
నిరుడు లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించి వరసగా మూడోసారి కేంద్రంలో అధికారంలోకొచ్చిన బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి విపక్షాల ఆధ్వర్యంలోని రెండు రాష్ట్రాలు గట్టి ప్రతిఘటననిస్తున్నాయి. ఇందులో తమిళనాడులోని డీఎంకే ప్రభుత్వం బెంగాల్‌లోని తృణమూల్ సర్కారుకన్నా ఒకడుగు ముందుంది. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ ఒకపక్క నియోజక వర్గాల పునర్విభజన, మరోపక్క హిందీ భాష పెత్తనం అనే రెండు పదునైన ఆయుధాలతోకేంద్రాన్ని ఇరకాటంలో పడేస్తున్నారు.
పార్లమెంటులోనూ, వెలుపలా ఈ రెండింటిపైనా విస్తృతమైన చర్చ జరిగేలా చూస్తున్నారు. నిత్యం పతాక శీర్షికలకెక్కుతున్నారు. శుక్రవారం ప్రవేశపెట్టే 2025–26 రాష్ట్ర బడ్జెట్ లోగో లోని హిందీ అక్షరం‘రూ’ బదులు తమిళ అక్షరం ‘రూ’ను వినియోగించబోతున్నా మని గురువారం స్టాలిన్ ప్రకటించటం అందులో భాగమే. అయితే తమ ఉద్దేశం తమిళభాష ఔన్న త్యాన్ని పెంచటమే తప్ప, హిందీని వ్యతిరేకించటం కాదని డీఎంకే ప్రతినిధి శరవణన్ వివరణ నిచ్చారు. హిందీ ‘రూ’ జాతీయ కరెన్సీ అధికారిక చిహ్నంగా 2010 జూలై నుంచి అమల్లోవుంది.
వచ్చే ఏడాది జరిగే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల దృష్టితోనే డీఎంకే ఇలాంటి విన్యాసాలు చేస్తున్న దని బీజేపీ అంటున్నా, ఆ పార్టీ లేవనెత్తుతున్న రెండు అంశాలూ కొట్టిపారేయదగ్గవి కాదు.రాజ్యాంగం నిర్దేశించిన ఫెడరలిజం భావనను కేంద్రం నీరుగారుస్తోందన్న అభిప్రాయం రాష్ట్రాల్లో బలపడనట్టయితే డీఎంకే లేవనెత్తిన అంశాలకు ఇప్పుడున్నంత ప్రాముఖ్యత లభించేది కాదన్నది వాస్తవం. ఇంతకూ జాతీయ కరెన్సీ చిహ్నం రూపొందించింది తమిళనాడు వ్యక్తి, పైగా డీఎంకే మాజీ ఎమ్మెల్యే కుమారుడు. కనుకనే డీఎంకే నిర్ణయం అందరినీ ఆశ్చర్యపరిచింది.
ఆ చిహ్నంలో హిందీ అక్షరమేవున్నా ఇంగ్లిష్ అక్షరం ‘ఆర్’ను కూడా పోలివుండటం దాని ప్రత్యేకత. కానీ సమస్య తలెత్తినప్పుడు ఇవన్నీ మరుగున పడతాయి. ఆ సంగతలా వుంచి ఈ అంశంలో బీజేపీ స్పందనలు శ్రుతిమించాయి. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ కరెన్సీ చిహ్నం మార్పు దేశ ఐక్యతను బలహీనపరిచే ప్రమాదకరమైన మనస్తత్వం పర్యవసానమని అభివర్ణించారు. హిందీ అమలుకు అనుసరించే విధానాలవల్లే ఆ భాషపై వ్యతిరేకత వస్తోంది. ఇది బీజేపీతో మొదలు కాలేదు.
కేంద్రంలో ఏ పార్టీ అధికారంలోవున్నా ఆ దిశగా ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. వాటికి ఎప్పటికప్పుడు ప్రతిఘటన వస్తూనే వున్నది. 2008లో యూపీఏ సర్కారు హిందీ వాడకాన్ని పెంచడానికంటూ విడుదల చేసిన సర్క్యులర్‌పై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. మెట్రిక్, ఆపై స్థాయి అభ్యర్థులకు కేంద్ర నియామకాల కోసం నిర్వహించే పోటీ పరీక్షల్లో తప్పనిసరిగా హిందీ ప్రశ్నపత్రం ఉండాలన్నది సర్క్యులర్ సారాంశం. తమ పార్టీ ఆధ్వర్యంలోని యూపీఏ సర్కారే దీన్ని తీసుకొచ్చినా అప్పటి ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు.
ఇతర ప్రశ్న పత్రాల్లో మెరుగైన మార్కులు వచ్చినా హిందీలో ఫెయిలైతే ఉద్యోగానికి అనర్హులవు తారని ఆ ప్రతిపాదన తెలిపింది. ఇది హిందీ భాషా ప్రాంతాల అభ్యర్థులకే లాభిస్తుందనీ, దక్షిణాదికి అన్యాయం జరుగుతుందనీ వైఎస్ లేఖ రాశారు. చివరకు ఆ సర్క్యులర్‌ను ఉపసంహరించుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత 2014, 2017, 2019లలో సైతం కేంద్రం ఈ మాదిరి ప్రతిపాదనలే ముందుకు తోసింది. ఇంగ్లిష్‌కు ప్రత్యామ్నాయంగా హిందీ ఉండాలని రెండేళ్ల క్రితం కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నప్పుడు కూడా వివాదం రేగింది.
జాతీయ విద్యావిధానం–2020తో తమిళనాడుకు పేచీవుంది. తాము ఎప్పటినుంచో వ్యతిరేకి స్తున్న త్రిభాషా సూత్రాన్ని తీసుకురావటమే ఆ విద్యావిధానం సారాంశమని డీఎంకే అంటున్నది. ఆ విధానం ప్రకారం విద్యార్థి మాతృ భాషతోపాటు ఇంగ్లిష్, మరేదైనా దేశీయ భాష నేర్చుకోవాలన్న నిబంధన వుంది. హిందీయే నేర్చుకోవాలని అందులో లేదన్నది నిజమే కావొచ్చుగానీ... వేరే భాష నేర్చుకోవాలనుకుంటే ఆ భాషా ఉపాధ్యాయులు అందుబాటులో ఉండే అవకాశముందా? హిందీ ప్రాంతాల్లో దక్షిణాది భాషలు నేర్పే టీచర్లే లేరు. అసలు ఈ త్రిభాషాసూత్రం వల్ల ఈ స్థాయిలో మేలు జరిగిందని చెప్పే గణాంకాలున్నాయా?
జాతీయ విద్యావిధానం అమలు చేయలేదన్న కార ణంతో సమగ్ర శిక్షా అభియాన్ (ఎస్‌ఎస్‌ఏ) కింద కేంద్రం నుంచి రావాల్సిన 2,152 కోట్లను నిలిపివేశారని తమిళనాడు ఆరోపిస్తోంది. ఎస్‌ఎస్‌ఏకు రావాల్సిన ఆ నిధులను సొంత వనరులనుంచే సమీకరించాలని నిర్ణయించినట్టు ఆ రాష్ట్ర బడ్జెట్‌లో ప్రకటించారు. హిందీకి వ్యతిరేకమనో, నూతన విద్యావిధానానికి వ్యతిరేకమనో చూపి నిధులు ఆపేయటం ఒత్తిడి తీసుకొచ్చే మార్గమనికేంద్రం అనుకోవచ్చుగానీ... దీన్ని బెదిరించటంగా, బ్లాక్‌మెయిల్‌గా తమిళనాడు పరిగణిస్తోంది. విద్యాపరంగా చూసినా, పన్నుల వసూళ్లపరంగా చూసినా తమిళనాడు అనేక రాష్ట్రాలకన్నా ఎంతో ముందుంది. అందుకు ఇదా బహుమతి అనే ప్రశ్న తలెత్తదా?
అమల్లోకి తీసుకురాదల్చుకున్న ఏ విధానంపైన అయినా సమగ్ర చర్చ జరపడం, అపోహల్ని తొలగించటం అవసరమని కేంద్రం గ్రహించాలి. ప్రాథమిక స్థాయి విద్య మొదలుకొని విశ్వవిద్యా లయ విద్యవరకూ అన్నింటా తన ఆధిపత్యమే ఉండాలన్న ఆత్రుత వేరే పర్యవసానాలకు దారి తీస్తున్నదని గుర్తుంచుకోవాలి. రాష్ట్రాలను మున్సిపాలిటీల స్థాయికి దిగజారిస్తే, ఫలానా పథకం అమలు చేయలేదన్న కారణం చూపి నిధులు ఎగ్గొడితే సాధారణ ప్రజలకు వేరే సంకేతాలు పోతాయి. ఆ పరిస్థితి తలెత్తకుండా చూసుకోవటం కేంద్రం బాధ్యత.