IUML
-
‘ఆ రెండు రాష్ట్రాల్లో ఎన్నికల తేదీలు మార్చాలి’
న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘం (ECI) 18వ లోక్‌సభ ఎన్నికల తేదీలను ప్రకటించింది. అయితే కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో పార్లమెంట్ ఎన్నికల తేదీలను మార్చాలని ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (IUML) డిమాండ్ చేస్తోంది. ఈమేరకు ఎలక్షన్ కమిషన్‌ను ఆశ్రయించనున్నట్లు తెలిపింది. కారణం ఇదే.. కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన లోక్‌సభ సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ప్రకారం.. తమిళనాడులో ఏప్రిల్ 19న, కేరళలో ఏప్రిల్ 26న ఎన్నికలు జరగనున్నాయి. ఈ రెండు తేదీలు శుక్రవారం వస్తాయి. దీంతో ఎన్నికల తేదీలను మార్చాలని ఐయూఎంఎల్ డిమాండ్ చేస్తోంది. శుక్రవారం ముస్లింలకు ముఖ్యమైన రోజు కాబట్టి ఓటర్లు, అధికారులు, అభ్యర్థులకు అసౌకర్యం కలగకుండా కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో ఎన్నికల తేదీలను మార్చాలని ఈసీఐని ఆశ్రయించనున్నట్లు యూడీఎఫ్‌లోని ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీకి ప్రధాన మిత్రపక్షమైన ఐయూఎంఎల్ తెలిపింది. ఐయూఎంఎల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పీఎంఏ సలామ్ పీటీఐ వార్తా సంస్థతో మాట్లాడుతూ ప్రార్థనల కోసం మసీదులలో గుమిగూడే ముస్లింలకు శుక్రవారం ముఖ్యమైన రోజు అన్నారు. “శుక్రవారం పోలింగ్ నిర్వహణ ఓటర్లు, అభ్యర్థులు, పోలింగ్ ఏజెంట్లు, ఎన్నికల విధులు కేటాయించిన అధికారులకు అసౌకర్యాన్ని కలిగిస్తుంది. అందుకే ఈసీఐని ఆశ్రయిస్తాం” అని సలామ్ పేర్కొన్నారు. ఐయూఎంఎల్‌తోపాటు ఇతర ముస్లిం సంస్థలు కూడా ఎన్నికల తేదీల మార్పు కోసం ఎలక్షన్ కమిషన్‌ను ఆశ్రయించాలని యోచిస్తున్నట్లు సమాచారం. -
బిడ్డకు జన్మనిచ్చిన కేరళ ట్రాన్స్మన్పై ఎమ్మెల్యే షాకింగ్ వ్యాఖ్యలు
దేశంలోనే తొలిసారిగా బిడ్డకు జన్మనిచ్చిన ట్రాన్స్‌మన్‌గా కేరళ ట్రాన్స్‌జెండర్ జంట నిలిచిన సంగతి తెలిసిందే. ఇది అరుదైన ఘటన అంటూ ఈ విషయం సర్వత్ర చర్చనీయాంశంగా నిలిచింది. ఐతే ఈ ఘటనపై కొడువల్లి ఎమ్మెల్యే, ఇండియన్ యూనియన్ ముస్లీం లీగ్ సీనియర్ నాయకుడు(ఐయూఎంఎల్) ఎంకే మునీర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. దీన్ని అద్భుత ఘటనగా పేర్కొన్నవారంతా మూర్ఖులుగా అభివర్ణించారు. అసలు ఆ జంటకు పాప పుట్టిన విషయాన్ని ఒక్కసారి ఆలోచిస్తే అసలు విషయం మనకే అవగతముతుందన్నారు. దీని వెనుక ఉన్న లాజిక్‌ని కూడా ఆయన విడమరిచి మరీ చెప్పారు. బిడ్డకు జన్మనిచ్చిన ట్రాన్స్‌మన్ నిజానికి ఒక స్త్రీ ఆమె పురుషునిలా మారుదామని వక్షోజాలను కూడా తొలగించుకుంది. అయితే ఆమె గర్భం దాల్చడంతో ఆమెను పురుషుడిగా మార్చడం విరమించుకున్నారు. అంటే గర్భం దాల్చిన వ్యక్తి స్త్రీ అని స్పష్టంగా అర్థమవుతుంది. కానీ అందరూ దీన్ని ఒక అద్భుతంగా ఆహో ఓహో అంటూ ఏవేవో కబుర్లు చెబుతూ.. మూర్ఖుల్లా ప్రవర్తిస్తున్నారని కొడువల్లి ఎమ్మేల్యే ఎంకే మునీర్ అన్నారు. ఈ మేరకు ఆయన ఆదివారం విజ్డమ్ ఇస్లామిక కాన్ఫరెన్స్ నిర్వహించిన కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా, ఫిబ్రవరి 8న ప్రసవించిన ట్రాన్స్‌మ్యాన్ జిహ్హద్ ఆ నవజాత శిశువు బర్త్ సర్టిఫికేట్లో తనను ఆ బిడ్డకు తండ్రిగా నమోదు చేయాలనిఆస్పత్రి వర్గాలను కోరిన నేపథ్యంలోనే ఆ ఎమ్మెల్యే ఈ వ్యాఖ్యలు చేశారు. (చదవండి: ఆమెను చూసి ‘అయ్యో’ అనేసిన ప్రధాని మోదీ) -
ఆభరణాల మోసం కేసులో ఎమ్మెల్యే అరెస్ట్
తిరువనంతపురం : ఆభరణాల పెట్టుబడి మోసం కేసులో ఐయుఎంఎల్ ఎమ్మెల్యే ఎంసి కమరుద్దీన్‌ను శనివారం కేరళ పోలీసు ప్రత్యేక దర్యాప్తు బృందం అరెస్టు చేసింది. కాగా కమరుద్దీన్ కాసర్గోడ్ జిల్లాలోని మంజేశ్వర నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గతంలో కమరుద్దీన్ ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్న ఫ్యాషన్ గోల్డ్ జ్యువెల్లరీ గ్రూప్‌లో పెట్టుబడులు పెట్టాలంటూ చాలామందిని ప్రభావితం చేసినట్లుగా తేలింది. కమరుద్దీన్‌పై ఉన్న నమ్మకంతో వందలాది మంది ఫ్యాషన్ గోల్డ్‌లో పెట్టుబడులు పెట్టారు. అయితే గత జూలైలో వ్యాపారంలో ఆర్థికంగా నష్టంరావడంతో ఫ్యాషన్ గోల్డ్ బోర్డు తిప్పేసింది. కాగా కంపెనీలో పెట్టుబడి పెట్టిన వారికి కనీసం తమ వాటా కూడా రాలేదు. దీంతో మోసపోయామని భావించిన బాధితులు పోలీసులను ఆశ్రయించి ఎమ్మెల్యే కమరుద్దీన్‌తో పాటు సిబ్బందిపై కేసు నమోదు చేశారు. కాగా కమరుద్దీన్‌పై 115 కి పైగా ఫిర్యాదులు వచ్చాయని పోలీసులు వెల్లడించారు. ఫిర్యాదులపై దర్యాప్తు కోసం రాష్ట్ర పోలీసులు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసిందన్నారు. దీనిలో భాగంగానే సెక్షన్ 420 కింద కమరుద్దీన్ అరెస్ట్ చేసిన సిట్ బృందం శనివారం దాదాపు 5గంటల పాటు విచారణ చేసింది. కాగా అరెస్టు తరువాత వైద్య పరీక్షల నిమిత్తం కమరుద్దీన్‌ను ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మీడియాతో మాట్లాడిన ఆయన తన అరెస్ట్ రాజకీయంగా ప్రేరేపించబడిందని అన్నారు. -
మలప్పురంలో ఎల్డీఎఫ్ దూకుడు..
మలప్పురం: కేరళ రాష్ట్రంలోని మలప్పురం లోక్‌సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నిక కౌంటింగ్‌లో కాంగ్రెస్-యూడీఎఫ్ తరపున బరిలోకి దిగిన పి.కె.కన్హాలికుట్టి ముందంజలో ఉన్నారు. కౌంటింగ్ ప్రారంభం అయినప్పటి నుంచే కన్హాలికుట్టి ఆధిక్యం కొనసాగుతోంది. ఆయన 13వేల ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. రెండో స్థానంలో అధికార ఎల్డీఎఫ్ అభ్యర్థి ఎంబీ.ఫైజల్ ఉండగా, బీజేపీ మద్దతు ఇచ్చిన ఎన్.శ్రీప్రకాశ్ మూడోస్థానంలో కొనసాగుతున్నారు. మధ్యాహ్నం 11 గంటలకే రిజల్ట్స్ వెలువడనుంది. కాగా కేంద్ర మాజీమంత్రి ఇ. అహ్మద్ మృతితో ఈ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ నెల 12న జరిగిన ఉప ఎన్నికల్లో 71.33 శాతం పోలింగ్ నమోదు అయిన విషయం తెలిసిందే. మరోవైపు పినరయి విజయన్ అధికారం చేపట్టిన పది నెలల అనంతరం జరిగిన ఈ ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కాగా 2014 ఎన్నికల్లో అహ్మద్ 1.94 లక్షల మెజార్టీతో గెలుపొందారు. -
పంపకాలు ముగిశాయ్!
సాక్షి, చెన్నై : డీఎంకేలో మిత్రులకు నియోజకవర్గాల పంపకాలు ముగిశా యి. గురువారం కాంగ్రెస్ నియోజకవర్గాల ఎంపిక ప్రక్రియ ముగియడంతో శుక్రవారం ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్(ఐయూఎంఎల్), పుదియ తమిళగం, మనిదనేయ మ క్కల్ కట్చిలకు నియోజకవర్గాల్ని కేటాయించేశారు. ఇక కరూర్ జిల్లా అరవకురిచ్చిలో డీఎంకే అభ్యర్థికి కాంగ్రెస్ అధికార ప్రతినిధి జ్యోతి మణి రూపంలో చిక్కులు ఎదురవుతున్నాయి. అలాగే, తిరువణ్ణామలై జిల్లా సెయ్యారును కాంగ్రెస్‌కు అప్పగించడంతో డీఎంకే వర్గాలు వీరంగానికి దిగారు. డీఎంకే నేతృత్వంలోని కూటమిలో సీట్ల పందేరాలు ముగియడంతో నియోజకవర్గాల ఎంపిక బిజీలో డీఎంకే దళపతి ఎంకే స్టాలిన్ నిమగ్నమయ్యారు. సంతృప్తికరంగా ఎంపిక ప్రక్రియ సాగగానే ఒప్పంద పత్రాలపై డీఎంకే అధినేత కరుణానిధి సంకతాలు పెట్టేస్తున్నారు. ఆ దిశగా గురువారం రాత్రి కాంగ్రెస్‌కు కేటాయించిన 41 సీట్లకుగాను నియోజకవర్గాల ఎంపిక ప్రక్రియ సంతృప్తికరంగా ముగిసింది. ఇక, కూటమిలోని పుదియ తమిళగం నేత కృష్ణ స్వామి ఉదయాన్నే డీఎంకే కార్యాలయం అన్నా అరివాలయం చేరుకుని స్టాలిన్ నేతృత్వంలోని కమిటీతో సమాలోచించారు. తమకు కావాల్సిన సీట్లను అప్పగించడంతో సంతృప్తికరంగా బయటకు వచ్చారు. ఆ మేరకు పుదియ తమిళగం తూత్తుకుడి జిల్లా ఒట్టపిడారం, తిరునల్వేలి జిల్లా వాసుదేవ నల్లూరు, విరుదునగర్ జిల్లా శ్రీవిల్లిపుత్తూరు, కరూర్ జిల్లా కృష్ణరాయపురంలలో అభ్యర్థుల్ని దించనున్నట్టు కృష్ణ స్వామి మీడియా ముందు ప్రకటించారు. తాము పోటీ చేసే చిహ్నం గురించి ఒకటి రెండు రోజుల్లో ప్రకటిస్తామన్నారు. తదుపరి ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ నేత ఖాదర్ మొహిద్దీన్ నేతృత్వంలోని బృందం స్టాలిన్‌తో సమాలోచించారు.కరుణానిధి సమక్షంలో ఒప్పంద పత్రాన్ని ఖాదర్ మొహిద్దీన్ అందుకున్నారు. వేలూరు జిల్లా వాణియంబాడి, తిరునల్వేలి జిల్లా కడయనల్లూరు, నాగపట్నం జిల్లా పూంబుహార్, తిరుచ్చి జిల్లా మనప్పారై, విల్లుపురంలలో నిచ్చెన చిహ్నంతో తమ అభ్యర్థులు ఎన్నికల బరిలో దిగుతారని ఖాదర్ మొహిద్దీన్ ప్రకటించారు. ఇక, ఇప్పటికే చిన్న పార్టీలకు ఒక్కో నియోజకవర్గం చొప్పున కేటాయించారు. అలాగే, మనిద నేయమక్కల్ కట్చి(ఎంఎంకే)కు ఐదు సీట్లు అప్పగించి ఉన్నారు. ఎంఎంకే నేత జవహరుల్లా తమకు కావాల్సిన స్థానాల్ని ఎంపిక చేసుకోవడంతో డీఎంకేలో నియోజకవర్గాల పంపకాలు ముగిశాయి. ఆ మేరకు ఎంఎంకే అభ్యర్థులు ఆంబూరు, రామనాథపురం, తొండాముత్తురు, ఉలందూరు పేట, నాగపట్నం నియోజకవర్గాల్లో పోటీ చేయనున్నారు. రేపు మేనిఫెస్టో: సీట్ల పంపకాలు, నియోజకవర్గాల ఎంపిక కసరత్తులు ముగింపు దశకు చేరడంతో ఇక మేనిఫెస్టోను విడుదల చేయడానికి డీఎంకే సిద్ధమైంది. దీనిని ఆదివారం డీఎంకే అధినేత ఎం కరుణానిధి విడుదల చేస్తారని దళపతి స్టాలిన్ ప్రకటించారు. ఆర్కే నగర్ మధ్యాహ్నం రెండున్నర గంటలకు స్టాలిన్ ప్రత్యక్షం అయ్యారు. డిఎంకేకు ఓటు వేయాలని, అన్నాడీఎంకే సర్కారు వైఫల్యాలతో రూపొందించిన కరపత్రాలను ఓటర్లు పంచి పెట్టారు. ఈ నియోజకవర్గం బరిలో అన్నాడీఎంకే అభ్యర్థిగా జయలలిత బరిలోకి దిగనున్నారు. అదే ఆ నియోజకవర్గంలో స్టాలిన్ పర్యటించడం, ఎన్నికల ప్రచారం సాగించడం విశేషం. అరవకురిచ్చిలో చిక్కులు - సెయ్యారులో వీరగం : డీఎంకే కూటమిలో నియోజకవర్గాల ఎంపిక పార్టీల నాయకులకు సంతృప్తిని ఇచ్చినా, ఆయా నియోజకవర్గాల్లోని స్థానిక నేతలకు మింగుడు పడడం లేదు. ఇందులో అరవకుర్చి రూపంలో డీఎంకేకు, సెయ్యారు రూపంలో కాంగ్రెస్‌కు చిక్కులు బయలు దేరాయి. కాంగ్రెస్ అధికార ప్రతినిధి జ్యోతిమణి గత ఎన్నికల్లో కరూర్ నుంచి బరిలోకి దిగి ఓటమి చవి చూశారు. ఈ సారి అరవకురిచ్చిని గురి పెట్టి ఆమె ముందుగానే ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. కొన్ని నెలలుగా అక్కడి ప్రజలకు అందుబాటులో ఉంటూ, సాధక బాధల్ని తెలుసుకుంటూ వాటి పరిష్కారం కోసం అధికారుల చుట్టూ తిరుగుతూ వచ్చారు. అయితే, ఆ స్థానాన్ని కాంగ్రెస్‌కు డీఎంకే కేటాయించక పోవడంతో తాను రెబల్‌గా నైనా బరిలోకి దిగుతానంటూ జ్యోతిమణి ప్రకటించడం గమనార్హం. అరవకురిచ్చి నియోజకవర్గాన్ని డీఎంకే నుంచి తప్పని సరిగా తీసుకోవాలని ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సూచించినా, టీఎన్‌సీసీ అధ్యక్షుడు ఈవీకేఎస్ ఇళంగోవన్ పెడ చెవిన పెట్టారని ఆరోపించారు. తాను మాత్రం ఈ స్థానం నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తానని ఆమె స్పష్టం చేయడం గమనార్హం. ఇక, సెయ్యారును కాంగ్రెస్‌కు అప్పగించడంతో డీఎంకే వర్గాలు అగ్గి మీద బుగ్గిలా మండి పడుతున్నారు. రోడ్డెక్కి ఆందోళనలతో వీరంగాలు సృష్టించారు. సెయ్యారును కాంగ్రెస్ నుంచి వెనక్కు తీసుకోని పక్షంలో, పదవులకు రాజీనామా చే యా ల్సి ఉంటుందని అక్కడి డీఎంకే వర్గాలు హెచ్చరించడం గమనార్హం. అభ్యర్థుల చిట్టా సిద్ధమై ఢిల్లీకి పంపించేందుకు ఈవీకేఎస్ కసరత్తుల్లో ఉన్నట్టు ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.