Megha Engineering and Infrastructures
-
మంగోలియాలో మేఘా భారీ ప్రాజెక్ట్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మేఘా ఇంజనీరింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ (ఎంఈఐఎల్) తాజాగా మంగోలియాలో మరో భారీ ప్రాజెక్టును చేజిక్కించుకుంది. ఇందులో భాగంగా అత్యాధునిక ముడిచమురు శుద్ధి కేంద్రాన్ని నిర్మించనుంది. డీల్ విలువ సుమారు రూ. 5,400 కోట్లు. ప్రాజెక్టు పూర్తయితే ఏటా 15 లక్షల టన్నుల ముడిచమురు ఉత్పత్తి చేయనుందని కంపెనీ ప్రకటించింది. మేఘా ఇంజనీరింగ్ ఇప్పటికే మంగోలియాలో రూ.6,500 కోట్ల విలువైన రెండు ప్రాజెక్టులను చేపట్టింది. మంగోలియా రాజధాని ఉలాన్బటోర్లో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో ఎంఈఐఎల్, మంగోల్ రిఫైనరీ స్టేట్ ఓన్డ్ ఎల్ఎల్సీ మధ్య ఒప్పందం జరిగింది. మంగోలియాలో తొలి గ్రీన్ ఫీల్డ్ క్రూడ్ రిఫైనరీ నిర్మాణంలో భాగస్వా మ్యం అయినందుకు గర్వంగా ఉందని ఎంఈఐఎల్ ఎండీ పి.వి.కృష్ణారెడ్డి తెలిపారు. -
ఒలెక్ట్రాకు రూ.10,000 కోట్ల ఆర్డర్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మేఘా ఇంజనీరింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అనుబంధ కంపెనీలైన ఒలెక్ట్రా గ్రీన్‌టెక్, ఈవీ ట్రాన్స్‌ల కన్సార్షియం భారీ ఆర్డర్‌ను చేజిక్కించుకుంది. ఇందులో భాగంగా మహారాష్ట్ర స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్‌కు (ఎంఎస్ఆర్టీసీ) 5,150 ఎలక్ట్రిక్ బస్‌లను 24 నెలల్లో సరఫరా చేయాల్సి ఉంటుంది. డీల్ విలువ సుమారు రూ.10,000 కోట్లు అని ఒలెక్ట్రా శుక్రవారం ప్రకటించింది. ఒలెక్ట్రా నుంచి ఈ ఎలక్ట్రిక్ బస్‌లను ఈవీ ట్రాన్స్ కొనుగోలు చేసి ఎంఎస్ఆర్టీసీకి అందిస్తుంది. కాగా, భారీ ఆర్డర్ నేపథ్యంలో ఒలెక్ట్రా షేరు ధర క్రితం ముగింపుతో పోలిస్తే బీఎస్ఈలో శుక్రవారం 18.02% ఎగసి రూ.1,231.35 వద్ద స్థిరపడింది. -
ఇక ఒలెక్ట్రా ఈ–టిప్పర్స్..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మేఘా ఇంజినీరింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అనుబంధ కంపెనీ ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ భారత్‌లో తొలిసారిగా తయారు చేసిన 6్ఠ4 హెవీ డ్యూటీ ఎలక్ట్రిక్ టిప్పర్స్కు హోమోలోగేషన్ ధ్రువీకరణ లభించింది. ఆటోమోటివ్ రీసర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా నుంచి ఈ సర్టిఫికెట్ సాధించింది. రహదారులకు టిప్పర్ అనువైనదో లేదో తెలుసుకునేందుకు పర్వత ప్రాంతాలు, ఎత్తయిన ప్రదేశాలు, మైనింగ్, క్వారీల్లో పరీక్షలు చేసి ధ్రువీకరణ పత్రం జారీ చేస్తారు. దేశంలోనే మొట్టమొదటి సర్టిఫైడ్ హెవీ డ్యూటీ ఈ–టిప్పర్గా ఇది నిలిచిందని ఒలెక్ట్రా సీఎండీ కె.వి.ప్రదీప్ తెలిపారు. 20 ఈ–టిప్పర్ల సరఫరాకై ఒక సంస్థతో చర్చలు తుది దశలో ఉన్నాయని చెప్పారు. వివిధ వేరియంట్లలో ఈ వాహనాన్ని విడుదల చేస్తామన్నారు. నిర్మాణం, మౌలిక సదుపాయాలు, మైనింగ్, క్వారీ రంగాల్లో ఇది గణనీయమైన మార్పును తేనుందని వివరించారు. -
పెండింగ్ డీల్స్‌కు మోక్షం.. ఆరు ఒప్పందాలకు సీసీఐ ఆమోదం
న్యూఢిల్లీ: దాదాపు మూడు నెలల విరామం తర్వాత కాంపిటీషన్ కమిషన్ (సీసీఐ) విలీనాలు, కొనుగోలు ఒప్పందాలను పరిశీలించడం ప్రారంభించింది. ఈ క్రమంలో ఆరు డీల్స్‌కు ఆమోదం తెలిపింది. కీమెడ్‌లో 20 శాతం వాటాను ప్రైమ్ టైమా లాజిస్టిక్స్ టెక్నాలజీస్ ద్వారా అపోలో హాస్పిటల్స్ వైస్ చైర్పర్సన్ శోభనా కామినేని కొనుగోలు చేస్తుండటం, లాంకో అన్పారా పవర్ (ఎల్ఏపీఎల్)ను మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రా (ఎంఈఐఎల్) కొనుగోలు చేయడానికి సంబంధించిన ఒప్పందాలు వీటిలో ఉన్నాయి. కీమెడ్ ప్రధానంగా ఔషధాల హోల్‌సేల్ విక్రయం, పంపిణీ వ్యాపారం చేస్తోంది. అటు హంట్స్మాన్ ఇంటర్నేషనల్‌ను ఆర్చ్‌రోమా ఆపరేషన్స్ కొనుగోలు చేయడం, హీరో ఫ్యూచర్ ఎనర్జీస్ గ్లోబల్‌లో ప్రైవేట్ ఈక్విటీ సంస్థ కేకేఆర్ వాటాలు దక్కించుకోవడం, హిందుస్తాన్ పోర్ట్స్‌లో నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ (ఎన్ఐఐఎఫ్) వాటాలు తీసుకోవడానికి సంబంధించిన ఒప్పందాలు కూడా ఉన్నాయి. దీనితో నవంబర్ 3 వరకు పెండింగ్‌లో ఉన్న డీల్స్‌ను సీసీఐ క్లియర్ చేసినట్లయింది. సాధారణంగా నిర్దిష్ట పరిమితి దాటిన ఒప్పందాలకు సీసీఐ ఆమోదముద్ర అవసరమవుతుంది. అయితే, 2022 అక్టోబర్ 25న చైర్పర్సన్ అశోక్ కుమార్ గుప్తా రిటైరైన తర్వాత కోరం లేకపోవడంతో సీసీఐ విలీన, కొనుగోలు డీల్స్ పరిశీలన చేపట్టలేదు. ఫలితంగా పలు డీల్స్ పెండింగ్‌లో పడిపోయిన నేపథ్యంలో కేంద్రం నిర్దిష్ట నిబంధనను అమల్లోకి తేవడంతో పరిశీలన మళ్లీ మొదలైంది. -
‘మేఘా’కు మంగోలియా ప్రాజెక్ట్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీ మౌలిక సదుపాయాల దిగ్గజం మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (ఎంఈఐఎల్) తాజాగా మంగోలియా మార్కెట్లో అడుగుపెట్టింది. దేశీయంగా తొలి గ్రీన్‌ఫీల్డ్ ఆయిల్ రిఫైనరీని నిర్మించే భారీ కాంట్రాక్టును దక్కించుకుంది. దీని విలువ 790 మిలియన్ డాలర్లు. మంగోల్ రిఫైనరీ ప్రాజెక్టుకు సంబంధించి ఎల్వోఏ (లెటర్ ఆఫ్ ఆఫర్ అండ్ యాక్సెప్టెన్సీ)ను అందుకున్నట్లు ఎంఈఐఎల్ తెలిపింది. ఇంజినీరింగ్, ప్రొక్యూర్మెంట్, కన్స్ట్రక్షన్ (ఈపీసీ) ప్రాతిపదికన ఈ కాంట్రాక్టు కింద ఓపెన్ ఆర్ట్ యూనిట్లు, యుటిలిటీలు, ప్లాంటు భవంతులు, క్యాప్టివ్ పవర్ ప్లాంట్లు మొదలైనవి నిర్మించాల్సి ఉంటుందని వివరించింది. ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత ఈ రిఫైనరీలో రోజుకు 30,000 బ్యారెల్స్, ఏడాదికి 1.5 మిలియన్ టన్నుల ముడి చమురును ప్రాసెస్ చేయవచ్చు. కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ (ఎంఈఏ) తలపెట్టిన భాగస్వామ్య అభివృద్ధి ప్రయత్నాల్లో భాగంగా, భారత ప్రభుత్వ ఆర్థిక సహాయ సహకారాలతో మంగోలియా ఈ ప్రాజెక్టును నిర్మించనుంది. దీనికి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఇంజినీర్స్ ఇండియా (ఈఐఎల్) ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కన్సల్టెంట్‌గా వ్యవహరించనుంది. ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత మెరుగుపడేందుకు, హైడ్రోకార్బన్స్ రంగంలో తమ వ్యాపార విస్తరణ వ్యూహాలకు ఈ ప్రాజెక్టు కీలకంగా ఉండగలదని కంపెనీ తెలిపింది. దీనితో రష్యన్ ఇంధనంపై మంగోలియా ఆధారపడటం తగ్గుతుందని, అలాగే తమ పెట్రోలియం ఉత్పత్తుల అవసరాలను స్వయంగా తీర్చుకునేందుకు ఇది దోహదపడుతుందని పేర్కొంది. స్థానికంగా చిన్న పరిశ్రమలు, ప్రజల ఉపాధి అవకాశాల వృద్ధికి ఈ ప్రాజెక్టు తోడ్పడనుంది. -
హైదరాబాద్: మేఘా గ్యాస్ ఇక ఎంసీజీడీపిఎల్
-
మేఘా గ్యాస్ ఇక ఎంసీజీడీపిఎల్
హైదరాబాద్: మేఘా ఇంజనీరింగ్ & ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (MEIL) అనుబంధ సంస్థ మేఘా గ్యాస్ పేరు మేఘా సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ (MCGDPL)గా మారింది. దేశంలో వివిధ నగరాల్లో సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ (CGD)ని మేఘా గ్యాస్ ఇప్పటివరకు నిర్వహిస్తోంది. ఇక నుంచి మేఘా గ్యాస్ బదులు ఎంసీజీడీపిఎల్ కంపెనీ ఇక నుంచి అన్ని రకాల అనుమతులున్న అధీకృత సంస్థగా సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ ను చేపడుతుంది. ఇప్పటి వరకు మేఘా గ్రూప్ లో ఒక విభాగంగా ఉన్న మేఘా గ్యాస్‌కున్న అనుమతులన్నింటినీ ఎంసీజీడీపిఎల్ కి బదిలీ చేయాలంటూ ఎంఈఐఎల్ చేసిన అభ్యర్థనను పెట్రోలియం మరియు సహజ వాయువు నియంత్రణ మండలి (PNGRB) ఆమోదించింది. ఇక నుంచి మేఘా గ్యాస్ కు ఉన్న అన్ని కార్యకలాపాలు, పరిపాలనా విధులతో సహా అన్ని వ్యవహారాలు ఎంసీజీడీపిఎల్ కిందకు వస్తాయి. దేశంలోని 10 రాష్ట్రాలు, 62 జిల్లాల్లోని 22 భౌగోళిక ప్రాంతాలలో కంపెనీ సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్‌ను ఎంసీజీడీపిఎల్ ఇక నుంచి అమలు చేస్తోంది. మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఒడిశా, రాజస్థాన్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ కార్యకలాపాలను మేఘా గ్యాస్ ఇప్పటికే చేపట్టింది. ఇక నుంచి ఎంసీజీడీపిఎల్ వీటిని చేపడుతుంది. ఇప్పటికే 2000 కి.మీ మేర MDPE లైన్ మరియు 500 కి.మీ పైగా స్టీల్ పైప్లైన్లను వివిధ ప్రాంతాలలో మేఘా గ్యాస్ ఏర్పాటు చేసింది. ప్రస్తుతం 60కి పైగా సీఎన్జీ స్టేషన్లను దేశంలోని వివిధ ప్రాంతాల్లో కంపెనీ నిర్వహిస్తోంది. 80 వేలకు పైగా గృహాలకు పైపుల ద్వారా నేచురల్ గ్యాస్‌ను అందిస్తున్నది. సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ కోసం కంపెనీ ఇప్పటికే రూ.1,000 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టింది. మరో రూ.10,000 కోట్లను వచ్చే ఐదేండ్లలో పెట్టుబడి పెట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. -
మేఘాకు 12 ‘సిటీ గ్యాస్’ ఏరియాలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సిటీ గ్యాస్ పంపిణీ (సీజీడీ) ప్రాజెక్టు 11వ రౌండు బిడ్డింగ్‌లో ఇన్ఫ్రా దిగ్గజం మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ (ఎంఈఐఎల్) 12 జాగ్రఫికల్ ఏరియాలను (జీఏ)దక్కించుకుంది. వీటిలో తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర, ఒరిస్సా రాష్ట్రాల్లోని ఏరియాలు ఉన్నాయి. పెట్రోలియం, నేచురల్ గ్యాస్ నియంత్రణ బోర్డు (పీఎన్జీఆర్బీ) శుక్రవారం ఈ వివరాలు వెల్లడించింది. మొత్తం 65 జీఏలకు బిడ్స్ ఆహ్వానించగా 61 ఏరియాలకు బిడ్స్ వచ్చాయి. వీటిలో 52 ఏరియాల ఫలితాలను ప్రకటించారు. ఎన్నికల కారణంగా 9 ప్రాంతాల ఫలితాలను ప్రకటించలేదు. వీటిల్లోనూ మరికొన్నింటిని ఎంఈఐఎల్ దక్కించుకునే అవకాశం ఉంది. తెలంగాణా విషయానికొస్తే జోగులాంబ గద్వాల్, నాగర్ కర్నూల్, మహబూబ్‌నగర్, నారాయణపేట, వనపర్తిలో సీజీడీ ప్రాజెక్టులో భాగంగా సిటీ గేట్ స్టేషన్, గ్యాస్ సప్లై పైప్లైన్లు.. సిఎన్జీ స్టేషన్లను నిర్మించి, ఇంటింటికీ గ్యాస్ సరఫరా చేయాల్సి ఉంటుంది. ఇంటింటికీ గ్యాస్ సరఫరాకు సంబంధించి నల్గొండతో పాటు రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్ తదితర ప్రాంతాల్లో ఇప్పటికే పైప్‌లైన్ నిర్మించడంతో పాటు 32 సీఎన్జీ స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నట్లు ఎంఈఐఎల్ పేర్కొంది. అటు ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లాతో పాటు కర్ణాటకలో తుముకూరు, బెల్గావి జిల్లాల్లో మేఘా గ్యాస్ పేరిట గృహ, పారిశ్రామిక అవసరాలకు కావాల్సిన గ్యాస్‌తో పాటు వాహనాలకు సీఎన్జీని కూడా అందిస్తున్నట్లు వివరించింది. -
మంచుకొండల్లో అద్భుత నిర్మాణం! ఎంఈఐఎస్ అరుదైన రికార్డు
హైదరాబాద్: మౌలిక రంగ నిర్మాణ దిగ్గజం మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (ఎంఈఐఎల్) అరుదైన మైలురాయిని చేరుకుంది. 18 కిలోమీటర్ల పొడవైన జొజిలా టన్నెల్స్ మార్గంలో 5 కిలోమీటర్ల మేర సొరంగ నిర్మాణ పనులను పూర్తి చేసింది. రికార్డు స్థాయిలో 14 నెలల్లోనే దీన్ని సాధించినట్టు ఎంఈఐఎల్ ప్రకటించింది. జాతీయ రహదారులు, మౌలిక సదుపాయాల అభివృద్ధి కార్పొరేషన్ (ఎన్హెచ్ఐడీసీఎల్) నుంచి ఈ ప్రాజెక్టును ఎంఈఐఎల్ సొంతం చేసుకోవడం గమనార్హం. ఆసియాలోనే అతిపెద్ద టన్నెల్ మార్గం అయిన ఇది పూర్తయితే, శ్రీనగర్–లద్దాక్ మధ్య ఏడాది పొడవునా ఎలాంటి అవాంతరాల్లేకుండా రవాణాకు వీలు కలుగుతుంది. జొజిలా టన్నెల్స్ పరిధిలో నీల్‌గ్రార్ 1, 2, జోజిలా ప్రధాన సొరంగం నిర్మాణాన్ని అననుకూల వాతావరణ పరిస్థితుల్లోనూ వేగంగా అమలు చేస్తున్నట్టు ఎంఈఐఎల్ తెలిపింది. ఇందులో నీల్ గ్రార్ టన్నెల్ 1లో 915 మీటర్లకు గాను మొత్తం పని పూర్తయింది. నీల్ గ్రార్ టన్నెల్ 2 లో 3907 మీటర్లకు గాను 2573 మీటర్ల పని పూర్తయింది. ఇక, జోజిలా ప్రధాన టన్నెల్ లో 13145 మీటర్లకు గాను 1523 మీటర్ల పని పూర్తయింది. మొత్తం 18 కిలోమీటర్ల టన్నెల్ పనులకు 5 కిలోమీటర్ల టన్నెల్ పనులను అతి స్వల్ప వ్యవధిలోనే మేఘా ఇంజనీరింగ్ సంస్థ పూర్తి చేయటం విశేషం. -
స్టాక్ మార్కెట్లో తెలుగు కంపెనీ సత్తా.. ఇన్వెస్టర్ల ఇంట లాభాల పంట
Multibagger Olectra Greentech: స్టాక్ మార్కెట్ అంటేనే ఉత్తరాది పెత్తనం. అందులోనూ గుజరాతీల హవానే ఎక్కువ. ప్రధాన స్టాక్‌మార్కెట్ ముంబైలో ఉండటంతో మహరాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్‌కి చెందిన వారి మాటే అక్కడ ఎక్కువగా చెల్లుబాటు అవుతోంది. కానీ వారందరిని తలదన్నెలా లాభాల పంట పండిస్తూ అందరీ దృష్టిని ఆకర్షిస్తోంది తెలుగు వ్యక్తులు స్థాపించిన ఒలెక్ట్రా కంపెనీ. కేవలం ఏడాది వ్యవధిలోనే రూపాయికి పది రూపాయల లాభం చూపించి మల్టీ బ్యాగర్‌గా గుర్తింపు పొందింది. ఎలక్ట్రిక్ బస్సుల తయారీ సంస్థ ఓలెక్ట్రా గ్రీన్‌టెక్ కంపెనీ షేర్లు స్టాక్ మార్కెట్లో సంచలనం సృష్టిస్తున్నాయి. నేషనల్ స్టాక్ ఎక్సేంజీలో స్మాల్‌క్యాప్ కెటగిరిలో ఉన్న ఈ కంపెనీ షేర్లు ఏడాది కాలంగా ఇన్వెస్టర్లకు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. గతేడాది 2020 నవంబరు 9న ఈ కంపెనీ ఒక్క షేరు విలువ రూ.59.55 దగ్గర ట్రేడ్ అయ్యింది. సరిగ్గా ఏడాది తిరిగే సరికి 2021 నవంబరు 9 మధ్యాహ్నం 2:30 గంటల సమయానికి ఈ కంపెనీ ఒక్క షేరు విలువ ఏకంగా రూ.649.90 దగ్గర ట్రేడ్ అవుతోంది. అంటే ఏడాది కాలంలో ఏకంగా 991 శాతం షేరు విలువ పెరిగింది. నికరంగా ఒక్కో షేరు ధర రూ.590 పెరిగింది. కోటికి పది కోట్ల రూపాయలు ఏడాది కిందట లక్ష రూపాయలు ఈ కంపెనీ షేర్లలో పెట్టుబడి పెట్టిన వారికి కేవలం ఏడాది వ్యవధిలోనే సుమారు పది లక్షల రూపాయల వరకు లాభం వచ్చినట్టయ్యింది. కోటి రూపాయలు పెట్టుబడి పెట్టిన వారికి పది కోట్ల రూపాయలను అందించింది. ఈ సీజన్లో మల్టీబ్యాగర్ షేర్లలో ఒకటిగా ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ నిలిచింది. కొత్తగా షేర్ మార్కెట్లోకి వచ్చిన వారికి స్టాక్ మార్కెట్లో లాభాల రుచిని చూపించింది. ప్రభుత్వ ప్రోత్సహకాలు వాతావరణ కాలుష్యం తగ్గించాలనే నినాదం ఎప్పటి నుంచో వినిపిస్తున్నా ఆచరణలో పెట్టింది తక్కువ. కానీ కరోనా సంక్షోభం తర్వాత పరిస్థితిలో మార్పు వచ్చింది. వాయు కాలుష్యం తగ్గించే లక్ష్యంతో ఎలక్ట్రిక్ వెహికల్స్ వాడకానికి ప్రభుత్వం దన్నుగా నిలుస్తోంది. ఫేమ్ 1, ఫేమ్ 2 పేరుతో ఈవీలకు ప్రోత్సహకాలు అందిస్తోంది. దీంతో ఈవీలకు ఒక్కసారిగా సానుకూల వాతావరణం ఏర్పడింది. ఎలక్ట్రిక్ బస్సుల తయారీలో ఒలెక్ట్రా ఉండటం ఈ కంపెనీ షేర్లకు వరంలా మారింది. పెట్రోలు ధరలు ప్రభుత్వ విధానాలు సానుకూలంగా ఉండటానికి తోడు చమురు ధరలు సైతం ఒలెక్ట్రా వృద్ధికి పరోక్షంగా సాయం అందించాయి. గత ఏడాది కాలంగా పెట్రోలు, డీజిలు ధరలు అడ్డు అదుపు లేకుండా పెరుగుతుంటంతో సామాన్యులు సైతం పెట్రోలు, డీజిల్‌కి ప్రత్యామ్నాయం ఏంటని ఆలోచించే పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో ఈవీ రంగంలో రోజుకో స్టార్టప్ వెలుగులోకి వస్తుంది. ఈవీ రంగంలో స్టార్టప్‌లకే పరిస్థితే ఎంతో ఆశజనకంగా ఉండగా.. 1992 నుంచి మార్కెట్లో ఉన్న ఒలెక్ట్రాకు అది మరింతగా లాభించింది. అందువల్లే ఇన్వెస్టర్లు ఒలెక్ట్రాపై నమ్మకం చూపించారు. ఏడాది కాలంగా షేరు వ్యాల్యూ పెరుగుతున్నా పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వస్తూనే ఉన్నారు. హైదరాబాద్ కేంద్రంగా హైడ్రోమెకానిక్స్ విభాగంలో ప్రపంచ వ్యాప్తంగా అనే భారీ ప్రాజెక్టులు చేపడుతోంది మేఘా ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్. తెలుగు వారు స్థాపించిన మేఘా సంస్థ సబ్సిడరీలో ఒకటి ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ కంపెనీ. హైదరాబాద్ కేంద్రంగా 1992లో ఈ సంస్థను స్థాపించారు. పాలిమర్ ఇన్సులేలర్లు, ఎలక్ట్రిక్ బస్సులను ఈ కంపెనీ తయారు చేస్తోంది. మార్కెట్లో చాలా కాలంగా ఉన్నప్పటికీ.. ఇటీవల ఈవీల వాడకం పెరగడంతో ఒక్కసారిగా ఒలెక్ట్రా లైమ్‌లైట్‌లోకి వచ్చింది. స్టాక్ మార్కెట్లో ఇప్పటి వరకు దక్షిణాదికి చెందిన ఐటీ, ఫార్మా కంపెనీలే హవా కొనసాగించగా ఇప్పుడు మాన్యుఫ్యాక్చరింగ్ విభాగం నుంచి ఒలెక్ట్రా సంచలనం సృష్టిస్తోంది. చదవండి: ఏపీఎస్ఆర్టీసీ నుంచి ఒలెక్ట్రాకు 100 బస్సుల ఆర్డర్ -
‘మేఘా’ వితరణ
మంగళగిరి: గుంటూరు జిల్లా చినకాకానిలోని ఎన్నారై ఆసుపత్రికి మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (ఎంఈఐఎల్) సంస్థ రెండు అంబులెన్స్‌లను వితరణగా అందజేసింది. ఎంఈఐఎల్ సంస్థ డైరెక్టర్ పి.సుధారెడ్డి బుధవారం అంబులెన్స్‌ల తాళాలను ఎన్నారై అకాడమీ ఆఫ్ సైన్సెస్ అధ్యక్షుడు డాక్టర్ ఎం.నరసరాజు, ప్రిన్సిపల్ లక్ష్మిలకు అందజేశారు. ఈ సందర్భంగా సుధారెడ్డి మాట్లాడుతూ.. మేఘా సంస్థ దేశ నిర్మాణంలో భాగస్వామ్యం కావడంతోపాటు పలు సేవా కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. ఇందులో భాగంగా హైదరాబాద్‌లోని నిమ్స్‌లో క్యాన్సర్ రోగుల కోసం ప్రత్యేకంగా వార్డు నిర్మించామని, పలు ఆసుపత్రులకు అవసరమైన అంబులెన్సులను అందించటంతో పాటు గ్రామాల్లో అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని తెలిపారు. ఎంఈఐఎల్ ప్రతినిధి కొమ్మారెడ్డి బాపిరెడ్డి మాట్లాడుతూ.. ఎన్నారై ఆసుపత్రికి తమ సంస్థ అందజేసిన అంబులెన్స్‌లలో ఐసీయూకు అవసరమైన సౌకర్యం కల్పించామన్నారు. కార్యక్రమంలో ఎన్నారై ఆస్పత్రి సీఈవో వెంకట ఫణిదర్, ఎన్నారై అకాడమీ ఆఫ్ సైన్సెస్ కోశాధికారి టీసీ చౌదరి తదితరులు పాల్గొన్నారు. -
Yadadri Temple: ‘మేఘా’ 6 కిలోల బంగారం
సాక్షి, హైదరాబాద్/యాదాద్రి: యాదాద్రి దేవాలయం విమాన గోపురానికి బంగారు తాపడం చేసేందుకు బంగారాన్ని విరాళంగా ఇవ్వాలంటూ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చేసిన విజ్ఞప్తికి మంచి స్పందన లభిస్తోంది. రెండ్రోజుల వ్యవధిలోనే పలువురు ప్రముఖులు సుమారు 32 కిలోల బంగారాన్ని విరాళంగా ప్రకటించారు. మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థ తరఫున ఆరు కిలోల బంగారం విరాళంగా ఇస్తున్నట్లు సంస్థ డైరెక్టర్ బి.శ్రీనివాస్‌రెడ్డి బుధవారం తెలిపారు. ఆరు కేజీల బంగారం లేదా సమానమైన మొత్తాన్ని చెక్కు రూపంలో త్వరలో అందజేస్తామని ప్రకటించారు. ప్రతిష్టాత్మక పుణ్యస్థలమైన యాదాద్రి.. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచల మేరకు మరింత అందంగా రూపుదిద్దుకుని, దేశంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రంగా మారుతుందని ఆయన ఆకాంక్షించారు. ఇలావుండగా సీఎం కేసీఆర్ స్ఫూర్తితో యాదాద్రి విమాన గోపురం స్వర్ణ తాపడం కోసం రెండు కిలోల బంగారాన్ని విరాళంగా ఇస్తున్నట్టు ప్రణీత్ గ్రూప్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ నరేంద్ర కుమార్ కామరాజు తెలిపారు. అలాగే కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఎండీ కామిడి నర్సింహారెడ్డి సంస్థ తరఫున 2 కిలోల బంగారాన్ని, ప్రముఖ వ్యాపారవేత్త ఎన్వీ రామరాజు తమ సంస్థ (జలవిహార్) తరఫున కిలో బంగారాన్ని విరాళంగా ప్రకటించారు. విరాళాల కోసం బ్యాంక్ ఖాతా స్వర్ణ తాపడానికి భక్తులు విరాళాలు సమర్పించడానికి బ్యాంక్ అకౌంట్ నంబర్‌ను దేవస్థానం ఏర్పాటు చేసింది. ఇందుకోసం ఇండియన్ బ్యాంక్ యాదగిరిగుట్ట శాఖలో ఖాతా తెరిచారు. దాతలు అకౌంట్ నం. 6814884695, ఐఎఫ్ఎస్సీ కోడ్ ఐడీఐబీ000వై011కు నగదు జమ చేయాలని దేవస్థానం ఈఓ గీతారెడ్డి కోరారు. విరాళాలు పారదర్శకంగా ఉండేందుకు బ్యాంక్ ద్వారానే తీసుకోనున్నామని తెలిపారు. బంగారం విరాళంగా ఇస్తే స్వచ్ఛత విషయంలో తేడాలు ఉండే అవకాశం ఉన్నందున భక్తులు నగదు రూపంలో బ్యాంకులో జమచేయాలని సూచించారు. -
ఐపీవో యోచనలో మేఘా ఇంజనీరింగ్
శ్రీనగర్ నుంచి సాక్షి ప్రతినిధి ఎన్. పార్థసారథి: ఇన్ఫ్రా రంగ దిగ్గజం మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రా (ఎంఈఐఎల్) పబ్లిక్ ఇష్యూకి రావాలనే యోచనలో ఉంది. అలాగే మరిన్ని కొత్త టెక్నాలజీలను కూడా దేశీయంగా అందుబాటులోకి తేవడంపై దృష్టి పెడుతోంది. ఎంఈఐఎల్ ఎండీ పి.వి. కృష్ణారెడ్డి ఈ విషయాలు తెలిపారు. అయితే, ఎప్పట్లోగా ఐపీవోకి రానున్నది, ఎంత మేర నిధులు సమీకరించనున్నది ఆయన వెల్లడించలేదు. మరోవైపు, హైడ్రోజన్ సంబంధ టెక్నాలజీకి సంబంధించి ఒక ఇటాలియన్ సంస్థతో కలిసి పనిచేస్తున్నామని కృష్ణారెడ్డి చెప్పారు. ఇటీవలే అవగాహన ఒప్పందం కూడా కుదుర్చుకున్నామని వివరించారు. కొత్త తరహా సాంకేతికతలపై సుమారు రూ. 15–20 వేల కోట్ల దాకా ఇన్వెస్ట్ చేయాలని భావిస్తున్నట్లు ఆయన చెప్పారు. ‘మేము ఇప్పటికే ఎలక్ట్రిక్ బస్సులు, ఆటోల్లాంటివి తయారు చేస్తున్నాం. దేశవ్యాప్తంగా 1,000కి పైగా ఎలక్ట్రిక్ బస్సులు నిర్వహిస్తున్నాం. అలాగే ఆన్‌షోర్, ఆఫ్‌షోర్ రిగ్గుల తయారీ, ఎక్స్‌ప్రెస్ వేస్, విద్యుత్ పంపిణీ తదితర రంగాల్లో కార్యకలాపాలు సాగిస్తున్నాం‘ అని కృష్ణారెడ్డి వివరించారు. అటు ఆఫ్రికా, దక్షిణ అమెరికా తదితర ఖండాల్లో 18 పైగా దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్నామన్నారు. డిజిన్వెస్ట్‌మెంట్ సంస్థలపై ఆసక్తి.. కేంద్ర పభుత్వం పెట్టుబడుల ఉపసంహరణలో భాగంగా వాటాలు విక్రయిస్తున్న సంస్థలను దక్కించుకోవడంపై కసరత్తు చేస్తున్నట్లు కృష్ణారెడ్డి చెప్పారు. బీఈఎంఎల్, షిప్పింగ్ కార్పొరేషన్, నీలాచల్ ఇస్పాత్ వంటి సంస్థల విషయంలో అర్హత కూడా సాధించినట్లు ఆయన పేర్కొన్నారు. కొనుగోళ్లకు సంబంధించి అవసరాన్ని బట్టి ఏడాది, రెండేళ్ల వ్యవధిలో రూ. 15,000–20,000 కోట్ల దాకా నిధులు సమీకరించుకోవాలని భావిస్తున్నట్లు చెప్పా రు. విదేశాల నుంచి సమీకరించే నిధులను భారత్‌లోనే ఇన్వెస్ట్ చేస్తామని, విదేశాల్లో ఇన్వెస్ట్ చేసే యోచనేదీ తమకు లేదని కృష్ణారెడ్డి స్పష్టం చేశారు. డెడ్‌లైన్ కన్నా ముందే జోజిలా టన్నెల్ పూర్తి.. శ్రీనగర్–లేహ్ మధ్యలో నిర్మిస్తున్న వ్యూహాత్మక జోజిలా టన్నెల్ ప్రాజెక్టు పనులను నిర్దేశిత గడువు కన్నా ముందే పూర్తి చేస్తామని కృష్ణారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఈ ప్రాంతంలో వ్యూహాత్మక రహదారుల అభివృద్ధితో స్థానికంగా ఉపాధి కల్పనకు, పర్యాటక రంగానికి ఊతం లభించగలదని పేర్కొన్నారు. ఉత్తరాఖండ్ తదితర రాష్ట్రాల్లో టన్నెల్ ప్రాజెక్టుల అనుభవంతో, కాంపిటీటివ్‌గా బిడ్ చేసి జోజిలా ప్రాజెక్టు దక్కించుకున్నామని ఆయన వివరించారు. ప్రస్తుతం తమ సంస్థలో 35,000 మంది పైచిలుకు ఉద్యోగులు ఉన్నారని, వివిధ ప్రాజెక్టుల్లో మూడు లక్షల మంది దాకా పనిచేస్తున్నారని కృష్ణారెడ్డి వివరించారు. తమ ప్రాజెక్టుల అవసరాలకు సంబంధించి చిన్న, మధ్య తరహా సంస్థలతో కూడా కలిసి పనిచేస్తుండటం ద్వారా వాటికి కూడా తోడ్పాటు అందించేందుకు ప్రయత్నిస్తున్నామని కృష్ణారెడ్డి చెప్పారు. చదవండి: ఒలెక్ట్రాకు మరో 150 బస్‌ల ఆర్డర్ -
పోలవరం గ్యాప్-3 కాంక్రీట్ డ్యామ్ నిర్మాణం పూర్తి
-
పోలవరం గ్యాప్-3 కాంక్రీట్ డ్యామ్ నిర్మాణం పూర్తి
సాక్షి, అమరావతి: ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను ఒక్కోక్కటీ పూర్తి చేసుకుంటూ శరవేగంగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కొనసాగుతుంది. ఓవైపు వరదలు మరో వైపు కరోనా వంటి విపత్కర పరిస్దితులున్నా.. అనుకున్న లక్ష్యం సాధించే దిశగా పోలవరం ప్రాజెక్టు పనులు సాగుతున్నాయి. పోలవరం ప్రాజెక్టు పనుల్లో కీలకమైన గ్యాప్-3 నిర్మాణం పూర్తయ్యింది. ఈ క్రమంలో పోలవరం ప్రాజెక్ట్ సీఈ సుధాకర్ బాబు, ఎస్ఈ నరసింహమూర్తి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి గ్యాప్-3 కాంక్రీట్ పనులను పూర్తి చేశారు. పోలవరం ప్రాజెక్ట్‌లో కీలకమైన ఈ గ్యాప్-3 కాంక్రీట్ డ్యామ్ నిర్మాణాన్ని మేఘా ఇంజనీరింగ్ సంస్థ పూర్తి చేసింది. 153.50 మీ పొడవు, 53.320మీ ఎత్తు, 8.50 మీ వెడల్పుతో గ్యాప్-3 కాంక్రీట్ డ్యామ్ నిర్మాణం పూర్తయ్యింది. దీనికి గాను 23,000 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్‌ని వినియోగించినట్లు అధికారులు తెలిపారు. పోలవరం హెడ్ వర్క్స్‌లో 3 ఈసీఆర్ఎఫ్ డ్యాంలలో గ్యాప్-3 ఒకటి. గ్యాప్-1, గ్యాప్-2 ఈసీఆర్ఎఫ్లు రాక్ ఫిల్ డ్యామ్‌లు కాగా గ్యాప్-3 మాత్రం కాంక్రీట్ డ్యామ్. (చదవండి: పోలవరం పనులపై ప్రాజెక్ట్ అథారిటీ సంతృప్తి) గ్యాప్-3 కాంక్రీట్ డ్యామ్ నిర్మాణ పూర్తి సందర్భంగా నిర్వహించిన పూజాకార్యక్రమంలో ఇరిగేషన్ అడ్వైజర్ గిరిధర్ రెడ్డి, ఈఈలు పాండురంగారావు, మల్లిఖార్జునరావు, ఆదిరెడ్డి, డీఈఈ ఎమ్.కె.డి.వి ప్రసాద్, ఏఈఈ శ్రీధర్, మేఘా ఇంజనీరింగ్ సంస్థ వైస్ ప్రెసిడెంట్ రంగరాజన్, జీఎంలు ఎం.ముద్దుకృష్ణ, దేవ్ మని మిశ్రా, ఏజిఎంలు కె.రాజేష్ కుమార్, క్రాంతి కుమార్, మేనేజర్ మురళి తదితరులు పాల్గొన్నారు. (చదవండి: Polavaram Project: పోలవరం పనులు భేష్) పోలవరం ప్రాజెక్టు వర్క్ ప్రోగ్రెస్.. ►మేఘా ఇంజనీరింగ్ సంస్ద 2019 నవంబర్ లో పనులు చేపట్టింది. ►ఇప్పటికే కీలకమైన పోలవరం స్పిల్ వే బ్రిడ్జి స్లాబ్ నిర్మాణం పూర్తైంది. ►స్పిల్ వే లో 3,32,295 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులను పూర్తి చేయడం జరిగింది. ►అదే విధంగా స్పిల్ వేలో అమర్చాల్సిన 48 రేడియల్ గేట్లకు గానూ 42 గేట్లను అమర్చడం జరిగింది. ►మిగిలిన 6గేట్లను త్వరలోనే అమర్చనున్నారు. ►రేడియల్ గేట్లకు అమర్చాల్సిన 96హైడ్రాలిక్ సిలిండర్లకు గానూ 84 సిలిండర్లను అమర్చారు. ►ఇప్పటికే 24పవర్ ప్యాక్ లకు గానూ 24 పవర్ ప్యాక్ లు అమర్చారు. ►ఇప్పటికే అన్ని గేట్లను పైకి ఎత్తి ఉంచడంతో గేట్ల ఏర్పాటు తర్వాత మొదటి సారి అన్ని గేట్ల నుండి గోదావరి వరద దిగువకు ప్రవహిస్తోంది. ►అదేవిధంగా 10రివర్ స్లూయిజ్ గేట్లను అమర్చడంతో పాటు వాటిని ఇప్పటికే పైకి ఎత్తి నీటిని కూడా విడుదల చేయడం జరిగింది. ►స్పిల్ ఛానెల్లో 2,41,826 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ నిర్మాణ పనులు పూర్తి అయ్యాయి. ►అదే విధంగా స్పిల్ ఛానెల్ లో 35 లక్షల క్యూబిక్ మీటర్లకు పైగా మట్టి తవ్వకం పనులు పూర్తి అయ్యాయి. ►దీనికి తోడు స్పిల్ ఛానెల్ లో కీలకమైన 1,391మీటర్ల పొడవైన ఎండ్ కటాఫ్ వాల్ నిర్మాణ పనులు సైతం పూర్తి అయ్యాయి. ►ఇంక అప్రోఛ్ ఛానెల్ లో దాదాపు 70లక్షల క్యూబిక్ మీటర్లకు పైగా మట్టి తవ్వకం పనులు పూర్తి అయ్యాయి. ఇది కేవలం 60 రోజుల్లో పూర్తి చేయడం ఓ అద్భుతం. ►కీలకమైన ఎగువ,దిగువ కాఫర్ డ్యామ్‌ల నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ►ఎగువ కాఫర్ డ్యాంలో 33,73,854, క్యూబిక్ మీటర్ల పనులు పూర్తి అయ్యాయి. ►ఇప్పటికే ఎగువ కాఫర్ డ్యామ్‌ను 2480మీ పొడవున, 42.5మీటర్ల ఎత్తు కు గానూ పూర్తి స్దాయి ఎత్తున నిర్మాణం పూర్తి అయింది. ►ఇంక దిగువ కాఫర్ డ్యామ్ నిర్మాణం సైతం దాదాపు 21మీటర్ల ఎత్తులో నిర్మాణం పూర్తి అయింది. దిగువ కాఫర్ డ్యామ్‌లో ఇప్పటికే 3,15,237 క్యూబిక్ మీటర్ల పనులు పూర్తి అయ్యాయి. ►ఇటీవలే ఎగువ కాఫర్ డ్యామ్ దగ్గర అడ్డుకట్ట వేసి గోదావరి నదీ ప్రవాహాన్ని మళ్ళించడం పూర్తైంది. ►ఇలా అప్రోచ్ ఛానెల్ నుంచి స్పిల్ వే మీదుగా గోదావరి నదిని దాదాపు 6.6కి.మీ మళ్ళించడం జరిగింది. ►ఇప్పటికే గ్యాప్2లో ఈసీఆర్ఎఫ్ డ్యామ్ నిర్మాణానికి సంబందించి 11,96,500 క్యూబిక్ మీటర్ల వైబ్రోకాంపాక్షన్ పనులు పూర్తి అయ్యాయి. ►అదేవిధంగా 1,61,310 క్యూబిక్ మీటర్ల శాండ్ ఫిల్లింగ్ పనులు పూర్తి అయ్యాయి. ►ఇంక గ్యాప్-1లో 400మీటర్ల పొడవున ప్లాస్టిక్ కాంక్రీట్ డ్యామ్ నిర్మాణం పూర్తి అయింది. ►గ్యాప్-1లో నేలను గట్టి పరిచేందుకు స్టోన్ కాలమ్స్ పనులు పూర్తి అవ్వగా కీలకమైన డీప్ సాయిల్ మిక్సింగ్ పనులు వేగంగా సాగుతున్నాయి. ►ఆసియాలో మొదటి సారి ఆధునిక టెక్నాలజీతో గ్యాప్-1లో డీప్ సాయిల్ మిక్సింగ్ పనులు జరుగుతున్నాయి. ►ఇంక కీలకమైన జలవిద్యుత్ కేంద్రానికి సంబందించి కొండ తవ్వకం పనులు దాదాపు పూర్తి అయ్యాయి. ఇప్పటికే 20,31491 క్యూబిక్ మీటర్ల తవ్వకం పనులు పూర్తి అయ్యాయి. ►జలవిద్యుత్ కేంద్రానికి సంబందించి ప్రెజర్ టన్నెల్స్ తవ్వకం పనులు జోరందుకున్నాయి. -
ఈ ఏడాదే ఓఎన్జీసీకి 23 రిగ్గులు: మేఘా
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: స్వదేశీ పరిజ్ఞానంతో కంపెనీ తయారు చేసిన రిగ్గు విజయవంతంగా డ్రిల్లింగ్ కార్యకలాపాలను కొనసాగిస్తోందని మేఘా ఇంజనీరింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ (ఎంఈఐఎల్) గురువారం వెల్లడించింది. మరో రిగ్గు ఓఎన్జీసీకి సరఫరా చేయడానికి సిద్ధంగా ఉందని గుజరాత్‌లోని గాంధీనగర్‌లో జరిగిన మీడియా సమావేశంలో కంపెనీ ప్రతినిధులు వెల్లడించారు. రిగ్గుల విక్రయం ద్వారా రానున్న రోజుల్లో దేశీయంగా, అంతర్జాతీయంగా రూ.14,800 కోట్ల విలువ గల వ్యాపార అవకాశాలను సొంతం చేసుకోనున్నామని మేఘా అనుబంధ కంపెనీ, ఆయిల్ రిగ్గుల తయారీలో ఉన్న డ్రిల్ మెక్ చైర్మన్ బొమ్మారెడ్డి శ్రీనివాస్ వెల్లడించారు. ఓఎన్జీసీకి సరఫరా చేయాల్సిన 47 రిగ్గులలో డిసెంబరుకల్లా 23 అప్పగిస్తామన్నారు. చమురు, ఇంధనం వెలికితీసే రిగ్గులను తొలిసారిగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసి వినియోగంలోకి తెచ్చిన ఘనత మేఘా ఇంజనీరింగ్ సొంతం చేసుకుందని కంపెనీ వైస్ ప్రెసిడెంట్ పి.రాజేష్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్, కాకినాడతోపాటు ఇటలీ, యూఎస్‌లోని ప్లాంట్లలో వీటిని తయారు చేస్తున్నామన్నారు. ప్రస్తుతం 70కి పైగా రిగ్గులను ఉత్పత్తి చేస్తున్నామని వివరించారు. 1500 హెచ్‌పీ సామర్థ్యం గల రిగ్గు అత్యాధునిక హైడ్రాలిక్ వ్యవస్థతో పనిచేస్తుంది. 4,000 మీటర్ల లోతు వరకు సులభంగా, వేగంగా తవ్వుతుందని ఆయిల్ రిగ్స్ డివిజన్ అధిపతి కృష్ణ కుమార్ తెలిపారు. -
ఒలెక్ట్రాకే 50 ఎలక్ట్రిక్ బస్‌ల సరఫరా ఆర్డర్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మౌలిక రంగ సంస్థ మేఘా ఇంజనీరింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ (ఎంఈఐఎల్) అనుబంధ కంపెనీ అయిన ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ తాజాగా 50 ఎలక్ట్రిక్ బస్‌ల సరఫరా ఆర్డర్‌ను చేజిక్కించుకుంది. గుజరాత్ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (జీఎస్ఆర్టీసీ) నుంచి ఈ ఆర్డర్ దక్కింది. ఇందులో భాగంగా 10 ఏళ్ల కాలానికిగాను గ్రాస్ కాస్ట్ కాంట్రాక్ట్ పద్ధతిలో బస్‌లను 12 నెలల్లో జీఎస్ఆర్టీసీకి అందజేస్తారు. మొత్తం ఆర్డర్ బుక్ 1,350 బస్‌లకు చేరుకుందని ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ ఎండీ కె.వి.ప్రదీప్ ఈ సందర్భంగా తెలిపారు. ఇప్పటికే గుజరాత్ రాష్ట్రంలో ఒలెక్ట్రా తయారీ 200 ఈ–బస్‌లు పరుగెడుతున్నాయని చెప్పారు. 9 మీటర్ల పొడవున్న ఈ బస్‌లో డ్రైవర్‌తో కలిపి 34 మంది కూర్చోవచ్చు. ఇందులోని లిథియం అయాన్ బ్యాటరీ ఒకసారి చార్జింగ్ చేస్తే బస్ 180–200 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. 3–4 గంటల్లోనే చార్జింగ్ పూర్తి కావడం విశేషం. చదవండి : రష్యాలో ప్రాజెక్టులు,15 బిలియన్ డాలర్లు దాటిన భారత్ పెట్టుబడులు -
పోలవరంలో మరో కీలక ఘట్టానికి శ్రీకారం
సాక్షి, అమరావతి/దేవీపట్నం: పోలవరం ప్రాజెక్టు పనుల్లో మరో కీలక ఘట్టానికి రాష్ట్ర ప్రభుత్వం తెర తీసింది. ప్రాజెక్టులో అంతర్భాగమైన 960 మెగా వాట్ల జలవిద్యుత్ కేంద్రం పనులను వేగవంతం చేసింది. ఈ కేంద్రంలో అత్యంత కీలకమైన 12 ప్రె జర్ టన్నెళ్ల తవ్వకం పనులను శుక్రవారం తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలం అంగుళూరు వద్ద మేఘా సంస్థ ప్రారంభించింది. పోలవరం హె డ్ వర్క్స్ (జలాశయం) పనులతోపాటు జలవిద్యు త్ కేంద్రం పనులను రివర్స్ టెండరింగ్‌లో దక్కిం చుకున్న మేఘా సంస్థ.. జలవిద్యుత్ కేంద్రం పనులను మార్చి 30న ప్రారంభించింది. ఈ పనుల్లో ఇప్పటికే 18.90 లక్షల క్యూబిక్ మీటర్ల కొండ తవ్వకం పనులను పూర్తిచేసింది. జలవిద్యుత్ కేం ద్రం పునాది పనులను జలవనరుల శాఖ అదికారులు పర్యవేక్షిస్తుండగా.. విద్యుత్ కేంద్రం నిర్మాణ పనులను జెన్కో అధికారులు పర్యవేక్షిస్తున్నారు. ధవళేశ్వరం బ్యారేజీ నుంచి ఏటా సగటున మూడు వేల టీఎంసీల మేర గోదావరి జలాలు సముద్రం లో కలుస్తున్నాయి. ఈ వరద నీటిని ఒడిసి పట్టి.. ఆయకట్టుకు నీళ్లందించడంతోపాటు భారీగా వి ద్యుత్ ఉత్పత్తి చేసి రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నిలి పేందుకు ప్రభుత్వం ఈ ప్రాజెక్టును చేపట్టింది. జలవిద్యుత్ కేంద్రం పనితీరు ఇలా.. పోలవరం ప్రాజెక్టు హెడ్‌వర్క్స్‌లో ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ (ఈసీఆర్ఎఫ్)కు ఎడమ వైపున జలవిద్యుత్ కేంద్రాన్ని నిర్మిస్తున్నారు. ఒక్కో యూనిట్లో 80 మెగావాట్ల చొప్పున 12 యూనిట్లలో 960 మెగాగాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసేలా ఈ కేంద్రాన్ని నిర్మిస్తున్నారు. పోలవరం ప్రాజెక్టులో నీటి మట్టం 35.52 మీటర్ల నుంచి నీటిని ప్రెజర్ టన్నెళ్ల ద్వారా పంపిస్తారు. టన్నెళ్లకు దిగువన కెప్లాన్ టర్బైన్లను ఏర్పాటుచేస్తారు. అధిక ఒత్తిడితో ఎత్తు నుంచి నీరు పడినప్పుడు వర్టికల్ కెప్లాన్ టర్బైన్లు వేగంగా తిరగడంవల్ల విద్యుత్ ఉత్పత్తవుతంది. ఇందుకోసం 145 మీటర్ల పొడవున 9 మీటర్ల వ్యాసంతో 12 ప్రెజర్ టన్నెళ్లను తవ్వే పనులను కాంట్రాక్టు సంస్థ ప్రారంభించింది. ఈ టన్నెళ్లకు చివరన తక్కువ వ్యాసంతో ఇనుప పైపులను తొడిగి.. భూ ఉపరితలానికి ఆరు మీటర్ల దిగువన వర్టికల్ కెప్లాన్ టర్బైన్లను ఏర్పాటుచేస్తారు. ప్రెజర్ టన్నెళ్ల వైపు నీటిని మళ్లించడానికి వీలుగా 206 మీటర్ల పొడవున 294 మీటర్ల వెడల్పుతో జలాశయం నుంచి అప్రోచ్ ఛానల్ తవ్వుతారు. దీని ద్వారా ప్రెజర్ టన్నెళ్లకు నీటిని విడుదల చేయడం ద్వారా వర్టికల్ కెప్లాన్ టర్బైన్లను తిరిగేలా చేసి.. విద్యుదుత్పత్తి చేస్తారు. టర్బైన్ల నుంచి దిగువకు వచ్చిన నీటిని టెయిల్ రేస్ ఛానల్ ద్వారా ఈసీఆర్‌ఎఫ్‌కు దిగువన నదిలోకి కలుపుతారు. ఈ వర్టికల్ కెప్లాన్ టర్బైన్లను భోపాల్‌కు చెందిన బీహెచ్ఈఎల్ సంస్థ తయారుచేస్తోంది. ఈ విద్యుత్ కేం ద్రంలో వినియోగిస్తున్న టర్బైన్లు ఆసియాలోనే అత్యంత పెద్దవి. ప్రెజర్ టన్నెల్ తవ్వకం పనుల ప్రారంభోత్సవంలో జెన్కో ఎస్ఈ ఎస్. శేషారెడ్డి, ఈఈలు ఎ. సోమయ్య, సి. హనుమ, ఎలక్ట్రికల్ ఈ ఈ వై. భీమధనరావు, ఇరిగేషన్ ఈఈ పాండురంగారావు, మేఘా ఇంజినీరింగ్ సంస్థ వైస్ ప్రెసిడెంట్ రంగరాజన్, జీఎం ముద్దుకృష్ణ, ఏజిఎం క్రాంతికుమార్, కోఆర్డినేటర్ ఠాగూర్‌చంద్ పాల్గొన్నారు. హిమాలయ విద్యుత్ కేంద్రాల స్థాయిలో.. హిమాలయ నదుల్లో నీటి లభ్యత అధికంగా ఉండటంవల్ల వాటిపై నిర్మించే జలవిద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ అధికంగా ఉత్పత్తవుతుంది. అలాగే, గోదావరి నదిపై ఎగువన మహారాష్ట్రలో జైక్వాడ్ డ్యామ్ నుంచి దిగువన ఏపీలోని ధవళేశ్వరం బ్యారేజీ వరకూ అతిపెద్ద నీటి నిల్వ సామర్థ్యం ఉన్న ప్రాజెక్టు పోలవరం ఒక్కటే. దీని సామర్థ్యం 194.6 టీఎంసీలు. పోలవరం వద్ద నీటి లభ్యత అధికంగా ఉండటంవల్ల హిమాలయ నదులపై ఉన్న విద్యుత్ కేంద్రాలకు దీటుగా పోలవరం విద్యుత్ కేంద్రంలోనూ కరెంట్‌ను ఉత్పత్తి చేయవచ్చునని ఆ రంగ నిపుణులు చెబుతున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే అంతరాయాలు లేకుండా కారుచౌకగా విద్యుత్ సరఫరా చేసే పరిస్థితి ఏర్పడుతుంది. తద్వారా రాష్ట్రంలో భారీఎత్తున పరిశ్రమల ఏర్పాటుకు పారిశ్రామికవేత్తలు ముందుకొస్తారని.. అలాగే ఉపాధి అవకాశాలు మరింత మెరుగుపడడానికి అది దోహదం చేస్తుందని రాష్ట్ర ప్రభుత్వ అంచనా. ఇవీ చదవండి: ఏపీ: దేశంలోని తొలి ప్రయోగం.. వాట్సాప్.. రైతుల హేట్సాఫ్ -
ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ ఎండీగా కె.వి. ప్రదీప్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మౌలిక రంగ సంస్థ మేఘా ఇంజనీరింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ (ఎంఈఐఎల్) గ్రూప్ కంపెనీ అయిన ఎలక్ట్రిక్ వాహన తయారీలో ఉన్న ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ నూతన ఎండీగా వెంకటేశ్వర ప్రదీప్ కారుమూరు నియమితులయ్యారు. ఇప్పటి వరకు ఆయన నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఉన్నారు. కొత్త బాధ్యతల్లో మూడేళ్లపాటు ఉంటారు. సివిల్ ఇంజనీర్ అయిన ప్రదీప్.. వ్యాపార అభివృద్ధి, ప్రాజెక్టుల అమలు, ఈపీసీ, విమానయాన రంగాల్లో 22 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. భారత్‌లో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఎలక్ట్రిక్ బస్ తయారీ సంస్థకు నాయకత్వం వహించడం గర్వంగా ఉందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. అత్యంత అధునాతన, పర్యావరణ అనుకూల ఈ–బస్‌లను ప్రవేశపెట్టడంలో భాగస్వామ్యం అవుతామని వివరించారు. ఆర్డర్ బుక్ 1,325 బస్‌లు.. ప్రస్తుతం ఒలెక్ట్రా ఖాతాలో 1,325 బస్‌లకు ఆర్డర్ ఉంది. ఇందులో 87 యూనిట్లు డెలివరీ చేశారు. కొత్తగా 300 బస్‌ల కాంట్రాక్టుకుగాను లోయెస్ట్ బిడ్డర్‌గా కంపెనీ నిలిచింది. త్వరలోనే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడనుంది. మరిన్ని టెండర్లలో పాలుపంచుకునే పనిలో కంపెనీ నిమగ్నమైంది. కాగా, జూన్ త్రైమాసికంలో ఒలెక్ట్రా రూ.5.65 కోట్ల నికరలాభం ఆర్జించింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో రూ.3.62 కోట్ల నష్టం వాటిల్లింది. టర్నోవర్ 86 శాతం అధికమై రూ.41.15 కోట్లు సాధించింది. ఇందులో ఈ–బస్ విభాగం వాటా రూ.23.36 కోట్లు ఉంది. విద్యుత్ పంపిణీకి అవసరమైన సిలికాన్ రబ్బర్/కంపోజిట్ ఇన్సులేటర్స్ తయారీలో ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ దేశంలో అతిపెద్ద కంపెనీ. -
‘మేఘా’ 75 ఎంటీల మెడికల్ ఆక్సిజన్ వితరణ
ముత్తుకూరు: కరోనా బాధితులకు వైద్య చికిత్స కోసం మేఘా ఇంజనీరింగ్ సంస్థ సీఎస్సార్ ఫండ్స్‌తో రూ.1.65 కోట్ల విలువైన 75 ఎంటీ (మెట్రిక్ టన్ను)ల మెడికల్ ఆక్సిజన్‌ను జిల్లాకు అందించినట్లు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కలెక్టర్ కేవీఎన్ చక్రధర్‌బాబు తెలిపారు. మేఘా సంస్థ ద్వారా శుక్రవారం ఒక్కోటి 25 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ కలిగిన మూడు ట్యాంకర్లు రైలు మార్గంలో అదాని కృష్ణపట్నం పోర్టుకు చేరాయి. వీటికి కలెక్టర్ చక్రధర్‌బాబు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కలెక్టర్ మేఘా సంస్థను అభినందించారు. సీఎం వైఎస్ జగన్ తీసుకొన్న ప్రత్యేక శ్రద్ధతో ఆస్పత్రుల్లో ఆక్సిజన్ కొరత తీరిందన్నారు. ఈ కార్యక్రమంలో జేసీలు హరేంద్రప్రసాద్, బాపిరెడ్డి, పోర్టు సీఈవో సతీష్ చంద్రరాయ్, మేఘా ప్రతినిధులు నారాయణ, కిషోర్ తదితరులు పాల్గొన్నారు. -
సింగపూర్ నుంచి ఏపీకి మూడు ఆక్సిజన్ ట్యాంకర్లు
సాక్షి, అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రజల అవసరాల నిమిత్తం మూడు క్రయోజెనిక్ ఆక్సిజన్ ట్యాంకులను ప్రభుత్వానికి ఉచితంగా అందించిన మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్. ఒక్కో ఆక్సిజన్ ట్యాంక్ నుంచి 1. 40 కోట్ల లీటర్ల ఆక్సిజన్ సామర్ధ్యం ఉన్న మూడు క్రయోజెనిక్ ట్యాంకర్లను సింగపూర్ నుంచి దిగుమతి చేసుకుంది. భారత కాలమానం ప్రకారం మంగళవారం మధ్యాహ్నం మూడున్నర గంటలకు సింగపూర్‌లో బయలుదేరిన భారత వైమానికదళ ప్రత్యేక విమానం రాత్రి ఏడు గంటలకు పశ్చిమబెంగాల్ లోని పానాగఢ్ వైమానిక స్థావరానికి మూడు క్రయోజెనిక్ ట్యాంకులతో చేరుకుంది. క్రయోజెనిక్ ఆక్సిజన్ ట్యాంకులను విమానం నుంచి దించిన వెంటనే ప్రత్యేక వాహనాల్లో 35 కిలోమీటర్ల దూరంలోని దుర్గాపూర్ ఉక్కు కర్మాగారానికి తరలించారు. ఆ ఉక్కు కర్మాగారంలో ఉత్పత్తి అయ్యే ఆక్సిజన్ ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించిన విషయం తెలిసిందే. మూడు క్రయోజెనిక్ ట్యాంకర్లలో ఆక్సిజన్ నింపిన తరువాత అవి ఆంధ్ర ప్రదేశ్ కు బయలుదేరతాయి. ఆక్సిజన్ ట్యాంకులు రైలు మార్గం ద్వారా బుధవారం రాత్రికి లేదా గురువారం ఉదయానికి రాష్టానికి చేరుకుంటాయని ఎంఈఐఎల్ వైస్ ప్రెసిడెంట్ పి. రాజేశ్‌రెడ్డి తెలిపారు. ఇప్పటికే 11 క్రయోజెనిక్ ఆక్సిజన్ ట్యాంకులను తెలంగాణా ప్రభుత్వానికి మేఘా ఇంజనీరింగ్ ఉచితంగా థాయిలాండ్ నుంచి దిగుమతు చేసుకుని అందించిన విషయం తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర రక్షణ, విదేశాంగ మంత్రిత్వ శాఖలు సింగపూర్ ప్రభుత్వం సమన్వయంతో త్వరితగతిన ట్యాంకర్లు దిగుమతి కావడానికి కృషి చేశాయన్నారు. ఆంధ్రప్రదేశ్ కు అందించే మూడు ట్యాంకర్ల ద్వారా 4. 20 కోట్ల లీటర్ల ఆక్సిజన్ ను సరఫరా చేయవచ్చు. ఈ క్రయోజనిక్ ట్యాంకర్లను రాష్ట్ర ప్రభుత్వం తమ అవసరాలకు తగిన విధంగా వినియోగించుకుంటుంది. మన రాష్ట్రానికి కేటాయించిన ఆక్సిజన్ ఉత్పత్తి కేంద్రాల నుంచి లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ ను తీసుకువచ్చి నేరుగా ఆసుపత్రులకు ఇవి అందచేస్తాయి. అదే సమయంలో అవసరాన్ని బట్టి నేరుగా ఆసుపత్రులకు సరఫరా చేసే విధంగా కూడా ఈ ట్యాంకర్లను ఉపయోగిస్తారు. ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మోహన్ రెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ళ నాని, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాధ్ దాస్, ఇతర ప్రభుత్వ ఉన్నతాధికారుల కమిటీ ఈ వ్యవహారాన్ని పర్యవేక్షిస్తోంది. ప్రస్తుత, భవిష్యత్తు అవసరాలు దృష్టి లో ఉంచుకొని ఆక్సిజన్ సరఫరాకు క్రయోజనిక్ ట్యాంకర్స్ ను సింగపూర్ నుండి మేఘా ఇంజనీరింగ్ దిగుమతి చేసుకుంది. దేశంలో సరిపడా ఆక్సిజన్ ఉన్నా దాన్ని సరఫరా చేయడానికి అవసరమైన ట్యాంకులు, రవాణా లాంటి సదుపాయాలు లేకపోవడంతో అవసరమైన వారికి అందడం లేదు. మన దేశంలో ఒక్కొక్క క్రయోజనిక్ ట్యాంకర్ తయారు చేయడానికి కనీసం మూడు నెలల సమయం పడుతోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో కాలంతో పోటీ పడి ట్యాంకర్లను సిద్ధం చేయాలి. దాంతో ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల్లోనూ గాలించి సింగపూర్ నుండి 3 క్రయోజనిక్ ట్యాంకర్లను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోసం మేఘా ఇంజనీరింగ్ దిగుమతి చేసుకుంది. కరోనా సమయంలో తమ వంతుగా దేశానికి సేవ చేయడం బాధ్యతగా ఎంఈఐఎల్ భావిస్తోంది. దేశంలో ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులకు ఉచితంగా ఆక్సిజన్ సరఫరా చేయడం కోసం ప్రత్యేకంగా ఒక బృందం పనిచేస్తోంది. కరోనా సంక్షోభం తీవ్ర రూపం దాల్చి ఆక్సిజన్ కొరత అధికమవుతున్నప్పటి నుంచి ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులకు ఉచితంగా ఆక్సిజన్ సరఫరా చేస్తోంది. అందులో భాగంగానే సంస్థ ఉన్నతస్థాయి యాజమాన్యమే కాకుండా మొత్తం యంత్రాంగం ఇదే పనిలో నిమగ్నమైంది. -
కరోనా: తమిళనాడుకు మేఘా సహాయం
దేశంలో వివిధ రాష్ట్రాల్లో కరోనా పేషంట్లను ఆదుకునేందుకు వివిధ ప్రభుత్వాలకు సహాయసహకారాలు అందిస్తున్న విధంగానే హైదరాబాద్‌కు చెందిన మేఘా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (ఎంఈఐఎల్) సంస్థ. తాజాగా తమిళనాడు వ్యాప్తంగా ఉచితంగా 2500 ఆక్సిజన్ బెడ్లను ఏర్పాటు చేస్తోంది. ఇందులో భాగంగా మదురైలో కేవలం 72 గంటల్లోనే 500 ఆక్సిజన్ బెడ్లను సిద్ధం చేసింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలకు ఆక్సిజన్ ట్యాంకర్లను, బెడ్స్‌ను, ఆస్పత్రులకు వివిధ మౌళిక సదుపాయాలను కల్పించిన ఎంఈఐఎల్, తమిళనాడు వ్యాప్తంగా కరోనా బాధితుల కోసం ఉచితంగా ఆస్పత్రులలో ఆక్సిజన్ బెడ్స్‌ను ఏర్పాటు చేస్తోంది. మేఘా ఇంజనీరింగ్ తో పాటు తమిళనాడుకు చెందిన క్రెడాయ్, జి రియల్టర్స్ సంస్థ ఇందులో భాగస్తులయ్యాయి. ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ ఈ కార్యక్రమాన్ని నేరుగా పర్యావేక్షిస్తున్నారు. చెన్నైలో 1070 ఆక్సిజన్ బెడ్లు గ్రేటర్ చెన్నై పరిధిలోని ఆసుపత్రులలో 1070 ఆక్సిజన్ బెడ్ల ను మేఘా ఇంజనీరింగ్ సంస్థ యుద్ధపాత్రిపదికన పనులు చేస్తోంది. వీటితో పాటు ఇరోడ్ జిల్లాలో 200, వెల్లూరు 250, అంబూరు 100, నట్టారం వళ్లి 100, మెలిశ్వరం 100, అయ్యపాకం 200, శోలింగార్ 50, వనియంబాడిలో 100, వల్లఝాలో 100 ఆక్సిజన్ పడకల ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే 660 బెడ్లను సిద్ధం చేసిన ఎంఈఐఎల్ రాబోయే రోజుల్లో 2500 బెడ్ల ఏర్పాటు చేయబోతోంది. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న మేఘా ఇంజనీరింగ్ సంస్థ (ఎంఈఐఎల్) తనవంతు సహాయంగా తమిళనాడుకు ఆక్సిజన్ బెడ్లను అందిస్తోంది. ఈ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా 20 దేశాల్లో తన కార్యకలాపాలను కొనసాగిస్తోంది. మేఘాకు సేవల్లో పాలు భాగస్తులైన క్రెడాయ్, జి రియల్టర్స్ మధురై ప్రభుత్వ ఆసుపత్రి (తోప్పూర్ జిహెచ్) లో తమిళనాడు ముఖ్యమంత్రి ఎం. కె. స్టాలిన్ 500 స్కేలబుల్ ఆక్సిజనేటెడ్ బెడ్ సౌకర్యాలను మే 21 ప్రారంభించారు. ఇందులో 200 ఆక్సిజన్ పడకలు అందుబాటులోకి వచ్చాయి. మిగిలిన 300 పడకలు త్వరలో ప్రజల ఉపయోగం కోసం అందుబాటులో ఉంచనున్నారు. మేఘా సంస్థ చొరవతో ప్రజలకు ఉచిత చికిత్సను అందిస్తున్నారు. జి స్క్వేర్ రియల్టర్స్, మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్, క్రెడాయి మదురై జిహెచ్ వద్ద 72 గంటల రికార్డు సమయంలో 500 ఆక్సిజన్ బెడ్ సౌకర్యాలను ఏర్పాటు చేశాయి. జి స్క్వేర్ రియల్టర్ తో కలిసి మేఘా ఇంజనీరింగ్ సంస్థ చెన్నై అన్నా నగర్ ప్రభుత్వ ఆసుపత్రితో పాటు ఒమాండురార్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక్కొక్కటి 100 ఆక్సిజనేటెడ్ పడకలను ఏర్పాటు చేశారు. కరోనా సంక్షోభం తీవ్ర రూపం దాల్చి ఆక్సిజన్ కొరత అధికమవుతున్నప్పటి నుంచి ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులకు ఉచితంగా ఆక్సిజన్ సరఫరా చేసేందుకు మేఘా యాజమాన్యం కృషి చేస్తోంది. అందులో భాగంగానే సంస్థ ఉన్నతస్థాయి యాజమాన్యమే కాకుండా మొత్తం యంత్రాంగం ఇదే పనిలో నిమగ్నమయ్యింది. కరోనా సమయంలో తమ వంతుగా దేశానికి సేవ చేయడం బాధ్యతగా భావిస్తున్నామని ఎంఈఐఎల్ డైరెక్టర్ బి. శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. కోవిడ్ రోగులను ఆదుకునేందుకు ప్రభుత్వానికి సహాయ సహకారాలు అందించడం కోసం ప్రత్యేకంగా ఒక బృందం పనిచేస్తోందని ఆయన తెలిపారు. ఈ మొత్తం వ్యవహారాన్ని ఎంఈఐఎల్ మేనేజింగ్ డైరెక్టర్ కృష్ణా రెడ్డి పర్యవేక్షిస్తున్నారన్నారు. క్రెడాయ్ తమిళనాడు అధ్యక్షుడు సురేష్ కృష్ణ మాట్లాడుతూ, “సిఎస్ఆర్ పథకంలో భాగంగా మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్, లైఫ్ స్టైల్ (చెన్నై), ఒలింపియా, టిఎన్ ఇస్పాట్ పరిషత్ లిమిటెడ్, తిరుపూర్ ఎగుమతిదారుల సంఘం వంటి అనేక సంస్థలు తమిళనాడు ప్రజల కోసం ఆస్పత్రుల్లో సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నాయన్నారు. కేవలం 72 గంటల తక్కువ వ్యవధిలో మేఘా సంస్థ పూర్తి చేయడం చాలా సంతోషంగా ఉంది” జి స్క్వేర్ రియల్టర్స్ ప్రమోటర్ బాలా మాట్లాడుతూ, “మానవ జీవితం కంటే మరేమీ ముఖ్యమైనది కాదు. మేఘా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ర్టక్చర్ లిమిటెడ్ (ఎంఈఐఎల్) - జి స్క్వేర్ సంస్థలు కలిసి ప్రభుత్వానికి అండగా నిలబడడం గర్వంగా ఉందన్నారు. ఈ ఆసుపత్రులను తమిళనాడు అంతటా ఏర్పాటు చేయడానికి గౌరవ ఆరోగ్య మంత్రి, తమిళనాడు ప్రభుత్వ ఆరోగ్య కార్యదర్శి తమ పూర్తి సహకారాన్ని అందిస్తున్నాయన్నారు” బాధ్యతగా కోవిడ్ బాధితులను ఆదుకుంటున్నాం: బి. శ్రీనివాస్ రెడ్డి నిర్మాణ రంగంలో ప్రపంచ వ్యాప్తంగా అనేక ప్రాజెక్ట్ లను సకాలంలో పూర్తి చేసి గుర్తింపు పొందిన మేఘా ఇంజనీరింగ్ ఇన్ ఫ్రాస్ర్టక్చర్ సంస్థ కోవిడ్ కష్టకాలంలో ప్రజలను ఆదుకునేందుకు బాధ్యతగా ముందుకు వచ్చిందని ఆ సంస్థ డైరెక్టర్ బి. శ్రీనివాస్ రెడ్డి ఈ సందర్భంగా తెలిపారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ ఆదేశాల మేరకు రాష్ర్టంలో 2500 పడకల ఆక్సిజన్ బెడ్ల ఆసుపత్రులను యుద్ధ ప్రతిపాదికన ఏర్పాటు చేస్తున్నామన్నారు. మదురైలో కేవలం 72 గంటల్లోనే 200 పడకల ఆక్సిజన్ బెడ్స్ ఆసుపత్రిని నిర్మించి ప్రభుత్వానికి అందచేశామన్నారు. ఈ కార్యక్రమంలో తమిళనాడుకు చెందిన క్రెడాయ్, జి రియల్టర్స్ సహాయ సహకారాలు అందిస్తున్నట్లు వివరించారు. దేశంలో ఆక్సిజన్ కొరతను నివారించడానికి 200 పి.ఎస్.ఏ ప్లాంట్లు ఏర్పాటు చర్యలు ప్రారంభించినట్లు బి.శ్రీనివాస్ రెడ్డి తెలియజేశారు. అలాగే క్రయోజనిక్ ట్యాంకుల తయారీ కూడా ప్రారంభించినట్లు చెప్పారు. ఇందుకు డిఆర్డీవో, పెట్రోలియం మంత్రిత్వ శాఖలు పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నట్లు ఆయన వివరించారు. ఇప్పటికే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్లో ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులకు ఉచితంగా ఆక్సిజన్ సరఫరా చేస్తున్న సంగతిని గుర్తు చేశారు. తొలిసారిగా తెలంగాణకు థాయిలాండ్ నుంచి 11 క్రయోజనిక్ ఆక్సిజన్ ట్యాంకర్లు దిగుమతి చేసి ఉచితంగా ఇస్తున్నట్లు తెలిపారు. చదవండి: జయలలిత చివరి రోజుల్లో తీసుకున్న నిర్ణయాలపై రహస్య విచారణ -
ఆక్సిజన్ సరఫరాకు ముందుకొచ్చిన ఎంఈఐఎల్
సాక్షి, హైదరాబాద్ : కరోనా సెకెండ్ వేవ్ నేపథ్యంలో ఆసుపత్రుల్లో రోగులకు ఆక్సిజన్ అత్యవసరంగా మారింది. దాంతో సహజంగానే ఆక్సిజన్ సిలిండర్లకు డిమాండ్ పెరిగిపోయింది. ఉత్పత్తి సరైన స్థాయిలో లేకపోవడంతో ఆక్సిజన్ సిలిండర్ల సరఫరా అవసరమైన మేరకు జరగడం లేదు. ఈ పరిస్థితుల్లో హైదరాబాద్‌లోని ప్రఖ్యాత నిమ్స్, అపోలో, సరోజినిదేవి వంటి ఆస్పత్రుల నుంచి మేఘా ఇంజినీరింగ్ సంస్థకు ఆక్సిజన్ అందించమని అభ్యర్థనలు వచ్చాయి.. వచ్చిందే తడవుగా మేఘా ఇంజినీరింగ్ సంస్థ ఆక్సిజన్ సిలిండర్లను భారీ స్థాయిలో ఉచితంగా సరఫరా చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఆక్సిజన్ సేకరణ కోసం భద్రాచలంలోని ఐటీసీ, హైదరాబాద్‌లోని డిఆర్‌డివోతో ఆఘమేఘాల మీద ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం. దేశంలో కరోనా విలయతాండవం చేస్తోంది. ముఖ్యంగా కోవిడ్ రోగులు ఆక్సిజన్ సమస్యతో సతమతమవుతున్నారు. ఆక్సిజన్ అందక రోజుకు కొన్ని వందల మంది కోవిడ్ మహమ్మారితో పోరాడుతూ ప్రాణాలు విడుస్తున్నారు. అలాంటి విపత్కర పరిస్థితులను ఎదుర్కొనేందుకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు ప్రైవేటు సంస్థల సహకారంతో ఆక్సిజన్ అవసరమయ్యే అన్ని హాస్పిటల్స్‌కు ఆక్సిజన్ సరఫరా చేయాలని నిర్ణయించాయి. ఇందులో భాగంగా మేఘా ఇంజనీరింగ్ ప్రభుత్వం సహకారంతో వివిధ హాస్పిటల్స్ కు ఉచితంగా ఆక్సిజన్ సిలిండర్లను సరఫరా చేయనుంది. కోవిడ్ రోగుల అవసరాలకు అనుగుణంగా నిమ్స్ హాస్పిటల్ యాజమాన్యం ఆక్సిజన్ బెడ్లను పెంచుతూ పోతోంది. ప్రస్తుతం 180 నుంచి 500 బెడ్లకు పెంచారు. పెంచిన బెడ్లకు అనుగుణంగా నిమ్స్ లో రోజుకు 50 బి.టైప్ మెడికల్ ఆక్సిజన్ సిలిండర్లు (ఒక్కొక్క సిలిండర్ 7000 లీటర్లు) ఏర్పాటు అవసరం అవుతుందని నిమ్స్ డైరెక్టర్ డా. మనోహర్ ఎంఈఐఎల్ సంస్థకు రాసిన లేఖలో పేర్కొన్నారు. అలాగే సరోజిని దేవి కంటి ఆసుప్రతికి రోజుకు దాదాపు 200 సిలిండర్లను అందించబోతుంది మేఘా సంస్థ. ఇక అపోలో హాస్పిటల్స్‌కు ప్రతి రోజు 100 సిలిండర్లు, కేర్ హైటెక్ కు 50 సిలిండర్లను సరఫరా చేయనుంది. ఇక భవిష్యత్తులో ఆసుపత్రుల నుంచి వచ్చే ఆక్సిజన్ విజ్ఞప్తి మేరకు సరఫరా చేసేందుకు ఉత్పత్తి, సరఫరా వ్యవస్థను మెరుగుపరిచేందుకు మేఘా ఇంజనీరింగ్ యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టింది. చదవండి: షిప్పింగ్ కార్పొరేషన్ వేటలో మేఘా డీఆర్డీవో టెక్నాలజీ సహకారంతో మేఘా ఇంజనీరింగ్ సంస్థ 30 నుంచి 40 ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తోంది. ఒక్కొక్క ప్లాంటు నుంచి నిమిషానికి 150 నుంచి 1000 లీటర్ల ఆక్సిజన్ ను ఉత్పత్తి చేయనున్నారు. ఈ మొత్తాన్ని డి.ఆర్.డి.వో కల్నల్ బి.ఎస్. రావత్, డా. రాఘవేంద్ర రావు పర్యవేక్షించనున్నారు. మొత్తానికి డి.ఆర్.డి.వో సహకారంతో మేఘా ఇంజనీరింగ్ 35 లక్షల లీటర్ల ఆక్సిజన్ మేఘా సంస్థ ఆస్పత్రులకు సరఫరా చేస్తుంది. ఈ మేరకు ఆయా హాస్పిటల్ నుంచి అభ్యర్థనలు వచ్చాయి. వీటికి అనుగుణంగా ఆక్సిజన్ ను ఉత్పత్తి చేసి సరఫరా చేయనుంది మేఘా సంస్థ. ఇక భద్రాచలం ఐటీసీ నుంచి రోజుకు 30 మెట్రిక్ టన్నుల క్రయోజనిక్ ఆక్సిజన్ ను తీసుకొని ఎంఈఐఎల్ సంస్థ లిక్విడ్ ఆక్సిజన్ గా మార్చనుంది. ఇందుకు అనుగుణంగా భద్రాచలం ఐటీసీ దగ్గర ప్లాంట్ ను ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ క్రయోజనిక్ ఆక్సిజన్ లభ్యమవుతోంది. స్పెయిన్‌లో ఉన్న ఎంఈఐఎల్కు సంబంధించి కర్మాగారం నుంచి క్రయోజనిక్ ఆక్సిజన్ ట్యాంకులను దిగుమతి చేసేందుకు సంస్థ సంసిద్ధత వ్యక్తం చేసింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాసింది. అక్కడి ఫ్యాక్టరీ నుంచి 10 నుంచి 15 ట్యాంకులను ఇక్కడి ఆక్సిజన్ నిల్వ, సరఫరా అవసరాల నిమిత్తం ఉపయోగించుకునేందుకు యుద్ధ ప్రాతిపాదికన తీసుకువచ్చేందుకు ఆసక్తి చూపింది. ఈ మేరకు ప్రభుత్వానికి లేఖ రాసింది. అదే సమయంలో ఎంఈఐఎల్ కు సంబంధించిన నగర శివారులోని పరిశ్రమల్లో క్రయోజనిక్ ఆక్సిజన్ ట్యాంకులను యుద్ధ ప్రతిపాదికన తయారు చేసి అందించేందుకు కూడా సంసిద్ధత తెలిపింది. ఇందుకు సంబంధించిన డిజైన్లు, డ్రాయింగ్ లతో పాటు డాక్యుమెంట్లను ప్రభుత్వానికి అందించనుంది. ప్రభుత్వ పరిశీలన, అనుమతి అనంతరం వాటి తయారీకి వెంటనే రంగంలోకి దిగుతుంది. -
షిప్పింగ్ కార్పొరేషన్ వేటలో మేఘా
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో (ఎస్సీఐ) ప్రభుత్వ వాటా కొనుగోలుకు శక్తి కలిగిన కంపెనీల జాబితాలో హైదరాబాద్‌కు చెందిన మౌలిక రంగ సంస్థ మేఘా ఇంజనీరింగ్, ఇన్ఫ్రాస్టక్చర్ (ఎంఈఐఎల్) నిలిచింది. ఎంఈఐఎల్‌తోపాటు యూఎస్‌కు చెందిన సేఫ్సీ, ఎన్నారై రవి మెహరోత్రా నేతృత్వంలోని కన్సార్షియం షార్ట్ లిస్ట్ అయిన జాబితాలో ఉన్నాయి. ఎస్‌సీఐలో ప్రభుత్వ వాటా కొనుగోలుకు ఆసక్తి కనబరిచిన ఈ మూడు కంపెనీలు టెక్నికల్, ఫైనాన్షియల్ ప్రమాణాల విషయంలో అర్హత సాధించాయి. షిప్పింగ్ కార్పొరేషన్లో కేంద్ర ప్రభుత్వం తనకున్న 63.75% వాటాను విక్రయిస్తోంది. ఈ వాటాను దక్కించుకున్న సంస్థ సెబీ టేకోవర్ నిబంధనల ప్రకారం ఆ తర్వాత మరో 26 శాతం వాటా కోసం ఓపెన్ ఆఫర్ ప్రకటించాల్సి ఉంటుంది. 1961 అక్టోబరు 2న ఏర్పాటైన ఎస్సీఐ.. భారత్‌లో అతిపెద్ద షిప్పింగ్ కంపెనీగా ఎదిగింది. సరుకు, ప్రయాణికుల రవాణా కార్యకలాపాలు సాగిస్తున్న ఈ సంస్థ పెద్ద ఎత్తున బల్క్ క్యారియర్లు, క్రూడ్ ఆయిల్ ట్యాంకర్లు, ప్రొడక్ట్ ట్యాంకర్స్, కంటైనర్ వెసెల్స్, ప్యాసింజర్/కార్గో వెసెల్స్, ఎల్పీజీ, అమోనియా క్యారియర్లను సొంతంగా కలిగి ఉంది. డిసెంబరు త్రైమాసికంలో షిప్పింగ్ కార్పొరేషన్ రూ.841 కోట్ల టర్నోవర్‌పై రూ.103 కోట్ల నికరలాభం ఆర్జించింది. కంపెనీ షేరు ధర క్రితం ముగింపుతో పోలిస్తే 0.43 % ఎగసి రూ.115.75 వద్ద స్థిరపడింది. -
రూ.5,000 కోట్లతో ‘మేఘా గ్యాస్’ ప్రాజెక్ట్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మౌలిక రంగ సంస్థ మేఘా ఇంజనీరింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ (ఎంఈఐఎల్) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ ప్రాజెక్టు పనులు చకచకా సాగుతున్నాయి. ఈ ప్రాజెక్టులో భాగంగా మేఘా గ్యాస్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలో 16 జిల్లాల్లో పైపుల ద్వారా సహజ వాయువును (పీఎన్జీ) గృహాలకు, పారిశ్రామిక అవసరాలకు సరఫరా చేయనుంది. ఎల్పీజీతో పోలిస్తే పీఎన్జీ ధర 35–40 శాతం తక్కువగా ఉంటుందని కంపెనీ తెలిపింది. ఇక వాహనాల కోసం కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (సీఎన్జీ) స్టేషన్లను సైతం ఏర్పాటు చేస్తోంది. ప్రాజెక్టు కోసం సంస్థ రూ.5,000 కోట్లు వెచ్చించనుంది. ఇందులో ఇప్పటికే రూ.1,100 కోట్లు ఖర్చు చేసింది. 2019లో మొదలైన సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ పనులను మేఘా గ్యాస్ 2026కి పూర్తి చేయాల్సి ఉంటుంది. 2021 డిసెంబర్ నాటికి.. మేఘా గ్యాస్ 7 జియోగ్రాఫికల్ ఏరియాల్లో సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ పనులను చేపట్టింది. మూడు రాష్ట్రాల్లోని 16 జిల్లాలు దీని కింద కవర్ అవుతున్నాయి. 2026 కల్లా పైపుల ద్వారా దాదాపు 11 లక్షల గృహాలకు సహజ వాయువు సరఫరా చేయాలని సంస్థ నిర్దేశించుకుంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా, కర్ణాటకలోని బెల్గాం, తూముకూరు ఏరియాలు పూర్తి అయ్యాయి. ఈ మూడు యూనిట్స్ కింద 62,000 గృహాలకు కనెక్షన్లు ఇచ్చారు. తెలంగాణలోని నల్లగొండ యూనిట్ ఇటీవలే కార్యరూపం దాల్చింది. ఇక రంగారెడ్డి, ఖమ్మం, వరంగల్ ఏరియాలు 2021 డిసెంబరుకల్లా పూర్తి చేయాలన్నది కంపెనీ లక్ష్యం. వచ్చే ఆరేళ్లలో ఈ ఏడు యూనిట్స్‌లో మొత్తం 250 సీఎన్జీ స్టేషన్లు ఏర్పాటు కానున్నాయని ఎంఈఐఎల్ సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ బిజినెస్ హెడ్ పి.వెంకటేశ్ సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. ఇందులో 25 స్టేషన్లు అందుబాటులోకి వచ్చాయని చెప్పారు. ప్రత్యక్షంగా 1,000 మంది, పరోక్షంగా 3,000 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.