదారులపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటాం. ఈ జాబితాలోని వారిని తరిమేస్తాం’ అని తెలిపారు.
అమెరికాలో సెటిలవ్వగలరా?
2019 లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ప్రతీ బహిరంగ సభ, ర్యాలీలో తాను ఎన్నార్సీని ప్రస్తావించానని అమిత్ తెలిపారు. ‘ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఇలావెళ్లిపోయి అలా స్థిరపడలేరు. నేను మిమ్మల్ని(సభికుల్ని) అడుగుతున్నా. మీరిప్పుడు అమెరికాకు వెళ్లి స్థిరపడగలరా? వీలుకాదు కదా. మీరు రష్యా, నెదర్లాండ్స్, ఇంగ్లండ్.. ఇలా ఎక్కడకు వెళ్లి స్థిరపడేందుకు ప్రయత్నించినా కుదరదు. మరి భారత్‌లో ఎవరైనా ఎలా స్థిరపడగలరు? దేశాలు ఇలా నడవవు. భారత ప్రజల కోసం జాతీయ పౌర రిజస్టర్(ఎన్నార్సీ) అమలు చేయాల్సిన సమయం వచ్చేసింది’ అని షా వెల్లడించారు. ఎన్నార్సీలో పేర్లు లేని నిరుపేదలు అప్పీల్ చేసుకునేందుకు వీలుగా ఉచిత న్యాయసాయం అందిస్తున్నట్లు షా పేర్కొన్నారు. అస్సాంలో ఇటీవల విడుదల చేసిన ఎన్నార్సీలో 19 లక్షల మందిని విదేశీయులుగా ప్రకటించిన సంగతి తెలిసిందే.
హిందీని రుద్దట్లేదు
హిందీ దినోత్సవం సందర్భంగా తాను చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంపై అమిత్ స్పందించారు. భారత్‌లో ఎక్కడా హిందీని బలవంతంగా అమలుచేయాల్సిందిగా తాను చెప్పలేదన్నారు. మాతృభాష తర్వాత హిందీని రెండో భాషగా నేర్చుకోవాలని కోరానన్నారు. ప్రాంతీయ భాషలను ప్రోత్సహించాల్సిన అవసరాన్ని తాను ప్రస్తావించానన్నారు. ‘నేను హిందీయేతర రాష్ట్రం నుంచే వచ్చాను. నా మాతృభాష గుజరాతీ. నన్ను విమర్శిస్తున్నవారు ఎవరైనా ముందు నేనిచ్చిన ప్రసంగాన్ని పూర్తిగా వినాలి. అలాకాకుండా ఎవరైనా దీన్ని రాజకీయం చేయాలనుకుంటే, అది వాళ్లిష్టం’ అని షా వ్యాఖ్యానించారు. మాతృభాషలో విద్యాబోధన సాగితేనే పిల్లల మనోవికాసం సరైనరీతిలో ఉంటుందని హోంమంత్రి అభిప్రాయపడ్డారు. కానీ దేశంలో ఒకే జాతీయ భాష ఉండాల్సిన అవసరముందనీ, ప్రజలు మరో భాషను నేర్చుకోవాలంటే అందుకు మాధ్యమంగా హిందీయే ఉండాలని షా స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment