Tamil Nadu
-
అన్నామలైకే మళ్లీ ఛాన్స్
సాక్షి, చైన్నె: తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా అన్నామలైకు మళ్లీ ఛాన్స్ దక్కబోతున్నట్టుగా ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈనెల 17న అధికారిక ప్రకటన వెలువడనుంది. బీజేపీ సంస్థాగత ఎన్నికలు రాష్ట్రంలో తుది దశకు చేరిన విషయం తెలిసిందే. జిల్లాల అధ్యక్షుల ఎంపిక ప్రక్రియ ముగిసింది. అధిష్టానం ఆమోదంతో జాబితా వెలువడాల్సి ఉంది. ఆ తదుపరి రాష్ట్ర అధ్యక్షుడు, ఇతర కార్యవర్గ పదవుల ప్రక్రియ సాగాల్సి ఉంది. ప్రస్తుతం రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా అన్నామలై వ్యవహరిస్తున్నారు. ఆయన పదవి చేపట్టిన తర్వాత రాష్ట్రంలో బీజేపీ బలం కొంత మేరకు పెరిగిందని చెప్పవచ్చు. రాష్ట్రంలో విస్తృతంగాఅ న్నామలై పర్యటిస్తూ వస్తున్నారు. అదే సమయంలో అన్నాడీఎంకేతో వైర్యం పెట్టుకోవడం ఇతర బీజేపీ నేతలకు మింగుడు పడడం లేదు. ఈ వ్యవహారంలో సీనియర్ నేతలందరూ గుర్రుగానే ఉన్నారు. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర అధ్యక్ష ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియ ఈనెల 17వ తేది జరగబోతోంది. అధ్యక్ష ఎంపికకు నియంచిన కమిటీ బాధ్యతల్లో భాగంగా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి రంగంలోకి దిగనున్నారు. ఈసారి అధ్యక్ష పదవి రేసులో మహిళా నేత, ఎమ్మెల్యే వానతీ శ్రీనివాసన్, శాసన సభా పక్ష నేత నైనార్ నాగేంద్రన్ సైతం రేసులో ఉన్నట్టుగా సమాచారాలు వెలువడ్డాయి. అయితే వారు సుముఖంగా లేనట్టు సంకేతాలు వెలువడ్డాయి. పార్టీ బలోపేతం దిశగా అన్నామలై పరుగులు తీస్తుండడం, అధిష్టానం మద్దతు పాటూ రాష్ట్రంలో కేడర్ అంతా ఆయన వైపు చూస్తుండడంతో మరోమారు అన్నామలై అధ్యక్ష పగ్గాలు చేపట్టడం ఖాయం అని బీజేపీ వర్గాలు పేర్కొంటున్నాయి. -
ఆహ్వానం!
సాక్షి, చైన్నె: కొత్త సంవత్సరంలో తొలి సమావేశానికి హాజరుకావాలని గవర్నర్ ఆర్ఎన్ రవిని అసెంబ్లీ స్పీకర్ అప్పావు ఆహ్వానించారు. ఈనెల 6న అసెంబ్లీ ప్రారంభం కానుంది. ప్రతి ఏటా కొత్త సంవత్సరం తొలి అసెంబ్లీ సమావేశం గవర్నర్ ప్రసంగంతో మొదలెట్టడం రాష్ట్రంలో ఆనవాయితీగా వస్తున్న విషయం తెలిసిందే. గవర్నర్‌గా ఆర్ఎన్ రవి బాధ్యతలు స్వీకరించినానంతరం మూడవ సంవత్సరంగా అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారు. ఈనెల 6న సభ ప్రారంభం కానున్న నేపథ్యంలో గవర్నర్ రవిని ఆహ్వానించేందుకు స్పీకర్ అప్పావు శుక్రవారం ఉదయం రాజ్‌భవన్‌కు వెళ్లారు. గవర్నర్‌తో కాసేపు సమావేశమయ్యారు. తొలి సమావేశానికి హాజరు కావాలని ఆహ్వానించారు. ఈసందర్భంగా తన ప్రసంగం పాఠం గురించి స్పీకర్‌తో గవర్నర్ సమాచారం రాబట్టినట్టు సంకేతాలు వెలువడ్డాయి. రాష్ట్ర ప్రభుత్వ ప్రగతిని, భవిష్యత్తులో చేపట్టబోయే అంశాలను వివరించే విధంగా గవర్నర్ ప్రసంగంలో అంశాలను పాలకుల పేర్కొనడం జరుగుతోంది. అయితే, ఈ ప్రసంగాలను గవర్నర్ రవి గత రెండేళ్లు పక్కన పెట్టారు. తొలిసారిగా అయితే, పెద్ద దుమారమే సభలో చోటుచేసుకుంది. గవర్నర్‌కు వ్యతిరేకంగా సభలో డీఎంకే పాలకులు తీర్మానం కూడా ప్రవేశ పెట్టారు.ఈ సందర్భంగా గత ఏడాది ప్రభుత్వ ప్రసంగాన్ని గవర్నర్ పక్కన పడేశారు. తొలి పేజీ, చివరి పేజీని మాత్రం చదివి సభ నుంచి బయటకు వచ్చేయడం మళ్లీ చర్చకు, రచ్చకు దారి తీసింది. తాజాగా మూడో సంవత్సరంగా సభలో అడుగు పెట్టబోతున్న గవర్నర్ ఆర్ఎన్ రవి ఎలా స్పందించనున్నారో అనే చర్చ ఇప్పటికే అందరిలో సాగుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో గవర్నర్ రవిని స్పీకర్ కలవడం, సభకు రావాలని ఆహ్వానించడం గమనార్హం. -
ఆక్రమణల తొలగింపు
తిరువళ్లూరు: తిరుపతి – చైన్నె జాతీయ రహదారిలో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించే విధంగా ఉన్న దుకాణాలు, భవనాలను అధికారులు పోలీసుల భారీ బందోబస్తు నడుమ శుక్రవారం తొలగించారు. అయితే దుకాణాలను తొలగించే సమయంలో వ్యాపారులు జేసీబీని అడ్డుకుని నిరసనకు దిగడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.తిరుపతి–చైన్నె జాతీయ రహదారిలో నిత్యం వాహనాల రాకపోకలు రద్దీగా ఉండడంతో తరచూ ట్రాఫిక్‌కు సమస్యలు ఏర్పడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో జేఎన్ రోడ్డు, సీవీనాయుడు రోడ్డులోని ఆక్రమణలను తొలగించాలని అధికారులు నిర్ణయించారు. గత రెండు రోజుల క్రితం ప్రకటనలు జారీ చేశారు. అక్రమంగా ఏర్పాటు చేసిన దుకాణాలు, భవనాలను ఎవరికి వారే తొలగించుకోవాలని సూచించారు. అయితే వ్యాపారులు పెద్దగా స్పందించకపోవడంతో శుక్రవారం భారీ పోలీసు బందోబస్తు నడుమ తొలగింపు ప్రక్రియ చేపట్టారు. ట్రాఫిక్‌కు ఇబ్బందులు కలిగించేలా ఉన్న పూల దుకాణాలు, టీస్టాల్స్, స్వీట్స్స్టాల్స్తోపాటు ఇతర వాటిని జేసీబీ సాయంతో తొలగించారు. ఈ సమయంలో ఆక్రమణలను వ్యాపారులు అడ్డుకోవడంతో ఇరువర్గాల మద్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం నెలకొంది. కొందరు వ్యాపారులు జేసీబీని అడ్డుకుని నిరసన వ్యక్తం చేశారు. రంగ ప్రవేశం చేసిన పోలీసులు వ్యాపారులను బలవంతంగా పక్కకు తప్పించి ఆక్రమణల తొలగింపు ప్రక్రియను కొనసాగించారు. -
రేయింబవళ్లు శ్రమిద్దాం
సాక్షి, చైన్నె: ఎన్నికలకు 15 నెలలే సమయం ఉంది...రేయింబవళ్లు శ్రమిద్దాం.. విజయ్ను సీఎం చేద్దాం అని పార్టీ నేతలకు తమిళగ వెట్రి కళగం ప్రధాన కార్యదర్శి బుస్సీ ఆనంద్ పిలుపు నిచ్చారు. పార్టీ అధ్యక్షుడు విజయ్ ఆదేశాలతో నియోజకవర్గ నేతలతో తమిళగ వెట్రి కళగం ప్రధాన కార్యదర్శి బుస్సీ ఆనంద్ సమీక్షలపై దృష్టి సారించారు.చైన్నె పనయూరులోని పార్టీ కార్యాలయంలో నియోజకవర్గాల వారీగా నేతలతో సమావేశాల విస్తృతానికి నిర్ణయించారు. ఇందులో భాగంగా ఆదివారం తిరువణ్ణామలై జిల్లా పరిధిలోని చెయ్యారు, ఆరణి, పోలూరు, వందవాసి, కలశసాక్కం, కీల్ పెన్నాత్తూరు అసెంబ్లీ నియోజకవర్గాల నేతలతో సమావేశమయ్యారు. ఆయా నియోజకవర్గాలలో పార్టీ సభ్యత్వం, పార్టీ తరపున చేపట్టాల్సిన కార్యక్రమాల గురించి బుస్సీ ఆనంద్ వివరించారు. నియోజకవర్గాల వారీగా పట్టున్న ప్రాంతాలు, బలం కలిగిన నేతలు,తదితర వివరాలను సేకరించారు.ఈ సందర్భంగా బుస్సీ ఆనంద్ మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికలకు మరో 15 నెలలుమాత్రమే సమయం ఉందని వివరించారు. సమయం చాలా తక్కువగా ఉండటంతో ప్రతి కార్యకర్త,నాయకుడు రేయింబవళ్లు శ్రమించాల్సిన అవసరం ఉందని సూచించారు. అహర్నిషలు శ్రమించడం ద్వారా విజయ్ను సీఎం చేసుకోగలమని ధీమా వ్యక్తం చేశారు. విజయ్ సూచించే అభ్యర్థి గెలుపు కోసం నియోజకవర్గాలలో తీవ్రంగా శ్రమించాలని పిలుపు నిచ్చారు. ఎన్నికలకు సమయం ఆసన్నం అవుతోండడంతో కార్యక్రమాల వేగం మరింత పుంజుకోవాలని, అందర్నీ కలిసేందుకు త్వరలో విజయ్ నియోజకవర్గాలకు వస్తారని పేర్కొన్నారు. -
ఆయనతో నటించడం మంచి అనుభవం
తమిళసినిమా: సంచలన నటీమణుల్లో శ్రుతిహాసన్ ఒకరని కచ్చితంగా చెప్పవచ్చు. చాలా బోల్డ్ నటి ఈమె. నచ్చింది చేయడం, నచ్చకపోతే నో అని నిర్మొహమాటంగా చెప్పే నటి శుృతిహాసన్. ఇలానే ఇటీవల ఒక తెలుగు చిత్రం నుంచి వైదొలగి వార్తల్లోకి ఎక్కారు. పెళ్లి వద్దు, సహజీవనం ముద్దు అని చెప్పే గట్స్ ఉన్న నటి ఈ భామ. అయితే వివాహమనేది పవిత్రమైనదని, పెళ్లి చేసుకోవడానికి తనకలాంటి వ్యక్తి ఇప్పటి వరకు తారసపడలేదని అంటారు. కాగా ప్రస్తుతం రజనీకాంత్ కథానాయకుడిగా లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కూలీ చిత్రంలో శ్రుతి ప్రధాన పాత్రను పోషిస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె తన ఇన్‌స్ట్రాగామ్‌లో చేసిన పోస్ట్‌లో తాను క్రిస్మస్ రోజు కూడా కూలీ చిత్రం షూటింగ్లో పాల్గొన్నానని చెప్పారు. గత ఏడాది కూడా క్రిస్మస్ రోజున క్రాక్ అనే తెలుగు చిత్ర షూటింగ్లో ఉన్నట్లు గుర్తు చేశారు. తనకు లోకేష్‌కనకరాజ్ చిత్రాలంటే చాలా ఇష్టమని ఆయన దర్శకత్వంలో నటించాలని కోరుకుంటున్నానని, అది కూలీతో నెరవేరడం సంతోషంగా ఉందన్నారు. రజనీతో కలిసి నటించడం మంచి అనుభవం అన్నారు. ఆయన నుంచి చాలా నేర్చుకున్నట్లు చెప్పారు. ఇకపోతే ఈ అమ్మడు త్వరలో ధనుష్‌తో జత కట్టడానికి సిద్ధం అవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది. కాగా ఈమె ఇంతకుముందు ప్రభాస్ సరసన సలార్ చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. ఆ చిత్రం మంచి విజయాన్ని సాధించింది కూడా. త్వరలో సలార్ చిత్రానికి సీక్వెల్ తెరకెక్కనుంది. ఇందులోనూ శ్రుతిహాసన్ నటించడానికి సిద్ధం అవుతున్నట్లు సమాచారం. -
25 కేజీల గంజాయి స్వాధీనం
తిరుత్తణి: ఆంధ్రా నుంచి బస్సుల్లో తరలించిన 25 కేజీల గంజాయి స్వాదీనం చేసుకున్న పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు. వివరాలు.. తిరుత్తణి సమీపంలోని పొన్పాడి చెక్‌పోస్టు వద్ద పోలీసులు బుధవారం వాహన తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆంధ్రాలోని తిరుపతి నుంచి చెన్నై, కాంచీపురం, తిరుత్తణి ప్రాంతాలకు పయనించిన బస్సుల్లో తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా బస్సులో వుంచి తరలించిన 25 కేజీల గంజాయిని గుర్తించి సీజ్ చేశారు. విచారణలో కాంచీపురం జిల్లా చిరువానూరుకు చెందిన దినేష్(21), ప్రతాప్‌కుమార్(21), విజయ్(18) ఆంధ్రాలో గంజాలు కొనుగోలు చేసి కాంచీపురం తరలించినట్లు గుర్తించారు. వారిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. అలాగే ప్రభుత్వ బస్సులో తరలించిన 6 కేజీల గుట్కా ప్యాకెట్లు స్వాదీనం చేసుకున్న తిరుత్తణి పోలీసులు చిత్తూరు జిల్లా నగరి సమీపం ఓజుకుప్పానికి చెందిన తరుణ్(18) అనే యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. -
హీరోయిన్లను ఎంపిక చేసేది వీరే..
తమిళసినిమా: సినీరంగంలో కథానాయికలు ఒక స్థాయికి ఎదిగిన తరువాత కచ్చితంగా వారి వాయిస్ రైజ్ అవుతుంది. అలాంటి వారిలో నటి తాప్సీ ఒకరు. తమిళం, తెలుగు, హిందీ భాషల్లో నటి స్తూ అగ్ర కథానాయకి స్థాయికి ఎదిగిన ఈ ఉత్తరాది భామ కోలీవుడ్‌లో ధనుష్ కు జంటగా ఆడుగళం చిత్రంతో ఎంట్రీ ఇచ్చారు. ఇక్కడ తొలి చిత్రమే సూపర్ హిట్ కావడం, నటుడు ధనుష్ కు జాతీయ ఉత్తమ నటుడు అవార్డును తెచ్చి పెడటంతో తాప్సీకి మంచి పేరు తెచ్చిపెట్టింది. అయితే చాలా తక్కువ చిత్రాల్లోనే ఇక్కడ నటించారు. అయితే తెలుగులో చాలా చిత్రాలు చేశారు. ఆ తర్వాత బాలీవుడ్ పై దృష్టి సారించారు. ఇక్కడ ఈమె నటించిన బేబీ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. వరుసగా అవకాశాలు వరించాయి. ఇలా తాప్సీ నటించిన చిత్రాలలో పింక్ ఒకటి. ఆ చిత్రం సూపర్ హిట్ అయింది. హలో బాలీవుడ్ టాప్ స్టార్ షారుక్ ఖాన్ వరకు పలువురు హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగారు. అదేవిధంగా ఉమెన్ సెంట్రిక్ కథా చిత్రాల్లోనూ నటించి తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. కాగా గత మార్చి 24న బాయ్ ఫ్రెండ్ మాథ్యూస్ బో అనే డెన్మార్క్‌కు చెందిన టెన్నిస్ ప్లేయర్ కోచ్‌ను పెళ్లి చేసుకున్నారు. అలాంటి తాప్సీ ఇటీవల ఓ భేటీలో చిత్ర పరిశ్రమలో హీరోయిన్ల పరిస్థితి గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. చిత్రాల్లో హీరోయిన్లు ఎంపిక చేసేది హీరోలే అని పేర్కొన్నారు. అదేవిధంగా హీరోలు తమకంటే తక్కువ స్థాయిలో ఉన్న హీరోయిన్లకే అవకాశా లు ఇస్తారన్నారు. ఇలా తాప్సీ తనకు ఎదురైన అనుభవాలను పేర్కొన్నారు. కాగా కెరీర్ ఆరంభంలో అయితే ఇలాంటివి మాట్లాడేవారా? అంటూ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. -
విజయ్‌పై ఆదిలోనే విమర్శలెందుకు!
తమిళసినిమా: శ్ఙ్రీరాజకీయ రంగ ప్రవేశం చేసిన పురిటీలోనే నటుడు విజయ్‌పై విమర్శల దాడి చేస్తున్నారు. ముందు ఆయన్ని రాజకీయాలు చేయనివ్వండి ఆ తర్వాత విమర్శించండి శ్ఙ్రీఅని దర్శకుడు, సినీ దర్శక సంఘం అధ్యక్షుడు ఆర్వి.ఉదయ్ కుమార్ పేర్కొన్నారు. సిగర్ పిక్చర్స్ పోతాకంపై కమల కుమారి, రాజ్ కుమార్ కలిసి నిర్మించిన చిత్రం ఎక్స్ ట్రీమ్. రాజ వేర్ కష్ణ దర్శకత్వం వహించిన ఇందులో నటి రక్షిత మహాలక్ష్మి, అబి నక్షత్ర, రాజ్ కుమార్,ఆనంద్ నాగ్ ,అమృత షెల్టర్, శివం తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ప్రతాప్ సంగీతాన్ని డీజే బాల ఛాయాగ్రహణం అందించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమం పూర్తిచేసుకుని ఈనెల 20న తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా చిత్ర హిట్టు సోమవారం సాయంత్రం చైన్నెలోని ప్రసాద ల్యాబ్‌లో ఆడియో, ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో సినీ దర్శకుల సంఘం అధ్యక్షుడు ఆర్వీ ఉదయ్ కుమార్, కార్యదర్శి పేరరసు, నటుడు, డిస్ట్రిబ్యూటర్ల సంఘం అధ్యక్షుడు కె. రాజన్ తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొని ఆడియోను ఆవిష్కరించారు. ఇతని నిర్మాత రాజ్‌కుమార్ మాట్లాడుతూ శ్ఙ్రీదర్శకుడు రాజా వేల్ మొదట ఒక కథ చెప్పినప్పుడు దాన్ని షార్ట్ ఫిలింగా రూపొందించాం. అది పలు అంతర్జాతీయ అవార్డులను తెచ్చిపెట్టడంతో పాటు అందులో నటించిన నా నటనకు అభినందనలు లభించాయి. అదే షార్ట్ ఫిలింను తూవల్ పేరుతో చిత్రంగా రూపొందించి ఇటీవల విడుదల చేయగా పలువురి ప్రశంసలు లభించాయి.. ఆ తర్వాత మహిళల దక్షిణ ఇతివృత్తంతో కూడిన ఈ ఎక్స్ట్రీమ్ చిత్రాన్ని నిర్మించాం.. ఇందులోనూ దర్శకుడు నన్ను పోలీసు అధికారిగా నటింపజేశారుశ్రీశ్రీ అని చెప్పారు.. దర్శకుల సంఘం అధ్యక్షుడు ఆర్ వి ఉదయ్ కుమార్ మాట్లాడుతూ భర్త రాజ్‌కుమార్ ఆశకు బలాన్నిస్తూ ఈ చిత్రాన్ని నిర్మించిన కమల కుమారికి అభినందిస్తున్నాను. ఇప్పుడు బయట వారు సినిమా వాళ్లను విమర్శిస్తున్నారు. అయితే బయట ప్రపంచంలో చాలామంది చెడ్డవాళ్ళు ఉన్నారు. సినిమా వాళ్లు రాజకీయాల్లోకి వస్తే తప్పేంటి. నటుడు విజయ్ ఇప్పుడే రాజకీయ రంగ ప్రవేశం చేశారు. ఆయన పై ఆదిలోనే విమర్శల దాడి చేస్తున్నారు. విజయ్ రాజకీయాలు చేసిన తర్వాత విమర్శించండి. సినిమా రంగం నుంచి చాలామంది ముఖ్యమంత్రులు అయ్యారు.. కాబట్టి ఎవరైనా రాజకీయాల్లోకి రావచ్చు.. అని దర్శకుడు ఆర్వీ ఉదయ్ కుమార్ పేర్కొన్నారు. -
కనుల పండువగా మహారథోత్సవం
వేలూరు: తిరువణ్ణామలై అరుణాచలేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు పంచ మూర్తులు పంచ రథోత్సవం కనుల పండువగా సాగింది. ఈ వేడుకలను పెద్ద సంఖ్యలో భక్తులు తిలకించి మొక్కులు చెల్లించుకున్నారు. కార్తీక బ్రహ్మోత్సవాలు ఈనెల 4న ధ్వజారోహనంతో ప్రారంభమయ్యాయి. అప్పటి నుంచి రోజూ ఉదయం, సాయంత్రం వేళల్లో స్వామి వార్లకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేసి పుష్పాలంకరణలు నిర్వహించి ఉత్సవ మూర్తులకు వివిధ వాహన సేవలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఏడవ రోజైన మంగళవారం ఉదయం 3 గంటలకు ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి అన్నామలై సమేత ఉన్నామలై అమ్మవారికి పూజలు చేసి పుష్పాలంకరణలు చేశారు. అనంతరం పంచ మూర్తులైన వినాయకుడు, సుబ్రహ్మణ్య స్వామి, అన్నామలై సమేత ఉన్నామలై అమ్మవారు, పరాశక్తి అమ్మవారు, చండికేశ్వరుడికి మేళ తాళాల నడుమ ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు, దీపారాధన నిర్వహించారు. వినాయకుడిని ఉదయం 6.25 గంటలకు భక్తుల హరోం... హరా... నామస్మరణ మధ్య పుష్పాలంకరణలో రాజగోపురం వద్దనున్న రథంలో ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం రథం అన్నామలైయార్ ఆలయ రాజగోపురం ఎదురుగా నుంచి బయలుదేరింది. ఆ సమయంలో చలిని కూడా భక్తులు లెక్క చేయకుండా అరుణాచలేశ్వరునికి హరోంహరా అంటూ రథం దారాన్ని లాగారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ భాస్కర పాండియన్, ఎస్పీ సుధాకర్, ఆలయ జాయింట్ కమిషనర్ జ్యోతి పాల్గొన్నారు.మాడ వీధుల్లో ఊరేగిన పంచ రథాలు:మాడ వీధుల్లో బయలుదేరిన రథం ఉదయం 9.20 గంటలకు వచ్చి చేరింది. అనంతరం ఉదయం 9.35 గంటలకు సుబ్రహ్మణ్య స్వామిని ఊరేగించారు. మద్యాహ్నం 12.20 గంటలకు మహా రధాన్ని ఊరేగించారు. మధ్యాహ్నం ఒంటి గంటకు మహా రథంలో అన్నామలైయార్ భక్తులకు దర్శనమిచ్చారు. ఈ రథాన్ని ఒక పక్క మహిళా భక్తులు, మరో పక్క పురుషులు రథం దారాలను పట్టి లాగారు. ఈ మహా రథోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అరుణాచలేశ్వరునికి హరోంహర నామస్మరణ చేస్తూ రథాన్ని లాగారు. సాయంత్రం 4 గంటలకు ఉన్నామలై అమ్మవారి రథోత్సవం జరిగింది. ఈ రథాన్ని మహిళా భక్తులు మాత్రమే లాగారు. స్వామి వారి మహారథం, చండికేశ్వరుడి రథం, పంచ రధాలు విడివిడిగా మాడ వీధుల్లో ఊరేగించారు. ఉన్నామలై అమ్మవారి రఽథ తాడును మహిళా భక్తులు మాత్రమే అధికసంఖ్యలో చేరుకొని లాగారు. ఒకే రోజు పంచ రథాలు మాడ వీధుల్లో ఊరేగనున్న నేపథ్యంలో చైన్నె, విల్లుపురం, కాంచీపురంతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు పాల్గొని పంచ మూర్తులను దర్శించుకున్నారు. సంతాన భాగ్యం కలిగిన దంపతులు తమ బిడ్డలకు చెరుకులతో ఉయ్యాల కట్టి అందులో సంతానాన్ని ఉంచి ఆలయ మాడ వీధుల్లో తిరుగుతూ మొక్కులు తీర్చుకున్నారు.5 లక్షల మంది భక్తులు హాజరు..మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగే ఐదు రథోత్సవాల్లో కలుసుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి సుమారు 5 లక్షల మందికి పైగా భక్తులు తిరువణ్ణామలై చేరుకున్నారు. ఫలితంగా మాడ వీధులు కిక్కిరిశాయి. ఈ సందర్బంగా భక్తులు రథాలపై బొరుగులు, మిరియాలు చల్లి మొక్కులు తీర్చుకున్నారు.పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటురథోత్సవంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఆరువేల మందితో పోలీస్ బందోబస్తు నిర్వహించినట్లు ఎస్పీ సుధాకర్ తెలిపారు.పారంపర్య గుర్రపు సంత ప్రారంభంరథోత్సవం రోజు నుంచి నాలుగు రోజుల పాటు జరిగే గుర్రపు సంత మంగళవారం ఉదయం ప్రారంభమైంది. దీపోత్సవాన్ని పురష్కరించుకొని గత వంద సంవత్సరాల నుంచి గుర్రపు సంతను నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. అందులో భాగంగా ఈరోడ్డు, పుదుక్కోటై, తిరుపత్తూరు, ఓసూరు, కర్ణాటక వంటి రాష్ట్రాల నుంచి గుర్రాలను తీసుకొచ్చి విక్రయ సంతలో ఉంచారు. ఈ సంత ఈనెల 13న దీపోత్సవంతో ముగుస్తుంది. ఈ సంవత్సరం గుర్రం, ఎద్దుల సంతకు పన్ను వసూలు చేయకుండా అధికారులు మినహాయింపు ఇచ్చారు.రూ. 70 లక్షలతో మహా రథానికి మరమ్మతు పనులుమహారథం అనే పిలిచే అన్నామలైయార్ రథం పూర్తిగా శిథిలం కావడంతో ఈ సంవత్సరం దేవదాయశాఖ ఆధ్వర్యంలో రూ.70 లక్షల వ్యయంతో రథానికి మరమ్మతులు చేపట్టారు. ఈ పనులు పూర్తి కావడంతో గత నవంబర్ 8వ తేదీన ఆలయ మాడ వీధుల్లో ట్రయిల్ రన్ నిర్వహించారు. అనంతరం రథానికి మెరుగులు దిద్ధి పుష్పాలంకరణలు, విద్యుత్ దీపాలు అమర్చి మంగళవారం మహా రథోత్సవాన్ని నిర్వహించారు. -
‘దళపతి’ అడుగుల ముద్ర పడేనా?
‘సామాజిక స్పృహ టు రాజ్యాధికారం, వయా సినిమా.’ తమిళనాట ఏడున్నర దశాబ్దాలుగా రాజ్యమేలుతున్న రాజకీయ ఫార్ములా! సూపర్‌స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లోకి రావాలని యత్నించి వెనకడుగు వేసిన చోట, సినీ తుఫాన్ విజయ్‌కాంత్ రాజకీయంగా మెరుపు మెరిసి కనుమరుగైన చోట, మరో దిగ్గజ నటుడు కమల్‌హాసన్ పార్టీ పెట్టి ఇప్పటికీ నిలదొక్కుకోలేకపోతున్న చోట... ఇంకో నటుడు ‘దళపతి’ విజయ్ కొత్త పార్టీ పెట్టారు. ‘‘మారా ల్సింది సైన్స్ అండ్ టెక్నాలజీ ఒక్కటేనా? రాజకీయాలు కూడా మారాలి’’ అన్న ఆయన కామెంట్స్ సోషల్ మీడియాలో హోరెత్తాయి. రజనీకాంత్ తర్వాతి తరంలో అత్యధిక అభిమాన గణం ఉన్న నటుడిగా గుర్తింపు పొందిన విజయ్ ఆగమనం తమిళనాడు రాజకీయాల్లో మార్పు తెస్తుందా?తమిళ నటుడు విజయ్ ఈ ఏడాది ఫిబ్రవరిలో ‘తమిళగ వెట్రి కజగం’ (టీవీకే) పేరిట కొత్త పార్టీని ప్రకటించి, అక్టోబరు 27న విక్రవండిలో మొదటి బహిరంగ సభ నిర్వహించారు. ఒక ఎంజీఆర్, ఒక కరుణానిధి, ఓ జయ లలిత... సినీరంగ నేపథ్యంతో రాజకీయాలకు వచ్చి, తమదైన ముద్ర వేయడమే కాకుండా తమిళనాడు సామాజికార్థిక, రాజకీయ స్థితి గతుల్నే మార్చిన చరిత్ర కొనసాగింపే తాజా పరిణామం. తీవ్రమైన భావోద్వేగాలకు నెలవైన తమిళ నేలలో ‘దళపతి’ ప్రభావమెంత? ఇరుగు పొరుగు రాష్ట్రాలతో పోలిస్తే తమిళనాడు రాజకీయాలు భిన్నమైనవి. అసెంబ్లీలో ప్రత్యర్థి సభ్యులు భౌతికదాడికి పాల్పడి అవమానించినపుడు, ‘ఒక్క డీఎంకే సభ్యుడు కూడా లేని సభకే మళ్లీ వస్తా’నని దివంగత ముఖ్యమంత్రి జయలలిత శపథం చేస్తే, అటువంటి సభనే ఏర్పరచిన తమిళ తీర్పు ఒక భావోద్వేగ చరిత్ర! ఆత్మ గౌరవ ఉద్యమాన్ని, జస్టిస్ పార్టీని కలిపి 1944లో రామస్వామి పెరియార్ ‘ద్రావిడర్ కజగం’ (డీకే) ఏర్పాటు చేశారు. అర్ధ శతాబ్ధానికి పైగా తమిళనాడును పాలిస్తున్న ద్రవిడ కజగం పార్టీలన్నీ ఈ డీకే నుంచి పుట్టినవే! పెరియార్‌తో విబేధాలు రావడంతో డీకే నుంచి బయటకొచ్చిన అన్నాదురై... 1949లో ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే) స్థాపించారు. ద్రవిడ సిద్ధాంతాల ప్రకారం బ్రాహ్మణులు,కాంగ్రెస్, బీజేపీ ఉత్తరాది ఆర్యుల పార్టీల పెత్తనం చెల్లదు. అన్నాదురై తర్వాత డీఎంకేలో ఉంటూ ద్రవిడ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన రచయిత కరుణానిధి 1969లో ముఖ్యమంత్రి అయ్యారు. కరుణానిధి తన గురువు అన్నాదురై సిద్ధాంతాలకు విరు ద్ధంగా పని చేస్తున్నారని ఆరోపిస్తూ... నటుడు ఎంజీ రామచంద్రన్ డీఎంకే నుంచి బయటకు వచ్చి 1972లో అన్నా డీఎంకే పార్టీని స్థాపించారు. ఆ రోజుల్లో నటునిగా తిరుగులేని ప్రజాకర్షణ కలిగిన ఎంజీఆర్, 1977లో అన్నాడీఎంకేని గెలిపించి ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తర్వాత ఎంజీఆర్ వారసత్వాన్ని జయలలిత కొనసాగించారు. డీఎంకే, అన్నా డీఎంకేలు కేంద్ర ప్రభుత్వాలకు అవసరమైనపుడు ఆ మేరకు మద్దతునిచ్చినా... తమిళనాడులో ఆ యా జాతీయ పార్టీలు బలపడ కుండా అవి నివారించగలిగాయి. దీంతో 5 దశాబ్దాలుగా అక్కడి రాజకీయాలు డీఎంకే వర్సెస్ అన్నా డీఎంకేగా నడుస్తున్నాయి. ఎంజీఆర్ స్ఫూర్తితో చాలామంది నటులు రాజకీయ ప్రవేశం చేశారు కానీ, ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీఆర్ మినహా ఎవరూ అంతటి విజయం సాధించలేకపోయారు. ఎంజీఆర్ కొత్త పార్టీ పెట్టడానికి ముందు నటించిన సినిమాలను తన రాజకీయ ఆశయాలను ప్రచారం చేయడానికి వాడుకున్నారు. ఇటీవల విజయ్ సినిమాల్లో కూడా ఇదే తంతు కనిపించింది. 2018లో విజయ్ నటించిన సర్కార్ చిత్రంలో... హీరో రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిని చూసి షాక్ తిని, రాజకీయ నాయకుడిగా మారుతాడు. ఈ సినిమాలోనే, ఆ సమయంలో అధి కారంలో ఉన్న అన్నాడీఎంకేను అవమానించేలా కొన్ని సన్నివేశాలు ఉన్నాయనే ఆరోపణలు వచ్చాయి. కానీ, మొదటి బహిరంగ సభలో విజయ్ అన్నాడీఎంకేను ఒక్కమాటా అనలేదు! ఇటీవల విడుదలైన పలు చిత్రాల్లో పరోక్షంగా పంచ్ డైలాగ్స్‌తో డీఎంకేను విమర్శించారు. పెరియార్, అన్నా పేర్లను స్మరిస్తూ ద్రవిడ నమూనా పేరుతో తమిళనాడును ఒక కుటుంబం దోచుకుంటోందని విమర్శిస్తూ, ఆ పార్టీయే మన శత్రువని విజయ్ ప్రకటించారు. హేతువాది పెరియారే తన పార్టీకి విధాన మార్గదర్శి, కానీ పెరియార్ నాస్తిక సిద్ధాంతాన్ని మాత్రమే తాము అంగీకరించమని చెప్పారు. ఈ విషయంలో ‘ఒకటే వంశం – ఒకటే దేవుడు’ అన్న ‘అన్నా’ సూత్రాన్ని పాటిస్తామన్నారు. విధానపరంగా తమ సిద్ధాంతంలో ద్రవిడ, తమిళ జాతీయవాదం మధ్య విభజన లేదని వ్యాఖ్యానిస్తూ, ఆ రెండూ తనకు రెండు కళ్ళు అని చెప్పారు. పరస్పర విరుద్ధాంశాలపై అభిప్రాయానికి పొంతన లేకపోవడంతో విజయ్ సిద్ధాంతాల్లో స్పష్టత కొరవడినట్టు కనిపిస్తోంది. పార్టీల పేర్లను ప్రస్తావించకుండా, మతోన్మాద బీజేపీ తమ సైద్ధాంతిక ప్రత్యర్థిగా చెప్పినప్పటికీ, డీఎంకేకు వ్యతిరేకంగా మాట్లాడి నంతగా బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడకపోవడం పలు ఊహాగానా లకు ఆస్కారం కల్పిస్తోంది. కుల గణన నిర్వహించాలనీ, విద్య ఉద్యో గాల్లో దామాషా ప్రకారం ప్రాతినిధ్యం కల్పించాలనీ చెప్పిన విజయ్, మైనారిటీల గురించి, వారి భద్రత గురించి ఎక్కడా ప్రస్తావించక పోవడమే ఆయనలోని ద్వైదీభావనకు నిదర్శనం! పలు తమిళ ఫ్యాన్ పేజీల్లో ఏపీ ఉపముఖ్యమంత్రి, జనసేనాని పవన్ కల్యాణ్‌తో విజయ్‌కు పోలికలు తేవడం చూడొచ్చు. వీరిరువురు ఒకరి సినిమాలు ఇంకొకరు రీమేకులు చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. రాజకీయంగా కూడా ఇలాంటి రీమేక్ జరుగుతుందనే చర్చను అభిమానులు తెరపైకి తెస్తున్నారు. విజయ్, పవన్ మధ్య సామ్యాలు ఉన్నన్ని వైరుధ్యాలు కూడా ఉన్నాయి. పైగా, తెలుగు, తమిళ రాజకీయాలకు నక్కకు నాకలోకానికి ఉన్నంత తేడా ఉంటుందని గమనించాలి. ఏపీలో జనసేన అధికార భాగస్వామ్య పక్షమైన ప్పటికీ, వాస్తవానికి ఆ పార్టీ ఇప్పటికీ క్షేత్రస్థాయిలో బలపడలేదు. ఎన్నికల ఫలితాల్లో నూరు శాతం సక్సెస్ రేట్ సాధించినప్పటికీ, పకడ్బందీ పార్టీ వ్యవస్థ ఏర్పడలేదు. రాజకీయ సిద్ధాంత విధానా ల్లోనూ స్పష్టత లేదు. విజయ్ టీవీకేకూ ఇదే వర్తిస్తుంది. ఎంజీఆర్ పార్టీ పెట్టడానికీ, ఇతర నటులు పార్టీ పెట్టడానికీ తేడా ఉంది. ఎంజీఆర్ డీఎంకేను విడిచిపెట్టినప్పుడు, ఆయన అప్పటికే పార్టీలో నంబర్ త్రీగా ఉన్నారు. పదేళ్లు శాసనసభ అనుభవం గడించి ఉన్నారు. డీఎంకే కోశాధికారిగా పనిచేశారు. తమిళనాడులో కొత్త పార్టీలు పెట్టడానికి ఎవరో ఒకరి సపోర్ట్ ఉంటుందనే వాదన ఉంది. ఎంజీఆర్ వెనుక ఇందిరాగాంధీ ఉన్నారు. కొంతమేరకు విజయం సాధించగలిగిన నటుడు విజయకాంత్ వెనక పన్రుటి ఎస్. రామచంద్రన్ వంటి అనుభవజ్ఞుడైన రాజకీయ నాయకుడు ఉన్నారు. మరి, విజయ్ వెనుక కూడా ఎవరైనా ఉండొచ్చు అనే అనుమానా లున్నాయి. ‘‘2026 అసెంబ్లీ ఎన్నికల్లో మాకే మెజారిటీ వస్తుందని ఆశిస్తున్నాం. భావసారూప్య పార్టీలతో పొత్తులకు, కూటమి ఏర్పాట్లకూ సిద్ధమే. మాతో పొత్తు పెట్టుకున్న వారినే అధికారంలో భాగస్వాము లను చేస్తాం’’ అని విజయ్ చెప్పారు. కానీ, సోషల్ మీడియాను దాటి క్షేత్రస్థాయి పరిస్థితులను గమనిస్తే మెజారిటీ సులభంగా కనిపించదు. మరోవైపు, అన్నాడీఎంకే ముందు పరోక్షంగా పొత్తు సంకేతాలు ఉంచి నట్లయ్యింది. ఒకవేళ ఆయన అన్నాడీఎంకేతో కలిసి నడిస్తే కూటమిగా విజయం సాధించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. 2021లో అధికార డీఎంకే 37.7 శాతం ఓట్లు సాధించగా, అన్నాడీఎంకే 33.29 శాతం ఓట్లు సాధించింది. విజయ్ పార్టీ వచ్చే రెండేళ్లు క్షేత్రస్థాయిలో ఉంటే 7 శాతం వరకు ఓట్లు సాధించవచ్చు. అంటే, విజయ్ అన్నా డీఎంకేతో కలిస్తే, డీఎంకేకు నష్టం కలుగుతుంది. ఒకవేళ ఒంటరిగా పోటీ చేస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి, డీఎంకేకు లబ్ధి చేకూరుతుంది. అందుకే ఉభయ ద్రవిడ పార్టీలు విజయ్ అడుగులనూ, ఆయనకు లభించే ప్రజాదరణనూ జాగ్రత్తగా గమనిస్తున్నాయి.దిలీప్ రెడ్డి వ్యాసకర్త ‘పీపుల్స్ పల్స్’ రీసెర్చ్ సంస్థ డైరెక్టర్ -
ఆనందోత్సాహాలతో దీపావళి
సాక్షి, చైన్నె: రాష్ట్ర ప్రజలు దీపావళి పండుగను గురు, శుక్రవారాల్లో ఆనందోత్సాహాలతో అత్యంత వేడుకగా జరుపుకున్నారు. పండుగ వేళ వర్షం పడకపోవడంతో బాణసంచా విక్రయాలు జోరుగానే జరిగాయి. వస్త్రాలు, స్వీట్లు, మాంసం, బాణసంచా సహా ఇతర విక్రయాలు రాష్ట్రంలో ఈ ఏడాది రూ.60 వేల కోట్లకు జరిగినట్టు అంచనా వేశారు. ఇందులో బాణసంచా మాత్రం రూ.6 వేల కోట్లకు అమ్మకాలు జరిగాయి. నిబంధనలు ఉల్లంఘించి బాణ సంచాలు అమ్మిన, కాల్చి వారికి కేసులతో పోలీసులు వాతలు పెట్టారు. బాణసంచాల దాటికి 150 ప్రమాదాలు జరగ్గా 544 మంది గాయపడ్డారు. ఒకరు మృతి చెందారు. గత రెండేళ్లలతో పోల్చితే ఈసారి దీపావళిని రాష్ట్ర ప్రజలు అత్యంత వేడుకగా జరుపుకున్నారు. మహాబలిపురంలో విదేశీయులు దీపావళి సంబరాల్లో భాగస్వాములయ్యారు. సినీ సెలబ్రటీలు తమ తమ కుటుంబాలతో పండుగను జరుపుకున్నారు. వడలూరులోని మేట్టుకుప్పంలోని అనాథ ఆశ్రమంలో దక్షిణ భారత చలన చిత్ర సూపర్‌స్టార్ రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య పండుగను జరుపుకున్నారు. వర్షం పడని దృష్ట్యా, ఈ ఏడాది బాణసంచా విక్రయాలు జోరుగానే జరిగాయి. నిబంధనలు ఉల్లంఘించి బాణసంచాలను పేల్చడంతో పోలీసులు కన్నెర్రజేశారు. కోయంబత్తూరు, తేని జిల్లాల్లోని అనేక గ్రామాల ప్రజలు పక్షులకు, గబ్బిలాలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా బాణసంచాలకు దూరంగా పండుగను జరుపుకున్నారు. బాణసంచాల మోతతో చెత్తతో పాటు కాలుష్యం విపరీతంగా పెరిగింది. చైన్నెలో గతంలో ఎన్నడూ లేని విధంగా పెరుంగుడి, ఆలందూరు పరిసరాల్లో గాలిలో కాలుష్యం పెరిగింది. బాణసంచాలతో పేరుకుపోయిన చెత్తను తొలగించేందుకు శుక్రవారం ఉదయాన్నే చైన్నెలో ఐదు వేల మంది సిబ్బంది రంగంలోకి దిగారు. చైన్నెలోని 34 వేల వీధుల్లో 15 వేల టన్నుల చెత్తను తొలగించారు.కేసులతో వాత..ఉదయం 6 నుంచి 7 గంటల వరకు, రాత్రి 7 నుంచి 8 గంటల వరకు బాణసంచాలను పేల్చేందుకు విధించిన సమయాన్ని అనేక చోట్ల ప్రజలు ఖాతరు చేయలేదు. రాత్రి పది గంటల వరకు సైతం గాల్లో రంగురంగుల బాణసంచాలు మార్మోగాయి. చైన్నె నగరంతో పాటు, ఆవడి, తాంబరంలలో గస్తీ పోలీసులు నిబంధనలు ఉల్లంఘించి బాణసంచా పేల్చుతున్న వారిని పసిగట్టి కేసులతో వాతలు పెట్టారు. చైన్నెలో 347 కేసులు, ఆవడిలో 65 కేసులు నమోదు చేసి జరిమానా విధించారు. రాష్ట్రవ్యాప్తంగా వందలాది కేసులు నమోదయ్యాయి. అలాగే, నిబంధనలు ఉల్లంగించి బాణసంచాలను విక్రయించిన దుకాణదారులకు రూ.20 వేల చొప్పున జరిమానా విధించారు.తగ్గిన ప్రమాదాలు..బాణసంచా కారణంగా రాష్ట్రంలో గతంలో కంటే ఈసారి ప్రమాదాలు తగ్గాయి. అగ్నిమాపక శాఖ డైరెక్టర్ అబాస్కుమార్, అదనపు డైరెక్టర్ సత్యనారాయణన్ నేతృత్వంలో దీపావళికి ముందుగానే అవగాహన కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహించారు. పండుగ రోజున ప్రమాదాలు చోటుచేసుకోకుండా ముందుజాగ్రత్తగా అప్రమత్తతతో వ్యవహరించారు. రాష్ట్ర వ్యాప్తంగా 368 బృందాలలో 8 వేల మంది సిబ్బంది సేవలను అందించారు. విరుదునగర్ జిల్లా అల్లంపట్టిలో గురువారం రాత్రి తారాజువ్వ చొచ్చుకు రావడంతో అగ్గి పెట్టెల పరిశ్రమ దగ్ధమైంది.ఎవ్వరికి ఎలాంటి గాయాలు కానప్పటికీ, లక్షలాది రూపాయల నష్టం వాటిల్లింది. ఇక మిగిలినవి చిన్నచిన్న ప్రమాదాలే. అనేకచోట్ల గుడిసెలు, పందిళ్లు దగ్ధమయ్యాయి . చైన్నె ఎర్నావూరులో నాలుగు గుడిసెలు దగ్ధమయ్యాయి. బాణసంచా పేల్చుతూ, తారాజువ్వల దాడిలో రాష్ట్రంలో 150 ప్రమాదాలు జరిగాయి. ఇందులో చైన్నెలో మాత్రం 48 ఉన్నాయి. 544 మంది గాయాలపాలయ్యారు. ఇందులో చైన్నెలో 95 మంది ఉన్నారు. కళ్లకురిచ్చి జిల్లా ఉలందూరుపేట సమీపంలోని ఎర్నావూరుకు చెందిన ముగ్గురు మిత్రులు సమీప గ్రామంలో నాటు బాణసంచాలను కొనుగోలు చేసి మోటారు సైకిల్‌పై తీసుకెళ్తుండగా అవి పేలాయి. ఈ ఘటనలో విన్సంట్(22) మృతిచెందాడు. ప్రేమ్‌కుమార్(24), పౌల్రాజ్(22) తీవ్రగాయాలతో చికిత్స పొందుతున్నారు. పండుగ రోజున చైన్నె ఎన్నూరు సత్యవాణి ముత్తునగర్లో మద్యం మత్తులో మేసీ్త్ర ముత్తువేల్(42) రెండవ అంతస్తు నుంచి పడి మృతిచెందాడు.ప్రత్యేక బస్సులుదీపావళి సంబరాలు ముగియడంతో స్వస్థలాలకు వెళ్లిన జనం ఆదివారం నుంచి తిరుగు పయనం కానున్నారు. వీరి కోసం ఆయా మార్గాలు, ప్రాంతాల నుంచి చైన్నె వైపుఅదనంగా ప్రత్యేక బస్సులను రవాణా సంస్థ రోడ్డెక్కించేందుకు చర్యలు తీసుకుంది. చైన్నె శివారులోని కిలాంబాక్కంకు బస్సులు పరిమితం చేసిన దృష్ట్యా, ఈ ప్రయాణికులు నగరంలోకి వచ్చేందుకు వీలుగా దక్షిణ రైల్వే అదనపు ఎలక్ట్రిక్ రైలు సేవలకు నిర్ణయించింది. తాంబరం– కాటాన్ కొళత్తూరు మధ్య ఉదయం 4 గంటల నుంచి ఎలక్ట్రిక్ రైళ్లను నడిపేందుకు చర్యలు తీసుకుంది.గొడవల్లో..బాణసంచా పేల్చే విషయంగా జరిగిన గొడవల్లో ఇద్దరు మృతిచెందారు. చైన్నె రాయపేట అంబేడ్కర్ నగర్‌కు చెందిన శ్యామ్‌ను బాణసంచా పేల్చే విషయంగా జరిగిన గొడవల్లో మరో ప్రాంత యువకులు దాడి చేయడంతో కింద పడి మృతిచెందాడు. విల్లుపురం జిల్లా విక్రవాండి ఒరత్తూరులోని ఓ ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్న ఉత్తరాది కార్మికులు సుదన్ రిషిదేవ్(31), దిల్కుష్ కుమార్(22)బాణసంచా పేల్చే విషయంగా పొటీలు పడి చివరకు గొడవకు దిగారు. దిల్కుష్కుమార్ బలంగా నెట్టడంతో కింద పడ్డ రిషిదేవ్ మృతిచెందాడు. సేలం జిల్లా ఇరుంబాలై పట్టిలో బాణసంచా పేల్చే గొడవలో ఓ వర్గం ఆ ప్రాంతానికి చెందిన ఫొటోగ్రాఫర్ సతీష్‌కుమార్(38) ఇంటిని ధ్వంసం చేశారు. ఈ ఘటనలో నలుగురు గాయపడ్డారు. ఇక, పండుగ వేళ మద్యం వ్యాపారం జోరుగానే జరిగింది. గురు, శుక్రవారాలలో టాస్మాక్ దుకాణాలు కిక్కిరిశాయి. -
విజయ్ సంకీర్ణం చిచ్చు!
విక్రవాండి మహానాడు వేదికగా తమిళగ వెట్రికళగం అధ్యక్షుడు, సినీ నటుడు విజయ్ చేసిన సంకీర్ణ ప్రభుత్వం, అధికారంలో వాటా ప్రకటన డీఎంకే కూటమిలో కొత్త చర్చకు దారి తీసింది. ఈ కూటమిలోని వీసీకే తమ గళానికి బలం చేకూరినట్టయ్యిందన్న వ్యాఖ్యలు తూటాలను పేల్చింది. అధికారంలో వాటా పై నిర్ణయం తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి శరవణన్ డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌కు లేఖాస్త్రం సందించడం గమనార్హం. అదే సమయంలో డీఎంకే కూటమి బలంగా ఉందని, 200 స్థానాలలో గెలుపు లక్ష్యంగా పనుల వేగం పెంచాలని అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లకు స్టాలిన్ పిలుపు నిచ్చారు.సాక్షి, చైన్నె: విల్లుపురం జిల్లా, విక్రవాండి వీసాలై గ్రామంలో ఆదివారం జరిగిన తమ పార్టీ తొలి మహానాడు బ్రహ్మాండ విజయవంతం కావడంతో తమిళగ వెట్రికళగం వర్గాలు మంచిజోష్ మీదున్నాయి. పది లక్షల మందికి పైగా ఈ మహానాడుకు తరలి వచ్చినట్టు భావిస్తున్నారు. ఇందులో విజయ్ చేసిన వ్యాఖ్యలు తమిళనాట హాట్ టాపీగా మారాయి. ఏ చానళ్లు చూసినా విజయ్ వ్యాఖ్యలపై డిబెట్ల హోరు పెంచాయి. ప్రధానంగా అవినీతి, అక్రమాలంటూ రాష్ట్రంలో డీఎంకేను, మతతత్వ శక్తి పేరిట కేంద్రంలో బీజేపీని విజయ్ టార్గెట్ చేసినా తాము గెలిస్తే.. సంకీర్ణ ప్రభుత్వం.. మిత్రులకు అధికారంలో వాటా అన్న ప్రకటన రాష్ట్రంలో పెను చర్చకు దారితీసింది. ఇన్నాళ్లు రాష్ట్రంలో కూటమిగా ఎన్నికలను ఎదుర్కొన్నా, అధికారం విషయానికి వస్తే డీఎంకే , అన్నాడీఎంకేలు మార్చిమార్చి చేజిక్కించకుంటూ వచ్చాయి. ఆ పార్టీలకు చెందిన వారే మంత్రులుగా రాజ్యమేలుతుండే వారు. కూ టమి పార్టీలు మి త్ర పక్షాలుగా రా జకీయం సాగించాల్సిన పరిస్థితి. ఈ పరిణామాల నేపథ్యంలో తాజాగా విజయ్ కూటమి, వాటా అంటూ సంకీర్ణ ప్రభు త్వం అధికారంలో కి రావాల్సిన అవశ్యం ఉందన్న వ్యాఖ్యలు అందుకోవడంతో డీఎంకే, అన్నాడీఎంకే గొడుగు నీడన చేరే పార్టీలను ఆలోచనలో పడేశాయి. అదే సమయంలో రాష్ట్రంలోని పార్టీలను తన వైపు తిప్పుకునేందుకే విజయ్ ఈ కొత్త ప్రకటన అందుకున్నట్టుగా రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.ఎవరేమంటున్నారంటే?ఇటీవల కాలంగా డీఎంకే కూటమిలోని వీసీకే అధికారంలో వాటా అన్న నినాదాన్ని అందుకున్న విషయం తెలిసిందే. తాజాగా విజయ్ వ్యాఖ్యలను ఆ పార్టీ తీవ్రంగానే పరిశీలిస్తున్నట్టుంది. ఇందుకు అద్దం పట్టే విధంగా ఆ పార్టీ నేత అర్జున్ సోమవారం స్పందించారు. తమ గళానికి బలం చేకూరిందని వ్యాఖ్యలు చేశారు. తమ గళం మున్ముందు మరింతగా జ్వలిస్తుందన్న ధీమా వ్యక్తం చేశారు. అలాగే ఆ పార్టీ ఎంపీ, సీనియర్ నేత రవికుమార్ స్పందిస్తూ అంబేడ్కర్ భగవద్గీత గురించి రాసిన విషయాలను కూడా విజయ్ చదవాలని సూచించడం గమనార్హం. ఇక కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సెల్వ పెరుంతొగై స్పందిస్తూ ప్రస్తుతం కూటమిలో ఎలాంటి మార్పు లేదంటూ వ్యాఖ్యానించారు. అదే సమయంలో ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి శరవణన్ డీఎంకే అధ్యక్షు డు, సీఎం స్టాలి న్కు ఓ లేఖ రాయడం చ ర్చకు దారితీ సింది. ఇప్పు డే అధికారంలో వాటాపై నిర్ణయం తీసుకుని భవిష్యత్తుకు మార్గదర్శకంగా ఉండాలని అందులో సూచించడం గమనార్హం. ఇక కాంగ్రెస్ సీనియర్‌నేత, ఎంపీ మాణిక్యంఠాకూర్ స్పందిస్తూ కూటమి పాలన నినాదం బాగుందంటూ విజయ్పేరు ప్రస్తావన లేకుండా వ్యాఖ్యలు చేశారు.డీసెంట్ పెర్ఫామెన్స్అన్నాడీఎంకే దివంగత నేత ఎంజీఆర్ పేరు మహానాడులో ప్రస్తావించిన విజయ్, ఆ పార్టీని టార్గెట్ చేయకపోవడం మరో చర్చకు దారితీసింది. అస్సలు అన్నాడీఎంకేను ఆయన లెక్కలోకి తీసుకోలేదన్న చర్చ ఊపందుకుంది. ఈ విషయంగా అన్నాడీఎంకే అధికార ప్రతినిధి కోవై సత్యన్ స్పందిస్తూ, విజయ్ సిద్ధాంతాలలో ప్రత్యేకత ఏమీ లేదన్నారు. డీసెంట్ పర్ఫామెన్స్ ఇచ్చారని, అన్ని పార్టీల సిద్ధాంతాలలో తలా ఓ ముక్క తీసుకుని కాక్ టైల్ ఐడియాలజీని ఉపయోగించారని ఎద్దేవా చేశారు. నోటి మాట, రాతపూర్వకంగా అమలయ్యేనా అన్నది కాలం సమాధానం చెబుతుందన్నారు. మరో నేత ఆర్బీ ఉదయకుమార్ స్పందిస్తూ, ద్రావిడ మోడల్‌కు వ్యతిరేకంగా ఆయన గళం వినిపించి ఉన్నారని, ఇదే కాద తాము కూడా ఆది నుంచి చేస్తూ వస్తున్నదని వ్యాఖ్యలు చేశారు.బీ, సీ టీంవిజయ్ తమను టార్గెట్ చేయడంపై డీఎంకే నేతలు తీవ్రంగానే స్పందించారు. స్పీకర్ అప్పావు మాట్లాడుతూ, రజనీకాంత్ రాజకీయాలలో యూ టర్న్ తీసుకోవడంతో విజయ్ను బీజేపీ తెర మీదకు తెచ్చినట్టుందని ఆరోపించారు. ఇది బీజేబీ బీటీం అన్నది స్పష్టమవుతోందన్నారు. మంత్రి రఘుపతి స్పందిస్తూ, పార్టీలు ఎవరైనా పెట్టుకోవచ్చు అని, ఇప్పటికే అనేక మంది నాయకులు ఉదాహరణకు శరత్‌కుమార్, కమల్, కరుణాస్.. ఇలా చెప్పకుంటూ పోతే ఎందరో పార్టీని పెట్టారని వివరించారు. అయితే, డీఎంకే నీడను కూడా ఎవ్వరూ తాకలేక పోయారని హితవు పలికారు. మరో మంత్రి శేఖర్‌బాబు స్పందిస్తూ, డీఎంకే అనే మహాశక్తిని కొత్తగా ఏ శక్తీ నిలువరించ లేదన్నారు. ఎంపీ తమిళచ్చి తంగ పాండియన్ పేర్కొంటూ డీఎంకేను నిర్వీర్యంచేయాడం లేదా ఉదయ సూర్యడ్ని తాకేందుకు ఎవ్వరూ సాహసం చేయలేరని, చేయబోరని హితవు పలికారు. ఈ చర్చల నేపథ్యంలో డీఎంకే అధ్యక్షుడు, సీఎం స్టాలిన్ పార్టీ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లతో సమావేశం ఏర్పాటు చేయడం గమనార్హం.బలంగానే కూటమిపార్టీ కార్యాలయంలో స్టాలిన్ అధ్యక్షతన అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు, పర్యవేక్షకుల సమావేశం జరిగింది. ఇందులో స్టాలిన్ మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికలలో వందకు వంద గెలిచామన్న విషయాన్ని గుర్తుచేస్తూ, ఇక అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధం కావాలని పిలుపు నిచ్చారు. ఇందులోనే గెలుపు మనదేనని ధీమా వ్యక్తం చేశారు. 200 స్థానాలలో గెలుపు లక్ష్యంగా ఇప్పటి నుంచి కార్యక్రమాలు విస్తృతం చేయాలని ఆదేశించారు. దేశంలో ఈ పార్టీ ప్రభుత్వం అమలు చేయని పథకాలను రాష్ట్రంలో విజయవంతంగా ప్రజలకు దరి చేర్చామని వివరించారు. పథకాల గురించి ప్రజలకు విస్తృతంగా ప్రచారం చేయాలని, ప్రజలతో మమేకం అయ్యే విధంగా కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. ఎన్నికల పనులు వేగవంతంచేయాలని, గెలుపే లక్ష్యంగా ముందుకెళ్లాలని ఆదేశించడం గమనార్హం.ఎవరికి నష్టంవిజయ్ ప్రకటన నేపథ్యంలో నష్టం తీవ్రత రాష్ట్రంలో ఎవరికి ఎక్కువగా ఉండబోతున్నదో అన్న చర్చ ఊపందుకుంది. ఇందులో డీఎంకే, అన్నాడీఎంకే, బీజేపీలతో పాటుగా వామపక్షాలు, కాంగ్రెస్ ఓటు బ్యాంక్‌లు చీలుతాయన్న ప్రచారం ఊపందుకుంది. దివంగత నేతల ఎంజీఆర్, జయలలితల తరహా రాజకీయాన్ని విజయ్ సాగించబోతున్నట్టుగా, అధికారంలో వాటా అన్న నినాదంతో రాష్ట్రంలో 2026లో బలమైన కూటమి ఏర్పాటు చేసి తీరుతారన్న ధీమాను రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నాయి. ఇన్నాళ్లు, డీఎంకే, అన్నాడీఎంకేల గొడుగు నీడన చేరి ఎన్నికలను ఎదుర్కొనే అనేక పార్టీలు అధికార బలం కోసం విజయ్ వైపుగా దృష్టి పెట్టేందుకు ఆస్కారం ఉందని వ్యాఖ్యలు చేస్తున్నారు. బలమైన కూటమి ఏర్పాటులో సఫలీకృతులైన పక్షంలో తొలి నష్టం డీఎంకేకు, ఆ తదుపరి అన్నాడీఎంకేకు తప్పదని పేర్కొంటుండడం గమనార్హం. -
జయంరవి చిత్రం షురూ!
తమిళసినిమా: నటుడు జయంరవి చేతి నిండా చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఈయన కథానాయకుడిగా నటించిన బ్రదర్ చిత్రం దీపావళి రేస్‌లో నిలవనుంది. అలాగే జీనీ, కాదలిక్క నేరమిల్లై చిత్రాలు నిర్మాణంలో ఉన్నాయి. ఇవి కాకుండా మరికొన్ని చిత్రాలకు కమిట్ అయ్యారు. అలా జయంరవి తాజాగా కమిట్ అయిన చిత్రానికి డాడా చిత్రం ఫేమ్ గణేశ్‌బాబు దర్శకత్వం వహించనున్నారు. దీన్ని సుందర్ ఆరుముగన్ సమర్పణలో స్క్రీన్ సీన్ మీడియా ఎంటర్టెయిన్మెంట్ ప్రైవేట్ సంస్థ నిర్మించనుంది. దీనికి సంబంధించిన అధికార పోస్టర్‌ను చిత్ర వర్గాలు విడుదల చేశారు. ఈ పోస్టర్ చాలా వైవిధ్యభరితంగా ఉండి చిత్రంపై ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇది జయంరవి నటిస్తున్న 34వ చిత్రం కావడం గమనార్హం. దీనికి హరీష్ జయరాజ్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇందులో ప్రదీప్ ఆంటోని ముఖ్యపాత్రను పోషించనున్నారని సమాచారం. త్వరలోనే సెట్‌పైకి వెళ్లనున్న ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన ప్రకటనను వెలువడించనున్నట్లు నిర్మాతల వర్గం పేర్కొన్నారు. జయంరవి వ్యక్తిగతంగా సమస్యలను ఎదుర్కొంటున్నా, వృత్తిపై దాని ప్రభావం పడకుండా జాగ్రత్త పడుతున్నారనే చెప్పాలి. -
దీపావళికి 14 వేల ప్రత్యేక బస్సులు
సాక్షి, చైన్నె: దీపావళి సందర్భంగా ప్రత్యేక బస్సులను రోడ్డెక్కించేందుకు రవాణా సంస్థ సిద్ధమైంది. 14 వేల బస్సులను ప్రయాణికుల కోసం రోడ్డెక్కించేందుకు నిర్ణయించారు. చైన్నెలో 3 చోట్ల నుంచి వివిధ మార్గాలలో ప్రయాణించే బస్సుల వివరాలను రవాణా మంత్రి శివశంకర్ సోమవారం ప్రకటించారు. వివరాలు.. దీపావళికి పది రోజులే సమయం ఉంది. ఇంటిళ్లి పాది స్వస్థలాలలకు వెళ్లి పండుగను జరుపుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఈ సారి పండుగకకు ఏకంగా నాలుగురోజులు సెలవు రావడంతో వివిధ ప్రాంతాలలో ఉన్నవాళ్లంతా స్వస్థలాలకు వెళ్లేందుకు ప్రయాణ ఏర్పాట్లపై దృష్టి పెట్టారు. వీరికోసం రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రత్యేక బస్సులను నడిపేందుకు చర్యలు తీసుకుంది. బస్సుల రూట్లు, బస్సుల సంఖ్య తదితర అంశాల గురించి రవాణా అదనపు ముఖ్యకార్యదర్శి కె. ఫణీంద్రరెడ్డి , ఇతర పోలీసుల అధికారులతో జరిపిన సమావేశానంతరం ప్రత్యేక బస్సుల వివరాలను మంత్రి శివశంకర్ ప్రకటించారు.ప్రత్యేక బస్సులు..చైన్నెలో ఈనెల 28, 29, 30 తేదీలలో సాధారణంగా నడిచే బస్సులతో పాటు ప్రత్యేక బస్సులను నడపున్నారు. తొలిరోజున 2,092 బస్సులు, తదుపరి రెండురోజులు 4,900 చొప్పున ప్రత్యేక బస్సులను రోడ్డెక్కించేందుకు నిర్ణయించారు. ఇతర నగరాలు, పట్టణాల మధ్య ప్రత్యేక బస్సులతో కలుపుకుని మొత్తంగా మొత్తం 14,086 బస్సులు నడపనున్నారు. దీపావళి పండుగ తర్వాత ఇతర నగరాల నుంచి చైన్నెకి వచ్చే వారికోసం 2వ తేదీన 2,092 బస్సులు, మూడు, నాలుగు తేదీలలో 3,165 చొప్పున బస్సులను నడిపేందుకు నిర్ణయించారు. తిరుగు పయనం అయ్యే వారి కోసం 12,606 బస్సులు రోడ్డెక్కిస్తున్నామని మంత్రి వివరించారు. చైన్నె శివారులోని కిలాంబాక్కం కలైజ్ఞర్ కరుణానిధి శత జయంతిస్మారక బస్టాండ్ నుంచి పుదుచ్చేరి, కడలూరు, చిదంబరం, తిరుచ్చి, మధురై, తూత్తుకుడి,సెంగోట్టై, తిరునెల్వేలి, సేలం, కోయంబత్తూర్, వందవాసి, పోలూర్, తిరువణ్ణామలై, కుంభకోణం, తంజావూరు వైపుగా వెళ్లే బస్సులను నడపనున్నారు. పురట్చి తలైవర్ డాక్టర్ ఎంజీఆర్కోయంబేడు బస్ టెర్మినల్ నుంచి ఈసీఆర్ మార్గం, కాంచీపురం, వేలూరు, బెంగళూరు, తిరుత్తణి మార్గాలలో నడిచే బస్సులు అందుబాటులో ఉంటాయి. అలాగే మాధవరం సబర్బన్ టెర్మినల్ నుంచి పొన్నేరి వైపుగా ఆంధ్ర ప్రదేశ్ మార్గంలో, అలాగే వయా ఊత్తుకోట్టై మార్గంలో నడిచే బస్సులతోపాటు తిరుచ్చి, సేలం, కుంభకోణం మార్గాలలో నడిచే బస్సులు రోడ్డెక్కించనున్నారు.ఫిర్యాదులు..ట్రాఫిక్ రద్దీని క్రమబద్ధీకరించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి శివశంకర్ వివరించారు. కార్లు, ఇతర వాహనాలు ప్రయా ణించే వారిని దృష్టిలో ఉంచుకుని తాంబరం, పెరుంగళత్తూరు, తిరుపోరూర్, చెంగల్పట్టు మీదుగా వెళ్లే వారున అవుటర్ రింగ్‌రోడ్డును ఉపయోగించే విధంగా చూస్తామన్నారు. ప్రత్యే క బస్సుల రిజర్వేషన్లు ఉదయం 7 నుంచి రాత్రి 9 గంటల వరకు చేసుకోవచ్చని సూచించారు. ప్రయాణికుల సౌకర్యార్థం ప్రత్యేక కంట్రోల్ రూంలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఫిర్యాదుల కోసం 94450 14436 నెంబర్‌ను ఈసందర్భంగా ప్రకటించారు. ప్రైవేటు ఆమ్నీ బస్సులు అధిక చార్జీల వసూళ్లకు పాల్పడిన పక్షంలో 1800 425 6151 (టోల్ ఫ్రీ నంబర్), 044– 24749002, 044–26280445, 044–2628 1611 నంబర్లను సంప్రదించాలని వివరించారు. అన్ని బస్టాండ్లలో మే ఐ హెల్ప్ యూ కేంద్రాలు 24 గంటలూ పనిచేస్తాయన్నారు. కోయంబేడు నుంచి కిలాంబాక్కం, మాధవరం బస్టాండ్లకు 24 గంటల పాటు ఎంటీసీ బస్సులపై తేదీలలో సేవలను అంది స్తాయన్నారు. ఈ సందర్భంగా చైన్నె ఎంటీసీలో పనిచేసి విధుల సమయంలో మరణించిన ఉద్యోగుల వారసులు నలుగురికి కారుణ్య నియామకాల కింద ఉద్యోగ నియామక ఉత్తర్వులను మంత్రి శివశంకర్ అందజేశారు. -
శ్రీరస్తు.. శుభమస్తు
హిందూ దేవదాయ శాఖ నేతృత్వంలో రాష్ట్రంలో సామూహిక వివాహ మహోత్సవం సోమవారం కనుల పండువగా సాగింది. 379 జంటలకు ఆలయాలలో వివాహాలు జరిపించారు. అన్ని రకాల వస్తువులతో సారెను అందజేశారు. చైన్నెలో సీఎం ఎంకే స్టాలిన్ సమక్షంలో 31 జంటలు ఏకమయ్యాయి. పుట్టబోయే పిల్లలకు అందమైన తమిళ పేర్లు పెట్టాలని ఈసందర్భంగా స్టాలిన్ వధూవరులకు విజ్ఞప్తి చేశారు.సాక్షి, చైన్నె: డీఎంకే అధికారంలోకి వచ్చినానంతరం హిందూ దేవదాయ శాఖ ద్వారా ఆలయాల అభివృద్ధికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఆలయాల జీర్ణోద్ధరణ, పునరుద్ధరణ పనులు, భక్తులకు కావాల్సిన సౌకర్యాల కల్పన, ఆలయ ఆస్తులను ఆక్రమణ దారుల నుంచి స్వాధీనం చేసుకోవడం, విద్యా కార్యక్రమాలు, పండుగుల సమయంలో ఆధ్యాత్మిక పర్యటనలు అంటూ అనేక కార్యక్రమాలను నిర్వహిస్తూ వస్తోంది. ఇదే సమయంలో ఆర్థికంగా వెనుకబడిన జంటలకు వివాహాలను జరిపించే విధంగా ముందుకెళ్తోంది. ఆ దిశగా 2022–2023 సంవత్సరం 500 జంటలకు, 2023–2024 సంవత్సరం 600 జంటలకు వివాహం జరిపించారు. ఒక్కో జంటకు నాలుగు గ్రాముల బంగారం తాళిబొట్టు,రూ. 50 వేలు విలువగల గృహోపకరణ వస్తువులు, ఇతర అన్నిరకాల వస్తువులను పంపిణీ చేశారు. 2024–25లో 700 జంటలకు వివాహం జరిపించేందుకు చర్యలు తీసుకున్నారు. ఇందులో 379 జంటలకు సోమవారం రాష్ట్రంలో సామూహిక వివాహాలు జరిగాయి. వీరికి నాలుగు గ్రాముల బంగారం తాళితోపాటు రూ. 60 వేల విలువైన వివిధ రకాల వస్తువులను సారెగా అందజేశారు. మంచం, బీరువా, పరుపు, దిండ్లు, వంట గ్యాస్ స్టవ్, వెట్ గ్రైండర్, మిక్సర్,కుక్కర్, వంటపాత్రలు తదితర వాటిని సారెగా అందజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు శేఖర్ బాబు, పొన్ముడి, ఎం.సుబ్రమణియన్, శ్రీపెరంబదూరు ఉలగార్య రామానుజ ఎంబార్ జీయర్‌స్వామి, తొండై మండలం ఆధీనం చిదంబరనాథ జ్ఞాన ప్రకాశ దేశిక పరమాచార్య స్వామి, ఎంపీ తమిళచ్చి తంగ పాండియన్, మేయర్ ఆర్. ప్రియ, ఎమ్మెల్యేలు తాయగం కవి, అసన్ మౌలానా, జగన్, జోసెఫ్ శామ్యూల్, అరవింద్ రమేష్, ప్రభాకర్ రాజ, దేవాదాయ శాఖ కార్యదర్శి చంద్రమోహన్, కమిషనర్ శ్రీధర్, అదనపు కమిషనర్ సుకుమార్ పాల్గొన్నారు.అందమైన తమిళ పేర్లు పెట్టండి..చైన్నెలో తిరువాన్మీయూరు మరుదీశ్వరర్ ఆలయంలో వివాహ వేడుక కోలాహలంగా సాగింది. ఇక్కడ సీఎం ఎంకే స్టాలిన్ సమక్షంలో 31 జంటలకు వివాహాలు జరిగాయి. అనంతరం ఆయా జిల్లాలో ఎంపిక చేసిన ప్రధాన ఆలయాలలో మిగిలిన జంటలకు వివాహాలు జరిగాయి. నవ వధువరులకు తాళిబొట్టును సీఎం అందజేశారు. వివాహ అనంతరం వారికి అన్నిరకాల వస్తువులతో సారెను అందజేశారు. నవ దంపతులను సీఎం ఆశీర్వదించిన అనంతరం ప్రసంగిస్తూ తాను సీఎంగా బాధ్యతలు చేపట్టగానే అత్యధికంగా హిందూ మత ధర్మాదాయ శాఖ కార్యక్రమాలలో పాల్గొన్నట్లు వివరించారు. ఇందుకు కారణం ఆ శాఖ మంత్రిగా ఉన్న శేఖర్ బాబు అని, ప్రతి కార్యక్రమానికి హాజరు కావాల్సిందేనని , కనీసం వీడియో కాన్ఫరెన్స్ ద్వారానైనా హాజరు కావాలని పట్టుబట్టే వారు అని గుర్తు చేశారు. ఈ మేరకు ఆయన ఈ శాఖ ద్వారా ప్రజలకు మరింత దగ్గరయ్యారని పేర్కొన్నారు. ధార్మిక రంగంలోనే కాదు, అన్నిరంగాలకు రాష్ట్రంలో తగిన ప్రాధాన్యతను ఇస్తున్నామని వివరించారు. మూడేళ్లలో ఈ శాఖ తరపున వివిధ కార్యక్రమాలు విజయవంతం అయ్యాయని తెలిపారు. 2,226 ఆలయాలకు కుంభాభిషేకం, 10,238 దేవాలయాల్లో పునరుద్ధరణ పనులు జరిగినట్లు పేర్కొన్నారు. దాతల నుంచి విరాళంగా సేకరించిన రూ. 1,103 కోట్లతో 9,163 పనులు జరుగుతున్నాయని తెలిపారు. ఈ మూడేళ్ల కాలంలో 6,792 కోట్లు విలువైన భూములను స్వాధీనం చేసుకున్నామని వివరించారు. రామేశ్వరం, కాశీ ఆధ్యాత్మిక యాత్రలు, వృద్ధులకు ఆధ్యాత్మిక క్షేత్రాల సందర్శన ఏర్పాట్లు విస్తృతంగా చేస్తున్నామని పేర్కొన్నారు. బంగారం పెట్టుబడి పథకం, దేవాలయాలలో తమిళంలో అర్చనలు వంటి అంశాలను ఈసందర్భంగా గుర్తుచేశారు. అన్ని మతాలను, అందరినీ సమానంగా గౌరవించే విధంగా వారి హక్కులను పరిరక్షించే రీతిలో ప్రభుత్వం ముందుకెళ్తోందన్నారు. ఇదే ద్రవిడ మోడల్ పాలన అని సగర్వంగా చెప్పుకుంటున్నామని, అయితే ఆలయాలు, భక్తిని అడ్డం పెట్టుకుని రాజకీయం చేయడానికి అస్త్రాలు వెతుకుంటున్న వాళ్లు కూడా ఈరాష్ట్రంలో ఉన్నారని మండిపడ్డారు. ఇక్కడ ఏకమైన కొత్త జంటలకు తాను విజ్ఞప్తి చేస్తున్నానని, సకల సౌభ్యాగాలతో జీవితం ఆనందమయం చేసుకోవడమేకాకుండా పుట్టే పిల్లలకు అందమైన తమిళ పేర్లు పెట్టేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. -
విల్లుపురంలో మెడికల్ పార్క్
సాక్షి, చైన్నె: విల్లుపురంలో మెడికల్ పార్క్ ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రూ. 155 కోట్లతో 111 ఎకరాలలో పనులు చేపట్టనున్నారు. రాష్ట్రం పారిశ్రామిక ప్రగతి దిశగా దూసుకెళ్తోంది. దేశంలోనే అత్యుత్తమ రాష్ట్రంగా పారిశ్రామిక రంగంలో తమిళనాడును నిలబెట్టడమే లక్ష్యంగా ప్రభుత్వం విస్తృత కార్యాచరణతో ముందుకెళ్తోంది. ఐటీ, మోటారు వాహనాలు, ఎలక్ట్రానిక్ వాహనాలు, వివిధ విడి భాగాలు, జౌళి, తోలు ఉత్పత్తులు, ఆర్మీకి ఉపయోగ పడే వివిధ రకాల ఉత్పత్తులు అంటూ పారిశ్రామికంగా తమిళనాడు 2030 నాటికి ఉన్నత స్థానంలో నిలబెట్టేందుకు ప్రభుత్వం పరుగులు తీస్తోంది. ఇందులో భాగంగా వెనుకబడిన ప్రాంతాలు, జిల్లా కేంద్రాలలో పారిశ్రామిక వాడల ఏర్పాటు విస్తృతమయ్యాయి. అలాగే నగరాలలోౖ టైడల్ పార్కుల ఏర్పాటు వేగం పెరిగింది.ఈ పరిస్థితుల్లో ఇటీవల విల్లుపురం జిల్లా వానూరులో టైడల్ పార్కు ఏర్పాటు చేశారు. దీనికి కొనసాగింపుగా విల్లుపురం జిల్లా మైలం నియోజకవర్గం పరిధిలోని మేల కుప్పం సిప్కాట్లో 111 ఎకరాలలో రూ. 155 కోట్లతో మెడికల్ పార్కు ఏర్పాటుకు సిద్ధమయ్యారు. ఇక్కడ అత్యాధునిక వసతుల కల్పనతో, వివిధ రకాల మందుల తయారీ, వైద్య సంబంధిత పరిశ్రమలను ఆహ్వానించి ఇక్కడ ఉత్పత్తి ప్రక్రియ చేపట్టేదిశగా మెడికల్ పార్కు పనుల మీద దృష్టి కేంద్రీకరించారు. ఈ పనుల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ. 51 కోట్లు, కేంద్రం వాటగా రూ. 20 కోట్లతో ప్రాథమిక పనులు చేపట్టేందుకు సిద్ధమయ్యారు. ఈ మెడికల్ పార్కు ఏర్పాటుతో వెనుకబడిన ప్రాంతాలుగా ఉన్న విల్లుపురం, కళ్లకురిచ్చి జిల్లాలు అభివృద్ధి పధంలో ముందుకు సాగేందుకు వీలుందని అధికారులు పేర్కొంటున్నారు. ఈ మెడికల్ పార్కు ద్వారా ప్రత్యక్షంగా 6 వేల మందికి, పరోక్షంగా 10 వేల మందికి ఉద్యోగ అవకాశాలు దక్కుతాయని అధికారులు పేర్కొనడం విశేషం. -
ఓం కాళీ.. జై కాళీ
సాక్షి, చైన్నె: రాష్ట్ర ప్రజలు శుక్రవారం ఆయుధ పూజ పండుగను జరుపుకున్నారు. ఇక శనివారం విజయ దశమి సందర్భంగా ఇళ్లల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. విజయ దశమిని పురస్కరించుకుని రాష్ట్రంలోని అమ్మవారి ఆలయాలో భక్తిభావం మిన్నంటింది. ఉదయం నుంచి ఆలయాలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు, ఉత్సవ వేడుకలు జరిగాయి. ఇందులో భాగంగా కుల శేఖర పట్నంలో ఆధ్యాత్మిక వాతావరణం నడుమ మహిషాసుర సంహారం సాగింది.రాత్రంతా పూజలు..కర్ణాటక రాష్ట్రం మైసూర్ తర్వాత దసరా ఉత్సవాలకు రాష్ట్రంలోని కులశేఖర పట్నం ప్రసిద్ధి చెందిన విష యం తెలిసిందే. తూత్తుకుడి జిల్లాలోని ఈ కులశేఖర పట్నంలో ముత్తారమ్మన్ దేవిగా కాళీ మాత కొలువై ఉన్నారు. ఆలయంలో వారం రోజులుగా దసరా వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతూ వచ్చాయి. రో జూ రాత్రి వేళ అమ్మవారు వివిధ రూపాలలో భక్తులకు దర్శనం ఇస్తూ వచ్చారు. ఉత్సవాలో ముఖ్య ఘట్టం శనివారం సాగింది. ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు ఆలయంలో అమ్మవారికి పలుమార్లు అభిషేకాలు జరిగాయి. వేలాదిగా భక్తులు కాళీమాత, శివుడు, సుబ్రహ్మణ్య స్వామి, హనుమంతుడు తదితర దేవతలు, దేవళ్ల వేషాలలో తరలి వచ్చి మొక్కులు తీర్చుకున్నారు. ఉత్సవాలు మొదలైన రోజు నుంచి ఊరూరా తిరిగి తాము సేకరించిన విరాళాల్ని ఆలయంలో కానుకలుగా సమర్పించారు. వివిధ వేషాలలో వచ్చిన భక్తులు చేతిలో మట్టి పాత్రలను పెట్టుకుని అందులో కర్పూరాన్ని వెలిగించి ఊరేగింపుగా ఆలయాల వద్దకు చేరుకుని మొక్కులు తీర్చుకున్నారు.అద్వితీయంగా సూరసంహారం..అర్ధరాత్రి 11 గంటల సమయంలో అమ్మవారికి ప్రత్యేక అలంకారం, విశేష పూజలు చేశారు. 12 గంటల సమయంలో అమ్మవారు సింహవానాన్ని అధిరోహించి సముద్ర తీరం వైపుగా కదిలారు. ఈ సమయంలో భక్తులు ఓం కాళీ..జై కాళీ అన్న నామస్మరనను మార్మోగించారు. సాగర తీరంలోని చిదంబరేశ్వరర్ ఆలయం వద్దకు చేరుకున్నారు. ఇక్కడ అర్ధరాత్రి వేళ మహిషాసూర సంహారఘట్టం అత్యంత వేడుకగా అద్వితీయంగా జరిగింది. ఇసుక వేస్తే రాలనంతగా లక్షల్లో తరలి వచ్చిన భక్తుల జయజయ ధ్వానాల నడుమ సూర సంహార ఘట్టం జరిగింది. ఇక్కడి నుంచి అమ్మవారు చిదంబరేశ్వర్ ఆలయంలోకి చేరుకున్నారు. ఇక్కడ ఆదివారం వేకువ జామున అమ్మవారికి గంధం వంటి సుగంద ద్రవ్యాలతో అభిషేకం సాగింది. ఆరు గంటల వరకు అమ్మవారికి పలు విడతలుగా అభిషేకాలు, ఆరాదనలు జరిగాయి. మధ్యాహ్నం వరకు భక్తులకు అమ్మవారు ఇక్కడే దర్శనం ఇచ్చారు. సాయంత్రం 4.30 గంటలకు అమ్మవారు మళ్లీ ఆలయానికి బయలుదేరి వెళ్లారు. రాత్రంతా సూర సంహార ఘట్టం అద్వితీయంగా సాగింది. తిరునల్వేలి,తూత్తుకుడి, రామనాథపురం జిల్లాల పోలీసులు బందోబస్తు చేపట్టారు. మొత్తం 7 లక్షల మందికి పైగా భక్తులు తరలి వచ్చినట్లు అధికారులు అంచనా. -
మురసోలి సెల్వం కన్నుమూత
సాక్షి, చైన్నె: దివంగత డీఎంకే అధినేత కరుణానిధి అల్లుడు, సీఎం స్టాలిన్ సోదరి సెల్వి భర్త మురసోలి సెల్వం (85) గుండెపోటుతో గురువారం కన్నుమూశారు. బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో మృతి చెందిన ఆయన భౌతిక కాయాన్ని ప్రత్యేక అంబులెన్స్‌లో చైన్నెకు సాయంత్రం ఆరు గంటలకు తీసుకొచ్చారు. గోపాలపురంలోని నివాసంలో ఆప్తులు సందర్శనార్థం ఉంచారు. మురసోలి సెల్వం మరణ సమాచారం హృదయంలో పిడుగు తాకినట్టు అయిందని, తాను తల వాల్చేందుకు ఉన్న ఒక్క భుజం కూడా కనుమరుగైందని సీఎం స్టాలిన్ ఉద్వేగానికి లోనయ్యారు. వివరాలు.. డీఎంకే దివంగత అధినేత కరుణానిధికి అప్పట్లో వెన్నుదన్నుగా ఉన్న వారిలో మేనళ్లులు మురసోలి మారన్. మురసోలి సెల్వం ముఖ్యులు. మురసోలి మారన్‌ను రాజకీయంగా పైకి తీసుకొచ్చి కేంద్ర మంత్రిగా జాతీయ స్థాయిలో చక్రం తిప్పే స్థాయికి కరుణానిధి తీసుకొచ్చారు. మురసోలి సెల్వంకు తన కుమార్తె సెల్విని ఇచ్చి వివాహం చేసి ముద్దుల అల్లుడిగా వెన్నంటే ఉంచుకున్నారు. కరుణానిధి మెచ్చిన డీఎంకే పత్రిక మురసోలికి ఐదు దశాబ్దాల కాలం సిలంది పేరిట సంపాదకీయాలతో మురసోలి సెల్వం సంపాదకులుగా పనిచేశారు. డీఎంకేలోనూ కీలకంగా అప్పట్లో వ్యవహరించిన మురసోలి సెల్వం అంటే సీఎం స్టాలిన్‌కు ఎనలేని అభిమానం. తండ్రి కరుణానిధి తర్వాత తనకు బావే అంతా అన్నట్టుగా మెలిగారు. వయోభారం, అనారోగ్య సమస్యలతో బాధ పడుతూ వచ్చిన సెల్వం బెంగళూరులోని ఓ ఆస్పత్రిలో గుండె పోటు రావడంతో గురువారం ఉదయం మరణించారు.విషాదంలో కుటుంబంమురసోలి సెల్వం మరణ సమాచారంతో సీఎంస్టాలిన్ కుటుంబంలో విషాదం నెలకొంది. గోపాలపురంలోని తల్లి దయాళు అమ్మాల్‌కు సహకారంగా వెన్నంటి సెల్వి ఉంటూ వచ్చారు. ఈ సమాచారంతో సెల్వి తీవ్ర విషాదంలో మునిగారు. అన్నిపనులను పక్కన పెట్టిన సీఎం స్టాలిన్, డిప్యూటీ సీఎం ఉదయనిధితో పాటు మంత్రులు, మురసోలిమారన్ కుమారుడు, ఎంపీ దయానిధి మారన్ తదితరులు గోపాలపురానికి చేరుకున్నారు. కరుణానిధి కుటుంబానికి చెందిన వారందరూ గోపాలపురానికి వచ్చేశారు. సీఎం స్టాలిన్ అయితే తీవ్ర విషాదంతో కనిపించారు. బెంగళూరు నుంచి ప్రత్యేక అంబులెన్స్‌లో చైన్నెకు సాయంత్రం మురసోలిసెల్వం భౌతిక కాయాన్ని తీసుకొచ్చారు. సాయంత్రం 6.30 గంటల తరువాత గోపాలపురం ఇంట్లో ఆప్తుల సందర్శనార్థం ఉంచారు. మాజీ సీఎం పన్నీర్‌సెల్వం, ఎండీఎంకే నేత వైగో, పుదియ నీతి కట్చి నేత ఏసీ షణ్ముగంతో పాటు పలువురు ప్రముఖులు తరలి వచ్చి నివాళులు అర్పించారు. మురసోలి సెల్వం మరణ సమాచారం తన హృదయంలో పిడుగు పడినట్లయ్యిందని సీఎం స్టాలిన్ ఆవేదనను వ్యక్తం చేశారు. అదిగో... పార్టీకి సిద్ధాంతాల ఆయుధంగా ఉన్న మురసోలి మనల్ని వదలి పెట్టి వెళ్లారంటూ ఉద్వేగానికి లోనయ్యారు. తండ్రి తర్వాత తాను తల వాల్చేందుకు ఉన్న ఒక్కగా నొక్క భుజం కూడా కనుమరుగైందని విషణ్ణవదనంతో వ్యాఖ్యలు చేశారు.మూడు రోజుల సంతాప దినాలుమురసోలి మారన్ మరణంతో డీఎంకేలో మూడురోజుల సంతాప దినం పాటించేందుకు నిర్ణయించారు. ఈ మేరకు పార్టీ ప్రధాన కార్యదర్శి దురై మురుగన్ ప్రకటన చేశారు. పార్టీ కార్యాలయాలు, వాడవాడలలోని స్తూపాలలలో పార్టీ జెండాను అవనతం చేయాలని, ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించవద్దని ఆదేశించారు. మురసోలి సెల్వం మరణ సమాచారంతో ఎండీఎంకే నేత వైగో స్పందిస్తూ, ఈ సమాచారం సెల్వి ఎలా తట్టుకో గలదోఅని ఆవేదన వ్యక్తం చేశారు. సెల్వం లేదన్న సమాచారంతో సీఎం స్టాలిన్ తీవ్ర విషాదంలో ఉన్నారని మనో ధైర్యంతో ఆయన ముందుకెళ్లాలని పేర్కొన్నారు. -
ఆయుధ పూజ సందడి
రాష్ట్రంలో ఆయుధ పూజ సందడి నెలకొంది. పండుగ శుక్రవారం కావడంతో గురువారం పూజా సామగ్రి కొనుగోలుకు జనం మార్కెట్లకు పోటెత్తారు. దీంతో అన్ని రకాల వస్తువుల ధరలకూ రెక్కలొచ్చాయి. ఇక కుటుంబ సభ్యులతో పండుగను ఆనందోత్సాహలతో జరుపుకునేందుకు చైన్నె నుంచి లక్షలాదిమంది ప్రత్యేక బస్సులు, రైళ్ల ద్వారా స్వస్థలాలకు బయలుదేరి వెళ్లారు.సాక్షి, చైన్నె: ఆధ్యాత్మికతకు నెలవుగా ఉన్న తమిళనాడులో పండుగలొస్తే సంబరాలు ఆకాశాన్నంటుతాయి. ఎక్కడెక్కడో వివిధ పనుల నిమిత్తం స్థిర పడ్డ వాళ్లంతా శ్రమ కోర్చి సెలవులకు స్వస్థలాలకు చేరుకుంటారు. రాష్ట్రంలో సంక్రాంతి, వినాయక చవితి తదుపరి వచ్చే ఆయుధ పూజ, విజయ దశమి పర్వదినాలకు ప్రజలు మరింత ప్రాధాన్యతను ఇవ్వడం జరుగుతోంది. ఇందులో చిన్నచిన్న దుకాణాల మొదలు అతిపెద్ద ఫ్యాక్టరీల వరకు, కూలీల మొదలు రైతుల వరకు తాము ఉపయోగించే వివిధ రకాల సామగ్రి, పనిముట్లకు పూజలు నిర్వహించే రీతిలో ఆయుధ పూజను అత్యంత భక్తిశ్రద్ధల పర్వదినంగా భావిస్తుంటారు. ఇంటిళ్లి పాది అత్యంత భక్తితో ఈ పర్వదినాన్ని జరుపుకుంటారు.నేతల శుభాకాంక్షలు..ఆయుధ పూజ, విజయ దశమి పండుగలను ఇంటిళ్లి పాది ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని రాష్ట్ర ప్రజలకు వివిధ పార్టీల నేతలు శుభాకాంక్షలు తెలియజేశారు. వీరిలో రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్ రవి, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణిస్వామి, అమ్మ మక్కల్‌మున్నేట్ర కళగం నేత టీటీవీ దినకరన్, మాజీ సీఎం పన్నీరు సెల్వం, తమిళ మానిల కాంగ్రెస్ నేత జీకే వాసన్, బీజేపీ నేతలు తమిళి సై సౌందరరాజన్, శరత్‌కుమార్, దివంగత సీఎం జయలలిత నెచ్చెలి శశికళ, పీఎంకే నేతలు రాందాసు, అన్బుమణి రాందాసు తదితరులు ఉన్నారు.స్వస్థలాలకు పయనం..ఈ ఏడాది పండుగకు మూడు రోజులు సెలవులు రావడంతో అత్యధిక శాతం మంది స్వస్థలాలకు వెళ్లి ఇంటిళ్లి పాది ఆయుధ పూజను జరుపుకునేందుకు సిద్ధమయ్యారు. చైన్నె వంటి నగరాలలో వివిధ పనులు చేసుకుంటూ, ఉద్యోగాలలో ఉన్న వాళ్లు దక్షిణ తమిళనాడులోని తిరుచ్చి, దిండుగల్, మదురై, తిరునల్వేలి, కన్యాకుమారి, కొంగు మండలంలోని సేలం, ఈరోడ్, తిరుప్పూర్, కోయంబత్తూరు జిల్లా లో ఉన్న తమ స్వస్థలాలకు అత్యధికంగా బయలు దేరి వెళ్లారు. బుధవారం రాత్రి నుంచే ప్రత్యేక బస్సులను రోడ్డెక్కించడంతో లక్షల మంది ఆయుధ పూజ నిమిత్తం స్వస్థలాలకు వెళ్లినట్టు రవాణా సంస్థ పరిశీలనలో తేలింది. చైన్నె, శివారులలోని బస్టాండ్ల అర్ధరాత్రి వరకు బస్సులు కిక్కిరిసి వెళ్లాయి. సుమారు 4 వేల బస్సులను చైన్నె నుంచి నడిపారు. ఇదే అదనుగా ఆమ్నీ ప్రైవేటు బస్సులు చార్జీలను పెంచేశాయి. విమాన టికెట్లు సైతం గాల్లో ఎగిరాయి. మదురై, తిరుచ్చి, తూత్తుకుడి,సేలంలకు విమాన చార్జీలు రెండింతలు పెరిగాయి.కులశేఖరపట్నంలో..తూత్తుకుడి జిల్లా కులశేఖరపట్నంలో దసరా సంబరాలు మిన్నంటుతున్నాయి. మైసూర్ తదుపరి దసరా ఉత్సవాలు కులశేఖర పట్నంలోని ముత్తాలమ్మన్ ఆలయంలో కనుల పండువగా జరుగుతాయన్న విషయం తెలిసిందే. ఆయుధపూజ, విజయ దశమి వేళ ఈ ఆలయానికి వేలాదిగా భక్తులు కాళి మాత వేషధారణలతో తరలి వచ్చి మొక్కులు చెల్లించుకుంటున్నారు. తాము విరాళాల రూపంలో సేకరించిన కానుకలను అమ్మవారి హుండీలో సమర్పిస్తున్నారు. పెద్దఎత్తున భక్తులు తరలి వస్తుండడంతో కులశేఖర పట్నంలో ఇసుక వేస్తే రాలనంతంగా కిక్కిరిసి ఉన్నాయి. ఇక్కడ విజయ దశమి పర్వదినం రోజైన 12వ తేదీ అర్ధరాత్రి సమయంలో సాగర తీరంలో శూర సంహారం అత్యంత వేడుకగా జరగనుంది. లక్షలలో భక్తులు తరలి రానున్న నేపథ్యంలో ఇక్కడ అధికారులు, ఆలయ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. భద్రతను కట్టుదిట్టం చేశారు. అలాగే, రాష్ట్రంలోని శివాలయాలు, అమ్మవారి ఆలయాలలో, తమ ఇళ్లల్లో నవరాత్రుల సందర్భంగా బొమ్మల కొలువులు ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు నిర్వహిస్తు వస్తున్నారు. విజయ దశమి వేళ ఆలయాలలో, ఇళ్లల్లోనూ ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీస్సులను అందుకునేందుకు మహిళలు సిద్ధమయ్యారు.మార్కెట్లు కిటకిటఆయుధ పూజ కోసం ఉపయోగించే పూజా సామగ్రి రాష్ట్రంలోని మార్కెట్లోకి పెద్దఎత్తున కొలువు దీరాయి. మరమరాలు(బొరుగులు), అటుకులు, బెల్లం, యాపిల్, ఆరంజ్ తదితర పండ్లు, వివిధ రకాల పువ్వులు, ఇతర పూజా సామగ్రి కొనుగోలు నిమిత్తం జనం మార్కెట్ల వైపుగా కదిలారు. రాష్ట్రంలోని మదురై, తిరుచ్చి, తిరునల్వేలి, కోయంబత్తూరు, ఈరోడ్, సేలం తదితర నగరాలలోని చిన్న పెద్ద మార్కెట్లు జనంతో కిక్కిరిశాయి. చైన్నెలోని టీ నగర్, పురసైవాక్కం, బ్రాడ్ వే మార్కెట్లు, దక్షిణాసియాలోనే అతిపెద్ద మార్కెట్‌గా ఉన్న కోయంబేడు జనంతో నిండాయి. ఎటు చూసినా కొనుగోలు దారులతో వర్తక కేంద్రాలు కిక్కిరిశాయి. పూజా సామాగ్రి, పండ్లు, పువ్వుల ధరలకు మరింతగా రెక్కలు వచ్చాయి. ధర పెరిగినా, తమ స్తోమతకు తగ్గట్టుగా పండుగను జరుపుకునేందుకు ప్రజలు సిద్ధమయ్యారు. శుక్రవారం ఆయుధ పూజ, శనివారం విజయదశమి పండుగకు కావాల్సిన అన్నిరకాల పూజాసామాగ్రిని సిద్ధం చేసు కున్నారు. -
మంత్రులకు జిల్లా బాధ్యతలు
అభివృద్ధి పనులు, పథకాల పర్యవేక్షణ, ప్రజలతో మమేకం అయ్యే విధంగా కార్యక్రమాలను విస్తృతం చేయడమే లక్ష్యంగా మంత్రులకు జిల్లాల బాధ్యతలను అప్పగించారు. ఒక్కో జిల్లాకు ఒక్కో మంత్రిని ఇన్చార్జ్గా నియమించారు. రూ.38 వేల కోట్ల మేరకు పెట్టుబడులకు ఆమోదం తెలియజేశారు. 14 సంస్థలు తమ పరిశ్రమలను నెలకొల్పేందుకు వీలుగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కాగా కేబినెట్ భేటీ అనంతరం తీసుకున్న నిర్ణయాలను మంత్రులు ప్రకటించారు.సాక్షి, చైన్నె : ఇటీవల మంత్రి వర్గంలో మార్పులు చేర్పుల నేపథ్యంలో మంగళవారం కేబినెట్ భేటీ సచివాలయం ఆవరణలోని సమావేశ మందిరంలో జరిగింది. సీఎం ఎంకే స్టాలిన్ అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో డిప్యూటీ సీఎం హోదాలో ముందు వరసలో ఓ వైపు తొలి సీటును ఉదయనిధికి కేటాయించారు. ఈ భేటిలో సీనియర్ మంత్రులు దురై మురుగన్, కేఎన్ నెహ్రూ, ఐ పెరియస్వామి, ఏవీవేలు, కేకేఎస్ఎస్ఆర్ రామచంద్రన్, పొన్ముడి, ఎంఆర్కే పన్నీరు సెల్వం తదితరులు హాజరయ్యారు. తొలి సారిగా మంత్రులుగా బాధ్యతలు స్వీకరించిన రాజేంద్రన్, చెలియన్లు, మళ్లీ మంత్రి పదవి దక్కించుకున్న సెంథిల్ బాలాజీ, నాజర్‌లు కూడా భేటీలో పాల్గొన్నారు. ఇందులో ఈశాన్య రుతు పవనాల సీజన్ నేపథ్యంలో చేపట్టిన ముందస్తు ఏర్పాట్లు, రాష్ట్రంలో సంపూర్ణ మద్య నిషేధం అమలు నినాదం మళ్లీ తెరమీదకు వచ్చిన నేపథ్యంలో కొన్ని టాస్మాక్ దుకాణాల మూత, ఉదయ నిధికి మరిన్ని అధికారాలు కట్టబెట్టే విషయంగా చర్చ జరిగినట్టు సమాచారం. అలాగే, పారిశ్రామిక రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిన సంస్థల గురించి చర్చించి వాటికి ఆమోద ముద్ర వేశారు. జిల్లాలో ప్రభుత్వ పరంగా కార్యక్రమాల విస్తృతం, ప్రజలకు పథకాలను దరిచ్చేడం వంటి అంశాలను పరిగణించి మంత్రులను ఇన్‌చార్జ్‌లుగా నియమిస్తూ చర్యలు తీసుకున్నారు. కేబినెట్ భేటీ అనంతరం మంత్రులకు ఏఏ జిల్లాలను కేటాయించారో అన్న వివరాలను ప్రకటించారు.క్షేత్రస్థాయిలో పర్యవేక్షణే లక్ష్యంగా..రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో అభివృద్ధి పనులను వేగవంతం చేయడం, సంక్షేమ పథకాల విస్తృతం, సహాయకాల పంపిణీ, ప్రకృతీ వైపరీత్యాల సమయంలో, అతవ్యసర పరిస్థితులలో చేపట్టాల్సిన పనులు తదితర వాటిని పరిగణించి మంత్రులకు అదనంగా బాధ్యతలు అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. రెవెన్యూ జిల్లాల వారీగా మంత్రులను ఇన్‌చార్జ్‌లగా నియమించారు. ఈ మేరకు తిరునెల్వేలి జిల్లాకు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ మంత్రి కె.ఎన్. నెహ్రూ, తేని జిల్లాకు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఐ పెరియసామి, తిరుపత్తూరు, కళ్లకురిచి జిల్లాలకు ప్రజాపనుల శాఖ మంత్రి ఏ.వి. వేలు, ధర్మపురి జిల్లాకు రైతు సంక్షేమం, వ్యవసాయ మంత్రి ఎంఆర్కే పన్నీరు సెల్వం, తెన్కాశి జిల్లాకు విపత్తు నిర్వహణ మంత్రి కె.కె.ఎస్.ఆర్. రామచంద్రన్‌ను నియమించారు. కన్యాకుమారి – ఆర్థిక మంత్రి తంగం తెన్నరసు, నీలగిరి – తమిళ అభివృద్ధి , సమాచార శాఖ సామినాథన్, కృష్ణగిరి– ఆహార భద్రతా శాఖ మంత్రి ఆర్చక్రపాణి, కోయంబత్తూరు – విద్యుత్ మంత్రి సెంథిల్ బాలాజీ, కాంచీపురం – జౌళి శాఖ మంత్రి ఆర్. గాంధీ , పెరంబలూరు– రవాణా మంత్రి శివశంకర్, నాగపట్నం – పాఠశాల విద్యా శాఖ మంత్రి అన్బిల్ మహేశ్, మైలాడుతురై – వెనుకబడిన సంక్షేమం శాఖ మంత్రి శివ.వి. మెయ్యనాథన్ తదితరులకు జిల్లాల బాధ్యతలను అప్పగించారు.రూ. 38 వేల కోట్లకు ఆమోదంకేబినెట్ భేటి అనంతరం మీడియాతో ఆర్థిక మంత్రి తంగం తెన్నరసు, పరిశ్రమల మంత్రి టీఆర్బీ రాజ మాట్లాడుతూ రాష్ట్రంలో వివిధ రకాల పరిశ్రమలను నెలకొల్పేందుకు అనేక సంస్థలు ముందుకు వచ్చాయని వివరించారు. ఇందులో 14 సంస్థలకు కేబినెట్లో ఆమోదం తెలిపిందన్నారు. రూ. 38 వేల కోట్ల పెట్టుబడితో 46 వేల మందికి ఉద్యోగ కల్పన దిశగా ఈ సంస్థలో రాష్ట్రంలో నెలకొల్పనున్నట్లు వివరించారు. ఇందులో రాణిపేటలో టాటా మోటార్స్ రూ. 9 వేల కోట్ల పెట్టుబడితో 5 వేల మందికి ఉద్యోగాలను కల్పించనున్నట్టు ప్రకటించారు. కాంచీపురంలో కంచిలో ఫాక్సాన్ అనుబంధ సంస్థ యూసాన్ టెక్నాలజీ రూ.13 వేల కోట్లతో 14 వేల మందికి ఉద్యోగాలనుక ల్పించే పరిశ్రమను నెలకొల్పనున్నట్టు తెలిపారు. తూత్తుకుడి, తిరుల్వేలి,రామనాపురం, తిరువణ్ణామలైలో పీహెచ్డీ గ్రూప్ లోని 3 వేల మందికి ఉద్యోగ కల్పన దిశగా రూ. 10, 375 కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్టు వివరించారు. అరియలూరులో తైవాన్‌కు చెందిన టీన్ షూస్ గ్రూప్ రూ. 1000 కోట్లతో 15 వేల మందికి ఉద్యోగకల్పన దిశగా పరిశ్రమను, కాంచీపురంలో కేమ్స్ సర్క్యూట్స్ ఇండియా రూ. 1,395 కోట్లతో 1000 మందికి ఉద్యోగాల కల్పన, కృష్ణగిరి జిల్లా హోసూర్ హసన్ సెక్యూర్ రూ. 612 కోట్లతో 1,200 మంది ఉపాధి కల్పించేందుకు సిద్ధమయ్యాయని వివరించారు. మొత్తం 14 సంస్థల పెట్టుబడులకు ఆమోదించామని, వీటి ద్వారా రాష్ట్రంలోకి రూ.38 వేల కోట్ల పెట్టుబడి, 46,931 మందికి ఉద్యోగ అవకాశాలు దక్కనున్నాయని ప్రకటించారు. -
కమలహాసన్, దర్శకుడు అట్లీ, సల్మాన్‌ఖాన్
తమిళసినిమా: లోకనాయకుడు కమలహాసన్, బాలీవుడ్ స్టార్ సల్మాన్‌ఖాన్ కలిసి నటిస్తే ఆ చిత్రం ఎలా ఉంటుందో ఒక్క సారి ఊహించుకోండి. మీ ఊహ నిజం కాబోతోందన్నది తాజా సమాచారం. నటుడు కమలహాసన్‌కు తమిళం, మలయాళం, తెలుగు, కన్నడం చిత్రాలు కొత్తేమీ కాదు. ఇక హిందీ చిత్రాల్లో నటించడం అస్సలు కొత్త కాదు. అదేవిధంగా పాన్ ఇండియా చిత్రాలు కూడా కొత్తేమీ కాదు.ఆయన ఇటీవల కూడా కల్కీ 2898 అనే పాన్ ఇండియా చిత్రంలో నటించారు. ప్రస్తుతం మణిరత్నం దర్శకత్వంలో నటిస్తున్న థగ్ లైఫ్ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతోంది. ఇకపోతే బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్‌ఖాన్ నటించిన చిత్రాలకు ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ ఉంటుంది. ఆయన తమిళంలో నేరుగా ఇప్పటి వరకూ నటించకపోయినా, ఇక్కడ అభిమాన గణం ఎక్కువే. ఇక దర్శకుడు అట్లీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దర్శకుడు శంకర్ శిష్యుడైన ఈయన రాజా రాణి చిత్రంతో దర్శకుడిగా మోగాఫోన్ పట్టి తొలి చిత్రంతోనే విజయాన్ని అందుకున్నారు. ఆ తరువాత దర్శకత్వం వహించిన మెర్శల్, తెరి, బిగిల్ చిత్రాలు సూపర్‌హిట్ అయ్యాయి. ఇకపోతే ఇటీవల షారూఖ్‌ఖాన్ హీరోగా అట్లీ దర్శకత్వం వహించిన హిందీ చిత్రం జవాన్ బ్లాక్‌బస్టర్ అయ్యి, రూ. 1200 కోట్లు వసూలు చేసింది. కాగా దర్శకుడు అట్లీ తదుపరి చిత్రంపై రకరకాల ప్రచారం జరుగుతోంది. తెలుగు చిత్రం అనీ, హిందీ చిత్రం అనీ, కాదు తమిళ చిత్రం చేయబోతున్నారని ప్రచారంలో ఉంది. కాగా తాజాగా నటుడు కమలహాసన్, బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్ కలిసి నటించే పాన్ ఇండియా చిత్రాన్ని అట్లీ తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. అంతే కాదు ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని సన్ పిక్చర్స్ సంస్థ నిర్మింనుందని సమాచారం. ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతాన్ని అందించనున్నట్లు తెలిసింది. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు. -
హిజ్రా దర్శకత్వం వహించిన చిత్రం నీల నిర సూర్యన్
తమిళసినిమా: ఒకప్పుడు హిజ్రాలను చిన్నచూపు చూసిన సమాజంలో ఇప్పుడు వారు తమకంటూ ఒక గుర్తింపును తెచ్చుకుంటున్నారు. ఎందరో ఆత్మవిశ్వాసంతో అన్ని రంగాల్లోనూ ఉన్నత స్థాయికి చేరుకుంటున్నారు. అలా అమ్మాయిగా మారిన సంయుక్త విజయన్ దర్శకుడుగా అవతారమెత్తి తెరకెక్కించిన చిత్రం నీల నిర సూర్యన్ (నీలి రంగ సూర్యుడు). తమిళంలో సినీ దర్శకురాలిగా పరిచయం అవుతున్న తొలి హిజ్రా ఈమెనే అన్నది గమనార్హం. కాగా ఫస్ట్ కాపీ ప్రొడక్షన్ పతాకంపై మాలా మణియన్ నిర్మించిన ఈ చిత్రంలో సంయుక్త విజయన్‌తో పాటు గీతా కై లాసం, గజరాజ్, మషాంత్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్ర వివరాలను సంయుక్త విజయన్ తెలుపుతూ ఒక మగవాడు యువతిగా మారాలనుకోవడంతో పాటు మన సమాజం వారిని ఎలా అవమానిస్తుందీ, వాటన్నింటినీ అధిగమించి వారు ఎలా సాధిస్తారు. అన్న పలు ఆసక్తికరమైన అంశాలతో తెరకెక్కించిన చిత్రం నీల నిర సూర్యన్ అని చెప్పారు. నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని అక్టోబరు 4వ తేదీన విడుదల చేస్తున్నట్లు తెలిపారు. కాగా ఈ చిత్రం ఐఎఫ్ఎఫ్ఐ 23 తదితర పలు అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ప్రదర్శింపబడి ప్రపంచ ప్రేక్షకులతో పాటు మంచి చిత్రాలను ఇష్టపడే సినిమా ప్రియుల అభినందనలు అందుకుందని దర్శకురాలు పేర్కొన్నారు. కాగా ఈ చిత్రానికి స్టీవ్ బెంజిమెన్ సంగీతాన్ని, చాయాగ్రహణం అందించారు. -
సవాళ్లకు .. సంసిద్ధం
ఈశాన్య రుతు పవనాల సీజన్లో ఎదురయ్యే విపత్తులను సమష్టిగా సమన్వయంతో.. ఎదుర్కొందామని అధికారులకు సీఎం స్టాలిన్ పిలుపునిచ్చారు. ముందు జాగ్రత్తలు మరింత విస్తృతం కావాలని, స్వచ్ఛంద సంస్థలు, వలంటీర్లతో ప్రత్యేక సహాయక బృందాలను సిద్ధం చేయాలని ఆదేశించారు. విపత్తులు ఎదురైన పక్షంలో ప్రాణ నష్టానికి అవకాశం ఇవ్వొద్దని, ఈ మేరకు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు సిద్ధంగా ఉండాలన్నారు.సాక్షి, చైన్నె: ఈశాన్య రుతుపవనాల రూపంలో ఈ ఏడాది తమిళనాడు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ కేంద్రం హెచ్చరికల నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యలకు సంబంధించి సచివాలయంలో అధికారులతో సీఎం స్టాలిన్ సమావేశమయ్యారు. డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్‌తో పాటు ముఖ్యశాఖల మంత్రులు, ప్రధా న, అదనపు కార్యదర్శులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం స్టాలిన్ అధికారులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈశాన్య రుతుపవనాల ప్రారంభానికి ముందే అప్రమత్తంగా ముందస్తు జాగ్రత్తలను విస్తృతం చేయాలని సూచించా రు. జాగ్రత్తగా ఉంటే ఎంతటి విపత్తు ఎదురైనా ప్రా ణ నష్టం జరగకుండా చర్యలు తీసుకునేందుకు వీ లుంటుందన్నారు. గత మూడేళ్ల కాలంలో ఈశాన్య రుతు పవనాలతో ఎదురైన విపత్తులను సమర్థంగా ఎదుర్కొన్నామని గుర్తు చేశారు. ఈ ఏడాది నైరుతి రూపంలో ఇంకా వర్షాలు పడుతున్నాయని గుర్తుచేస్తూ, అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు ఈశాన్యం రూపంలో మరింత వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్టు సమాచారాలు వచ్చి ఉన్నాయన్నారు.సురక్షితంగా..వరద ముంపునకు గురయ్యే ప్రాంతాలను గుర్తించి అక్కడి ప్రజలను ముందుగానే సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. ప్రజలకు అవసరమైన అన్ని సౌకర్యాలు సిద్ధంగా ఉంచాలన్నారు. వరదల సమయంలో ప్రభుత్వ యంత్రాంగం వీలైనంత త్వరగా సమష్టిగా పనిచేసి ప్రజల ఆస్తులు, ప్రాణాలను రక్షించడం లక్ష్యంగా ముందుకెళ్లాలని పిలుపు నిర్చారు. అవసరమైన చోట్ల ఉందుగానే మోటరు పంపు సెట్లు, జేసీబీలు, బోట్లను సిద్దంచేసి ఉంచుకోవాలన్నారు. వివిధ వరద నివారణ పనులు త్వరగా ముగించాలని, జిల్లాల వారీగా సీనియర్ అధికారుల పర్యవేక్షణ ముందు జాగ్రత్తలను మరింత విస్తృతం చేయనున్నామన్నారు. ప్రధానంగా చైన్నెలో మెట్రోపాలిటన్ చైన్నె కార్పొరేషన్‌లోని అన్ని జోన్లకు ఆయా ప్రాంతాల్లో ప్రత్యేక అధికారులను నియమించాలని సూచించారు. వరద నియంత్రణ పనులే కాదు. ఇతర సహాయకాల నిర్వహణ సక్రమంగా జరుగుతున్నాయా? అని ఈ అధికారులు పర్యవేక్షించాలని సూచించారు. వరదల సీజన్ వస్తే నీటి పరివాహక ప్రదేశాలపై మరింత దృష్టి పెట్టాలని, పిల్లలు ఎవ్వరూ అటు వైపుగా వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రాణ నష్టానికి అవకాశం ఇవ్వ వద్దని కోరారు. ఇందుకు తల్లిదండ్రులు సహకరించాలని కోరారు. వరదలు తుఫానులు వంటి విపత్తుల సమాచారం బదిలీలు, విద్యుత్ సేవలకు ఆటంకం అనేది ముఖ్యమైన సేవలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. సురక్షితమైన తాగునీరు, పాలు ఆహార పదార్థాల కొరత అన్నది లేకుండా అందుబాటులో ఉంచాలన్నారు. వర్షాలు, వరదల వల్ల ఎలాంటి ఇన్ఫెక్షన్ చోటు చేసుకోకుండా, అంటు వ్యాధులు వ్యాపించకుండా ప్రజారోగ్య సేవ విభాగం మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని ఆదేశించారు. అన్ని శాఖల అధికారులు సంయుక్తంగా పని చేయడం ద్వారా మాత్రమే ఎలాంటి విపత్తులు, సవాళ్లను ఎదుర్కోగలమని స్పష్టం చేశారు. అలాగే, విపత్తు నిర్వహణలో స్వచ్ఛంద సేవకులు, వలంటీర్ల పాత్ర కూడా ఎంతో కీలకం అని, రెస్క్యూ బృందాలతో కలిసి వలంటీర్లు పనిచేసే విధంగా ప్రత్యక చర్యలు తీసుకోవాలన్నారు. సమష్టిగా పనిచేయడం ద్వారా 100 శాతం విజయం సాధించగలమని, రుతు పవనాలసీజన్లో సవాళ్లను ఎదుర్కొని, ప్రజల కష్టాలను తొలగించేందుకు ప్రభుత్వ యంత్రాంగం అంతా ఒకే వేదిక మీద నిలబడి పనిచేయాల్సిన అవసరం ఉందని పిలుపు నిచ్చారు.సకాలంలో సమాచారం..ప్రజలకు సకాలంలో, వాతావరణ సూచనలు, సమాచారం చేర వేయడం ద్వారా పెద్ద ఎత్తుననష్టాలను నివారించేందుకు వీలుందన్నారు. విపత్తులను ఎదుర్కోవడానికి ముందు జాగ్రత్త చర్యలను సకాలంలో చేర వేయడమేనని, ఆ దిశగా ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. స్టేట్ ఎమర్జెన్సీ సెంటర్లో ప్రస్తుతం ఆధునిక సౌకార్యలను కల్పించి ఉన్నామని వివరిస్తూ, ఇక్కడ పలు శాఖల అధికారులు సమన్వయంతో పని చేస్తారని, ఇదే సమన్వయం అన్ని జిల్లాలలోనూ ఉండాలని ఆదేశించారు. ఎంత వర్షం పడింది? ఎం జరుగుతోంది? అన్నది సకాలంలో తెలిస్తే, డ్యామ్‌లలో నీటి విడుదల నిర్వహణ, వరద హెచ్చరికల సమాచారంతో సహా వివిధ విధులను సక్రమంగా నిర్వహించ గలిగేందుకు వీలుంటుదన్నారు. 100 ఆటోమేటిక్ రెయిన్ గేజ్‌లు, ఆటోమేటిక్ వాతావరణం కేంద్రాలను కూడా ఏర్పాటు చేసి రియల్ టైమ్ సమాచారం పొందుతున్నామని గుర్తు చేస్తూ, ఈ సమాచారం ఎప్పటికప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండాలని, అప్పుడే వారు వారి జాగ్రత్తలలో ఉంటారని వ్యాఖ్యలు చేశారు. సమాచారాన్ని తమిళంలో తెలుసుకునేందుకు ప్రభుత్వం టీఎన్ అలర్ట్ మొబైల్ అప్లికేషన్‌ను సిద్ధం చేసిందని ప్రకటించారు. చైన్నెతో సహా నగరాలలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని, దేశానికే ఆదర్శంగా నిలిచిన మెట్రోపాలిటన్ చైన్నె కార్పొరేషన్లో ప్రాంతాలు, వార్డులు, వీధుల వారిగా వరద హెచ్చరికల సమాచారాలను సకాలంలో అందించాలని, వరద ముంపు ఎదురైన పక్షంలో వృద్ధులు, గర్భిణులు, బాలింతలు, బిడ్డల తల్లులు, దివ్యాంగులకు అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు జిల్లా యంత్రాంగం ముందస్తుగా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు వివరించారు.వాతావరణ మార్పులతో..గతంలో ఈశాన్య రుతుపవనాలు సీజన్ రాష్ట్రం అంతటా వ్యాపించేవని వివరించారు. అయితే, ఇటీవలి వాతావరణ మార్పుల నేపథ్యంలో రోజుల వ్యవధిలో ఒకే చోట మొత్తం వర్షం పడుతోందని, కొన్ని గంటల్లో ఊహించని రీతిలో వర్షపాతం నమోదు అవుతోందని పేర్కొన్నారు. ఇలాంటి వర్షాన్ని ఎదుర్కొనడమే పెను సవాళ్లు గా మారి ఉన్నాయన్నారు. గంటల వ్యవధిలో కురిసే వర్షాలు ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్నాయని తెలిపారు. ప్రజలకే కాదు, తాగునీరు, రోడ్లు, విద్యుత్, మౌలిక సదుపాయాలకు సైతం పెద్ద ఎత్తుననష్టం ఎదురు అవుతోందన్నారు. గత ఏడాది ఈశాన్య రుతుపవనాల సమయంలో చైన్నె, తిరునెల్వేలి, తూత్తుకుడి జిల్లాలో గంటల వ్యవధిలో కురిసిన వర్షానికి భారీ వరదల రూపంలో అతి భారీ నష్టాన్ని చవిచూడాల్సి వచ్చిందని గుర్తు చేశారు. ప్రభుత్వం తీసుకున్న పటిష్ట చర్యలతో ఆ జిల్లాలు త్వరితగతిన కోలుకున్నాయని వివరించారు. ఈ విపత్తులు నేర్పిన గుణపాఠంతో ముందు జాగ్రత్తలపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. ఇప్పటికే పలుమార్లు సీఎస్ నేతృత్వంలో జిల్లాల కలెక్టర్ల సమావేశాలు జరిగాయని, సమగ్ర అధ్యయనంతో స్పష్టమైన ఆదేశాలు జారీ చేసి ఉన్నారని గుర్తు చేశారు. -
ఘనంగా అవార్డుల వేడుక
తమిళసినిమా: అవార్డులు అనేవి ప్రతిభకు గుర్తింపునే కాకుండా వర్తమాన కళాకారులకు ఎంతో ప్రోత్సాహకారంగా నిలుస్తాయి. వారిలోని ప్రతిభను వెలికి తీయడానికి దోహదపడతాయి. ఇక సామాజిక సేవకులకు ఈ అవార్డులు వారి సేవలకు ఫలితంగానూ, గౌరవాన్ని పెంచే విధంగాను ఉంటాయి. అలాంటి ప్రోత్సాహంగా అవార్డుల వేడుకలను అనురాధ జయరామన్‌కు చెందిన మహా ఆర్ట్స్ సంస్థ, కలైమామణి, డాక్టర్ నైల్లె సుందరాజన్కు చెందిన యునైటెడ్ ఆర్టిస్ట్స్ ఆఫ్ ఇండియా సంస్థ కలిసి చాలా ఏళ్లుగా సమర్థంగా నిర్వహిస్తున్నారు.అదేవిధంగా శనివారం సాయంత్రం స్థానిక వడపళని, కుమరన్ కాలనీలోని శిఖరం ఆవరణలో ఈ అవార్డుల వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో విశ్రాంతి హైకోర్టు న్యాయమూర్తి జ్ఞానప్రకాశం ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నటి శ్రీవిద్య తదితర కళాకారులతోపాటు, సైకిల్ ఛాంపియన్ డాక్టర్ ఎం ఆర్ సౌందర్య రాజన్, సెన్సార్ బోర్డు సభ్యుడు డాక్టర్ వీకే. వెంకటేశన్ మొదలగు పలువురు సామాజిక సేవకులకు విశ్రాంతి న్యాయమూర్తి జ్ఞాన ప్రకాశం చేతుల మీదగా అవార్డులను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా అవార్డు గ్రహీతల కళా, సామాజిక సేవలను విశ్రాంతి న్యాయమూర్తి జ్ఞాన ప్రకాశం అభినందించారు. అలాగే సాంస్కతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి. -
మా సంస్థపై విష ప్రచారం తగదు.. తిరుపతి లడ్డు వివాదంపై ఏఆర్ డెయిరీ
చెన్నై : దేశ వ్యాప్తంగా తిరుమల లడ్డూ వివాదం చర్చనీయాంశమైంది. ఈ వివాదంపై తిరుమల శ్రీవారి లడ్డూ తయారీలో వినియోగించే నెయ్యిని అందించే తమిళనాడుకు చెందిన ఏఆర్ డెయిరీ సంస్థ స్పందించింది. ‘‘ఏఆర్ డెయిరీ నుండి జూన్, జూలైలో నెయ్యి సరఫరా చేశాం. ఇప్పుడు మా సంస్థ టీటీడీకి నెయ్యి సరఫరా చెయ్యడం లేదు. 25 సంవత్సరాలుగా మేం డైయిరీ సేవల్ని అందిస్తున్నాం. దేశ వ్యాప్తంగా మా ఉత్పత్తుల అమ్మకాలు నిర్వహిస్తున్నాం. ఎప్పుడూ ఇలాంటి ఆరోపణలు రాలేదు.తాజాగా, మా సంస్థపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో మేం.. టీటీడీకి అందించే నెయ్యి నాణ్యతా ప్రమాణాలపై టెస్ట్‌లు నిర్వహించాం. ఆ టెస్టుల్లో నేయ్యిలో ఎలాంటి లోపాలు లేవని తేలింది. కానీ మాపై విష ప్రచారం చేస్తున్నారు. టీటీడీ అడిగిన వెంటనే సంబంధిత రిపోర్ట్‌ను పంపించాం. కానీ టీటీడీ నుంచి మాకు స్పందన రాలేదు’’ అని ఏఆర్ డెయిరీ యాజమాన్యం తెలిపింది.