మాజీ సీఎం వర్సెస్ మాజీ ఖైదీ
కర్నాల్ లోక్‌సభ స్థానంలో ఆసక్తికర పోరు
అభివృద్ధి ధీమాతో మనోహర్‌లాల్ ఖట్టర్
పోరాటాలు గెలిపిస్తాయంటున్న దివ్యాంశు
విద్యార్థి నాయకుడిగా సీఎం కాన్వాయ్‌ను అడ్డుకున్నందుకు జైలు శిక్ష అనుభవించారు. ఏడేళ్ల తరువాత ఆయన మీదే పోటీ చేస్తున్నారు. ఆ సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ కాగా నాటి విద్యార్థి దివ్యాంశు బుధిరాజా. వీరిద్దరి ఆసక్తికర పోరుకు హరియాణాలోని కర్నాల్ లోక్‌సభ స్థానం వేదికగా మారింది. మాజీ సీఎం ఖట్టర్ బీజేపీ నుంచి, బుధిరాజా కాంగ్రెస్ టికెట్‌పై అమీతుమీ తేల్చుకోనున్నారు. ఆరితేరిన నాయకుడు, విద్యార్థి ఉద్యమ కెరటం.. వీరిలో గెలుపెవరిదన్నది ఆసక్తిగా మారింది. కర్నాల్‌లో 25న ఆరో విడతలో పోలింగ్ జరగనుంది...
కర్నాల్ లోక్‌సభ స్థానంలో 1952 నుంచి 2009 దాకా కాంగ్రెస్ ఏకంగా 11 సార్లు గెలుపొందింది. 1996, 99 మాత్రమే మినహాయింపు. ఈ లోక్‌సభ స్థానం పరిధిలో 9 అసెంబ్లీ సెగ్మెంట్లున్నాయి. 2019 లోక్‌సభ ఎన్నికల్లో కర్నాల్‌లో 68.31 శాతం ఓటింగ్ నమోదైంది. బీజేపీ అభ్యర్థి సంజయ్ భాటియా ఏకంగా ఆరు లక్షల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.
వివాదాల సీఎం..
ఆరెస్సెస్ నుంచి బీజేపీ రాష్ట్ర కార్యదర్శి దాకా ఎదిగిన ఖట్టర్‌కు ఇవి తొలి లోక్‌సభ ఎన్నికలు. 2014, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో కర్నాల్ నుంచే గెలిచారాయన. తొమ్మిదేళ్లు సీఎంగా చేశారు. అత్యాచారాలు, మహిళల సమస్యలపై ఖట్టర్ వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు దారితీశాయి. ‘‘మహిళలపై అత్యాచారాలు, ఈవ్ టీజింగ్‌గా చెబుతున్న ఉదంతాల్లో 90 శాతం వారి సమ్మతితో జరుగుతున్నవే. విభేదాలొచ్చి విడిపోయాక అమ్మాయిలు కేసులు పెడుతున్నారు. ఈ ధోరణికి కోర్టులే అడ్డుకట్ట వేయాలి’’ అనే వ్యాఖ్యలతో 2018లో వివాదాస్పదమయ్యారు. 2014 ఎన్నికలప్పుడూ మహిళలపై ఇలాంటి వ్యాఖ్యలే చేసి విమర్శలకు గురయ్యారు. ఈ లోక్‌సభ ఎన్నికలకు ముందు సీట్ల పంపకంపై విభేదాలతో బీజేపీకి జననాయక్ జనతా పార్టీ (జేజేపీ) గుడ్‌బై చెప్పింది. అధికార సంకీర్ణం నుంచీ బయటికొచ్చింది. దాంతో మార్చిలో ఖట్టర్ రాజీనామా చేశారు. 2014, 2019లో ఉన్న సానుకూలత ఆయనకు ఇప్పుడు కనిపించడం లేదు.
పోరాటాల పిడికిలి..
31 ఏళ్ల వయసున్న బుధిరాజా సోనిపట్ జిల్లా గోహనాలో పంజాబీ కుటుంబంలో జన్మించారు. తండ్రి క్లర్క్. తల్లి స్కూల్ టీచర్. 2017లో ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షునిగా ఉండగా పంచకుల ప్రభుత్వ కాలేజీ విద్యార్థుల బృంద సారథిగా ఖట్టర్ కాన్వాయ్‌ను అడ్డుకుని అరెస్టయ్యారు. అంతకుముందు 2014లో పంజాబ్ యూనివర్సిటీ స్టూడెంట్స్ కౌన్సిల్ అధ్యక్షునిగా ఉన్నారు. 2021లో రాష్ట్ర యువజన కాంగ్రెస్ చీఫ్ అయ్యారు. ఎనిమిదేళ్లుగా విద్యార్థులు, నిరుద్యోగ యువత కోసం ఉద్యమిస్తున్నారు. కాంగ్రెస్ అనూహ్యంగా కర్నాల్ టికెటివ్వడంతో ఖట్టర్‌ను ఢీకొంటున్నారు. ‘‘మా కుటుంబంలో ఎవరూ ఇంతవరకు కనీసం సర్పంచ్ ఎన్నికల్లో కూడా పోటీ చేయలేదు. ఒక సాధారణ యువకుడికి ఇలాంటి అవకాశం లభించినందుకు యువత సంతోషంగా ఉంది’’ అంటున్నారు. కర్నాల్ లోక్‌సభ స్థానం పరిధిలోని ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలు ఇప్పటికే కాంగ్రెస్‌కు మద్దతు ప్రకటించారు. పంజాబ్, హరియాణా హైకోర్టు న్యాయవాదులూ బుధిరాజాకు మద్దతు తెలిపారు. మాజీ సీఎం భూపీందర్ సింగ్ హుడా, ఎంపీ దీపేందర్ హుడా ఆశీర్వాదం, ఓటు బ్యాంకు మరింత కలిసొచ్చేవే. మోదీ సర్కారుపై రైతుల ఆగ్రహం తనను విజయతీరాలకు చేరుస్తుందని బుధిరాజా చెబుతున్నారు.
ఇవీ సమస్యలు...!
కర్నాల్, పానిపట్ జిల్లాలు జాతీయ రాజధాని ప్రాంత పరిధిలో ఉన్నాయి. దాంతో వాటిపై వాయు నాణ్యత ఆంక్షలున్నాయి. ఇది అభివృద్ధికి ఆటంకంగా ఉందని, రెండు జిల్లాలను ఎన్‌సీఆర్ పరిధి నుంచి తప్పించాలని స్థానిక పారిశ్రామికవేత్తలు కోరుతున్నారు. స్టార్టప్ ప్రాజెక్టులు, స్మార్ట్ సిటీ వంటి పలు సమస్యలూ ముందున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment