
జో.. పశ్చిమానంద
‘చెట్టు మీద కాయను సముద్రంలో ఉప్పును కలిపినట్టె కలిపావు’ అన్న చరణానికి ఉదాహరణ జో కోస్టర్ జీవితం! వాణిజ్య వ్యవహారాల కన్సల్టెంట్ అయిన స్విట్జర్లాండ్‌కు చెందిన ‘జో’ తెలుగువారి స్వచ్ఛంద సేవకుడిగా మారాడు! ఇ
‘చెట్టు మీద కాయను సముద్రంలో ఉప్పును కలిపినట్టె కలిపావు’ అన్న చరణానికి ఉదాహరణ జో కోస్టర్ జీవితం! వాణిజ్య వ్యవహారాల కన్సల్టెంట్ అయిన స్విట్జర్లాండ్‌కు చెందిన ‘జో’ తెలుగువారి స్వచ్ఛంద సేవకుడిగా మారాడు! ఇప్పుడాయన ఎందరో విద్యార్థుల తలలో నాలుక! ‘హైదరాబాద్ వెస్ట్రన్ మ్యూజిక్ ఫౌండేషన్’వ్యవస్థాపక డెరైక్టర్ అయిన జో కోస్టర్‌తోసంభాషణ అతని మాటల్లోనే...
పున్నా కృష్ణమూర్తి
స్విట్జర్లాండ్ నా దేశం. బెర్లింగన్ మా ఊరు. కాన్‌స్టన్స్ అనే సరస్సు మా ఊరుకు ఆభరణం. హైద్రాబాద్, సికింద్రాబాద్‌ను హుసేన్ సాగర్ కలిపినట్టు, కాన్‌స్టన్స్ జర్మనీ-ఆస్ట్రియా-స్విట్జర్లాండ్‌లను కలుపుతుంది. వీచేగాలిని బట్టి సరస్సు అలలు ఒకో తీరాన్ని తాకినట్టు నా ప్రయాణం సాగింది. మ్యూనిచ్‌లో ఒక వాణిజ్య సంస్థకు బిజినెస్ కన్సల్టెంట్ డెరైక్టర్‌గా పనిచే సేవాడిని. ఒక స్వచ్ఛంద సంస్థ ప్రాజక్ట్ పనితీరును పరిశీలించేందుకు 1992లో మొదటిసారి ఇండియా వచ్చా. ప్రతి ఏటా వచ్చి రెండు-మూడు వారాలు ఉండేవాడిని. గోదావరి జిల్లాలు, ఖమ్మం, నగరంలోని కొన్ని స్లమ్స్‌లో పనిచేశాను. నా దృష్టిలో హైదరాబాద్‌లాంటి నగరాలు వేరు. గిరిజన, దళిత సమూహాలు నివసించే ప్రాంతాలు వేరు. ఇక్కడి ప్రజలతో ఏర్పడిన అనుబంధం నన్ను హైదరాబాదీని చేసింది. 2003 నుంచి పన్నెండేళ్లుగా ఇక్కడే ఉంటున్నాను. నా భార్య ఇనెస్ స్విట్జర్లాండ్‌లో నర్స్‌గా పనిచేస్తోంది. కొన్ని నెలలు తను ఇక్కడకు వస్తుంది. మరికొన్ని నెలలు నేను అక్కడకు వెళ్లి వస్తాను.
ధర్మవ్యాధుని ‘జో’ల పాట
బిజినెస్ కన్సల్టెన్సీ-ఎన్జీఓల వ్యాపకాలకు సంగీతం ఎలా జతకూడింది? అనుకుంటున్నారు కదా! సహజమే! మున్సిపల్ పట్టణం అయిన బెర్లింగెన్‌లో మాకో రెస్టారెంట్ ఉంది. మా నాన్న జోసెఫ్ బుచర్. ‘కసాయి’ అంటే కటువుగా భావిస్తారేమో కానీ.. వృత్తిలో కళాత్మకత ఉంటుంది. భారతీయ పురాణాల్లో ధర్మవ్యాధుడు గుర్తొస్తాడు మా నాన్నను తలచుకుంటే! రెస్టారెంట్‌లో కస్టమర్లు విందు ఆరగిస్తున్నప్పుడు మా నాన్న అకార్డియన్ వాయించేవాడు. అకార్డియన్ వినేందుకు కొందరు కస్టమర్లు మా రెస్టారెంట్‌కు వచ్చేవారు.
నాన్న ద్వారా విన్న ట్యూన్స్, వారాంతాల్లో వెళ్లిన మ్యూజిక్ క్లాస్‌లు బాల్యంలో సంగీతం పట్ల శ్రద్ధను పెంచాయి. మా రెస్టారెంట్‌లో, లోకల్ బ్రాస్-బ్యాండ్, స్విస్ ఆర్మీబ్యాండ్‌లలో ఇన్‌స్ట్రుమెంట్స్ వాయించేవాడిని. శాక్సాఫోన్, ట్రంపెట్, క్లార్నెట్, అకార్డియన్ ఎంత గొప్ప ఇన్‌స్ట్రుమెంట్స్. ఇప్పటి జనరేషన్‌లో కొందరు వాటిపట్ల చిన్నచూపు చూస్తున్నారు. పియానో, గిటార్, వయొలెన్, సితారలను మాత్రమే ‘క్లాసిక్స్’ అనుకొంటున్నారు.
ఫ్రెంచ్ టచ్!
బుధ, శనివారాలు ఫ్రాన్స్ వాసులకు మ్యూజిక్ డేస్! ఆ రెండు రోజులు రెగ్యులర్ సిలబస్‌ను పక్కనపెట్టి క్లాసికల్-కాంటెపరరీ మ్యూజిక్‌ను నేర్చుకుంటారు. హైదరాబాద్‌లోని ఫ్రెంచ్ కల్చరల్ సెంటర్ ‘అలయన్స్ ఫ్రాంఛైజ్’ డెరైక్టర్‌గా పనిచేసిన ఫ్రెడరిక్, మ్యూజిక్ లవర్. హవాయియన్ గిటార్‌ను రూపకల్పన చేసిన హిందుస్తానీ ఇన్‌స్ట్రుమెంటలిస్ట్ జయవంత్ నాయుడును, నన్నూ వారాంతపు కార్యక్రమాల్లో ప్రోత్సహించేవారు. ఆ నేపథ్యంలో హైదరాబాద్‌లో వెస్ట్రన్ మ్యూజిక్‌ను నేర్పే సంస్థ అవసరం ఉందని వివిధ సాృస్కృతిక సంస్థలు, పాఠశాలల నిర్వాహకులు భావించారు. అలా ‘హైదరాబాద్ వెస్ట్రన్ మ్యూజిక్ ఫౌండేషన్’ (http://www.hydmusic.com) అంకురించింది.
దక్కన్ వాయిస్...
వెస్ట్రన్ మ్యూజిక్ అంటే శంకరాభరణం సినిమాలో కథానాయకుడు శంకర శాస్త్రి చెప్పినట్లు సంగీతం స్థలకాలాదులకు అతీతమైనది. అన్నమయ్య కీర్తన ‘జో అచ్యుతానంద’ ఎంత హాయైన పాట! వెస్ట్రన్ మ్యూజిక్‌లో కూడా మంచి నిద్రను ప్రసాదించే క్లాసిక్ ట్యూన్స్ ఉంటాయి. ఈ అవగాహనతో హైదరాబాద్ వెస్ట్రన్ మ్యూజిక్ ఫౌండేషన్ నిపుణులు 11వ శతాబ్దినుంచి ఇప్పటి వరకు మ్యూజిక్ థియరీని విద్యార్ధులకు చెబుతారు. వెస్ట్రన్ క్లాసిక్ మ్యూజిక్ మాస్టర్స్ నుంచి సమకాలీనుల వరకూ విద్యార్ధులకు పరిచయం చేస్తాం.
ప్రాక్టీస్ చేయిస్తాం. ఎంపిక చేసిన వారితో కచేరీలు పెట్టిస్తాం. వివిధ దేశాలనుంచి సమకాలీన ప్రముఖులను పిలిపించి వారి కన్సర్ట్స్ ద్వారా సంగీతాభిమానులను ఆకర్షిస్తాం. సంస్థద్వారా తర్ఫీదైన యువకుల ప్రావీణ్యాన్నీ పరిచయం చేస్తాం. ఉదాహరణకు నవంబర్ 1వ తేదీన అలయన్స్‌ఫ్రాంచైజ్ కార్యాలయంలో నిర్వహించనున్న ‘హైదరాబాద్ యూత్ ఎసెంబుల్ మూడో సీజన్’ కోసం శిక్షణాకార్యక్రమాలను
ఇటీవలే ప్రారంభించాం.
ఫేస్‌బుక్: <http://www.facebook.com/TheHyderabadWesternMusicFoundation>www.facebook.com/TheHyderabadWesternMusicFoundation ద్వారా గానీ, info@hydmusic.com ఈమెయిల్ ద్వారా గానీ వివరాలు తెలుసుకోవచ్చు.