సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా ఉధృతి నియంత్రణలోకి వస్తోంది. వైరస్ వ్యాప్తి తగ్గుతుండగా బాధితులు వేగంగా కోలుకుంటున్నారు. మూడు వారాలుగా కొనసాగుతున్న లాక్ డౌన్, వైద్యారోగ్య శాఖ చేపట్టిన ఓపీ (ఔట్ పేషెంట్) సర్వే, ఇంటింటి సర్వే, లక్షణాలు ఉన్నవారికి ఇండ్ల వద్దే మందుల కిట్లు అందజేయడం ఫలితాన్ని ఇస్తున్నాయి. ఓ వైపు కొత్త కేసుల నమోదు తగ్గడం, మరోవైపు కోలుకుని డిశ్చార్జి అవుతున్న వారి సంఖ్య పెరగడంతో.. ఆస్పత్రుల్లో కరోనా పడకలు ఖాళీ అవుతున్నాయి. రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులలో కలిపి కోవిడ్ చికిత్స కోసం 55,352 పడకలు కేటాయించగా.. ఇందులో 34,959 పడకలు (63.15 శాతం) ఖాళీగా ఉన్నట్టు వైద్యారోగ్య శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. క్రమంగా కొత్త కేసులు, పాజిటివిటీ రేటు తగ్గుతున్నాయని.. మరో పక్షం రోజుల్లో పరిస్థితి మరింత అదుపులోకి వస్తుందని ప్రజారోగ్య విభాగం సంచాలకుడు జి.శ్రీనివాసరావు తెలిపారు. నెలాఖరులోగా సెకండ్‌వేవ్ తీవ్రత నుంచి బయటపడతామన్నారు.
కొద్దిరోజులు భయపెట్టి..
గత నెల చివరి రెండు వారాల్లో, ఈ నెల తొలి వారంలో కరోనా కేసులు పెద్ద సంఖ్యలో నమోదయ్యాయి. బాధితుల సంఖ్య ఒక్కసారిగా పెరిగిపోవడంతో ఆస్పత్రులు నిండిపోయాయి. బెడ్ల కోసం పేషెంట్లు పడిగాపులు పడ్డారు. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అయితే ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో ఆక్సిజన్, ఐసీయూ బెడ్ దొర కని పరిస్థితి ఏర్పడింది. అంబులెన్స్ సైరన్లు గుండె పగిలేలా ధ్వనించాయి. అంబులెన్సుల్లో, ఆస్పత్రుల ఆవరణలో పేషెంట్లు ప్రాణాలు విడిచిన ఘటనలు జరిగాయి. అలాంటి పరిస్థితి నుంచి ప్రస్తుతం ఆస్పత్రుల్లో బెడ్లు ఖాళీగా కనిపించే దశ వచ్చింది.
పకడ్బందీ చర్యలతో..
రాష్ట్రంలో ఈ నెల 12వ తేదీ నుంచి అమలవుతున్న లాక్ డౌన్‌తో జనం బయట తిరగడం తగ్గింది. దానికితోడు లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేయడంపై పోలీసు శాఖ దృష్టిపెట్టింది. మరోవైపు సర్కారు కరోనా టెస్టుల సంఖ్యను కూడా బాగా పెంచింది. రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటి సర్వే చేపట్టిన ప్రభుత్వం.. ఎవరికైనా కరోనా లక్షణాలు ఉన్నాయా, జ్వరం, దగ్గు, జలుబుతో బాధపడుతున్నారా అన్నది పరిశీలించి.. లక్షణాలు ఉన్నవారికి అక్కడిక్కడే మందుల కిట్లను అందించే కార్యక్రమాన్ని నిర్వహించింది. సెకండ్ వేవ్ మొదట్లో గ్రామీణ ప్రాంతాలను కమ్మేసిన కరోనా మెల్లగా తగ్గుముఖం పడుతోంది. ఆస్పత్రుల వరకు వెళ్లకుండా.. ఇంట్లో ఉండి ప్రభుత్వం పంపిణీ చేసిన మందులు వాడటం బాగానే ఉపయోగపడిందని అధికారులు చెప్తున్నారు. రాష్ట్రం కరోనా సెకండ్ వేవ్ ముప్పు నుంచి బయటపడినట్లేనని ప్రజారోగ్య విభాగం సంచాలకుడు శ్రీనివాసరావు కూడా ఇటీవల ప్రకటించడం గమనార్హం.
ఒకప్పటి పరిస్థితి ఇదీ
గాంధీ ఆస్పత్రిలో పడకలు ఖాళీలేక అంబులెన్స్‌లోనే వేచి ఉన్న బాధితులు(ఫైల్)
హైదరాబాద్‌లో పేషెంట్లు ఎక్కువున్నా..
రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో బెడ్లు ఖాళీ అయినా.. హైదరాబాద్‌లోని ఆస్పత్రుల్లో మాత్రం బాధితుల సంఖ్య కొంత ఎక్కువగానే ఉంది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ చికిత్స పొందుతున్నవారు గణనీయంగా ఉన్నారని.. అందుకే హైదరాబాద్‌లోని ఆస్పత్రుల్లో పేషెంట్ల సంఖ్య ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తోందని వైద్యారోగ్య శాఖ వర్గాలు పేర్కొన్నాయి.
ఆక్సిజన్ బెడ్లు సగంపైగా ఖాళీ
కరోనా ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉండి, ఆక్సిజన్ అవసరమైన వారు ఆస్పత్రుల్లో చేరుతున్నారని.. స్వల్ప, మధ్యస్థ లక్షణాలున్న వారిలో 85 శాతం మంది హోం ఐసోలేషన్‌లో ఉంటూ చికిత్స తీసుకుంటున్నారని వైద్యారోగ్య శాఖ వర్గాలు చెప్తున్నాయి. కొద్దిరోజుల కిందటి వరకు.. శ్వాస సమస్య ఎక్కువై, ఆక్సిజన్ పెట్టాల్సిన వారి సంఖ్య ఎక్కువగా ఉండేదని.. ప్రస్తుతం తక్కువగా ఉంటోందని అంటున్నాయి. వైద్యారోగ్య శాఖ లెక్కల ప్రకారం.. రాష్ట్రవ్యాప్తంగా 21,704 ఆక్సిజన్ బెడ్లు ఉండగా.. 10,278 బెడ్లలో పేషెంట్లు ఉన్నారు. మిగతా 11,426 బెడ్లు (52.64 శాతం) ఖాళీగా ఉన్నాయి. ఇక ఐసీయూ/వెంటిలేటర్ కేటగిరీలో 11,811 పడకలు ఉండగా.. ప్రస్తుతం 6,372 మంది చికిత్స తీసుకుంటున్నారు. 5,439 పడకలు (46.06 శాతం) ఖాళీగా ఉన్నాయి. రాష్ట్రంలో కరోనా టెస్టుల సంఖ్యను రోజుకు లక్ష వరకు పెంచారని.. కేసులు తక్కువగానే వస్తున్నాయని వైద్యారోగ్య శాఖ అధికారులు తెలిపారు. ఈ లెక్కన కరోనా నియంత్రణలోకి వస్తున్నట్టేనని పేర్కొన్నారు.
ఒక్కరోజే 205 మంది డిశ్చార్జి
గాంధీ ఆస్పత్రి: కోవిడ్ నోడల్ కేంద్రమైన సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి నుంచి ఒక్కరోజే రికార్డు స్థాయిలో కరోనా బాధితులు డిశ్చార్జి అయ్యారు. మహమ్మారిని జయించి పూర్తిస్థాయిలో కోలుకున్న 205 మంది శుక్రవారం తమ ఇళ్లకు వెళ్లారు. సెకండ్ వేవ్‌లో ఒక రోజులో ఇంతమంది డిశ్చార్జి కావడం ఇదే మొదటిసారి అని ఆస్పత్రి సూపరింటెండెంట్ రాజారావు, నోడల్ అధికారి ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. ప్రస్తుతం గాంధీ ఆస్పత్రిలో 12 వందల మందికి పైగా చికిత్స పొందుతున్నారని చెప్పారు. ప్రభుత్వ చర్యలు, లాక్‌డౌన్ నేపథ్యంలో కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టిందని పేర్కొన్నారు. ఇక గాంధీలో 149 మంది బ్లాక్ ఫంగస్ బా«ధితులు ఉన్నారని, అందులో శనివారం నాలుగు సర్జరీలు నిర్వహించామని వెల్లడించారు. బాధితులు క్రమంగా కోలుకుంటున్నారని తెలిపారు. జూన్ రెండో వారం నాటికి రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ నియంత్రణలోకి వచ్చే అవకాశం ఉందని చెప్పారు.
ప్రధాన ప్రభుత్వాస్పత్రుల్లో ఇలా..
►ఆదిలాబాద్ రిమ్స్‌లో కరోనా పేషెంట్లకు 550 పడకలు కేటాయించగా.. 514 పడకలు ఖాళీగా ఉన్నాయి.
►నిమ్స్‌లో 173 పడకలుంటే అన్నింట్లో పేషెంట్లు ఉన్నారు.
►గాంధీ ఆస్పత్రిలో 1,869 పడకలుండగా, 1,263 మంది రోగులున్నారు. 606 బెడ్లు ఖాళీగా ఉన్నాయి.
►ఉస్మానియా జనరల్ ఆస్పత్రిలో ఉన్న 261 బెడ్లు ఖాళీగా ఉన్నాయి.
►మహబూబ్‌నగర్ జనరల్ ఆస్పత్రిలో 500 పడకల్లో 251 పేషెంట్లు ఉన్నారు. మిగతావి ఖాళీ.
►నల్లగొండ జనరల్ ఆస్పత్రిలో 380 పడకలకు 148 బెడ్లలో రోగులున్నారు.
►నిజామాబాద్ జనరల్ ఆస్పత్రిలో 357 ఖాళీగానే ఉన్నాయి.
►గచ్చిబౌలి టిమ్స్‌లో 1,261 పడకలు కోవిడ్ కోసం కేటాయించగా 524 పడకల్లో మాత్రమే రోగులున్నారు.
►సిద్దిపేట జనరల్ ఆస్పత్రిలో 360 బెడ్లు ఉంటే 157 మందే
రోగులున్నారు. వరంగల్ ఎంజీఎంలో 1,170 బెడ్లు ఉండగా.. 704 ఖాళీగానే ఉన్నాయి.
►బీబీనగర్ ఎయిమ్స్‌లో 50 పడకల్లో 10 మందే చికిత్స పొందుతున్నారు.
సగంపైన బెడ్లు ఖాళీ..
రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. సీరియస్ కేసులు బాగా తగ్గాయి. ఆస్పత్రుల్లో చేరేవారి సంఖ్య బాగా తగ్గింది. రాష్ట్రంలో ఉన్న 10 ప్రభుత్వ బోధనాస్పత్రుల్లో సగం కంటే ఎక్కువ బెడ్లు ఖాళీగా ఉన్నాయి. ఆస్పత్రుల్లో సాధారణ బెడ్లు 80 శాతం వరకు ఖాళీగా ఉండటాన్ని బట్టి కోవిడ్ తీవ్రత తగ్గుముఖం పట్టిందని చెప్పొచ్చు.
– రమేశ్‌రెడ్డి, వైద్యవిద్య సంచాలకుడు
చదవండి: ఎక్స్‌ట్రా మసాలా.. లెగ్ పీస్ లేదు.. స్పందించిన కేటీఆర్
Comments
Please login to add a commentAdd a comment