నిజంగా తెలియదు
సాక్షి, చెన్నై: ప్రమాణ స్వీకారోత్సవంలో డీఎంకే దళపతి ఎంకే స్టాలిన్‌ను గుంపులో గోవిందా...! అన్నట్టుగా కూర్చోబెట్టడంపై సీఎం జయలలిత విచారం వ్యక్తం చేశారు. స్టాలిన్‌ను ఇబ్బంది పెట్టాలనిగానీ, డీఎంకేను అవమాన పరచాలనే ఉద్దేశంగానీ తనకు లేదని స్పష్టం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా అమ్మ జయలలిత ఆరోసారి పగ్గాలు చేపట్టిన విషయం తెలిసిందే. అన్నా సెంటినరీ హాల్ వేదికగా అట్టహాసంగా ప్రమాణ స్వీకారమహోత్సవం సోమవారం జరిగింది. ఇందులో డీఎంకే దళపతి ఎంకే స్టాలిన్, ఆ పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు పాల్గొనడం విశేషం.
అయితే, స్టాలిన్ కు దక్కాల్సిన మర్యాద మాత్రం అధికారులు కల్పించలేదు. గుంపులో గోవిందా...అన్నట్టుగా అందరు ఎమ్మెల్యేలతో పాటు ఆయన్ను కూడా కూర్చోబెట్టడం వివాదానికి దారి తీసింది. ప్రధాన ప్రతిపక్షం ప్రతినిధికి ఇచ్చే మర్యాద ఇదేనా..? అన్న ప్రశ్న మొదలైంది. అదే సమయంలో ఎన్నికల్లో ఓటమి చవిచూసిన సినీ నటుడు శరత్‌కుమార్, సీపీఐ నాయకుడు టి పాండియన్‌లతో పాటు పలువుర్ని ముందు వరసులో కూర్చోబెట్టి, స్టాలిన్‌ను గుంపులో గోవిందా... అని వదలి పెట్టడం ఎంత వరకు భావ్యం అని ప్రశ్నించే వాళ్లు పెరిగారు. ఇదే విషయంగా డీఎంకే అధినేత ఎం కరుణానిధి, ఎంపీ కనిమొళి అన్నాడీఎంకే సర్కారు తీరుపై విరుచుకుపడ్డారు.
ఇదేనా..మర్యాదా..? ఆమె మారరు ..! అని మండిపడ్డారు. స్టాలిన్‌ను ఇబ్బంది పెట్టారని, డీఎంకేను అవమానించారంటూ సోషల్ మీడియాల్లో చర్చలు మొదలయ్యాయి. గతంలో ఉన్న శతృత్వ వైరంతో కూడిన రాజకీయ సంస్కృతిని మార్చే రీతిలో, సత్‌సంప్రదాయాన్ని, రాజకీయ నాగరికతను చాటే విధంగా స్టాలిన్ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరు కావడంపై సర్వత్రా ప్రశంసలు కురిపించే పనిలో పడ్డారు. ఈ పరిస్థితుల్లో మంగళవారం సీఎం జయలలిత స్పందించా రు. గుంపులో గోవిందా..అని స్టాలిన్‌ను కూర్చోబెట్టడంపై అమ్మ విచారం వ్యక్తం చేస్తూ ప్రకటన విడుదల చేశారు.
అమ్మ విచారం.. కృతజ్ఞత: డీఎంకే ఎమ్మెల్యే స్టాలిన్ ప్రమాణ స్వీకారోత్సవానికి వచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. స్టాలిన్‌ను ఇబ్బంది పెట్టాలని గానీ, డీఎంకేను అవమానించాలన్న ఉద్దేశంగానీ తనకు లేదని స్పష్టం చేశారు. ఎమ్మెల్యేలకు ప్రొటోకాల్ మేరకు సీట్లను ప్రమాణ స్వీకారోత్సవ ఆడిటోరియంలో కేటాయించడం జరిగిందన్నారు. నిబంధనల మేరకు ప్రజాపనుల శాఖ అధికారులు స్టాలిన్‌ను కూడా ఎమ్మెల్యేల ప్రోటోకాల్ వరుసలో కూర్చోబెట్టి ఉన్నారని పేర్కొన్నారు.
స్టాలిన్ ప్రమాణ స్వీకారోత్సవానికి వచ్చిన సమాచారాన్ని తన దృష్టికి ఎవ్వరూ తీసుకురాలేదని వివరించారు. ఈ విషయాన్ని తన దృష్టికి తీసుకొచ్చి ఉంటే, తక్షణం నిబంధనల్ని సడలించి స్టాలిన్‌ను ముందు వరుసలో కూర్చోబెట్టి ఉంటామన్నారు. ప్రమాణ స్వీకారోత్సవానికి వచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని, అలాగే, ఆయనకు కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటున్నానని ( ప్రధాన ప్రతిపక్షనేతగా ఎంపికైనందుకు) అభినందించారు. రాష్ట్ర ప్రగతి లక్ష్యంగా డీఎంకేతో కలిసి పనిచేయడానికి ఎదురు చూస్తున్నట్టు ఈసందర్భంగా అమ్మ పేర్కొనడం విశేషం.