జ్యూరిక్ ఎయిర్‌పోర్టులో కలిసిన సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబుతో ముచ్చటిస్తున్న సీఎం రేవంత్
ఎయిర్‌పోర్టులో ఇద్దరు సీఎంల సమావేశం
అక్కడి నుంచి దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం భేటీకి పయనం.. అంతర్జాతీయ కంపెనీలతో భేటీ కానున్న రాష్ట్ర బృందం
సాక్షి, హైదరాబాద్: స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరిగే వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సదస్సులో పాల్గొనేందుకు వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని ‘రైజింగ్ తెలంగాణ’బృందం సోమవారం ఉదయం ఆ దేశంలోని జ్యూరిక్ పట్టణానికి చేరుకుంది. జ్యురిక్ ఎయిర్‌పోర్టులో సీఎం బృందానికి ప్రవాస తెలంగాణ వాసులు స్వాగతం పలికారు. మరోవైపు దావోస్ సదస్సులో పాల్గొనేందుకు వెళ్లిన ఏపీ సీఎం చంద్రబాబు నేతృత్వంలోని బృందం కూడా జ్యురిక్ చేరుకుంది.
ఎయిర్‌పోర్టులోనే ఇద్దరు సీఎంలు చంద్రబాబు, రేవంత్‌రెడ్డి భేటీ అయ్యారు. రెండు రాష్ట్రాల్లో అభివృద్ధి కార్యక్రమాలు, వివిధ రంగాల్లో పెట్టుబడులకు సంబంధించిన అంశాలపై వారు చర్చించినట్టు సమాచారం. ఈ భేటీలో కేంద్ర మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు, ఏపీ మంత్రి నారా లోకేశ్, తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు తదితరులు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్, చంద్రబాబులతో ఇరు రాష్ట్రాలకు చెందిన ప్రతినిధి బృందాలు ఫొటోలు దిగాయి.
రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా..
రాష్ట్ర ప్రతినిధి బృందం జ్యూరిక్ నుంచి రైలులో దావోస్ నగరానికి చేరుకుని ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొంటుంది. భారత కాలమానం ప్రకారం సోమవారం రాత్రి ఈ సదస్సు ప్రారంభం కానుంది. ఇందులో పలువురు అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలు, దిగ్గజ కంపెనీల ప్రతినిధులతో సీఎం బృందం భేటీ కానుంది. అంతర్జాతీయ పెట్టుబడుల గమ్యస్థానంగా తెలంగాణను ప్రపంచానికి పరిచయం చేసేలా ప్రణాళికలను వెల్లడించనుంది. రాష్ట్రంలో పెట్టుబడులకు సంబంధించి కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకోనుంది.
Comments
Please login to add a commentAdd a comment