
'ఈ సమావేశం తర్వాత కొంతమందికి నిద్రపట్టదు' అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) చేసిన వ్యాఖ్యలకు రాజకీయంగా ప్రాధాన్యత ఏర్పడింది. కేరళలో శుక్రవారం పర్యటించిన మోదీ మాటల తూటాలతో ప్రత్యర్థులపై సూటిగా గురిపెట్టారు. సీనియర్ కాంగ్రెస్ నేత శశిథరూర్ భుజాలపైనుంచి ప్రతిపక్ష ఇండియా కూటమిపై తుపాకీ ఎక్కుపెట్టారు. 'మీ పార్టీకి చెందిన సీనియర్ నేత మా పక్కన నిలబడ్డారు చూడండి' అన్నట్టుగా గ్రాండ్ ఓల్డ్ పార్టీ అయిన కాంగ్రెస్‌కు పరోక్షంగా కౌంటర్ ఇచ్చారు.
వారికి నిద్ర పట్టకపోవచ్చు..
తిరువనంతపురం సమీపంలో నిర్మించిన ప్రతిష్టాత్మక ఇంటర్నేషనల్ డీప్ వాటర్ మల్టీపర్పస్ సీపోర్టును ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి కేరళ సీఎం పినరయి విజయన్‌తో పాటు స్థానిక ఎంపీ, సీనియర్ కాంగ్రెస్ నేత శశిథరూర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. "ముఖ్యమంత్రి (పినరయి విజయన్)కి నేను చెప్పాలనుకుంటున్నాను, మీరు INDIA కూటమికి బలమైన స్తంభం, శశి థరూర్ (Shashi Tharoor) కూడా ఇక్కడ కూర్చున్నారు. ఈరోజు మీరు నాతో పాటు వేదిక పంచుకున్నారు. మీరు ఇక్కడ ఉండడం కొందరికి రుచించకపోవచ్చు. వారికి నిద్ర కూడా పట్టకపోవచ్చు. ఈ మెసేజ్ ఎక్కడికి వెళ్లాలో అక్కడికి చేరుతుంద"ని వ్యాఖ్యానించారు.
గ్యాప్ పెరిగింది..
తిరువనంతపురం లోక్‌సభ నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్న శశిథరూర్.. ఇండియన్ నేషనల్ డెవలప్‌మెంటల్ ఇంక్లూజివ్ అలయన్స్ (INDIA) కూటమిలో కీలక నేతగా ఉన్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి, ఆయనకు మధ్య దూరం పెరిగింది. పినరయి విజయన్ (Pinarayi Vijayan) సర్కారు తీసుకొచ్చిన ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, రెడ్ టేప్ కోత విధానాలపై కొద్ది రోజుల క్రితం శశిథరూర్ ప్రశంసలు కురిపించారు. అక్కడితో ఆగకుండా కాంగ్రెస్‌కు బద్దశత్రువైన ప్రధాని మోదీని పొగడ్తలతో ముంచెత్తారు. మోదీ అమెరికా పర్యటన, డొనాల్డ్ ట్రంప్‌తో భేటీపై పాజిటివ్ కామెంట్స్ చేశారు. దీంతో శశిథరూర్‌ను కాంగ్రెస్ హైకమాండ్ దూరం పెట్టింది. పార్టీకి తన అవసరం లేకపోతే స్పష్టంగా చెప్పాలని, తన దారి తాను చూసుకుంటానని గత ఫిబ్రవరిలో అధిష్టానాన్ని అడిగారు. ఈ నేపథ్యంలో థరూర్ బీజేపీలో చేరతారని ప్రచారం కూడా ఊపందుకుంది. అయితే తాను పార్టీ మారబోనని అప్పట్లో ఆయన స్పష్టం చేశారు.
చదవండి: ప్రపంచానికి ఇదే సందేశం ఇచ్చాం.. మల్లిఖార్జున ఖర్గే
పతాక శీర్షికలకు మోదీ వ్యాఖ్యలు
తాజాగా థరూర్‌పై ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలు పతాక శీర్షికలకు ఎక్కాయి. శశిథరూర్ భుజాల పైనుంచి ప్రతిపక్ష ఇండియా కూటమిపైకి మోదీ తుపాకీ ఎక్కుపెట్టారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇండియా కూటమిని డిఫెన్స్‌లో పడేసేందుకే మోదీ ఈ వ్యాఖ్యలు చేశారని అంటున్నారు. మరోవైపు కేరళలో పాగా వేసేందుకు కాషాయ పార్టీ ఇప్పటివరకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఈ నేపథ్యంలో మోదీ వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి. మోదీ వ్యాఖ్యలపై ఇండియా కూటమి, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఎలా స్పందిస్తుందో చూడాలి.