‘సెల్వంను ఎప్పుడూ సమర్థించలేదు’
చెన్నై: పన్నీర్ సెల్వంను తమ పార్టీ ఎప్పుడూ సమర్థించలేదని డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ తెలిపారు. అంశాలపరంగా మద్దతు ఇస్తున్నామని వెల్లడించారు. జయలలిత మరణంపై విచారణ జరపాలని పన్నీర్ సెల్వం నిర్ణయించడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. పన్నీర్ సెల్వం రాజీనామాకు ఒత్తిడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రస్తుత సంక్షోభ పరిస్థితుల్లో శత్రుభావం చూపబోమని, ప్రభుత్వం సవ్యంగా నడిచేందుకు సహరిస్తామని చెప్పారు.
రాష్ట్రంలో సాధారణ పరిస్థితులు నెలకొనేందుకు గవర్నర్ విద్యాసాగరరావు చొరవ చూపాలని కోరారు. ‘గవర్నర్ వెంటనే శాసనసభను సమావేశపరచాలి. లేకుంటే ఏ పార్టీకి మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు ఉందో చూడాల’ని స్టాలిన్ సూచించారు. ప్రస్తుత సంక్షోభం వెనుక డీఎం హస్తం ఉందని, స్టాలిన్ తో పన్నీరు సెల్వం రహస్య మంతనాలు సాగిస్తున్నారని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ నటరాజన్ అంతకుముందు ఆరోపించారు.