హెక్టారుకు రూ. 25 వేలు ప్రకటించాల్సిందే!
తంజై, నాగై, తిరువారూర్‌లలో పర్యటన
కుప్పులు తెప్పలుగా సహాయకాలు
పెద్ద సంఖ్యలో అన్నా అరివాలయంకు లారీల రాక
కరుణ పరిశీలన
వాళ్లు ఇవ్వరు..ఇంకొక్కర్ని ఇవ్వనివ్వరని మండిపాటు
చెన్నై: డీఎంకే కోశాధికారి ఎంకే స్టాలిన్ తంజావూరు, నాగపట్నం, తిరువారూర్ జిల్లాల్లో మంగళవారం పర్యటించారు. అన్నదాతలకు భరోసా ఇస్తూ ఆదుకుంటామని హామీ ఇచ్చారు. అయితే, రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నష్టపరిహారంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ, హెక్టారుకు రూ. 25 వేలు ప్రకటించాల్సిందేనని డిమాండ్ చేశారు. డీఎంకే కోశాధికారి ఎంకే స్టాలిన్ పార్టీ తరపున వరద బాధితులకు సహాయకాలను అందిస్తూ, బాధితులకు తామున్నామన్న భరోసాతో ముందుకు సాగుతున్నారు. చెన్నై నుంచి తంజావూరు చేరుకున్న ఆయన తొలుత అక్కడి వరద బాధిత ప్రాంతాల్లో మంగళవారం పర్యటించారు. అక్కడి పంట పొలాల్ని సందర్శించి, దెబ్బ తిన్న పంటల్ని పరిశీలించారు.
అన్నదాతలకు ఓదార్పు ఇచ్చే విధంగా సహాయకాలను అందజేశారు. రైతులతో సంప్రదింపులు జరిపి, వారికి ఏర్పడ్డ నష్టం తీవ్రతను ఆరా తీశారు. తదుపరి లోతట్టు గ్రామాల్లో పర్యటించి, సహాయకాలను అందించారు. తిరువారూర్‌లో పలు ప్రాంతాల్లో పర్యటించిన స్టాలిన్ రైతులకు అండగా తామున్నామన్న భరోసా ఇచ్చారు. నాగపట్నం చేరకుని జాలర్లు పడుతున్న కష్టాలను పరిశీలించారు. వరదలతో రోడ్డున పడ్డ కుటుంబాలను పరామర్శించి, సహాయకాలను అందజేశారు. ఈసందర్భంగా స్టాలిన్ మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ఆలస్యంగానైనా వరద సాయాన్ని ప్రకటించిందని పేర్కొన్నారు. అయితే, సాయం అన్నది బాధితులందరికి దరి చేర్చాల్సిన అవసరం ఉందన్నారు.
ఏక పక్షంగా వరద సాయం అందించే ప్రయత్నాలు సాగితే తీవ్రంగా స్పందించాల్సి ఉంటుందని హెచ్చరించారు. అన్నదాతలకు కంటి తుడుపు చర్యగా నష్ట పరిహారం ప్రకటించి ఉన్నారని, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఇక, స్టాలిన్ పర్యటన జోరు వానలో సాగడం విశేషం. అన్నదాతల్ని ఆదుకోవాలంటే హెక్టారుకు రూ. 25 వేలు ప్రకటించాల్సిందేనని డిమాండ్ చేశారు. ఇక, బుధవారం కడలూరులో స్టాలిన్ పర్యటించనున్నారు.
కుప్పలు తెప్పలుగా : డీఎంకే అధినేత ఎం కరుణానిధి ఇచ్చిన పిలుపుతో ఆ పార్టీ వర్గాలు తీవ్రంగానే స్పందించి ఉన్నారు. లారీలలో టన్నుల కొద్ది సహాయకాలు చెన్నైలోని అన్నా అరివాలయంకు వచ్చి చేరుతున్నాయి. బియ్యం, పప్పుధాన్యాలు, ప్లాస్టిక్ వస్తువులు, దుప్పట్లు, చాపలు, ఇలా ప్రజలకు అవసరమయ్యే అన్ని రకాల వస్తువులు కుప్పలు తెప్పలుగా వచ్చి పడుతుండటంతో వాటిని బాధితులకు పంపిణీ చేయడంలో వేగం పెంచి ఉన్నారు. మంగళవారం తంజావూరు, సేలం, మదురై, ధర్మపురిల నుంచి పదిహేను లారీల్లో వస్తువులు వచ్చి చేరాయి.
అలాగే, ఎస్‌ఆర్‌ఎం తరపున రెండు లారీల వస్తువుల్ని డీఎంకేకు అందజేశారు. ఇక్కడికి వచ్చిన వస్తువుల్ని పరిశీలించిన అధినేత ఎం కరుణానిధి ప్రతి కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరికీ వీటిని దరి చేర్చాలని పార్టీ వర్గాలను ఆదేశించారు. ఇక, మీడియాతో మాట్లాడిన కరుణానిధి ప్రభుత్వ తీరుపై పరోక్షంగానే విమర్శిస్తూ, రాజకీయాలకు అతీతంగా డిఎంకే ముందుకు సాగుతున్నారు.
కుటుంబానికే కాదు, కుటుంబంలో ఉన్న వాళ్లందరికి సహాయకాలను డిఎంకే దరి చేర్చుతున్నదని పేర్కొన్నారు. మానవతా దృక్పథంతో సేవలు చేస్తున్న వాళ్లను అడ్డుకోవడం హేయమైన చర్యగా పేర్కొంటూ, వాళ్లు పెట్టరు, ఇంకెకొర్ని సాయం చేయనివ్వరని అన్నాడీఎంకే వర్గాల మీద మండి పడ్డారు.