సాక్షి, చెన్నై : డీఎంకేలో మిత్రులకు నియోజకవర్గాల పంపకాలు ముగిశా యి. గురువారం కాంగ్రెస్ నియోజకవర్గాల ఎంపిక ప్రక్రియ ముగియడంతో శుక్రవారం ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్(ఐయూఎంఎల్), పుదియ తమిళగం, మనిదనేయ మ క్కల్ కట్చిలకు నియోజకవర్గాల్ని కేటాయించేశారు. ఇక కరూర్ జిల్లా అరవకురిచ్చిలో డీఎంకే అభ్యర్థికి కాంగ్రెస్ అధికార ప్రతినిధి జ్యోతి మణి రూపంలో చిక్కులు ఎదురవుతున్నాయి. అలాగే, తిరువణ్ణామలై జిల్లా సెయ్యారును కాంగ్రెస్‌కు అప్పగించడంతో డీఎంకే వర్గాలు వీరంగానికి దిగారు.
డీఎంకే నేతృత్వంలోని కూటమిలో సీట్ల పందేరాలు ముగియడంతో నియోజకవర్గాల ఎంపిక బిజీలో డీఎంకే దళపతి ఎంకే స్టాలిన్ నిమగ్నమయ్యారు. సంతృప్తికరంగా ఎంపిక ప్రక్రియ సాగగానే ఒప్పంద పత్రాలపై డీఎంకే అధినేత కరుణానిధి సంకతాలు పెట్టేస్తున్నారు. ఆ దిశగా గురువారం రాత్రి కాంగ్రెస్‌కు కేటాయించిన 41 సీట్లకుగాను నియోజకవర్గాల ఎంపిక ప్రక్రియ సంతృప్తికరంగా ముగిసింది. ఇక, కూటమిలోని పుదియ తమిళగం నేత కృష్ణ స్వామి ఉదయాన్నే డీఎంకే కార్యాలయం అన్నా అరివాలయం చేరుకుని స్టాలిన్ నేతృత్వంలోని కమిటీతో సమాలోచించారు.
తమకు కావాల్సిన సీట్లను అప్పగించడంతో సంతృప్తికరంగా బయటకు వచ్చారు. ఆ మేరకు పుదియ తమిళగం తూత్తుకుడి జిల్లా ఒట్టపిడారం, తిరునల్వేలి జిల్లా వాసుదేవ నల్లూరు, విరుదునగర్ జిల్లా శ్రీవిల్లిపుత్తూరు, కరూర్ జిల్లా కృష్ణరాయపురంలలో అభ్యర్థుల్ని దించనున్నట్టు కృష్ణ స్వామి మీడియా ముందు ప్రకటించారు. తాము పోటీ చేసే చిహ్నం గురించి ఒకటి రెండు రోజుల్లో ప్రకటిస్తామన్నారు. తదుపరి
ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ నేత ఖాదర్ మొహిద్దీన్ నేతృత్వంలోని బృందం స్టాలిన్‌తో సమాలోచించారు.కరుణానిధి సమక్షంలో ఒప్పంద పత్రాన్ని ఖాదర్ మొహిద్దీన్ అందుకున్నారు.
వేలూరు జిల్లా వాణియంబాడి, తిరునల్వేలి జిల్లా కడయనల్లూరు, నాగపట్నం జిల్లా పూంబుహార్, తిరుచ్చి జిల్లా మనప్పారై, విల్లుపురంలలో నిచ్చెన చిహ్నంతో తమ అభ్యర్థులు ఎన్నికల బరిలో దిగుతారని ఖాదర్ మొహిద్దీన్ ప్రకటించారు. ఇక, ఇప్పటికే చిన్న పార్టీలకు ఒక్కో నియోజకవర్గం చొప్పున కేటాయించారు. అలాగే, మనిద నేయమక్కల్ కట్చి(ఎంఎంకే)కు ఐదు సీట్లు అప్పగించి ఉన్నారు. ఎంఎంకే నేత జవహరుల్లా తమకు కావాల్సిన స్థానాల్ని ఎంపిక చేసుకోవడంతో డీఎంకేలో నియోజకవర్గాల పంపకాలు ముగిశాయి. ఆ మేరకు ఎంఎంకే అభ్యర్థులు ఆంబూరు, రామనాథపురం, తొండాముత్తురు, ఉలందూరు పేట, నాగపట్నం నియోజకవర్గాల్లో పోటీ చేయనున్నారు.
రేపు మేనిఫెస్టో: సీట్ల పంపకాలు, నియోజకవర్గాల ఎంపిక కసరత్తులు ముగింపు దశకు చేరడంతో ఇక మేనిఫెస్టోను విడుదల చేయడానికి డీఎంకే సిద్ధమైంది. దీనిని ఆదివారం డీఎంకే అధినేత ఎం కరుణానిధి విడుదల చేస్తారని దళపతి స్టాలిన్ ప్రకటించారు. ఆర్‌కే నగర్ మధ్యాహ్నం రెండున్నర గంటలకు స్టాలిన్ ప్రత్యక్షం అయ్యారు. డిఎంకేకు ఓటు వేయాలని, అన్నాడీఎంకే సర్కారు వైఫల్యాలతో రూపొందించిన కరపత్రాలను ఓటర్లు పంచి పెట్టారు. ఈ నియోజకవర్గం బరిలో అన్నాడీఎంకే అభ్యర్థిగా జయలలిత బరిలోకి దిగనున్నారు. అదే ఆ నియోజకవర్గంలో స్టాలిన్ పర్యటించడం, ఎన్నికల ప్రచారం సాగించడం విశేషం.
అరవకురిచ్చిలో చిక్కులు - సెయ్యారులో వీరగం : డీఎంకే కూటమిలో నియోజకవర్గాల ఎంపిక పార్టీల నాయకులకు సంతృప్తిని ఇచ్చినా, ఆయా నియోజకవర్గాల్లోని స్థానిక నేతలకు మింగుడు పడడం లేదు. ఇందులో అరవకుర్చి రూపంలో డీఎంకేకు, సెయ్యారు రూపంలో కాంగ్రెస్‌కు చిక్కులు బయలు దేరాయి. కాంగ్రెస్ అధికార ప్రతినిధి జ్యోతిమణి గత ఎన్నికల్లో కరూర్ నుంచి బరిలోకి దిగి ఓటమి చవి చూశారు. ఈ సారి అరవకురిచ్చిని గురి పెట్టి ఆమె ముందుగానే ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. కొన్ని నెలలుగా అక్కడి ప్రజలకు అందుబాటులో ఉంటూ, సాధక బాధల్ని తెలుసుకుంటూ వాటి పరిష్కారం కోసం అధికారుల చుట్టూ తిరుగుతూ వచ్చారు.
అయితే, ఆ స్థానాన్ని కాంగ్రెస్‌కు డీఎంకే కేటాయించక పోవడంతో తాను రెబల్‌గా నైనా బరిలోకి దిగుతానంటూ జ్యోతిమణి ప్రకటించడం గమనార్హం. అరవకురిచ్చి నియోజకవర్గాన్ని డీఎంకే నుంచి తప్పని సరిగా తీసుకోవాలని ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సూచించినా, టీఎన్‌సీసీ అధ్యక్షుడు ఈవీకేఎస్ ఇళంగోవన్ పెడ చెవిన పెట్టారని ఆరోపించారు.
తాను మాత్రం ఈ స్థానం నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తానని ఆమె స్పష్టం చేయడం గమనార్హం. ఇక, సెయ్యారును కాంగ్రెస్‌కు అప్పగించడంతో డీఎంకే వర్గాలు అగ్గి మీద బుగ్గిలా మండి పడుతున్నారు. రోడ్డెక్కి ఆందోళనలతో వీరంగాలు సృష్టించారు. సెయ్యారును కాంగ్రెస్ నుంచి వెనక్కు తీసుకోని పక్షంలో, పదవులకు రాజీనామా చే యా ల్సి ఉంటుందని అక్కడి డీఎంకే వర్గాలు హెచ్చరించడం గమనార్హం. అభ్యర్థుల చిట్టా సిద్ధమై ఢిల్లీకి పంపించేందుకు ఈవీకేఎస్ కసరత్తుల్లో ఉన్నట్టు ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.
పంపకాలు ముగిశాయ్!
Published Sat, Apr 9 2016 1:41 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement
Advertisement