ప్రకృతి చిత్రం భళా
ప్రకృతి పలకరించిన ఆమె కుంచె కాన్వాస్‌పై కడలి అలజడిని చూపిస్తుంది.. సెలయేళ్లను పారిస్తుంది.. వసంత గాలికి చిగురించిన వనదేవతను సాక్షాత్కరిస్తుంది. ద్రవిడ దేశంలో వికసించిన ఆ కళ.. తెలుగింటి కోడలిగా అడుగిడిన తర్వాత మరింత రమణీయంగా పల్లవించింది. ఈ తమిళ పడుచు వేసిన చిత్రమాలిక తొలి ప్రదర్శన ఐలమ్మ ఆర్ట్ గ్యాలరీలో కొలువుదీరింది. తన కళకు హైదరాబాదీల నుంచి మంచి రె స్పాన్స్ వస్తోందంటున్న యువ ఆర్టిస్ట్ గాయత్రి వెంకటరమణ్ ‘సిటీప్లస్’తో ముచ్చటించారు.
మాది చెన్నై దగ్గర ఓ పల్లెటూరు. పచ్చని పంట పొలాలు, ఆహ్లాదకరమైన వాతావరణం, కల్మషం లేని పల్లె మనుషులు అందంగా ఉండేది. మా పేరెంట్స్ నన్ను ఇంజనీర్‌గా చూడాలనుకున్నారు. చిన్నప్పటి నుంచే నాకు పెయింటింగ్స్ అంటే ఆసక్తి. స్కూల్‌డేస్‌లోనే పెయింటింగ్ పోటీల్లో ఉత్సాహంగా పాల్గొనేదాన్ని. బహుమతులు కూడా గెలుచుకునేదాన్ని. ఆ విజయాలే నాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచాయి. ఇటు చిత్రకళపై పట్టు సాధిస్తూనే.. అటు ఇంజనీరింగ్ పూర్తి చేశాను. తర్వాత 5జీ సాఫ్ట్‌వేర్ కంపెనీలో టెకీగా రెండేళ్లు పనిచేశాను.
కళనే వారధి..
2010లో రాజమండ్రికి చెందిన వెంకటరమణతో పెళ్లయింది. చెన్నైలో ఉద్యోగం మానేశాను. కొన్ని రోజులకు మావారికి హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ కంపెనీలో జాబ్ రావడంతో సిటీకి షిఫ్ట్ అయ్యాం. పెళ్లయినా నా ఆర్ట్‌కు నేను దూరం కాలేదు. ఆక్రిలిక్, వాటర్ కలర్, ఆయిల్ పెయింటింగ్స్ ఎక్కువగా వేస్తుంటాను. గృహిణిగా నా బాధ్యతలు నిర్వర్తిస్తూనే.. చిన్నప్పటి నుంచి నేనెరిగిన ప్రకృతిని పెయింటింగ్స్ వేస్తున్నా. పచ్చని ప్రకృతిపై అవేర్‌నెస్ తీసుకురావడానికి నా కళను ఒక వారధిగా మార్చుకునే ప్రయత్నంలో ఉన్నా. అందుకే నేను గీసిన పెయింటింగ్స్‌తో ప్రదర్శన ఏర్పాటు చేశాను.
మరిన్ని థీమ్స్‌తో..
నగరీకరణ వల్ల వాతావరణంలో కాలుష్యం పెరిగి ప్రకృతి సంపద కనుమరుగవుతోంది. వాతావరణ సమతుల్యత దెబ్బతినడంతో జనాలకు అనారోగ్య సమస్యలు కూడా పెరుగుతున్నాయి. అందుకే ప్రకృతిని పరిరక్షిస్తే మనకే మేలనే నా పెయింటింగ్స్ ద్వారా సందేశాన్ని అందిస్తున్నాను. ఇక వినాయకుడంటే అమితమైన భక్తి. అందుకే వివిధ భంగిమల్లో గణేశుడి చిత్రాలు కూడా గీస్తున్నాను. నా తొలి ఆర్ట్ ఎగ్జిబిషన్‌కు హైదరాబాద్ వేదిక కావడం ఆనందంగా ఉంది. రానున్న రోజుల్లో పలు రకాల థీమ్స్‌పై చిత్రాలు గీసి ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తాను.