స్కై రూట్ కో ఫౌండర్ పవన్ కుమార్‌ను సత్కరిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి. చిత్రంలో మంత్రి శ్రీధర్‌బాబు, జయేశ్‌రంజన్
ప్రభుత్వంతో మేఘా ఇంజనీరింగ్ మూడు కీలక ఒప్పందాలు
2160 మెగావాట్ల పంప్‌డ్ స్టోరేజ్ ప్రాజెక్టు, వేయి మెగావాట్ల బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్, వెల్నెస్ రిసార్ట్ ఏర్పాటుకు అంగీకారం
‘స్కై రూట్’ పెట్టుబడులు 500 కోట్లు.. సీఎం రేవంత్ సమక్షంలో ఒప్పందం
రాకెట్ తయారీ,ఇంటిగ్రేషన్ టెస్టింగ్ యూనిట్ ఏర్పాటుకు సంసిద్ధత
రాష్ట్రంలో పెట్టుబడులకు యూనిలీవర్ ఆసక్తి
కామారెడ్డి జిల్లాలో పామాయిల్ తయారీ యూనిట్ ఏర్పాటుకు ఓకే
సాక్షి, హైదరాబాద్: మేఘా ఇంజనీరింగ్ ఇండస్ట్రీస్‌తో రాష్ట్ర ప్రభుత్వం కోట్లాది రూపాయల పెట్టుబడులు, వేలాది ఉద్యోగాల కల్పనకు సంబంధించి మూడు కీలక ఒప్పందాలు కుదుర్చుకుంది. దావోస్‌లో వరల్డ్ ఎకనమిక్ ఫోరంలో జరుగుతున్న సమావేశాల్లో ఈ ఒప్పందాలు కుదిరాయి. రూ.11 వేల కోట్లతో 2160 మెగావాట్ల పంప్‌డ్ స్టోరేజ్ ప్రాజెక్టును తెలంగాణలో మేఘా సంస్థ ఏర్పాటు చేయనుంది. తద్వారా నిర్మాణ దశలో వేయి, నిర్వహణ దశలో 250 ఉద్యోగాల కల్పన సాధ్యమవుతుంది. అలాగే, రాష్ట్రవ్యాప్తంగా బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ వ్యవస్థకు సంబంధించిన ప్రాజెక్టులనూ ఈ సంస్థ స్థాపిస్తుంది.
తద్వారా పునరుత్పాదక ఇంధనం, సుస్థిర అభివృద్ధిలో రాష్ట్రం అగ్రస్థానం చేరేందుకు తోడ్పడుతుంది. ఒప్పందంలో భాగంగా వ్యూహాత్మక ప్రదేశాల్లో రూ.3 వేల కోట్లతో వేయి మెగావాట్ల బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ వ్యవస్థను స్థాపిస్తుంది. తద్వారా వచ్చే రెండేళ్లలో ప్రత్యక్షంగా వేయి, పరోక్షంగా మూడు వేల మందికి ఉద్యోగాలు లభిస్తాయి. ప్రాంతీయ ఆర్థిక అభివృద్ధికి బాటలు వేసేలా వికారాబాద్ జిల్లా అనంతగిరిలో ప్రపంచస్థాయి ప్రమాణాలతో రూ.వేయికోట్లతో వెల్నెస్ రిసార్ట్‌ను మేఘా సంస్థ నెలకొల్పుతుంది.
తద్వారా నిర్మాణ దశలో 2వేల మందికి ఉద్యోగాలు లభిస్తాయి. వరల్డ్ ఎకనమిక్ ఫోరం సమావేశాల్లో భాగంగా రెండోరోజు మంగళవారం సీఎం రేవంత్‌రెడ్డి సారథ్యంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం వివిధ కంపెనీల ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలతో సమావేశమైంది. మేఘాతో ఒప్పందాలపై మంత్రి శ్రీధర్ బాబు హర్షం వ్యక్తంచేశారు.
‘స్కై రూట్’ పెట్టుబడులు రూ.500 కోట్లు
హైదరాబాద్‌ను త్వరలోనే ప్రైవేటు రంగంలో అంతరిక్ష కార్యకలాపాలకు కేంద్ర బిందువుగా అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. తెలంగాణలో ప్రైవేటు రంగంలో రూ.500 కోట్లతో రాకెట్ తయారీ, ఇంటిగ్రేషన్ టెస్టింగ్ యూనిట్ ఏర్పాటుకు స్కై రూట్ కంపెనీ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. దావోస్‌లో ఈమేరకు సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి శ్రీధర్‌బాబు సమక్షంలో కంపెనీ ప్రతినిధులు అవగాహన ఒప్పందం (ఎంఓయూ)పై సంతకాలు చేశారు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ ఒప్పందం పట్ల హర్షం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌కు చెందిన సంస్థ ఆధునిక సాంకేతిక రంగంలో విజయం సాధించటం గర్వంగా ఉందన్నారు. తెలంగాణకు చెందిన యువకులు ప్రపంచంలోనే అద్భుతమైన ప్రతిభను ప్రదర్శించడంతోపాటు, రాష్ట్రంలో పెట్టుబడులకు ముందుకు రావడాన్ని అభినందించారు.
స్కైరూట్ కంపెనీతో ఒప్పందం చేసుకోవడం అంతరిక్ష రంగంపై తమ వ్యూహాత్మక దృష్టిని చాటిచెబుతుందని సీఎం అన్నారు. తెలంగాణ, హైదరాబాద్ రైజింగ్ లక్ష్యసాధనలో తాము భాగస్వామ్యం వహిస్తామని స్కై రూట్ కో ఫౌండర్ పవన్ కుమార్ చందన అన్నారు.
యూనీలివర్‌తో ఒప్పందం
దావోస్ పర్యటనలో భాగంగా దిగ్గజ కంపెనీ యూనిలీవర్ సంస్థ సీఈఓ హీన్ షూమేకర్, చీఫ్ సప్లై ఆఫీసర్ విల్లెమ్ ఉయిజెన్‌తో సీఎం రేవంత్‌రెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి డి.శ్రీధర్‌బాబు బృందం చర్చలు జరిపింది. ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్, సీఎంఓ ప్రధాన కార్యదర్శి వి.శేషాద్రి, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి, ఇన్వెస్ట్‌మెంట్స్ ప్రమోషన్ ప్రత్యేక కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి చర్చల్లో పాల్గొన్నారు.
తెలంగాణలో వ్యాపారం, పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వినియోగ వస్తువుల తయారీలో ప్రపంచంలోనే పేరొందిన యూనీలివర్ బృందానికి రేవంత్ వివరించారు. తెలంగాణలో వినియోగ వస్తువులకు భారీ మార్కెట్ ఉందని, తమ ప్రభుత్వం అనుసరిస్తున్న సులభతర వాణిజ్య విధానాలు వ్యాపారాలకు అనువుగా ఉంటాయన్నారు. చర్చలు ఫలప్రదం కావడంతో తెలంగాణలో పెట్టుబడులకు యూనిలీవర్ సంసిద్ధత వ్యక్తం చేసింది.
ఈ ఒప్పందంలో భాగంగా కామారెడ్డి జిల్లాలో పామాయిల్ తయారీ యూనిట్‌తోపాటు రాష్ట్రంలో బాటిల్ క్యాప్‌ల తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేస్తామని కంపెనీ ప్రకటించింది. ఈ యూనిట్ ఏర్పాటుతో ఇతర ప్రాంతాల నుంచి బాటిల్ క్యాప్‌ల దిగుమతి చేసుకుంటుండగా ఇకపై స్థానికంగా తయారవుతాయి. కాగా, కామారెడ్డిలో అవసరమైన భూమిని కేటాయిస్తామని సీఎం హామీ ఇచ్చారు.
వివిధ సంస్థలతో సంప్రదింపులు
కాలిఫోర్నియాలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ హార్డ్‌వేర్, ఏఐ సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్‌లో పేరొందిన ‘సాంబనోవా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీ’చీఫ్ గ్రోత్ ఆఫీసర్ సూలేతో ఐటీ, పరిశ్రమల మంత్రి శ్రీధర్‌బాబు బృందం చర్చించింది. తెలంగాణలో సెమీకండక్టర్ పరిశ్రమల్లో పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై వివరించింది.
వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ తెలంగాణ పెవిలియన్‌లో జరిగిన సమావేశంలో శ్రీధర్ బాబు లాజిస్టిక్స్ కంపెనీల్లో పేరొందిన ఎజిలిటీ సంస్థ చైర్మన్ తారెక్ సుల్తాన్‌ను కలిశారు. వ్యవసాయ రంగం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించటంతో పాటు రైతుల ఆదాయాన్ని స్థిరంగా పెంచేందుకు తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతలను మంత్రి శ్రీధర్ బాబు వివరించారు.
ఇండస్ట్రీస్ ఇన్ ఇంటెలిజెంట్ ఏజ్
దావోస్ వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సమావేశాలు ‘ఇండస్ట్రీస్ ఇన్ ఇంటెలిజెంట్ ఏజ్’అనే థీమ్‌తో ప్రారంభమయ్యాయి. శాస్త్ర సాంకేతిక అధునాతన పరిజ్ఞానానికి అనుగుణంగా పారిశ్రామిక వ్యూహాల మార్పు, పెరుగుతున్న ఇంధన అవసరాలు సమకూర్చుకోవాలనే ఇతివృత్తంతో రౌండ్ టేబుల్ సమావేశాలు, సెమినార్లు నిర్వహిస్తున్నారు.
వివిధ దేశాలు, రాష్ట్రాల ప్రతినిధులతోపాటు ఆయా రంగాలకు చెందిన నిపుణులు, పారిశ్రామికవేత్తలు దాదాపు మూడు వేలమంది ఈ సదస్సులో పాల్గొంటున్నారు. దావోస్ పర్యటనలో భాగంగా అమెజాన్, సిఫీ టెక్నాలజీస్ కంపెనీల ప్రతినిధులతో రాష్ట్ర బృందం చర్చలు జరపనుంది. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) సారథ్యంలో వివిధ కంపెనీ ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలతో సీఎం రేవంత్ భేటీ అవుతారు.
Comments
Please login to add a commentAdd a comment