అనుసంధాన భాషగా హిందీ అవసరం లేదా? | Is Hindi Not Required as Connecting Language: Nikhileswar | Sakshi
Sakshi News home page

అనుసంధాన భాషగా హిందీ అవసరం లేదా?

Published Mon, May 2 2022 3:07 PM | Last Updated on Mon, May 2 2022 3:11 PM

Is Hindi Not Required as Connecting Language: Nikhileswar - Sakshi

జాతీయోద్యమ కాలం నుంచీ ఒక ఉమ్మడి భాషగా హిందీ వ్యాపించిన వాస్తవాన్ని కాదనలేం. మరీ ముఖ్యంగా హిందీ సినిమాల జనాదరణ (పాటలతో పాటు) మూలంగా దేశం నలుమూలలా హిందీ భాషను అర్థం చేసుకోగల వాతావరణం ఏర్పడింది. సాహిత్యపరంగా ప్రేమ్‌చంద్, రాహుల్‌ సాంకృత్యాయన్, జయశంకర్‌ ప్రసాద్, దిన్‌కర్‌ నిరాలా వంటి రచయితలు – కవులు, తెలుగుతోపాటు ఇతర భారతీయ భాషల్లోనూ పాఠకుల ఆదరణ పొందారు.

ప్రస్తుతం హిందీ దేశవ్యాప్తంగా ఒక అధికార భాషగా లేదా అనుసంధాన భాషగా వాడుకలో ఉన్నప్పటికీ... హిందీయేతర ప్రాంతీయులకు ముఖ్యంగా దక్షిణాది ప్రాంతాలకు అభ్యంతరాలు కొనసాగుతూనే ఉన్నాయి. మరోవైపు ఇంగ్లిష్‌ ప్రాబల్యం పెరిగిన తర్వాత, హిందీ వెనుకబడిపోయింది. ఇక అసలు వివాదమెక్కడంటే భారతీయ భాషల్లో గుర్తింపు పొందిన (ఇంగ్లిష్‌తో సహా) 23 భాషలన్నీ జాతీయ భాషలే అనే యథార్థాన్ని హిందీవాదులు విస్మరించడం! ఫలితంగా హిందీ భాష ఆధిపత్యమనే ప్రమాదమున్నదని... ముఖ్యంగా తమిళనాడులో వ్యతిరేకత పెరిగింది. అయినా అక్కడే చెన్నైలో ‘దక్షిణ భారత హిందీ ప్రచార సభ’ చేసిన భాషా సేవను తక్కువగా అంచనా వేయలేం. జాతీయ సమైక్యతకు హిందీ ఒక వాహికగా ఉండగలదనే నమ్మకమే ఆ ప్రచారానికి దోహదపడింది.

ఇక ప్రాంతాల పరస్పర సంబంధాల రీత్యా, మన ఫెడరల్‌ వ్యవస్థకు అనుగుణంగా త్రిభాషా సూత్రాన్ని అమలు చేశారు. కానీ ఆచరణలో మాత్రం దక్షిణాది వారంతా మాతృభాషతోపాటు హిందీ –ఇంగ్లిష్‌ నేర్చుకొంటే... ఉత్తరాది వాళ్లు మాత్రం తమ హిందీతో పాటు ఇంగ్లిష్‌తో సరిపెట్టుకొన్నారు. ప్రయోగ రీత్యా హరియాణా– పంజాబ్, బిహార్‌–ఉత్తరప్రదేశ్‌ తదితర ప్రాంతాల్లో దక్షిణాది భాష లను అక్కడి కొన్ని విద్యాలయాల్లో బోధించినా ప్రోత్సాహం లభించలేదు. ఈ వైరుద్ధ్యం వల్ల ఈనాటికీ దక్షిణాది–ఉత్తరాది ప్రజల మధ్య భాషాపరంగా ఒక అగాథం మిగిలిపోయింది. బహుభాషా రాష్ట్రాలుగా ఉన్న ఈ దేశంలో... ప్రాంతీయంగా అక్కడి భాష అధి కార భాషగా ఉన్నప్పటికీ చాలావరకు ఇంగ్లిష్‌లోనే పరిపాలన సాగుతున్న యథార్థాన్ని కాదనగలమా? తమిళనాడు మరికొన్ని రాష్ట్రాలు తప్ప ఇతరత్రా అక్కడి ప్రజల భాషలో అధికార తతంగ మంతా ఇంగ్లిష్‌లోనే కొనసాగుతోంది.

మరోవైపు హిందీని కేంద్ర ప్రభుత్వం రైల్వే విభాగాల్లో, బ్యాంకు, పోస్టల్‌ సర్వీసుల్లో సమాంతరంగా ప్రవేశపెట్టి అధికార భాషగా చాలాకాలం కిందటే అమలు చేసింది. ఇక్కడే ఒక ఆచరణా త్మక వాస్తవాన్ని గుర్తించక తప్పదు. కేంద్ర–రాష్ట్ర సంబంధాల్లో, కేంద్ర పాలనలో మిగతా 22 భాషలను అధికార భాషలుగా అమలు చేయడం ఆచరణలో అసాధ్యం. అందువల్ల ఉమ్మడి భాషలుగా ఇంగ్లిష్‌–హిందీ భాషలు మన వ్యవహారంలో అనుసంధానంగా కొనసాగుతున్నాయి. ఈ వాస్తవాన్ని తిరస్కరించి, హిందీ పట్ల ద్వేషం పెంచుకోవడం భారతీయ భాషల పట్ల అపచారమే!

బ్రిటిష్‌ సామ్రాజ్య వ్యాప్తి ద్వారా ఇంగ్లిష్‌ (మనదేశంలో వలస పాలన) ఇండియాలోకి ప్రవేశించిన తర్వాత ఆ భాషను మనం సామ్రాజ్యవాద భాష అని తిరస్కరించామా? ఒకప్పుడు లోహియా సోషలిస్టులు ‘అంగ్రేజీ హఠావో’ (ఇంగ్లిష్‌ను తొలగించండి) అని ఉద్యమించినా, ఉపాధి రీత్యా, సాంకేతిక తదితర విద్యాబోధనా మాధ్యమంగా ఇంగ్లిష్‌ అనివార్యమై ప్రాథమిక స్థాయి నుంచే దానిని నేర్చుకోవాలనే స్థితికి చేరుకున్నాం.

మరో అతి ముఖ్యమైన అంశం– అనుసంధాన భాషగా హిందీ ఈ దేశంలో అత్యధిక ప్రజలు మాట్లాడుతున్న భాష. భాషా పరంగా అతి సులువుగా నేర్చుకోవచ్చు. ఒక రచయితగా నేను ఈరోజు హిందీలో కూడా రచనలు చేయగలుగుతున్నాను. హైస్కూలు స్థాయి నుంచి ‘త్రిభాషా సూత్రం’లో భాగంగా హిందీ రెండో భాషగా నేర్చు కోవడం వల్ల అది సాధ్యమైంది. గతంలో ఉర్దూ పదాల కలయికతో ‘హిందూస్తానీ’ భాషగా ప్రజల్లోకి వెళ్లిన హిందీని, ఉత్తరాది భాషా దురభిమానులు పనిగట్టుకుని సంస్కృతభూయిష్టంగా, పరిమితు ల్లోకి నెట్టివేశారు. అందువల్లే హిందుత్వ ఛాదస్తుల ప్రమాదం మరిం తగా భాషాపరంగా ఉందని చాలామంది భయపడుతున్నారు.

ఇతరత్రా హిందీ మెజారిటీ ప్రజల భాష అనే వాదన పట్ల కొన్ని అభ్యంతరాలున్న మాట కూడా వాస్తవం. ‘ది పీపుల్స్‌ లింగ్విస్టిక్‌ సర్వే ఆఫ్‌ ఇండియా’ ప్రధాన సంపాదకుడు, ప్రముఖ భాషావేత్త, జీఎన్‌ దెవీ వివరణ ప్రకారం– 2011లో నమోదైన (సంఖ్యాపరంగా) హిందీ భాషీయులు 52.83 కోట్లు. అయితే ఈ హిందీ అనే ప్రాంతా లలోనే భోజ్‌పురి, మైథిలి, ఛత్తీస్‌గఢ్, రాజస్థానీ, పవాడీ మొదలైన స్థానిక భాషలు కలిసి ఉన్నాయి. వీటిని తీసివేస్తే, హిందీ అనేది 32 శాతానికి దిగి వస్తున్నదని దెవీ వాదన. (క్లిక్: ఆంగ్లంతోనే అనుసంధానం)

హిందీ ఆధునికమైన భాష. ఇతర ప్రాచీన భాషలతో పోల్చితే వయస్సులో చిన్నదే. దెవీ భావిస్తున్నట్టు హిందీ అందమైన భాష. సాహిత్యపరంగా గౌరవ స్థానాన్ని సాధించుకున్నది. హిందీ సినిమా జనామోదం వల్ల దేశానికి ఎంతో ఖ్యాతిని, విదేశీ మారకాన్ని సంతరించి పెట్టింది. భౌగోళికంగా, చారిత్రక కారణాల వల్ల, పాలనా సౌలభ్య రీత్యా హిందీని అనుసంధాన భాషగా గౌరవించాలి. ఇంగ్లి ష్‌తో పాటు హిందీ అవసరాన్ని గత వందేళ్ల చరిత్ర నిరూపించింది. (చదవండి: ఒక్క భాషకు పెత్తనమా?)

- నిఖిలేశ్వర్‌
ప్రముఖ కవి, రచయిత

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement