ద్రవిడ నేలపై కమలం వికసించేనా? | Lok sabha elections 2024: BJP special focus on Tamil Nadu in Lok Sabha elections | Sakshi
Sakshi News home page

ద్రవిడ నేలపై కమలం వికసించేనా?

Published Sun, Mar 31 2024 4:49 AM | Last Updated on Sun, Mar 31 2024 4:49 AM

Lok sabha elections 2024: BJP special focus on Tamil Nadu in Lok Sabha elections - Sakshi

తమిళనాడుపై బీజేపీ ఫోకస్‌

అన్నామలై రాకతో ఫుల్‌ జోష్‌

అన్నాడీఎంకే ఓటు బ్యాంకుపై కన్ను

చిన్న పార్టీలతోనే కమలనాథుల పొత్తు

ఆసక్తి రేపుతున్న ముక్కోణపు పోటీ

స్టేట్‌ స్కాన్‌
దక్షిణాదిని పాదాక్రాంతం చేసుకోవాలని ఉవ్విళ్లూరుతున్న బీజేపీ ఈ లోక్‌సభ ఎన్నికల్లో ప్రధా నంగా తమిళనాడుపై స్పెషల్‌ ఫోకస్‌ పెట్టింది. ద్రవిడ పార్టీల ఆవిర్భావంతో దశాబ్దాలుగా జాతీయ పార్టీలకు ఆ రాష్ట్రం కొరకరాని కొయ్యగా మారిపోయింది. డీఎంకే, అన్నాడీఎంకేల్లో ఏదో ఒకదానికి తోక పార్టీగా కొనసాగడం మినహా కాంగ్రెస్, బీజేపీలకు మరో దారి లేని పరిస్థితి! ఈసారి ఈ పరిస్థితిని ఎలాగైనా మార్చాలని బీజేపీ కంకణం కట్టుకుంది. కె.అన్నామలై రాష్ట్ర బీజేపీ పగ్గాలు చేపట్టిన నాటినుంచీ దూకుడుగా వెళ్తున్నారు. రాష్ట్రమంతటా కలియదిరుగుతూ ఇటు జనాన్ని ఆకట్టుకుంటున్నారు. మంత్రుల అవినీతిపై వీడియోలు విడుదల చేస్తూ అటు అధికార డీఎంకేకు వణుకు పుట్టిస్తున్నారు. రాష్ట్రంలోని మొత్తం 39 లోక్‌సభ స్థానాలకూ ఏప్రిల్‌19న తొలి విడతలోనే పోలింగ్‌ జరగనుంది. ఈ నేపథ్యంలో తమిళనాట ఎన్నికల వేడి ఇప్పటికే పరాకాష్టకు చేరింది...

జాతీయ పార్టీలతో కుర్చిలాట
తమిళనాట 50 ఏళ్లుగా ద్రవిడ పార్టీలైన డీఎంకే, అన్నాడీఎంకేలదే హవా. రాష్ట్రంలో కాంగ్రెస్‌కు 1967లో డీఎంకే తొలిసారి ఓటమి రుచి చూపింది. 234 అసెంబ్లీ స్థానాలకు గాను ఏకంగా డీఎంకే 179 చోట్ల గెలవగా కాంగ్రెస్‌ 51 స్థానాలకు పరిమితమైంది. నాటినుంచి నేటిదాకా రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి రాలేకపోయింది! కరుణానిధితో విభేదాలతో 1972లో ఎంజీ రామచంద్రన్‌ డీఎంకేను చీల్చి అన్నాడీఎంకేను ఏర్పాటు చేశారు. నాటినుంచీ వాటి మధ్యే ప్రధాన పోరు సాగుతూ వస్తోంది.

జాతీయ రాజకీయాల్లో సంకీర్ణ యుగం ఆవిర్భావంతో 1989 నుంచి రెండు దశాబ్దాల పాటు కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటులో డీఎంకే, అన్నాడీఎంకే కీలక పాత్ర పోషించాయి. ఆ క్రమంలో రాష్ట్రంలోనూ కాంగ్రెస్, బీజేపీలతో మార్చి మార్చి పొత్తు పెట్టుకుంటూ వస్తున్నాయి. డీఎంకే 2004 దాకా కాంగ్రెస్‌కు బద్ధ విరోధిగా కొనసాగింది. అన్నాడీఎంకే కేంద్రంలో వాజ్‌పేయి ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించడంతో 1999లో బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమిలో చేరింది. కానీ 2004లో అన్నాడీఎంకే మళ్లీ ఎన్డీఏ గూటికి చేరడంతో డీఎంకే తన వైఖరి మార్చుకుని కాంగ్రెస్‌తో చేతులు కలిపింది.

నాటినుంచీ 2014లో మినహాయిస్తే వాటి బంధం అన్ని ఎన్నికల్లోనూ కొనసాగుతూ వస్తోంది. ఇక అన్నాడీఎంకే తాను తొలిసారి ఎన్నికల బరిలో 1977లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుంది. తర్వాత 1984 నుంచి 1991 ఎన్నికల దాకా వాటి బంధం సాగింది. 1998లో తొలిసారి బీజేపీతో చేతులు కలిపినా ఏడాదికే మళ్లీ కాంగ్రెస్‌ గూటికి చేరింది. 2004లో మళ్లీ బీజేపీతో జట్టు కట్టింది. అప్పటినుంచీ కాంగ్రెస్‌ను దూరం పెట్టింది. 2004 లోక్‌సభ ఎన్నికల్లో ఘోర పరాజయం నేపథ్యంలో 2009, 2014 ఎన్నికల్లో బీజేపీతో బంధం తెంచుకుంది. 2019లో మళ్లీ ఎన్డీఏలో చేరినా ఈసారి మాత్రం ఒంటరిగానే పోటీ చేస్తోంది. చిన్న పార్టీలైన పీఎంకే, ఎండీఎంకే కూడా పరిస్థితిని బట్టి డీఎంకే, అన్నాడీఎంకేలతో పొత్తు పెట్టుకుంటూ
వస్తున్నాయి.

పొత్తులు ఇలా...
డీఎంకే ఈసారి కూడా చిరకాల మిత్రులు కాంగ్రెస్, వామపక్షాలతో పొత్తు పెట్టుకోగా అన్నాడీఎంకే మాత్రం బీజేపీతో దూరం పాటిస్తోంది. దివంగత నటుడు విజయ్‌కాంత్‌కు చెందిన డీఎండీకేతో పొత్తు పెట్టుకుంది. ఇక బీజేపీ ఈసారి పీఎంకే, ఏఎంఎంకే, టీఎంసీ (ఎం) వంటి చిన్న పార్టీలతో జట్టు కట్టింది. 1999లో రాష్ట్రంలో అత్యధికంగా 4 లోక్‌సభ స్థానాల్లో నెగ్గిన బీజేపీ ఈసారి ఆ రికార్డును అధిగమించాలని పట్టుదలతో ఉంది. పోలింగ్‌ తేదీ సమీపిస్తుండటంతో ప్రధాని నరేంద్ర మోదీ తమిళనాట పర్యటనలతో హోరెత్తిస్తున్నారు. ఈ మధ్యకాలంలోనే రాష్ట్రానికి ఆయన ఏకంగా ఆరుసార్లు వచ్చారు.

ఎవరి సర్వేలు ఏమంటున్నాయి...
సీఎన్‌ఎన్‌–న్యూస్‌ 18 సర్వే ఈసారి ఎన్డీఏకు రాష్ట్రంలో 5 సీట్ల దాకా వస్తాయని పేర్కొనగా ఇండియాటుడే సర్వే మాత్రం మొత్తం 39 సీట్లనూ విపక్ష ఇండియా కూటమి క్లీన్‌స్వీప్‌ చేస్తుందని జోస్యం చెప్పింది.

ఎవరెన్ని సీట్లలో...
తమిళనాట ఎన్డీఏ, ఇండియా, అన్నాడీఎంకే కూటముల మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. ఇండియా కూటమిలో డీఎంకే 22 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేస్తోంది. కాంగ్రెస్‌కు 9, వామపక్షాలకు 4, ఇతర పార్టీలకు మరో 4 స్థానాలు కేటాయించింది. ఎన్డీఏ కూటమి విషయానికొస్తే బీజేపీ 20 చోట్ల, పీఎంకే 10, టీఎంసీ(ఎం) 3, ఏఎంఎంకే 2 చోట్ల, ఇతర పార్టీలు మూడింట బరిలో ఉన్నాయి. మరోచోట ఎన్డీఏ మద్దతుతో ఒ.పనీర్‌సెల్వం స్వతంత్రునిగా బరిలో దిగుతున్నారు. ఇక అన్నాడీఎంకే 32 స్థానాల్లో పోటీ చేస్తోంది. డీఎండీకేకు 5, ఇతరులకు 2 సీట్లు కేటాయించింది.

యువ ఓటర్లపైనే బీజేపీ ఆశలు...
తమిళనాట బీజేపీ ప్రధానంగా యువ ఓటర్లపైనే ఆశలు పెట్టుకుంది. ద్రవిడ పార్టీలతో విసిగిపోయారని, మార్పు కోసం చూస్తున్నారని నమ్ముతోంది. బీజేపీ రాష్ట్ర సారథి అన్నామలైకి వారిలో ఆదరణ నానాటికీ పెరుగుతోందని పరిశీలకులు చెబుతున్నారు. దీనికితోడు ద్రవిడ పార్టీల నేతలపైనా బీజేపీ కన్నేసింది. ఇప్పటికే అన్నాడీఎంకేకు చెందిన ఒక మాజీ ఎంపీ, 17 మంది మాజీ ఎమ్మెల్యేలు ఇటీవలే బీజేపీలో చేరారు. దక్షిణ తమిళనాట పదేళ్లుగా తమకు గట్టి పునాదే ఏర్పడిందని పార్టీ భావిస్తోంది.

అక్కడి కొంగు ప్రాంతంలో పార్టీకి సంస్థాగతంగా చెప్పుకోదగ్గ బలమే ఉంది. దీనికితోడు కోయంబత్తూరు నుంచి రాష్ట్ర పార్టీ సారథి అన్నామలై పోటీ చేస్తున్నారు. పీఎంకేతో పొత్తు ద్వారా ఉత్తర తమిళనాడులో తన బలహీనతను అధిగమిస్తానని బీజేపీ భావిస్తోంది. 2014లోనూ ఇలాగే చిన్న పార్టీలతో జట్టు కట్టి బీజేపీ ఏకంగా 19 శాతం ఓట్లు రాబట్టడమే గాక ఒక లోక్‌సభ స్థానాన్ని గెలుచుకుందని ఆ పార్టీ అభిమానులు గుర్తు చేస్తున్నారు. కాకపోతే అప్పటి భాగస్వాముల్లో డీఎండీకే, ఎండీఎంకే ఇప్పుడు ఎన్డీఏతో లేవు. పైగా ముక్కోణపు పోటీలో విపక్షాల ఓట్లు చీలి ఇండియా కూటమికే లబ్ధి చేకూరవచ్చన్న విశ్లేషణలున్నాయి.

ఇక 2019 లోక్‌సభ ఎన్నికల్లో ప్రస్తుత ఇండియా కూటమి ఏకంగా 53 శాతం ఓట్లు ఒడిసిపట్టింది! ఎన్డీఏ కేవలం 10 శాతంతో సరిపెట్టుకోగా అన్నాడీఎంకే కూటమికి 21 శాతం వచ్చాయి. అయితే ఈసారి ఏఎంఎంకే వంటి భాగస్వాములు అన్నాడీఎంకే ఓటు శాతానికి గండి కొట్టి తమవైపు మళ్లిస్తాయని బీజేపీ ఆశ పెట్టుకుంది. అన్నాడీఎంకే ఓట్లను ఏకంగా మూడొంతల దాకా ఒడిసిపట్టడంతో పాటు మోదీ చరిష్మా, స్టాలిన్‌ సర్కారుపై వ్యతిరేకత సాయంతో ఇండియా కూటమి ఓట్లలోనూ 10 శాతం దాకా ఎన్డీఏ కొల్లగొట్టగలిగితే 7 సీట్ల దాకా నెగ్గవచ్చని విశ్లేషకుల అంచనా. కాకపోతే అన్నాడీఎంకే ఓటు శాతానికి అంతగా గండి పెట్టడం బీజేపీకి పెనుసవాలే!

ప్రచారంలో సినీ తళుకులు..
బీజేపీ తరఫున సినీ నటులు ఖుష్బూ, ఇటీవలే తన పార్టీని విలీనం చేసిన శరత్‌ కుమార్, సెంథిల్‌ ప్రచారంలో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నారు. డీఎంకేకు కమల్‌హాసన్, అన్నాడీఎంకేకు గౌతమి, గాయత్రీ రఘురాం తదితర సినీ స్టార్లు ప్రచారం చేయనున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement