M K Stalin
-
గతంలో మా నాశనాన్ని కోరారు.. ఇప్పుడు వాళ్లే పతనమయ్యారు!
సాక్షి, చెన్నై: డీఎంకే నాశనాన్ని కోరిన వాళ్లే ఇప్పుడు పతనం అయ్యారని, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అన్నాడీఎంకే పార్టీ నేతలను ఉద్దేశించి విమర్శించారు. తిరువాన్మీయూరులోని ఓ కల్యాణ మండపంలో జరిగిన మంత్రి కేకేఎస్ఎస్ఆర్ రామచంద్రన్ కుటుంబ సభ్యుల వివాహ వేడుకలో ఆయన పాల్గొని వధూవరులను ఆశీర్వదించారు. అనంతరం సీఎం స్టాలిన్ మాట్లాడుతూ డీఎంకే కుటుంబం ఆనందోత్సాహాలతో ఉందని, పొరుగున ఉన్న కల్యాణ మండపంలో ఏమి జరుగుతోందో మనకు అవసరం లేదని పరోక్షంగా అన్నాడీఎంకే వివాదాలను గుర్తు చేస్తూ వ్యాఖ్యలు చేశారు. డీఎంకేను ఎలాగైనా నాశనం చేయాలని కుట్రలు పన్నిన వాళ్లు, వ్యూహాలను రచించిన వాళ్లే ఇప్పుడు పతనం అయ్యారని ఎద్దేవా చేశారు. డీఎంకేను నిర్వీర్యం చేయడం ఎవరి తరం కాదని ఈ సందర్భంగా సీఎం స్టాలిన్ ధీమా వ్యక్తం చేశారు. అధికారులతో సమీక్ష.. ఆదివారం సీఎం స్టాలిన్ స్వల్ప అనారోగ్యానికి గురైన విషయం తెలిసిందే. మూడు రోజుల పాటు ఆయన విశ్రాంతి తీసుకున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం కుదుట పడడంతో అధికారిక కార్యక్రమాలపై దృష్టి పెట్టారు. మంత్రి కేకేఎస్ఎస్ఆర్ ఇంటి వివాహ వేడుకలో పాల్గొన్న అనంతరం ఆయన నేరుగా సచివాలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా అధికారులతో సమావేశమయ్యారు. గత నాలుగైదు రోజులుగా కురుస్తున్న వర్షాలు, చేపట్టిన ముందు జాగ్రత్తల గురించి తెలుసుకున్నారు. కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండడం, కట్టడి లక్ష్యంగా చేపట్టిన చర్యలు, జ్వరాలు ప్రబలకుండా ముందు జాగ్రత్తలు విస్తృతం చేయాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో మంత్రులు దురై మురుగన్, కేఎన్ నెహ్రు, శేఖర్‌బాబు, ఎం సుబ్రమణియన్, ఏవి వేలు, సీఎస్ ఇరై అన్భు, ఆయా శాఖ కార్యదర్శులు పాల్గొన్నారు. -
CM MK Stalin: ఒక మహిళ చమత్కారం.. స్టాలిన్ నవ్వులు
ఆయన ఓ పెద్ద రాష్ట్రానికి ముఖ్యమంత్రి. చుట్టూ భారీ కాన్వాయ్, మందీమార్బలం లేకుండా సహజంగా ఏ సీఎం కూడా కాలు బయటపెట్టరు. అయితే తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అందుకు భిన్నంగా వ్యవహరించారు. సాధారణ పౌరుడిలా ‘ఎన్నమ్మా..సౌఖ్యమా’ (ఏమ్మా క్షేమంగా ఉన్నారా) అంటూ ప్రజలను నేరుగా పలుకరించి ‘వావ్ గ్రేట్’ అనిపించుకున్నారు. స్టాలిన్‌తో స్థానికులు అపూర్వమైన అనుభూతిని పంచుకున్నారు. వివరాల్లోకి వెళ్లితే.. సాక్షి, చెన్నై(తమిళనాడు): ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తన ఆరోగ్యంపై ఎంతో శ్రద్ధ చూపుతుంటారు. ప్రతి రోజూ ఉదయం నగరంలో సైక్లింగ్, జాగింగ్ చేయడం ఆయనకు అలవాటు. సీఎం అయిన తరువాత ఈ ఏడాది ఆగస్టులో చెన్నై నుంచి 50 కిలోమీటర్ల దూరంలోని మహాబలిపురం వరకు సైకిల్లో వెళ్లిన విషయం తెలిసిందే. మంగళవారం చెన్నై అడయారు ఆలమరం ప్రాంతానికి జాగింగ్ కోసం వెళ్లారు. అదే సమయంలో స్థానికులు జాగింగ్ చేస్తూ స్టాలిన్‌కు తారసపడ్డారు. వారిని చూడగానే స్టాలిన్ రోడ్డుపై నిలబడి మాట కలిపారు. క్షేమ సమాచారాలు అడిగి తెలుసుకున్నారు. వారిలో ఒక మహిళ.. ‘మిమ్మల్ని రెండేళ్ల క్రితం విమానాశ్రయంలో కలుసుకున్నాను, సీఎం కావాలని శుభాకాంక్షలు తెలిపాను, అయితే సెల్ఫీ తీసుకోవడం మిస్ అయ్యాను’ అంటూ పాత జ్ఞాపకాలను గుర్తు చేశారు. ‘మీరు సీఎం అయ్యాక ప్రతి ఒక్క విషయంలోనూ ఆచితూచి అడుగువేస్తున్నారు..చాలా గర్వకారణంగా ఉంది’ అంటూ మరో మహిళ ప్రశంశించారు. ‘మేమంతా ఎంతో సంతోషంగా ఉన్నాం.. ఈ మంచి రోజులు ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాము’ అని ఇంకో మహిళ స్టాలిన్‌తో అన్నారు. ‘అంతర్జాతీయ ఫుట్‌బాల్ పోటీలకు వెళ్లిన మీ మనుమడు విజయం సాధించాలని కోరుకుంటున్నాము’ అని ఓ స్థానికుడు చెప్పడంతో సీఎం వెంటనే ధన్యవాదాలు తెలిపారు. ‘ఎన్నో ఏళ్లుగా మిమ్మల్ని చూస్తున్నాం..మార్కెండేయుల్లా ఉన్నారే’ అంటూ ఆయన గ్లామర్‌పై ఒక మహిళ చమత్కరించడంతో స్టాలిన్ పెద్ద పెట్టున నవ్వగా పరిసరాల్లో ఉన్నవారంతా ఆయనతో కలిసి నవ్వులు చిందించారు. ప్రతి రోజూ వ్యాయామం చేస్తా, ఆహారంలో జాగ్రత్తలు పాటిస్తా అని తన యవ్వన, ఆరోగ్య రహస్యాన్ని స్టాలిన్ ప్రజలతో పంచుకున్నారు. స్టాలిన్‌తో పాటు జాగింగ్‌లో పాల్గొన్న ఆరోగ్యశాఖ మంత్రి ఎం. సుబ్రమణియన్, బందోబస్తుగా వెళ్లిన పరిమిత సిబ్బంది సైతం స్థానికులతో సీఎం సంభాషణను ఎంతో ఎంజాయ్ చేశారు. సుమారు అర గంటకు పైగా సాగిన ఈ పిచ్చాపాటీతో ఆ పరిసరాలన్నీ సందడిగా మారాయి. చదవండి: ‘రేవంత్ దమ్ముంటే హుజూరాబాద్‌లో డిపాజిట్ తెచ్చుకో’ M K Stalin blushes as a lady asks the secret of his youthful look, during his morning walk. He responds "diet control". pic.twitter.com/178TnzrNxE — J Sam Daniel Stalin (@jsamdaniel) September 21, 2021 -
స్టాలిన్‌పై నిప్పులు చెరిగిన పన్నీర్!
చెన్నై: డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంకే స్టాలిన్‌కు ఓటమి భయం పట్టుకుందని, ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో డీఎంకే ఓటమి ఖాయమని మాజీ ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం అన్నారు. ఆ ఓటమి భయంతోనే దివంగత ముఖ్యమంత్రి జయలలిత మృతికి సంబంధించి అన్నాడీఎంకే తాత్కాలిక కార్యదర్శి వీకే శశికళకు వ్యతిరేకంగా తన వద్ద ఉన్న ఆధారాలను బటయపెట్టాలని డిమాండ్ చేస్తున్నారని చెప్పారు. అవినీతి గురించి మాట్లాడే అర్హత డీఎంకే నేతలకు లేదని, దేశంలో పెద్ద కుంభకోణాలు వారి హయాంలోనే జరిగాయని విమర్శించారు. అన్నాడీఎంకే పురట్చితలైవి అమ్మ అభ్యర్థి ఈ మధుసూదనన్ పై ప్రజలు నమ్మకం ఉంచారని, డీఎంకే అభ్యర్థి మరుదు గణేషన్ కు ఓటమి తప్పదని పునరుద్ఘాటించారు. గత సోమవారం డీఎంకే అధినేత స్టాలిన్ ఎన్నికల ప్రచారం సందర్భంగా మాట్లాడుతూ.. జయలలిత మృతిపై పన్నీర్ సెల్వం వద్ద ఉన్న సాక్ష్యాలను, అవినీతిని బయటపెట్టాలని డిమాండ్ చేశారు. సాక్ష్యాలను బహిర్గతం చేయకపోతే ప్రజలకు అన్యాయం చేసిన వ్యక్తిగా నిలిచిపోతారని పేర్కొన్నారు. దీనిపై పన్నీర్ సెల్వం స్పందిస్తూ.. అవినీతి గురించి మాట్లాడే నైతిక అర్హత స్టాలిన్‌కు లేదన్నారు. 2జీ, ఎయిర్ మాక్సిస్ లాంటి దేశంలోనే అతిపెద్ద కుంభకోణాలు డీఎంకే నేతలు చేసినవేనంటూ నిప్పులు చెరిగారు. అయితే శశికళ తనను అమ్మ జయలలిత నుంచి దూరం చేసేందుకు 2006 నుంచి చేసిన ప్రయత్నాలే ఆ 90 శాతం రహస్యాలని చెప్పారు. అమ్మ ఆస్పత్రిలో ఉన్నప్పుడు కనీసం ఆమెను చూడలేకపోయానని, చికిత్స కోసం జయలలితను విదేశాలకు తీసుకెళ్లాలని లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ తంబిదురైతో చర్చించినట్లు వెల్లడించారు. అమ్మను ఆరోగ్యంగా ఇంటికి తీసుకురావాలని.. లేనిపక్షంలో మనపైనే కాదు మన ఇళ్లమీద దాడులు జరుగుతాయని ఆరోగ్యశాఖమంత్రి సీ విజయభాస్కర్‌కు సూచించిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఆర్కే నగర్ ఎన్నికల బరిలో చివరికి రేసులో 62 మంది మిగిలారు. అయితే ఇక్కడ చతుర్మఖ పోరు తప్పదనిపిస్తోంది -
జయలలిత ఫొటోలను తొలగించండి
చెన్నై: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జయలలిత దోషిగా తేలినందున తమిళనాడులోని ప్రభుత్వ కార్యాలయాల్లో ఆమె ఫొటోలను తొలగించాలని ప్రతిపక్ష డీఎంకే డిమాండ్ చేసింది. అంతేగాక ఆమె పేరు మీద ప్రభుత్వ పథకాలను అమలు చేయడాన్ని వ్యతిరేకించింది. ప్రతిపక్ష నేత, డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ ఈ మేరకు డిమాండ్ చేశారు. 'ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కోర్టు జయలలితను దోషిగా ప్రకటించింది. ఇప్పటికే ఆమె పేరుతో కొన్ని ప్రభుత్వ పథకాలున్నాయి. వీటి పేర్లను మార్చాలి. ప్రభుత్వం ఇకమీదట జయలలిత పేరుతో కొత్త పథకాలను ప్రకటించరాదు. సెక్రటేరియట్, మంత్రుల కార్యాలయాలు, స్థానిక సంస్థల కార్యాలయాలలో ఉన్న ఆమె ఫొటోలను తొలగించాలి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గిరిజా వైద్యనాధన్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లాం. ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే మేం కోర్టును ఆశ్రయిస్తాం' అని స్టాలిన్ చెప్పారు. జయలలిత 69వ జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం పత్రికల్లు, టీవీలలో ప్రకటనలు ఇవ్వడంపై వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. -
‘సెల్వంను ఎప్పుడూ సమర్థించలేదు’
చెన్నై: పన్నీర్ సెల్వంను తమ పార్టీ ఎప్పుడూ సమర్థించలేదని డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ తెలిపారు. అంశాలపరంగా మద్దతు ఇస్తున్నామని వెల్లడించారు. జయలలిత మరణంపై విచారణ జరపాలని పన్నీర్ సెల్వం నిర్ణయించడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. పన్నీర్ సెల్వం రాజీనామాకు ఒత్తిడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రస్తుత సంక్షోభ పరిస్థితుల్లో శత్రుభావం చూపబోమని, ప్రభుత్వం సవ్యంగా నడిచేందుకు సహరిస్తామని చెప్పారు. రాష్ట్రంలో సాధారణ పరిస్థితులు నెలకొనేందుకు గవర్నర్ విద్యాసాగరరావు చొరవ చూపాలని కోరారు. ‘గవర్నర్ వెంటనే శాసనసభను సమావేశపరచాలి. లేకుంటే ఏ పార్టీకి మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు ఉందో చూడాల’ని స్టాలిన్ సూచించారు. ప్రస్తుత సంక్షోభం వెనుక డీఎం హస్తం ఉందని, స్టాలిన్ తో పన్నీరు సెల్వం రహస్య మంతనాలు సాగిస్తున్నారని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ నటరాజన్ అంతకుముందు ఆరోపించారు. -
మేమే ప్రధానిని కలుస్తాం..
తమిళనాడుః కావేరీజల వివాదం కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలమధ్యే కాక, పార్టీల మధ్యా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులను తెచ్చింది. రెండు రాష్ట్రాల్లో ప్రజల ఆందోళనలకు తోడు రాజకీయ నాయకుల రంగప్రవేశంతో పరిస్థితి మరింత ఉధ్రుతంగా మారుతోంది. ఈ నేపథ్యంలో ఏఐడీఎంకే ప్రభుత్వంపై మరింత ఒత్తిడిని తెచ్చేందుకు డీఎంకే నాయకుడు, విపక్ష నేత ఎం కే స్టాలిన్ పావులు కదుపుతున్నారు. కావేరీ సమస్యపై పాలక పార్టీ విఫలమైన పక్షంలో తామే ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తామని స్టాలిన్ వెల్లడించారు. కావేరీ సమస్య పై డీఎంకే పార్టీ ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నట్లు ప్రతిపక్ష నేత స్టాలిన్ వెల్లడించారు. సమస్యపై చర్చించేందుకు అన్ని పార్టీల ప్రతినిధి బృందం తో కలసి ప్రధాని నరేంద్ర మోదీని, అవసరమైతే రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కూడా కలుస్తామన్నారు. అయితే అధికార, ప్రతిపక్షాలతోపాటు రాజకీయ పార్టీలన్నీ కలసి సమస్యను పరిష్కరించాలన్న చర్యకు ఏఐడీఎంకే ప్రభుత్వం ఏమాత్రం ఇష్టపడలేదని, పైగా చట్టపరంగానే సాధించాలని యోచించినట్లు ఆయన తెలిపారు. అన్ని రాజకీయ పార్టీలు కలసి మాత్రమే సమస్యను పరిష్కరించగలవన్న ఆలోచనను పాలక పార్టీకి ఎన్నోసార్లు తెలియజేశామన్నారు. వారి స్పందనకోసం ఎంతో ఓపిగ్గా నిరీక్షించినా.. ఏఐడీఎంకే అటు దిశగా ఏమాత్రం అడుగు వేయడం లేదని పార్టీ సభ్యులు ఆరోపించారు. పార్టీ నిర్వహించిన నిరాహార దీక్ష ప్రదర్శనలో కావేరీ సమస్యపై స్టాలిన్ ప్రసంగించారు. నేటి నిరాహార దీక్షను చూసైనా ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తుందని ఆశిస్తున్నామని, అందుకు తమ మద్దతు, సహకారం పూర్తిశాతం ఉంటుందనడంలో ఏమాత్రం సందేహం లేదని అన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం ఏమాత్రం ఆలస్యం చేసినా తమ పార్టీ అధ్యక్షుడి అనుమతితో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి, ప్రధాని నరేంద్ర మోదీని, అవసరమైతే రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలుస్తామని స్పష్టం చేశారు. డీఎంకే అధికారంలో ఉన్నపుడు ప్రధాన సమస్యలపై అఖిలపక్ష సమావేశాలు నిర్వహించేదని స్టాలిన్ ఈ సందర్భంలోగుర్తు చేశారు. -
నిజంగా తెలియదు
సాక్షి, చెన్నై: ప్రమాణ స్వీకారోత్సవంలో డీఎంకే దళపతి ఎంకే స్టాలిన్‌ను గుంపులో గోవిందా...! అన్నట్టుగా కూర్చోబెట్టడంపై సీఎం జయలలిత విచారం వ్యక్తం చేశారు. స్టాలిన్‌ను ఇబ్బంది పెట్టాలనిగానీ, డీఎంకేను అవమాన పరచాలనే ఉద్దేశంగానీ తనకు లేదని స్పష్టం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా అమ్మ జయలలిత ఆరోసారి పగ్గాలు చేపట్టిన విషయం తెలిసిందే. అన్నా సెంటినరీ హాల్ వేదికగా అట్టహాసంగా ప్రమాణ స్వీకారమహోత్సవం సోమవారం జరిగింది. ఇందులో డీఎంకే దళపతి ఎంకే స్టాలిన్, ఆ పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు పాల్గొనడం విశేషం. అయితే, స్టాలిన్ కు దక్కాల్సిన మర్యాద మాత్రం అధికారులు కల్పించలేదు. గుంపులో గోవిందా...అన్నట్టుగా అందరు ఎమ్మెల్యేలతో పాటు ఆయన్ను కూడా కూర్చోబెట్టడం వివాదానికి దారి తీసింది. ప్రధాన ప్రతిపక్షం ప్రతినిధికి ఇచ్చే మర్యాద ఇదేనా..? అన్న ప్రశ్న మొదలైంది. అదే సమయంలో ఎన్నికల్లో ఓటమి చవిచూసిన సినీ నటుడు శరత్‌కుమార్, సీపీఐ నాయకుడు టి పాండియన్‌లతో పాటు పలువుర్ని ముందు వరసులో కూర్చోబెట్టి, స్టాలిన్‌ను గుంపులో గోవిందా... అని వదలి పెట్టడం ఎంత వరకు భావ్యం అని ప్రశ్నించే వాళ్లు పెరిగారు. ఇదే విషయంగా డీఎంకే అధినేత ఎం కరుణానిధి, ఎంపీ కనిమొళి అన్నాడీఎంకే సర్కారు తీరుపై విరుచుకుపడ్డారు. ఇదేనా..మర్యాదా..? ఆమె మారరు ..! అని మండిపడ్డారు. స్టాలిన్‌ను ఇబ్బంది పెట్టారని, డీఎంకేను అవమానించారంటూ సోషల్ మీడియాల్లో చర్చలు మొదలయ్యాయి. గతంలో ఉన్న శతృత్వ వైరంతో కూడిన రాజకీయ సంస్కృతిని మార్చే రీతిలో, సత్సంప్రదాయాన్ని, రాజకీయ నాగరికతను చాటే విధంగా స్టాలిన్ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరు కావడంపై సర్వత్రా ప్రశంసలు కురిపించే పనిలో పడ్డారు. ఈ పరిస్థితుల్లో మంగళవారం సీఎం జయలలిత స్పందించా రు. గుంపులో గోవిందా..అని స్టాలిన్‌ను కూర్చోబెట్టడంపై అమ్మ విచారం వ్యక్తం చేస్తూ ప్రకటన విడుదల చేశారు. అమ్మ విచారం.. కృతజ్ఞత: డీఎంకే ఎమ్మెల్యే స్టాలిన్ ప్రమాణ స్వీకారోత్సవానికి వచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. స్టాలిన్‌ను ఇబ్బంది పెట్టాలని గానీ, డీఎంకేను అవమానించాలన్న ఉద్దేశంగానీ తనకు లేదని స్పష్టం చేశారు. ఎమ్మెల్యేలకు ప్రొటోకాల్ మేరకు సీట్లను ప్రమాణ స్వీకారోత్సవ ఆడిటోరియంలో కేటాయించడం జరిగిందన్నారు. నిబంధనల మేరకు ప్రజాపనుల శాఖ అధికారులు స్టాలిన్‌ను కూడా ఎమ్మెల్యేల ప్రోటోకాల్ వరుసలో కూర్చోబెట్టి ఉన్నారని పేర్కొన్నారు. స్టాలిన్ ప్రమాణ స్వీకారోత్సవానికి వచ్చిన సమాచారాన్ని తన దృష్టికి ఎవ్వరూ తీసుకురాలేదని వివరించారు. ఈ విషయాన్ని తన దృష్టికి తీసుకొచ్చి ఉంటే, తక్షణం నిబంధనల్ని సడలించి స్టాలిన్‌ను ముందు వరుసలో కూర్చోబెట్టి ఉంటామన్నారు. ప్రమాణ స్వీకారోత్సవానికి వచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని, అలాగే, ఆయనకు కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటున్నానని ( ప్రధాన ప్రతిపక్షనేతగా ఎంపికైనందుకు) అభినందించారు. రాష్ట్ర ప్రగతి లక్ష్యంగా డీఎంకేతో కలిసి పనిచేయడానికి ఎదురు చూస్తున్నట్టు ఈసందర్భంగా అమ్మ పేర్కొనడం విశేషం. -
స్టాలిన్ వచ్చినందుకు వెరీ హ్యాపీ: జయలలిత
చెన్నై: ముఖ్యమంత్రిగా తాను ప్రమాణం చేసే కార్యక్రమంలో డీఎంకే నేత స్టాలిన్ కు వెనుక వరస సీటు కేటాయింపు విషయంపై తమిళనాడు సీఎం జయలలిత వివరణ ఇచ్చారు. స్టాలిన్ వస్తారని తెలుసునని, ఆయన రావడం తనకెంతో సంతోషాన్నిచ్చిందని ఆమె పేర్కొన్నారు. ప్రతిపక్షపార్టీ నేతలపై తనకు ఎలాంటి విభేదాలు లేవని, స్టాలిన్ కు ఉద్దేశపూర్వకంగా సీటు కేటాయింపు జరగలేదన్నారు. ప్రోటోకాల్ ప్రకారం అధికారులు వ్యవహరించారని అందులో భాగంగానే మొదటి వరసలో సీటు ఇవ్వలేదని, అంతేకానీ ప్రతిపక్ష పార్టీ నేతలను చిన్నచూపు చూపడం కాదని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. నిజం చెప్పాలంటే జయలలిత తాజా ఎన్నికల్లో విజయాన్ని సాధించి చరిత్ర సృష్టించారు. మూడు దశాబ్దాల తర్వాత తమిళ రాజకీయాలను ప్రభావితం చేసిన వ్యక్తిగా నిలిచారు. ఆమె మద్రాసులోని సెంటినరీ ఆడిటోరియంలో సోమవారం ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. జయలలిత సీఎంగా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి స్టాలిన్ రెండో సారి హాజరయ్యారు. స్టాలిన్‌కు ఆడిటోరియంలో 16వ వరుసలో కుర్చీ కేటాయించడంపై డీఎంకే అధినేత కరుణానిధి మండిపడ్డారు. ఉద్దేశపూర్వకంగానే జయలలిత ఈ పని చేశారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. సినీనటుడు శరత్ కుమార్‌కు ముందు వరుసలో సీటు ఇవ్వడాన్ని సాకుగా చూపిస్తూ కరుణానిధి ఆగ్రహం వ్యక్తంచేశారు. ఏది ఏమైతేనేం.. జయలలిత చేసిన పని సబబు కాదంటూ అక్కడ హాట్ టాపిక్ గా మారింది. కేబినెట్ ర్యాంకు స్థాయి, ప్రతిపక్ష హోదా స్థాయి కలిగిన వ్యక్తిని చివరి వరుసలో సీటు ఎలా కేటాయిస్తారంటూ డీఎంకే అగ్రనేతలతో పాటు సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో ఐదుసార్లు ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించిన వ్యక్తికి ప్రధాన ప్రతిపక్ష పార్టీ అగ్రనేతలను ఇలాంటి సందర్భాలలో ఎలా గౌరవించాలో జయలలితకు తెలియదా అంటే.. ఆమె చాకచక్యంగా వ్యవహరించారని అర్థమైపోతోంది. -
స్టాలిన్‌ను జయ అవమానించారా!
చెన్నై: ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం.. ఒకవేళ ఎప్పటిలాగే తండ్రి సీఎం పీఠంపై కూర్చున్నా.. స్వచ్ఛందంగా రెండున్నరేళ్లలో ఆయన తప్పుకొని కుమారుడికి పట్టాభిషేకం ఖాయం. ఇవి తమిళనాడు ఎన్నికల ఫలితాల ముందు డీఎంకే గురించి ఆ పార్టీ చీఫ్ కరుణానిధి, ఆయన చిన్న కుమారుడు స్టాలిన్ గురించి వరకు ప్రతి ఒక్కరూ నెమరు వేసుకున్న అంశాలు. అయితే.. అందరి అంచనాలను తమిళులు పల్టీ కొట్టించారు. ఈసారి అందరికీ షాకిచ్చి.. మరోసారి పురుచ్చితలైవి జయలలితకే పట్టం కట్టారు. ఆమె మద్రాస్ లోని సెంటినరీ ఆడిటోరియంలో సోమవారం ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఉపముఖ్యమంత్రి స్టాలిన్ హాజరయ్యారు. ఇలా జయలలిత సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆయన హాజరుకావడం ఇది రెండోసారి. 2001లో ఒకసారి హాజరయ్యారు. అయితే.. ఈ కార్యక్రమంలో స్టాలిన్‌కు ఆడిటోరియంలో 16వ వరుసలో కుర్చీ కేటాయించారు. ఆయనతో పాటు కొందరు డీఎంకే ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. స్టాలినే ఈసారి ప్రధాన ప్రతిపక్ష నేత అవుతారని కూడా అంచనాలు ఉన్నాయి. కేబినెట్ ర్యాంకు ఉండే ప్రతిపక్ష నేత స్థాయి వ్యక్తిని ఇలా వెనకాల కూర్చోబెట్టడం ఏంటని అంతా మండిపడుతున్నారు. పైగా.. పుండు మీద కారం చల్లినట్లు అదే సమయంలో సినీనటుడు శరత్ కుమార్‌కు మాత్రం ముందు వరుసలో సీటు ఇచ్చారు. ఈ అంశంపై డీఎంకే అధినేత కరుణానిధి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. తన కుమారుడిని వెనుక వరుసలో కూర్చోబెట్టి అవమానిస్తారా అని కరుణ ఫీలయినట్లు సమాచారం. -
అన్నదాతలకు స్టాలిన్ భరోసా
హెక్టారుకు రూ. 25 వేలు ప్రకటించాల్సిందే! తంజై, నాగై, తిరువారూర్లలో పర్యటన కుప్పులు తెప్పలుగా సహాయకాలు పెద్ద సంఖ్యలో అన్నా అరివాలయంకు లారీల రాక కరుణ పరిశీలన వాళ్లు ఇవ్వరు..ఇంకొక్కర్ని ఇవ్వనివ్వరని మండిపాటు చెన్నై: డీఎంకే కోశాధికారి ఎంకే స్టాలిన్ తంజావూరు, నాగపట్నం, తిరువారూర్ జిల్లాల్లో మంగళవారం పర్యటించారు. అన్నదాతలకు భరోసా ఇస్తూ ఆదుకుంటామని హామీ ఇచ్చారు. అయితే, రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నష్టపరిహారంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ, హెక్టారుకు రూ. 25 వేలు ప్రకటించాల్సిందేనని డిమాండ్ చేశారు. డీఎంకే కోశాధికారి ఎంకే స్టాలిన్ పార్టీ తరపున వరద బాధితులకు సహాయకాలను అందిస్తూ, బాధితులకు తామున్నామన్న భరోసాతో ముందుకు సాగుతున్నారు. చెన్నై నుంచి తంజావూరు చేరుకున్న ఆయన తొలుత అక్కడి వరద బాధిత ప్రాంతాల్లో మంగళవారం పర్యటించారు. అక్కడి పంట పొలాల్ని సందర్శించి, దెబ్బ తిన్న పంటల్ని పరిశీలించారు. అన్నదాతలకు ఓదార్పు ఇచ్చే విధంగా సహాయకాలను అందజేశారు. రైతులతో సంప్రదింపులు జరిపి, వారికి ఏర్పడ్డ నష్టం తీవ్రతను ఆరా తీశారు. తదుపరి లోతట్టు గ్రామాల్లో పర్యటించి, సహాయకాలను అందించారు. తిరువారూర్‌లో పలు ప్రాంతాల్లో పర్యటించిన స్టాలిన్ రైతులకు అండగా తామున్నామన్న భరోసా ఇచ్చారు. నాగపట్నం చేరకుని జాలర్లు పడుతున్న కష్టాలను పరిశీలించారు. వరదలతో రోడ్డున పడ్డ కుటుంబాలను పరామర్శించి, సహాయకాలను అందజేశారు. ఈసందర్భంగా స్టాలిన్ మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ఆలస్యంగానైనా వరద సాయాన్ని ప్రకటించిందని పేర్కొన్నారు. అయితే, సాయం అన్నది బాధితులందరికి దరి చేర్చాల్సిన అవసరం ఉందన్నారు. ఏక పక్షంగా వరద సాయం అందించే ప్రయత్నాలు సాగితే తీవ్రంగా స్పందించాల్సి ఉంటుందని హెచ్చరించారు. అన్నదాతలకు కంటి తుడుపు చర్యగా నష్ట పరిహారం ప్రకటించి ఉన్నారని, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఇక, స్టాలిన్ పర్యటన జోరు వానలో సాగడం విశేషం. అన్నదాతల్ని ఆదుకోవాలంటే హెక్టారుకు రూ. 25 వేలు ప్రకటించాల్సిందేనని డిమాండ్ చేశారు. ఇక, బుధవారం కడలూరులో స్టాలిన్ పర్యటించనున్నారు. కుప్పలు తెప్పలుగా : డీఎంకే అధినేత ఎం కరుణానిధి ఇచ్చిన పిలుపుతో ఆ పార్టీ వర్గాలు తీవ్రంగానే స్పందించి ఉన్నారు. లారీలలో టన్నుల కొద్ది సహాయకాలు చెన్నైలోని అన్నా అరివాలయంకు వచ్చి చేరుతున్నాయి. బియ్యం, పప్పుధాన్యాలు, ప్లాస్టిక్ వస్తువులు, దుప్పట్లు, చాపలు, ఇలా ప్రజలకు అవసరమయ్యే అన్ని రకాల వస్తువులు కుప్పలు తెప్పలుగా వచ్చి పడుతుండటంతో వాటిని బాధితులకు పంపిణీ చేయడంలో వేగం పెంచి ఉన్నారు. మంగళవారం తంజావూరు, సేలం, మదురై, ధర్మపురిల నుంచి పదిహేను లారీల్లో వస్తువులు వచ్చి చేరాయి. అలాగే, ఎస్ఆర్ఎం తరపున రెండు లారీల వస్తువుల్ని డీఎంకేకు అందజేశారు. ఇక్కడికి వచ్చిన వస్తువుల్ని పరిశీలించిన అధినేత ఎం కరుణానిధి ప్రతి కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరికీ వీటిని దరి చేర్చాలని పార్టీ వర్గాలను ఆదేశించారు. ఇక, మీడియాతో మాట్లాడిన కరుణానిధి ప్రభుత్వ తీరుపై పరోక్షంగానే విమర్శిస్తూ, రాజకీయాలకు అతీతంగా డిఎంకే ముందుకు సాగుతున్నారు. కుటుంబానికే కాదు, కుటుంబంలో ఉన్న వాళ్లందరికి సహాయకాలను డిఎంకే దరి చేర్చుతున్నదని పేర్కొన్నారు. మానవతా దృక్పథంతో సేవలు చేస్తున్న వాళ్లను అడ్డుకోవడం హేయమైన చర్యగా పేర్కొంటూ, వాళ్లు పెట్టరు, ఇంకెకొర్ని సాయం చేయనివ్వరని అన్నాడీఎంకే వర్గాల మీద మండి పడ్డారు. -
ఇదేనా పాలన?
సాక్షి, చెన్నై : రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకు పోయి ఉన్నదని డీఎంకే కోశాధికారి ఎంకే స్టాలిన్ ఆరోపించారు. అప్పుల్లో రాష్ట్రాన్ని మొదటి స్థానంలో నిలబెట్టిన ఘనత సీఎం జయలలిత నేతృత్వంలోని ప్రభుత్వానికే దక్కిందని మండి పడ్డారు. ఇదేనా ప్రజలకు అందిస్తున్న సుపరి పాలన అని ప్రశ్నించారు. ఆదివారం డీఎంకే కోశాధికారి ఎంకే స్టాలిన్ ఓ ప్రకటన విడుదల చేశారు. 2011 ఎన్నికల ముందు రాష్ట్రంలో కేవలం 95కోట్ల అప్పుల్లో ఉండేదని గుర్తుచేశారు. అయితే, ఈ నాలుగున్నరేళ్ల కాలంలో అప్పులు భారీగా పెరిగాయని వివరించారు. తాము అధికారంలోకి వస్తే అప్పు రహిత రాష్ట్రంగా తమిళనాడును తీర్చిదిద్దుతామని జయలలిత గత ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటించారని పేర్కొన్నారు. అయితే, ఇప్పుడు వెలుగు చూస్తున్న లెక్కల మేరకు రాష్ట్రంలో రెండు లక్షల 11 వేల 483 కోట్ల మేరకు అప్పుల్లో ఉన్నట్టు స్పష్టం అవుతోందన్నారు. ప్రత్యేక పథకాల ద్వారా రానున్న ఐదేళ్లల్లో లక్షా 20 వేల కోట్ల ఆదాయన్ని ఆర్జించి తీరుతామని ప్రగల్బాలు పలికిన సీఎం జయలలిత, ఇప్పుడు పేరుకు పోయిన అప్పుల గురించి ఎలాంటి సమాధానం ఇస్తారో అని ఎద్దేవాచేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఒక్కొక్కరి నెత్తిన రూ. 28 వేల మేరకు అప్పును ప్రభుత్వం రుద్ది ఉన్నదని పేర్కొన్నారు. అన్ని రకాలుగా రాష్ట్రం వెనుక బడి ఉన్నా, అప్పుల్లో మాత్రం దేశంలోనే మొదటి స్థానాన్ని దక్కించుకుని ఉండడం విచారకరంగా పేర్కొన్నారు. ఇంత పెద్ద మొత్తంలో రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకు పోయేందుకు ప్రధాన కారణం అధ్వానమైన పాలన, అవినీతి మయం అని ఆరోపించారు. పేరుకు పోయిన అప్పుల గురించి ఎలాంటి సమాధానం ఇస్తారో చూద్దామని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2014-15 ఆర్థిక పరిశీలన నివేదిక మేరకు లక్షా 91 వేల 300 కోట్లను అప్పుగా చూపించి ఉన్నారని, ఇంత పెద్ద మొత్తంలో అప్పు చేయాల్సిన అవసరం ప్రభుత్వానికి ఎందుకు వచ్చిందో వివరించాలని డిమాండ్ చేశారు. సుపరి పాలన అంటూ ప్రజల్ని అప్పుల్లోకి నెట్టడమేనా పాలన అని సీఎం జయలలితను ఉద్దేశించి ప్రశ్నించారు. అప్పులతో రాష్ట్రానికి తలవంపు తీసుకొచ్చి పెట్టిన ఈ పాలకులకు బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. -
లిక్కర్ బాటిల్‌తో స్టాలిన్ ముందుకు యువతి
వెల్లూరు: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి తనయుడు ఎంకే స్టాలిన్‌కు ఓ యువతి నుంచి తీవ్ర నిరసన వ్యక్తమైంది. కంటినిండా నీరుతో గద్గద స్వరంతో చేతిలో బీరు బాటిల్ పట్టుకొని ఊపుతూ ఆమె తన ఆవేదనను వెల్లిబుచ్చింది. వెల్లూరులో ఆయన బుధవారం 'నమక్కు నామే' అనే ఓ ప్రచార కార్యక్రమానికి వెళ్లిన సందర్భంగా ఆ యువతి లిక్కర్ బాటిల్ తో ఆయన ముందుకు వచ్చింది. మద్యం మహామ్మారి తన తండ్రిని పొట్టన పెట్టుకుందని, ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా మద్యాన్ని మాన్పించలేకపోతున్నారని, ఫలితంగా తమలాంటి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని, ఈ సారి డీఎంకే ప్రభుత్వమైనా మద్యాన్ని పూర్తిగా నిషేధిస్తామని హామీ ఇవ్వాలని చెప్పింది. ఇందుకు స్పందించిన స్టాలిన్.. తాము అధికారంలోకి వస్తే తప్పకుండా మద్యాన్ని పూర్తిగా నిషేధిస్తామని, తమ అజెండాలో ఆ అంశం కూడా ఉందని చెప్పారు. -
'మన కోసం మనం'.. ఓ కామెడి ప్రోగ్రామ్!
చెన్నై: వారసత్వపోరులో తమ్ముడి చేతిలో ఓడి, పార్టీ నుంచి బహిష్కరణకు గురైన డీఎంకే పార్టీ మాజీ నేత, తమిళనాడు మాజీ సీఎం పెద్ద కుమారుడు అళగిరి మరోసారి నిరసన గళం వినిపించారు. తన సోదరుడు ఎం.కె. స్టాలిన్ ఇటీవలే చేపట్టిన 'మన కోసం మనం' కార్యక్రమాన్ని ఉద్దేశించి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 'ఆ కార్యక్రమం ఓ కామెడీ ప్రోగ్రామ్. దానివల్ల డీఎంకేకి ఎలాంటి ఉపయోగం ఉండదు' అని ఆదివారం చెన్నైలో విలేకరులతో అన్నారు. వచ్చే ఏడాది జరుగనున్న అసెంబ్లీ ఎన్నికలకు డీఎంకే పార్టీ శ్రేణులను సమాయత్తం చేసేందుకుగానూ స్టాలిన్.. నమక్కు నామే విదియాల్ మీట్పు పయనం (మన కోసం మనమే: ఓటమి నుంచి విజయం వైపు పయనం) పేరుతో గత నెల చివరి వారం నుంచి యాత్ర ప్రారంభించిన సంగతి తెలిసిందే. -
2016లో స్టాలినే ముఖ్యమంత్రి!
పళ్లిపట్టు : 2016లో రాష్ట్ర ముఖ్యమంత్రిగా స్టాలిన్ పదవీ బాధ్యతలు చేపట్టడం ఖాయమని దిండుగల్ లియోని పేర్కొన్నారు. డీఎంకే నేత విభాగం ఆధ్వర్యంలో పళ్లిపట్టు సమీపంలోని పొదటూరుపేటలో డీఎంకే అధినేత కరుణానిధి 92వ జన్మదినోత్సవ వేడుకలు నిర్వహించారు. రాష్ట్ర నేత విభాగ ఉపాధ్యక్షుడు నాగలింగం అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమాల్లో భాగంగా ఆ పార్టీ తిరువళ్లూరు జిల్లా కార్యదర్శి గుమ్మిడిపూండి వేణు, మాజీ మంత్రి సుందరం తదితరులు పాల్గొని మొక్కలు నాటి జూన్ 3న జన్మించిన వారికి రూ.పది వేల చొప్పున ఆర్థిక సహాయకాలు పంపిణీ చేశారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో దిండుగల్ లియోని ఆధ్వర్యంలో కవి సమ్మేళనం నిర్వహించారు. వేడుకల్లో భాగంగా నేత విభాగ రాష్ట్ర అధ్యక్షుడు షణ్ముగం, కార్యదర్శి సచ్చితానందనం,అన్బళగన్, శివశక్తివేల్, అన్నామలై పాల్గొన్నారు. -
'నేను యోగా ఎప్పటి నుంచో చేస్తున్నా'
చెన్నై: తాను యోగాను ఎప్పటి నుంచో చేస్తున్నానని డీఎంకే నేత, కరుణానిధి చిన్న కుమారుడు ఎంకే స్టాలిన్ అన్నారు. తనలో సానూకూల దృక్ఫథానికి యోగానే కారణమని చెప్పారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆయన ఫేస్బుక్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. 'నేను చాలా ఏళ్లుగా యోగా చేస్తున్నాను. యోగా మన శరీరానికి, ఆలోచనకు స్థిరత్వం ఇస్తుందని నేను నమ్ముతాను. అంతేకాకుండా ప్రతి ఒక్కరికీ పాజిటివ్ శక్తిని కూడా పెంపొందిస్తుంది' అని ఆయన యోగా విశిష్టతను తెలియజేశారు. ఏ ప్రభుత్వం పరిపాలించాలనుకున్నా దానికి ప్రజల ఆరోగ్యం కూడా చాలా ముఖ్యమని చెప్పారు. జూన్ 21ని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా జరుపుకోవడం అభినందనీయం అని చెప్పారు.