న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘం (ECI) 18వ లోక్‌సభ ఎన్నికల తేదీలను ప్రకటించింది. అయితే కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో పార్లమెంట్ ఎన్నికల తేదీలను మార్చాలని ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (IUML) డిమాండ్ చేస్తోంది. ఈమేరకు ఎలక్షన్ కమిషన్‌ను ఆశ్రయించనున్నట్లు తెలిపింది.
కారణం ఇదే..
కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన లోక్‌సభ సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ప్రకారం.. తమిళనాడులో ఏప్రిల్ 19న, కేరళలో ఏప్రిల్ 26న ఎన్నికలు జరగనున్నాయి. ఈ రెండు తేదీలు శుక్రవారం వస్తాయి. దీంతో ఎన్నికల తేదీలను మార్చాలని ఐయూఎంఎల్ డిమాండ్ చేస్తోంది.
శుక్రవారం ముస్లింలకు ముఖ్యమైన రోజు కాబట్టి ఓటర్లు, అధికారులు, అభ్యర్థులకు అసౌకర్యం కలగకుండా కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో ఎన్నికల తేదీలను మార్చాలని ఈసీఐని ఆశ్రయించనున్నట్లు యూడీఎఫ్‌లోని ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీకి ప్రధాన మిత్రపక్షమైన ఐయూఎంఎల్ తెలిపింది.
ఐయూఎంఎల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పీఎంఏ సలామ్ పీటీఐ వార్తా సంస్థతో మాట్లాడుతూ ప్రార్థనల కోసం మసీదులలో గుమిగూడే ముస్లింలకు శుక్రవారం ముఖ్యమైన రోజు అన్నారు. “శుక్రవారం పోలింగ్ నిర్వహణ ఓటర్లు, అభ్యర్థులు, పోలింగ్ ఏజెంట్లు, ఎన్నికల విధులు కేటాయించిన అధికారులకు అసౌకర్యాన్ని కలిగిస్తుంది. అందుకే ఈసీఐని ఆశ్రయిస్తాం” అని సలామ్ పేర్కొన్నారు. ఐయూఎంఎల్‌తోపాటు ఇతర ముస్లిం సంస్థలు కూడా ఎన్నికల తేదీల మార్పు కోసం ఎలక్షన్ కమిషన్‌ను ఆశ్రయించాలని యోచిస్తున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment