సాక్షి, చైన్నె: అన్నాడీఎంకే రాజకీయాలలో తన ప్రవేశానికి సమయం ఆసన్నమైందని దివంగత సీఎం జయలలిత నెచ్చెలి శశికళ వ్యాఖ్యానించారు. చైన్నెలో ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడారు. అన్నాడీఎంకే కార్యకర్తల పార్టీ అని అన్నారు. ఈ పార్టీని దివంగత నేతలు ఎంజీఆర్, జయలలిత చెక్కు చెదరకుండా పరిరక్షించారని వివరించారు. అయితే, ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు తీవ్ర ఆందోళన, మనో వేదనకు గురి చేస్తున్నాయన్నారు.
కుల మతాలకు అతీతంగా అన్నాడీఎంకేలో అందర్నీ దివంగత నేత జయలలిత చూసే వారు అని గుర్తుచేశారు. కుల, మతం చూసి ఉంటే తనను దగ్గర చేర్చి ఉంటారా? అని ప్రశ్నించారు. ఆమెకు అందరూ సమానం అని, అందుకే ఆమెను ప్రజలు అమ్మగా కొలుస్తూ వస్తున్నారన్నారు. అయితే ప్రస్తుతం అన్నాడీఎంకేలోకి కులం ప్రవేశించిందని, ఓ సామాజిక వర్గంకు చెందిన వారు వ్యక్తిగత స్వలాభం, ఆధిపత్యం దిశగా చేస్తున్న ప్రయత్నాలు పార్టీని పాతాళంలోకి నెడుతున్నదని ఆరోపించారు.
అన్నాడీఎంకే అంటే ఒకే కుటుంబం అని, ఇది కార్యకర్తల పార్టీ అని వ్యాఖ్యలు చేశారు. డీఎంకే అంటే ఒకే కుటుంబం అని ఆ కుటుంబానికి చెందిన వారికే అందులో పదవులు ఉంటాయని విమర్శించారు. డీఎంకే విధానాన్ని అన్నాడీఎంకేలోకి అనుమతించే ప్రసక్తేలేదన్నారు. తన లక్ష్యం ఒక్కటే అని అందర్నీ ఏకం చేయడం అన్నాడీఎంకేను బలోపేతం చేసి రానున్న ఎన్నికలలో విజయంతో అధికారం చేజిక్కించుకోవడమేనని అన్నారు. ఇందుకోసం తన ప్రయత్నం మొదలెట్టానని, తన ప్రవేశానికి సమయం ఆసన్నమైందని, ఇక, మరింత వేగంగా ముందుకెళ్లబోతున్నట్టు శశికళ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment