City plus
-
షాహీ నాష్టా.. నోరూరించే నిజాంల నాటి వంటకాలు
షాహీ నాష్టా.. అంటే నిజాం కాలంలో ఉదయం పూట అల్పాహారం. పాయారోటీ, గుర్దాభాజీ, ఖీమారోటీ, ఖిచిడీ ఖీమాలాంటి పదార్థాలను నిజాములు అల్పాహారంగా సేవించేవారు. నిజాముల కాలం నాటి వంటకాలు కొన్ని నేటికీ ప్రజాదరణలో ఉన్నాయి. క్రమేణా ఈ వంటకాలన్నీ పాతబస్తీ హోటళ్లు, సికింద్రాబాద్‌లోని ఒకటి రెండు హోటళ్లలో సామాన్యులకు కూడా అందుబాటులోకి వచ్చాయి. దీంతో నగరంలో నాన్‌వెజ్ బ్రేక్‌ఫాస్ట్ అందించే రెస్టారెంట్ల సంఖ్య పెరుగుతోంది. జంటనగరాలతోపాటు శివారు ప్రాంతాల్లో నాన్‌వెజ్ అల్పాహార వంటకాల కోసం ఉదయం పూట వందలాది మంది వేచి చూస్తారంటే అతిశయోక్తి కాదు. – సికింద్రాబాద్వయసుతో పని లేకుండా... ప్రతిరోజు 6 గంటల నుంచే వేడివేడిగా మాంసాహారపు వంటకాల అల్పాహారాలను రెస్టారెంట్ల నిర్వాహకులు సిద్ధంగా ఉంచుతున్నారు. భాజీగుర్దా, ఖీమా కర్రీ, పాయ వంటి పురాతన వంటకాలతోపాటు చిల్లిగారె, పూరి, ఇడ్లీ, వడ, దోశ, రాగిముద్ద వంటి బ్రేక్‌ఫాస్ట్‌ను చికెన్, మటన్‌తో కూడిన వివిధ వంటకాలతో రడీగా ఉంచుతున్నారు. మరికొన్ని హోటళ్లు అయితే ఉదయం 5 గంటల నుంచి 11.30 గంటల వరకూ నాన్‌వెజ్ వంటకాలను అందుబాటులో ఉంచుతున్నారు. రాత్రి 12 గంటల లోపే నాణ్యమైన మాంసం, అవసరమైన ఆకుకూరలు, మసాలాలను సిద్ధం చేసుకుని తెల్లవారుజామున ఒంటిగంట, రెండు గంటల ప్రాంతంలో వంటలు ప్రారంభిస్తున్నారు. ఉదయం 5 గంటలకు రెస్టారెంట్లను తెరిచి పూరి, రోటీ ఇతర టిఫిన్లతో కస్టమర్లకు సర్వ్ చేస్తున్నారు.వయసుతో పని లేకుండా... ఉదయం వేళల్లో చోటా ఆరగించేవాళ్లలో అన్ని వయస్కుల వాళ్లూ కనిపిస్తున్నారు. 18 ఏళ్ల నవయువకుల నుంచి 70 ఏళ్ల వృద్ధుల వరకూ ఈ టిఫిన్లు ఆరగిస్తున్నారు. కేవలం నాన్‌వెజ్ కర్రీతో ప్రత్యేకంగా లభించే టిఫిన్లు ఆరగించడం కోసం వచ్చే వాళ్లు మిత్రులుగా మారిన వారూ ఉంటున్నారు. నాన్‌వెజ్ టిఫిన్లు సేవించేవారు మైదానాల్లోనే మిత్రులుగా మారుతున్నారు. కొందరు ఐతే ఏకంగా నాన్‌వెజ్ టిఫిన్స్ కోసం చాట్ గ్రూప్స్ మెయింటెన్ చేస్తున్నారు. వారాంతాల్లో జాతరే!రోజు రోటీ, ఇతర టిఫిన్లు తినేందుకు నాన్‌వెజ్ టిఫిన్ సెంటర్లు, రెస్టారెంట్ల వద్ద కస్టమర్లు బారులు తీరుతున్నారు. శని, ఆదివారం వచి్చందంటే చాలు మాంసాహార టిఫిన్‌సెంటర్ల ముందు జాతర కనిపిస్తుంది. భాజీగుర్దా.. ఖీమాతో రోటీపాటు, ఇడ్లీ, వడ, దోశ వంటి అల్పాహారాలు కూడా మాంసం కూరలతో తినేందుకు ఇష్టపడుతున్నారు. దీంతో కస్టమర్లతో రెస్టారెంట్ల వద్ద సందడి వాతావరణం కనిపిస్తుంది. మార్నింగ్ వాకర్లు, స్మిమ్మర్లు, జిమ్‌కు వెళ్లేవాళ్లు, క్రికెటర్లు వారాంతపు రోజులు, సెలవు దినాల్లో వ్యాయామం ముగించుకున్నాక నేరుగా మాంసాహార టిఫిన్ సెంటర్ల వద్దకు చేరుకుంటారు. వీళ్లే కాకుండా పలువురు సాఫ్ట్వేర్ ఇంజినీర్లు కూడా సెలవు దినాల్లో నాన్‌వెజ్ టిఫిన్స్ ఆరగించేందుకు ఉవి్వళ్లూరు తున్నారు. -
అమెరి‘ఖానా’...
అమెరికా కేంద్రంగా ప్రపంచ ప్రసిద్ధి చెందిన రెస్టారెంట్ గ్రూప్ ‘చిలీస్’ నగరంలో తన రెండవ శాఖను ఏర్పాటు చేసింది. బంజారాహిల్స్, రోడ్‌నెం..1లోని జలగం వెంగళరావు పార్క్ ఎదురుగా నెలకొల్పిన ఈ రెస్టారెంట్‌ను గురువారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి సినీనటి షామిలి హాజరయ్యారు. ఈ సందర్భంగా సంస్థ సీఈఓ అశీష్ సక్సేనా మాట్లాడుతూ హైదరాబాద్‌లో ఇనార్బిట్ మాల్ తర్వాత బంజారాహిల్స్‌లో రెండవ శాఖను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. దీనితో భారత్‌లో తమ బ్రాండ్ 8 శాఖలు నెలకొల్పినట్టయిందన్నారు. అమెరికాలో అమితాదరణ కలిగిన టెర్లింగ్వా చిలి, బోంబే బర్గర్, ఒరిజినల్ బార్బెక్యూ రిబ్స్, చీజ్ క్యూసొదిల్లాస్, చెర్రీ కోలా.. వంటి రుచులు హైదరాబాదీలను సైతం అమితంగా ఆకట్టుకుంటున్నాయన్నారు. - సాక్షి, లైఫ్‌స్టైల్ ప్రతినిధి -
హాయ్..నేను జ్యోతిలక్ష్మిని..
తాను ఎక్కడికి వెళ్లినా జ్యోతిలక్ష్మి వచ్చిందంటున్నారని, ఇది తనకెంతో ఆనందంగా ఉందని కథానాయిక చార్మి పేర్కొన్నారు. బుధవారం రవీంద్రభారతి కాన్ఫరెన్స్ హల్లో వంశీ ఇంటర్నేషనల్-వంశీ ఫిలిం సొసైటీ ఆధ్వర్యంలో ‘ జ్యోతిలక్ష్మీ’ చిత్ర యూనిట్‌కు అభినందన సభ నిర్వహించారు. ఇందులో హీరోయిన్ చార్మి మాట్లాడుతూ.. మహిళలను తోటి మహిళ గౌరవించే సంస్కృతి వస్తే మిగతా వారు గౌరవిస్తారన్నారు. పురుషుడి అండ ఉంటే మరింత ప్రగతి సాధిస్తారన్నారు. ఈ సందర్భంగా చార్మి, హీరో సత్య, చిత్ర బృందంపై పూలవాన కురిపించారు. నిర్మాత సి.కల్యాణ్, సమాచార హక్కు చట్టం కమిషనర్ పి. విజయబాబు, టీడీపీ నేత నన్నపనేని రాజకుమారి, రచయిత్రి కేబీ లక్ష్మి, జీవీఎల్ఎన్ రాజు, సంగీత దర్శకుడు సునీల్ కశ్యప్, వంశీ సంస్థ నిర్వాహకురాలు డాక్టర్ తెన్నేటి సుధాదేవి, ప్రధాన కార్యదర్శి సుంకరపల్లి శైలజ తదితరులు పాల్గొన్నారు. - సాక్షి,సిటీబ్యూరో -
సమాజ సేవలో.. నేనున్నానని..
హీరో అంటే.. వందమందిని ఇరగదీయాలి. డ్యూయెట్లు పాడాలి. తనవారి కోసం విలన్‌ను ఎదిరించి నిలవాలి.. ఇది ‘రీల్ హీరో’ సంగతి. మరి నిజ జీవితంలో కష్టాల్లో ఉన్నవారికి సాయం చేసేవారు.. తనకన్నా సమాజం కోసం పాటుపడేవారు.. ‘రియల్ హీరో’ అవుతారు. ఈ కోవకు చెందిన వ్యక్తే వేణు శ్రావణ్. వెండి తెరపై హీరో కావాలన్న కలతో సిటీకి వచ్చిన అతడు పేదల సాయంలో నిమగ్నమయ్యాడు. ఓ పక్క రేడియో జాకీగా, మరోపక్క బుల్లితెర నటుడిగా కొనసాగుతున్నాడు. తాను సేకరించిన పాత, కొత్త దుస్తులను ఆదివారం ధర్నా చౌక్‌లో పేదలకు పంచాడు. వారికి భోజనం సైతం పెట్టాడు. ఈ సందర్భంగా అతడిని ‘సాక్షి’ పలకరిస్తే ఎన్నో విషయాలు చెప్పాడు. ఆయన మాటల్లోనే.. - సాక్షి,సిటీబ్యూరో అలా ‘చలో హైదరాబాద్’ ‘మాది ఖమ్మం జిల్లాలోని బ్రాహ్మణపల్లి. డిగ్రీ వరకు ఖమ్మంలోనే చదువుకున్నాను. పాఠశాల, కళాశాల రోజుల్లో నాటకాలు వేశాను. అలా సినిమా హీరో కావాలనుకున్నా. డిగ్రీ పూర్తయ్యాక ఇండస్ట్రీని ఇరగదీయాలని చలో హైదరాబాద్ అన్నా. భాగ్యనగరంలో కొన్నాళ్లు టీచరుగా పనిచేశాను. తర్వాత రెయిన్బో ఎఫ్ఎంలో ఆర్జేగా మారాను. మరో పక్క ‘విధి, రాధా-మధు, చక్రవాకం, ఆమె, శుభలగ్నం’ వంటి సీరియల్స్‌లో నటించాను. ఇదే సమయంలో యాంకర్ గానూ చేస్తున్నా. తర్వాత సమాజంలో ఒక్కో ఘటనతో ఒక్కో అనుభవం. దీంతో ఆశయం ముందు హీరో కావలన్న ఆశ చిన్నదైపోయింది. అలా పుట్టుకొచ్చింది ‘కలర్స్’ ‘కొన్నాళ్ల క్రితం వృద్ధుల దినోత్సవం రోజు నిజాంపేట్‌లోని ఓ వృద్ధాశ్రమంలో ఈవెంట్ కోసం యాంకర్‌గా వెళ్లాను. ఆరోజు ఉదయం నుంచి తమ బిడ్డల కోసం వృద్ధులు ఎదురు చూస్తూనే ఉన్నారు. ఎంత సేపటికీ వారు రాలేదు. నా వాక్ చాతుర్యంతో వారిని ఆడించి మెప్పించాను. వారు నన్ను నిజమైన బిడ్డవంటూ ముద్దాడారు. ఒకసారి చిన్న బాబుకి లివర్ ఆపరేషన్ చేయాలి. ఖమ్మంకు చెందిన దంపతులిద్దరూ నా రూములో 15 రోజులు ఉన్నారు. ‘సాక్షి చానెల్’ వారిని సంప్రదిస్తే బాబు సమస్యను టీవీలో టెలికాస్ట్ చేశారు. దీంతో రూ.14 లక్షలు పోగయ్యాయి. ఆ డబ్బుతో ఆ బాబు బతికాడు. సమయానికి సరైన సాయం అందక చాలామంది పేదలు కష్టాలు పాలవుతున్నారు. చర్లపల్లి జైల్లో కార్యక్రమాలు చేశా. క్షణికావేశంతో చేసిన తప్పులకు నేరస్తులు జైల్లో ఉంటే వారి కుటుంబాలు ఎలా నష్టపోతున్నాయో తెలుసుకున్నా. ఇలాంటి వారికి సాయం చేయాలనుకున్నా. ఇందుకోసం డబ్బు కావాలి. ఇందుకు 2013లో ‘కలర్స్ సర్వీస్ అండ్ ఎంటర్టైన్మెంట్’ పేరుతో సంస్థను స్థాపించా. దీనిద్వారా లైవ్ షోలు చేసి విరాళాలు సేకరిస్తున్నా. ఫేస్బుక్ స్నేహితులతో మాట్లాడి ఆదివారాల్లో ఏదో ఒక సామాజిక కార్యక్రమం చేస్తున్నా. ఎంత కాలం బతికామన్నది కాదు.. ఎలా బతికామన్నదే నాకు ముఖ్యం’.. అని ముగించాడు. -
దత్తతకు పిల్లలు కావలెను..!
లైఫ్ ఛేంజ్ ఎఫెక్ట్ సిటీలో పెరుగుతున్న సంతానలేమి జంటలు దత్తత కోసం శిశువిహార్‌కు దరఖాస్తుల వెల్లువ ఎదురు చూపుల్లో వెయ్యికి పైగా జంటలు ఆలస్యపు పెళ్లిళ్లు.. మారిన జీవనశైలి.. రోజంతా పని ఒత్తిడి.. ఆపై అధిక బరువు.. వెరసి నవ దంపతుల సంతానోత్పత్తి సామర్థ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. ఎన్ని మందులు వాడినా సంతానం కలగక పోవడంతో తోడు కోసం అనాథ పిల్లలపై ఆసక్తి పెంచుకుంటున్నారు. దత్తతకు పిల్లలు కావాలని కోరుతూ ఇప్పటికే అనేక మంది శిశువిహార్‌కు దరఖాస్తు చేసుకుంటున్నారు. అయితే, వారికి పిల్లలు మాత్రం దొరకడం లేదు. ఏడాది లోపు బిడ్డ కావాలంటే సుమారు ఆరేళ్లు ఆగాల్సి వస్తోంది. దీంతో చాలామంది దంపతులు ఆందోళన చెందుతున్నారు. - సాక్షి, సిటీబ్యూరో కప్పుడు పాతికేళ్లకే పెళ్లి చేసుకుని, ఏడాదిలో పండంటి బిడ్డకు జన్మనిచ్చేవారు. ప్రస్తుతం చాలా మంది ఉన్నత చదువులు, ఉద్యోగ అవకాశాల వేటలో పడి 30 ఏళ్లు దాటిన తర్వాతే పెళ్లికి సిద్ధపడుతున్నారు. అధిక పని ఒత్తిడితో పాటు ఉష్ణోగ్రతలకు హార్మోన్లలో సమతుల్యత లోపిస్తుంది. ఆకలి తీర్చుకునేందుకు పిజ్జాలు, బర్గర్లతో కడుపు నింపుకోవడంతో స్త్రీ, పురుషుల హార్మోన్లపై తీవ్ర ప్రభావం చూపుతోంది. దీనికి తోడు భార్య ఒక షిఫ్ట్.. భర్త మరో షిఫ్ట్‌లో ఆఫీసుకు వెళ్తుండడం వల్ల వారు కనీస దాంపత్యానికి నోచుకోలేకపోతున్నారు. వీకెండ్లో పార్టీల పేరుతో మద్యం తీసుకోవడం వల్ల శృంగార సమస్యలు తలెత్తుతున్నాయి. పెళ్లై నాలుగైదేళ్లు దాటినా పిల్లలు పుట్టకపోవడంతో చివరకు సంతాన సాఫల్య కేంద్రాలను ఆశ్రయిస్తున్నారు. ఇన్విట్రో ఫెర్టిలైజేషన్ అండ్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ (ఐవీఎఫ్), ఇంట్రాసైటో ప్లాస్మి క్ స్పెర్మ్ ఇంజెక్షన్ (ఐసీఎస్ఐ) చికిత్సలు సైతం ఆశించిన ఫలితాలు ఇవ్వడం లేదనే విమర్శలు కూడా ఉన్నాయి. ఇదే అంశంపై 2013లో నగరానికి చెందిన ఇద్దరు దంపతులు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌తో పాటు ఆంధ్రప్రదేశ్ లోకాయుక్తను ఆశ్రయించడం సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఒంటిరిగా జీవించలేక, పిల్లలపై మమకారం చంపుకోలేక అనాథలను దత్తత తీసుకునేందుకు దంపతులు ముందుకు వస్తున్నా, పిల్లలు దొరకని పరిస్థితి తలెత్తింది. దత్తతకు ఆరేళ్లు ఆగాల్సిందే.. గతంతో పోలిస్తే దంపతుల వైఖరిలో చాలా మార్పులు వచ్చాయి. ఆడపిల్లలు భారమని భావించే రోజులు పోయాయి. శిశు విహార్‌లో పిల్లలను దత్తత తీసుకుంటున్న దంపతుల జాబితాను పరిశీలిస్తే ఇది స్పష్టమవుతోంది. ప్రస్తుతం పిల్లల కోసం 1100 మందికిపైగా ఎదురు చూస్తున్నారంటే ఆశ్చర్యపోనవసరం లేదు. ఆడశిశువు కావాలంటే కనీసం మూడేళ్లు సమయం పడుతుండగా, మగ శిశువుకు ఐదు నుంచి ఆరే ళ్లు పడుతోంది. పిల్లల దత్తత కోసం దరఖాస్తు చేసుకున్నా.. అది కూడా గ్యారంటీ లేదు. ఇదిలా ఉంటే గత పదమూడేళ్లలో శిశువిహార్ ద్వారా మొత్తం 2047 మందిని దత్తత ఇవ్వడం గమనార్హం. ఐటీ అనుబంధ ఉద్యోగుల్లో అధికం నగరంలో 30కి పైగా ఫెర్టిలిటీ సెంటర్లు ఉండగా, మా ఆస్పత్రికి ప్రతి రోజూ సగటున 30 కేసులు వస్తున్నాయి. వీరిలో అధిక శాతం ఐటీ, కాల్ సెంటర్స్, మీడియా అనుబంధ రంగాల్లో పనిచేస్తున్న దంపతులే. ముందు వీరికి పరీక్షలు చేసి లోపాన్ని గుర్తిస్తాం. తొలుత మందులతో ప్రయత్నిస్తాం. అయినా ఫలితం లేకపోతే ఐవీఎఫ్, ఐసీఎస్ఐ వంటి కృత్రిమ పద్ధతుల్లో టెస్ట్‌ట్యూబ్ బేబీకి సిఫారసు చేస్తాం. చిన్న వయసులోనే మోనోపాజ్ వస్తుండటం వల్ల నగరంలో చాలా మంది రెండో సారి గర్భధారణకు నోచుకోవడంలేదు. - డాక్టర్ చందన, నోవా ఇన్ఫెర్టిలిటీ సెంటర్ -
ఆలోచింపజేసే రేపేంటి?
పర్యావరణాన్ని కాలుష్యం చేస్తే రానున్న రోజుల్లో పరిస్థితి ఏంటి? పాలిథిన్ కవర్ల బదులు పేవర్ కవర్లు వాడాలని, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‌తో కాకుండా మట్టితో చేసిన వినాయకులే ఎంతో మేలని.. ఇంకుడు గుంతలు ఉపయోగకరమని.. ప్రకృతి వ్యవసాయంతో రైతులకు ఆత్మహత్యలు ఉండవని అంటున్నారు సొసైటీ ఫర్ అవేర్నెస్ అండ్ విజన్ ఆన్ ఎన్విరాన్మెంట్(సేవ్) సంస్థ ప్రతినిధులు. ప్రతి ఒక్కరూ నేల తల్లి పరిరక్షణలో భాగస్వాములు కావాలని కోరుతున్నారు సేవ్ సంస్థ వ్యవస్థాపకుడు విజయ్‌రాం. సేవ్ సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం ఇందిరాపార్కు వద్ద ఏర్పాటు చేసిన రేపేంటి? ఎంతో ఆలోచింపజేసింది. ప్రకృతి సేద్యం కోసంఅరకిలో వరి విత్తనాలు ఉచితంగా ఇవ్వనున్నామని, పేపరు బ్యాగులు, మట్టి వినాయకులు, సీడ్‌బాల్, ఇంటి పంటపై ఇందిరా పార్కు వద్ద శని, ఆదివారాల్లో కూడా ప్రదర్శన నిర్వహించడంతో పాటు ఔత్సాహికులకు శిక్షణ కూడా ఇస్తామని విజయ్‌రాం చెప్పారు. -దోమలగూడ -
శారీలో శ్రావ్యం..
తరాలు మారినా చీరకట్టుకు ఆదరణ తగ్గదని, చీరకట్టుతో వచ్చే అందం మరే వస్త్ర సౌందర్యంలో రాదని ‘కాయ్ రాజా కాయ్’ కథానాయిక శ్రావ్య అన్నారు. శుక్రవారం ఆమె బషీర్‌బాగ్‌లో అవంతి స్కిల్స్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె షోరూంలోని వస్త్ర అందాలను తిలకించారు. భారతీయ సంస్కృతిలో చీర కట్టుకు విడదీయరాని బంధమని, తాను ఎక్కువగా చీరలనే ఇష్టపడతానని పేర్కొన్నారు. అనంతరం అవంతి స్కిల్స్ నిర్వహకులు మహేష్ అవస్తి, మాట్లాడుతూ హ్యాండ్లూమ్ వస్త్ర ఉత్పత్తి, హోల్ సెల్ రంగంలో 20 ఏళ్ల అనుభవాన్ని రంగరించి ఈ షోరూంను అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. దేశంలోని పలు ప్రాంతాలకు చెందిన కళాంకారి, హ్యాండ్ పెయింటింగ్, బాతిక్, బనారస్, మహేశ్వరి వంటి రకాలు అందుబాటులో ఉంటాయన్నారు. -హిమాయత్‌నగర్ -
రంగుల డాన్...
మురిపించెన్.. ఓ ఊసరవెల్లి చెట్టుపై నుంచి కిందకు దిగి ఠీవీగా లాన్లో నడుచుకుంటూ వెళ్తోంది.. అక్కడే ఆడుకుంటున్న చిన్నారులు, స్థానికులు దాన్ని చూశారు. చూడముచ్చటగా ఉండటంతో దాంతో కాసేపు ఆడుకున్నారు. ఫొటోలు తీసుకున్నారు. అనంతరం దాన్ని ఓ డబ్బాలో బంధించారు. శుక్రవారం కుత్బుల్లాపూర్‌లోని కృష్ణకుంజ్ గార్డెన్లో చోటుచేసుకున్న ఈ దృశ్యాలు సాక్షి కెమెరాకు చిక్కాయి. ఫొటోలు: దశరధ్జ్రువా -
కాన్వాసుపై చారిత్రక పండగ
♦ తెలంగాణ సంస్కృతిని చాటుతున్న చిత్రకారులు ♦ రాష్ట్రావతరణ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక ఎగ్జిబిషన్ ఇద్దరు చిత్రకారులు.. పేర్లు దేవేందర్‌గౌడ్, రామ్మోహన్. ఒకరిది మహబూబ్‌నగర్ జిల్లా బోయినపల్లి. మరొకరిది వరంగల్ జిల్లా పరకాల మండలం నర్సక్కపల్లి. ఇద్దరిలోనూ కామన్‌గా ఉన్నది.. కళలపై మమకారం. ఇదే వీరిద్దరినీ కలిపింది. కలిసి కాన్వాసుపై తెలంగాణ చరిత్రను పరిచి.. సంస్కృతిని ఇనుమడింపజేస్తున్నారు. తెలంగాణ కల్చర్‌ను ప్రమోట్ చేసేందుకు దేశ పర్యటన చేపట్టారు. ఆయా రాష్ట్రాల్లో వారు తెలంగాణ ‘చిత్రాన్ని’ ఆవిష్కరిస్తున్నారు. తొలిసారిగా జరుగుతున్న రాష్ట్ర అవతరణ వేడుకలను పురస్కరించుకుని వీరు బంజారాహిల్స్‌లోని గ్యాలరీ స్పేస్ ఆర్ట్ గ్యాలరీలో ‘కాకతీయన్ హెరిటేజ్’ పేరుతో గ్రూప్ షో ఏర్పాటు చేశారు. ఈ ప్రదర్శనను స్పీకర్ మధుసూదనాచారి, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా చిత్రకారులను ‘సాక్షి’ పలకరించినప్పుడు చిత్రాల చరిత్రను వివరించారు. ఆ వివరాలు వారి మాటల్లోనే.. - సాక్షి, సిటీబ్యూరో ‘ఈ సిటీని చిన్నప్పటి నుంచి చూస్తున్నా. ఈ నగరమే నా కళకు ప్రాణం పోసింది’ అని సంతోషంగా చెప్పారు దేవేందర్‌గౌడ్. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల తాలూకా బోయినపల్లి గ్రామానికి చెందిన ఈ చిత్రకారుడు.. మూడేళ్లుగా ఢిల్లీలో ఉంటున్నారు. తెలంగాణ సంస్కృతిని, కాకతీయుల పాలనలో వెలసిన చారిత్రక కట్టడాల గొప్పతనాన్ని చాటేందుకు ఫుల్ టైమ్ ఆర్టిస్ట్‌గా అవతారమెత్తారు. పరకాల మండలం నర్సక్కపల్లి గ్రామానికి చెందిన మరో ఆర్టిస్టు రామ్మోహన్ మాట్లాడుతూ.. ‘చిన్నప్పటి నుంచీ వరంగల్‌లో జరిగే సమ్మక్క-సారలమ్మ జాతరను వెళుతుండేవాడిని. కుంభమేళా తర్వాత అంత పెద్దగా జనాలు వచ్చే ఈ జాతర ప్రత్యేకతను నలుగురికీ చెప్పాలనుకున్నా. అందుకు కుంచె పట్టా’ అని చెప్పారు. కళే కలిపింది ఇద్దరిని.. ‘మా ఇంట్లో నేను చిన్నోడిని. మా నాన్న ప్రస్తుత తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి. చిన్నప్పటి నుంచి నాకు కళలపై ఉన్న ఆసక్తి కుంచె పట్టేలా చేసింది. అలా శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ కాలేజీ నుంచి బీఎఫ్ఏ చేశా. ఇదే సమయంలో నాకు దేవేందర్ గౌడ్‌తో పరిచయం ఏర్పడింది. ఇద్దరి అభిరుచులు ఒక్కటే. ఓసారి సమ్మక్క-సారలమ్మ జాతరను చూశాం. అప్పటి నుంచే మన తెలంగాణ చారిత్రక వైభవాన్ని ప్రపంచానికి చాటిచెప్పాలని ఫిక్స్ అయిపోయాం’ అని చెప్పుకొచ్చారు రామ్మోహన్. ఢిల్లీలో కూడా చేశాం.. ‘తెలంగాణ కల్చర్‌ను ప్రమోట్ చేసేందుకు ఢిల్లీలోని ఆలిండియా ఫైన్ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్ సొసైటీలో ఇప్పటికే ఎగ్జిబిషన్ చేశాం. తొలిసారిగా జరుగుతున్న రాష్ట్ర అవతరణ వేడుకలను పురస్కరించుకొని మరికొన్ని కొత్త పెయింటింగ్స్‌తో ఈ ప్రదర్శన ఏర్పాటు చేశాం. మన తెలంగాణలోనైనా మన చారిత్రక కట్టడాలకు తగిన గుర్తింపు లభిస్తుందని కోరుకుంటున్నా’మన్నారు ఈ కళా ద్వయం. ఓ కుంచెది ‘శిల ్ప’ చరిత్ర.. ‘800 ఏళ్ల క్రితం నాటి రామప్ప గుడి నన్ను ఎంతో ప్రభావితం చేసింది. ఇంత అద్భుత శిల్ప సంపద ఉన్నా అనుకున్నంత గుర్తింపు రాకపోవడం ఆలోచింపచేసింది. రామప్ప ఓ శిల్పి. కళాకారులకు కాకతీయులు గుర్తింపు ఇచ్చినా ఇప్పటివారు నిర్లక్ష్యం చేయడం బాధించింది. ఈ శిల్పాలు శివుని అనాటమీ (స్ట్రక్చర్).. విష్ణువు ఆకృతిని పోలి ఉంటాయి. రామప్ప గుడి శిల్ప సంపదను కళ్లకు కట్టినట్టు చూపేందుకు కుంచెను ఆయుధంగా వాడుకున్నా’ అని గర్వంగా చెప్పారు దేవేందర్‌గౌడ్. మరో కుంచెది ‘మహా జాతర’.. ‘భారతదేశంలో భారీగా భక్తులు హాజరయ్యేది కుంభమేళాకే. తర్వాత అంత భక్తజనం తరలి వచ్చేది ‘సమ్మక్క- సారక్క’ జాతరకే. తమకు జరిగిన అన్యాయాన్ని ఎదిరించేందుకు ఈ గిరిజన అక్కాచెల్లెళ్లు చూపిన తెగువను ప్రపంచమే చెప్పుకుంటుంది. మిగతా జాతర్లకు ఈ తిరునాళ్లకు ఉన్న ప్రత్యేకత ఏంటంటే.. మిగతా చోట్ల బంగారంతో మొక్కులు చెల్లిస్తారు. ఇక్కడ బెల్లాన్ని సమర్పిస్తుంటారు. ఇదే సీన్‌ను పెయింటింగ్ ద్వారా చూపించా. సమ్మక్క గద్దె, సారక్క గద్దెను చూస్తే అలానే నిలబడి చూడాలనిపిస్తునే ఉంటుంది. అందుకే ఆ చిత్రాలను గీశా’ అంటూ చెప్పారు రామ్మోహన్. -
దేహానికి సమ్మర్ గార్డ్స్
మండే ఎండల్ని ఇచ్చే ప్రకృతే వాటి నుంచి కాపు ‘కాచే’ కాయల్నీ మనకు ఇచ్చింది. అందుకేనేమో... వాటికి తమ పేరుకు (ఆంగ్లంలో) ‘గార్డ్స్’ను జత చేసుకున్నాయి. నగరంలో మండుతున్న వేసవి నుంచి సిటీజనుల్ని రక్షించేందుకు అందుబాటులోనే ఉన్న కొన్ని కూరగాయలు తీసుకుంటే చాలంటున్నారు వైద్యులు. కూల్ డ్రింక్స్నో, మరో కృత్రిమ పానియాలనో ఆశ్రయిస్తూ ఎండ నుంచి తాత్కాలిక ఉపశమనాన్ని, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల్ని కొని తెచ్చుకుంటున్నాం. వాటికి బదులు కొన్ని రకాల కూరగాయల్ని ఆహారంలో భాగం చేయడం ద్వారా మండే ఎండల్నీ చల్లగా సాగనంపవచ్చని నగరానికి చెందిన పలువురు పోషకాహార నిపుణులు చెబుతున్నారు. - సాక్షి, లైఫ్‌స్టైల్ ప్రతినిధి బిట్టర్ గార్డ్ ఇది సమ్మర్ నుంచి రక్షించే ‘బెటర్ గార్డ్’. కాకర కాయగా మనకు అత్యంత చిరపరిచితమైన ఈ కూరగాయ వేసవికి తోడు పని ఒత్తిడి కారణంగా తలెత్తే హైపర్ టెన్షన్‌ను నివారిస్తుంది. సీజనల్‌గా ఏర్పడే పుండ్లు, దద్దుర్లు, ఫంగల్ ఇన్ఫెక్షన్, రింగ్ వార్మ్ వంటి వాటిని అదుపు చేయడంలో సహకరిస్తుంది. డయాబెటిస్ నియంత్రణకు ఇది చక్కని ఆహారం. స్నేక్ గార్డ్ పేరులో పామున్నా.. స్నేక్ గార్డ్.. తెలుగులో పొట్లకాయగా మనకు చిరపరిచితమే. ఇది దేహానికి కూలింగ్ ఎఫెక్ట్ ఇస్తుంది. వేడిమి కారణంగా పేరుకుంటున్న పొడి తత్వాన్ని దూరం చేసి శరీరంలో ఫ్లూయిడ్స్ ఉత్పత్తిని పెంచుతుంది. శరీర విధి నిర్వహణ సాధారణంగా జరిగేలా దోహదపడుతుంది. యాష్ గార్డ్ పేరులో బూడిద ఉన్నా తీరులో బంగారం అనిపిస్తుంది యాష్గార్డ్.. అదే బూడిద గుమ్మడికాయ. దేహాన్ని చల్లగా ఉంచి వడదెబ్బ నుంచి కాపాడుతుంది. ఇది దాదాపు 96 శాతం నీటిని కలిగి ఉంటుంది. విటమిన్- బి,ఎ (థయామిన్), బి3 (నియాసిన్)ను పుష్కలంగా అందిస్తుంది. దీనిలోని హై పొటాషియం రక్తపోటు సరైన క్రమంలో ఉండేలా చూస్తుంది. కిడ్నీలో రాళ్లు వంటి సమస్యల నివారణకు మంచి మందు. రిడ్జెడ్ గార్డ్ బీరకాయనే ఆంగ్లంలో రిడ్జెడ్ గార్డ్ అంటారు. ఇది రక్తాన్ని శుద్ధి చేసి రక్తంలోని చక్కెర శాతాన్ని నియంత్రిస్తుంది. వేసవి కారణంగా తలెత్తే జీర్ణకోశ వ్యాధులకు చక్కని పరిష్కారం చూపుతుంది. బాటిల్ గార్డ్ అత్యధికంగా నీటి శాతాన్ని కలిగి ఉన్న బాటిల్ గార్డ్.. సొరకాయగా తెలుసు. ఇది మినరల్ వాటర్ బాటిల్స్‌ను మించిన పోషకాలను అందిస్తూ దేహానికి రక్షణగా నిలుస్తుంది. ఎండ కారణంగా కడుపులో తలెత్తే ఎసిడిటీ సమస్యకు సొరకాయ మేలైన పరిష్కారం చూపుతుంది. విపరీతమైన చెమట కారణంగా కోల్పోయే సోడియంను శరవేగంగా భర్తీ చేస్తుంది. అతి దాహాన్ని, అలసటను దూరం చేస్తుంది. -
నా భార్య నాకన్నా ఎత్తుంటే తప్పేముంది?
ఈడు జోడు మారింది చూడు కాంబినేషన్లో కొత్త మార్పులు ‘అమ్మాయి ఆకాశంలో ఉంటే వీడేమో భూమ్మీద. పెళ్లంటే ఈడూ జోడూ కుదరకపోతే ఎలా?’ ఇలాంటి ప్రశ్నలకు కాలం చెల్లింది. ఈతరహాపాత తరపు అభిప్రాయాలను పట్టించుకోని నవతరం.. ఈడు విషయంలో అబ్బాయి కన్నా అమ్మాయి చిన్నగా ఉండాలంటూ పెట్టిన ఆంక్షలను ఇప్పటికే స్పష్టంగా తిప్పికొట్టేసింది. అదే వేగంతో ఇప్పుడు జోడు విషయంలోనూ మార్పులకు సై అంటోంది. తనకన్నా ఎత్తున్న అమ్మాయిలను తలెత్తుకుని చూడడానికి మాత్రమే కాదు ఆమెతో కలిసి ఏడడుగులు నడవడానికి కూడా అబ్బాయిలు ముందుంటున్నారు. పెళ్లి అనే వ్యవస్థలో పురుషుడికి ఎక్కువ అధికారాలు కట్టబెట్టిన సంప్రదాయం.. వయసులోనూ, ఆకారంలోనూ.. కూడా పురుషాధిక్యతకే పెద్ద పీట వేసింది. అమ్మాయికన్నా అబ్బాయి వయసు, ఎత్తు ఎక్కువుండాలని నిర్ధేశించింది. ప్రస్తుత తరం ఈ కాంబినేషన్ రూల్‌ని తోసిరాజంటోంది. హైటెక్కినా.. ఓకే ‘నా భార్య నాకన్నా ఎత్తుంటే తప్పేముంది? అందులో నాకు చిన్నతనం అనిపించాల్సిన అవసరం ఏముంది?’ అని ప్రశ్నించారు పంజ గుట్టలో నివసించే మల్లీశ్వరరావు. తనకన్నా ఎత్తున్న శ్రీదేవిని ఆయన భార్యగా చేసుకున్నారు. ఈ విషయంలో ఆయన బంధువుల్లో కొందరు గుసగుసలాడకపోలేదు. అయితే దీన్ని ఆయన తేలిగ్గా తీసుకున్నారు. ‘మాది చింతపల్లి అనే పల్లెటూరు. అక్కడ భార్యకన్నా భర్త ఎత్తు తక్కువ ఉండడం అనేది నవ్వుకునే విషయమే. అయితే ఇదంతా తొలినాళ్లలోనే. ఇప్పుడు వాళ్లు కూడా ఈ విషయాన్ని పట్టించుకోవడం లేదు. మనసులు కలిసిన జంటలకు ఇవన్నీ చాలా చిన్న విషయాలు’అని చెప్పారాయన. అత్యాధునిక పోకడలను మోసుకొచ్చే ఫ్యాషన్ ర్యాంప్ మీద తరచూ మెరిసే సిటీ జంట ఆయేషా లఖోటియా, అజహర్ లఖోటియాలు సైతం ఈ విషయాన్ని ఎంతమాత్రం పట్టించుకోరు. ‘నా భార్య నాకన్నా హైట్ అనే విషయం నాకు గర్వంగానే అనిపిస్తుంది. నిజానికి షి ఈజ్ వెరీ గుడ్ లుకింగ్’ అంటారు అజహర్. ‘నేను హైట్ తక్కువున్నాను. నా కంటే తక్కువ హైట్ ఉన్న అమ్మాయిని చేసుకుంటే ఇద్దరికీ పుట్టే పిల్లలు మరీ పొట్టిగా పుట్టే అవకాశముంది. అందుకే నాకన్నా రెండు అంగుళాలు ఎక్కువున్న అమ్మాయిని పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకున్నా’నన్నాడు శశాంక్. సినిమాలూ స్ఫూర్తి.. ‘నా హైట్ చూసి హీరోలు నా పక్కన నటించడానికి ఇబ్బంది పడుతున్నారు. అదే నాకు మైనస్ అయింది’ అంటూ వాపోయింది కొంత కాలం క్రితం మాజీ మిస్ యూనివర్స్ సుస్మితాసేన్. అయితే, ఇప్పుడా పరిస్థితి పూర్తిగా తలకిందులైంది. దీపికా పదుకునే వంటి పొడుగుకాళ్ల బ్యూటీతో షారూఖ్, రణవీర్‌సింగ్ తదితర హీరోలు, సోనాక్షి సిన్హాతో షాహిద్ కపూర్ హాయిగా జట్టు కట్టేస్తున్నారు. ఆమీర్‌ఖాన్ (5.6 ఫీట్స్) కత్రినాకైఫ్ (5.9 ఫీట్స్)తో జంటగా నటనను పండిస్తున్నారు. రియల్ లైఫ్‌లోనూ ఒకరికొకరు అంటుకు తిరిగే సల్మాన్ (5.7), కత్రినాకైఫ్‌లు ఈ తరహా కాంబినేషన్‌కు నిలువెత్తు నిదర్శనం అని చెప్పొచ్చు. ఇప్పుడు టాలీవుడ్ కూడా అదే బాట పట్టింది. కృతి సనన్ (5.9 ఫీట్స్) వంటి టాల్గాళ్తో నాగచైతన్య (5.7 ఫీట్స్) లాంటి కుర్ర హీరోలు హైట్‌ను పక్కన పెట్టి మరీ జోడి కట్టారు. ప్రముఖుల పెళ్లిళ్లూ... తనకన్నా వయసు, హైట్ కూడా ఎక్కువున్న అమ్మాయిని పెళ్లాడిన సచిన్ టెండూల్కర్ జంట కూడా ఈ విషయంలో యూత్‌కి ఇన్స్పిరేషనే. ‘నా భార్య నాకన్నా ఎత్తు ఎక్కువుండడం వల్ల నాకు కాన్ఫిడెన్స్ పెరిగింది’ అని చెప్పే రాజ్‌పాల్ యాదవ్ లాంటి బాలీవుడ్ నటులు ఈ తరహా ట్రెండ్‌కు ప్రమోటర్లుగా మారారు. ఇక సినీనటి దేవయాని, డెరైక్టర్ రాజకుమరన్ల జంట కూడా మరో ఎగ్జాంపుల్. రానున్న కాలంలో ఈడు జోడు అనేది రివర్స్ అయి అబ్బాయికన్నా అమ్మాయే ఎక్కువ వయసుండాలని, ఎత్తుండాలని కొత్త సంప్రదాయం పుట్టుకొచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. పొడవుతో గుడ్ లుక్.. చిన్న తనం నుంచే పొడుగున్న అమ్మాయిలంటే ఇష్టం. వాళ్లలో కనబడే కాన్ఫిడెన్స్, గుడ్‌లుక్స్ బాగా ఇష్టం. అందుకేనేమో నాకన్నా ఎత్తుగా ఉందని అందరూ అంటున్నా వెనుకాడకుండా ఆయేషాని పెళ్లి చేసుకున్నాను. మీ వల్ల హైహీల్స్ వేసుకోవాలనే నా కోరిక తీరడం లేదు.. అంటూ ఆయేషా అనే సరదా మాటలు తప్ప మా మధ్య మరే సమస్య లేదు. - అజహర్ లఖోటియా ఆదివారం ఆర్గానిక్ సందడి ఆర్గానిక్ ఫ్రూట్స్, కూరగాయలు, ఇంట్లో చేసిన బ్రెడ్స్, హ్యాండీక్రాఫ్ట్స్, హ్యాండ్‌మేడ్ జ్యువెలరీ.. ఇలా ఎన్నో ఆదివారం అంగట్లో లభిస్తాయి. అలాగే టై గార్డెనింగ్, క్రియేటివ్ డిజైన్ స్పేస్ గురించి తెలుసుకోవచ్చు. బంజారాహిల్స్‌లోని లామకాన్‌లో ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 2.30 వరకు ఇది కొనసాగుతుంది. వీర్‌దాస్ షో... ప్రసిద్ధ భారతీయ స్టాండప్ కమెడియన్ వీర్‌దాస్ నగరంలో తన ప్రదర్శన నిర్వహిస్తున్నారు. ‘అన్బిలీవబులిష్-ట్రూ వర్డ్స్ ఫ్రమ్ ది మౌత్ ఆఫ్ ఎ లయర్’ పేరుతో నిర్వహించే ఈ ప్రదర్శన ఆదివారం రాత్రి 8 గంటలకు శిల్పకళావేదిక లో ఉంటుంది. బాటిల్ ఆఫ్ బ్యాండ్స్.. నగరానికి చెందిన పలు రాక్ బ్యాండ్స్ పోటాపోటీగా తమదైన శైలి సంగీతంతో హోరెత్తిస్తూ సాగే బాటిల్ ఆఫ్ బ్యాండ్స్... కార్యక్రమం పంజాగుట్టలోని సెంట్రల్మాల్లో జరుగనుంది. ఈ బ్యాండ్స్ వార్ ఆదివారం సాయంత్రం 5గంటలకు ప్రారంభమవుతుంది. ఎంబ్రాయిడరీ వర్క్‌షాప్ బంజారా ఎంబ్రాయిడరీతో చేసే చేతి సంచులు, పర్సులు, రకరకాల గృహాలంకారాలకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ కలర్‌ఫుల్ ఎంబ్రాయిడరీ నేర్చుకోవాలనుకునే వారి కోసం వర్క్‌షాప్ నిర్వహిస్తున్నారు. ఎప్పుడు: మే 30, 31 ఎక్కడ: సికింద్రబాద్ అవర్ సేక్రెడ్ స్పేస్ ఉర్దూ గజల్స్‌కి ప్రాముఖ్యత ఎందుకు..! ఈ అంశం గురించి ప్రత్యేక చర్చా కార్యక్రమం జూన్ 2న సాయంత్రం 7 గంటలకు లామకాన్‌లో జరగనుంది. హైదరాబాద్, లక్నోకి చెందిన ప్రముఖ ఉర్దూ ప్రొఫెసర్లు పాల్గొంటున్న ఈ కార్యక్రమానికి ప్రవేశం ఉచితం. -
ఆర్ట్స్ ఆన్లైన్ - ఆర్ట్స్ ఆఫ్‌లైన్
మీరు చేసిన ఆర్ట్ వర్క్ ఆన్లైన్, ఆఫ్‌లైన్‌లో అమ్మటం ఎలాగో తెలుసుకోవాలనుకుంటే ఈ మీటప్ మీ కోసమే అంటున్నారు ఈ కార్యక్రమ నిర్వాహకులు. వివరాలు: ది గ్యాలరీ కఫే, బంజారాహిల్స్ రోడ్ నెం.10లో, ఉదయం 8.30కు -
లంబాడీ స్టైల్ ఎంబ్రాయిడరీ వర్క్‌షాప్
బంజారా ఎంబ్రాయిడరీతో చేసే చేతి సంచులు, పర్సులు, రకరకాల గృహాలంకారాలకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ కలర్‌ఫుల్ ఎంబ్రాయిడరీ నేర్చుకోవాలనుకునే వారి కోసం వర్క్‌షాప్ నిర్వహిస్తున్నారు. ఎప్పుడు: మే 30, 31 ఎక్కడ: సికింద్రబాద్ అవర్ సేక్రెడ్ స్పేస్ -
బాటిల్ ఆఫ్ బ్యాండ్స్..
నగరానికి చెందిన పలు రాక్ బ్యాండ్స్ పోటాపోటీగా తమదైన శైలి సంగీతంతో హోరెత్తిస్తూ సాగే బాటిల్ ఆఫ్ బ్యాండ్స్... కార్యక్రమం పంజాగుట్టలోని సెంట్రల్మాల్లో జరుగనుంది. ఈ బ్యాండ్స్ వార్ ఆదివారం సాయంత్రం 5గంటలకు ప్రారంభమవుతుంది. -
వీర్‌దాస్ షో...
ప్రసిద్ధ భారతీయ స్టాండప్ కమెడియన్ వీర్‌దాస్ నగరంలో తన ప్రదర్శన నిర్వహిస్తున్నారు. ‘అన్బిలీవబులిష్-ట్రూ వర్డ్స్ ఫ్రమ్ ది మౌత్ ఆఫ్ ఎ లయర్’ పేరుతో నిర్వహించే ఈ ప్రదర్శన ఆదివారం రాత్రి 8 గంటలకు శిల్పకళావేదిక లో ఉంటుంది. -
క్లాసికల్ డ్యాన్స్‌తోనే భవిష్యత్తు..
బాలీవుడ్ కొరియోగ్రాఫర్ సరోజ్‌ఖాన్ సాక్షి, లైఫ్‌స్టైల్ ప్రతినిధి : ‘ఏ డ్యాన్స్‌లో రాణించాలనుకున్నా ముందస్తుగా సంప్రదాయ నృత్యం సాధన చేయాల్సిందే. క్లాసికల్ డ్యాన్స్‌లో ప్రావీణ్యం సాధిస్తే ఏ డ్యాన్సయినా సులువుగా చేయవచ్చు. నృత్యంలో రాణించాలనుకున్నవారు ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకోవాలి’ అని సూచించారు ప్రసిద్ధ బాలీవుడ్ కొరియోగ్రాఫర్ సరోజ్‌ఖాన్. నగరానికి చెందిన ప్రసిద్ధ ఒడిస్సీ నృత్యకారిణి సోనాలి ఆచార్జీ మాదాపూర్‌లోని సోనాలి అకాడమీ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మోడ్రన్ డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ను ఆమె శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సరోజ్‌ఖాన్ మాట్లాడుతూ తాను ప్రాథమికంగా క్లాసికల్ డ్యాన్సర్‌ని కాబట్టే విభిన్న రకాల పాటలకు నృత్యాలను అందించగలిగానన్నారు. అయితే ఇప్పుడు సినిమాల్లో వచ్చే డ్యాన్స్‌లు చూస్తుంటే అవేమిటో తనకే అర్థం కావడం లేదన్నారు. కొన్ని సినిమాల్లో కొరియోగ్రాఫర్‌తో సంబంధం లేకుండానే డ్యాన్స్‌లు చేసేస్తున్నారని, ఈ మధ్య వచ్చిన ఒక సినిమాలో పాటకు హీరోనే డ్యాన్స్ డెరైక్షన్ చేసేశాడని చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో, పొట్టి పొట్టి దుస్తుల హీరోయిన్లతో పనిచేయలేకే బాలీవుడ్లో కొరియోగ్రఫీ చేయడం లేదన్నారు. హైదరాబాద్‌లో సోనాలితో కలిసి ఇన్స్టిట్యూట్ ప్రారంభించడం సంతోషంగా ఉందంటూ ప్రతి 2 నెలలకు ఒకసారి నగరానికి వచ్చి స్టూడెంట్స్ ప్రతిభను పరిశీలిస్తానని, అలాగే రానున్న దీపావళికి 11 రోజుల పాటు ప్రత్యేకంగా వర్క్‌షాప్ నిర్వహించి పెద్ద ప్రదర్శన నిర్వహిస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కళాతపస్వి తెలుగు సినీ దర్శకులు కె.విశ్వనాథ్ మాట్లాడుతూ సంప్రదాయ నృత్యం, సంగీతం మనసుకు ఆహ్లాదాన్ని అందిస్తాయన్నారు. సంగీతం, పాటలు తప్ప ఏముంటాయి ఆయన సినిమాలో అంటూ కొందరు విమర్శించినా... సిరిసిరిమువ్వ దగ్గర్నుంచి తన ప్రతి సినిమాలో వాటికే పెద్ద పీట వేశానని గుర్తు చేశారు. మన సంప్రదాయ మూలాల్ని మరిచిపోతే మనకంటూ ఉన్న గుర్తింపు కోల్పోతామని పిల్లలకు ఈ విషయంలో అవగాహన పెంచాల్సిన బాధ్యత పెద్దలదేనన్నారు. ఇన్స్టిట్యూట్ నిర్వాహకురాలు సోనాలి మాట్లాడుతూ సంప్రదాయ ఒడిస్సీతో పాటు బాలీవుడ్ నృత్యాల్లో కూడా తాము శిక్షణ అందిస్తామన్నారు. -
సమర మే చేద్దామిలా..
సూర్య@42.9 నిన్నా మొన్నటి దాకా కాస్త చూసీ చూడనట్టు ఉన్న సూరీడు.. ‘మే’ నెల, రోహిణీ కార్తె రోజుల్లో ఒక్కసారిగా ఉగ్రరూపం దాల్చాడు. కేవలం 4 రోజుల్లో అమాంతం పెరిగిన ఎండలు.. నగరవాసిని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. మండే ఎండలను ఎదుర్కోవడంలో మనకి తోడ్పడేందుకు వైద్యులు, ఫిట్నెస్ ట్రైనర్లు విలువైన సూచనలు అందిస్తున్నారు. - సాక్షి, లైఫ్‌స్టైల్ ప్రతినిధి గ్రీష్మ భానుడు ఉగ్రరూపం దాల్చాడు. రెండు రోజులుగా నగరంపై విరుచుకు పడుతున్నాడు. ఉదయం నుంచే తన విశ్వరూపం చూపుతూ ప్రజలను ఠారెత్తిస్తున్నాడు. ఎండలు ఒక్కసారిగా పెరగడంతో సిటీజనులు అల్లాడుతున్నారు. నీడ లేకుండా క్షణం నిలవలేకపోతున్నారు. ఇంటి నుంచి బయటకు వెళ్లాలంటే భయపడుతున్నారు. ఒకవేళ వెళ్లినా గొంతు తడుపుకొనే మార్గం కోసం వెదుకుతున్నారు. బుధవారం ఎండకు తట్టుకోలేక ప్రజలు పడే పాట్లు ఇలా ‘సాక్షి’ కెమెరాకు చిక్కాయి. దాహమేస్తే ఇలా.. మూలు రోజులకన్నా ఈ సీజన్లో కనీసం 3 రెట్లు నీళ్లు అధికంగా తీసుకోవాలి. పళ్ల రసాలు, మజ్జిగ, రాగి మాల్ట్, నిమ్మరసం వంటివన్నీ ఉపయుక్తమైన ద్రవాహారాన్ని అందించేవే. ఫ్రిజ్ నీటిని తాగకుండా కుండలు, కూజాలే ఉత్తమం. విపరీతమైన దాహం వేసే వరకూ ఆగకుండా ఈ సీజన్లో తరచుగా నీరు, బార్లీ వంటి ద్రవాహారం తీసుకుంటుండాలి. సహజాహారమే సరైంది.. వేసవికాలం రుచికరమైన, ఆరోగ్యకరమైన సీజనల్ ఫ్రూట్స్‌కి విడిది. యాంటీ ఆక్సిడెంట్స్ నిండిన తాజా పండ్లు, కూరగాయలు దేహాన్ని చల్లబరచడంలో, విటమిన్లు, మినరల్స్‌ను అందించడంలో ఉపకరిస్తాయి. వీటిలో.. బ్లాక్ బెర్రీస్, బ్లూ బెర్రీస్, స్ట్రా బెర్రీస్, రాస్ బెర్రీస్, బొప్పాయి, పచ్చి మామిడి, చెర్రీస్, యాపిల్, పుచ్చకాయ, ఉసిరి.. వంటివి విరివిగా ఉపయోగించడం మంచిది. కూరగాయల్లో కాకరకాయ, క్యాబేజి, కాలిఫ్లవర్, బ్రాక్కొలి, దోస, గ్రీన్‌బీన్స్, ఆస్పారెగస్, అల్ఫా అల్ఫా, పెద్ద వంకాయ, ఐస్‌బర్గ్, పుదీనా... వంటివి నీటి పరిమాణాన్ని దేహంలో సమపాళ్లలో ఉంచేందుకు ఉపకరిస్తాయి. మాంసాహారం పరిమితం చేయాలి. చెమట కారణంగా కోల్పోయే శక్తిని సులభంగా పొందేందుకు ప్రోటీన్ షేక్స్ తీసుకోవచ్చు. ఓట్మీల్, బ్రౌన్ రైస్, తియ్యటి బంగాళ దుంపలు ఆహారంలో భాగం చేస్తే బెటర్. ఆహారంతో ఓ టేబుల్ స్పూన్ ఫ్లాక్స్‌సీడ్ ఆయిల్‌ను రోజుకు ఒకటి లేదా రెండు సార్లు కలిపి తీసుకుంటే దేహానికి అవసరమైన ఫాటీ యాసిడ్స్ అందుతాయి. స్నానమే పరిష్కారం.. చమట పూర్తిగా ఆరాక మాత్రమే స్నానం చేయాలి. కనీసం రోజుకు 2 లేదా వీలైతే 3 సార్లు స్నానం, దీనికి వినియోగించే నీళ్లలో రోజ్ వాటర్, ఆల్మండ్ ఆయిల్ లాంటి మెడికేటెడ్ ఉత్పత్తులు కలపడం మేలు. ఉదయపు స్నానం వంట్లో బడలికను పోగొట్టి హుషారుగా చేసేందుకు సహకరిస్తే, రాత్రి వేళ స్నానం మలినాలను తొలగించి చక్కని నిద్ర కు తోడ్పడుతుంది. మంచి నిద్ర మజిల్ పునరుత్తేజానికి అవసరం. ఆరోగ్య సమస్యలేమీ లేకపోతే చన్నీళ్ల స్నానం బెటర్ అంటున్నారు కేర్ క్లినిక్స్‌కు చెందిన ‘ఫిజియో’ శశిశేఖర్. మేలైన మార్గం యోగా వేసవిలో యోగా చాలా మంచిదని కపిలమహర్షి యోగా రీసోర్స్ సెంటర్‌కు చెందిన యోగా నిపుణులు సి.ఎస్.రావు చెబుతున్నారు. సూర్య నమస్కారం 12 భంగిమలు లెక్కిస్తూ చేయాలి. భంగిమకి 5 సెకన్లు చొప్పున కేటాయిస్తూ ఓ నిమిషం సమయంలో పూర్తి చేయాలి. వేసవి కాలానికి తగ్గట్టుగా నిదానంగా చేసే ఈ సూర్య నమస్కారాలను రోజులో 6 సార్లు ఆచరిస్తే వేసవి కారణంగా వచ్చే ఆరోగ్య సమస్యలు దరిచేరవు. ఉష్ట్రాసనం, భద్రాసనం, ఏకన్ముక్తాసనం, శశాంకాసనం, అర్ధకోణాసనం, ప్రశాంతాసనం, యోగనిద్ర, షణ్ముఖి ముద్ర ఆసనాలు కూడా మంచివే. నేలపై కూర్చుని, పడుకుని చేస్తూ ఒక ఆసనం లోంచి మరో ఆసనంలోకి మారేటప్పుడు సాధారణ శ్వాస తీసుకుంటూ రెండు శ్వాసల వ్యవధి ఉండేలా చూడాలి. శీతలి, ఉజ్జయి, చంద్రఖేధిని, నాడిశోధన చేయడం ద్వారా ఎండ వేడిమి వల్ల కలిగే శారీర క ఇబ్బందులన్నింటినీ అధిగమించవచ్చు. -
పెయింటింగ్ వర్క్‌షాప్
ఆలోచనలకు రంగులద్ది, చక్కటి పెయింటింగ్స్ వేయాలని అనుకునే వారికోసం సికింద్రాబాద్‌లోని అవర్ సాక్రెడ్ స్పేస్‌లో వర్క్‌షాప్ నిర్వహించనున్నారు. ఈనెల 16, 17 తేదీల్లో జరిగే వర్క్‌షాప్ చిత్రలేఖనంలో బేసిక్స్ తెలుసుకోవాలనుకునే వారికి చక్కటి అవకాశం. వాటర్ కలర్స్‌ను వాడుతూ అందమైన ఊహలకు రూపమివ్వడానికి ఉపకరించేలా ఇది కొనసాగుతుంది. -
‘పర్సనల్ సేఫ్టీ’పై అవగాహన
పిల్లలు, పెద్దలకు వ్యక్తిగత భద్రత పట్ల అవగాహన కలిగించేందుకు ఈనెల 16న సాయంత్రం 4.30 గంటలకు బంజారాహిల్స్ లామకాన్‌లో చర్చా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఆలోచనా విధానాలు, యంత్రాంగాలు ఇలా వ్యక్తిగత భద్రతకు సంబంధించిన అన్ని కోణాలపై చర్చించనున్నారు. పిల్లల భద్రత గురించి, భవిష్యత్తు గురించి ఆలోచించడానికి సిద్ధంగా ఉన్న టీనేజర్, యంగ్‌స్టర్, పేరెంట్స్ అందరూ ఈ చర్చలో పాల్గొనవచ్చని కార్యక్రమ నిర్వాహకులు మిహిరా అపరేందర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో 15 ఏళ్లు పైబడిన వారు ఎవరైనా పాల్గొనవచ్చు. ప్రవేశం ఉచితం. తబలా క్లాసెస్ సుహాస్ ఆధ్వర్యంలో శని, ఆదివారాల్లో ఉదయం 10 నుంచి 11 వరకు బంజారాహిల్స్ లామకాన్‌లో తబలా శిక్షణా తరగతులు నిర్వహిస్తారు. -
ఫ్లాట్ డిస్కౌంట్
సిటీలోని బ్రాండ్ ఫ్యాక్టరీ ఫ్లాట్ 40 శాతం రాయితీని ప్రకటించింది. పురుషులు, మహిళలు, పిల్లలకు సంబంధించిన అన్ని వస్త్రాలపై ఈ డిస్కౌంట్ వర్తిస్తుంది. స్పోర్ట్స్ షూస్, లగేజి, ఉమెన్ హ్యాండ్ బాగ్స్కు కూడా వర్తించే ఈ డిస్కౌంట్ ఈనెల 15 నుంచి 24 వరకు అందుబాటులో ఉంటుంది. యునెటైడ్ కలర్స్ ఆఫ్ బెనెటన్, కలర్ ప్లస్, జాన్ ప్లేయర్, పార్క్స్, పార్క్ అవెన్యూ, రేమండ్స్, మినరల్, లీ, రాంగ్లర్, నైకీ, పూమా, జీని అండ్ జానీ తదితర బ్రాండ్స్ అందుబాటులో ఉన్నాయని బ్రాండ్ ఫ్యాక్టరీ ప్రతినిథి రాక్ డిసౌజా తెలిపారు. -
హోటల్ మేనేజ్మెంట్లో ఉచిత శిక్షణ
హయత్‌నగర్: నిథం-ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్కిల్స్ ఆధ్వర్యంలో హోటల్ మేనేజ్మెంట్లో ఉచిత శిక్షణను ఇస్తున్నట్లు నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు. 10వ తరగతి పాసై, 18-30 సంవత్సరాల వయసుగల వారు దరఖాస్తులు చేసుకోవాలని వారు తెలిపారు. వివరాలకు 9959173183, 9989313278 నెంబర్లకు ఫోన్ చేయవచ్చు. -
ఆన్లైన్ మార్కెటింగ్ కోర్సు
ఆన్లైన్ మార్కెటింగ్ మెళకువలను నేర్పేందుకు ఈనెల 18 నుంచి కొత్త బ్యాచ్‌ను ప్రారంభిస్తోంది మాదాపూర్‌లోని డిజిటల్ మార్కెటింగ్ సంస్థ. ఇప్పటికే బిజినెస్ రంగంలో ఉన్నవారితో పాటు గృహిణులు, స్టార్టప్ యజమానులు, ఎంటర్‌ప్రెన్యూర్స్, మేనేజ్మెంట్ స్టడీస్, అడ్వర్టైజింగ్ అండ్ మార్కెటింగ్ ప్రొఫెషనల్స్‌కు ఈ ఆన్లైన్ మార్కెటింగ్ లాభదాయకమని సంస్థ తెలిపింది. డిజిటల్ మార్కెటింగ్‌లో వస్తున్న నయా ట్రెండ్ విషయాలను చెప్పేందుకు ఫ్రీ డెమో క్లాస్‌లను నిర్వహిస్తోంది. ఆసక్తి గలవారు 088015 66566 నంబర్లో సంప్రదించవచ్చు. -
నా ప్రతి అడుగులో అమ్మ ఉంది..
‘శాంత బయోటెక్’ ఫౌండర్‌గా పరిచయం అవసరంలేని ప్రముఖ వ్యాపారవేత్త, శాస్త్రవేత్త వరప్రసాద్ రెడ్డి. ఎన్ని పదవులు వరించినా.. ఎంత పెద్ద హోదాలో ఉన్నా అమ్మకు నచ్చిన తనయుడిగా ఉంటే చాలనుకునే వరాల పుత్రుడు ఆయన. తాను ఎదిగిన ప్రతి మలుపులో అమ్మ తోడ్పాటు ఉందని.. అమ్మ పుట్టిన రోజును (మే 9) ‘మాతృ దినోత్సవం’గా జరుపుకుంటున్నారాయన. ‘నాఎదుగుదలకు కారణం అమ్మ’ అని ఆయనంటే.. ‘నేనేం చేసానయ్యా నీకు జన్మతహా వచ్చింది.. సాధించావు’.. అంటుందా తల్లి. మాతృదినోత్సవం సందర్భంగా ఆ తల్లి, తనయుల మాటలు.. ‘ఇంట్లో స్త్రీ చదువు, సంస్కారవంతమైనది అయితే ఆ ఇంట్లో అందరూ సంస్కారవంతులవుతారు. బిడ్డ కడుపులో ఉన్నప్పటి నుంచే ఆమె ఆలోచనలు, తినే ఆహారం, చదివే పుస్తకం, వినే శబ్దాలు, సంగీతం అన్నీ బిడ్డ మీద ప్రభావం చూపిస్తాయి. అవి సహజంగానే బిడ్డకు అబ్బుతాయి. ప్రణాళికాబద్ధ మైన జీవితం, ఆధ్యాత్మిక చింతన, ఏ విషయానికి ఉద్రేక పడకుండా ఉండే స్వభావం ఆమె నుంచే వచ్చాయి. గురువు చదువు నేర్పిస్తే.. సంస్కారం అమ్మ నేర్పుతుంది. సంస్కారం లేకపోతే సంపూర్ణమైన వ్యక్తిత్వం రాదు’.. కృతజ్ఞతగా చెప్పారు కొడుకు వరప్రసాద్ రెడ్డి. ‘అమ్మ నాలుగున్నర కల్లా లేస్తారు. ఆ సమయానికి లేచి ఆమెతో పాటు కాసేపు కూర్చుని మిగతా పనులు మొదలుపెడతాను. నేనున్న వృత్తిలో ప్రయాణాలు ఎక్కువ. దానివల్ల అమ్మను రోజూ చూసే అవకాశం ఉండదు. చాలా బాధగా ఉండేది. రిటైర్ అయిన తర్వాత ఇప్పుడు ఎక్కువగా ఆఫీస్‌కి వెళ్లడం లేదు. అమ్మతో ఎక్కువ టైం గడుపుతున్నాను. నేనొక్కడినే ఆమెకు సంతానం. ఈ వయసులో ఆమెకు ఇవ్వగలిగిన బహుమతులు ఏం ఉంటాయి..! మధ్య వయస్కులకు, చిన్న పిల్లలకు బహుమతులు ఇస్తాం. ఈ వయసులో ఆమె నగలు, చీరలు వేసుకోలేదు. అందుకే ఏడేళ్ల క్రితం ఆమెకు ఉత్తరం రాశాను. ఆమె దాన్ని చదువుకుని, మనసంతా తడైపోయింది. ‘మడిచి జేబులో పెట్టుకునే ఉత్తరం కాదు, నీ బిడ్డలు దీన్ని చూడాలి. వాళ్ల తల్లిని వారు అలాగే చూసుకోవాలి. పటం కట్టించు’ అంది. అమ్మకు నేనిచ్చిన బహుమతి నచ్చింది’. కొడుకు సంతోషం. ‘ఏదో రామాయణం, భారతంలో కథలు చెప్తే ఊ.. కొట్టేవాడు. నిద్దరొస్తే పడుకునేవాడు. ఇంట్లో పది మంది పిల్లలున్నా వారితో చేరి అల్లరి చేసేవాడు కాదు. అతిశయంగా చెప్పటం లేదు. చెప్పింది వినేవాడు. ఒక్కమాట ఎవరినీ అనేవాడు కాదు. దేవుడి నైవేద్యం కూడా పెట్టేవరకూ తాకేవాడు కాదు. పుట్టుకతో వచ్చిన లక్షణాలే అవి’.. అంటుంది శాంతమ్మ. ‘పది మందికి ఉపయోగపడేలా ఉండమని, నిస్వార్థంగా చేసేది మనకు కలిసొస్తుంది నాయనా.. అని చెప్పానే తప్పా ఫలానా పని చెయ్యి.. వద్దు అంటూ చెప్పలేదు. తినేది నలుగురికి పెట్టేవాడు. ఇప్పటికీ అదే తీరు. ఇంట్లో ఏది చేసినా తీసుకెళ్లి నలుగురు పిల్లకాయలకు పెట్టి తింటాడు. అలా పెరిగిన క్రమంలో వంటపట్టినని ఏమన్నా ఉన్నాయేమో గాని, నేను ప్రత్యేకంగా ఏమీ నేర్పలేదు. తల్లికి పిల్లలు వృద్ధిలోకి రావాలనే ఉంటదిగా. పెద్దోడై, మంచి మనసుతో, మంచి ఉద్దేశంతో, పది మందికి ఉపయోగపడే మనస్తత్వం కలవాడు కావాలని అనుకుంటాం. మాది వ్యవసాయ కుటుంబం. అయిదో తరగతి చదువున్న దాన్ని. గొప్పగా ఏం చెప్పగలను’ అంటుంది భూషణం లాంటి కొడుకుని కన్న ఈ బంగారు తల్లి. ‘ఆ రోజుల్లో 5వ తరగతి వరకే చదువుకున్నప్పటికీ సాహిత్యం, పురాణ, ఇతిహాసాల మీద పట్టు ఉంది. వాటి సారం వివరించేది. మంచి, చెడుల మధ్య విచక్షణ తెలుసుకుంది. చదువు భుక్తి కోసం అయితే సంస్కారం జీవన్ముక్తికి అవసరం. అమ్మ నుంచి మనకొచ్చే ఈ సంస్కారం మనం గుర్తించం. తల్లి దగ్గర అది నేర్చుకున్నాం అని కూడా చెప్పం. అలా ఆమె ఇచ్చిన సౌభాగ్యాన్ని మదర్స్‌డే రోజు బోకే ఇచ్చి తీర్చుకోలేం. ప్రతి రోజు ఆమె కోసం ఆలోచించాలి’. ఇది ఆ కొడుకు కృతజ్ఞత. ‘పద్యం దాని తాత్పర్యం చెప్పేదాన్ని.. బుద్ధిగా వినేవాడు. సుభాషితాలు, వేమన, సుమతి శతకాలు అన్నీ నీతి వాక్యాలే కాబట్టి అవి ఆకట్టుకుని ఉండవచ్చు. అంతేగాని నేను ప్రత్యేకంగా కొట్టి, తిట్టి చెప్పింది, నేర్పించింది ఏమీ లేదు. తోటి పిల్లలతో ఆడుకోవటం కన్నా నా దగ్గరే ఎక్కవ సేపు గడిపేవాడు’. ఆ అమ్మ నిరాడంబరత. ‘స్త్రీ బాగుంటే సమాజం, పరిజనం అంతా బాగుంటాయి. ఆ ఉద్దేశంతోనే తల్లిని బాగా చూసుకోవాలి. అమ్మ రుణం తీర్చుకోవాలంటే అమ్మకు అమ్మగా పుట్టాలి. అప్పుడే ఆమె చేసినంత సేవ ఆమెకు చేయగలం’ అమ్మా నీవే నేను నేనే నీవు నేను నీలో అంతర్భాగానిని నీవు నాలో అంతర్వాహినివి..! -
‘అమ్మ’దనానికి ప్రతీక యశోదమ్మ
‘మాది మధ్యతరగతి కుటుంబం. నాన్న రామచందర్ రావు రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఆర్ఐ. ఉద్యోగరీత్యా వివిధ ప్రాంతాలకు వెళుతుండేవారు. ఇదే క్రమంలో నల్లగొండ జిల్లాలోని గుమ్మడివెల్లి గ్రామం నుంచి హన్మకొండకు మకాం మార్చాం. నాన్న మరో ప్రాంతానికి బదిలీ అయ్యారు. అమ్మ యశోదా దేవి మా చదువుల కోసం హన్మకొండలోని శివారు గ్రామాల్లో భూమి కౌలుకు తీసుకొని వ్యవసాయం చేశారు. కాజీపేటలోని సెయింట్ గాబ్రియల్ స్కూల్లో పదో తరగతి వరకు చదివించారు. ఇంటర్ తర్వాత బ్రదర్స్ సురేందర్ రావు, నరేందర్ రావు మెడిసిన్‌లో చేరారు. నేను ఇంజనీరింగ్ పూర్తి చేశా. మరో బ్రదర్ సీఏ చేశాడు. మమ్మల్ని సరైన మార్గంలో నడపడంలో మా అమ్మ పాత్ర మరవలేనిది. వృధా ఖర్చులకు ఎప్పుడూ దూరంగా ఉంచేది. తెల్లవారుజామునే లేపి చదివించడంతో పాటు చదువుకుంటేనే జీవితంలో ఏదైనా సాధించవచ్చని పదేపదే చెప్పేది. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే తత్వం మాకు చిన్నప్పటి నుంచే అమ్మ అలవర్చారు. అమ్మ మీద ప్రేమ, గౌరవంతో యశోద హాస్పిటల్స్ ప్రారంభించాం. 1989లో ఒక చిన్న క్లినిక్‌గా ప్రారంభమైన యశోద హాస్పిటల్ పాతికేళ్ల కాలంలో అగ్రశ్రేణి వైద్య సంస్థగా ఎదగడంలో అమ్మ దీవెనలు ఉన్నాయి. తల్లిగా.. కుటుంబానికి పెద్ద దిక్కుగా.. సంకల్పంతోనూ.. శ్రమించే తత్వంతోనూ.. అంకితభావంతోనూ, క్రమశిక్షణతోనూ ఎందరికో ఆదర్శమూర్తి అయిన అమ్మ జీవితం ఈతరం వారికి స్ఫూర్తి అవుతుందని అనుకుంటున్నా. ఇప్పుడు అమ్మ మా మధ్యలో లేకున్నా... ఆమె చూపిన మార్గంలోనే ముందుకెళుతున్నాం’. - గోరుకంటి రవీందర్రావు, చైర్మన్, యశోద హాస్పిటల్స్ -
'అర్ధగంట చేజింగ్ తర్వాత దొరికాడు'
ఎంతటివారైనా బాల్యాన్ని గుర్తు చేసుకుంటే అమ్మతో గడిపిన క్షణాలే జ్ఞాపకాల దొంతర్లుగా కళ్ల ముందు కదలాడతాయి. ప్రతిచోటా అమ్మ చూపిన ప్రేమానురాగాలే గుర్తుకు వస్తాయి. ఏమిచ్చినా అమ్మ రుణం తీరదు. లోకంలో ఏదీ అమ్మ ప్రేమకు సాటిరాదు. అమ్మతో ఉన్న అనుబంధాన్ని కొందరు ప్రముఖులు ఇలా గుర్తు చేసుకున్నారు. వారి మాటల్లోనే... ‘1950 మార్చి మూడో తేదీ...నెల్లూరు జిల్లా మొలాపేట.. ఒక కుర్రాడి కోసం సందుల్లో నలుగురు పరుగెత్తుతున్నారు. గోడలు దూకేస్తున్నారు. అరగంట చేజింగ్ తర్వాత దొరికాడు. పట్టుకొని ఇంటికి తీసుకొచ్చారు. అక్కడ ఒక ఆవిడ కాళ్ల మీద కుర్రాడిని బలవంతంగా పడుకోబెట్టారు. ఉగ్గుగిన్నెలోని వంటాముదం కుర్రాడి నోట్లో పోశారు. ఆ కుర్రాడు ఇప్పటి నటుడు జయప్రకాశ్ రెడ్డి. కాళ్ల మీద కుర్రాడిని పెట్టుకుంది జేపీ అమ్మ సాంబ్రాజ్యమ్మ. ‘రెండు, మూడు నెలలకోసారి నేను పరుగెత్తే సీన్ రీపిట్ అవుతుండేద’ని అమ్మతో అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు జేపీ. విసుక్కునేది కాదు.. నాన్న సాంబిరెడ్డి పోలీసు ఆఫీసర్. రోజూ పదుల సంఖ్యలో జనాలు ఇంటికి వచ్చేవారు. వారందరికీ టీతో సరిపెట్టకుండా మా అమ్మ టిఫిన్లు కూడా చేసేది. అస్సలు విసుక్కునేది కాదు. పెద్దయ్యాక నాటకాలు వేస్తూ రాత్రి ఒంటి గంటకు ఇంటికి చేరేవాణ్ని. నాతోపాటు ఐదారుగురు ఆర్టిస్టులు వచ్చేవారు. ఆ టైమ్‌లోనూ అమ్మ ఎంతో ఓపికగా అందరికీ భోజనం పెట్టేది. పూర్తి శాకాహారి.. మా అమ్మ ప్యూర్ వెజిటేరియన్. మా కోసమే నాన్‌వెజ్ వండడం నేర్చుకుంది. ఆమె మాత్రం శాకాహారమే తినేది. అమెరికాలో బ్రదర్స్‌తో కలిసి 18 ఏళ్లు ఉంది. అక్కడ బ్రదర్ ఫ్రెండ్స్ అమెరికా వాళ్లు అమ్మ వంట రుచికి ఫిదా అయిపోయారు. పక్షవాతం వచ్చిన నాన్నను కంటికి రెప్పలా చూసుకోవడం ఇప్పటికీ నా మదిలో కదలాడుతునే ఉన్నాయి. ఇప్పుడు 84 ఏళ్లు.. నేను చిన్నగా ఉన్నప్పుడే అమ్మకు టీబీ సోకింది. చెన్నైలో వైద్యం చేయిస్తే తగ్గిపోయింది. ఇప్పడు అమ్మకు 84 ఏళ్లు. ఓపెన్ హార్ట్ సర్జరీ కావడంతో అమ్మను మూడున్నరేళ్ల క్రితం గుంటూరుకు తీసుకొచ్చా. చంటి పిల్లలా వ్యవహరిస్తున్న అమ్మను చూస్తుంటే నా చిన్నప్పటి రోజులు గుర్తుకొస్తున్నాయి. తన తల్లికంటే ఎక్కువగా మా అమ్మను జాగ్రత్తగా చూసుకునే భార్య దొరకడం నా అదృష్టం’’. -
ప్రాణం నీవే పయనం నీవే
నేడు అంతర్జాతీయ మాతృదినోత్సవం అమృతం కంటే కమ్మనైనది.. అనంతమైన ప్రేమ.. హద్దులు లేని వాత్సల్యం.. భూదేవికున్న ఓపిక ఎవరికుంటాయి..! ఒక్క అమ్మకు తప్ప. అందుకే దేవుడే ఆ ప్రేమ కోసం పరితపించాడు. బిడ్డ కడుపున పడ్డాక.. నెలలు గడుస్తున్న కొద్దీ పెరుగుతున్న బరువును ఓపికగా మోస్తుంది. చీకటి గర్భంలోని కదలికలను చేతితో తడుముకుంటూ రంగుల కలను కంటుంది. నేలపై పడ్డ బుజ్జి పాపాయికి లోకాన్ని పరిచయం చేస్తుంది. అందుకే అమ్మ దేవుడికన్నా మిన్న. -
చేనేత షో యగం
పోచంపల్లి వస్త్ర సోయగం.. సిటీవాసులను పలకరించింది. కుషాయిగూడలోని ఈసీఐఎల్ క్రాస్ రోడ్డు ఎస్‌ఎస్‌ఐసీ ఎగ్జిబిషన్ సెంటర్లో శుక్రవారం పోచంపల్లి ఇకత్ ఆర్ట్ మేళాను టాలీవుడ్ నటి హాసికా దత్ ప్రారంభించింది. ష్యాషన్ లుక్.. ట్రెడిషనల్ మార్క్.. ఈ రెండూ చేనేత వస్త్రాల్లోనే కనిపిస్తాయన్నారామె. తాను కూడా చేనేత వస్త్రాలను ఇష్టంగా ధరిస్తానని చెప్పారు. ఈ నెల 17 వరకు కొనసాగే ప్రదర్శనలో.. డిజైనర్ శారీస్, సిల్క్ అండ్ కాటన్ డ్రెస్ మెటీరియల్స్, కుర్తాలు, టేబుల్ లెనిన్ వంటి రకరకాల ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ప్రదర్శన కొనసాగుతుంది. - కుషాయిగూడ -
సల్లూభాయ్.. వుయ్ లవ్ యు..
బాలీవుడ్ స్టార్, కండల వీరుడు సల్మాన్‌ఖాన్‌కు హిట్ అండ్ రన్ కేసులో శిక్ష ఖరారవడం నగరవాసుల్లో విషాదాన్ని నింపింది. బాలీవుడ్ హీరోల్లో బహుశా ఎవరికీ లేనంత అనుబంధం సల్మాన్‌ఖాన్‌కి సిటీతో ఉంది. సల్లూభాయ్ నగరానికి వస్తే చాలు అతడిని చూడడానికి ఎగబడతారు. తన సినిమాలను సూపర్‌హిట్ చేయడంలో రికార్డులు సృష్టించిన జోధ్‌పూర్ వంటి నగరాలను దాటి సల్మాన్ మన హైదరాబాద్‌కు వచ్చారు. ఇక్కడి అభిమానులు సల్మాన్ మానియాకు కేరాఫ్‌గా నిలిచారనేది అధికారికంగా రూఢీ అయిన విషయం. అందుకే.. ‘సల్లూభాయ్ వుయ్ లవ్ యు’ అంటూ సిటీ సినీ ప్రియులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. - సాక్షి, లైఫ్‌స్టైల్ ప్రతినిధి క్రేజ్‌కి కేరాఫ్ సల్లూభాయ్ సల్మాన్‌కి సిటీ అంటే మహా ఇష్టం. హైదరాబాద్‌లో సినిమా షూటింగ్స్ అంటే ఇష్టపడేవాడని బాలీవుడ్ నిర్మాతలు అంటుంటారు. తెలుగు నటి భూమికాచావ్లాతో నటించిన ‘తేరేనామ్’ ఇక్కడి సిటీ కాలేజ్‌లోనే ఎక్కువ భాగం షూట్ చేశారు. ఇంకా ‘వాంటెడ్’ తదితర సినిమాలూ షూటింగ్ జరుపుకున్నాయిక్కడ. మన బిర్యానీ అన్నా, హలీమ్ అన్నా సల్మాన్‌కి చాలా ఇష్టం. తన సోదరి అర్పిత పెళ్లి నగరంలోని ఫలక్‌నుమా ప్యాలెస్‌లో చేయడం సిటీ మీద సల్మాన్‌కి ఉన్న అభిమానానికి నిదర్శనం. సల్మాన్ హోస్ట్ చేసిన టీవీ షో ‘బిగ్‌బాస్’లో తొలి కామన్ మ్యాన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఖాసిఫ్ ఖురేషి నగరవాసే. సిటీలోని సబేరీ కళ్లజోడు షోరూమ్‌కి సల్మాన్ బ్రాండ్ అంబాసిడర్. ఇలాంటి నడుడికి శిక్ష పడడాన్ని అభిమానులు తట్టుకోలేకపోతున్నారు. అందరికీ మంచి చేసే వ్యక్తి.. పలు ఈవెంట్స్‌తో పాటు అర్పిత మ్యారేజ్‌కు సల్మాన్ సెక్యూరిటీ ఇన్చార్జ్గా పనిచేశా. సీసీఎల్ ఆఫ్టర్ పార్టీలో సంతోష్‌నగర్‌కు చెందిన బౌన్సర్ రఫీఖ్.. సల్మాన్‌ని ఆర్మ్ రెజ్లింగ్‌లో ఓడించాడు. దీనికి ఏ మాత్రం ఫీలవ్వకపోగా, అతనికి క్యాష్ గిఫ్ట్ ఇచ్చి మరీ ప్రశంసించాడు. తన దగ్గర పనిచేసేవారిని సల్లూభాయ్ బాగా చూస్తాడు. అందరికీ మంచి చేసే వ్యక్తికి శిక్ష పడడం వేదనకు గురిచేసింది. - మహ్మద్ అబ్రార్, సల్మాన్‌కు సిటీలో సెక్యూరిటీ చాలా మారిపోయాడు.. చాలా బాధగా ఉంది. సిటీకి సల్మాన్ ఎప్పుడు వచ్చినా తప్పకుండా చూసేవాడిని. తనని చూసే రెగ్యులర్‌గా బ్రాస్లెట్ వాడుతున్నా. హీరోగా ఎంత మంచి నటుడో.. వ్యక్తిగా అంత సహృదయుడు. ఆయన ‘బీయింగ్ హ్యూమన్’ వంటి చారిటీ కార్యక్రమాలు చేశాడు. ఆయనకు ఐదేళ్ల ఖైదు వల్ల సినిమాలకు మాత్రమే కాదు.. ఆయన్ను నమ్ముకున్న ఎన్నో చారిటీ కార్యక్రమాలకు కూడా విఘాతం కలుగుతుంది. ఆ సంఘటన జరిగిన 13 సంవత్సరాల తర్వాత తను చాలా మారాడు. వందల మంది ప్రాణాలు కాపాడాడు. ఒక అభిమానిగానే కాకుండా ఆయన కారణంగా సాయం పొందుతున్న వారి తరపున ఆలోచించి బాధపడుతున్నా. - అహ్మద్‌ఖాన్, ఈవెంట్ కో ఆర్డినేటర్ రియల్ ‘హ్యూమన్’ సల్మాన్ చిన్నప్పటి నుంచీ సల్మాన్ అంటే చాలా ఇష్టం. ఎన్నోసార్లు కలవాలనుకున్నా కుదర్లేదు. అతను చేసే చారిటీ కార్యక్రమాలు నాలో మరింత అభిమానాన్ని పెంచాయి. అలాంటిది.. అతనికి ఇలా శిక్ష పడడం చాలా బాధగా అనిపిస్తోంది. తన వల్ల చాలా మంది చిన్నారులు సేవ్ అయ్యారు. దేవుడు అతనికి మంచి చేయాలని కోరుకుంటున్నాను. - ప్రత్యూష, సిటీ మోడల్ -
రీమిక్స్ రీచార్జ్
‘వయ్యారి భామ’కు సిటీ డీజే స్వరాల జోడింపు తె లుగు డీజే పృధ్వి మిక్స్ ఆల్బమ్స్‌కు ఊపు ‘యూట్యూబ్’లో తొలి తెలుగు డబ్‌స్టెప్ మిక్స్ హల్చల్ పబ్స్.. క్లబ్స్ ఈవెంట్స్‌లో మ్యూజిక్‌ని కదం తొక్కించే డిస్క్ జాకీ (డీజే)లు సిటీకి కొత్తకాదు. అయితే, అంత మాత్రాన డీజేల క్రేజ్ ఎల్లలు దాటదు. సొంతంగా ఆడియో, వీడియో ఆల్బమ్స్ రూపొందించి విడుదల చేయడం ద్వారా మాత్రమే అది సాధ్యమవుతుంది. సిటీ డీజేలు ఈ విషయంలో కొంత వెనుకంజలో ఉన్నా.. డీజే పృథ్వి ‘మిక్స్ ట్రాక్’ను కదం తొక్కించాడు. అదీ ఇటీవలే ఊపందుకున్న ‘డబ్ స్టెప్’ శైలిలో కావడం విశేషం. - సాక్షి, లైఫ్‌స్టైల్ ప్రతినిధి బాలీవుడ్లో భళా.. దాదాపు మూడు దశాబ్దాల క్రితం రీమిక్స్ ఆల్బమ్స్ బాగా పాపులర్. హిందీ పాటల మిక్సింగ్‌తో మొదలైన ట్రెండ్.. తెలుగుకూ విస్తరించింది. అప్పట్లో ఘంటసాల పాటలను రీమిక్స్ చేసి విడుదల చేసిన ఆడియో ఆల్బమ్స్ కొన్ని సూపర్‌హిట్ అయ్యాయి కూడా. అయితే, తర్వాత ఈ ధోరణిలో మార్పు వచ్చింది. పాప్ గాయని స్మిత ‘మసక మసక చీకటిలో మల్లెతోట వెనకాల...’తో పాత పాటలకు కొత్త స్వరాలు సమకూర్చే ట్రెండ్ మళ్లీ పుంజుకుని వరుసగా కొన్ని ఆల్బమ్స్ వచ్చాయి. మళ్లీ కొంత గ్యాప్. తర్వాత హీరో చిరంజీవి హిట్ సాంగ్స్‌ని ‘మెగామిక్స్’ పేరుతో నగరానికే చెందిన డీజే ప్రభు రూపొందించారు. అది మంచి విజయం సాధించింది. ఆ తర్వాత ఆయనే ఇళయరాజా పాటల మిక్స్ ఆడియోను ‘చలాకీ చిన్నది’ పేరుతో విడుదల చేశారు. రానురానాను పూర్తి పాటను నవీకరించే రీమిక్స్లూ తగ్గిపోయాయి. పాత పాటకు తమవైన సంగీత ప్రత్యేకతను జత చేసే డీజే మిక్స్‌లూ అరుదైపోయాయి. అదే సమయంలో హిందీ పాటల మిక్సింగ్ ఎప్పటికప్పడు వైవిధ్య రీతులను సంతరించుకుంటూ ఊపందుకుంటోంది. సినీతారలు కూడా మ్యూజిక్ ఆల్బమ్స్‌పై మోజు పెంచుకునేంతగా బాలీవుడ్లో మిక్సింగ్ విజృంభిస్తోంది. అక్కడి ఆల్బమ్స్ విజృంభణకు ముంబై డీజేల క్రియేటివిటీయే ప్రధాన కారణం అని చెప్పక తప్పదు. ఎప్పటికప్పుడు హిట్ సాంగ్స్‌కు సొంత ట్రాక్‌లు, మరోవైపు పాత పాటలకు కొత్త సంగీతాన్ని జత చేస్తూ నార్త్‌లో దూసుకుపోతున్నారు డీజేలు. అయితే మన సిటీ డీజేలు కూడా హిందీ, ఇంగ్లిష్ ట్రాక్స్‌నే మిక్సింగ్‌కు ఎంచుకుంటుండటంతో నేటి యువ శ్రోతలకు నిన్నటి పాటలను కొత్త శైలిలో వినే అవకాశం దక్కడం లేదు. మరోపక్క తెలుగు పాటల మిక్స్ ఆల్బమ్స్‌కు సినిమాల్లో రీమిక్స్ పాటల వెల్లువ అడ్డుకట్ట వేసింది. సినీ సంగీత దర్శకులే రీమిక్స్ పాటలకు సై అంటుండడంతో ప్రైవేట్ ఆల్బమ్స్ రూపొందించేవారు సెలైంటైపోయారు. ఈ నేపథ్యంలో తెలుగు పాటల మిక్సింగ్ ట్రెండ్‌కు కాసింత ఊపు నిచ్చేలా సిటీ డీజే పృథ్వీ తాజాగా ఒక పాత పాటకు డీజే మిక్స్ చేశారు. కిక్ ఇచ్చిన ‘డబ్ స్టెప్’.. ఈ డబ్ స్టెప్ మూలాలు ఇంగ్లాండ్‌లోని సౌత్ లండన్‌లో ఉన్నాయని చెబుతారు. డ్రమ్స్, పెర్క్యుషన్, బాస్ ఫ్రీక్వెన్సీస్ మేళ వింపుతో సాగే ఈ శైలి.. బాగా ప్రయోగాత్మకంగా సాగే రీమిక్స్‌లకు పేరొందింది. మూలాలు మూడు దశాబ్దాల క్రితమే ఉన్నాయని గుర్తించినా, 2010 నుంచి లండన్ నైట్ క్లబ్స్‌లో డబ్ స్టెప్ స్టైల్‌ను డీజేలు బాగా ప్రమోట్ చేస్తూ వచ్చారు. పెద్ద పెద్ద మ్యూజిక్ కన్సర్ట్స్ ద్వారా అమెరికాలో దీని పాపులారిటీ పెరగడంతో ఇప్పుడిప్పుడే ఆసియా దేశాలకు సైతం విస్తరించింది. డిస్క్ జాకీల రీమిక్స్‌ల ఆధారంగా విజృంభిస్తున్న డబ్స్టెప్ను సిటీ డీజే పృథ్వీ తన తాజా మిక్సింగ్‌కు వినియోగించడం ఇప్పుడు నగరంలో మరికొందరు డీజేలను ఇన్స్పైర్ చేస్తోంది. ‘వయ్యారి భామ’కు వన్నె చిన్నెలు.. పవన్ కల్యాణ్ నటించిన సూపర్ హిట్ సినిమా ‘తమ్ముడు’లోని ‘వయ్యారి భామా నీ హంస నడక..’ పాట అప్పట్లో ఒక ట్రెండ్ సెట్టర్. వైవిధ్యమైన సంగీతానికి పెట్టింది పేరైన రమణ గోగుల కూర్చిన ఈ పాట ఇప్పుడు విన్నా ఫ్రెష్‌గా ఉంటుంది. ఇలాంటి పాటనే ఎంచుకున్నాడు సిటీ యంగెస్ట్ అండ్ బెస్ట్ డీజేగా పేరొందిన పృథ్వి. ‘నేను పవన్ కల్యాణ్ అభిమానిని. వయ్యారి భామ పాట అంటే నాకు చాలా ఇష్టం. అలాగే తమ్ముడు సినిమాలో పవన్ చేసిన కొన్ని హాస్య సన్నివేశాలు, ఆడవారి గొంతును అనుకరిస్తూ మాట్లాడిన మాటలు.. వంటివి ఇప్పటికీ యూత్ సరదా చాట్స్‌లో చోటు చేసుకుంటూనే ఉంటాయి. అందుకే ఆ పాటను, కొన్ని మాటలను, నా మ్యూజిక్‌ని మిక్స్ చేసి కొత్తగా విడుదల చేశా’నన్నాడు పృథ్వి. రెండు రోజుల క్రితమే యూట్యూబ్‌లో అప్లోడ్ చేసిన ఈ పాట.. వేల సంఖ్యలో హిట్స్‌తో వీక్షకుల ఆదరణ పొందిందంటున్నాడీ యంగ్ డీజే స్టార్. త్వరలోనే మరికొన్ని తెలుగు మ్యూజిక్ ఆల్బమ్స్ చేయాలని అనుకుంటున్నట్లు పృథ్వీ చెప్పాడు. -
మనసు బాగోలేదా...?
ఇటీవల జర్మనీ విమానం కూలిపోయిన సంఘటన గుర్తుందా? దానికి కారణం ఏమిటో జ్ఞాపకం ఉందా? డిప్రెషన్లో ఉన్న కో-పైలట్ ఇందుకు పాల్పడ్డాడని తెలిశాక ప్రపంచం నివ్వెరపోయింది.. ఇంకా ఎందరో తనువు చాలించుకుంటున్నారు. మరికొందరు ఇతరుల ఉసురు తీస్తున్నారు. కారణాలేమైతేనేమి? డిప్రెషన్ (వ్యాకులత)తో ఎన్నో అఘాయిత్యాలు చోటు చేసుకోవడంపై ఇప్పుడు మానసిక శాస్త్రవేత్తలు, వైద్యులు, నిపుణులు ఆందోళన చెందుతున్నారు. కౌన్సెలింగ్, థెరపీ వంటి చికిత్సా విధానాలతో డిప్రెషన్ నుంచి బయటపడవచ్చని చెబుతున్నారు. ప్రశాంత జీవితాన్ని కోరుకోని వారుండరు. కానీ ఆ ప్రశాంతతే చాలామందికి కరువవుతోంది. ఒంటరితనం, విషాదం, అపార్థం, నిరాశ, ఆందోళన, అసంతృప్తి వంటివి డిప్రెషన్‌కు దారితీస్తాయి. ఇవి వయసుతో పనిలేకుండా అన్ని వయసుల వారికీ వర్తిస్తాయి. విద్యార్థులకైతే ఇష్టం లేని కోర్సులు, కాలేజీల్లో చేర్చడంతో అక్కడ ఇమడలేక, సర్దుబాటు చేసుకోలేక, సబ్జెక్ట్ అర్థం కాక సతమతమవుతుంటారు. ఇంకా దూరంగా ఉన్న కాలేజీలకు రోజూ వెళ్లిరావడం, పేరెంట్స్‌కు దూ రంగా ఉండడం, లవ్ ఫెయిల్యూర్స్ కూడా డిప్రెషన్‌కు దోహదపడుతున్నాయి. ఇక విద్య పూర్తయ్యాక కూడా వ్యాకులతకు లోనయ్యే వారెందరో ఉంటున్నారు. చదువయ్యాక సరైన ఉద్యోగావకాశాలు, విద్యార్హతకు తగిన ఉద్యోగాలు రాక, జీతాలు చాలక కొందరు, అధిక పని, నిద్రలేమి వంటివి కూడా ఇందుకు దోహదపడుతున్నాయి. పెళ్లయ్యాక భార్యాభర్తల నేపథ్యం సమస్యలు, ఫైనాన్షియల్ షేరింగ్ లేకపోవడం, జాబ్ రిలేటెడ్ ప్రోబ్లమ్స్, వివాహేతర సంబంధాలు, టీవీ సీరియళ్ల ప్రభావం డిప్రెషన్‌కు కారణమవుతున్నాయని సర్వేలు చెబుతున్నాయి. ఇక వృద్ధాప్యంలోనూ డిప్రెషన్‌కు లోనవుతున్న వారూ ఉన్నారు. వయసు మీరాక వివిధ కారణాల వల్ల పిల్లలు దూరం కావడం, జీవిత భాగస్వామి మరణించడంతో ఒంటరితనాన్ని భరించలేకపోవడం, అనారోగ్యం వంటి వాటితో వ్యాకులతకు గురవుతున్నారు. పలువురు తమ మనోవేదనను ఇతరులతో పంచుకోకుండా లోలోపలే భరించడంకూడా ఇందుకు ప్రేరేపిస్తున్నాయి. ఇవన్నీ వెరసి అం తిమంగా డిప్రెషన్‌కు దారి తీసి ఆత్మహత్యలకు ఆస్కారమిస్తున్నాయి. ఇలా పేద, మధ్య తరగతి వారే కాదు.. మేధావులు, శాస్త్రవేత్తలు, వైద్యులు, రచయితలు తనువులు చాలించిన వారిలో ఉండడం విశేషం! మన విశాఖ నగరంలోనూ డిప్రెషన్‌కు గురవుతు న్న వారి సంఖ్య అధికంగా ఉందని మానసిక నిపుణులు చెబుతున్నారు. ఇందులో 15శాతం యువతలోనే ఉంటోందని అంచనాకొచ్చారు. విధి నిర్వహణలో జాగ్రత్త.. డిప్రెషన్లో ఉంటూ విధి నిర్వహణ చేసే వారితో ఎంతో అప్రమత్తంగా ఉండాలని మానసిక శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. విమాన పెలైట్లు, వాహనాల డ్రైవర్లు, మెదడు, గుండె సంబంధిత వైద్యులు, సైంటిస్టులు, కీలక పరిశ్రమలు, మైనింగ్‌లో పనిచేసేవారిలో అవసరమైన వారు తరచూ డిప్రెషన్ చెకప్ చేయించుకోవాలని సూచిస్తున్నారు. లేనిపక్షంలో వారితో పాటు ఇతరులకు కూడా ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని చెబుతున్నారు. మొన్నటికి మొన్న జర్మన్ విమానం కో-పైల ట్ ఆండ్రియాస్ లుబిట్జ్ ప్రియురాలు కాదనడంతో డిప్రెషన్‌కు లోనై విమానాన్ని కూల్చివేసి 150 మంది అమాయక ప్రయాణికుల చావుకు కారణమయ్యాడన్న చేదు నిజాన్ని వీరు ఉదహరిస్తున్నారు. అందుకే ఇలాంటి వారి మానసిక స్థితి తెలిసేలా ముందుగా అవసరమైన చెకప్ చేయాలని వీరు పేర్కొంటున్నారు. థెరపీతో నయం.. డిప్రెషన్‌కు గురయిన వారికి థెరపీతో నయం చేయొచ్చు. డిప్రెషన్లో మైల్డ్, మోడరేట్, సివియర్ ఉంటాయి. డిప్రెషన్ స్కేల్‌తో దాని తీవ్రతను గుర్తిస్తారు. ఇందులో మైల్డ్, మోడరేట్లకు కౌన్సెలింగ్, కాగ్నెటివ్ బిహేవియర్ థెర పీతో పూర్తిగా సరి చేస్తాం. ఇందుకు 2-6 నెలల పాటు చికిత్స అవసరం. అవసరమైన వారికి అవగాహన, సోషల్ స్కిల్స్, కెరీర్ ప్లానింగ్, హెల్త్ ఎడ్యుకేషన్ కూడా ఇస్తాం. సివియర్ కేటగిరీలో ఉన్న వారిని సైక్రి యాట్రిస్ట్ను సంప్రదించాలి. విశాఖ నగరంలో డిప్రెషన్ బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఇప్పుడిప్పుడే అవగాహన పెరుగుతోంది. ఇంకా పెరగాలి. మైండ్ అండ్ బాడీతో పనిచేసే వారు తరచూ డిప్రెషన్‌పై చెకప్ చేయించుకోవాలి. అవసరమైన వారు సంప్రదిస్తే కౌన్సెలింగ్, చికిత్స అందిస్తాం. - డాక్టర్ ఎం.వి.ఆర్.రాజు, సైకాలజీ విభాగాధిపతి, ఏయూ (సెల్ః 9393101813) -
భయపెట్టే ప్రయత్నం
హారర్ మూవీస్.. చూస్తున్నంత సేపు భయపడుతుంటాం.. కానీ ఆ సినిమాలు చూడడంలో వచ్చే థ్రిల్లే వేరు. ఫీచర్ ఫిల్మ్స్‌కే పరిమితమైన హారర్ మూవీస్ షార్ట్‌ఫిల్మ్స్‌లోనూ అప్పుడప్పుడూ పలకరిస్తున్నాయి. అలా వచ్చిందే ఫ్లాట్ నంబర్.4. నగరానికి చెందిన నరేష్ తన ఈ హారర్ మూవీతో నెటిజన్లను కాస్త భయపెట్టారు. ఇంతకీ ఫ్లాట్ నంబర్.4లో ఏముంది? ఇదీ కథ రైల్వే స్టేషన్లో ఆటో ఎక్కి తన ఫ్రెండ్ ఇంటికి వస్తుంది ఒక అమ్మాయి. ఫ్రెండ్ డాలీకి ఫోన్ చేస్తే వాచ్‌మన్ దగ్గర ‘ఫ్లాట్ న ం.4’ తాళాలు ఉంటాయి.. తీసుకో అని చెప్తుంది. ఫ్లాట్‌కు వెళ్లి సేదతీరాక ఆపిల్ తింటూ టీవీ చూస్తుంటుందీ అమ్మాయి. అప్పుడు టైం రాత్రి 7 అవుతుంది. ఆ సమయంలో డాలీ ఫోన్ చేసి తను ఇంటికి వచ్చేసరికి రాత్రి 12.30 అవుతుంది అని చెబుతుంది. ఇంతలో తన వెనుక ఎవరో ఉన్నట్లు అనిపించి వెనక్కి చూస్తుంది. కానీ ఎవరు ఉండరు. ఈ సారి వెనక్కి చూసినప్పుడు ఒక ఆకారం కనిపిస్తుంది. ఎటు చూస్తే అటే కనిపించి భయపెడుతుంది. తన ఫ్రెండ్ చనిపోయినట్లు, ఫొటోకు దండ, చనిపోయిన తేదీ ఉండడం, దెయ్యం తనను చంపేస్తున్నట్లుగా భయపడుతుంది. ఆ సమయంలో కాలింగ్ బెల్ మోగడంతో నిద్ర నుంచి లేస్తుంది. ఇంతకీ ఇదంతా ఆమెకు వచ్చిన కలన్న మాట. రివ్యూ హారర్ మూవీస్‌కు టేకింగ్, మ్యూజిక్ ప్రధానం. ఎక్కువ భయపెట్టేవి ఆ రెండే. ఆ విషయంలో సక్సెస్ అయ్యారు డెరైక్టర్. కెమెరా టేకింగ్, సీన్‌కు సరిపడే మ్యూజిక్ హారర్ ఫీల్ తెచ్చింది. యాక్టింగ్‌కు అంతగా స్కోప్ లేదు. కానీ ఉన్నంతలో బాగుంది. సినిమా ప్రారంభంలో చిత్రం రాం గోపాల్ వర్మకు అంకితం అని ఒక స్లైడ్ వేశారు. దానికి తగినట్లుగానే టేకింగ్‌లో కొంత ఆర్జీవీ మార్క్ క నిపించింది. ఓవరాల్‌గా ఫిల్మ్ బాగుంది. కానీ చూపించినదంతా కేవలం ‘ఊహ’ అని తేల్చేయడ మే కాస్త మైనస్ అనిపిస్తుంది.‘ఫ్లాట్ నం.4’ లోకి వెళ్లాలనుకునేవారికి ఇదిగోండి తాళం.. https://youtube/nRuVFmZbxGU ఇదంతా అమ్మ చలవే నాకు చిన్నప్పటి నుంచి సినిమాలంటే ఇష్టం. ఎంబీఏ చేశాను. డిగ్రీలో ఉండగానే నటుడిని కావాలని ఉండేది. అవకాశం లేక వెళ్లలేకపోయాను. ఇప్పుడు ఇంటర్నెట్ నాకు అవకాశాన్ని కల్పించింది. ఫేస్బుక్, యూ ట్యూబ్, చాలా ఈ-బుక్స్ చదివి డెరైక్షన్ నేర్చుకున్నాను. మా అమ్మగారు చాలా సపోర్ట్ చేస్తారు. షార్ట్‌ఫిల్మ్‌కు అయ్యే ఖర్చు అమ్మే ఇస్తారు. 2014లో ఫస్ట్ షార్ట్‌ఫిల్మ్ చేశాను. ఇప్పటికి 4 చేశాను. నా దగ్గర ఇంకో 30 స్క్రిప్టులు రెడీగా ఉన్నాయి. ఒకదాని తర్వాత ఒకటి చేస్తాను. - నరేష్ బాబు, డెరైక్టర్ -
ఎన్నెన్నో వర్ణాలు..!
అందమైన ప్రకృతిలో అసంఖ్యాకమైన సిత్రాలు. లక్షలాది వర్ణాలు. అందమైన పూలు.. కనువిందైన పక్షులు.. నీలాకాశంలో రకరకాల రంగుల్లో మేఘాలు.. అనంత సాగరంలో అలలపై దోబూచులాడే వింత వర్ణాలు.. పుడమిపై లెక్కలేనన్ని రంగులు.. జీవితమంతా రంగులమయం కాదూ. ఈ వర్ణాలను, వాటి అందాలను కాన్వాస్ అద్దంపై ప్రతిబింబించేవాడు చిత్రకారుడు. చిత్రం తీర్చిదిద్దే సమయంలో అతని ఆలోచనలు ఎలా ఉంటాయో, అవి కాన్వాస్‌పై ఎలా ప్రాణం పోసుకుంటాయో ఊహించడం కష్టం. కానీ చిత్రం పూర్తయ్యాక అది చెప్పే కథలు అనంతం. చూసేవారి కళ్లకు మనసుంటే ఆ కథ మధురాతిమధురం. ఇక తమ చిత్రాల గురించి ఆర్టిస్టులే మాట్లాడితే? అది మరింత అర్ధవంతంగా ఉంటుంది. ఏయూ ఫైన్ ఆర్ట్స్ విభాగానికి చెందిన బీఎఫ్ఏ విద్యార్థి రాజశేఖర్ ఇలా తన పెయింటింగ్ ప్రత్యేకతను ఇలా వివరించారు. ‘ఓ చిత్రం గీసేటప్పుడు ఆర్టిస్ట్‌ను ఏదో తెలియని శక్తి ఆవహిస్తుంది. అంతులేని ఉత్తేజానికి అది కారణమవుతుంది. నేను కూడా అటువంటి భావాలకు లోనయ్యాను. నేను ఇప్పటివరకు ఎన్నో చిత్రాలు గీశాను. వాటిలో ఏది అత్యుత్తమైనదంటే ఆలోచించాలి కానీ.. మనసుకు బాగా నచ్చినది మాత్రం నేను గీసిన ‘ఫైవ్ ఎలిమెంట్స్’ చిత్రం. నైరూప్య కళ (ఏబ్స్ట్రాక్ట్ పెయింటింగ్) కోవలోకి వచ్చే ఈ చిత్రం నాకు ఎంతో ఉత్తేజాన్నిచ్చింది. ఈ పెయింటింగ్ వేస్తూ గంటల తరబడి ఏవో ఊహల్లోకి వెళ్లిపోయేవాడిని. నాకు కావాల్సిన, నేను కోరుకున్న భావం వచ్చే వరకూ చిత్రం గీస్తూనే ఉండేవాడిని. పంచభూతాలను చిత్రంలో అంశాలుగా తీసుకుని ఈ చిత్రాన్ని తీర్చిదిద్దాను. ఇలా వేసిన ప్రతి పెయింటింగ్‌లో నేను కోరిన భావం వచ్చిందన్న సంతృప్తి ఉంటుంది. దాన్ని చూసినప్పుడల్లా ఏదో తెలియని ఉద్వేగం కలుగుతుంది. ఆలోచన ఇలా.. సృష్టి సర్వం పంచభూతాల కలయిక కారణంగా రూపు దిద్దుకున్న సంగతి తెలిసిందే. వీటి నుంచే మానవ జన్మ ప్రారంభమవుతుంది. వీటిలో విలీనం కావడం ద్వారా అది ముగుస్తుంది. పంచభూతాలైన ఆకాశం, భూమి, గాలి, నీరు, అగ్ని మానవ జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. అవి ఒకదానితో ఒకటి అనుబంధమై ఉంటాయి. వాటికి నిర్దిష్టమైన రూపాన్ని ఊహించడం కష్టం. ఈ విషయాలను దృష్టిలో ఉంచుకుని పెయింటింగ్ తీర్చిదిద్దడానికి ప్రయత్నించాను. ఒక్కో అంశానికి ఒక్కో రంగును నిర్దేశించుకుని వాటిని రకరకాలుగా కలుపుతూ పాంచభౌతికమన్న భావాన్ని చూపించడానికి కృషి చేశాను. ఆకాశానికి గాఢమైన నీలి రంగు, నీటికి లేత నీలి రంగు, గాలికి తెలుపు, అగ్నికి ఎరుపు, భూమికి జేగురు రంగు ఎంచుకున్నాను. ఈ పెయింటింగ్‌కు రోజుకు ఆరు నుంచి ఎనిమిది గంటల సమయం తీసుకున్నాను. ఒక్కో పెయింటింగ్ వేయడానికి నాకు రెండు నుంచి నాలుగు రోజుల వరకు సమయం పట్టింది. ఇదే కాన్సెప్ట్‌తో ఇప్పటివరకు 20 పెయింటింగ్స్ వరకు వేశాను. పాంచభౌతికమైన ప్రకృతి నన్నెంతగా ప్రభావితం చేసిందీ వీటిని చూస్తే అర్ధమవుతుంది. -
చూడు తమ్ముడూ!
విషయాన్ని సుత్తి లేకుండా.. సూటిగా చెప్పడం చేతకాని వారెందరో.. వాట్సప్ గ్రూపుల్లో ఫ్రెండ్స్ దగ్గర అడ్డంగా బుక్కై పోతుంటారు. విషయ పరిజ్ఞానం ఉన్నా.. సింపుల్‌గా చెప్పడం తెలియని మేధావుల మెసేజ్‌లకు వాట్.. వాట్.. అనే రిప్లైలు వస్తుంటాయి. ఇంకొందరుంటారు.. అల్రెడీ ఫోన్లో ఇన్‌బిల్ట్‌గా ఉన్న స్మైలీ బొమ్మలను రిప్లైగా పంపుతూ.. అదే క్రియేటివిటీ అని ఫీలైపోతుంటారు. భాషలో రాయలేని విషయాలెన్నో.. ఒక్క బొమ్మ చెప్పేస్తుంది. అలాంటి బొమ్మల కొలువుతో వచ్చేసింది.. దేఖ్ భాయ్ ఆండ్రాయిడ్ యాప్. ఇది ఆన్లైన్ ప్రపంచంలో రకరకాల ఎక్స్‌ప్రెషన్స్‌తో రాజ్యమేలుతోంది. ఈ మధ్య.. వాట్సప్, ఫేస్బుక్ మెసెంజర్, ఇన్స్టాగ్రామ్.. ఇత్యాది మెసేజ్ ఓరియెంటెడ్ ఆన్లైన్లో కొత్తగా కొన్ని చిత్రాలు విచిత్ర సంభాషణలతో కిక్కెక్కిస్తున్నాయి. మాటలకందని ఎన్నో భావాలు ఒక్క హావభావంతో ఎదుటివారికి చేరిపోతాయి. ఇదే సూత్రాన్ని పాటిస్తూ రూపొందించిన దేఖ్భాయ్ యాప్ ఇప్పుడు ఆన్లైన్లో హల్చల్ చేస్తుంది. కళ్లుమూసుకుని, ఓ చెయ్యెత్తి ఏదో సీరియస్‌గా చూస్తున్న ఓ గుండు బొమ్మపై.. దేఖ్ భాయ్ అని రాసుంటుంది. సందర్భోచితంగా మీరేదైనా మెసేజ్ రాసుకోవచ్చు. తర్వాత దాన్ని షేర్ చేస్తే చాలు. ఇందులోని ఇన్‌బిల్ట్ మెసేజ్‌లు కూడా సరదాగా, ఫన్నీగా ఉంటాయి. హస్తీ హస్తీ.. దోస్తీ దోస్తీ.. ‘దేఖ్ భాయ్.. పైసే మాంగేతో ఫ్రెండ్షిప్ ఖతమ్’ (డబ్బులడిగావో.. దోస్తీ కట్) ఇదో రకం చిలిపి హెచ్చరిక సందేశం. దీన్ని పంపి చూడండి.. అట్నుంచి నవ్వులే రిప్లైగా వస్తాయి. బాయ్ బొమ్మ మాత్రమే కాదు.. ఓ పెద్దావిడ సీరియస్‌గా హితవు పలుకుతున్నట్టు ఉండే బొమ్మ.. కోపం, సంతోషం, హాస్యం.. ఇలా రకరకాల భావాలకు తగ్గట్టుగా ఉన్న బొమ్మలు ఇందులో ఉన్నాయి. పెద్దావిడ విషయానికి వస్తే.. ‘దేఖ్ బేటా..’ అని మొదలవుతుంది మెసేజ్. ‘దేఖ్ బేటా.. సోజా వర్నా ఫోన్ కో ఆగ్ లగాదూంగీ’ (పండుకో.. లేకపోతే ఫోన్‌కు నిప్పెట్టేస్తా..!) ఇలాంటి సరదా వార్నింగులెన్నో ఈ పెద్దావిడ బొమ్మను అడ్డం పెట్టుకుని పంపించేయొచ్చు. సెలబ్రిటీ హంగులు.. దేఖ్ భాయ్ ప్రస్థానానికి మూలం గుజరాతీ ‘జో బకా’ (చూడు మిత్రమా). ‘జో బకా’ మెసేజ్‌లు ఆన్లైన్లో ఎప్పట్నుంచో చక్కర్లు కొడుతున్నాయి. దాన్ని బేస్ చేసుకుని వచ్చిన దేఖ్ భాయ్ సిరీస్‌కు ఈతరం యువత రెడ్‌కార్పెట్ స్వాగతం పలుకుతోంది. డిఫరెంట్ ఎక్స్ప్రెషన్ బొమ్మలేకాదు.. సచిన్ టెండూల్కర్, నరేంద్ర మోదీ, బాబా రాందేవ్, రాహుల్ గాంధీ, రజనీకాంత్.. ఇలా ఫేమస్ పర్సనాలిటీల చిత్ర విచిత్రమైన క్యారికేచర్లు కూడా ఈ సరదా సందేశాల్లో పాలుపంచుకోవడానికి సిద్ధంగా ఉన్నాయి. బొమ్మలకు బ్యాక్ గ్రౌండ్లో కనిపించే ఎల్లో కలర్‌ను కూడా కస్టమైజ్డ్ గా మీ కిష్టమైన రంగుల్లోకి మార్చుకోవచ్చు. ఇన్‌బిల్ట్ బొమ్మలే కాదు.. కస్టమైజ్డ్గా ఫొటోలు కూడా ఎంపిక చేసుకునే చాన్స్ ఉంది. ఏ ఎక్స్ప్రెషన్స్నైనా పలికించే బొమ్మలు ఉన్నాయి కదా అని దేఖ్ భాయ్‌ని ఎడాపెడా వాడేస్తే లాభం లేదంటారు హ్యూమరిస్టులు. ఆ భావానికి తగ్గ భాషను పలికించగలిగితేనే కిక్కు డోసు పెరుగుతుందని చెబుతున్నారు. మరింకెందుకు ఆలస్యం ‘దేఖ్ భాయ్.. సోచ్ మత్.. డౌన్లోడ్ కర్..!!’. -
జస్ట్.. లైట్ తీస్కో!...
ఉరుకుల పరుగుల జీవితాలు. ప్రశాంతంగా కప్పు కాఫీ తాగడానికి కూడా టైం లేని రోజులు. మీరు ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేసరికి బాగా లేట్ అయిపోయింది. దాని వల్ల నిద్రపోవడానికి కూడా లేట్ అయ్యింది. ఉదయాన్నే ఆఫీస్‌లో మీటింగ్ ఉంది. గబగబ లేచి రెడీ అయ్యి ఆఫీస్‌కు వెళ్లాలి. ఆ తొందరలో పొరపాటున ప్యాంట్ వేసుకోవడం కూడా మరచిపోయే వాళ్లు ఉంటారు. అలా ఎవరుంటారు అంటారా? ఒక్కసారి చింతకాయల రవి సినిమా చూడండి. ఇంటర్వ్యూకు పిలిచారు కదా అని ప్యాంట్ వేసుకోవడం మరచిపోయి మేనేజర్ దగ్గరకు వెళ్లిపోతాడు వెంక టేష్. అలాంటి టైంలో చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతాం కదా!!! కానీ ఏడాదికోరోజు సరదాగా ఫ్యాంట్ విప్పేసి తిరిగితే ఎలా ఉంటుంది...హౌ ఫన్నీ! అంటూ విదేశాల్లో విద్యార్థులకు ఓ ఫన్నీ ఆలోచన తట్టింది. ఇకనేం...స్టూడెంట్స్‌కు ఓ ఆలోచన వస్తే ఇక ఆగేదేం ఉంది...వెంటనే మొదలెట్టేశారు. అకాడమిక్ సంవత్సరం సెమిస్టర్‌కు ఆఖరి రోజున ఏదైనా ఫన్నీగా చేస్తే బాగుంటుంది కదా అని కొంత మంది ఆలోచించి ఆ రోజున స్టూడెంట్స్ అంతా ప్యాంట్స్ విప్పేసి తిరిగారు. చిట్టిపొట్టి షార్ట్స్‌తో క్యాంపస్ కలియతిరిగి పండగ చేసుకున్నారు. ఇదేదో బాగుందే...అని చాలా దేశాల్లో స్టూడెంట్స్ కూడా అట్రాక్ట్ అయిపోయారు. 2000వ సంవత్సరంలో ఆస్టిన్లోని యూనివర్శిటీ ఆఫ్ టెక్సాస్‌లో ఇది స్టార్ట్ అయ్యింది. తరువాత కెనడా,స్వీడన్,ఆస్ట్రేలియా,ఫిన్లాండ్,యూకే లాంటి దేశాలలో ఈ క్రేజ్ వ్యాపించింది. ఇపుడీ ప్యాంటోపాఖ్యానం ఏమిటనుకుంటున్నారా...? టుడే నో ఫ్యాంట్స్ డే. ప్రతి సంవత్సరం మేలో వచ్చే మొదటి శుక్రవారాన్ని ‘నో ఫ్యాంట్స్ డే’ గా జరుపుకుంటారు. కెనడా మాజీ ప్రెసిడెంట్ కూడా ఆ రోజున విద్యార్థులతో కలిసి ఫొటోకు ఫోజ్ ఇచ్చారు. ఈ ఫొటోలోని ఫోజు అదే. శంకర్ తీసిన ‘స్నేహితుడు’ సినిమా చూస్తే ఇండియాలో కూడా ఆ కల్చర్ స్టార్ట్ అవుతుందేమో అనిపిస్తుంది. ఎనీ వే... హ్యాపీ నో ప్యాంట్స్ డే.... -
ఇటు టూ గ్రో
ఇంటిపంట సాగుదారులంతా ఫేస్బుక్లో ఫ్రెండ్స్. ఏయే పంటలు పండిస్తున్నారు? ఏం తింటున్నారు? ఏం వండుతున్నారు?.. ఇవన్నీ పోస్ట్స్, షేర్స్ చేసుకుంటూ ఉంటారు. తాజాగా బంజారాహిల్స్‌లోని లామకాన్‌లో మీట్ అయ్యారు. ముచ్చటపడి ఇంట్లో పండించే ఆకు, కాయగూరలను ఆహారంగా ఎలా తీసుకోవాలనే విషయమై వర్క్‌షాపు నిర్వహించుకున్నారు. దీనికి హాజరైన ఎన్వరాన్‌మెంటలిస్ట్ సీతా ఆనంద్ వారందరికీ చెప్పిన విషయాలు మనకీ ఉపయోగపడేవే.. ..:: ఓ మధు మనం ఇంట్లో పండించుకునే ఆకుకూరలు వారం.. పదిహేను రోజులకు చేతికొచ్చేవై ఉంటే మంచిది. ఇక మనం మోజుపడి పెరటిలోనే పండించుకునే వాటిని ఎలా తింటున్నామన్నది ముఖ్యం. ఉదాహరణకు చిక్కుడు, వంకాయ వంటివి వండేటప్పుడు బాగా నూనె వేసి డీప్ ఫ్రై చేసేస్తుంటాం. అది ఆరోగ్యానికి మంచిది కాదు. ఏ కూరగాయలైనా, పప్పులైనా ఎంత పచ్చివి తినగలిగితే ఆరోగ్యానికి అంత మంచిది. శ్రీరామ నవమికి తినే వడపప్పు చక్కటి రా ఫుడ్ రెసిపీ. అలాంటివి రెగ్యులర్‌గా అన్ని పప్పులతో కలిపి కాంబినేషన్‌గా చేసుకోవచ్చు. పచ్చివి తింటేనే.. సలాడ్ చేసుకునేందుకు వీలైన కూరగాయలను కూడా ఇంట్లో పెంచవచ్చు. చాలా కూరగాయలను సలాడ్స్ చేసుకోవటం కుదరదని అనుకుంటాం. కానీ అది నిజం కాదు. బీరకాయ, సొరకాయ, బూడిద గుమ్మడి కాయలు వంటివి పచ్చివి తినటమే ఉత్తమం. నీటి పరిమాణం ఎక్కువగా ఉండే కూరగాయల్ని వేడి చేయకూడదు. అంటే వండకూడదు. ఆ నీటిలో చాలా పోషకాలుంటాయి. వండటం వలన నీరు పోయి పోషకాలు నశిస్తాయి. ఆ కూరగాయల్లో ఉండే రసాయనాలు మారిపోతాయి. అలా కాంపోజిషన్స్ మారిపోతే ఆరోగ్యానికే హాని. తీగకూరగాయలన్నిటినీ సలాడ్స్‌గా చేసుకుని తింటేనే మంచిది. టమోటా, బాదం లాంటివి ఆ సలాడ్స్‌లోకి చేరిస్తే మంచి రుచి వస్తుంది. గంగవాయిలీ, పాలకూరలు కూడా సలాడ్‌లో వేసుకోవచ్చు. తోటకూర తినటం కొంచెం కష్టం. దీంట్లో కీరదోస, టమోటా, పచ్చిమిర్చి, నువ్వులు, పచ్చి నూనె.. ఇలా కాంబినేషన్స్‌తో ట్రై చేస్తే టేస్టీగా మారుతుంది. గానుగ నూనె వాడాలి. ఆహార క్రమం.. మనం తీసుకునే ఆహారంలో మొదటి స్థానంలో ఫ్రూట్స్ ఉండాలి. ఆ తరువాత స్థానం ఆకు, కూరగాయలకు ఇవ్వాలి. పప్పులకు కూడా ప్రాధాన్యమివ్వాలి. సమ్మర్లో ఎక్కువగా సలాడ్స్, ఫ్రూట్స్ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. సీజనల్ ఫుడ్నుసమపాళ్లతో తీసుకోవాలి. సమ్మర్ స్పెషల్ స్మూదీ.. నచ్చిన ఆకుకూర ఒక కప్పు, అరటిపండు, బాదం లేదా కొబ్బరిపాలు మిక్సీలో వేసుకోవాలి. అరటిపండు... లేకపోతే ఖర్జూరాన్ని వేసుకోండి. జ్యూస్‌లా చేసుకోవాలి. దానిలో సబ్జా గింజలు వేస్తే.. సమ్మర్ స్పెషల్ స్మూదీ రెడీ. ఇందులో కావాలంటే కొంచెం కొబ్బరి కూడా కలపొచ్చు. -
యానిమేటెడ్ ఫిల్మ్ ఫెస్టివల్
యువ, చిన్నారి ప్రేక్షకులకు నగరంలో మహా పండుగ. ప్రఖ్యాత ‘స్టట్గార్ట్ ఇంటర్నేషనల్ యానిమేటెడ్ ఫిల్మ్ ఫెస్టివల్’ సిటీకి వస్తోంది. బంజారాహిల్స్‌లోని గోథెజంత్రమ్ ఈ కలర్‌ఫుల్ ఈవెంట్ నిర్వహిస్తోంది. జర్మనీ, డెన్మార్క్, ఇరాన్, ఫ్రాన్స్‌లకు చెందిన షార్ట్ కార్టూన్స్ కూడా ఇందులో ప్రదర్శిస్తారు. జెబ్రా, హోమ్ స్వీట్ హోమ్, పాస్తా యా, మై లిటిల్ క్రోకో, లబాజ్ ఎ సాహబ్ వంటి చిత్రాలు వీటిల్లో ఉన్నాయి. వేదిక : గోథెజంత్రమ్, బంజారాహిల్స్ సమయం : ఈ నెల 30 సాయంత్రం 6.30 గంటలకు ప్రవేశం : ఉచితం -
బచ్చా బాలీవుడ్
అసలే సమ్మర్.. ఇక పిల్లలకు ఎక్కడ లేని హుషార్.. రొటీన్ ఆటపాటలు.. సమ్మర్ టూర్స్.. వీటి నుంచి కాస్త డిఫరెంట్‌గా గడపాలనుకునే చిన్నారులకు భలే చాన్స్.. బచ్చా బాలీవుడ్ ప్రోగ్రామ్. వేసవి కానుకగా ఇనార్బిట్ మాల్ జీక్యూ చానల్‌తో కలిసి 17 రోజుల పాటు నటనలో శిక్షణనిచ్చేందుకు వర్క్‌షాప్‌లు నిర్వహిస్తోంది. ఇందులో నటన, దర్శకత్వం, స్క్రిప్ట్‌రైటింగ్, డైలాగ్ రైటింగ్, మేకప్, సంగీతం, నృత్యం తదితర అంశాల్లో శిక్షణనిస్తారు. మే 2 నుంచి 18 వరకు ఈ వర్క్‌షాప్ జరుగుతుంది. 7 నుంచి 15 ఏళ్ల వయసు పిల్లలు అర్హులు. ఇంకో విశేషం ఏమిటంటే.. ఇక్కడ టాలెంట్ చూపిన చిన్నారులతో ఒక షార్ట్మూవీని చిత్రీకరిస్తారు.దానిని జీక్యూ చానల్‌తో పాటు టీవీ, సినిమా థియేటర్లలో ప్రదర్శిస్తారు. సో.. చిన్నారులూ.. గెట్ రెడీ. లైట్స్.. కెమెరా.. యాక్షన్. -
బాంబే రాగశ్రీ
బాంబే జయశ్రీ... భారతీయ సంగీతంలో పరిచయం అక్కర్లేని పేరు. ‘శశివదనే శశివదనే... స్వరనీలాంబరి నీవా...’ పాటను ఇష్టపడని సంగీత ప్రియులుండరు. ‘మనోహరా నా హృదయంలో...’ అంటూ కూనిరాగాయలు తీయని చెలి ఉండదు. ఇలాంటి పాటలతో తెలుగువారి చెవుల్లో తేనెలు కురిపించిన జయశ్రీ ఇటీవల హైదరాబాద్‌కు వచ్చారు. రవీంద్రభారతిలో సౌత్ ఇండియన్ కల్చరల్ అసోసియేషన్ నిర్వహించిన కచేరీలో తన గాన మాధుర్యంతో శ్రోతలకు వీనులవిందు చేశారు. ఈ సందర్భంగా ‘సిటీప్లస్’ ఆమెను పలకరించింది. ఆ సంగీత ఝరి పంచుకున్న ముచ్చట్లు ఆమె మాటల్లోనే... ..:: కట్ట కవిత హైదరాబాదీలెప్పుడూ కొత్త ఆలోచనలను స్వాగతిస్తారు. ఎంత బాధ్యతాయుతంగా ఉంటారో అంతే ఎనర్జిటిక్ కూడా. 1990 తొలినాళ్లలో నేను ఇక్కడ మొదటి ప్రదర్శన ఇచ్చాను. అప్పటినుంచే నాకు సిటీ అంటే అమితమైన ప్రేమ. బీఆర్సీ అయ్యంగార్ నిర్వహించే కన్సర్ట్స్‌లో పాల్గొనడానికి తరచూ వచ్చేదాన్ని. ప్రేక్షకులతో ఇంటరాక్ట్ అయ్యేదాన్ని. నా పుస్తకం వాయిసెస్ వితిన్ మొదట ప్రింట య్యింది కూడా ఇక్కడే. కర్ణాటక సంగీతం తెలుగులో చాలా కంపోజ్ అయింది. అయితే ఈ విషయంలో తమిళనాడుతో పోల్చు కుంటే మాత్రం తక్కువే. ఈ 20 ఏళ్లలో నగరంలో కర్ణాటక సంగీత ప్రేమికులు తగ్గిపోయారు. విదేశాల్లో స్థిరపడ్డ తెలుగువారికి మాత్రం దీనిపై ప్రేమ తగ్గలేదు. నేర్చుకుంటున్నారు, పాడుతున్నారు, వింటున్నారు. కర్ణాటక సంగీతం ఓ మంచి స్నేహితుడి సాంగత్యం వంటిది. శ్రోతల్లో ఒక్కొక్కరు ఒక్కో రకంగా ఆస్వాదిస్తారు. ఈ సంగీతాన్ని వింటూ కొందరు ఆధ్యాత్మిక లోకంలోకి వెళ్తే... మరికొందరు అందులోని సాహిత్యాన్ని ఎంజాయ్ చేస్తారు. ఇవ్వాల్సిన సమయం... కోల్‌కత్తాలో పుట్టి, ముంబైలో పెరిగి, ప్రస్తుతం చెన్నైలో ఉంటున్నా... నా పేరు పక్కన బాంబే ఉండడాన్నే ఇష్టపడతాను. ముంబై అంటే అంతిష్టం. సంగీతమే సర్వం అయిపోయింది కానీ.. తొలినాళ్లలో అమ్మ నా మెంటార్. తరువాత నా గురువులు టి.ఆర్.బాలమణి, లాల్గుడి జయరామన్‌ల ఆశీస్సులతో ఇంత ఎదిగాను. అలాగే హిందుస్థానీ సంగీతాన్ని నాకందించిన మహవీర్ జయపూర్వాలే, అజయ్ పొహంకర్లను మరువలేను. ఇప్పటిదాకా ఎంతో నేర్చుకున్నాను, ఎంతో పొందాను. కానీ ఇది నేను సమాజానికి ఎంతోకొంత ఇవ్వాల్సిన సమయం. అందుకే ‘హితం’ ట్రస్ట్ ఏర్పాటు చేశాను. నా విద్యార్థులతో కలిసి గ్రామీణ విద్యార్థులకు, డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్‌కు సంగీతాన్ని నేర్పిస్తున్నాను. సంగీతంతో సంతోషాన్ని నలుగురికి పంచడంలో ఆనందం ఉంది. -
లేడీసే లీడర్స్
యంగ్ ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్.. యువ మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తూ, వారి సాధికారతకు కృషి చేస్తున్న సంస్థ. దశాబ్దానికి పైగా నగరంలో సేవలందిస్తున్న ఎఫ్ఎల్ఓ (ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్)కు అనుబంధంగా నడుస్తోందీ వైఎఫ్‌ఎల్‌ఓ. పర్సనాలిటీ డెవలప్మెంట్, అవేర్నెస్, ట్రైనింగ్, బిజినెస్ కన్సల్టెన్సీ, నెట్వర్కింగ్ తదితర అంశాల్లో ఎప్పటికప్పుడు యంగ్ లేడీ ఎంటర్‌ప్రెన్యూర్స్‌ను అప్డేట్ చేస్తూ... వారి అభివృద్ధికి చేయూతనందిస్తోంది. దీనికి నూతన చైర్‌పర్సన్‌గా సామియా అలమ్‌ఖాన్ నియమితులయ్యారు. సిటీకి చెందిన ఈ యువ పారిశ్రామికవేత్త మార్కెటింగ్ అండ్ ఫైనాన్స్ మేనేజ్మెంట్ గ్రాడ్యుయేట్. బ్యాంకింగ్ ప్రొఫెషనల్‌గా కెరీర్ ప్రారంభించి, ఐటీఈఎస్, కేపీఓ సెక్టార్స్‌లో ప్రభావవంతంగా బాధ్యతలు నిర్వర్తించారు. ప్రస్తుతం లీడింగ్ లైఫ్‌స్టైల్ ఎగ్జిబిషన్ ‘ఆరాయిష్’ పార్ట్నర్గా, ‘ది హైదరాబాద్ దక్కన్ సిగరెట్ ఫాక్యక్టరీ’ డెరైక్టర్‌గా సమర్థవంతమైన పాత్రలు పోషిస్తున్న సామియా... శకుంతల దివి నుంచి ‘వైఎఫ్‌ఎల్‌ఓ’ పగ్గాలు చేపట్టారు. ఈ సందర్భంగా... జీవితంలోని ప్రతి అంకంలో మహిళ నాయకురాలే అంటారామె. ‘మహిళ సాధికారత సాధించాలంటే విద్యాభివృద్ధి, ఆర్థిక కార్యకలాపాల్లో చురుకైన పాత్ర పోషించడం కీలకం. అన్ని స్థాయిల్లో విద్య, నైపుణ్యాల అభివృద్ధి ద్వారా దీన్ని సాకారం చేసుకోగలం. కాన్ఫిడెన్స్, ఎంపవర్మెంట్... కజిన్స్. దానికి మూలం, ప్రోత్సాహం ఆత్మవిశ్వా సమే. భారత్ ప్రస్తుతం ప్రపంచంలోనే ఓ శక్తిగా ఎదుగుతోంది. మహిళలు నిర్ణయాత్మకంగా వ్యవహరించి ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి. ఆలోచనలు విస్తృతం చేసి, ప్రతి రంగంలోనూ ముందుకు దూసుకు పోయేలా ఎదగాలి. అది విద్య, మౌళిక వసతులు, పరిశ్రమలు, ఆర్థిక సేవలు, వ్యాపారాలు.. ఏవైనా కావచ్చు’ అంటూ ఎంతో ఉద్వేగంగా చెప్పుకొచ్చారు సామియా. వయసులో చిన్నే అయినా ఆమె ఆలోచనలు ఆకాశమంత. సీఈఓ నుంచి హౌస్‌వైఫ్ వరకు.. మహిళలు వంటింట్లో ఉన్నా.. వ్యాపార రంగంలో ఎదుగుతున్నా.. ఎక్కడున్నా నాయకురాళ్లే అనేది సామియా అలమ్‌ఖాన్ చెప్పే భాష్యం. అంతే కాదు... ‘ఏ గొప్ప కార్యం జరిగినా దానికి ఆరంభం మహిళలతోనే. విశ్వాసం, నాయకత్వ లక్షణాలున్న ఎంతో మంది స్త్రీల సామర్థ్యంతో ఈ భారతావని నిర్మితమైంది’ అంటూ స్ఫూర్తిదాయకంగా చెప్పుకొచ్చారు ఈ యువ పారిశ్రామికవేత్త. మహిళలు స్వతంత్రంగా ఎదిగి తోటి మహిళలకూ చేయూతనందించడం తప్పనిసరంటున్న సామియా ఈ పదవిలో ఏడాది పాటు కొనసాగుతారు. ‘లెర్న్, ఇంప్లిమెంట్ అండ్ ఇన్స్పైర్’ అనే థీమ్‌తో తన ప్రస్థానాన్ని కొనసాగిస్తానంటున్నారామె. సో... బెస్ట్ ఆఫ్ లక్ టు సామియా! -
రోప్ తేరా మస్తానా!
అంతకంతకూ ఆధునికులకు చేరువైపోతూ.. నిత్య జీవితంలో భాగంగా మారిపోతున్న యోగా.. సమకాలీన పోకడలకు తగ్గట్టు పలు రూపాలను సంతరించుకుంటోంది. అదే బాటలో నగరానికి తాజాగా పరిచయమైంది రోప్ యోగా. యోగ సాధకులకు కొత్త ఉత్సాహాన్నందిస్తూ అందరినీ ఆకట్టుకుంటోంది. ..:: ఎస్.సత్యబాబు పై నుంచి కిందకు, పక్కలకు వేలాడుతూ చూడ్డానికి విచిత్రంగా అనిపించే ఈ ఆసనాల సాధన పేరు.. రోప్ వాల్ యోగా. అయ్యంగార్ల యోగాశైలి నుంచి ఈ నవీన యోగ జీవం పోసుకుందంటారు. యోగా గురువు బీకేఎస్ అయ్యంగార్ డిజైన్ చేశారని చెబుతున్న ఈ పద్ధతిలో తాడు, గోడలను ఆధారం చేసుకుని ఆసనాలు వేయడం ద్వారా మరింత ప్రయోజనం పొందవచ్చని చెబుతారు. అయ్యంగార్లు దీనిని యోగా కరుంట లేదా యోగా పప్పెట్రీ అని పిలిచేవారట. ఇప్పటిదాకా బాగా అనుభవజ్ఞులైన యోగా గురువులకు, యోగా చరిత్ర ఔపోసన పట్టిన వారికి మాత్రమే తెలిసిన ఈ విశేష ఆసన శైలి.. కొందరు యోగా గురువుల ద్వారా ఇటీవలే సిటీలో అరంగేట్రం చేసింది. ఆరోగ్యాభిలాషులకు చేరువవుతోంది. తాడు, గోడే ఆధారంగా.. రోప్ యోగా చేసేందుకు పూర్తిస్థాయి రోప్వాల్ను సెటప్ చేస్తారు. ఆ వాల్‌కు రోప్స్‌ను హుక్స్‌తో బిగిస్తారు. ట్రెక్కింగ్ వంటి వాటికి ఉపయోగించే బలమైన తాడును ఉపయోగిస్తారు. ఈ తాడు ఆధారంగా ఎంత బరువు, వయసు ఉన్న వారైనా ఆసనాలు వేయొచ్చు. గోడ, తాడులను ఆధారం చేసుకోవడం వల్ల మామూలు విధానంలో వేయడం కష్టమైన కొన్ని రకాల ఆసనాలను సులువుగా వేయవచ్చు. ప్రస్తుతం సిటీలోని కొన్ని యోగా స్టూడియోలలో బిగినర్స్ కోసం ఒకరకమైన తాళ్లను, యోగాసనాల్లో నైపుణ్యం కలిగిన వారి కోసం మరో రకమైన రోప్స్‌ను అమరుస్తున్నారు. మిగిలిన యోగాసనాలను సాధన చేస్తూ ఈ రోప్ యోగాను వారంలో రెండ్రోజులు వేస్తే సరిపోతుందని నిపుణులు సూచిస్తున్నారు. నో పెయిన్స్.. ఓన్లీ గెయిన్స్.. రోప్యోగాతో రిజల్ట్స్ ఫుల్ అంటున్నారు రినా హిందోచా. నగరంలోని తిరుమలగిరిలో రోప్వాల్ యోగా స్టూడియోను ఆమె నెలకొల్పారు. ‘ఐదేళ్ల సాధనతో గాని సాధ్యం కాని విలోమాసనం వంటివి రోప్స్ ద్వారా స్వల్పకాలంలోనే వేయవచ్చు. ఈ శైలిలో వేసే ఆసనాల వల్ల వెన్నెముక పటిష్టమవుతుంది. టైట్ మజిల్స్‌ను రిలాక్స్ చేస్తుంది. బ్యాక్‌పెయిన్‌కి మంత్రదండంలా పనిచేస్తుందని చెప్పవచ్చు’ అంటున్న రినా హిందోచా తమ దగ్గర ఒకేసారి పది మంది రోప్ యోగా చేయడానికి వీలుగా ఏర్పాట్లు ఉన్నాయని చెప్పారు. పదకొండేళ్లుగా శిక్షకురాలిగా ఉన్న ఉత్తర శర్మ సైతం సిటీలో రోప్యోగా స్టూడియో నిర్వహిస్తున్నారు. కొన్ని రకాల బాడీ టైప్స్‌కి ఇది పనికిరాదనే అపోహలను యోగా నిపుణులు తోసిపుచ్చుతున్నారు. బాడీ టైప్ని బట్టి విభిన్న ఆసనాలు, సాధన శైలిని మార్చుకోవచ్చునంటున్నారు. గతేడాదే రోప్వాల్ యోగా స్టార్ట్ చేశానంటున్న రమ్య, తనకు దీని ద్వారా మైగ్రెయిన్ బాధ తప్పిందన్నారు. ‘తొలుత చూసినప్పుడు భయమేసింది. కానీ.. ఇప్పుడు మరింత ఫ్లెక్సిబుల్‌గా మారాన’ని ఆనందం వ్యక్తం చేశారామె. ఫ్లెక్సిబులిటీని అలా ఉంచితే తల భాగానికి రక్త సరఫరా మెరుగై మంచి ఫలితాలు లభిస్తాయని చెబుతున్నారు యోగా గురువులు. ‘ఇది మైండ్‌కి, దేహానికి చాలా మేలు చేస్తుంది. చర్మం కాంతివంతమై, ముడతల్ని నివారిస్తుంది. తలకు రక్త సరఫరా అనేది హార్మోనల్ బ్యాలెన్సింగ్‌కు ఉపకరిస్తుంది. పిట్యూటరీ గ్రంథితో పాటు బ్రెయిన్లో ఉండే స్పిరిట్యువల్ సెంటర్‌గా పేర్కొనే పినియల్ గ్లాండ్ కూడా యాక్టివేట్ అవుతుంది’ అంటూ నిపుణులు దీని లాభాలను వివరిస్తున్నారు. జాగ్రత్తలూ ఉన్నాయ్.. ఇప్పటికే యోగసాధనలో ఉన్నవారు మాత్రమే ఈ యోగా శైలిని ఎంచుకోవాలి. అసలు యోగాసనాలే పరిచయం లేనివారు ప్రారంభ దశలో ఇవి వేయడం క్షేమం కాదు. కనీసం వారం రోజులైనా సరే ముందస్తుగా యోగ సాధన చేయకుండా తిన్నగా రోప్ అందుకోవడానికి కుదరదు. -
ఖల్నాయక్..
చార్మినార్ కేంద్రంగా నూతన నగరం ఏర్పడిన తర్వాత నగరం గురించి చెప్పిన వారిలో అమీర్అలీ మూడో తరానికి చెందినవాడు. ఈ థగ్గు ప్రత్యేకత ఏమిటి? ముందు తరాలు చెప్పిన ‘ఉద్యానవన నగరి’ వైనాలు నిజమేనని ధ్రువీకరించుకున్నాం.‘రోమాంచిత సాహసాలు’ ఇతడికే ప్రత్యేకం! అమీర్ అలీ అనే థగ్గు మాత్రమే బంజారాహిల్స్‌ను తొలిసారి వర్ణించాడు. ‘కుడివైపున కఠిన శిలల గుట్టలు. ఎడమవైపు మైదానప్రాంతం. ఆకాశంలో కలుస్తోందా అన్నట్టు ఆ మైదానం చాలా విశాలంగా ఉంది. మధ్యలో చిన్నిలోయ. అక్కడో నది (మూసి). తీరం వెంబడి అడవిని తలపించే వృక్షాలు. మధ్యలో సూర్యకాంతిలో తెల్లటి నివాసాలు. ధగధగా మెరుస్తున్నాయి. వీటన్నిటి మధ్య వీటన్నికంటే ఎత్తులో చార్మినార్.. పక్కనే మక్కామసీదు.. తలెత్తుకుని నిల్చున్నాయి. నూరు చిన్నచిన్న మసీదులు శ్వేతవర్ణంలో కాంతులీనుతున్నాయి. దూరం నుంచి ఈ నగరం చొరబడలేని అడవి. దగ్గరకు చేరేకొద్దీ తోటలు. తీర్చిదిద్దినట్టు.. వీధులు,నివాసాలు. దూరం నుంచి చూస్తే.. ఇక్కడ నరమానవులు ఉన్నారా..? అని అనిపించేది. నగరంలోకి ప్రవేశిస్తే తెలిసింది.. ఇది చిక్కని జనసముద్రం! చార్-మినార్ల మొనలు మేఘాలను చీల్చుకుని ఆకాశాన్ని అందుకున్నాయి. ఈ ఒక్క దర్శనం చాలు. ఢిల్లీ నుంచి వచ్చిన ఫలితం దక్కింది’ అని హైదరాబాద్ గురించి రాసుకున్నాడు అమీర్ అలీ. బందీని విడిపించాడు! కుతుబ్‌షాహీ సమాధులను తొలిసారి వర్ణించిన క్రెడిట్ కూడా అమీర్అలీదే! ఇక్కడకు రావడంలో ‘అందం’ ఉంది.‘ప్రతాపం’ ఉంది. అమీర్ అలీ గుర్రంపై అటుగా వెళ్తున్నాడు. అజీమా అనే అందమైన యువతి బాల్కనీలో విశ్రాంతిగా కన్పించింది. ఓ ముసలి, వ్యసనపరుడు ఆమెను ఇంటి బందీని చేశాడు! అమీర్‌అలీని అజీమా చూపులు కలిశాయి. సహాయకురాలిని అమీర్అలీ దగ్గరకు పంపింది, విముక్తం చేయాలని కోరుతూ! కథను క్లుప్తం చేస్తే, వాళ్లు లేచిపోదామనుకుంటారు. మరుసటి రోజు ఉదయం కుతుబ్‌షాహీ సమాధుల దగ్గరలోని షావలీ దర్గా దగ్గర కలుసుకోవాలని అనుకుంటారు. అనుకున్న వేళకు అమీర్ అలీ వచ్చేస్తాడు. అజీమాకు ఆలస్యం అవుతుంది. దిక్కులు చూస్తోన్న అమీర్అలీకి దర్గా కుడివైపు కుతుబ్‌షాహీ సమాధులు కనిపిస్తాయి. కొంచెం దూరం నుంచి చూసి చెప్పినా ‘కుతుబ్‌షాహీలు శాశ్వతనిద్రపోతున్న అచ్చోట అడవి పావురాళ్లూ, గబ్బిలాలు చేసే సవ్వడిని పెద్దపెద్ద గుమ్మటాలు ప్రతిధ్వనిస్తున్నాయి. అక్కడి శబ్దమూ, నిశ్శబ్దమూ, వెలుతురూ, చీకటి చిత్రమైన భావాలను కలిగించాయి’ అని అన్నాడు. బంధం తెంచుకుంది! కొంచెం ఆలస్యంగానైనా అజీమా అనుకున్న చోటికి వచ్చింది. ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. పిల్లవాడిని కన్నారు. చాలా సుఖంగా జీవించారు. పదేళ్లు రివ్వున గడిచాయి. అమీర్ అలీ పట్టుబడ్డాడు! జైలు పాలయ్యాడు! అజీమా ఎటువంటి మానసికస్థితికి లోనైఉంటుంది..? రోజుకు పలుమార్లు ‘దిగ్భ్రాంతి’ చెందినట్లుగా ప్రకటనలు ఇచ్చే ‘పెద్దవాళ్ల’లా కాదు, ఆమె నిజంగానే దిగ్భ్రాంతి చెందింది! తనను రక్షించిన కథానాయకుడు థగ్గు అని.. చుక్కనెత్తురు చిందకుండా వందల మందిని హత్యచేశాడని ఆమె కలలో కూడా ఊహించలేదు. ఆత్మహత్య చేసుకుంది! ప్రెజెంటేషన్: పున్నా కృష్ణమూర్తి, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్, ఫోన్ నంబర్: 7680950863 -
కమాన్ రాక్‌స్టార్స్
దక్కన్ పీఠభూమిలో ఠీవీగా నిల్చున్న భాగ్యనగరంలో హిల్స్‌కు కొదవేం లేదు. కాంక్రీట్ వనంలా మారిన బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ వదిలిపెడితే.. నగర శివార్లకు వెళ్తే.. ఇప్పటికీ.. ఎన్నో బండరాళ్లు సహజమైన అందాలతో దర్జాగా నిల్చుని ఉన్నాయి. ఉలి అలికిడి లేకుండానే వెలిసిన ఈ రాళ్ల సోయగాన్ని కాపాడే ల క్ష్యంతో కొన్ని సంస్థలు రాకథాన్, రాక్వాక్, రాక్ క్లయింబింగ్ వంటి ఈవెంట్లు నిర్వహిస్తున్నాయి. ఇందులో భాగంగా ఈ రోజు శంషాబాద్ దగ్గర్లోని వైట్ క్వార్ట్జ్ క్లిఫ్ దగ్గర రాక్వాక్ నిర్వహిస్తోంది ద సొసైటీ టు సేవ్ రాక్స్. మాసబ్‌ట్యాంక్‌లోని ఎన్ఎమ్డీసీ ప్రధాన ద్వారం దగ్గర రాక్స్టార్లంతా జట్టుకట్టి ఉదయం 7.30 గంటలకు అక్కడ్నుంచి మెయిన్స్పాట్కు బయల్దేరుతారు. ఇందులో పాల్గొనేవారు సొంత వాహనాలు తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఫోన్: 9866019402, 9848418085 -
కిక్.. క్లిక్..
రాయదుర్గంలోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో ఫొటో ఎక్స్పో-2015 శనివారం ప్రారంభమైంది. సినీనటి మంచు లక్ష్మి ఈ ఎక్స్పోను ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడే ఉన్న అధునాతన బైక్ దగ్గర నిల్చుని ఫొటోకు ఫోజులిచ్చారు. - రాయదుర్గం -
నేను.. మీ దియా!
సెలబ్‌డబ్ సెలబ్రిటీస్ హార్ట్ బీట్ దియామీర్జా మోడల్‌గా మెరిశారు. సినీనటిగా వెలిగారు. నిర్మాతగా మారారు. వీటన్నింటికంటే మించి చిన్న వయసులోనే సందేశాత్మక కార్యక్రమాల్లో పాలుపంచుకుంటూ తోటి నటీనటులకు భిన్నంగా నిలిచారు. దియామీర్జా మన హైదరాబాదీ అని సగర్వంగా చెప్పుకొనేలా తన జీవనయానాన్ని మలచుకున్నారు. ఇటీవల హైదరాబాద్‌కు వచ్చిన సందర్భంగా తన మనసులో మాటల్ని ఇలా పంచుకున్నారు. ..:: ఎస్.సత్యబాబు నేనెప్పుడూ మోడల్ని కావాలనుకోలేదు. అయ్యాను. నటిని అనే ఆలోచనే చేయలేదు. కాని సినిమాల్లో నటించాను. అదే క్రమంలో నిర్మాత అయ్యాను. డబ్బు కోసం సినిమాలు తీయడం లేదు. నా ఆలోచనలు, ఆశయాలను వీలైనంతగా ప్రతిఫలించే సినిమాలనే చేస్తున్నాను. ఇటీవల నేను తీసిన బాబీజసూస్ సినిమా అలాంటిదే. నేను.. మోడల్.. నటి.. ‘నువ్వు అందంగా ఉంటావన్న భావన తలకెక్కనీయవద్దు’ అని అమ్మ ఎప్పుడు హెచ్చరించేది. నేనెంచుకున్న కెరీర్ అందంతో ముడిపడి ఉన్నా.. కేవలం దాన్నే ఆధారంగా నేనెన్నడూ భావించలేదు. అందాలపోటీలను కనీసం చూడని నేను.. అనుకోకుండా ఓ రోజు బ్యూటీ కాంటెస్ట్‌లో పాల్గొన్నాను. మా అమ్మ ఆకాంక్షలకు వ్యతిరేకంగా అందులో పార్టిసిపేట్ చేశాను. కిరీటం గెలుచుకున్నా.. ఒంటరి అయిపోయాను. సంతోషం అనేది ఇతరులతో పంచుకున్నప్పుడే కలుగుతుందని నాకు ఆనాడే తెలిసింది. ఇక సినిమాలు కూడా నేను ప్లాన్ చేసుకున్న రంగం కాదు. స్కూల్‌డేస్‌లో థియేటర్ అనుభవం ఉంది. బ్యూటీ కాంటెస్ట్‌లో విజయం నన్ను అమాంతంగా నటిని చేసేసింది. నేను...నా చిన్నతనం... మానసికంగా నా పరిణతికి నా స్కూల్డేసే కారణం. మా ఇంట్లోగానీ, స్కూల్లో గానీ.. అమ్మాయిలు, అబ్బాయిలు అని తేడా చూపేవారు కాదు. మా పేరెంట్స్‌ది ప్రేమ వివాహం. ఇద్దరి మతాలు వేరు. దీంతో చిన్నప్పుడు మన మతమేదని అమ్మను ప్రశ్నించేదాన్ని. ‘మానవత్వమే మన మతమ’ని అమ్మ చెప్పేది. అయితే ఆ సమాధానంతో అందరినీ కన్విన్స్ చేయలేకపోయేదాన్ని. దీంతో ఇండియన్ అని చెప్పమన్న అమ్మ సూచనను అమల్లోపెట్టాను. నాకు తొమ్మిదేళ్లు ఉన్నప్పుడు నాన్న పోయారు. తర్వాత నాకు స్టెప్ ఫాదర్‌గా అహ్మద్ అలీ మీర్జా వచ్చారు. ఆయనంటే నాకు చాలా గౌరవం. నా సర్నేమ్ ఆయన అందించిందే. నేను.. సేవ.. మొదటి నుంచి సామాజిక స్పృహ ఎక్కువే. అందుకే మంచి ఉద్దేశాలతో వచ్చే ఎన్జీవోలతో పని చేయడానికి ఆసక్తి చూపిస్తుంటాను. మహిళలపై దాడుల నుంచి గ్రామీణ విద్య వరకు మన జీవితాలపై ప్రభావం చూపే ఏ అంశమైనా నా అవసరం ఉందంటే తప్పకుండా ముందుంటాను. ఎన్డీటీవీ గ్రీన్థాన్ కార్యక్రమం ప్రారంభమైన నాటి నుంచి అందులో భాగంగా ఉన్నాను. కేన్సర్, ఎయిడ్స్‌పై అవగాహన కల్పించే సొసైటీలు, స్పాస్టిక్స్ సొసైటీ ఆఫ్ ఇండియా, పెటా, క్రై.. ఇలా పలు సంస్థలతో కలసి కదులుతున్నాను. ప్రజాప్రయోజన కార్యక్రమాల ప్రచారం కోసం ఏవైనా రాష్ట్ర ప్రభుత్వాలు నన్ను సంప్రదిస్తే వెంటనే ఓకే చెబుతున్నాను. నేను.. ఆయన.. పెళ్లి నా జీవితానికి మరింత ఆనందాన్ని జత చేసింది. సాహిల్.. ఓ అద్భుతమైన భాగస్వామి. ఆయన మనస్తత్వం, ఆలోచనలు బాగుంటాయి. ఇంకో మాట.. నాపై భాగ్యనగరం ప్రభావం ఎంతో ఉంది. చిన్నప్పుడు నేను చదువుకున్న విద్యారణ్య స్కూల్లో అవలంబించిన జిడ్డు కృష్ణమూర్తి ఫిలాసఫీ నుంచి.. ఇక్కడ ఉండగా నా జీవితంలో ఎదురైన ప్రతి పరిణామం నా వ్యక్తిత్వాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దుకోవడానికి ఉపకరించాయి. -
నాట్యలాస్యం
ఆదివాసీలకు ఆలవాలంగా ఉన్న ఈశాన్య రాష్ట్రాల్లో అడుగడుగునా జానపదలాస్యం కనిపిస్తుంది. మణిపూర్‌లో వికసించి, జానపద వైభవానికి ప్రతీకలుగా నిలిచిన ‘వసంత్ రాస్, పుంగ్ చోలమ్’.. నాట్యాలకు హైదరాబాద్ వేదిక కానుంది. శిల్పారామంలోని అంఫీ థియేటర్లో ఈ రోజు సాయంత్రం 6.30 గంటలకు ఈ జంట నృత్యాలు కనువిందు చేయనున్నాయి. ఇంఫాల్‌లోని జవహర్లాల్ నెహ్రూ మణిపురి డ్యాన్స్ అకాడమీకి చెందిన 20 మంది కళాకారులు వీటిని ప్రదర్శించనున్నారు. రాసలీల రేయిలోని.. బృందావన శ్రీకృష్ణుడి రాసలీలను కీర్తిస్తూ సాగే నాట్యం వసంత్‌రాస్. మణిపూర్‌లో వసంత రుతువు ఆగమనం తర్వాత చైత్ర మాసంలో జానపదులు జరిపే ఉత్సవాల్లో వసంత రాస్ నృత్య రూపకం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. రాధాకృష్ణుల ఆనందకేళి, కృష్ణునితో గోపికల వినోదవల్లరి.. ఇలా భాషలోన రాయలేని.. రాసలీల రేయిని.. ఈ రూపకంలో కళ్లముందుంచుతారు కళాకారులు. ఢమరుకం మోగ.. హోలీ వేళలో.. మణిపూర్ పల్లెల్లో పుంగ్ చోలమ్ కన్నులవిందుగా సాగుతుంది. మృదంగాలు చేతబూనిన కళాకారుల లాస్య విన్యాసం చూసి తరించాల్సిందే. పాదరసంలా పాదాలను కదుపుతూ.. గాలిలో ఎగురుతూ.. చేసే నృత్యం అద్భుతంగా సాగుతుంది. ఫోన్: 9849298275, 9391047632 -
వెండితెర బంగారం
చిట్‌చాట్ నిత్య నూతన చిరునవ్వుతో.. టాలీవుడ్ జనాలకు దగ్గరైన నిత్యామీనన్.. చీరకట్టులో సింప్లీ సూపర్బ్ అనిపించింది. బంజారాహిల్స్‌లోని పార్క్ హయత్ హోటల్లో శనివారం జరిగిన సినిమాటోగ్రాఫర్ జ్ఞానశంకర్ ఆర్ట్ ఎగ్జిబిషన్లో... ఆయన కుంచె నుంచి జాలువారిన పెయింటింగ్స్‌ను చూసి అచ్చెరువొందింది. ఈ సందర్భంగా నిత్యామీనన్‌తో సిటీప్లస్ చిట్‌చాట్.. నేను పుట్టి పెరిగింది బెంగళూరులో. మణిపాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కమ్యూనికేషన్ నుంచి జర్నలిజం కోర్సు చేశా. హీరోయిన్ అవుతానని ఏనాడూ అనుకోలేదు. జర్నలిస్టుగా రాణించాలనుకున్నా. పరిస్థితులు అందుకు సహకరించలేదు. ఆ తర్వాత నా ఆలోచనలను సినిమా ద్వారా చెప్పేందుకు నిర్మాత కావడం కోసం పూణెలోని ఎఫ్టీఐలో సినిమాటోగ్రఫీలో ఎన్రోల్ చేసుకున్నా. ఈ ఎంట్రెన్స్ సమయంలోనే నందినిరెడ్డితో పరిచయం ఏర్పడింది. హీరోయిన్గా నటించాలని బ్రెయిన్ వాష్ చేసింది. అలా మొదలైంది నా సినిమా కెరీర్. చిన్నప్పటి నుంచీ చలాకీ... స్కూల్ డేస్ నుంచే చలాకీగా ఉండేదాన్ని. ఇంట్లో కూడా బాగా అల్లరి చేసేదాన్ని. నా ముసిముసినవ్వులు, వినసొంపైన మాటలతో పేరెంట్స్‌ను కూల్ చేసేదాన్ని. కోపమొచ్చినా మరుక్షణంలో మరిచేలా నటించేదాన్ని. అలా నాకు తెలియకుండానే నటన వచ్చేసింది. పదో తరగతిలో ఉండగానే ‘ద మంకీ హూ న్యూ టూమచ్’ సినిమాలో చైల్డ్ ఆర్టిస్టుగా అవకాశం వచ్చింది. అలా మొదలైంది... నా కెరీర్‌కు దోహదపడిన ఈ భాగ్యనగరం అంటే నాకు ప్రత్యేక అభిమానం. అలా మొదలైంది సినిమా చాలా వరకు సిటీ లొకేషన్స్‌లోనే తీశారు. ఈ షూటింగ్ ిపీరియడ్లోనే సిటీలోని చారిత్రక కట్టడాలు చూసేశాను. నాకు డ్రెస్ వేసుకోవడం కంటే.. చీర కట్టుకోవడం అంటే చాలా ఇష్టం. చీరకట్టులో అచ్చమైన తెలుగమ్మాయిలా ఉంటాను. హైదరాబాదీ డిజైనర్స్ చేతిలో అట్రాక్షన్‌గా రూపుదిద్దుకున్న చీరలు భలేగా ఉంటాయి. అ మజానే వేరు.. సిటీఫుడ్ అంటే చాలా ఇష్టం. టైం దొరికినప్పుడల్లా బంజారాహిల్స్‌లోని తాజ్బంజారాకు వెళ్తుంటా. అక్కడ లేక్ పక్కన ఉన్న కుర్చీల్లో కూర్చొని బిర్యానీ తింటే ఆ మజానే వేరు. స్పైసీ ఫుడ్ కూడా నోరూరిస్తుంటుంది. సరికొత్తగా కనిపించిన ఏ వంటకాలనైనా టేస్ట్ చూడనిదే వదిలిపెట్టను. సినిమా పరంగా అయితే ఇష్క్, ఒక్కడినే, జబర్దస్త్, గుండె జారి గల్లంతయ్యిందే, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు.. మంచి పేరునే తెచ్చిపెట్టాయి. సన్నాఫ్ సత్యమూర్తిలో చేసింది చిన్న రోల్ అయినా నటన సంతృప్తినిచ్చింది. ఓకే బంగారంలోని నా పాత్ర రియల్ లైఫ్‌కి అతికినట్టు సరిపోతుంది. సొంతూరు వెళ్తున్నా.... ఇన్నాళ్లు సినిమా షూటింగ్‌లతో బిజీగా ఉన్నా. రెండు నెలల పాటు బ్రేక్‌ను ఇవ్వాలనుకుంటున్నా. బెంగళూరుకు వెళ్లి కుటుంబసభ్యులతో గడుపుదామనుకుంటున్నా. ఆ తర్వాత బెంగళూరు డేస్ రీమేక్ తెలుగు మూవీలో నటించబోతున్నా. ఖాళీ సమయాల్లో పుస్తకాలు చదువుతుంటా. రాస్తుంటా. కూర్చొని ఆలోచిస్తుంటా. అయితే ఆర్ట్ వేయడమనేది ఓ విద్య. అంత కష్టమైన పనిని నేను చేయలేను. -
దారితోచని పాదచారి
అదిగో అది రోడ్డు..! ఎవరికి..? వాహనాలకు. ఇదిగో ఇది ఫుట్‌పాత్..! ఎవరికి ? పాదచారులకు. మరి నడిచే వారేరి..? నడిచే వారికి దారేది..? ఈ నగరంలో ఫుట్‌పాత్‌లుండాలి ఎవరికైనా కనిపించాయా..? రోడ్లు విస్తరిస్తున్నాయి. వాటి నిండా వాహనాలు నిండిపోతున్నాయి. రహదారులు వెడల్పయ్యే కొద్దీ ఫుట్‌పాత్‌లు చిక్కిపోతున్నాయి. వాహనాలు పెరిగే కొద్దీ పాదచారులూ బక్కచిక్కిపోతున్నారు. దూరం తక్కువే అయినా నడిచే తీరిక లేదు నగరవాసికి. నడిచే తీరిక ఉన్నా రహదారిపై పద్మవ్యూహాన్ని ఛేదించే ఓపిక అంతకన్నా లేదు. తప్పక నడుద్దామనుకుంటే.. ఫుట్‌పాత్ ఎక్కడ ఉందో వెతుక్కోవాల్సిందే. విక్రమార్కుడిలా అన్వేషణ సాగిస్తే అక్కడక్కడా ఒక్కో సైజులో ఉండీ లేనట్టు ఊరిస్తూ దర్శనమిస్తాయివి. దారి కాచిన చిక్కులు.. నైలు నది ఉన్నట్టుండి ఎడారిలో మాయమైనట్టు మన సిటీలో ఫుట్‌పాత్‌లు సడన్‌గా మాయమై ఏ దుకాణానికి సంబంధించిన సామగ్రో కాళ్లముందు ప్రత్యక్షమవుతుంది. కాలు తడవకుండా సముద్రాన్నయినా దాటొచ్చేమో కాని.. కాలు రోడ్డు మీద పెట్టకుండా ఫుట్‌పాత్ మీద నడవలేమన్నది ‘నగర సత్యం’. అడుగడుగునా ఆక్రమణలు, కబ్జాలు సారీ అలా అంటే వారికి కోపమొస్తుందేమో ! ఏదో జస్ట్ ఖాళీగాఉందని వాడుకుంటున్నారు. కేవలం దుకాణాదారులేనా.. గృహస్తులు, అపార్ట్‌మెంట్‌వాసులూ తక్కువేం కాదు. మొక్కల పెంపకం పేరుతో ఫుట్‌పాత్‌లను అందంగా వాడేసుకుంటున్నారు. అడగటానికి మీరొస్తారా..! నేనొస్తానా..!! అందుకే అవి అందంగా చెలామణీ అయిపోతున్నాయి. ఇదీ రహదారే.. ఇక అక్కడక్కడ కనిపించే ఫుట్పాత్లని ముఖ్యంగా మెయిన్ రోడ్‌పై ఫుట్‌పాత్‌లను యమ దర్జాగా వాడుకునే బైక్వీరుల గురించి చెప్పాలి. సిగ్నల్ పడినా ట్రాఫిక్‌లో కొన్ని బైకుల వేగం ఆగదు. ఫుట్‌పాత్ కనిపిస్తే చాలు వాటిపైకి ఎక్కేస్తాయి. వారి కోసమే ఫుట్‌పాత్ ఉందన్నట్టు రేసింగ్‌లో దూసుకెళ్లినట్టు ముందుకెళ్తారు. ఫుట్‌పాత్‌లు ఇలా కూడా వాడొచ్చన్నమాట అని విస్తుపోవడం మన వంతు. ఆపడానికి మీరొచ్చారా..! నేనొచ్చానా..!! అందుకే వాళ్లు ఫుట్‌పాత్‌లను సైతం ‘మా దారి రహదారి’ అని డిక్లేర్ చేస్తున్నారు. మార్గదర్శులెవరు..? ‘కంచే చేను మేస్తే’ అన్న చందంగా ప్రభుత్వం వల్ల కలిగే నష్టాల గురించి ఎవరి దగ్గర మొర పెట్టుకోవాలో చెప్పండి. రోడ్డుతో పాటు ఫుట్పాత్లకూ ఇంత బడ్జెట్ ఉంటుంది. కానీ రోడ్డొకరిది.. ఫుట్‌పాత్ ఒకరిది. నారు పోసిన వాడు నీరు పోయక మానడు. కాని, రోడ్డు పోసిన వాడు ఫుట్‌పాత్ మాత్రం వేయడు. అది వేరే డిపార్ట్మెంట్ పని కనుక. పోనీ ఎట్టకేలకు ఫుట్‌పాత్ తయారైనా.. మరో డిపార్ట్మెంట్ అర్జెంట్‌గా తవ్వి తీరుతుంది. అలా తవ్వింది పూడ్చడానికి మరో బడ్జెట్కాలం పడుతుంది. ‘మా తాతలు గోతులు తవ్వారు.. మేం నీతులు చెబుతున్నాం’ అంటూ చూసే వారే కానీ నిజంగా ఫుట్‌పాత్‌ల గురించి ఆలోచించే డిపార్ట్మెంట్లేవి. ఓ బాటటౌటటడ నడకదారి మనందరి హక్కు. అందమైన రోడ్లతో పాటు సరైన ఫుట్‌పాత్‌లు మన నగరానికి నిజమైన అవసరం. మనం వాడనిదే, అడగనిదే ఆ అవసరాన్ని తీర్చేందుకు ప్రభుత్వాలు ముందుకు రావు. ఓ పక్క కొన్ని చోట్ల నిజంగానే ఫుట్‌పాత్‌లు అందంగా ఉన్నా, వాటిని ఉపయోగించే పాదచారులు ఏరి..? ఫుట్‌పాత్‌లు ఉన్నా కూడా రోడ్డు మీద వాహనాల మధ్యలో నడిచే వారు మనలో చాలామందే ఉన్నారు. అలవాటులో పొరపాటుగా ఫుట్‌పాత్ మరచిపోయి మరీ వాహనాలతో పోటీపడుతున్నారు. ఈ సారి ఫుట్‌పాత్ కనిపిస్తే పండుగ చేసుకోండి. దానిపై దర్జాగా నడవండి. ఏదైనా అడ్డొస్తే ధైర్యంగా అడగండి. నడవడం మన హక్కు. ఫుట్‌పాత్ మన అధికారం. -
యాప్స్ ఫర్ క్లైమేట్ చేంజ్
‘మొబైల్ యాప్స్ ఫర్ క్లైమేట్ చేంజ్’... విద్యార్థుల్లో పర్యావరణంపై అవగాహన పెంచేందుకు ఎల్వీ ప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్‌తో కలిసి వరల్డ్‌వైడ్ ఫండ్ ఫర్ నేచర్ రూపొందించిన ప్రాజెక్ట్! ఈ పర్యావరణ అధ్యయనాన్ని ‘అర్బన్ ఐనేచర్వాచ్ చాలెంజ్’ పేరుతో విద్యార్థుల ప్రాజెక్టు వర్క్‌లో భాగం చేశారు. డిసెంబర్లో లాంచ్ చేసిన ఈ యాప్స్ ఉపయోగిస్తున్న తీరును తెలుసుకునే కార్యక్రమాన్ని చేపట్టింది డబ్ల్యూడబ్ల్యూఎఫ్. ఇందులో మెరిడియన్, హైదరాబాద్ పబ్లిక్‌స్కూల్, భారతీయవిద్యాభవన్, చిరాక్ ఇంటర్నేషనల్, ఆక్స్ఫర్డ్ గ్రామర్ స్కూల్, ఇక్బాలియా ఇంటర్నేషనల్ స్కూల్స్ విద్యార్థులు పాల్గొని.. యాప్ వినియోగాన్ని వివరిస్తారు. సమయం: ఉదయం 9:30 గంటలకు వేదిక : ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్, బంజారాహిల్స్ -
సాక్షి ఎక్స్‌లెన్స్
గత ఏడాది విభిన్న రంగాల్లో ప్రతిభా నైపుణ్యాలు ప్రదర్శించిన విజయవంతమైన వ్యక్తులను గుర్తించి సత్కరించేందుకు సాక్షి మీడియా గ్రూప్.. ‘సాక్షి ఎక్స్‌లెన్స్ అవార్డ్స్ 2014’ కార్యక్రమాన్ని రెండు రోజుల పాటు నిర్వహించింది. నగరంలోని తాజ్ బంజారా హోటల్ ఇందుకు వేదికైంది. అవార్డులకు సంబంధించిన నామినేషన్ల వడపోత ప్రక్రియ బుధవారం ప్రారంభమైంది. తొలిరోజు పాపులర్ కేటగిరీలుగా స్పోర్ట్స్, టీవీ సీరియల్స్, సినిమా రంగాలకు సంబంధించి తమకు అందిన నామినేషన్లను జ్యూరీ సభ్యులు పరిశీలించారు. వీటిలో ఒక్కో కేటగిరీ నుంచి ఫైనలిస్ట్‌లుగా కొందరిని ఎంపిక చేశారు. వీరిలో నుంచి విజేతలను ఓటింగ్ ద్వారా ఎంపిక చేస్తారు. యంగ్ అఛీవర్ ఇన్ సోషల్ సర్వీస్ కేటగిరీ నుంచి ఐదుగురిని టాప్ ఫైనలిస్ట్‌లుగా ఎంపిక చేశారు. ఈ విభాగంలో తుది విజేతను జ్యూరీయే స్వయంగా ఎంపిక చేస్తుంది. మొదటి రోజు ఎక్స్‌లెన్స్ అవార్డ్స్ ఎంపిక కమిటీకి జ్యూరీ సభ్యులుగా సినీ, క్రీడా రంగ ప్రముఖులు రావి కొండలరావు, గీతాంజలి, అల్లాణి శ్రీధర్, పూర్ణిమారావు, ఎన్.ముఖేష్‌కుమార్, విక్టర్ అమల్‌రాజ్, నాటక రంగ ప్రముఖులు గుమ్మడి గోపాలకృష్ణ, నృత్యకారిణి స్వాతి సోమనాథ్ వ్యవహరించారు. రెండో రోజు.. రెండో రోజు గురువారం బెస్ట్ మూవీ, బెస్ట్ మేల్-ఫిమేల్ ఆర్టిస్ట్, బెస్ట్ ఫిమేల్-మేల్ సింగర్ల కేటగిరీలకు ఫైనలిస్ట్‌లను సెలక్ట్ చేశారు. ఈ ప్రక్రియకు జ్యూరీ సభ్యులుగా సినీ ప్రముఖులు తమ్మారెడ్డి భరద్వాజ్, చంద్రబోస్, కవిత, రాశి, సంగీత దర్శకుడు కె.ఎం.రాధాకృష్ణన్, సామాజిక ప్రముఖులు గోరటి వెంకన్న, దేవి వ్యవహరించారు. ఈ రెండు రోజుల కార్యక్రమాన్ని సాక్షి కార్పొరేట్ కమ్యూనికేషన్స్ డెరైక్టర్ రాణిరెడ్డి పర్యవేక్షించారు. సంతోషంగా ఉంది: దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ విభిన్న రంగాల్లో ప్రతిభ చూపిన వారిని సత్కరించేందుకు సాక్షి మీడియా చేస్తున్న ఈ ప్రయత్నాన్ని అభినందిస్తున్నాను. ఈ తరహా సెలక్షన్స్ సినీఫీల్డ్‌లో సాధారణమే. అయితే ఓ మీడియా సంస్థ ఇంత జెన్యూన్‌గా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం సంతోషంగా ఉంది. మరెందరికో స్ఫూర్తి: నటి కవిత ఈ కార్యక్రమాన్ని చేపట్టిన సాక్షి మీడియాకు ధన్యవాదాలు. ఇండస్ట్రీకి చెందిన వ్యక్తిగా ఇందులో పాలుపంచుకుంటున్నా. ఈ కార్యక్రమం మరెందరికో స్ఫూర్తి నివ్వాలని కోరుకుంటున్నా. కొత్తగా అనిపించింది: సంగీత దర్శకుడు రాధాకృష్ణన్ ఇలాంటి అవార్డ్ ప్రోగ్రామ్స్ బాలీవుడ్లో ఎక్కువ. ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని సాక్షి నుంచి నాకు కాల్ రాగానే కొత్తగా అనిపించింది. ఇటువంటికార్యక్రమాలు కొత్త స్ఫూర్తి నింపుతాయి. గొప్ప ఆలోచన: సినీ గేయ రచయిత చంద్రబోస్ కేవలం సినిమా నటీనటులు, గాయనీగాయకులు అని కాకుండా.. స్పోర్ట్స్ పర్సన్స్, సీరియల్స్, సామాజిక సేవకులు.. ఇలా పలు రంగాలకు చెందిన వారిని ప్రోత్సహించే ఈ కార్యక్రమంలో నన్ను భాగస్వామిని చేసినందుకు సాక్షికి కృతజ్ఞతలు. ప్రేక్షకులే నిర్ణేతలు: సినీ నటి రాశి ఎవరు ది బెస్ట్ అని నిర్ణయించడం అంత సులభమైన విషయం కాదు. సరైన న్యాయనిర్ణేతలు మాత్రం టీవీల ముందు కూర్చున్న ప్రేక్షక దేవుళ్లే. సాక్షి చేపట్టిన ఎక్స్‌లెన్స్ ఈవెంట్లో నా ఒపీనియన్ షేర్ చేసుకున్నందుకు హ్యాపీగా ఉంది. ఫ్యూచర్లో..: సామాజిక కార్యకర్త దేవి సాక్షి చేస్తున్న ఈ ప్రయత్నం బాగుంది. షార్ట్ ఫిలింస్, డాక్యుమెంటరీస్ మీద కూడా ఫోకస్ చేస్తే బాగుండేది. మంచి కథ, కథనం ఉండి పెద్దగా పేరు రాని మంచి మూవీస్ అనేకం ఉంటాయి. అలాంటి వాటిపై దృష్టి పెట్టి ఉంటే.. న్యూ టాలెంట్స్‌ను ప్రోత్సహించినట్టుండేది. ఫ్యూచర్లో ఆ కోణంలో ఆలోచిస్తే బాగుంటుంది. -
మై ఎడ్యూ ఫెయిర్-2015
సమయం: ఈ రోజు ఉదయం 11 గంటలకు వేదిక: గ్రీన్‌పార్క్, బేగంపేట్ ఫోన్: 9176938884 -
వీక్లీ ఆర్గానిక్ బజార్
సమయం: ఆదివారం ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 2.30 గంటల వరకు వేదిక: లామకాన్, రోడ్ నంబర్ 1, బంజారాహిల్స్ ఫోన్: 9642731329, 9177882261 -
సలామ్ సల్సా
ఆడుతూ పాడుతూ.. అలుపు సొలుపు తెచ్చుకోవాలనుకుంటున్నారా. తనువుకు వ్యాయామం.. మనసుకు ఆహ్లాదం కలిగించే సరదా స్టెప్పుల ఆటే సల్సా. చూడటానికి జల్సాగా కనిపించినా.. సల్సాతో ఫిట్నెస్ మెరుగుపర్చుకోవచ్చని చెబుతున్నారు ట్రైనీలు. అందుకే సల్సా డ్యాన్స్ వర్క్‌షాప్ నిర్వహిస్తున్నారు. ఆదివారం మధ్యాహ్నం 3 నుంచి 5 గంటల వరకు డ్యాన్స్ క్లాస్ జరుగుతుంది. వేదిక: అవర్ సేక్రెడ్ స్పేస్, ఎస్పీ రోడ్, సికింద్రాబాద్ -
సెలెక్ట్ యువర్స్..
నిగనిగలాడే నగలంటే మగువలకు ఎంత ఇష్టమో చెప్పనక్కర్లేదు. అందుకే బంగారం ధర భగభగ మండినా.. కొంగొత్త ధగధగలతో మేనంతా మెరిసిపోవాలనుకుంటారు. ష్యాషన్‌కు రెడ్‌కార్పెట్ పరచి స్వాగతించే అతివల కోసం.. యునెటైడ్ ఎగ్జిబిషన్ మెగా జ్యువెలరీ ప్రదర్శన ఏర్పాటు చేస్తోంది. ప్రముఖ డిజైనర్ల లేటెస్ట్ కలెక్షన్స్ ఇందులో కొలువుదీరనున్నాయి. బంజారాహిల్స్‌లోని తాజ్‌కృష్ణలో ఈ రోజు నుంచి సోమవారం వరకు మూడు రోజుల పాటు ఈ ప్రదర్శన జరగనుంది. ఫోన్: 040-66466778 -
రాగరంజని
ద్రవిడ సీమలో విరిసిన గాత్రం సిటీవాసులను రాగ రంజనిలో ఓలలాడించనుంది. ఆల్ ఇండియా రేడియో ఆర్టిస్ట్ రంజనీ శివకుమార్ గళవిన్యాసానికి బంజారాహిల్స్ రోడ్‌నంబర్ 8లోని సప్తపర్ణి వేదిక కానుంది. రంజని కర్ణాటక గాత్ర కచేరి ఈ రోజు సాయంత్రం 6.30 గంటలకు ప్రారంభమవుతుంది. ప్రవేశం ఉచితం. ఫోన్: 040- 23705440 -
ఫన్ ఫ్లవర్
పొద్దుతిరుగుడు పూలలా ముద్దుగుమ్మలు సిగ్గులొలికిస్తూ వయ్యారాలు పోయారు. పసుపు పచ్చందంలో మెరిసిపోయారు. ఫన్కార్ ఇన్నోవేటివ్ మైండ్స్ లేడీస్క్లబ్ సభ్యులు మారియట్ హోటల్లో శుక్రవారం సన్‌ఫ్లవర్ పార్టీ వేడుకగా చేసుకున్నారు. సమ్మర్ సీజన్‌కు ఫన్నీగా వెల్కం చెబుతూ.. ఎల్లో కాస్ట్యూమ్స్‌లో స్టన్నింగ్ పోజులిచ్చారు. -
ఖూబ్సూరత్
దుబాయ్ శీను సినిమా చూశారుగా..! అందులో షాయాజీ షిండే తరచూ ముఖం వంకర్లు తిప్పే సీన్ గుర్తుందా..? ముఖారవిందం అందంగా కనిపించడానికి ఫేస్ ఎక్సర్సైజ్ చేస్తున్నానని షిండే చెప్పే సీన్లు మనం కామెడీగా తీసుకున్నాం కానీ.. అది నిజమేనండీ బాబు..! ప్రస్తుతం సిటీలో కొందరు అతివలకు ఫేసర్‌సైజ్ ఫీవర్ పట్టుకుంది. వీకెండ్ వస్తే చాలు.. ఫేస్ చరిష్మాను మార్చే ఫేసర్‌సైజ్ వర్క్‌షాప్‌లకు పరుగులు తీస్తున్నారు. ..:: వాంకె శ్రీనివాస్ ‘ఆమె ముఖం చంద్రబింబం వలె ఉన్నది’.. తెలుగు అలంకారాలు నేర్చుకునే రోజుల్లో ఈ వాక్యం పదే పదే చదువుకున్నాం. చంద్రబింబాన్ని కృష్ణపక్షం ఎలా మింగేస్తుందో.. ముఖ వర్చస్సును వయసు అలా హరిస్తుంది. నిండు యవ ్వనంలో నిగనిగలాడిన బూరెల్లాంటి బుగ్గలు.. నడివయసుకు వచ్చే సరికి పీలగా మారిపోతాయి. ఫిట్నెస్ సూత్రాలను తు.చ తప్పకుండా ఫాలో అయ్యే మగువల్లోనూ తనువెల్లా అందం తొణికిసలాడినా.. ముఖం వరకు వచ్చే సరికి మాత్రం వయసు పైబడిన ఛాయలు కొట్టొచ్చినట్టు కనిపిస్తాయి. ఈ సమస్యను అధిగమించడానికి సిటీస్త్రీలు ఫేసర్‌సైజ్ వైపు మొగ్గు చూపుతున్నారు. వీకెండ్స్‌లో జరిగే వర్క్‌షాప్‌లకు హాజరవుతున్నారు. అక్కడ నేర్చుకున్న వ్యాయామాలను ప్రతి రోజూ ఓ 15 నిమిషాలు చేస్తూ గ్లామర్‌ను పెంచుకునే పనిలోపడ్డారు. ముఖార‘వింత’ం ఫేసర్సైజ్లో భాగంగా ముఖంపై చేతులు పెట్టుకోవడం.. మెడ చుట్టూ చేతులను బిగించడం.. ఇలా వింత విన్యాసాలతో అందాన్ని సొంతం చేసుకుంటున్నారు. ‘1980లో కారొలే మాగియో ఫేసర్‌సైజ్ ఫేసియల్ ఎక్సర్సైజ్ను సృష్టించారు. ఇందులోని ఎక్సర్సైజ్లు ముఖ కండరాలను మెరుగుపరిచి అందంగా కనబడేలా చేస్తాయి. పాశ్చాత్య దేశాల్లో ఇప్పటికే ప్రాచుర్యం పొందిన ఫేసర్‌సైజ్.. ఢిల్లీ, ముంబైల మీదుగా ఇప్పుడు హైదరాబాద్‌కు చేరుకుంది. ఇన్నాళ్లు ముఖం అందాన్ని మార్చుకునేందుకు కాస్మొటిక్ సర్జరీల వైపు మొగ్గు చూపిన వాళ్లు.. ప్రస్తుతం ఫేసర్‌సైజ్ ఆప్షన్‌ను ఎంచుకుంటున్నారు. ఇందులో ఫోర్హ్యాండెడ్నెస్, డబుల్ చీక్, ఫర్ స్మైలింగ్ లైన్, నెక్ టోనర్.. ఇలా 72 డిఫరెంట్ ఎక్సర్సైజులను నేర్పిస్తున్నామ’ని తెలిపారు జూబ్లీహిల్స్‌లోని మేఘవి స్పా యజమానురాలు మేఘవి. చహరేమే జాదూ.. ఒక్కో రకం ఎక్సర్‌సైజ్‌తో ముఖంలోని ఒక్కో భాగం అందంగా కనిపిస్తుందని చెబుతున్నారు ఫేసర్‌సైజ్ ట్రైనీలు. ‘నుదురు అందంగా కనిపించడం కోసం.. కనుబొమ్మల పైభాగంలో రెండు వైపుల నుంచి చేతులు కాసేపు ఉంచాలి. ఇలా చేయడం వల్ల రక్త ప్రసరణ సులువుగా జరిగి.. కండరాలు సంకోచించడం వల్ల.. లలాటంలో కళ పెరుగుతుంది. ఇలాంటి చిన్న చిన్న వ్యాయామాల వల్ల మీ వయసు ఐదేళ్లు తక్కువగా కనిపిస్తుంది’ అని అంటారు మేఘవి. ఈ ఫేసర్‌సైజ్ కేవలం అతివల కోసమే కాదు. మగాళ్లు కూడా చేసుకోవచ్చని చెబుతున్నారామె. ముఖంలో అందం పెరగటం వల్ల మనిషిలో కాన్ఫిడెంట్ లెవల్స్ కూడా పెరుగుతాయని అంటున్నారు. -
వెన్నునొప్పి ముదిరితే మిగిలేది వైకల్యమే
వెన్నునొప్పి ప్రాణాలేమీ తీయక పోవచ్చు కానీ, శరీరాన్ని నిర్జీవంగా మార్చేస్తుంది. దీనికి పెయిన్ కిల్లర్స్, సర్జరీ, బెడ్‌రెస్ట్,ఫిజియోథెరపీ శాశ్వత పరిష్కారం కాదు. ఆయుర్వేదంలో సూచించిన కేరళ పంచకర్మ, మర్మ చికిత్సలతో వెన్ను నొప్పిఉన్న మూల కారణాలను శాశ్వతంగా నిర్మూలించవచ్చు. అంతే కాకుండా వెన్నెముకని ఉక్కు స్తంభంలా మారుస్తుందంటున్నారు ప్రముఖ ఆయుర్వేదిక్ పంచకర్మ స్పెషలిస్ట్ డాక్టర్ పి.కృష్ణప్రసాద్. వెన్నెముక వర్సెస్ పవర్‌హౌస్ వెన్నెముక పవర్ హౌస్ లాంటిది. ఇది కాళ్లు, చేతులు, తల, భుజాలు, మెడను స్థిరంగా నిలబడేలా చేస్తుంది. వివిధ కారణాలవల్ల ఒక్కోసారి ఈ పవర్ హౌస్ శక్తిహీనంగా మారుతుంది. సరైన సమయంలో వైద్య చికిత్సలేవీ అందకపోతే భుజం నొప్పులు, మెడ నొప్పులు, కళ్ల నొప్పులు మొదలౌతాయి. వెన్ను భాగంలో మొద్దుబారినట్లు, బలహీన పడి నట్లు, చురకలు, పోట్లు, మంటలు మొదలౌతాయి. జీర్ణవ్యవస్థలో సమస్యలు తలెత్తుతాయి. అలాగే కొనసాగితే కొన్ని లైంగిక సమస్యలు సైతం తలెత్తవచ్చు. ఎవరికైనా వెన్నుపాములోని డిస్క్‌లు, నరాలు ఒత్తిడికి గురైతే.. కాళ్లు, చేతులు పక్షవాతానికి కూడా తలెత్తవచ్చు. సర్జరీతో ఒరిగేది శూన్యం... వెన్నునొప్పితో వెళితే వైద్యులు మొట్ట మొదటగా సూచించేది పెయిన్ కిల్లర్లే. అవి వాడితే నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది గానీ, అందుకు గల కారణాలను మాత్రం తగ్గించలేదు. పెయిన్ కిల్లర్స్ అతిగా వాడటం వల్ల తలనొప్పి, కడుపుబ్బరం, లివర్, కిడ్నీలు దెబ్బతినడం వంటివి తలెత్తుతాయి. సర్జరీ చేయించుకొంటే.. పెద్ద మొత్తంలో ఖర్చు అవడమే తప్ప కలిగే ప్రయోజనం మాత్రం శూన్యం. కనీసం ఆ ఒక్క సర్జరీతో అంతా అయిపోతుందా అంటే.. చెప్పలేం. ఆ తరువాత మరో సర్జరీ అవసరం కూడా రావచ్చు. కేరళ పంచకర్మతో... అస్థిధాతుక్షయం, మార్గావరోధాల వల్లే శరీరంలో వాతం పెరుగుతుంది. ఆ వాతమే వెన్ను నొప్పికి, కాలంతా పాకే సయాటికా నొప్పికి మూలం అవుతుంది. అందుకే ధాతుక్షయాన్ని, మార్గావరో ధాన్ని నివారించే చికిత్సలకు ఆయుర్వేదం అత్యంత ప్రాధాన్యం ఇస్తుంది. చికిత్స క్రమంలో కీళ్లు, లిగమెంట్లు, టెండాన్లు, డిస్కులు, వెన్నెముకతో అనుబంధంగా ఉండే కండరా లను సమస్థితికి తీసుకురావడం చాలా ముఖ్యం. అదే సమయంలో నరాల వ్యవ స్థను కూడా బ్యాలెన్స్ చేయాల్సి వస్తుంది. ఇవన్నీ నొప్పిని తగ్గించడమే కాదు.. మరో సారి ఆ నొప్పి రాకుండా చేస్తాయి. ఈ విధానంలో మర్మ, పంచకర్మ చికిత్సల ద్వారా వెన్నునొప్పికి మూలకారణాన్ని కనుగొని ఆ నొప్పిని సమూలంగా తగ్గించి వేస్తుంది. కేరళ ఆయుర్వేద పంచకర్మ చికిత్సల ద్వారా మీ వెన్నెముకను కాపాడుకోండి. దూర ప్రాంతాల నుంచి వచ్చే పేషెంట్లకు ఇన్‌పేషంట్ సౌకర్యం కలదు. అడ్రస్ శ్రీచరక కేరళ ఆయుర్వేదిక్ హాస్పిటల్ బిసైడ్ ఎస్.బి.హెచ్, నియర్ జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్, రోడ్ నం.17, హైదరాబాద్, వివరాలకు: డా॥పి.కృష్ణ ప్రసాద్. 9030013688/ 9440213688/ 040- 65986352 E mail:krishnaprasad.gmail.com -
డాగ్స్ spot
ఆదివారం వస్తోందంటే వాటికి పండుగే. ఎంచక్కా టామీతో కులాసాగా షికార్లు కొట్టొచ్చని పప్పీ... జూలీతో జాలీగా ఎంజాయ్ చేయొచ్చని జాకీ.. తెగ ఆరాటపడుతుంటాయి. మనం ఆదివారం కోసం ఎదురు చూడటంలో అర్థం ఉంది. మరి స్కూలు, ఆఫీసు ఎరుగని శునకాలు కూడా ఆ రోజు కోసం ఎందుకంత ఆరాటంగా ఎదురుచూస్తున్నాయంటే మాత్రం.. దానికో కారణం ఉంది. ఎవ్రీ సండే వాటి యజమానులతో కలసి.. అందంగా ముస్తాబై నెక్లెస్‌రోడ్‌లోని జలవిహార్‌కు ఎదురుగా ఉన్న చిన్నపార్క్కు వచ్చేస్తాయి. ఇవే కాదు నగరం నలుమూలల నుంచి ఎన్నో శునకాలు ఈ ‘డాగ్స్ స్పాట్’కు చేరుకుంటాయి. ఉదయం ఆరు నుంచి తొమ్మిది గంటల వరకు తోటి కుక్కలతో ఆటలాడుకుంటాయి... సరదాగా పోట్లాడుకుంటాయి. ఒక్క మాటలో చెప్పాలంటే మస్తీ మజా చేసేస్తాయి. ..:: వాంకె శ్రీనివాస్ గాంధీనగర్‌కు చెందిన సన్నీ ఓ రోజు తన డ్యూక్ (కుక్క)ను పట్టుకుని నెక్లెస్‌రోడ్ మీదుగా వెళ్తున్నాడు. అదే టైంలో ఓ పెద్దాయన రాందాస్‌తో సన్నీకి పరిచయమైంది. వీరిద్దరూ ఇక్కడ ముచ్చట ్లలో ఉండగానే.. రాందాస్ చేతిలో ఉన్న మరో కుక్క (బాండ్), డ్యూక్‌తో సరదాగా ఆటలాడుకుంది. ఈ సీన్ ఇద్దరిలో కొత్త ఆలోచనకు నాంది పలికింది.ప్రతి ఆదివారం నెక్లెస్‌రోడ్‌కు కుక్కలను జాగింగ్‌కు తీసుకురావాలని అందులో కోరారు. మీ పెట్స్‌కు ఇంతకన్నా మంచి వీకెండ్ గిఫ్ట్ మరొకటి మీరివ్వలేరని ప్రచారం చేశారు. ప్రతివారం కుక్కలు కలుస్తుండటం వల్ల వాటి ప్రవర్తనలో మార్పు కూడా వస్తుందని అప్పీల్ చేశారు. పోటీగా ఆటలు.. సన్నీ అండ్ రాందాస్ ఆలోచన సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. మొదట రెండు కుక్కలతో మొదలైన సండే సందడి.. ఇప్పుడు 70 శునకాలకు చేరుకుంది. సిటీ శివారు ప్రాంతాల నుంచి కూడా పెట్ లవర్స్ తమ శునకాలను తీసుకుని నెక్లెస్ రోడ్‌కు చేరుకుంటున్నారు. దీంతో ప్రతి ఆదివారం లాబ్రీడర్, జర్మన్ షెఫర్డ్, బిగిల్, పగ్, రాడ్విల్లర్.. ఇలా వివిధ జాతుల కుక్కలు నెక్లెస్ రోడ్లో ఆడిపాడేసుకుంటున్నాయి. తోటి శునకాలతో కలసి పోటీ పడిమరీ పరిగెత్తుతున్నాయి. మూడు గంటల పాటు ఫుల్‌గా ఎంజాయ్ చేస్తున్నాయి. ఫ్యామిలీ అనుబంధం... ఇక్కడికి వచ్చిన శునకాలే కాదు.. వాటిని తమ వెంట తీసుకుని వచ్చిన యజమానులకూ కొత్త పరిచయాలు సరికొత్త ఆనందాన్ని పంచుతున్నాయి. మొదటి వారం ముఖ పరిచయంతో వెనుదిరుగుతున్న పెట్ లవర్స్.. రెండు, మూడు వారాలు అయిపోయే సరికి మంచి మిత్రులుగా మారుతున్నారు. ఒకరి ఇంటికి మరొకరు వెళ్లి పలకరించుకునే స్థాయికి చేరుకుంటోంది వీరి స్నేహం. అంతేకాదు, అలా వాళ్ల ఇంటికి వెళ్లేటప్పుడు తమ కుక్కను కూడా వెంటబెట్టుకుని మరీ వెళ్తున్నారు. ఇక ఎవ్రీ సండే కుక్కలు చేసే విన్యాసాలతో రిలీఫ్ అవుతున్నారు వాటి ఓనర్లు. ‘కుక్కలు లేనివారు కూడా ఎందరో ఇక్కడికి వస్తున్నారు. ఇక్కడ అవి చేస్తున్న ఫీట్లు చూసి.. వారూ కుక్కలను పెంచుకునేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. మరికొందరు మేలుజాతి కుక్కల సమాచారం తెలుసుకుంటున్నార’ని చెబుతున్నారు సన్నీ. మొత్తానికి సిటీలో కొత్తగా మొదలైన డాగ్ స్పాట్ శునకాలకే కాదు, వాటి యజమానులకు కూడా సరికొత్త జాలీ స్పాట్‌గా మారిపోయింది. -
అదరగొట్టారు
స్కూలు ఫంక్షన్స్‌లో పిల్లలు ప్రదర్శనలు ఇవ్వటం మాములే. అలా ఓ స్కూల్లో వేసిన నాటకంలో వాళ్ల ఇన్వాల్వ్మెంట్, టాలెంట్ చూసి ముచ్చట పడిన యాజమాన్యం.. మరోసారి పెద్దల కోసమంటూ లామకాన్‌లో వీళ్లతో ఓ నాటక ప్రదర్శన ఏర్పాటు చేసింది. 20 మందికి పైగా పిల్లలు ఎలాంటి తడబాటు లేకుండా డైలాగులు, చక్కటి హావభావాలతో మురిపించారు. కామెడీ, సెటైర్, చక్కటి భాష కలిసిన ‘యాజ్ యూ లైక్ ఇట్’ నాటకం ఆహూతులను ఆకట్టుకుంది. షేక్స్పియర్ రాసిన నాటకాలు అర్థం చేసుకోవటమే కష్టం. అలాంటిది ఆ నాటకాన్ని అలవోకగా ప్రదర్శించడం మహామహా నటులకే సాధ్యమయ్యే పని. అంతటి క్లిష్టమైన నాటకాన్ని సులభంగా అర్థం చేసుకోవడమే కాదు... అనుభవమున్న నటుల్లా ఆయా పాత్రల్లో జీవించారు చిన్నారులు. నగరంలోని శ్లోక పాఠశాలలో 5 నుంచి 9వ తరగతి చదువుతున్న విద్యార్థులు షేక్స్పియర్ ‘యాజ్ యూ లైక్ ఇట్’ నాటకాన్ని నవరస రంజితంగా ప్రదర్శించి శభాష్ అనిపించుకున్నారు. ఒరిజినల్లో వున్న క్యారెక్టర్లు, కథనం అలాగే ఉన్నాయి. సంభాషణలు మోడరన్ డేస్‌కి అనువుగా మార్చి, కాంటెపరరీగా మలిచిన ఈ నాటకం అబ్బురపరిచింది. ఊహించని మలుపులు.. షేక్స్పియర్ నాటకం విషయానికి వస్తే.. ‘ఫ్రెడరిక్ తన అన్న డ్యూక్ ఆస్తిని ఆక్రమించుకుని అతన్ని తరిమేస్తాడు. కానీ అతని కూతురు రోజాలిండ్ని మాత్రం తన కూతురు సిలియా కోసం తన దగ్గరే ఉంచుకుంటాడు. ఈ ఇద్దరు మంచి ఫ్రెండ్స్. చూసీ చూడగానే రోజాలిండ్ ప్రేమలో పడతాడు పరదేశ యువరాజు ఆర్నాల్డో. అతని అన్న ఆలివర్. రోజాలిండ్ ప్రేమ విషయం తెలిసి ఫ్రెడరిక్ కోపగించుకొని దండించబోతాడు. తట్టుకోలేక రోజాలిండ్ అబ్బాయిగా, సిలియా ఎలీనాగా వేషం వేసుకుని ఇంటి నుంచి పారిపోతారు. మారువేషాల్లో వున్న ఎలీనాతో అలివర్ ప్రేమలో పడతాడు. మగవేషంలో ఉన్న రోజాలిండ్ ఆర్నాల్డోని కలుస్తుంది. ప్రేమకోసం తపిస్తూ అతను రాస్తున్న కవితలు చదివి, ఆ ప్రేమను మరిచిపొమ్మని చెబుతుంది. మరోవైపు రోజాలిండ్ని అబ్బాయి అనుకుని ఫేబ్ అనే అమ్మాయి ఆమెను ప్రేమిస్తుంది. ఇలా ఒక ప్రేమ జంటతో మొదలైన కథలోకి నాలుగు జంటలు వస్తాయి. చివరికి సుఖాంతమవుతుంది. అయితే మధ్యలో వచ్చే అనేక పాత్రలు, ఊహించని మలుపులు ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తాయి. ప్రపంచం నేటికి చెప్పుకునే ‘జీవితం ఒక రంగస్థలం లాంటిది, అందులో మనమందరం పాత్రధారులం’ డైలాగ్స్ ఈ నాటకంలోనివే. -
సమజ్దార్ లోగ్
ఎడతెరిపి లేని పని భారంతో అలసిన మనసులను నవ్వుల జల్లులతో కాసింత ఉల్లాస పరిచే కామెడీ ప్లే ఇది. దర్పణ్ థియేటర్ గ్రూప్ ఈ నాటకాన్ని ప్రదర్శిస్తోంది. ముగ్గురు మతి స్థిమితం లేని వారి చుట్టూ కథ తిరుగుతుంది. ముగ్గురూ కలసి తమ లైఫ్‌ను ఆశ్రమంలో ఆస్వాదిస్తుంటారు. ఓ రోజు ఉన్నట్టుండి వీరి మధ్యలోకి ఓ వ్యక్తి వస్తాడు. తాను పిచ్చివాడిని కాదని, బాగా చదువుకున్నానని చెప్పుకుంటాడు. అసలు ఇంతకీ అతను ఎందుకు అక్కడికి వచ్చాడని తెలుసుకోవడానికి ఎంతో ఆసక్తి చూపిస్తారు ఆ ముగ్గురూ. వారి మధ్య సాగే సంభాషణ గిలిగింతలు పెడుతుంది. బంజారాహిల్స్ లామకాన్‌లో ఈ నెల 10, 11 తేదీల్లో రాత్రి 7.30 గంటలకు ప్లే షురూ అవుతుంది. వివరాలకు: 9703169709 -
ది ఎకనామిక్స్ ఆఫ్ హ్యాపీనెస్
ధరిత్రీ దినోత్సవం సందర్భంగా ప్రదర్శిస్తున్న ఈ చిత్రం... ప్రపంచంలోని ఆరు భిన్న ప్రాంతాల్లో సంభవించిన ఆర్థిక వ్యవస్థ మార్పులపై చర్చిస్తుంది. వేదిక: లామకాన్, బంజారాహిల్స్ సమయం: ఈ నెల 22 రాత్రి 7 గంటలకు -
ఫెస్ట్... జబర్దస్త్!
ఫ్యాషన్వాక్, సోలో డ్యాన్స్, మేనేజ్మెంట్ స్కిట్స్.... డిఫరె ంట్ కాన్సెప్ట్స్ తో ఆంగ్లోఫైల్ బిజినెస్ స్కూల్ యాన్యువల్ ఫెస్ట్-2015 జోష్ ఫుల్‌గా సాగింది. మూడు థీమ్స్‌తో సాగిన మూడు రౌండ్ల ఫ్యాషన్ షో విద్యార్థుల సృజనాత్మకతను కళ్లకు కట్టింది. విద్యార్థులు రౌండ్లో జంటగా, రెండో రౌండ్లో వెస్ట్రన్ అండ్ ఫ్లోరల్ వేర్లో, మూడో రౌండ్లో ఎథ్నిక్ అండ్ డిజైనర్ వేర్లో ర్యాంప్‌పై ప్రొఫెషనల్ మోడల్స్‌కు దీటుగా హొయలు పోయారు. గెస్ ది బ్రాండ్, అడ్వర్టైజింగ్స్ అండ్ నాస్టాల్జియా వంటి మేనేజ్మెంట్ గేమ్స్ స్టూడెంట్స్ మెదడుకు పదును పెట్టాయి. సురానా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ వినితా సురానా ప్రసంగం విద్యార్థుల్లో స్ఫూర్తి నింపింది. -
గ్రహపాటు!
సామాజిక సైట్లో తన గారాల కుక్కగారి వీడియో ఒకటి పోస్ట్ చేయబోయి... పెద్ద చిక్కే కొని తెచ్చుకుంది సెక్సీ సింగర్ కాటి పెర్రీ. క్రిస్ జెన్నర్ పిక్సీ హెయిర్ స్టైల్లా తన అందమైన లూజ్ హెయిర్‌ను కట్ చేసుకుని షాకిచ్చిన క్యూటీ... మరోసారి ఫ్యాన్స్‌ను షేక్ చేసింది. సోషల్ సైట్ ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌ల్లో పెట్ డాగ్ బటర్స్ చిలిపి చేష్టల వీడియోను మురిపెంగా అప్లోడ్ చేసిన అమ్మడికి కాసేపట్లోనే షాక్ మీద షాక్‌లు తగిలాయి. సదరు కుక్కగారి మెళ్లో వేలాడ దీసిన ట్యాగ్‌పై పెర్రీ ఫోన్ నంబర్ కూడా ఉందట!!! దీన్ని పసిగట్టిన ఫ్యాన్స్... కాల్స్ మీద కాల్స్ చేసేశారట. దెబ్బకు కంగుతిన్న స్వీటీ... కాసేపటికి తేరుకుని, జరిగింది అర్థం చేసుకుందట. పొరపాటు గ్రహపాటుగా మారిన ఈ ఎపిసోడ్లో మిలియన్ల కాల్స్ చిన్నదాని ఫోన్‌కు చేరాయట. ఈ బాధ తట్టుకోలేక వెంటనే ఆ వీడియో తొలగించేసి... ఫోన్ నంబర్‌ను బ్లాక్ చేస్తే గానీ విశ్రాంతి దొరకలేదనేది ఓ యూఎస్ మ్యాగజైన్ కథనం!!! -
లెక్క తక్కువైనా...!
సూపర్ డెరైక్టర్ మహేష్‌భట్ గారాల కూతురుగా బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చినా... ఆ తరువాత స్పెషల్ ఇమేజ్‌తో కుర్రకారుకు దగ్గరైపోయింది బొద్దుగుమ్మ అలియాభట్. గత ఏడాది వరుస సినిమాలతో అభిమానుల మనసు కొల్లగొట్టిన ఈ సొగసిరి లెక్క తక్కువైనా పర్లేదు గానీ... ఎక్కువ కాకుండా ఉంటే చాలంటోంది. ఆఫర్లు వస్తున్నాయి కదా అని చేసుకుంటూ పోతే... చివరకు ఫ్యాన్స్ విసుగెత్తిపోతారంది. ఏదైనా ఓ లిమిట్లో ఉంటే బాగుంటుందంటోంది. తన సినిమాల రిలీజ్లో కాస్త గ్యాప్ ఇవ్వాలని అభిప్రాయపడుతోంది. ఇక తన తండ్రి మహేష్‌భట్ ప్రొడక్షన్స్‌లో పనిచేసే ప్లాన్స్ ప్రస్తుతానికైతే ఏమీ లేవంది అలియా. ఇటీవల జరిగిన ఫిలింఫేర్ అవార్డుల ఫంక్షన్లో ‘బెస్ట్ ఫిమేల్ యాక్టర్’ (క్రిటిక్స్) గెలుచుకున్న ఈ చబ్బీ చీక్స్ సుందరి మెస్మరైజింగ్ లుక్సే కాదు... ఎనర్జటిక్ యాక్టింగ్‌తో క్రేజీ తారగా మారిపోయింది. -
వుడ్ కట్ ఆర్ట్ ఎగ్జిబిషన్
అమీర్‌పేటలోని ‘ధీ ఆర్ట్ స్పేస్ గ్యాలరీ’లో గురువారం ప్రారంభమైన వుడ్ కట్ ఆర్ట్ ఎగ్జిబిషన్ కళాభిమానుల మనసు దోచుకుంటోంది. 13 మంది ప్రముఖ ఆర్టిస్టులు రూపొందించిన అద్భుత చిత్రాలు ఇక్కడ కొలువుదీరాయి. తెలంగాణ వనితను కాన్వాస్‌పై కళాత్మకంగా ఆవిష్కరించారు ప్రముఖ చిత్రకారుడు తోట వైకుంఠం. వ్యవసాయం వదిలిపెట్టి రైతులు పరిశ్రమల్లో పనిచేసేందుకు ఎలా వస్తున్నారనే థీమ్‌తో యంగ్ ఆర్టిస్టు పీసీ శేఖర్ చిత్రాలు భారత గ్రామీణ వాతావరణాన్ని కళ్లకు కట్టాయి. నెమలిని గాంధీజీ అప్యాయతతో దగ్గరకు తీసుకుంటున్నట్టుగా చెక్కపై జగదీశ్ తమ్మినేని చెక్కిన చిత్రం... గాంధీకి పక్షులంటే ఎంత ప్రేమో చెప్పకనే చెబుతోంది. చెరువులు, వాగులు, కుంటల్లో కనిపించే చేపల చిత్రాలను వుడ్‌కట్ ఆర్ట్‌లో అద్భుతంగా మలిచారు మరో ఆర్టిస్టు శ్రీకాంత్ గురు. బరోడాలో సెటిల్ అయిన సిటీ అమ్మాయి గాయత్రి మాట్లాడుతూ... డైలీ లైఫ్‌లో ఎదురయ్యే డిఫరెంట్ సమస్యలకు చిత్రరూపమిచ్చే ప్రయత్నం చేశానన్నారు. ‘ఐ యామ్ లిజనింగ్... చెట్టు ముందు కూర్చొని నేను వింటున్నాను అనే థీమ్‌తో ప్రతాప్ మోడీ వుడ్కట్స్ ప్రత్యేకతను చాటుకుంది. హైదరాబాద్‌కు చెందిన ఆర్టిస్టు పద్మారెడ్డి మాట్లాడుతూ... భారత సంస్కృతి, సంప్రదాయాల్లో ప్రధానమైన వివాహ వేడుకలనే సబ్జెక్ట్‌గా ఎంచుకొని ‘ది వెడ్డింగ్ గౌన్’కు చిత్ర రూపమిచ్చానని చెప్పారు. డెకరేటివ్ మోటార్స్ యూజ్ చేసుకుంటూ బ్యూటిఫుల్‌గా పిక్చర్ చేశానంటున్నారు. వచ్చే నెల 16 వరకు ఈ అపురూప చిత్ర ప్రదర్శన అందుబాటులో ఉంటుంది. సాక్షి, సిటీ ప్లస్ -
మాస్టర్ చెఫ్
భక్తి అరోరా.. ఈ సీజన్ మాస్టర్ చెఫ్ ఇండియాకు ఎంపికైన ఏకైక హైదరాబాదీ. ఆ కార్యక్రమంలో ఏడుగురు పార్టిసిపెంట్స్‌లో ఈమె ఒకరు. అందరూ ‘ఝాన్సీ కి రాణి’, ‘భక్తి కి శక్తి’ అని పిల్చుకునే ఈ అమ్మాయి ఫ్లేవర్-ఇ-ఆజమ్ రుచులతో ఇప్పటికే జడ్జెస్ మనసు గెలుచుకుంది. హైదరాబాద్ ఆడిషన్స్‌లో మిస్సయినా... బై నుంచి ప్రయత్నించి, ఎంపికై తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. ..:: కట్ట కవిత షోలో పాల్గొన్నవాళ్లందరూ పాకశాస్త్రంలో ప్రవీణులే. అయితే కాంపిటీషన్ వేరు కదా! ఇచ్చిన టైమ్‌లోనే వంటల్ని ది బెస్ట్‌గా చేసి చూపాలి. ఆ టైమ్‌ను ఎలా మేనేజ్ చేస్తున్నామన్నదే ప్రధానం. ఇంట్లో తాపీగా వండటం తప్ప... ఇలా షోస్‌కి వెళ్లింది లేదు కాబట్టి మొదట్లో కాస్త ఇబ్బంది పడ్డాను. ఎందుకంటే చుట్టూ కెమెరాలు, మనం చేస్తున్న దాన్ని ఎంతో మంది చూస్తున్నారన్న స్పృహ వెరసి కొంత కంగారు. కానీ తరువాత సెట్ అయ్యాను. కలినరీ స్టూడియో... కుకింగ్ మీద ప్యాషన్‌తో ఉద్యోగాన్ని సైతం వదిలేసి ముంబైలో ‘బెల్ పెప్పర్’ రెస్టారెంట్ ప్రారంభించాను. కేవలం పార్టీ ఆర్డర్స్ మాత్రమే తీసుకునేవాళ్లం. భవిష్యత్‌లో హైదరాబాద్‌లో ఓ కేఫ్, కలినరీ స్టూడియో ఏర్పాటు చేయాలని ప్లాన్ చేస్తున్నా. అమ్మ పోరు పడలేక.. ఎనిమిదేళ్లప్పటి నుంచే వంట నేర్చుకున్నాను. మా అమ్మ వంట నేర్చుకోమని ఎప్పుడూ నా వెంటపడేది. ‘భవిష్యత్‌లో ఎవరి మీదా ఆధారపడకూడదంటే నువు కచ్చితంగా వంట నేర్చుకోవాలి’ అనేది. అయితే నేను అమ్మాయిని కాబట్టి అలా అనేది అనుకోకండి. ఎందుకంటే మా బ్రదర్‌ను కూడా వంట నేర్చుకోమని పట్టుబట్టేది. అప్పుడు అలా అమ్మ పోరాడి నేర్పిన వంటి ఇప్పుడు ఇలాపనికొస్తోంది. ఆయన ప్రోత్సాహం... మాది ముంబై. పెళ్లి తరువాత హైదరాబాద్‌కు షిఫ్టయ్యాం. నా హజ్బెండ్ సురేందర్ మానేకర్ ఆడిషన్స్‌కు వెళ్లాలని నన్ను ప్రోత్సహించారు. నేను కచ్చితంగా ఎంపికవుతానని తన నమ్మకం. తను డయాబెటిక్. దాంతో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉన్న రైస్, పొటాటోస్ ఎక్కువగా తీసుకోకూడదు కదా! అయితే... వాటిని రిప్లేస్ చేస్తూ కొత్త ప్రయోగాలతో వంటలు చేయడం ప్రారంభించాను. నేను వంటల్లో ఆరితేరడానికి అదీ ఒక కారణం. -
సిటీ రాకెట్
అందరిలా కాదు శివాని. ఏడేళ్ల వయసులోనే లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. రాకెట్ పట్టి... కోర్టులోకి దిగి ప్రత్యర్థులను మట్టి కరిపిస్తోంది. అమ్మానాన్నల ప్రోత్సాహం... కోచ్ సహకారం... వెరసి అద్వితీయ ప్రదర్శనతో అంతర్జాతీయ వేదికలపై నగర కీర్తిని ఘనంగా చాటుతోంది. ఆమె ఆటకు ముచ్చటపడ్డ ఎంపవర్ స్పోర్ట్స్ స్పాన్సర్షిప్ అందిస్తోంది. బ్యాంకాక్‌లో జరిగిన ఆసియా ఓషియానియా టోర్నీలో మంచి ప్రతిభ కనబరిచి సిటీకి తిరిగి వచ్చిన ఈ ‘జూనియర్ రాకెట్’ను ‘సిటీ ప్లస్’ పలుకరించింది. మేం సిటీకి వచ్చి సెటిలయ్యే నాటికి నా వయసు ఆరేళ్లు. నాన్న శ్రీనివాస్ పోలీస్ ఉద్యోగి కావడంతో మెదక్ జిల్లా సిద్ధిపేట నుంచి ఇక్కడికి బదిలీపై వచ్చాం. అమ్మ సత్యవతి గృహిణి. సిటీకి వచ్చిన తరువాత నా ధ్యాసంతా టెన్నిస్పైకి మళ్లింది. అమ్మానాన్నల ప్రోత్సాహంతో ఏడేళ్లప్పుడు బేగంపేట్ ఏస్ టెన్నిస్ అకాడమీలో తొలిసారి రాకెట్ పట్టా. కోచ్ ప్రవీణ్ భార్గవ్ శిక్షణలో ప్రావీణ్యం సంపాదించా. ఐటీఎఫ్ జూనియర్ టోర్నీలు ఆడటం మొదలుపెట్టా. నా ప్రతిభను గుర్తించిన ఎంపవర్ స్పోర్ట్స్ చేయూతనిచ్చింది. విదేశాల్లో ఆడే టోర్నీలకు దొడ్లా డెయిరీ ప్రయాణపు ఖర్చులు, ట్రైనింగ్‌కు నిధులు సమకూరుస్తోంది. సక్సెస్ మంత్ర... క్రీడల్లో రాణించాలంటే ఫిట్నెస్ ప్రధానం. ఎలాంటి వాతావరణాన్నయినా తట్టుకునే సామర్థ్యం ఉండాలి. అందుకు తగ్గట్టే శారీరక వ్యాయామంతో పాటు న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోవల్సి ఉంటుంది. డ్రైఫ్రూట్స్, ఎనర్జిటిక్ డ్రింక్స్‌కు ప్రాధాన్యమిస్తా. రోజూ ఉదయం మూడు గంటలు, సాయంత్రం మూడు గంటలు ప్రాక్టీసు చేస్తాను. ఉదయం వేళలో ఒక గంట ఫిట్నెస్, రెండు గంటలు టెన్నిస్ ప్రాక్టీసు, మళ్లీ సాయంత్రం వేళలో గంట ఫిట్నెస్, రెండు గంటలు టెన్నిస్ ప్రాక్టీస్. టోర్నీ సమయాల్లో ప్రత్యర్థుల బలబలాలు, ఆటతీరు ఆధారంగా నా శైలిని మార్చుకుంటాను. సిటీలో విక్టరీ... తొలినాళ్లలో సిటీలో జరిగిన వివిధ టోర్నీల్లో పాల్గొన్నా. ఎన్నో సవాళ్లు. అన్నింటినీ అధిగమించి విజయాలు సాధించా. ఐటీఎఫ్ జూనియర్ టోర్నీలో పాల్గొనే అర్హత సాధించా. 2014 ఏప్రిల్ 21న హైదరాబాద్‌లో జరిగిన అండర్ 14 సూపర్ సిరీస్ సింగిల్స్, డబుల్స్ విజేతనయ్యా. సిటీతో పాటు వివిధ నగరాల్లో జరిగిన టోర్నీల్లో సత్తాచాటా. అహ్మదాబాద్‌లో అండర్-14 నేషనల్స్ టోర్నీ రన్నర్‌గా నిలవడం లైఫ్‌లో మర్చిపోలేనిది. గతేడాది అండర్ -18 టాటా సిరీస్ నెగ్గా. ఇదేకాదు వివిధ నగరాల్లో జరిగిన టోర్నీల్లోనూ మంచి ప్రతిభ కనబరిచా. దీంతో అండర్ -14 ఇండియా టీమ్‌లో ఆడే అవకాశం దక్కింది. నాతో పాటు చండీఘర్ నుంచి ప్రింకుల్ సింగ్, మహారాష్ట్ర నుంచి మెహత్ జైన్‌కు అవకాశమొచ్చింది. బ్యాంకాక్‌లో జరిగిన ఆసియా ఓషియానియా టోర్నమెంట్లో భారత్ తరఫునా ఆడాం. సింగిల్స్‌లో సెమీఫైనల్ వరకు వెళ్లా. తద్వారా ఆసియా జూనియర్ ర్యాంకింగ్స్‌లో నాలుగో స్థానానికి చేరా. గతంలో దిల్లీలో జరిగిన రోడ్ టూ వింబుల్డన్‌లో ఎంపికైన 16 మందిలో నేను ఒకదాన్ని. త్వరలోనే మళ్లీ దిల్లీలో జరిగే ఇదే టోర్నీలో సత్తా చాటితే వింబుల్డన్ గ్రాండ్‌శ్లామ్ జూనియర్ విభాగంలో ఆడే అవకాశం వస్తుంది. దీన్ని అందుకునేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నా. ఐ లైక్ చార్మినార్... టైమ్ దొరికితే పుస్తకాలు చదువుతా. టీవీలో స్పోర్ట్స్ ఎక్కువగా చూస్తుంటా. ఫెదరర్, కిమ్ క్లియ్‌స్టర్స్ నాకు ఇష్టమైన క్రీడాకారులు. బంజారాహిల్స్ మెరిడియన్ స్కూల్లో ఎనిమిదో తరగతి చదువుతున్నా. చార్మినార్ నచ్చిన స్పాట్. వీఎస్ -
ఆర్టిస్టిక్
బంజారాహిల్స్ గ్యాలరీ స్పేస్‌లో పలువురు చిత్రకారులు రూపొందించిన చిత్రాల ప్రదర్శన ఆకట్టుకుంటోంది. శనివారం ప్రారంభమైన ఈ ప్రదర్శనలో నగరానికి చెందిన ప్రసిద్ధ ల్యాండ్‌స్కేప్ ఆర్టిస్ట్ బి.భాస్కరరావు, ఇరాన్ ఆర్టిస్ట్‌లు బహార్ హంజెహ్పౌర్, అమీర్ హంజెహ్పౌర్, ముంబైకి చెందిన చిత్రకారిణులు ర ష్మీ త్యాగి, అంబరీన్ ధరమ్సేలతో పాటు బ్రహ్మా ప్రొద్దొకు, దీక్షారాయ్, కె.వి.ఎస్.ప్రసాద్, రుక్సానా హుడా, కె.రవి, సంజయ్ శంకర్ అకోలికర్ల ఆర్ట్‌వర్క్స్ కొలువుదీరాయి. ఏప్రిల్ 15 వరకు రోజూ ఉదయం 11 గంటల నుంచి రాత్రి 7 గంటల దాకా ప్రదర్శన అందుబాటులో ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. సాక్షి, సిటీప్లస్ -
కల్యాణం.. కమనీయం
జానకిరాముల విశేషాలు, పెళ్లి మంత్రాలకు అర్థాలు పిల్లలకు వివరించారు ఉమ. శ్రీరామ నవమి ప్రత్యేకతను చిన్నారులు ఎంతో ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు. ఈతరం పిల్లలకు రాముడు, ఆయన గాథ తెలియదని, అవన్నీ ఇలా వారి చేతే చేయించి చూపడం వల్ల ప్రతిదీ అర్థం చేసుకోగలుగుతారని అన్నారు పేరెంట్ కె.రాంబాబు. ‘రాముడికి బట్టలు పెట్టాం. బాసికం కట్టాం. తెర పట్టుకుని మంత్రాలు చదివాం. తలంబ్రాలు పోశాం. పూల బంతులు ఆడాం. దేవుడి పెళ్లి మేమే చేశాం. పెళ్లయ్యాక ఉంగరాల ఆట కూడా ఆడాం. ఈ కల్యాణం మాకెంతో నచ్చింది’ అంటూ మురిసిపోతూ చెప్పారు చిన్నారులు ఆశ్రీత మణికంఠ, వంశిక, అంశృత. అలాగే... బుడతలు అయోధ్యాధిపతికి కట్నకానుకలు చెల్లించే ఘట్టాన్నీ... తమ ముద్దు ముద్దు మాటలతో మహా రక్తి కట్టించారు. ‘విగ్రహాల ఆవాహన నుంచి వివాహ మహోత్సవంలోని ప్రతి ఘట్టాన్నీ సంప్రదాయబద్దంగా పిల్లలతో చేయించాం. కంకణ ధారణ, రాముడికి స్నాతకోత్సవం, యజ్ఞోపవీత ధారణం... ఇలా ప్రతి ఘట్టాన్నీ నిర్వహిస్తూ, వాటి కారణాలను వివరించాం. పిల్లలే పేరంటాళ్లను పిలిచి ఈ తంతు చేశారు. రామాయణ శ్లోకాలు వినిపించి, వారి చేత ఉచ్ఛరిస్తూ, వాటి అర్థాలను చెప్పడం వల్ల చిన్నారులు ఇంత పెద్ద కార్యాన్ని ఎంతో ఆసక్తిగా, ఓపిగ్గా పూర్తిచేశారు’ అన్నారు ఉమా చల్లా. ఓ మధు -
సైకిల్ సవారీ
హైదరాబాద్ బైసైక్లింగ్ క్లబ్ శనివారం నిర్వహించిన ‘ఎకో ఫ్రెండ్లీ సైకిల్ రైడ్’ ఉత్సాహంగా సాగింది. ఎర్త్ అవర్ డే సందర్భంగా గచ్చిబౌలి బైసైక్లింగ్ క్లబ్ వద్ద ప్రారంభమైన ఈ రైడ్ గూగుల్, కొత్తగూడ, గచ్చిబౌలి జంక్షన్ల మీదుగా సాగింది. కాలుష్య నివారణ, శారీరక దారుఢ్యం కోసం సైక్లింగ్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని, అందరూ సైకిళ్లను వాడాల్సిన అవసరం ఉందని మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి చెప్పారు. నగరంలో మరిన్ని సైక్లింగ్ క్లబ్‌లు రావాలని ఆకాంక్షించింది బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు. ఐటీ ఉద్యోగులు, చిన్నారులు అధిక సంఖ్యలో పాల్గొని సైకిల్‌పై స్వారీ చేశారు. గచ్చిబౌలి -
లిప్ లాక్!
నాలుగేళ్లు కలిసుండి... ఆ తరువాత ఒకరినొకిరు తిట్టుకుని... విడిపోయిన సూపర్ సింగర్ జెనిఫర్ లోపెజ్, నటుడు కాస్పర్ స్మార్ట్ మళ్లీ ఒక్కటయ్యారా! వీళ్ల వాలకం చూస్తుంటే కాదనలేకపోతున్నారు హాలీవుడ్ జనం. రీసెంట్గా ‘అమెరికన్ ఐడల్’ పధ్నాలుగో సీజన్ షూటింగ్ గ్యాప్‌లో ఈ ఇద్దరూ లిప్ లాక్ వేసుకుని మైమరిచిపోయారట! రోజంతా ఒకరినొదిలి ఒకరు ఉండలేనంతగా ఎంతో ఆప్యాయంగా మాట్లాడుకుంటూ కనిపించారట. ఎంతో కాలం రొమాన్స్ చేసిన ఈ తారలు గత ఏడాది జులైలో విడిపోయారు. భర్త మార్క్ ఆంథోనీతో ఏడేళ్ల కాపురం చేసి విడిపోయిన జెనిఫర్‌కు కాస్పర్ మరింత దగ్గరయ్యాడు. ఎంతో అన్యోన్యంగా తిరిగారు. అయితే కాస్పర్ ఇద్దరు మోడల్స్‌తో క్లోజ్‌గా ఉన్న పిక్చర్స్ ఓ వెబ్సైట్ రిలీజ్ చేసింది. దీంతో వీరు విడిపోయారు. -
గోంగూర పచ్చడి కంపల్సరీ
సిటీప్లస్ ‘హైదరాబాద్‌లోనే పుట్టాను. ఇక్కడి విద్యారణ్య, స్టాన్లీ గర్ల్స్ హైస్కూల్లో చదువుకున్నాను. ఈ నగరం నాకు చాలా నేర్పింది. చిన్నతనంలోనే పెద్ద ఆలోచనలు చేసేలా నన్ను మార్చింది’ అంటూ సిటీతో తన జ్ఞాపకాన్ని నెమరు వేసుకున్నారు మాజీ బ్యూటీక్వీన్, బాలీవుడ్ నటి దియామీర్జా. ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ట్రైడెంట్ హోటల్లో నిర్వహించిన ఇంటరాక్టివ్ సెషన్లో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. విద్యాబాలన్ హీరోయిన్గా తాను ప్రొడ్యూస్ చేసిన బాబీజాసూస్ సినిమా కోసం చాలా రోజులు ఇక్కడ గడిపానని, మళ్లీ ఇప్పుడే అఫిషియల్‌గా రావడమని చెప్పారు. ‘ఇక్కడకు వ చ్చి.. తిరిగి వెళ్లేటప్పుడు గోంగూర పచ్చడి కంపల్సరీగా ఉండాల్సిందే. అన్నీ కుదిరితే త్వరలోనే తెలుగు సినిమా నిర్మిస్తా’ అని చెప్పారు దియా. మహిళల స్వయం సాధికారత అంటే తనకు చాలా గౌరవమంటున్న దియా.. ఆడ- మగ ఇద్దరూ ఒకరినొకరు సమానంగా గౌరవించుకోవాలన్నారు. తల్లి, చెల్లి, భార్య, స్నేహితురాలు.. ఇలా ఏ పాత్రలోనైనా మహిళ ఎంతో మనస్ఫూర్తిగా ఇమిడిపోతుందన్నారు. వరల్డ్‌కప్‌లో విరాట్‌కొహ్లీ ఫెయిల్యూర్‌కి, తద్వారా ఇండియా సెమీస్‌లో పరాజయం పాలవడానికి అతని గాళ్‌ఫ్రెండ్ అనుష్క కారణమంటూ అందరూ తప్పుపడుతున్న విషయాన్ని ప్రస్తావిస్తూ.. అదెంత మాత్రం సరైంది కాదన్నారు. ఈ సందర్భంగా ఫిక్కీ సభ్యులు అడిగిన పలు ప్రశ్నలకు ఆమె సమాధానమిచ్చారు. దాదాపు 200 మంది మహిళలు హాజరైన ఈ కార్యక్రమాన్ని ఫిక్కీ చైర్పర్సన్ మోనికా అగర్వాల్ పర్యవేక్షించారు. -
మ్యూజిక్ అండ్ డ్యాన్స్ ఫెస్ట్
సురాంజలి ఫౌండేషన్ పండిట్ భీమ్సేన్ జోషి పేరిట జాతీయ స్థాయి సంగీత, నృత్య కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ నెల 27 నుంచి 29 వరకు గోల్కొండ కోట దగ్గర్లోని తారామతి బారాదరిలో ఈ సంగీత నృత్యోత్సవం జరుగనుంది. మూడు రోజులు జరిగే ఈ కార్యక్రమంలో వెంపటి శ్రీమయి నృత్య ప్రదర్శనతో పాటు, పండిట్ ఆనింద చటర్జీ, పండిట్ కుమార్ బోస్- తబలా, షౌనక్, ఆనంద్ భాటే- వోకల్, పండిట్ రాజన్, సాజన్ మిశ్రా శాస్త్రీయ గాత్ర కచేరీ, మహాపాత్రో ఒడిస్సీ నృత్యం, అభిజిత్ బెనర్జీ గ్రూప్ ప్రదర్శనలు జరుగుతాయని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమానికి చెందిన బ్రోచర్‌ను సోమవారం విడుదల చేశారు. ఈ ఈవెంట్ నిర్వహణ ద్వారా వచ్చిన నిధులను ఆటిజం బాధిత చిన్నారులకు అందజేయనున్నట్టు తెలిపారు. మరిన్ని వివరాల కోసం 09989821333 ఫోన్ నంబర్‌ను సంప్రదించవచ్చు. -
అన్నుల మన్నుల
మెరిసేదంతా బంగారం కాదు.. అందరికీ తెలిసిన సామెత. ఫ్యాషన్ ప్రపంచంలో మాత్రం మగువలను మురిపింపజేసేదంతా బంగారమే. పసిడితో ప్రాణం పోసుకుని నిగనిగలాడే నగలకు దీటుగా ధగధగలాడే ఆభరణాలు ఫ్యాషన్ సెక్టర్లో ఎన్నో ఉన్నాయి. వీనులను మెరిపించే దుద్దులైనా.. మెడను హత్తుకునే నెక్లెస్ అయినా.. మట్టితో తయారై మాణిక్యాల్లా మెరుస్తూ.. పుత్తడి ఆభరణాలను మరిపిస్తున్నాయి. అందుకే మనసుకు నచ్చి.. తనువుకు నప్పే నగలైతే చాలు.. దాన్ని దేంతో చేశారన్నది అప్రస్తుతం అంటున్న నారీమణులకు టైట జ్యువెలరీ వరంగా మారింది. మగువలకు జ్యువెలరీ కంటే ఇష్టమైంది మరొకటి ఉండదు. అందుకే స్వర్ణాభరణాలు ఎన్ని ఉన్నా.. మార్కెట్లోకి వచ్చే నయా ట్రెండ్ జ్యువెలరీని పక్కాగా ఫాలో అవుతుంటారు. నల్లపూసల హారం, చంద్రహారం, నెక్లెస్, వంకీలు, జుంకాలు.. బంగారంతో ఒక సెట్ చేయించుకోగలరు. కాస్త సిరిమంతుల ఇంతులైతే.. రెండు డిఫరెంట్ సెట్ల జ్యువెలరీ చేయించుకోగలరు. ఇన్ని ఉన్నా.. ట్రెండ్ మారిన ప్రతిసారీ దానికి తగ్గట్టుగా జ్యువెలరీ చేయించుకోవాలంటే అందరికీ సాధ్యం కాదు కదా..! అందుకే 1 గ్రామ్ గోల్డ్ వైపో.. రోల్డ్‌గోల్డ్ వైపో మొగ్గుచూపుతారు. ఈ కేటగిరీ మహిళలను టార్గెట్ చేసిన జ్యువెలరీ డిజైనర్లు టైట టెంపుల్ జ్యువెలరీకి అదనపు సొబగులు అద్ది మార్కెట్లోకి తీసుకొస్తున్నారు. మట్టితో మాణిక్యాలు.. ప్రజెంట్ ట్రెండ్‌ను ప్రతిబింబిస్తూ.. ట్రెడిషనల్ లుక్ మిస్ కాకుండా మన ముందుకు వచ్చిన మోడల్ టైట టెంపుల్ జ్యువెలరీ. టైట బొమ్మల మాదిరి ఈ ఆభరణాలు కూడా మట్టితో తయారైనవే. మన్నుతో మన్నికైన ఆభరణాలు చేయడం అంటే మామూలా..! అందుకే బంగారు ఆభరణాలు చేసినంత జాగ్రత్తగా వీటిని తయారు చేస్తారు. లక్ష్మీ, సరస్వతీ దేవి వంటి దేవతా రూపాలు, విభిన్న డిజైన్లను లాకెట్లుగా మలిచి.. వాటికి రుద్రాక్షలు, ముత్యాలు, పగడాలు, రకరకాల రత్నాలు పొందికగా అటాచ్ చేసి జ్యువెలరీ లుక్ తీసుకొస్తారు. మట్టితోనే జుంకాలు సైతం తయారు చేస్తున్నారు. ఇన్నోవేటివ్ లుక్ సొంతం చేసుకున్న ఈ మట్టి ఆభరణాలను యువతుల నుంచి అమ్మమ్మల వరకు అందరూ సాదరంగా ఆహ్వానిస్తున్నారు. హ్యాండిల్ విత్ కేర్.. అన్ని రకాల సంప్రదాయ వస్త్రశైలులకూ ఈ జ్యువెలరీ అతికినట్టు సరిపోతుంది. అంతేకాదు ఫ్యాషన్ వేరింగ్కు నప్పుతుండటంతో యువతులు కూడా వీటిపై ఇంట్రెస్ట్ కనబరుస్తున్నారు. చీరకట్టులో, చుడీదార్లో, లంగాఓణి, గాగ్రాచోలీ ఇలా ఏ రకమైన డ్రెస్సింగ్ చేసుకున్నా వాటిపైకి ఇవి ఇట్టే సెట్ అయిపోతున్నాయి. పైగా ధర తక్కువగా ఉండటంతో.. పండుగలకు, పబ్బాలకు తమ డ్రెస్సింగ్‌కు మ్యాచ్ అయ్యే మోడల్స్‌ను కొనుగోలు చేస్తున్నారు కొందరు. అంతేకాదు ఎప్పుడూ బంగారంలో మెరిసి బోర్ కొట్టిన వారు కాస్త డిఫరెంట్‌గా కనిపించడానికి కూడా వీటికి తమ జ్యువెలరీ సెట్లలో చోటిస్తున్నారు. అయితే వీటిని హ్యాండిల్ చేయడంలో మాత్రం జాగ్రత్త తప్పనిసరి అంటున్నారు డిజైనర్లు. మట్టితో చేసినవి కావడంతో ఏ మాత్రం చేజారినా.. పగిలే అవకాశం ఉంది. సో హ్యాండిల్ విత్ కేర్.. హ్యాపీ విత్ వేర్. శిరీష చల్లపల్లి -
మన్‌బోలే తంబోలా
వినసొంపైన పాటలు.. అంతకుమించిన మాటలతో సిటీ శ్రోతలను అలరిస్తున్న రేడియో సిటీ 91.1 ఎఫ్ఎం ‘రేడియో సిటీ తంబోలా’ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. సాక్షి దినపత్రిక భాగస్వామ్యంతో ఈ మెగా మ్యూజిక్ ఈవెంట్‌ని కండక్ట్ చేస్తోంది. ప్రతి బుధ, శుక్రవారాల్లో సాక్షి పత్రికలో కొన్ని పాటలతో లిస్ట్ ప్రచురితమవుతుంది. ఆ లిస్ట్‌లో ఇచ్చిన పాటలు ఆయా రోజుల్లో ఉదయం 9.30 నుంచి 10.30 గంటల మధ్య రేడియో సిటీలో ప్రసారమవుతాయి. పాట విన్న శ్రోతలు పాటల లిస్ట్‌లో ఏవైనా 5 పాటలను సీక్వెన్స్ మిస్ కాకుండా కరెక్ట్ ఆర్డర్లో టైప్ చేసి 56060 నంబర్‌కు మెసేజ్ చేస్తే చాలు. కరెక్ట్‌గా ఎస్సెమ్మెస్ పంపిన వారు రూ.2,000 విలువ చేసే ప్రైజ్ గెలుచుకునే అవకాశం ఉంది. సో.. ఆ లక్కీ విన్నర్ మీరే ఎందుకు కాకూడదు. -
కెసెండ్రా మాట ఎవరు వింటారు?
నీరు జీవితం! చెట్టు చేమకు సమస్త ప్రాణికోటికి నదులు, ఇతర నీటి వనరులే జీవనాధారం! కాబట్టే నగరాలు నదీతీరాల వెంట వెలిశాయి. టైగ్రిస్, నైలు, సింధు నదీతీరాల్లో నాగరికతలు నవనవలాడాయి. నదుల నడక మారిన కారణంగా, నదుల్లో జలరాశులు హరించుకుపోయిన కారణంగా చారిత్రక నగరాలు అంతరించిపోయిన దాఖలాలున్నాయి. మొన్న ఆదివారం వరల్డ్ వాటర్ డే చేసుకున్నాం! నీరు చరిత్రలోకి ప్రవహించక ముందే ఓసారి నీటిని స్మరించుకుందాం! భూగోళం బాస్కెట్‌బాల్ సైజులో ఉంటే మంచినీటి గోళం పింగ్‌పాంగ్ బంతి సైజులో ఉంటుంది. భూగోళాన్ని ఆక్రమించిన 70 శాతం నీటిలో మంచి నీరు ‘గరిటెడే’! భూమి ఏర్పడిన రోజు నుంచి ఈ రోజు వరకూ మనిషికి అవసరమైన మంచి నీటి పరిణామంలో మార్పు లేదు! నీటి నిలువల్లోనే మార్పులు. సాంప్రదాయక పద్ధతుల్లోని నీటి నిలువలను మనుషులమైన మనం మార్పునకు గురిచేస్తున్నాం! నదుల సహజ ప్రవాహాన్ని అరికట్టి కృత్రిమ జలాశయాలను ఏర్పరుస్తున్నాం. సహజనీటి వనరుల చుట్టూ పరిశ్రమలు, నివాసాలు ఏర్పరచుకుంటున్నాం. ఒక కారు తయారీకి పెద్ద స్విమ్మింగ్ పూల్ పరిమాణంలో మంచినీరు వాడతాం. మంచినీటి విలువలు లేని ఒక కూల్‌డ్రింక్ కోసం రెండువందల రెట్లు అధికంగా మంచినీరు వాడతాం. మన చేష్టల ఫలితంగా మంచినీటికి నిలువ జాగా లేకపోతోంది! నీటిని నిలువ చేయడంలో ప్రకృతికి తనదైన పద్ధతులున్నాయి. మన పూర్వీకులు వాటిని గౌరవించారు. అధికారిక జలాశయాలు ఏర్పడ్డాక వాటి సరఫరా, నియంత్రణ కేంద్రీకృతం అయ్యింది. నీటి సరఫరా బ్యూరోక్రసీ విధుల్లో భాగం అయ్యింది. జలాశయాలు, కాలువల్లో మేటలు (సిల్ట్) ఏర్పడతాయి. వీటిని క్రమానుగతంగా తొలగించాలి. పాలకులు, అధికార గణం వాటిని పట్టించుకోరు. ఫలితంగా నీటి నిలువ సామర్ధ్యం కుంచించుకుపోతోంది! కొత్త కాలనీలు నిర్మించేపుడు, ఇళ్లు నిర్మించే సందర్భాల్లో అప్పటికే ఉన్న మురుగుకాల్వలకు నష్టం కలుగకుండా చేయడం, కొత్తవాటిని ఏర్పరచుకోవడం అనే అంశంలో దారుణమైన అంధత్వాన్ని ప్రదర్శిస్తున్నారు. ఫలితం? చినుకు చిటుక్కుమంటే నగరం ముంపునకు గురికావడం అనుభవంలోకి వస్తూనే ఉంది కదా! సేద్యానికి జూదానికి తేడా ఏమిటి? వీటికి తోడు భూతాపపు పెరుగుదల వాతావరణంపై విపరీత ప్రతికూలతను చూపుతోంది. వానలు వెర్రెత్తుతున్నాయి. రుతువులకూ వానలకూ సంబంధం లేకుండా పోతోంది. ఈ నెలలో ఈ కార్తెలో వానలు వస్తాయి అనే శతాబ్దాల లెక్కలు తల్లకిందులు కావడంతో నీటి నిలువలపైనా ఆ ప్రభావం పడుతోంది. ‘వానాకాలం పంట’ అనే నానుడికీ కాలం చెల్లుతోంది. భారతీయ వ్యవసాయం జూదప్రాయంగా మారుతోంది. జూదశాల (క్యాసినో)కు వ్యవసాయానికీ తేడా ఏమిటి? క్యాసినో ఎప్పుడు తెరుస్తారో తెలుస్తుంది. మనమెంత నష్టపోతామో తెలుస్తుంది. వ్యవసాయ జూదం ఎప్పుడు మొదలవుతుందో తెలీదు. ముగింపు ఎప్పడూ సుఖాంతం కాదు కదా! ప్రాణాంతకంగా కూడా మారుతోంది. నీటి కంటె చమురు చౌక గతంలో ఎప్పుడూ వినని ‘నీటి కరువు’ అనే పరిస్థితిని మనం అనుభవంలోకి తెచ్చుకుంటున్నాం. కెసెండ్రా గుర్తుంది కదా? ట్రాయ్ రాజు ప్రియం కూతురు కెసెండ్రా. ఆమె అందానికి అబ్బురపడ్డ అపోలో దేవుడు ఆమెకు జరగబోయే సంఘటనలను సవివరంగా చెప్పగల వరాన్ని ఇస్తాడు. కానుకకు కొనసాగింపుగా ఆమెతో సంగమాన్ని కోరతాడు. కెసెండ్రా అంగీకరించదు. అపోలో కోపితుడవుతాడు. ఆమె చెప్పే భవిష్యవాణిని ఎవ్వరూ నమ్మకుందురు గాక అని శపిస్తాడు. ఆధునిక కెసెండ్రాలు నీటి విషయంలో భవిష్యవాణిని చెబుతూనే ఉంటారు. ఎవరు నమ్ముతారు? వచ్చే ఐదేళ్లలో మంచినీటికి విపరీత కరువు వస్తుందని 2050 నాటికి శాశ్వత కరువు ఏర్పడుతుందని కెసెండ్రాలు సెలవిస్తున్నారు. భవిష్యత్ యుద్ధాలు చమురు కోసం కాదు నీటికోసమే జరుగుతాయి అనే జోస్యాన్ని నమ్మాల్సి వస్తోంది. కడవ నీటికోసం పల్లెతల్లులు పదిమైళ్లు నడవడం కంటిముందు కనిపిస్తున్న వాస్తవమే కదా! నదీప్రవాహాలను పంచుకుంటున్న కర్ణాటక-తమిళనాడు మధ్య అంతర్యుద్ధం ఏర్పడ్డ పరిస్థితులను చూశాం కదా! తెలుగు రాష్ట్రాల్లోనూ సెగలు-పొగలు కన్పిస్తున్నాయి. పోలీసులు పోలీసులపై లాఠీచార్జ్ చేసిన వైనానికి కారణం ఇరురాష్ట్రాల నీటి అవసరాలే కదా! ఆ దండ కట్టలేం! ‘చెంగ’ అనే పంజాబీ పదానికి అర్థం మంచి, చక్కని, అందమైన.. ఇలాంటి పేర్లున్నాయి. భారతదేశానికి నదులతో ఒక చెంగల్వ దండ వేద్దామనుకున్నారు దివంగత ఇంజనీర్ కె.ఎల్.రావు. ఆయన నెహ్రూ కేబినెట్లో ఇరిగేషన్ మినిస్టర్‌గా పనిచేశారు. మన దేశంలో కొన్ని ప్రాంతాలు నీటి చుక్కకు తపిస్తోంటే కొన్ని ప్రాంతాలు వరదల్లో మునిగిపోవడం గురించి రావుగారి ఇంజనీరింగ్ హృదయం కలత చెందింది! ఈ దుస్థితి తొలగాలంటే ఏంచెయ్యాలి..? నదులను కాల్వల ద్వారా అనుసంధానం చేస్తూ ‘గార్లెండ్ ప్రాజెక్ట్’ను సూచించారు. దశాబ్దాల క్రితపు ఖరీదైన ఆ కల ఇప్పటికీ ఆచరణలోకి అడుగువేయలేదు. ఒక వేళ అమలు చేయాలనుకుంటే గార్లెండ్ ప్రాజెక్ట్‌కు ఎంత ఖర్చవుతుంది? పదేళ్ల క్రితం అంచనా ప్రకారం 5,60,000 కోట్ల రూపాయలు! ఆర్థిక కారణాలొక్కటే ఈ ప్రాజెక్ట్ అమలుకు అడ్డంకి కాదు. రాష్ట్రాల భిన్న ధోరణులు కూడా! ‘ నా జీవిత కాలంలో ఈ ప్రాజెక్ట్ శ్రీకారం చుట్టదు’ అని ప్లానింగ్ కమిషన్ సభ్యులొకరు ఇటీవల నిర్వేదం చెందారు. అతడిని నిరాశావాదని అందామా..!! ప్రజెంటేషన్: పున్నా కృష్ణమూర్తి -
నెగిటివ్ రోల్స్ ఇష్టం
ఆయన సినిమా చూస్తుంటే మన పక్కింటి బాషా భాయ్... ఎదురింటి శంకరన్న మాట్లాడుతున్నట్లే ఉంటుంది. ఎలాంటి హంగులు, ఆర్భాటాలు లేకుండా హైదరాబాదీ గల్లీలు మన కళ్లకు కడతాయి. బాలీవుడ్ బాద్షాలా... హైదరాబాదీలకు ఓ ఖాన్ ఉన్నాడు. హాఫ్ ప్రై, జబర్దస్త్, గుళ్లుదాదాల్లో నెగిటివ్ రోల్స్‌లో మెప్పించి, ఏక్తా సర్దార్తో కథానాయకుడిగా హైదరాబాదీల మనసు దోచుకున్న ఆ ఖాన్.. తౌఫిక్ ఖాన్. నటుడిగానే పరిమితమవ్వకుండా మినార్ ఫిల్మ్ ప్రొడక్షన్ ఏర్పాటు చేసి... సిటీ కల్చర్‌ను, సిటీకే సొంతమైన భాషను దృశ్యమానం చేస్తున్నాడు. త్వరలో మరో సినిమా ముహూర్తానికి రెడీ అవుతున్న ఖాన్‌ను సాక్షి సిటీప్లస్ పలకరించింది. ఆ ముచ్చట్లు ఆయన మాటల్లోనే... ..:: దార్ల వెంకటేశ్వరరావు తెరపై నన్ను నేను చూసుకోవాలని మెహిదీపట్నంలోని రిషి జూనియర్ కళాశాలలో ఇంటర్ చదువుతుండగానే కళాశాల నాటకాల్లో నటించేవాణ్ణి. డ్రామాల్లో నన్ను చూసిన ఫ్రెండ్స్ మెచ్చుకునే వాళ్లు. అప్పుడే సినిమాల్లో నటించాలనే కోరిక బలంగా కలిగింది. స్నేహితుల సహకారంతో మొదట నాలుగు సినిమాల్లో నటించాను. నెగిటివ్ రోల్స్ ఇష్టం. అందుకే మొదట అవి చేశాను. తరువాత సొంత బ్యానర్ ‘మినార్ ఫిల్మ్ ప్రొడక్షన్’ ఏర్పాటు చేశాను. ఈ క్రమంలో నా దోస్తులు సయ్యద్ హమీదుద్దీన్, జాఫర్ హుస్సేన్ మిరాజ్, జయంత్‌ల ప్రోత్సాహం మరువలేనిది. రియల్ స్టోరీ... నాలుగు చిత్రాల తర్వాత ఏక్తాసర్దార్ సొంత బ్యానర్‌పైనే నిర్మించాను. ఇందులో లీడ్‌రోల్ చేశాను. హైదరాబాద్‌లో ఆటో నడుపుతూ జీవనం గడిపే ఓ ఆటోడ్రైవర్ పోలీసుల వేధింపులతో సర్దార్‌గా ఎలా మారాడనేది ఆ చిత్ర సారాంశం. హైదరాబాదీ భాష, వ్యవహారంతో పాటు అచ్చ హైదరాబాదీ చిత్రంలా ఉండేందుకు నా ఫ్రెండ్స్ అక్బర్బిన్ తబర్, అద్నాన్ సాజిద్, గుళ్లుదాదా, ఆర్కే మామ, అజీజ్ నాసిర్, అల్తాఫ్ హైదర్ గ్యాంగును తీసుకున్నా. ఈ చిత్రంలో బాగా నటించేందుకు ముంబై నుంచి శిక్షకులను పిలిపించుకుని, వారి దగ్గర మూడు సంవత్సరాల పాటు శిక్షణ తీసుకున్నా. సినిమాకు స్పెషల్ అట్రాక్షన్ కోసం టాలీవుడ్లో పెద్ద నటుడైన ముఖేష్ రిషీని ఒప్పించాం. ఆయన అంగీకరించడం సంతోషాన్నిస్తే... ఆ చిత్రం హైదరాబాద్‌లో 100 రోజులు ఆడటం నా ఆనందాన్ని రెట్టింపు చేసింది. దీనికి సీక్వెల్‌గా కొత్త సినిమా ప్రారంభిస్తున్నా. సొంతానికి వాడుకోను... సినిమాలో నటించినపుడు వచ్చిన డబ్బు, చిత్ర నిర్మాణం తర్వాత వచ్చిన ఆదాయంలో ఒక్క రూపాయి కూడా నేను వాడుకోను. వచ్చిన డబ్బంతా సేవా కార్యక్రమాలకు వినియోగిస్తా. ఆ అల్లా దయతో నాకు ఈ జీవితానికి కావాల్సినంత డబ్బు బిజినెస్ ద్వారా వస్తుంది. సినిమాలో వచ్చినా రాకపోయినా 365 రోజులు సామాజిక సేవా కార్యక్రమాలకు ఖర్చు చేస్తుంటా. బియ్యం, రంజాన్ సమయంలో దుస్తులు, పండుగ సరుకులు అందిస్తుంటా. సేవలో ఉండే ఆనందం చాలా గొప్పది. తల్లిదండ్రుల పేరుతో యాకుత్‌పుర అమన్‌నగర్‌లో అమీనా యూసుఫ్ మసీదు నిర్మించా. సినిమాల్లో నటించడం డబ్బు కోసం కాదు కాబట్టే ఇంత కాలం ఇతర సినిమాల్లో ఆఫర్లు వచ్చినా వదులుకున్నా. అయితే ఈ సారి వస్తే నటించి, ఆ డబ్బు ట్రస్టులకు ఇవ్వాలని అనుకుంటున్నా. పేరు తెచ్చుకోవాలని... ఏక్తాసర్దార్ ఒక్క హైదరాబాద్‌లోనే కాకుండా కర్ణాటక, మహారాష్ట్రల్లో కూడా బాగా ఆడింది. దీంతో మంచి గుర్తింపు వచ్చింది. మక్కాకు వెళితే అక్కడ చాలా మంది గుర్తు పట్టి ‘సర్దార్’ అంటూ పిలిచారు. దుబాయ్‌లో కూడా ఇలాంటి సంఘటనే జరిగింది. ఇలా అభిమానులు వచ్చి పిలుస్తూ ఫొటోలు దిగుతుంటే చాలా మజా అనిపిస్తుంది. ‘యే షహర్ మేతో సిర్ఫ్ ఏకీ రహ్సక్తా... ఓ హై సర్దార్’ డైలాగ్ లాగే హైదరాబాద్ సర్దార్‌గా ఇంకా పేరు తెచ్చుకోవాలని ఉంది. సన్నీ డియోల్, నానా పటేకర్ అంటే ఇష్టం. తెలుగులో ప్రకాష్‌రాజ్ నటన అంటే అమితమైన ప్రేమ. ప్రోత్సాహమివ్వాలి... చిన్న నిర్మాతలు ఎన్నో మంచి సినిమాలు తీస్తున్నారు. మన భాష, సంస్కృతి పరిరక్షణకు ఇవి దోహదపడుతున్నాయి. వాటిని ప్రభుత్వం ప్రోత్సహించాలి. హైదరాబాద్‌లో చిన్న సినిమాలకు థియేటర్లు దొరకని పరిస్థితి ఉంది. అది మారాలి! -
హాస్టల్ దునియా
చదువుకోసమో... ఉద్యోగవేటలోనో నగరంలో అడుగుపెడితే మొదటఎదురయ్యే సమస్య వసతి. బంధువులుంటే సరి... లేకపోతే హాస్టలే గతి. ఆ హాస్టల్‌ను వెదకడానికి నానా కష్టాలు. ఎన్నో తిప్పలు పడి వెతికినాక దొరికినా... అందులో సౌకర్యాలు అరకొర. ఈ సమస్యలన్నింటికీ సింగిల్ క్లిక్‌తో చెక్ పెట్టేలా చేశాడు యువ ఇంజనీర్ రాజు. ‘హాస్టల్దునియాడాట్కామ్’ వెబ్‌సైట్‌ని సృష్టించి... అవసరం ఆవిష్కరణలకు నాంది అని మరోసారి నిరూపించాడు. ఆ నాంది ప్రస్తావన... ..:: భువనేశ్వరి ‘కరీంనగర్ మా స్వస్థలం. నాన్న రైతు. ఇంజనీరింగ్ చదువుకోవడానికి హైదరాబాద్‌కి వచ్చాను. ఇక్కడ జేఎన్టీయూలో చదువు పూర్తయ్యాక ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం వచ్చింది. కాలేజ్ టైమ్‌లోనే సరైన హాస్టల్ సదుపాయం లేక చాలా ఇబ్బందులు పడ్డాను. జస్ట్ డయిల్ ద్వారా వెదికితే... అడ్రస్ ఉంటుంది. హాస్టల్లో సదుపాయాల గురించి తెలియదు. చాలా ఇబ్బంది పడ్డాను. అయితే నాలా ఎంతో మంది ఇలాంటి ఇబ్బందులు పడుతూ ఉంటారు కదా అనిపించింది. ఒక యూజర్ఫ్రెండ్లీ వెబ్సైట్లో నగరంలోని హాస్టళ్ల వివరాలు పెడితే ఎలా ఉంటుందని ఆలోచించాను. ముందుగా వెబ్‌సైట్‌ని డిజైన్ చేసుకున్నాను. ఉద్యోగం చేసుకుంటూనే ఈ వెబ్సైట్ డెవలప్మెంట్ మీద దృష్టి పెట్టాను’అంటూ హాస్టల్ దునియా డాట్‌కామ్ రూపకల్పన వెనుక సంకల్పాన్ని గుర్తు చేసుకున్నారు రాజు. ఏడాది కిందట స్టార్ట్ అయిన ఈ వెబ్‌సైట్‌ను ఇప్పటివరకు 8 లక్షలమంది చూశారు. అన్ని వివరాలు... ఈ వెబ్సైట్లో హాస్టల్ అడ్రస్, ఫోన్ నెంబర్ పెట్టి ఊరుకోలేదు. హాస్టల్లో ఉన్న సదుపాయాలు, సింగిల్ రూమ్‌కి ఫీజు ఎంత?, డబుల్ షేరింగ్‌కి ఎంత, త్రిబుల్ షేరింగ్‌కి ఎంత, ఏసీ ఉంటే, లేకపోతే... ఇలా అన్ని రకాల వివరాలు చేర్చాడు. ఆ హాస్టల్‌కి ఎంత దూరంలో ఏమేమున్నాయో కూడా మెన్షన్ చేశాడు. ‘ఇన్ని వివరాలు సైట్లో పెట్టాలంటే నేరుగా హాస్టల్ యజమానులతో మాట్లాడాలి, హాస్టల్‌ని చూడాలి. కొత్తలో పెన్ను, పేపరు పట్టుకుని హాస్టల్‌కి వెళ్లి వివరాలు చెప్పమని అడిగితే చాలామంది తిరస్కరించారు. ఏ ఐటి అధికారులో పంపించి ఉంటారని భయపడ్డారు. చాలా ఓపికతో విషయం చెప్పి, వారిని ఒప్పించి వివరాలు సేకరించడానికి చాలా సమయం పట్టింది. రోజూ ఆఫీసునుంచి బయటికివచ్చాక ఫ్రెండ్స్‌ని తీసుకుని హాస్టళ్ల చుట్టూ తిరిగేవాణ్ణి. అలా కొన్ని నెలలపాటు తిరిగి రెండు వందల హాస్టళ్ల వివరాలు సేకరించగలిగాను. వాటిని వెబ్సైట్లో అప్లోడ్ చేశాను’ అని తాను ఎదుర్కొన్న ఇబ్బందులను పంచుకున్నాడు రాజు. కొద్దిరోజుల్లోనే... సైట్‌ని మొదలుపెట్టిన కొద్దిరోజులకే విజిటర్స్ సంఖ్య పెరిగిపోయింది. దీంతో ‘మా హాస్టల్ వివరాలు కూడా చేర్చండ’ంటూ హాస్టళ్ల యజమానులు రాజుని సంప్రదించడం మొదలుపెట్టారు. ప్రస్తుతం ఈ వెబ్సైట్లో నగరంలోని 1500 హాస్టళ్ల వివరాలున్నాయి. వెబ్‌సైట్‌కి వెళ్లి మనకు కావాల్సిన సదుపాయాలను ఆప్షన్స్‌లో టైప్ చేస్తే... మన రిక్వైర్‌మెంట్స్‌కి తగిన హాస్టల్‌ను అడ్రస్, ఫోన్‌నెంబర్‌తో సహా మన ముందుంచుతుంది. ‘తొలిసారి ఇలాంటి వినూత్న ప్రయత్నం చేసి విజయం సాధించినందుకు ఈ మధ్యనే స్టార్టప్ హీరో అవార్డు వచ్చింది. నగరంలో అమీర్‌పేట్, కూకట్పల్లి, మాదాపూర్, మణికొండ... ఇలా ఏరియావైజ్ హాస్టళ్ల వివరాలను క్షణాల్లో తెలుసుకోగలిగే అవకాశాన్ని అందరికీ అందుబాటులోకి తెచ్చినందుకు సంతోషంతోపాటు గర్వంగా కూడా ఉంది. ఎందుకంటే హాస్టల్లో రూమ్ దొరకడం ఎంత సులువో.. అంతే కష్టం కూడా. ముఖ్యంగా అమ్మాయిలకు. ఈ సమస్య మన ఒక్క నగరానిది మాత్రమే కాదు. బెంగళూరు, చెన్నైలో ఉన్న తెలుగువాళ్ల సూచనమేరకు అక్కడా హాస్టల్ దునియా ప్రారంభించాను’ అని వివరించాడు రాజు. ఈ స్టార్టప్ హీరో భవిష్యత్‌లో పుణే, కోయంబత్తూర్‌కి కూడా ఈ సేవలను విస్తరించాలనుకుంటున్నాడు. ఇతర నగరాల్లో... ఈ మధ్యనే మొదలైన బెంగళూరు వెబ్సైట్లో ప్రస్తుతం 50 హాస్టళ్ల వివరాలు ఉన్నాయి. మరిన్ని చేర్చేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. చెన్నైలోనూ హాస్టల్‌దునియా ప్రారంభమైంది. ‘దేశంలోని ఏ నగరానికైనా కొత్తగా వచ్చిన వ్యక్తి వసతి ఇబ్బందులెదుర్కోకుండా ఉండాలన్నదే నా ఆలోచన’ అని చెబుతున్న ఈ యువ ఇంజనీరు కల నెరవేరాలని కోరుకుందాం! -
స్ట్రీట్ ప్లేస్
యోగా, స్పోర్ట్స్, కల్చరల్ ఈవెంట్స్‌తో నగరవాసులకు కావాల్సినంత ఫన్ని అందిస్తున్న రాహ్‌గిరి.. మరో కొత్త థీమ్‌తో రోడ్డెక్కింది. ఆటపాటలతోనే సరిపెట్టక... మార్చి 8న మహిళల పట్ల బాధ్యతను తెలియజెప్పిన రాహ్‌గిరి.. ఇప్పుడు నుక్కడ్ నాటక్ (వీధి నాటకం)కి వేదికైంది. ఎంటర్టైన్మెంట్తో పాటు సోషల్ మెసేజ్నీ పాస్ చేస్తోంది!. నాటకం ఏదైనా వేయండి... ప్రజలను ఆలోచింపజేయాలి. ఆసక్తికరంగానూ ఉండాలి. ప్రదర్శించడం మీకు ఇష్టమైతే... రాహ్‌గిరి వేదిక సిద్ధంగా ఉంది. ..:: కట్ట కవిత వీధి నాటకాలు... లైవ్ మీడియా. ఎవర్గ్రీన్ కూడా. టీవీ, సినిమాలు ఎంతో ప్రభావితం చేస్తున్నాయి. ఇంటర్నెట్ అరచేతిలో వైకుంఠాన్ని చూపిస్తోంది... ఇంకా వీధి నాటకాలనెవరు చూస్తారు? ఇది చాలా మంది సందేహం. ఇలాంటి సందేహాల్ని పటాపంచలు చేస్తూ.. వాటికి తాను వేదికవుతానంటోంది ‘రాహ్‌గిరి’. ఇటీవలే మంథన్ సొసైటీ.. పిల్లలతో పులులను కాపాడాలంటూ సందేశమిచ్చింది. ఈ వారం కొత్తగా... కేంద్ర ప్రభుత్వ కార్యక్రమం ‘బేటీ బచావో, బేటీ పడావో’ స్ఫూర్తితో ‘బేటీ హై తో కల్ హై’ వీధి నాటకాన్ని ప్రదర్శించాయి మంథన్ అండ్ లివ్ లైఫ్ ఫౌండేషన్స్. ‘మంథన్’ నుక్కడ్ నాటక్ సొసైటీ... సామాజిక సమస్యలపై మరిన్ని నాటకాస్త్రాలను సంధించడానికి సిద్ధమవుతోంది. అసలు సత్యం... వీధి నాటకాలు వేయడానికి థియేటర్స్ అక్కర్లేదు. వీధులు, షాపింగ్ మాల్స్, పార్కులు ప్లేస్ ఏదైనా కావచ్చు. చాలా సింపుల్ కాస్ట్యూమ్స్‌తో, అందరికీ అర్థమయ్యే సరళమైన భాషతో అందరినీ ఆక ట్టుకోవడమే కాదు... ఆలోచింపజేసేలా ప్రదర్శన ఇవ్వడం కష్టంతో కూడుకున్న పని. దాన్ని సవాల్‌గా తీసుకుని ఆర్టిస్టులకు, ప్రేక్షకులకు మధ్య ఉన్న దూరాన్ని తగ్గిస్తున్నాయివి. లింగ వివక్షని ఎత్తి చూపుతూనే పొగ తాగకూడదని చెబుతున్నాయి. వరకట్నం పెనుభూతమని, భ్రూణహత్యలు పాపమని, లంచగొండితనం నేరమనే చైతన్యాన్ని కలిగిస్తున్నాయి. ప్రవృత్తిగా అయితే ఈ నాటకాలని ప్రొఫెషనల్ ఆర్టిస్టులే వేయడం లేదు. విద్యార్థులు, ఉద్యోగులు.. వివిధ రంగాల్లో ఉన్నవారు ప్రవృత్తిగా వీటిని ఎంచుకుంటున్నారు. ఇందుకు ఉదాహరణ ఐటీ ప్రొఫెషనల్ అనిరుధ్. ‘చుట్టూ ఉన్నవాళ్లు మావైపు చూసేందుకు గట్టిగా అరుస్తాం. నాటకాల్లో ఇది మొదటిఅంశం. దీనికోసం ఎనర్జీతోపాటు ఏకాగ్రత కూడా అవసరం. సినిమాల్లో లాగా రీ టేకులు ఉండవు. ఒకే షాట్లో ఓకే అయిపోవాలి. దీనికోసం ఎంతో రిహార్సల్స్ చేస్తాం. మైక్, స్టేజ్ లాంటి లగ్జరీస్ ఏమీ ఉండవు. ప్రేక్షకుల కళ్లముందే ప్రదర్శించాలి. వాళ్లను మెప్పించాలంటే ఎంతో హాస్యం వచ్చి ఉండాలి. చున్ని, టవల్స్ వంటి చిన్నచిన్న ప్రాపర్టీస్‌తో ప్రేక్షకులను నవ్వించాలి. ఈ వీధి నాటకాలకు సంగీతం, డ్యాన్స్ వంటివి కూడా జోడించవచ్చు’ అని చెబుతున్నాడాయన. అంశమేదైనా... వేదిక మాది... భారతీయ సంస్కృతి సంప్రదాయాలను సుసంపన్నం చేసిన వాటిలో వీధి నాటకం కూడా ఒకటి. అంతటి ప్రాముఖ్యత ఉన్న వీధినాటకాలను పునర్జీవింపచేయడానికి, వాటి ద్వారా ప్రజల్లో చైతన్యం నింపడానికి రాహ్‌గిరి కచ్చితంగా సహకరిస్తుంది అంటున్నారు ‘రాహ్‌గిరి’ ప్రతినిధి విశాలరెడ్డి. సామాజిక, రాజకీయ సమస్యేదైనా... వ్యంగ్యంగా, నవ్వులు కురిపిస్తూ ఉత్సాహంగా సాగే ఈ వీధి నాటకాలు కచ్చితంగా ప్రజల్లో చైతన్యం కలిగిస్తాయని చెబుతున్నారు ఎంబార్క్ ఎన్జీవో ప్రాజెక్ట్ మేనేజర్ ప్రశాంత్ బచ్. సమ్‌థింగ్ స్పెషల్ రంగులు, లైటింగ్, మేకప్, ఒక స్టేజీ, కళాకారులు, రిహార్సల్స్.. ఒక నాటకాన్ని ప్రదర్శించాలంటే ఇంత సరంజామా కావాలి. పైగా ఏదైనా నాటకాన్ని చూడాలనుకుంటే.. అది ప్రదర్శించే చోటకు వెళ్లాలి. అందరూ అలా వెళ్లలేరు. కాబట్టి వాటి ద్వారా చెప్పదల్చుకున్నది జనంలోకి వెళ్లదు. కానీ, రాహ్‌గిరి వేదిక అందుకు భిన్నం. విద్యార్థులు, ఉద్యోగులు అప్పటికప్పుడు కళాకారులుగా మారిపోతారు. ఇతివృత్తాన్ని అర్థం చేసుకుని తమదైన ‘పాత్ర’ పోషిస్తారు. తాము చెప్పదల్చుకున్నది అందరి మధ్య, ఆసక్తికరంగా, మనసుకు హత్తుకునేలా చెబుతారు. తద్వారా అందరికీ సులభంగా సందేశం చేరుతుంది. ఇకపై ప్రతి వారం సామాజిక సమస్యలు ప్రధానాంశంగా స్ట్రీట్ ప్లేస్ ప్రదర్శిస్తామని రాహ్‌గిరి ప్రతినిధులు చెబుతున్నారు. -
ఆ క్రెడిట్ టాలీవుడ్‌దే..
సంజన.. బుజ్జిగాడు సినిమాలో త్రిష చెల్లిగా వయ్యారాలు పోయిన ఈ భామ.. కన్నడలో బిజీ నటిగా మారిపోయింది. తెలుగు ప్రేక్షకులను అడపాదడపా అలరిస్తున్న ఈ ముద్దుగుమ్మ ఈ మధ్యే ఓ ఇంటిదయ్యింది. అలాగని ఇల్లాలయిపోయిందని ఫిక్సయిపోకండి. ఓ అందమైన ఫ్లాట్‌కు ఓనర్ అయిందట. ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చిన సంజన తన మూవీ ముచ్చట్లు, కొత్తింటి అచ్చట్లు సీటీప్లస్తో పంచుకుంది. ఆ విషయాలు ఆమె మాటల్లోనే.. - శిరీష చల్లపల్లి మాది బెంగళూరు. చిన్నప్పటి నుంచి ఫ్యాషన్‌గా కనిపించాలనుకునేదాన్ని. అలా ఫ్యాషన్ ఫీల్డ్‌లోకి ఎంటరయ్యాను. సినిమాల్లోకి రాకముందు జాన్ అబ్రహంతో ఫాస్ట్‌ట్రాక్ గ్లాసెస్ యాడ్‌లో నటించాను. ఆ యాడ్ చూసి పూరి జగన్నాథ్ నన్ను పిలిపించారు. తను తీయబోయే ‘బుజ్జిగాడు’లో మంచి రోల్ ఉందని చెప్పారు. అందులో ‘త్రిష చెల్లిగా నువ్వయితేనే కరెక్ట’ని ఆఫర్ చేశారు. వెంటనే ఓకే చెప్పేశాను. అప్పుడు నా ఏజ్ జస్ట్ సెవెంటీన్. ఆ సినిమా కోసమే నేను మొదటిసారి హైదరాబాద్‌కు వచ్చాను. అప్పటికీ నాకు ఇండస్ట్రీ గురించి ఏం తెలియదు. పూరి గారు నాకు కొత్త లోకాన్ని పరిచయం చేశారు. ఇంకా చెప్పాలంటే నాకో కొత్త లైఫ్ అందించారు. అంతకుముందు తమిళం, కన్నడంలో కొన్ని సినిమాలు చేసినా.. బుజ్జిగాడు మంచి బ్రేక్ ఇచ్చింది. టాలీవుడ్లో సక్సెస్ తర్వాత శాండిల్‌వుడ్‌లో మంచి అవకాశాలు వచ్చాయి. ప్రజెంట్ కన్నడలో ప్రధాన నటి కావడానికి కారణం టాలీవుడే. మై డ్రీమ్ హోమ్.. ఈవెంట్స్, ఇనాగరేషన్స్, మూవీస్.. ప్రస్తుతం బిజీగానే ఉన్నాను. చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాను. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న సూత్రాన్నీ ఫాలో అవుతున్నాను. అందుకే బెంగళూరూలో ఒక ఫ్లాట్ కూడా తీసుకున్నాను. ఈ మధ్యే అందులోకి వెళ్లాం. చిన్నప్పటి నుంచి నాకో డ్రీమ్ హోమ్ ఉండేది. న్యూ ఫ్లాట్‌లో కూడా ఫర్నిచర్, ఆర్కిటెక్చర్.. ఇలా ప్రతిదీ నా ఊహాసౌధాన్ని మరపించేలా ప్లాన్ చేసుకున్నాను. నేను రోజూ వెళ్లే యోగా సెంటర్, జిమ్ సెంటర్ కూడా మా ఇంటికి చాలా దగ్గర. ప్రజెంట్ నా డ్రీమ్ హోమ్‌ని తెగ ఎంజాయ్ చేస్తున్నాను. షాపింగ్స్.. హ్యాంగౌట్స్. పేరుకు బెంగళూరువాసినైనా.. నా బెస్ట్ ఫ్రెండ్స్ అందరూ హైదరాబాద్‌లోనే ఉన్నారు. తర చూ ఈ సిటీ విజిట్ చేస్తుంటాను. వచ్చిన ప్రతిసారీ కనీసం రెండుమూడ్రోజులు స్టే చేస్తాను. ఫ్రెండ్స్‌తో కలసి సరదాగా షాపింగ్, హ్యాంగౌట్స్కి వెళ్తుంటాను. ప్రస్తుతం కన్నడలో 5 సినిమాలు చేస్తున్నాను. తెలుగులో అవును-2 సినిమాలో నటిస్తున్నాను.