Dravida country
-
ద్రవిడ నేలపై కమలం వికసించేనా?
స్టేట్ స్కాన్ దక్షిణాదిని పాదాక్రాంతం చేసుకోవాలని ఉవ్విళ్లూరుతున్న బీజేపీ ఈ లోక్‌సభ ఎన్నికల్లో ప్రధా నంగా తమిళనాడుపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. ద్రవిడ పార్టీల ఆవిర్భావంతో దశాబ్దాలుగా జాతీయ పార్టీలకు ఆ రాష్ట్రం కొరకరాని కొయ్యగా మారిపోయింది. డీఎంకే, అన్నాడీఎంకేల్లో ఏదో ఒకదానికి తోక పార్టీగా కొనసాగడం మినహా కాంగ్రెస్, బీజేపీలకు మరో దారి లేని పరిస్థితి! ఈసారి ఈ పరిస్థితిని ఎలాగైనా మార్చాలని బీజేపీ కంకణం కట్టుకుంది. కె.అన్నామలై రాష్ట్ర బీజేపీ పగ్గాలు చేపట్టిన నాటినుంచీ దూకుడుగా వెళ్తున్నారు. రాష్ట్రమంతటా కలియదిరుగుతూ ఇటు జనాన్ని ఆకట్టుకుంటున్నారు. మంత్రుల అవినీతిపై వీడియోలు విడుదల చేస్తూ అటు అధికార డీఎంకేకు వణుకు పుట్టిస్తున్నారు. రాష్ట్రంలోని మొత్తం 39 లోక్‌సభ స్థానాలకూ ఏప్రిల్19న తొలి విడతలోనే పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో తమిళనాట ఎన్నికల వేడి ఇప్పటికే పరాకాష్టకు చేరింది... జాతీయ పార్టీలతో కుర్చిలాట తమిళనాట 50 ఏళ్లుగా ద్రవిడ పార్టీలైన డీఎంకే, అన్నాడీఎంకేలదే హవా. రాష్ట్రంలో కాంగ్రెస్‌కు 1967లో డీఎంకే తొలిసారి ఓటమి రుచి చూపింది. 234 అసెంబ్లీ స్థానాలకు గాను ఏకంగా డీఎంకే 179 చోట్ల గెలవగా కాంగ్రెస్ 51 స్థానాలకు పరిమితమైంది. నాటినుంచి నేటిదాకా రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాలేకపోయింది! కరుణానిధితో విభేదాలతో 1972లో ఎంజీ రామచంద్రన్ డీఎంకేను చీల్చి అన్నాడీఎంకేను ఏర్పాటు చేశారు. నాటినుంచీ వాటి మధ్యే ప్రధాన పోరు సాగుతూ వస్తోంది. జాతీయ రాజకీయాల్లో సంకీర్ణ యుగం ఆవిర్భావంతో 1989 నుంచి రెండు దశాబ్దాల పాటు కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటులో డీఎంకే, అన్నాడీఎంకే కీలక పాత్ర పోషించాయి. ఆ క్రమంలో రాష్ట్రంలోనూ కాంగ్రెస్, బీజేపీలతో మార్చి మార్చి పొత్తు పెట్టుకుంటూ వస్తున్నాయి. డీఎంకే 2004 దాకా కాంగ్రెస్‌కు బద్ధ విరోధిగా కొనసాగింది. అన్నాడీఎంకే కేంద్రంలో వాజ్‌పేయి ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించడంతో 1999లో బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమిలో చేరింది. కానీ 2004లో అన్నాడీఎంకే మళ్లీ ఎన్డీఏ గూటికి చేరడంతో డీఎంకే తన వైఖరి మార్చుకుని కాంగ్రెస్‌తో చేతులు కలిపింది. నాటినుంచీ 2014లో మినహాయిస్తే వాటి బంధం అన్ని ఎన్నికల్లోనూ కొనసాగుతూ వస్తోంది. ఇక అన్నాడీఎంకే తాను తొలిసారి ఎన్నికల బరిలో 1977లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుంది. తర్వాత 1984 నుంచి 1991 ఎన్నికల దాకా వాటి బంధం సాగింది. 1998లో తొలిసారి బీజేపీతో చేతులు కలిపినా ఏడాదికే మళ్లీ కాంగ్రెస్ గూటికి చేరింది. 2004లో మళ్లీ బీజేపీతో జట్టు కట్టింది. అప్పటినుంచీ కాంగ్రెస్‌ను దూరం పెట్టింది. 2004 లోక్‌సభ ఎన్నికల్లో ఘోర పరాజయం నేపథ్యంలో 2009, 2014 ఎన్నికల్లో బీజేపీతో బంధం తెంచుకుంది. 2019లో మళ్లీ ఎన్డీఏలో చేరినా ఈసారి మాత్రం ఒంటరిగానే పోటీ చేస్తోంది. చిన్న పార్టీలైన పీఎంకే, ఎండీఎంకే కూడా పరిస్థితిని బట్టి డీఎంకే, అన్నాడీఎంకేలతో పొత్తు పెట్టుకుంటూ వస్తున్నాయి. పొత్తులు ఇలా... డీఎంకే ఈసారి కూడా చిరకాల మిత్రులు కాంగ్రెస్, వామపక్షాలతో పొత్తు పెట్టుకోగా అన్నాడీఎంకే మాత్రం బీజేపీతో దూరం పాటిస్తోంది. దివంగత నటుడు విజయ్‌కాంత్‌కు చెందిన డీఎండీకేతో పొత్తు పెట్టుకుంది. ఇక బీజేపీ ఈసారి పీఎంకే, ఏఎంఎంకే, టీఎంసీ (ఎం) వంటి చిన్న పార్టీలతో జట్టు కట్టింది. 1999లో రాష్ట్రంలో అత్యధికంగా 4 లోక్‌సభ స్థానాల్లో నెగ్గిన బీజేపీ ఈసారి ఆ రికార్డును అధిగమించాలని పట్టుదలతో ఉంది. పోలింగ్ తేదీ సమీపిస్తుండటంతో ప్రధాని నరేంద్ర మోదీ తమిళనాట పర్యటనలతో హోరెత్తిస్తున్నారు. ఈ మధ్యకాలంలోనే రాష్ట్రానికి ఆయన ఏకంగా ఆరుసార్లు వచ్చారు. ఎవరి సర్వేలు ఏమంటున్నాయి... సీఎన్ఎన్–న్యూస్ 18 సర్వే ఈసారి ఎన్డీఏకు రాష్ట్రంలో 5 సీట్ల దాకా వస్తాయని పేర్కొనగా ఇండియాటుడే సర్వే మాత్రం మొత్తం 39 సీట్లనూ విపక్ష ఇండియా కూటమి క్లీన్‌స్వీప్ చేస్తుందని జోస్యం చెప్పింది. ఎవరెన్ని సీట్లలో... తమిళనాట ఎన్డీఏ, ఇండియా, అన్నాడీఎంకే కూటముల మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. ఇండియా కూటమిలో డీఎంకే 22 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేస్తోంది. కాంగ్రెస్‌కు 9, వామపక్షాలకు 4, ఇతర పార్టీలకు మరో 4 స్థానాలు కేటాయించింది. ఎన్డీఏ కూటమి విషయానికొస్తే బీజేపీ 20 చోట్ల, పీఎంకే 10, టీఎంసీ(ఎం) 3, ఏఎంఎంకే 2 చోట్ల, ఇతర పార్టీలు మూడింట బరిలో ఉన్నాయి. మరోచోట ఎన్డీఏ మద్దతుతో ఒ.పనీర్‌సెల్వం స్వతంత్రునిగా బరిలో దిగుతున్నారు. ఇక అన్నాడీఎంకే 32 స్థానాల్లో పోటీ చేస్తోంది. డీఎండీకేకు 5, ఇతరులకు 2 సీట్లు కేటాయించింది. యువ ఓటర్లపైనే బీజేపీ ఆశలు... తమిళనాట బీజేపీ ప్రధానంగా యువ ఓటర్లపైనే ఆశలు పెట్టుకుంది. ద్రవిడ పార్టీలతో విసిగిపోయారని, మార్పు కోసం చూస్తున్నారని నమ్ముతోంది. బీజేపీ రాష్ట్ర సారథి అన్నామలైకి వారిలో ఆదరణ నానాటికీ పెరుగుతోందని పరిశీలకులు చెబుతున్నారు. దీనికితోడు ద్రవిడ పార్టీల నేతలపైనా బీజేపీ కన్నేసింది. ఇప్పటికే అన్నాడీఎంకేకు చెందిన ఒక మాజీ ఎంపీ, 17 మంది మాజీ ఎమ్మెల్యేలు ఇటీవలే బీజేపీలో చేరారు. దక్షిణ తమిళనాట పదేళ్లుగా తమకు గట్టి పునాదే ఏర్పడిందని పార్టీ భావిస్తోంది. అక్కడి కొంగు ప్రాంతంలో పార్టీకి సంస్థాగతంగా చెప్పుకోదగ్గ బలమే ఉంది. దీనికితోడు కోయంబత్తూరు నుంచి రాష్ట్ర పార్టీ సారథి అన్నామలై పోటీ చేస్తున్నారు. పీఎంకేతో పొత్తు ద్వారా ఉత్తర తమిళనాడులో తన బలహీనతను అధిగమిస్తానని బీజేపీ భావిస్తోంది. 2014లోనూ ఇలాగే చిన్న పార్టీలతో జట్టు కట్టి బీజేపీ ఏకంగా 19 శాతం ఓట్లు రాబట్టడమే గాక ఒక లోక్‌సభ స్థానాన్ని గెలుచుకుందని ఆ పార్టీ అభిమానులు గుర్తు చేస్తున్నారు. కాకపోతే అప్పటి భాగస్వాముల్లో డీఎండీకే, ఎండీఎంకే ఇప్పుడు ఎన్డీఏతో లేవు. పైగా ముక్కోణపు పోటీలో విపక్షాల ఓట్లు చీలి ఇండియా కూటమికే లబ్ధి చేకూరవచ్చన్న విశ్లేషణలున్నాయి. ఇక 2019 లోక్‌సభ ఎన్నికల్లో ప్రస్తుత ఇండియా కూటమి ఏకంగా 53 శాతం ఓట్లు ఒడిసిపట్టింది! ఎన్డీఏ కేవలం 10 శాతంతో సరిపెట్టుకోగా అన్నాడీఎంకే కూటమికి 21 శాతం వచ్చాయి. అయితే ఈసారి ఏఎంఎంకే వంటి భాగస్వాములు అన్నాడీఎంకే ఓటు శాతానికి గండి కొట్టి తమవైపు మళ్లిస్తాయని బీజేపీ ఆశ పెట్టుకుంది. అన్నాడీఎంకే ఓట్లను ఏకంగా మూడొంతల దాకా ఒడిసిపట్టడంతో పాటు మోదీ చరిష్మా, స్టాలిన్ సర్కారుపై వ్యతిరేకత సాయంతో ఇండియా కూటమి ఓట్లలోనూ 10 శాతం దాకా ఎన్డీఏ కొల్లగొట్టగలిగితే 7 సీట్ల దాకా నెగ్గవచ్చని విశ్లేషకుల అంచనా. కాకపోతే అన్నాడీఎంకే ఓటు శాతానికి అంతగా గండి పెట్టడం బీజేపీకి పెనుసవాలే! ప్రచారంలో సినీ తళుకులు.. బీజేపీ తరఫున సినీ నటులు ఖుష్బూ, ఇటీవలే తన పార్టీని విలీనం చేసిన శరత్ కుమార్, సెంథిల్ ప్రచారంలో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నారు. డీఎంకేకు కమల్‌హాసన్, అన్నాడీఎంకేకు గౌతమి, గాయత్రీ రఘురాం తదితర సినీ స్టార్లు ప్రచారం చేయనున్నారు. -
భారత్.. నాదీ కాదు, మోదీ-షాలదీ కాదు: ఒవైసీ సంచలన వ్యాఖ్యలు
భారత దేశం గురించి ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్.. నాది(ఒవైసీ) కాదు, మోదీ-షాలదీ కాదు.. అంతుకుమించి థాక్రేలది అసలే కాదని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నిజానికి భారత దేశం ద్రవిడియన్లు, ఆదివాసీలది అని కామెంట్స్ చేశారు. వివరాల ప్రకారం.. ఒవైసీ శనివారం మహారాష్ట్రలోని బీవండిలో జరిగిన ఓ సభలో మాట్లాడుతూ.. కేంద్రంలో ఉన్న బీజేపీ, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)పై విరుచుకుపడ్డారు. భారత్.. ద్రవిడియన్లు, ఆదివాసీలది మాత్రమేనని అభిప్రాయపడ్డారు. నాదీ కాదు, మోదీ-షాలదీ, థాక్రేలది అసలే కాదని అన్నారు. ఆఫ్రికా, మధ్య ఆసియా, ఇరాన్, తూర్పు ఆసియా నుంచి వలస వచ్చిన వారితోనే భారత్ ఏర్పడిందని వ్యాఖ్యానించారు. దేశంలోకి మొగల్స్ వచ్చి వెళ్లిన తర్వాతే ఆర్ఎస్ఎస్, బీజేపీలు వెలుగులోకి వచ్చాయని తెలిపారు. ఈ క్రమంలోనే ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్‌పై మండిపడ్డారు. శివసేన ఎంపీ సంజయ్ రౌత్‌కు చేసినట్లుగా నవాబ్ మాలిక్ అరెస్ట్‌పై ప్రధాని మోదీని ఎందుకు కలవలేదని ప్రశ్నించారు. బీజేపీ, ఎన్సీపీ, కాంగ్రెస్, ఎస్పీ పార్టీలు లౌకిక పార్టీలు అని వ్యాఖ్యలు చేశారు. అయితే, సంజయ్ రౌత్‌పై కేంద్ర దర్యాప్తు సంస్థలు(సీబీఐ, ఈడీ) ఎలాంటి చర్య తీసుకోకుండా శరద్ పవార్, ప్రధాని మోదీని కలిశారని తెలిపారు. ఇదే సమయంలో ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్ అరెస్ట్ అయితే ఆయనకు ఎందుకు సాయం చేయలేదని విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలో నవాబ్ మాలిక్.. ముస్లిం కావడం వల్లేనా..? అని ప్రశ్నించారు. దీంతో ఆయన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. Bhiwandi, Maharashtra | India is neither mine, nor Thackeray's, nor Modi-Shah's. If India belongs to anyone, it's Dravidians & Adivasis but BJP-RSS only after Mughals. India was formed after people migrated from Africa, Iran, Central Asia, East Asia:AIMIM's Asaduddin Owaisi(28.5) pic.twitter.com/NmpxCYo2oC — ANI (@ANI) May 28, 2022 ఇది కూడా చదవండి: యూపీ సీఎం యోగి సంచలన నిర్ణయం -
రజనీతో జట్టు కట్టను: కమల్
సాక్షి ప్రతినిధి, చెన్నై: ఆధ్యాత్మిక భావాలు, సిద్ధాంతాలతో నటుడు రజనీకాంత్ ప్రారంభించబోయే రాజకీయ పార్టీతో తాను కలసి పనిచేసే అవకాశం లేదని నటుడు కమల్ హసన్ చెప్పారు. దివంగత రాష్ట్రపతి కలాం ఈ దేశం గురించి ఎన్నో కలలు కనేవారని, తనకూ అలాంటి కలలే ఉన్నాయని చెప్పారు. గతంలో ఒకసారి విమానంలో కలాంతో కలసి ప్రయాణం చేసే అవకాశం వచ్చిందని, ఆ సందర్భంగా అనేక అంశాలపై తాము మాట్లాడుకున్నామని తెలిపారు. ద్రవిడ సిద్ధాంతం తమిళనాడుకు మాత్రమే పరిమితం కాదని, దేశవ్యాప్తంగా వ్యాపించి ఉందని వ్యాఖ్యానించారు. కమల్ తన రాజకీయ ప్రస్థానాన్ని రామేశ్వరంలోని దివంగత కలాం ఇంటి నుంచి ప్రారంభించాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. -
రజనీ ఉద్దేశం అదే అయితే.. రాజకీయ భవిష్యత్తే ఉండదు
సాక్షి, చెన్నై : రజనీకాంత్ పొలిటికల్ అరంగ్రేటం ఒక ఎత్తయితే.. డీఎంకే పార్టీ కురు వృద్ధుడు కరుణానిధితో భేటీ కావటం అరవ రాజకీయాలను ఆసక్తికరంగా మార్చింది. గతంలో జయలలితకు వ్యతిరేకంగా.. డీఎంకేకు మద్దతు ఇచ్చి పెద్ద తప్పు చేశానంటూ రజనీ వ్యాఖ్యలు చేయటం తెలిసిందే. అయితే నిన్న సాయంత్రం హడావుడిగా కరుణ నివాసానికి వెళ్లిన రజనీ ఆయన ఆశీర్వాదం తీసుకున్నాడు. దీనిపై మీడియాలో రకరకాల కథనాలు వెలువడుతుండగా.. కరుణానిధి తనయుడు, డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ స్పందించారు. ‘‘ పెరియార్, అన్నాదురై, కరుణానిధి లాంటి నేతలతో ద్రవిడ భూమి తరించింది. కానీ, ద్రవిడ సిద్ధాంతాన్ని నిర్మూలించేందుకే రజనీ రాజకీయాల్లో వచ్చాడంటూ ఆయన అనుచరులు ప్రచారం చేస్తున్నారు. ఒకవేళ అదే నిజమైతే మాత్రం ఆయన అడ్డుకునేందుకు ముందు మేమే ఉంటాం. ఆయన రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారటం ఖాయం. గతంలో అలా ప్రయత్నించి విఫలమైనవారు చాలా మందే ఉన్నారు. కానీ, తనది ఆధ్యాత్మిక పార్టీ అని రజనీకాంత్ చెబుతున్నారు కాబట్టి దాని గురించి ఇప్పుడే ఏం స్పందించలేం. పార్టీ ప్రారంభించే ముందు కేవలం సంప్రదాయ రీతిలో మాత్రమే కరుణను కలిశారు.. వేరే ఉద్దేశం లేదు. ఇంతకుముందు విజయ్‌కాంత్ కూడా పార్టీ ప్రారంభించే సమయంలో ఇలానే కరుణను కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు’’ అని స్టాలిన్ పేర్కొన్నారు. కాగా, కరుణానిధిని కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయటంతోపాటు ఆరోగ్యం గురించి రజనీ వాకబు చేశారు. ఆపై తన రాజకీయ ఎంట్రీ గురించి ఆయనతో కాసేపు చర్చించినట్లు రజనీ సన్నిహితులు తెలిపారు. ఇదిలా ఉంటే రజనీ ఇంతకు ముందులా ట్విట్టర్లో అభిప్రాయాలను తెలియజేయటం మానుకుని.. ప్రజల్లోకి రావాలంటూ డీఎండీకే పార్టీ అధ్యక్షుడు విజయ్‌కాంత్ సతీమణి ప్రేమలత చెబుతున్నారు. -
ప్రకృతి చిత్రం భళా
ప్రకృతి పలకరించిన ఆమె కుంచె కాన్వాస్‌పై కడలి అలజడిని చూపిస్తుంది.. సెలయేళ్లను పారిస్తుంది.. వసంత గాలికి చిగురించిన వనదేవతను సాక్షాత్కరిస్తుంది. ద్రవిడ దేశంలో వికసించిన ఆ కళ.. తెలుగింటి కోడలిగా అడుగిడిన తర్వాత మరింత రమణీయంగా పల్లవించింది. ఈ తమిళ పడుచు వేసిన చిత్రమాలిక తొలి ప్రదర్శన ఐలమ్మ ఆర్ట్ గ్యాలరీలో కొలువుదీరింది. తన కళకు హైదరాబాదీల నుంచి మంచి రె స్పాన్స్ వస్తోందంటున్న యువ ఆర్టిస్ట్ గాయత్రి వెంకటరమణ్ ‘సిటీప్లస్’తో ముచ్చటించారు. మాది చెన్నై దగ్గర ఓ పల్లెటూరు. పచ్చని పంట పొలాలు, ఆహ్లాదకరమైన వాతావరణం, కల్మషం లేని పల్లె మనుషులు అందంగా ఉండేది. మా పేరెంట్స్ నన్ను ఇంజనీర్‌గా చూడాలనుకున్నారు. చిన్నప్పటి నుంచే నాకు పెయింటింగ్స్ అంటే ఆసక్తి. స్కూల్‌డేస్‌లోనే పెయింటింగ్ పోటీల్లో ఉత్సాహంగా పాల్గొనేదాన్ని. బహుమతులు కూడా గెలుచుకునేదాన్ని. ఆ విజయాలే నాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచాయి. ఇటు చిత్రకళపై పట్టు సాధిస్తూనే.. అటు ఇంజనీరింగ్ పూర్తి చేశాను. తర్వాత 5జీ సాఫ్ట్వేర్ కంపెనీలో టెకీగా రెండేళ్లు పనిచేశాను. కళనే వారధి.. 2010లో రాజమండ్రికి చెందిన వెంకటరమణతో పెళ్లయింది. చెన్నైలో ఉద్యోగం మానేశాను. కొన్ని రోజులకు మావారికి హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ రావడంతో సిటీకి షిఫ్ట్ అయ్యాం. పెళ్లయినా నా ఆర్ట్‌కు నేను దూరం కాలేదు. ఆక్రిలిక్, వాటర్ కలర్, ఆయిల్ పెయింటింగ్స్ ఎక్కువగా వేస్తుంటాను. గృహిణిగా నా బాధ్యతలు నిర్వర్తిస్తూనే.. చిన్నప్పటి నుంచి నేనెరిగిన ప్రకృతిని పెయింటింగ్స్ వేస్తున్నా. పచ్చని ప్రకృతిపై అవేర్నెస్ తీసుకురావడానికి నా కళను ఒక వారధిగా మార్చుకునే ప్రయత్నంలో ఉన్నా. అందుకే నేను గీసిన పెయింటింగ్స్‌తో ప్రదర్శన ఏర్పాటు చేశాను. మరిన్ని థీమ్స్‌తో.. నగరీకరణ వల్ల వాతావరణంలో కాలుష్యం పెరిగి ప్రకృతి సంపద కనుమరుగవుతోంది. వాతావరణ సమతుల్యత దెబ్బతినడంతో జనాలకు అనారోగ్య సమస్యలు కూడా పెరుగుతున్నాయి. అందుకే ప్రకృతిని పరిరక్షిస్తే మనకే మేలనే నా పెయింటింగ్స్ ద్వారా సందేశాన్ని అందిస్తున్నాను. ఇక వినాయకుడంటే అమితమైన భక్తి. అందుకే వివిధ భంగిమల్లో గణేశుడి చిత్రాలు కూడా గీస్తున్నాను. నా తొలి ఆర్ట్ ఎగ్జిబిషన్‌కు హైదరాబాద్ వేదిక కావడం ఆనందంగా ఉంది. రానున్న రోజుల్లో పలు రకాల థీమ్స్‌పై చిత్రాలు గీసి ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తాను.