ఆక్సిజన్‌ సరఫరాకు ముందుకొచ్చిన ఎంఈఐఎల్‌ | MEIL To Commission 30 Tonne Oxygen Plant in Telangana | Sakshi
Sakshi News home page

ఆక్సిజన్‌ సరఫరాకు ముందుకొచ్చిన ఎంఈఐఎల్‌

Published Sat, May 8 2021 5:48 PM | Last Updated on Sat, May 8 2021 6:25 PM

MEIL To Commission 30 Tonne Oxygen Plant in Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : కరోనా సెకెండ్ వేవ్ నేపథ్యంలో ఆసుపత్రుల్లో రోగులకు ఆక్సిజన్ అత్యవసరంగా మారింది. దాంతో సహజంగానే ఆక్సిజన్ సిలిండర్లకు డిమాండ్ పెరిగిపోయింది. ఉత్పత్తి సరైన స్థాయిలో లేకపోవడంతో ఆక్సిజన్ సిలిండర్ల సరఫరా అవసరమైన మేరకు జరగడం లేదు. ఈ ప‌రిస్థితుల్లో హైద‌రాబాద్‌లోని ప్ర‌ఖ్యాత నిమ్స్‌, అపోలో, స‌రోజినిదేవి వంటి ఆస్ప‌త్రుల నుంచి మేఘా ఇంజినీరింగ్ సంస్థ‌కు ఆక్సిజ‌న్ అందించ‌మ‌ని అభ్య‌ర్థ‌న‌లు వ‌చ్చాయి.. వ‌చ్చిందే త‌డ‌వుగా మేఘా ఇంజినీరింగ్ సంస్థ ఆక్సిజ‌న్ సిలిండ‌ర్ల‌ను భారీ స్థాయిలో ఉచితంగా స‌ర‌ఫ‌రా చేయాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్లు తెలుస్తోంది. ఆక్సిజ‌న్ సేక‌ర‌ణ కోసం భ‌ద్రాచ‌లంలోని ఐటీసీ, హైద‌రాబాద్‌లోని డిఆర్‌డివోతో ఆఘ‌మేఘాల మీద ఒప్పందం చేసుకున్న‌ట్లు స‌మాచారం.

దేశంలో కరోనా విలయతాండవం చేస్తోంది. ముఖ్యంగా కోవిడ్ రోగులు ఆక్సిజన్ సమస్యతో సతమతమవుతున్నారు. ఆక్సిజన్ అందక రోజుకు కొన్ని వందల మంది కోవిడ్ మహమ్మారితో పోరాడుతూ ప్రాణాలు విడుస్తున్నారు. అలాంటి విపత్కర పరిస్థితులను ఎదుర్కొనేందుకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు ప్రైవేటు సంస్థల సహకారంతో ఆక్సిజన్ అవసరమయ్యే అన్ని హాస్పిటల్స్‌కు ఆక్సిజన్ సరఫరా చేయాలని నిర్ణయించాయి. ఇందులో భాగంగా మేఘా ఇంజనీరింగ్ ప్రభుత్వం సహకారంతో వివిధ హాస్పిటల్స్ కు ఉచితంగా ఆక్సిజన్ సిలిండర్లను సరఫరా చేయనుంది.

కోవిడ్ రోగుల అవసరాలకు అనుగుణంగా నిమ్స్ హాస్పిటల్ యాజమాన్యం ఆక్సిజన్ బెడ్లను పెంచుతూ పోతోంది. ప్రస్తుతం 180 నుంచి 500 బెడ్లకు పెంచారు. పెంచిన బెడ్లకు అనుగుణంగా నిమ్స్ లో రోజుకు 50 బి.టైప్ మెడికల్ ఆక్సిజన్ సిలిండర్లు (ఒక్కొక్క సిలిండర్ 7000 లీటర్లు) ఏర్పాటు అవసరం అవుతుందని నిమ్స్ డైరెక్టర్ డా. మనోహర్ ఎంఈఐఎల్ సంస్థకు రాసిన లేఖలో పేర్కొన్నారు. అలాగే సరోజిని దేవి కంటి ఆసుప్రతికి రోజుకు దాదాపు 200 సిలిండర్లను అందించబోతుంది మేఘా సంస్థ. ఇక అపోలో హాస్పిటల్స్‌కు ప్రతి రోజు 100 సిలిండర్లు, కేర్ హైటెక్ కు 50 సిలిండర్లను సరఫరా చేయనుంది. ఇక భవిష్యత్తులో ఆసుపత్రుల నుంచి వచ్చే ఆక్సిజన్ విజ్ఞప్తి  మేరకు సరఫరా చేసేందుకు ఉత్పత్తి, సరఫరా వ్యవస్థను మెరుగుపరిచేందుకు మేఘా ఇంజనీరింగ్ యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టింది. 

చదవండి: షిప్పింగ్‌ కార్పొరేషన్‌ వేటలో మేఘా

డీఆర్‌డీవో టెక్నాలజీ సహకారంతో మేఘా ఇంజనీరింగ్ సంస్థ 30 నుంచి 40 ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తోంది. ఒక్కొక్క ప్లాంటు నుంచి నిమిషానికి 150 నుంచి 1000 లీటర్ల ఆక్సిజన్ ను ఉత్పత్తి చేయనున్నారు. ఈ మొత్తాన్ని డి.ఆర్.డి.వో కల్నల్ బి.ఎస్. రావత్, డా. రాఘవేంద్ర రావు పర్యవేక్షించనున్నారు. మొత్తానికి డి.ఆర్.డి.వో సహకారంతో మేఘా ఇంజనీరింగ్ 35 ల‌క్ష‌ల లీట‌ర్ల ఆక్సిజ‌న్ మేఘా సంస్థ ఆస్ప‌త్రుల‌కు స‌ర‌ఫ‌రా చేస్తుంది. ఈ మేరకు ఆయా హాస్పిటల్ నుంచి అభ్యర్థనలు వచ్చాయి. వీటికి అనుగుణంగా ఆక్సిజన్ ను ఉత్పత్తి చేసి సరఫరా చేయనుంది మేఘా సంస్థ. 

ఇక భద్రాచలం ఐటీసీ నుంచి రోజుకు 30 మెట్రిక్ టన్నుల క్రయోజనిక్ ఆక్సిజన్ ను తీసుకొని ఎంఈఐఎల్ సంస్థ లిక్విడ్ ఆక్సిజన్ గా మార్చనుంది. ఇందుకు అనుగుణంగా భద్రాచలం ఐటీసీ దగ్గర ప్లాంట్ ను ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ క్రయోజనిక్ ఆక్సిజన్ లభ్యమవుతోంది. స్పెయిన్‌లో ఉన్న ఎంఈఐఎల్‌కు సంబంధించి కర్మాగారం నుంచి క్రయోజనిక్ ఆక్సిజన్ ట్యాంకులను  దిగుమతి చేసేందుకు సంస్థ సంసిద్ధత వ్యక్తం చేసింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాసింది. అక్కడి ఫ్యాక్టరీ నుంచి 10 నుంచి 15 ట్యాంకులను ఇక్కడి ఆక్సిజన్ నిల్వ, సరఫరా అవసరాల నిమిత్తం ఉపయోగించుకునేందుకు యుద్ధ ప్రాతిపాదికన తీసుకువచ్చేందుకు ఆసక్తి చూపింది. ఈ మేరకు ప్రభుత్వానికి లేఖ రాసింది. 

అదే సమయంలో ఎంఈఐఎల్ కు సంబంధించిన నగర శివారులోని పరిశ్రమల్లో క్రయోజనిక్ ఆక్సిజన్ ట్యాంకులను యుద్ధ ప్రతిపాదికన తయారు చేసి అందించేందుకు కూడా సంసిద్ధత తెలిపింది. ఇందుకు సంబంధించిన డిజైన్లు, డ్రాయింగ్ లతో పాటు డాక్యుమెంట్లను ప్రభుత్వానికి అందించనుంది. ప్రభుత్వ పరిశీలన, అనుమతి అనంతరం వాటి తయారీకి వెంటనే రంగంలోకి దిగుతుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement