సాక్షి, చెన్నై: డీఎంకే నాశనాన్ని కోరిన వాళ్లే ఇప్పుడు పతనం అయ్యారని, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అన్నాడీఎంకే పార్టీ నేతలను ఉద్దేశించి విమర్శించారు. తిరువాన్మీయూరులోని ఓ కల్యాణ మండపంలో జరిగిన మంత్రి కేకేఎస్‌ఎస్‌ఆర్ రామచంద్రన్ కుటుంబ సభ్యుల వివాహ వేడుకలో ఆయన పాల్గొని వధూవరులను ఆశీర్వదించారు. అనంతరం సీఎం స్టాలిన్ మాట్లాడుతూ డీఎంకే కుటుంబం ఆనందోత్సాహాలతో ఉందని, పొరుగున ఉన్న కల్యాణ మండపంలో ఏమి జరుగుతోందో మనకు అవసరం లేదని పరోక్షంగా అన్నాడీఎంకే వివాదాలను గుర్తు చేస్తూ వ్యాఖ్యలు చేశారు. డీఎంకేను ఎలాగైనా నాశనం చేయాలని కుట్రలు పన్నిన వాళ్లు, వ్యూహాలను రచించిన వాళ్లే ఇప్పుడు పతనం అయ్యారని ఎద్దేవా చేశారు. డీఎంకేను నిర్వీర్యం చేయడం ఎవరి తరం కాదని ఈ సందర్భంగా సీఎం స్టాలిన్ ధీమా వ్యక్తం చేశారు.
అధికారులతో సమీక్ష..
ఆదివారం సీఎం స్టాలిన్ స్వల్ప అనారోగ్యానికి గురైన విషయం తెలిసిందే. మూడు రోజుల పాటు ఆయన విశ్రాంతి తీసుకున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం కుదుట పడడంతో అధికారిక కార్యక్రమాలపై దృష్టి పెట్టారు. మంత్రి కేకేఎస్‌ఎస్‌ఆర్ ఇంటి వివాహ వేడుకలో పాల్గొన్న అనంతరం ఆయన నేరుగా సచివాలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా అధికారులతో సమావేశమయ్యారు. గత నాలుగైదు రోజులుగా కురుస్తున్న వర్షాలు, చేపట్టిన ముందు జాగ్రత్తల గురించి తెలుసుకున్నారు. కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండడం, కట్టడి లక్ష్యంగా చేపట్టిన చర్యలు, జ్వరాలు ప్రబలకుండా ముందు జాగ్రత్తలు విస్తృతం చేయాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో మంత్రులు దురై మురుగన్, కేఎన్ నెహ్రు, శేఖర్‌బాబు, ఎం సుబ్రమణియన్, ఏవి వేలు, సీఎస్ ఇరై అన్భు, ఆయా శాఖ కార్యదర్శులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment