Beds
-
కేజీబీవీ విద్యార్థినులకు బంకర్ బెడ్లు
సాక్షి, అమరావతి: కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయా (కేజీబీవీ)ల్లో మెరుగైన సదుపాయాల కల్పనపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. రాష్ట్రంలోని 352 కేజీబీవీల్లో ఆరు నుంచి ఇంటర్మిడియెట్ వరకు చదువుతున్న 98,560 మంది విద్యార్థినులకు మంచాలు అందించాలని అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. విద్యార్థినులకు అన్ని రకాలుగా అనువుగా ఉండేలా స్టోరేజీ బాక్స్‌తో ఉండే రెండు లేదా మూండంచెల బంకర్ బెడ్లను అందించాలన్నారు. వీటిని డిసెంబర్ నెలాఖరుకు ఆయా పాఠశాలలకు అందించాలని యోచిస్తున్నారు. దీంతో 98,560 మంది విద్యార్థినులకు మేలు కలగనుంది. కేజీబీవీలకు గత టీడీపీ ప్రభుత్వం 2018లో మందపాటి బొంతలను మాత్రమే ఇచ్చింది. ఈ క్రమంలో విద్యార్థినులకు అందుతున్న వసతులపై సమగ్ర శిక్ష, కేజీబీవీ అధికారులు ఆరా తీశారు. ఇటీవల జరిగిన ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో ఈ డిసెంబర్‌లోగా మంచాలు అందించాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. ఇప్పటికే కేజీబీవీల్లో చదువుతున్న బాలికల ఆరోగ్య సంరక్షణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. వారికి ప్రతి నెలా హిమోగ్లోబిన్ పరీక్షలు చేసి, అవసరమైనవారికి మాత్రలు అందజేసింది. ఆ పరీక్షల రిపోర్టును రికార్డు చేసేందుకు ‘హెచ్‌బీ పర్సంటేజ్’ కార్డులను సైతం ఆయా స్కూళ్లకు అందించింది. చదువుకునేందుకు కూడా ఉపయోగపడేలా.. ఏపీలో 2004–05 విద్యా సంవత్సరంలో కేజీబీవీలను అందుబాటులోకి తెచ్చారు. తొలుత 6 నుంచి 8వ తరగతి వరకు ప్రారంభించారు. అనంతరం ఇంటర్మిడియెట్ వరకు పెంచారు. ప్రస్తుతం ఈ విద్యాలయాల్లో 98,560 మంది విద్యార్థినులు చదువుతున్నారు. వీరికి గత ప్రభుత్వం బొంతలు మాత్రమే అందించడంతో నేలపై పడుకోవాలి్సన దుస్థితి తలెత్తింది. పేదింటి ఆడపిల్లలు చదువుకునే విద్యాలయాల్లో వారికి మంచాలు అందించడానికి అధికారులు సిద్ధమవుతున్నారు. ఇద్దరు లేదా ముగ్గురు విద్యార్థినులు పడుకునేలా, వాటిపై కూర్చుని చదువుకునేందుకు అనువైన ఎత్తు ఉండేలా బంకర్ బెడ్లను తయారు చేయిస్తున్నారు. ఒకదానిపై ఒకటి ఉండి ఇనుముతో చేసిన బంకర్ బెడ్లు అడుగున విద్యార్థినుల పుస్తకాలు, ఇతర సామగ్రి దాచుకునేందుకు వీలుగా స్టోరేజీ బాక్స్‌లను సైతం బిగించనున్నారు. -
నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి యువరాజ్ సాయం
-
యువీ దాతృత్వం.. నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి 120 ఐసీయూ బెడ్స్
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి ప్రభావం పతాక స్థాయిలో ఉన్నప్పుడు ఆసుపత్రుల్లో బెడ్లు దొరక్క సామన్య ప్రజలు ఎదుర్కొన్న అవస్థలను దగ్గరగా చూసిన టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్‌సింగ్.. బెడ్ల కొరత తీర్చేందుకు తన వంతు సాయం చేయాలని నిర్ణయించుకున్నాడు. తాజాగా, తన ఫౌండేషన్ (YouWeCan Foundation) ద్వారా తెలంగాణలోని నిజామాబాద్ ప్రభుత్వాస్పత్రిలో 120 ఐసీయూ బెడ్స్‌కు సాయం అందించాడు. ఈ ఐసీయూ బెడ్లను యువీ నేడు వర్చువల్‌గా ప్రారంభించాడు. కాగా, ఈ సిక్సర్ల వీరుడు.. గతంలో కూడా ఇలాంటి సహాయాలు చాలా చేశాడు. ఈ ఏడాది మే నెలలో తన ఫౌండేషన్ పేరిట మధ్యప్రదేశలోని ఇండోర్‌లో మూడున్న కోట్ల వ్యయంతో 100 పడకల ఆసుపత్రిని నిర్మించి ఇచ్చాడు. -
శృంగారంలో పాల్గొంటే మంచాలు విరుగుతాయా?
Tokyo olympics: జూలై నెల చివరి వారంలో ప్రారంభంకానున్న విశ్వ క్రీడలకు ప్రపంచ అథ్లెట్లు సంసిద్ధమవుతున్నారు. అయితే కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ఈ ఏడాది ఒలింపిక్స్ నిర్వహణ కత్తి మీద సాములా మారిందని చెప్పాలి. ఈ క్రమంలో అథ్లెట్ల మధ్య శృంగార కట్టడికి నిర్వాహకులు వినూత్న ఆలోచనను అమలు చేశారు. కరోనా నేపథ్యంలో క్రీడాకారులు రొమాన్స్ లో పాల్గొనకుండా ఒలింపిక్ గ్రామంలోని వాళ్లు బస చేస్తున్న గదుల్లో విచిత్రమైన బెడ్లను ఏర్పాటు చేశారు. అట్టలతో తయారు చేసిన మంచాలను క్రీడాకారుల గదులో ఉంచారు. దీనివల్ల ఆటగాళ్లు శృంగారంలో పాల్గొనే వీలుండదని అని వారి యోచన. ఒలింపిక్స్ ముగిశాక వీటిని రీసైక్లింగ్ చేసి కాగితపు ఉత్పత్తులుగా మార్చనున్నారు. క్రీడాకారుల మధ్య భౌతిక దూరం ఉండేందుకు ఈ చర్యలు చేపట్టారు. జూలై 24న ప్రారంభమయ్యే ఒలింపిక్స్ సందర్భంగా ఆటగాళ్ల బస కోసం 18,000 పడకలు అవసరం కాగా, పారా ఒలింపిక్స్‌కు 8,000 పడకలు మాత్రమే అవసరం అయ్యాయి. ప్రస్తుతం ఈ బెడ్ల ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా అవి వైరల్ గా మారి హల్ చల్ చేస్తున్నాయి. దీనిపై నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు. అయితే ఇవి గరిష్టంగా 200 కిలోల బరువు వరకు ఆపగలవని, యాంటీ సెక్స్ బెడ్స్ కథనాలను తోసిపుచ్చుతున్నారు ఒలింపిక్ నిర్వాహకులు. Beds to be installed in Tokyo Olympic Village will be made of cardboard, this is aimed at avoiding intimacy among athletes Beds will be able to withstand the weight of a single person to avoid situations beyond sports. I see no problem for distance runners,even 4 of us can do😂 pic.twitter.com/J45wlxgtSo — Paul Chelimo🇺🇸🥈🥉 (@Paulchelimo) July 17, 2021 *looks up ‘sex during the games’ in #Tokyo2020 health and safety handbook https://t.co/m4UaAYMhNz — James Longman (@JamesAALongman) July 19, 2021 “Anti-sex” beds at the Olympics pic.twitter.com/2jnFm6mKcB — Rhys Mcclenaghan (@McClenaghanRhys) July 18, 2021 -
ప్రతి ప్రభుత్వ ఆస్పత్రికి 10 ఐసీయూ బెడ్లు
సాక్షి, అమరావతి : నిరుపేదలకు నాణ్యమైన వైద్యాన్ని అందుబాటులోకి తీసుకురావాలన్న లక్ష్యంతో నిర్మాణ్ సంస్థ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఏపీలోని ప్రతి ప్రభుత్వ ఆస్పత్రిలో శాశ్వత ప్రాతిపదికన 10 ఐసీయూ బెడ్లను ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది. ప్రభుత్వ ఆస్పత్రుల రూపురేఖలను సమూలంగా మార్చి అత్యాధునికంగా తీర్చిదిద్దేదుoకు ప్రభుత్వం ఇప్పటికే నాడు-నేడు కార్యక్రమాన్ని చేపట్టింది. ప్రజారోగ్య రంగాన్ని పూర్తిగా ప్రక్షాళన చేసి మౌలిక వసతులను కల్పించడం ద్వారా సుస్థిర అభివృద్ధికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బాటలు వేస్తున్నారు. పేదలకు సైతం ప్రభుత్వ ఆస్పత్రుల ద్వారా కార్పొరేట్ వైద్యాన్ని అందించాలన్న సంకల్పంతో సీఎం జగన్ ముందుకు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వానికి తమ వంతు సహకారం అందించేందుకు నిర్మాణ్ సంస్థ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. నిర్మాణ్ సంస్థ ఆపరేషన్స్ హెడ్ శ్రీకాంత్ నాథాముని, ఖోశ్లా వెంచర్స్ ఫౌండర్ వినోద్ ఖోశ్లా ఈ ఆలోచన కార్యరూపం దాల్చడానికి ముఖ్యకారకులు. ఏపీ ప్రభుత్వం తరపున న ఏలూరు పార్లమెంటు సభ్యులు కోటగిరి శ్రీధర్, ఉత్తర అమెరికా- రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి పండుగాయల రత్నాకర్ ఈ గొప్ప కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లనున్నారు. ఇందులో భాగంగా దాతలను గుర్తించి, వారిని విరాళం అందించేలా ప్రోత్సహించనున్నారు. ప్రభుత్వ ఒప్పందంలో భాగంగా ప్రతి ఐసీయూ యూనిట్ మీద సంబంధిత దాతల పేరు ఉంటుంది. ఇందుకు సంబంధించిన కార్యకలాపాలను పర్యవేక్షించేందుకు ప్రభుత్వం డా. అర్జా శ్రీకాంత్‌ను ముఖ్య అధికారిగా నియమించింది. ఈ కార్యక్రమం ద్వారా గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లోని ప్రజలకు.. ప్రభుత్వ ఆస్పత్రులు మెరుగైన వైద్య సేవలందించేందుకు సిద్ధం కాబోతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ కార్యక్రమాన్ని జూన్ 5న మంత్రి కల్వకుంట్ల తారక్ రామారావు ప్రారంభించారు. పేదలకు ఆరోగ్య భద్రతకు భరోసా కల్పించే ఈ బృహత్తర కార్యక్రమంలో భాగం కావాల్సిందిగా ప్రతి ఒక్కరికీ మా విన్నపం. ఇప్పటికి 22 ప్రభుత్వ వైద్యశాలలకు దాతలు ముందుకు వచ్చారు , ఇంకా విరాళం అందించేందుకు ఆసక్తి ఉన్న దాతలు ఈ క్రింది లింక్ ద్వారా తమ విరాళాన్ని అందించవచ్చు. -
Telangana: పడకలు ఖాళీ!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా ఉధృతి నియంత్రణలోకి వస్తోంది. వైరస్ వ్యాప్తి తగ్గుతుండగా బాధితులు వేగంగా కోలుకుంటున్నారు. మూడు వారాలుగా కొనసాగుతున్న లాక్ డౌన్, వైద్యారోగ్య శాఖ చేపట్టిన ఓపీ (ఔట్ పేషెంట్) సర్వే, ఇంటింటి సర్వే, లక్షణాలు ఉన్నవారికి ఇండ్ల వద్దే మందుల కిట్లు అందజేయడం ఫలితాన్ని ఇస్తున్నాయి. ఓ వైపు కొత్త కేసుల నమోదు తగ్గడం, మరోవైపు కోలుకుని డిశ్చార్జి అవుతున్న వారి సంఖ్య పెరగడంతో.. ఆస్పత్రుల్లో కరోనా పడకలు ఖాళీ అవుతున్నాయి. రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులలో కలిపి కోవిడ్ చికిత్స కోసం 55,352 పడకలు కేటాయించగా.. ఇందులో 34,959 పడకలు (63.15 శాతం) ఖాళీగా ఉన్నట్టు వైద్యారోగ్య శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. క్రమంగా కొత్త కేసులు, పాజిటివిటీ రేటు తగ్గుతున్నాయని.. మరో పక్షం రోజుల్లో పరిస్థితి మరింత అదుపులోకి వస్తుందని ప్రజారోగ్య విభాగం సంచాలకుడు జి.శ్రీనివాసరావు తెలిపారు. నెలాఖరులోగా సెకండ్‌వేవ్ తీవ్రత నుంచి బయటపడతామన్నారు. కొద్దిరోజులు భయపెట్టి.. గత నెల చివరి రెండు వారాల్లో, ఈ నెల తొలి వారంలో కరోనా కేసులు పెద్ద సంఖ్యలో నమోదయ్యాయి. బాధితుల సంఖ్య ఒక్కసారిగా పెరిగిపోవడంతో ఆస్పత్రులు నిండిపోయాయి. బెడ్ల కోసం పేషెంట్లు పడిగాపులు పడ్డారు. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అయితే ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో ఆక్సిజన్, ఐసీయూ బెడ్ దొర కని పరిస్థితి ఏర్పడింది. అంబులెన్స్ సైరన్లు గుండె పగిలేలా ధ్వనించాయి. అంబులెన్సుల్లో, ఆస్పత్రుల ఆవరణలో పేషెంట్లు ప్రాణాలు విడిచిన ఘటనలు జరిగాయి. అలాంటి పరిస్థితి నుంచి ప్రస్తుతం ఆస్పత్రుల్లో బెడ్లు ఖాళీగా కనిపించే దశ వచ్చింది. పకడ్బందీ చర్యలతో.. రాష్ట్రంలో ఈ నెల 12వ తేదీ నుంచి అమలవుతున్న లాక్ డౌన్‌తో జనం బయట తిరగడం తగ్గింది. దానికితోడు లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేయడంపై పోలీసు శాఖ దృష్టిపెట్టింది. మరోవైపు సర్కారు కరోనా టెస్టుల సంఖ్యను కూడా బాగా పెంచింది. రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటి సర్వే చేపట్టిన ప్రభుత్వం.. ఎవరికైనా కరోనా లక్షణాలు ఉన్నాయా, జ్వరం, దగ్గు, జలుబుతో బాధపడుతున్నారా అన్నది పరిశీలించి.. లక్షణాలు ఉన్నవారికి అక్కడిక్కడే మందుల కిట్లను అందించే కార్యక్రమాన్ని నిర్వహించింది. సెకండ్ వేవ్ మొదట్లో గ్రామీణ ప్రాంతాలను కమ్మేసిన కరోనా మెల్లగా తగ్గుముఖం పడుతోంది. ఆస్పత్రుల వరకు వెళ్లకుండా.. ఇంట్లో ఉండి ప్రభుత్వం పంపిణీ చేసిన మందులు వాడటం బాగానే ఉపయోగపడిందని అధికారులు చెప్తున్నారు. రాష్ట్రం కరోనా సెకండ్ వేవ్ ముప్పు నుంచి బయటపడినట్లేనని ప్రజారోగ్య విభాగం సంచాలకుడు శ్రీనివాసరావు కూడా ఇటీవల ప్రకటించడం గమనార్హం. ఒకప్పటి పరిస్థితి ఇదీ గాంధీ ఆస్పత్రిలో పడకలు ఖాళీలేక అంబులెన్స్‌లోనే వేచి ఉన్న బాధితులు(ఫైల్) హైదరాబాద్‌లో పేషెంట్లు ఎక్కువున్నా.. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో బెడ్లు ఖాళీ అయినా.. హైదరాబాద్‌లోని ఆస్పత్రుల్లో మాత్రం బాధితుల సంఖ్య కొంత ఎక్కువగానే ఉంది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ చికిత్స పొందుతున్నవారు గణనీయంగా ఉన్నారని.. అందుకే హైదరాబాద్‌లోని ఆస్పత్రుల్లో పేషెంట్ల సంఖ్య ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తోందని వైద్యారోగ్య శాఖ వర్గాలు పేర్కొన్నాయి. ఆక్సిజన్ బెడ్లు సగంపైగా ఖాళీ కరోనా ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉండి, ఆక్సిజన్ అవసరమైన వారు ఆస్పత్రుల్లో చేరుతున్నారని.. స్వల్ప, మధ్యస్థ లక్షణాలున్న వారిలో 85 శాతం మంది హోం ఐసోలేషన్‌లో ఉంటూ చికిత్స తీసుకుంటున్నారని వైద్యారోగ్య శాఖ వర్గాలు చెప్తున్నాయి. కొద్దిరోజుల కిందటి వరకు.. శ్వాస సమస్య ఎక్కువై, ఆక్సిజన్ పెట్టాల్సిన వారి సంఖ్య ఎక్కువగా ఉండేదని.. ప్రస్తుతం తక్కువగా ఉంటోందని అంటున్నాయి. వైద్యారోగ్య శాఖ లెక్కల ప్రకారం.. రాష్ట్రవ్యాప్తంగా 21,704 ఆక్సిజన్ బెడ్లు ఉండగా.. 10,278 బెడ్లలో పేషెంట్లు ఉన్నారు. మిగతా 11,426 బెడ్లు (52.64 శాతం) ఖాళీగా ఉన్నాయి. ఇక ఐసీయూ/వెంటిలేటర్ కేటగిరీలో 11,811 పడకలు ఉండగా.. ప్రస్తుతం 6,372 మంది చికిత్స తీసుకుంటున్నారు. 5,439 పడకలు (46.06 శాతం) ఖాళీగా ఉన్నాయి. రాష్ట్రంలో కరోనా టెస్టుల సంఖ్యను రోజుకు లక్ష వరకు పెంచారని.. కేసులు తక్కువగానే వస్తున్నాయని వైద్యారోగ్య శాఖ అధికారులు తెలిపారు. ఈ లెక్కన కరోనా నియంత్రణలోకి వస్తున్నట్టేనని పేర్కొన్నారు. ఒక్కరోజే 205 మంది డిశ్చార్జి గాంధీ ఆస్పత్రి: కోవిడ్ నోడల్ కేంద్రమైన సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి నుంచి ఒక్కరోజే రికార్డు స్థాయిలో కరోనా బాధితులు డిశ్చార్జి అయ్యారు. మహమ్మారిని జయించి పూర్తిస్థాయిలో కోలుకున్న 205 మంది శుక్రవారం తమ ఇళ్లకు వెళ్లారు. సెకండ్ వేవ్‌లో ఒక రోజులో ఇంతమంది డిశ్చార్జి కావడం ఇదే మొదటిసారి అని ఆస్పత్రి సూపరింటెండెంట్ రాజారావు, నోడల్ అధికారి ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. ప్రస్తుతం గాంధీ ఆస్పత్రిలో 12 వందల మందికి పైగా చికిత్స పొందుతున్నారని చెప్పారు. ప్రభుత్వ చర్యలు, లాక్డౌన్ నేపథ్యంలో కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టిందని పేర్కొన్నారు. ఇక గాంధీలో 149 మంది బ్లాక్ ఫంగస్ బా«ధితులు ఉన్నారని, అందులో శనివారం నాలుగు సర్జరీలు నిర్వహించామని వెల్లడించారు. బాధితులు క్రమంగా కోలుకుంటున్నారని తెలిపారు. జూన్ రెండో వారం నాటికి రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ నియంత్రణలోకి వచ్చే అవకాశం ఉందని చెప్పారు. ప్రధాన ప్రభుత్వాస్పత్రుల్లో ఇలా.. ►ఆదిలాబాద్ రిమ్స్‌లో కరోనా పేషెంట్లకు 550 పడకలు కేటాయించగా.. 514 పడకలు ఖాళీగా ఉన్నాయి. ►నిమ్స్‌లో 173 పడకలుంటే అన్నింట్లో పేషెంట్లు ఉన్నారు. ►గాంధీ ఆస్పత్రిలో 1,869 పడకలుండగా, 1,263 మంది రోగులున్నారు. 606 బెడ్లు ఖాళీగా ఉన్నాయి. ►ఉస్మానియా జనరల్ ఆస్పత్రిలో ఉన్న 261 బెడ్లు ఖాళీగా ఉన్నాయి. ►మహబూబ్‌నగర్ జనరల్ ఆస్పత్రిలో 500 పడకల్లో 251 పేషెంట్లు ఉన్నారు. మిగతావి ఖాళీ. ►నల్లగొండ జనరల్ ఆస్పత్రిలో 380 పడకలకు 148 బెడ్లలో రోగులున్నారు. ►నిజామాబాద్ జనరల్ ఆస్పత్రిలో 357 ఖాళీగానే ఉన్నాయి. ►గచ్చిబౌలి టిమ్స్‌లో 1,261 పడకలు కోవిడ్ కోసం కేటాయించగా 524 పడకల్లో మాత్రమే రోగులున్నారు. ►సిద్దిపేట జనరల్ ఆస్పత్రిలో 360 బెడ్లు ఉంటే 157 మందే రోగులున్నారు. వరంగల్ ఎంజీఎంలో 1,170 బెడ్లు ఉండగా.. 704 ఖాళీగానే ఉన్నాయి. ►బీబీనగర్ ఎయిమ్స్‌లో 50 పడకల్లో 10 మందే చికిత్స పొందుతున్నారు. సగంపైన బెడ్లు ఖాళీ.. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. సీరియస్ కేసులు బాగా తగ్గాయి. ఆస్పత్రుల్లో చేరేవారి సంఖ్య బాగా తగ్గింది. రాష్ట్రంలో ఉన్న 10 ప్రభుత్వ బోధనాస్పత్రుల్లో సగం కంటే ఎక్కువ బెడ్లు ఖాళీగా ఉన్నాయి. ఆస్పత్రుల్లో సాధారణ బెడ్లు 80 శాతం వరకు ఖాళీగా ఉండటాన్ని బట్టి కోవిడ్ తీవ్రత తగ్గుముఖం పట్టిందని చెప్పొచ్చు. – రమేశ్‌రెడ్డి, వైద్యవిద్య సంచాలకుడు చదవండి: ఎక్స్ట్రా మసాలా.. లెగ్ పీస్ లేదు.. స్పందించిన కేటీఆర్ -
కరోనా: తమిళనాడుకు మేఘా సహాయం
దేశంలో వివిధ రాష్ట్రాల్లో కరోనా పేషంట్లను ఆదుకునేందుకు వివిధ ప్రభుత్వాలకు సహాయసహకారాలు అందిస్తున్న విధంగానే హైదరాబాద్‌కు చెందిన మేఘా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (ఎంఈఐఎల్) సంస్థ. తాజాగా తమిళనాడు వ్యాప్తంగా ఉచితంగా 2500 ఆక్సిజన్ బెడ్లను ఏర్పాటు చేస్తోంది. ఇందులో భాగంగా మదురైలో కేవలం 72 గంటల్లోనే 500 ఆక్సిజన్ బెడ్లను సిద్ధం చేసింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలకు ఆక్సిజన్ ట్యాంకర్లను, బెడ్స్‌ను, ఆస్పత్రులకు వివిధ మౌళిక సదుపాయాలను కల్పించిన ఎంఈఐఎల్, తమిళనాడు వ్యాప్తంగా కరోనా బాధితుల కోసం ఉచితంగా ఆస్పత్రులలో ఆక్సిజన్ బెడ్స్‌ను ఏర్పాటు చేస్తోంది. మేఘా ఇంజనీరింగ్ తో పాటు తమిళనాడుకు చెందిన క్రెడాయ్, జి రియల్టర్స్ సంస్థ ఇందులో భాగస్తులయ్యాయి. ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ ఈ కార్యక్రమాన్ని నేరుగా పర్యావేక్షిస్తున్నారు. చెన్నైలో 1070 ఆక్సిజన్ బెడ్లు గ్రేటర్ చెన్నై పరిధిలోని ఆసుపత్రులలో 1070 ఆక్సిజన్ బెడ్ల ను మేఘా ఇంజనీరింగ్ సంస్థ యుద్ధపాత్రిపదికన పనులు చేస్తోంది. వీటితో పాటు ఇరోడ్ జిల్లాలో 200, వెల్లూరు 250, అంబూరు 100, నట్టారం వళ్లి 100, మెలిశ్వరం 100, అయ్యపాకం 200, శోలింగార్ 50, వనియంబాడిలో 100, వల్లఝాలో 100 ఆక్సిజన్ పడకల ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే 660 బెడ్లను సిద్ధం చేసిన ఎంఈఐఎల్ రాబోయే రోజుల్లో 2500 బెడ్ల ఏర్పాటు చేయబోతోంది. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న మేఘా ఇంజనీరింగ్ సంస్థ (ఎంఈఐఎల్) తనవంతు సహాయంగా తమిళనాడుకు ఆక్సిజన్ బెడ్లను అందిస్తోంది. ఈ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా 20 దేశాల్లో తన కార్యకలాపాలను కొనసాగిస్తోంది. మేఘాకు సేవల్లో పాలు భాగస్తులైన క్రెడాయ్, జి రియల్టర్స్ మధురై ప్రభుత్వ ఆసుపత్రి (తోప్పూర్ జిహెచ్) లో తమిళనాడు ముఖ్యమంత్రి ఎం. కె. స్టాలిన్ 500 స్కేలబుల్ ఆక్సిజనేటెడ్ బెడ్ సౌకర్యాలను మే 21 ప్రారంభించారు. ఇందులో 200 ఆక్సిజన్ పడకలు అందుబాటులోకి వచ్చాయి. మిగిలిన 300 పడకలు త్వరలో ప్రజల ఉపయోగం కోసం అందుబాటులో ఉంచనున్నారు. మేఘా సంస్థ చొరవతో ప్రజలకు ఉచిత చికిత్సను అందిస్తున్నారు. జి స్క్వేర్ రియల్టర్స్, మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్, క్రెడాయి మదురై జిహెచ్ వద్ద 72 గంటల రికార్డు సమయంలో 500 ఆక్సిజన్ బెడ్ సౌకర్యాలను ఏర్పాటు చేశాయి. జి స్క్వేర్ రియల్టర్ తో కలిసి మేఘా ఇంజనీరింగ్ సంస్థ చెన్నై అన్నా నగర్ ప్రభుత్వ ఆసుపత్రితో పాటు ఒమాండురార్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక్కొక్కటి 100 ఆక్సిజనేటెడ్ పడకలను ఏర్పాటు చేశారు. కరోనా సంక్షోభం తీవ్ర రూపం దాల్చి ఆక్సిజన్ కొరత అధికమవుతున్నప్పటి నుంచి ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులకు ఉచితంగా ఆక్సిజన్ సరఫరా చేసేందుకు మేఘా యాజమాన్యం కృషి చేస్తోంది. అందులో భాగంగానే సంస్థ ఉన్నతస్థాయి యాజమాన్యమే కాకుండా మొత్తం యంత్రాంగం ఇదే పనిలో నిమగ్నమయ్యింది. కరోనా సమయంలో తమ వంతుగా దేశానికి సేవ చేయడం బాధ్యతగా భావిస్తున్నామని ఎంఈఐఎల్ డైరెక్టర్ బి. శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. కోవిడ్ రోగులను ఆదుకునేందుకు ప్రభుత్వానికి సహాయ సహకారాలు అందించడం కోసం ప్రత్యేకంగా ఒక బృందం పనిచేస్తోందని ఆయన తెలిపారు. ఈ మొత్తం వ్యవహారాన్ని ఎంఈఐఎల్ మేనేజింగ్ డైరెక్టర్ కృష్ణా రెడ్డి పర్యవేక్షిస్తున్నారన్నారు. క్రెడాయ్ తమిళనాడు అధ్యక్షుడు సురేష్ కృష్ణ మాట్లాడుతూ, “సిఎస్ఆర్ పథకంలో భాగంగా మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్, లైఫ్ స్టైల్ (చెన్నై), ఒలింపియా, టిఎన్ ఇస్పాట్ పరిషత్ లిమిటెడ్, తిరుపూర్ ఎగుమతిదారుల సంఘం వంటి అనేక సంస్థలు తమిళనాడు ప్రజల కోసం ఆస్పత్రుల్లో సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నాయన్నారు. కేవలం 72 గంటల తక్కువ వ్యవధిలో మేఘా సంస్థ పూర్తి చేయడం చాలా సంతోషంగా ఉంది” జి స్క్వేర్ రియల్టర్స్ ప్రమోటర్ బాలా మాట్లాడుతూ, “మానవ జీవితం కంటే మరేమీ ముఖ్యమైనది కాదు. మేఘా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ర్టక్చర్ లిమిటెడ్ (ఎంఈఐఎల్) - జి స్క్వేర్ సంస్థలు కలిసి ప్రభుత్వానికి అండగా నిలబడడం గర్వంగా ఉందన్నారు. ఈ ఆసుపత్రులను తమిళనాడు అంతటా ఏర్పాటు చేయడానికి గౌరవ ఆరోగ్య మంత్రి, తమిళనాడు ప్రభుత్వ ఆరోగ్య కార్యదర్శి తమ పూర్తి సహకారాన్ని అందిస్తున్నాయన్నారు” బాధ్యతగా కోవిడ్ బాధితులను ఆదుకుంటున్నాం: బి. శ్రీనివాస్ రెడ్డి నిర్మాణ రంగంలో ప్రపంచ వ్యాప్తంగా అనేక ప్రాజెక్ట్ లను సకాలంలో పూర్తి చేసి గుర్తింపు పొందిన మేఘా ఇంజనీరింగ్ ఇన్ ఫ్రాస్ర్టక్చర్ సంస్థ కోవిడ్ కష్టకాలంలో ప్రజలను ఆదుకునేందుకు బాధ్యతగా ముందుకు వచ్చిందని ఆ సంస్థ డైరెక్టర్ బి. శ్రీనివాస్ రెడ్డి ఈ సందర్భంగా తెలిపారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ ఆదేశాల మేరకు రాష్ర్టంలో 2500 పడకల ఆక్సిజన్ బెడ్ల ఆసుపత్రులను యుద్ధ ప్రతిపాదికన ఏర్పాటు చేస్తున్నామన్నారు. మదురైలో కేవలం 72 గంటల్లోనే 200 పడకల ఆక్సిజన్ బెడ్స్ ఆసుపత్రిని నిర్మించి ప్రభుత్వానికి అందచేశామన్నారు. ఈ కార్యక్రమంలో తమిళనాడుకు చెందిన క్రెడాయ్, జి రియల్టర్స్ సహాయ సహకారాలు అందిస్తున్నట్లు వివరించారు. దేశంలో ఆక్సిజన్ కొరతను నివారించడానికి 200 పి.ఎస్.ఏ ప్లాంట్లు ఏర్పాటు చర్యలు ప్రారంభించినట్లు బి.శ్రీనివాస్ రెడ్డి తెలియజేశారు. అలాగే క్రయోజనిక్ ట్యాంకుల తయారీ కూడా ప్రారంభించినట్లు చెప్పారు. ఇందుకు డిఆర్డీవో, పెట్రోలియం మంత్రిత్వ శాఖలు పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నట్లు ఆయన వివరించారు. ఇప్పటికే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్లో ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులకు ఉచితంగా ఆక్సిజన్ సరఫరా చేస్తున్న సంగతిని గుర్తు చేశారు. తొలిసారిగా తెలంగాణకు థాయిలాండ్ నుంచి 11 క్రయోజనిక్ ఆక్సిజన్ ట్యాంకర్లు దిగుమతి చేసి ఉచితంగా ఇస్తున్నట్లు తెలిపారు. చదవండి: జయలలిత చివరి రోజుల్లో తీసుకున్న నిర్ణయాలపై రహస్య విచారణ -
విశాఖలో మరో 300 ఆక్సిజన్ బెడ్లు సిద్ధం
-
కరోనా పేషెంట్స్ కోసం గూగుల్ మ్యాప్స్ లో సరికొత్త ఫీచర్
న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మరి కారణంగా భాదపడుతున్న భాదితుల కోసం టెక్ దిగ్గజం గూగుల్ తన మ్యాప్స్ అప్లికేషన్లో కొత్త ఫీచర్‌ను పరీక్షిస్తున్నట్లు తెలిపింది. దేశంలో భారీగా కరోనా వైరస్ వ్యాపిస్తున్న ప్రాంతాలలో పడకలు, మెడికల్ ఆక్సిజన్ లభ్యతకు సంబందించిన స్థానిక సమాచారాన్ని ప్రజలకు తెలియజేయడానికి ఈ ఫీచర్ పరీక్షిస్తున్నట్లు పేర్కొంది. కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ ను అరికట్టడానికి ప్రభుత్వం చేస్తున్న సహాయక చర్యలకు మద్దతు ఇవ్వడానికి టెక్ దిగ్గజం ప్రయత్నిస్తున్నట్లు పేర్కొంది. "ప్రజలు కీలకమైన సమాచారమైన ఆసుపత్రిలలో పడకలు, వైద్య ఆక్సిజన్‌కు లభ్యత వెతుకుతున్న విషయం మాకు తెలుసు. ఆ విషయంలో సమాధానాలను తేలికగా కనుగొనడంలో వారికి సహాయపడటానికి, మ్యాప్‌లలోని Q & A అనే ఫంక్షన్‌ను ఉపయోగించి కొత్త ఫీచర్‌ను పరీక్షిస్తున్నాము. స్థానిక ప్రదేశాలలోని పడకలు, మెడికల్ ఆక్సిజన్ లభ్యతపై సమాచారాన్ని తెలుసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది" అని గూగుల్ ఒక బ్లాగ్ పోస్ట్ లో పేర్కొంది. చదవండి: ఫ్లిప్‌కార్ట్‌లో రూ.15 వేలకే ఆపిల్ ఐఫోన్ -
కరోనా బెడ్ల స్కాం .. తెరపైకి బీజేపీ ఎంపీ?
బెంగళూరు: ఒక పక్క దేశంలో కరోనా విలయం కొనసాగుతోంది. మరోపక్క ఆసుపత్రిలో బెడ్లు దొరకక, ఆక్సిజన్ కొరతతో కరోనా బాధితులు అల్లాడిపోతున్నారు. ఈ నేపథ్యంలో బెంగళూరులో భారీ స్కాం వెలుగులోకి వచ్చింది. గళూరులో భారీ ఎత్తున ఆస్పత్రి బెడ్ల కుంభకోణం జరిగింది. దీనిపై సమాచారం అందుకున్న సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ అధికారులు నలుగురు నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య మద్దతుదారులున్నారని, వారి సాయంతో ఆస్పత్రులలో బెడ్లను బ్లాక్ చేయించి పెద్దమొత్తం లో సొమ్ము చేసుకుంటున్నారనే ఆరోపణలు కలకలం రేపాయి. నేత్రావతి, రోహిత్ కుమార్, డాక్టర్ రిహాన్, బొమ్మనహళ్లికి డాక్టర్ శశి కుమార్ లను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం జరిపిన వైద్య పరిక్షల్లో డాక్టర్ రోహిత్ కు కరోనా పాజిటీవ్ రావడంతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా పలు జోన్లలో పనిచేస్తున్న వారిలో బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య మద్దతుదారులపై వచ్చిన ఆరోపణలపై విచారణ చేపట్టామని సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు చెప్పారు. ఈ కేసుకు సంబంధించిన 17 మందిని ప్రశ్నించామనీ, అయితే వారి వద్ద ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదన్నారు. దీనిపై మరింత దర్యాప్తు చేయనున్నామని వెల్లడించారు. 80 శాతం ప్రైవేట్ ఆస్పత్రి బెడ్లని కరోనా పేషెంట్లకు ఇవ్వాలని కర్ణాటక ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయినా కరోనా కేసులు పెరిగిపోతుండడంతో ఆస్పత్రులో బెడ్లు కరువయ్యాయి. దీంతో కరోనా బాధితులకు అండగా ఉండే బెడ్ల కేటాయింపు జరగాలని.. ఆ ప్రక్రియను బృహత్ బెంగళూరు మహానగర పాలక మున్సిపల్ శాఖకు అప్పగించింది. మున్సిపల్ అధికారులు సిటీ కార్పొరేషన్ పరిధిలో ఉన్న తొమ్మిది జోనల్ స్థాయిలలో కరోనా వార్ రూమ్ లను ఏర్పాటు చేసింది. వార్ రూమ్ లలో ఉన్న బెడ్లను బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య తన పలుకబడిని ఉపయోగించి బ్లాక్ చేయిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ బెడ్లను డిమాండ్ తగ్గట్లు కేటాయించి, సొమ్ము చేసుకున్నారని అందుకు సంబంధించి ఓ నలుగురు హెల్ప్ చేస్తున్నారనే వాదనలు తెరపైకి వచ్చాయి. -
సత్వర కరోనా సేవలే లక్ష్యంగా ఎమ్మెల్యే చెవిరెడ్డి ముందడుగు
-
ఆసుపత్రుల్లో బెడ్స్ ,ఆక్సిజన్ సరఫరాఫై ప్రత్యేక దృష్టి
-
గాంధీ ఆస్పత్రి: కరోనా బాధితులు ఫుల్, ఐసీయూ బెడ్లు నిల్
గాంధీఆస్పత్రి: కరోనా సెకండ్‌వేవ్ విజృంభణ కొనసాగుతోంది. కోవిడ్ నోడల్ కేంద్రమైన సికింద్రాబాద్ గాంధీఆస్పత్రిలో ఐసీయూ పడకలు రోగులతో నిండిపోయాయి. ఆక్సిజన్ బెడ్లు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం ప్రాణాపాయస్థితిలో ఉన్న 722 మంది రోగులకు వైద్యసేవలు అందిస్తున్నారు. గాంధీలో మొత్తం 1850 పడకలు ఉండగా 500 ఐసీయూ (వెంటిలేటర్), 1250 ఆక్సిజన్ బెడ్ల కోసం కేటాయించారు. ఐసీయూ పడకలు రోగులతో నిండిపోవడంతో వెంటిలేటర్ అవసరమైన రోగులు అంబులెన్స్‌ల్లోనే గంటల తరబడి నిరీక్షించే పరిస్థితి నెలకొంది. అత్యవసర విభాగం వద్ద కరోనా ట్రైయాజ్ సెంటర్‌ను ఏర్పాటు చేసి రోగుల చిరునామా ఇతర వివరాలను నమోదు చేసి వైద్యపరీక్షల అనంతరం వార్డుల్లోకి తరలిస్తున్నారు. కరోనా మృతుల సంఖ్య అమాంతం పెరగడంతో కోవిడ్ మార్చురీగా మార్చారు. ఇక్కడ సుమారు 150 మృతదేహాలను భద్రపరిచే అవకాశం ఉంది. సాధారణ పోస్టుమార్టంలను నిలిపివేశారు. ప్రమాదాల్లో మృతి చెందినవారిని ఉస్మానియా మార్చురీకి తరలిస్తున్నారు. ఆక్సిజన్ కొరత లేదు సికింద్రాబాద్ గాంధీఆస్పత్రిలో ఆక్సిజన్ కొరత లేదు. ఇక్కడ 20 టన్నులు, 6 టన్నుల కెపాసిటీ కలిగిన రెండు లిక్విడ్ ఆక్సిజన్ ట్యాంకులు అందుబాటులో ఉన్నాయి. ప్రతిరోజు ఆక్సిజన్ ట్యాంకులను నింపుతున్నాం. ప్రైవేటు, కార్పొరేట్ ఆస్పత్రుల నుంచి బాధితులు చివరి నిమిషంలో గాంధీఆస్పత్రికి రిఫరల్‌పై వస్తున్నారు. గాంధీ వైద్యులు, సిబ్బంది రౌండ్ ది క్లాక్ సేవలు అందిస్తున్నారు. అత్యంత ప్రమాదకరమైన సెకండ్‌వేవ్ పట్ల ప్రజలంతా మరింత అప్రమత్తంగా ఉండాలి. కోవిడ్ నిబంధనలు తప్పక పాటించాలి. – రాజారావు, సూపరింటెండెంట్ ( చదవండి: GHMC Sanitation: పేరు గొప్ప.. ఊరు దిబ్బ ) -
కార్పొరేట్ ఆసుపత్రి ఉద్యోగి ఆడియో లీక్
-
ఆసుపత్రులకు రావడం లేదు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ ఆసుపత్రులకు వచ్చే వారి సంఖ్య మాత్రం గణనీయంగా తగ్గుతోంది. దీంతో కోవిడ్‌కు కేటాయించిన పడకల్లో అత్యధికం ఖాళీగా ఉంటున్నాయని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాసరావు ఆదివారం ఉదయం విడుదల చేసిన బులెటిన్ ప్రకారం... ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో 79.73 శాతం పడకలు ఖాళీగా ఉన్నాయి. 62 ప్రభుత్వాసుపత్రుల్లో 8,794 పడకలుండగా, వీటిలో 7,241 ఖాళీగా ఉన్నాయి. అంటే గవర్నమెంట్ హాస్పిటల్స్‌లో 82.35 శాతం ఖాళీ. అలాగే 227 ప్రైవేట్ ఆసుపత్రుల్లో 9,694 పడకలు కరోనాకు కేటాయించగా, 7,476 ఖాళీగా ఉన్నాయి. అంటే 77.11 శాతం ఖాళీ. ఇక ప్రభుత్వంలో ఐసోలేషన్ పడకలు 83.53 శాతం, ప్రైవేట్‌లో 83.95 శాతం ఖాళీగా ఉన్నాయి. దీంతో అనేక ఆసుపత్రులు కరోనా ఐసోలేషన్ పడకలను ఎత్తేస్తున్నాయి. సాధారణ చికిత్సలవైపు వాటిని మళ్లిస్తున్నాయి. ఇళ్లల్లో చికిత్స పొందుతున్నవారు 82.89% ఒకప్పుడు కరోనా పాజిటివ్ రాగానే ఉరుకులు పరుగుల మీద ఆసుపత్రులకు వచ్చేవారు. ఇప్పుడు కోవిడ్‌పై ప్రజల్లో అవగాహన ఏర్పడింది. లక్షణాలుంటే ఆసుపత్రులకు వచ్చి నిర్దారణ పరీక్షలు చేయించుకుంటున్నారు. సాధారణ లక్షణాలుంటే ఇళ్లు లేదా వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల ఆధ్వర్యంలోని కోవిడ్ కేర్ ఐసోలేషన్ కేంద్రాల్లో చికిత్స తీసుకుంటున్నారు. ఇప్పటివరకూ రాష్ట్రవ్యాప్తంగా 38,30,503 మంది పరీక్షలు చేయించుకోగా, అందులో 2,22,111 మందికి వైరస్ సోకింది. వీరిలో 1,98,790 మంది కోలుకున్నారు. అంటే కోలుకున్నవారి రేటు 89.5 శాతానికి పెరిగింది. ఇక ఇప్పటివరకు 1,271 మంది చనిపోగా, కరోనా మరణాల రేటు రాష్ట్రంలో 0.57 శాతంగా ఉంది. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 22,050 ఉండగా, అందులో ఇళ్లు లేదా ఇతర సంస్థల ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నవారు 18,279 మంది ఉన్నారు. అంటే 82.89 శాతం మంది ఇళ్లు, సంస్థల ఐసోలేషన్‌లోనే చికిత్స పొందుతున్నారు. దీంతో ఆసుపత్రులకు వచ్చేవారి సంఖ్య గణనీయంగా తగ్గిందని వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. అలాగే ఇప్పటివరకు నమోదైన కేసుల్లో 1,55,478 (70%) మందికి కరోనా లక్షణాలు లేనేలేవు. మిగిలిన 66,633 (30%) మందికి మాత్రమే లక్షణాలున్నట్లు అధికారులు వెల్లడించారు. దీనివల్ల కూడా ఆసుపత్రులకు వచ్చేవారి సంఖ్య తగ్గిందని అంటున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 10 లక్షల జనాభాలో 1,02,915 మందికి కరోనా పరీక్షలు చేశారు. కాగా, శనివారం ఒక్కరోజే 41,043 పరీక్షలు చేయగా, 1,436 మందిలో వైరస్ గుర్తించారు. అలాగే ఒక్కరోజులో 2,154 మంది కోలుకోగా, ఆరుగురు చనిపోయారు. -
అదనంగా 8,000 ఆక్సిజన్ బెడ్స్
సాక్షి, హైదరాబాద్: కరోనా కారణంగా ఆగమేఘాల మీద ప్రభుత్వ వైద్య వ్యవస్థను బలోపేతం చేసుకోవాల్సి వచ్చింది. వైరస్ వచ్చి ఆరు నెలలు గడిచింది. ఈ కాలంలో వైద్య మౌలిక సదుపాయాలు మెరుగయ్యాయి. వైరస్ తీవ్రత అధికంగా ఉన్న లక్ష మందికి వైద్యం అందించే వెసులుబాటు ఇప్పుడు రాష్ట్రంలో నెలకొంది. మార్చి నుంచి ఆగస్టు మధ్య ప్రభుత్వ ఆసుపత్రుల్లో అదనంగా 8 వేల పడకలకు ఆక్సిజన్ సదుపాయం ఏర్పాటు చేశారు. దీంతో ప్రస్తుతం ఆక్సిజన్ పడకల సంఖ్య రాష్ట్రంలో 10,010కి చేరింది. అంటే వైరస్ వచ్చాకే 80 శాతం ఆక్సిజన్ పడకలు అందుబాటులోకి వచ్చాయి. ఏళ్లుగా అందుబాటులోకి రాని వైద్య వసతులెన్నో కరోనా కారణంగా సమకూరినట్లు వైద్య,ఆరోగ్యశాఖ వర్గాలు చెబుతున్నాయి. అంతేకాదు ఎటువంటి వైరస్ మున్ముందు దాడి చేసినా తక్షణమే అప్రమత్తం అయ్యేలా వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు చెబుతున్నారు. రాష్ట్రంలో కరోనా నేపథ్యంలో సమకూరిన మౌలిక సదుపాయాలపై వైద్య, ఆరోగ్యశాఖ ఒక సమగ్ర నివేదికను సర్కారుకు నివేదించింది. పెరిగిన టెస్టింగ్ సామర్థ్యం కరోనా ప్రారంభ దశలో పరీక్షల కోసం పుణేలోని వైరాలజీ లేబొరేటరీకి రోడ్డు మార్గంలో నమూనాలను పంపాల్సి వచ్చింది. తర్వాత గాంధీ మెడికల్ కాలేజీలో మొదటి టెస్టింగ్ ల్యాబ్ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం 17 ప్రభుత్వ ఆర్టీ పీసీఆర్ లేబొరేటరీలు పనిచేస్తున్నాయి. మరో 6 ల్యాబ్‌లు త్వరలో ప్రారంభమవుతాయి. నిమ్స్‌లో రోజుకు 4వేల టెస్ట్‌లు చేసే లేబొరేటరీని విదేశాల నుంచి కొనుగోలు చేశారు. అలాగే ప్రైవేట్‌లో 43 ఆర్టీపీసీఆర్ లేబొరేటరీలు అందుబాటులో ఉన్నాయి. ఆర్టీపీసీఆర్ లేబొరేటరీల పరీక్షల సామర్థ్యం రోజుకు 20,771. ఇక పీహెచ్‌సీలు మొదలు పైస్థాయి వరకు 1,076 ర్యాపిడ్ యాంటిజెన్ పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. దీంతో గ్రామ స్థాయి వరకు టెస్టింగ్ చేసే సామర్థ్యం ఏర్పడింది. యుద్ధప్రాతిపదికన ‘టిమ్స్’ గాంధీ ఆసుపత్రిని ప్రత్యేకమైన కోవిడ్ ఆసుపత్రిగా ఏర్పాటు చేశారు. అలాగే కొత్తగా కోవిడ్ చికిత్స కోసం తక్కువ సమయంలో గచ్చిబౌలిలో టిమ్స్ ఆసుపత్రిని ఏర్పాటు చేశారు. టిమ్స్‌లో మొత్తం 1,224 పడకలున్నాయి. అందులో 980 ఆక్సిజన్ పడకలు, 50 ఐసీయూ పడకలున్నాయి. అలాగే 62 ప్రభుత్వ ఆసుపత్రుల్లో కరోనా చికిత్స కోసం 8,840 పడకలు ఏర్పాటు చేశారు. ఇక 225 ప్రైవేట్ ఆసుపత్రులలో కోవిడ్ చికిత్సకు 9,454 పడకలను సిద్ధంచేశారు. ప్రస్తుతం లక్ష యాక్టివ్ కేసులు వచ్చినా చికిత్స చేసే సదుపాయం రాష్ట్రంలో అందుబాటులోకి వచ్చింది. అందుబాటులోకి వచ్చిన సదుపాయాలు ఇవే... ప్రభుత్వ ఆసుపత్రులలో ఆరునెలల్లో కొత్తగా 8 వేల ఆక్సిజన్ పడకల ఏర్పాటు. 100 పడకలకు మించి ఉన్న అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ లిక్విడ్ ఆక్సిజన్ యూనిట్లను ఏర్పాటు చేశారు. దీంతో నిరంతరాయంగా ఆక్సిజన్‌ను వాడుకోవచ్చు. కరోనా చికిత్స కోసం ప్రత్యేకంగా 5,209 వైద్య సిబ్బంది పోస్టులు మంజూరు చేశారు. అందులో డాక్టర్లు 1,899, నర్సులు 2,125, పారామెడికల్, సహాయక సిబ్బంది 1,185 మంది ఉన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటి వరకు కరోనా కోసం ప్రత్యేకంగా రూ. 912 కోట్లు మంజూరు చేసింది. 1,259 వెంటిలేటర్లు ఏర్పాటు. 200 హై ఫ్లో నాసల్ ఆక్సిజన్ పరికరాలు అందుబాటులోకి వచ్చాయి. 27,264 పల్స్ ఆక్సీమీటర్లు, 13,570 ఇన్ఫ్రారెడ్ థర్మామీటర్లను సమకూర్చారు. ఈ ఏడాది మార్చి నుంచి ఆగస్టు వరకు కొత్తగా 40 బస్తీ దవాఖానాల ఏర్పాటు. ఇక బస్తీ దవాఖానాల్లో గతేడాది మార్చి నుంచి ఆగస్టు వరకు ఓపీ 6.2 లక్షలు కాగా, ఈ ఏడాది అదే కాలంలో 12 లక్షల ఓపీ రోగులు వచ్చినట్లు నివేదిక వెల్లడించింది. -
మూడు వారాలు.. మూడింతలు
సాక్షి, హైదరాబాద్: కరోనా చికిత్స చేసే ప్రైవే ట్ ఆసుపత్రుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. కేవలం మూడు వారాల్లోనే మూడింతలు పెరగడం గమనార్హం. ప్రైవేట్ ఆసుపత్రుల్లో కరోనా చికిత్సలకు అనుమతులు ఇవ్వాలని, ఆ మేరకు దరఖాస్తులు తీసుకోవాలని అన్ని జిల్లాల అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా కరోనా చికిత్స చేయగలిగే అవకాశం కలిగిన ఆసుపత్రులు దరఖాస్తు చేసుకుంటున్నాయి. అనంతరం ప్రభుత్వం వాటికి అనుమతులు ఇస్తోంది. జూలై 28 నాటికి ప్రైవేట్‌లో కంటే ప్రభుత్వ ఆసుపత్రుల్లో కరోనా పడకల సంఖ్య దాదాపు రెట్టింపు ఉంది. అయితే శుక్రవారం నాటికి ప్రైవేట్ ఆసుపత్రుల సంఖ్య 167కి చేరుకోగా, వీటిల్లో మొత్తం కరోనా పడకల సంఖ్య 9,048కు పెరిగింది. మరోవైపు ప్రస్తుతం 42 ప్రభుత్వ ఆసుపత్రుల్లో మాత్రమే కరోనా చికిత్సలు చేస్తున్నారు. వీటిల్లో 7,952 కరోనా పడకలు ఉన్నాయి. తీరిన పడకల కొరత... ప్రైవేట్ ఆసుపత్రులకు విరివిగా అనుమతులు ఇవ్వడంతో రాష్ట్రంలో కరోనా బాధితులకు అవసరమైన పడకల కొరత తీరినట్లేనని వైద్య, ఆరోగ్యశాఖ వర్గాలు చెబుతున్నాయి. దీంతో అన్ని జిల్లాల్లోని ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా కరోనా వైద్య సేవలు అందుబాటులోకి వస్తున్నట్లు చెబుతున్నారు. హైదరాబాద్‌కే పరిమితమైన కరోనా వైద్యం ఇప్పుడు జిల్లాలకూ చేరడంతో బాధితులకు ఊరట కలుగుతుందని అంటున్నారు. అంతేగాక ఆసుపత్రుల్లో తక్కువ ఫీజులకే కరోనా వైద్యం అందుబాటులోకి వస్తుందని వైద్య, ఆరోగ్యశాఖ వర్గాలు చెబుతున్నాయి. కొన్ని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు మాత్రం ఫీజుల విషయంలో ఇంకా కఠినంగానే ఉంటున్నాయని బాధితులు చెబుతున్నారు. జూలై 28 నాటికి ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్సలు ఇలా.. ► మొత్తం ప్రభుత్వ ఆసుపత్రులు: 57 ► వీటిలో మొత్తం పడకలు: 8,446 ► సాధారణ పడకలు: 2,532 ► ఆక్సిజన్ బెడ్లు: 4,663 ► ఐసీయూ బెడ్లు: 1,251 మొత్తం ప్రైవేట్ ఆసుపత్రులు: 55 ► వీటిలో మొత్తం పడకలు: 4,497 ► సాధారణ పడకలు: 2,010 ► ఆక్సిజన్ బెడ్లు: 1,676 ► ఐసీయూ బెడ్లు: 811 శుక్రవారం నాటికి కరోనా బెడ్లు ప్రభుత్వ ఆసుపత్రుల్లో... ► మొత్తం పడకలు: 7,952 ► చికిత్స పొందుతున్న బాధితులు: 2,385 ► ఖాళీగా ఉన్న బెడ్లు: 5,567 ప్రైవేట్ ఆసుపత్రుల్లో... ► మొత్తం పడకలు: 9,048 ► చికిత్స పొందుతున్న బాధితులు: 3,970 ► ఖాళీగా ఉన్న బెడ్లు: 5,078 ► ఖాళీ వాటిలో సాధారణ పడకలు: 1,844 ► ఆక్సిజన్ బెడ్లు: 2,197 ► ఐసీయూ బెడ్లు: 1,037 -
‘సగం పడకల’పై ప్రతిష్టంభన
సాక్షి, హైదరాబాద్: కరోనా చికిత్స కోసం సూపర్ స్పెషాలిటీ, కార్పొరేట్ ఆసుపత్రుల్లోని సగం (50 శాతం) పడకలను స్వాధీనం చేసుకొనే ప్రక్రియలో ప్రతిష్టంభన ఏర్పడింది. ఈ నెల 13న వైద్య, ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్‌తో జరిపిన చర్చల్లో సగం పడకల ను సర్కారుకు ఇవ్వడానికి ఆయా ఆసుపత్రు ల యాజమాన్యాలు అంగీకరించగా ఆ సగం పడకలను ఎలా కేటాయించాలి? వాటికెంత ఫీజు వసూలు చేయాలన్న దానిపై 14న ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాసరావు ఆసుపత్రుల యాజమాన్యాలతో చర్చలు జరిపారు. ఆ చర్చల అనంతరమే విధివిధానాలు ఖరారు చేసి ప్రకటిస్తామని అంతకుముందు రోజే మంత్రి ఈటల ప్రకటించారు. కానీ ఎలాంటి స్పష్టమైన నిర్ణయం తీసుకోకుండానే యాజమాన్యాలతో చర్చలు అర్ధాంతరంగా వాయిదా పడ్డాయి. దీనిపై శని, ఆదివారాల్లో సమావేశం జరుగుతుందని అందరూ భావించినా అలా జరగకపోగా ఇక వారితో చర్చలు ఉండబోవని వైద్య, ఆరోగ్యశాఖ వర్గాలు చెబుతున్నాయి. తాము సూచించినట్లుగా యాజమాన్యాలు ప్రతిపాదనలు పంపితే వాటిని సీఎంకు నివేదించి తర్వాత విధివిధానాలు ఖరారు చేస్తామని అంటున్నాయి. ‘సీలింగ్’పై కార్పొరేట్ల తర్జనభర్జన... సగం పడకలను సర్కారుకు బదలాయిస్తే వాటికి ఎంత ఫీజులుండాలన్న దానిపైనే సూపర్ స్పెషాలిటీ, కార్పొరేట్ ఆసుపత్రుల యాజమాన్యాలు తర్జనభర్జన పడుతున్నాయి. పాత జీవో ప్రకారం రోజుకు ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రుల్లోని సాధారణ వార్డుల్లో కరోనా చికిత్సకు రూ. 4 వేలు, ఐసీయూలో రూ. 7,500, వెంటిలేటర్ అమరిస్తే రూ. 9 వేలు వసూలు చేయాలన్నది నిబంధన. పీపీఈ కిట్లు, మందులకు అదనంగా వసూలు చేసుకోవచ్చని జీవోలో సర్కారు చెప్పింది. దీన్నే అలుసుగా తీసుకొని యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా డబ్బులు వసూలు చేశాయన్న ఫిర్యాదులు వెల్లువెత్తాయి. అందుకే డాక్టర్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరిగిన చర్చల్లో ఈ ఫీజుతో సంబంధం లేకుండా అన్నీ కలిపి ఫీజు సీలింగ్ ప్రతిపాదనను సర్కారు తెరపైకి తెచ్చింది. దాని ప్రకారం 14 రోజులకు కలిపి కరోనా చికిత్సకు సాధారణ వార్డులో రూ. లక్ష, ఆక్సిజన్ వార్డులో రూ. 2 లక్షలు, ఐసీయూ వార్డులో రూ. 3–4 లక్షలను సీలింగ్ ఫీజుగా పేర్కొంటూ సర్కారు ప్రతిపాదించింది. ఐసీయూలో ఉన్నప్పుడు బాధితుడిని ఒక్కోసారి రెండు, మూడు రోజులు అదనం గా ఉంచాల్సి రావొచ్చు. అత్యవసర, ఖరీదైన మందులు వాడాల్సి రావొచ్చు. అలాగే ఎవరికైనా కిడ్నీలు ఫెయిలైనా, సీటీస్కాన్లు తీ యాల్సి వస్తే ఐసీయూకు గరిష్టంగా రూ. 4 లక్షల వరకు సీలింగ్‌ను ప్రభుత్వం ప్రతిపాదించింది. వాటి ప్రకారమే ప్రతిపాదన లు తీసుకొని రావాలని మేనేజ్మెంట్లను ప్రభుత్వం ఆదేశించింది. మిగిలిన సగం ఫీజుల్లో జోక్యం ఉండదు! సర్కారుకు అప్పగించే సగం పడకలపైనే తమ ఆధిపత్యం ఉంటుందని, సూపర్ స్పెషాలిటీ, కార్పొరేట్ యాజమాన్యాల ఆధ్వర్యంలోని మిగిలిన సగం పడకలకు వసూలు చేసే ఫీజులతో తమకు ఎలాంటి సంబంధం లేదని వైద్య, ఆరోగ్యశాఖ వర్గాలు చెబుతున్నాయి. ధనవంతులు ఆ ఫీజులను భరిస్తే తమకు అభ్యంతరం లేదని అంటున్నాయి. ప్రభుత్వానికి అప్పగించే పడకలను తామే నింపుతామని, వాటిని పేదలు, మధ్యతరగతికి చెందిన కరోనా బాధితులెవరికైనా కేటాయిస్తామని అధికారులు అంటున్నారు. దీనికోసం ప్రత్యేక యాప్ తయారు చేస్తామని, అందరికీ అందుబాటులో ఉండేలా స్మార్ట్ఫోన్లలో డౌన్లోడ్ చేసుకోవచ్చని చెబుతున్నారు. యాప్‌లో ఎప్పటికప్పుడు సర్కారు అధీనంలోని కార్పొరేట్ కరోనా పడకల వివరాలు, ఖాళీలు అప్డేట్ చేస్తామని, ఆ మేరకు కసరత్తు జరుగుతుందని ఒక ఉన్నతాధికారి తెలిపారు. మేనేజ్మెంట్లలో మూడు ఆలోచనలు సర్కారు సూచించిన సీలింగ్ ప్రతిపాదనపై సూపర్ స్పెషాలిటీ, కార్పొరేట్ యాజమాన్యాల్లో గందరగోళం నెలకొంది. ఒక్కో ఆసుపత్రి ఒక్కో రకంగా ఆలోచిస్తోంది. అందులో మొదటిది ఏమిటంటే సర్కారు సీలింగ్ ప్రకారం యథావిధిగా ఆయా ఫీజులకు ఒప్పుకోవడం. దానికి షరతుగా తమ అధీనంలో ఉండే మిగిలిన సగం పడకల ఫీజుల్లో జోక్యం చేసుకోకూడదని సర్కారుకు చెప్పడం. వాటికి ఎంత వసూలు చేసుకున్నా సర్కారు వేలు పెట్టవద్దని స్పష్టం చేయడం. ఇక రెండోది ఒకవేళ మొదటి ప్రతిపాదన సరేననుకున్నా ఆచరణలోనూ, న్యాయపరంగా చిక్కులు వచ్చే అవకాశం ఉన్నందున ఫీజు సీలింగ్‌ను పెంచాలని ప్రతిపాదించడం. మూడో ఆలోచన ఏమిటంటే ప్రైవేటు ఆరోగ్య బీమా, ప్రభుత్వ ఉద్యోగులు, జర్నలిస్టుల ఆరోగ్య పథకం (ఈజేహెచ్ఎస్) వంటి వాటిని అమలు చేయాల్సి వస్తే బీమా పోను మిగిలిన సొమ్ము ఎవరు కడతారన్న దానిపైనా స్పష్టతకు రావడం. ఇవిగాక ఇంకా ఒకట్రెండు ఆలోచనలను కూడా యాజమాన్యా లు తెరపైకి తెస్తున్నాయి. తాము సోమ వారం సమావేశమై ఒక నిర్ణయం తీసుకున్నా క సర్కారుకు ప్రతిపాదనలు ఇవ్వడంతో పాటు నేరుగా మీడియా సమావేశం ఏర్పా టు చేసి ప్రకటిస్తామని ఒక సూపర్ స్పెషాలిటీ కార్పొరేట్ యజమాని తెలిపారు. -
సర్కారుకు సగం ‘ప్రైవేటు’ పడకలు!
సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు ఆస్పత్రుల్లో ఉన్న పడకల్లో 50శాతం బెడ్లను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని నిర్వహించేలా కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ వెల్లడించారు. జనరల్ వార్డుల్లోని బెడ్లతోపాటు ఐసీయూ విభాగాల్లోని 50 శాతం పడకల్లో ప్రభుత్వ నిబంధనల ప్రకారం కోవిడ్–19 బాధితులకు చికిత్స అందించాలని భావిస్తున్నట్లు తెలిపారు. ప్రైవేటు ఆస్పత్రుల ఆగడాలపై ఇప్పటివరకు 1,039 ఫిర్యాదులు వచ్చాయని, వీటిని తీవ్రంగా పరిగణిస్తూ ఈ మేరకు నిర్ణయానికి వచ్చినట్టు వివరించారు. ఇప్పటికైనా ప్రైవేటు ఆస్పత్రుల యాజమాన్యాలు ప్రభుత్వ నిబంధనల ప్రకారం నడుచుకోకుంటే తాజాగా నిర్దేశించిన కార్యాచరణను అమలు చేస్తామని తేల్చిచెప్పారు. ప్రైవేటు ఆస్పత్రులపై వచ్చిన లిఖితపూర్వక ఫిర్యాదులను పరిశీలించిన మంత్రి ఈటల.. సంబంధిత అధికారులతో సోమవారం సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. అధిక బిల్లులపైనే ఎక్కువ ఫిర్యాదులు.. ప్రభుత్వానికి అందిన ఫిర్యాదుల్లో ముఖ్యంగా ఎక్కువ బిల్లులు వేయడం, కొన్ని సందర్భాల్లో బిల్లులు ఇవ్వకుండా డబ్బులు వసూలు చేయడం, రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షల అడ్వాన్స్ చెల్లిస్తే తప్ప ఆస్పత్రిలో చేర్చుకోకపోవడం లేదా బెడ్లు ఖాళీ లేవని పేషెంట్లను కనీసం పరీక్ష చేయకుండానే తిప్పి పంపుతున్నారనే అంశాలతో ఉన్నాయని ఈటల చెప్పారు. అదేవిధంగా ఇన్సూరెన్స్, క్రెడిట్‌కార్డు అంగీకరించకపోవడం, డబ్బులు చెల్లించినప్పటికీ రోగులను సరిగా పట్టించుకోకపోవడం, చికిత్స జరుగుతున్న క్రమంలో మరణిస్తే పూర్తి బిల్లు చెల్లించే వరకు మృతదేహాన్ని ఇవ్వకపోవడం వంటి ఫిర్యాదులు కూడా ఉన్నాయని పేర్కొన్నారు. కరోనా లేని వారి దగ్గర కూడా కరోనా ఉందా.. లేదా తెలుసుకోవడానికి పరీక్షల పేరుతో డబ్బులు వసూలు చేస్తున్నట్లు అధికమొత్తంలో ఫిర్యాదులు ఉన్నాయని తెలిపారు. ఇతర జబ్బుల కోసం చికిత్స చేయించుకోవడానికి హాస్పిటల్‌కు వచ్చిన వారికి కూడా కరోనా నిర్ధారణ పరీక్షల కోసం కరోనా ప్యాకేజ్ పేరుతో డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయన్నారు. వాస్తవానికి కరోనా నిర్ధారణకు ర్యాపిడ్ పరీక్ష లేదా ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేసుకోవడానికి ప్రైవేట్ ఆస్పత్రులకు అనుమతులు ఉన్నాయని.. కానీ వీటిని పక్కనపెట్టి సీటీ స్కాన్, ఎక్స్‌రే, రక్త పరీక్షల పేరుతో ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. రక్త పరీక్ష ల్లో కూడా డీ–డిమ్మ ర్, ఎల్డీహెచ్, సీఆర్పీ, ఫెరిటిన్, ఐఎల్–6 వంటి పరీక్షలను అవసరం లేకున్నా చేస్తున్నారన్నారు. హైదరాబా ద్‌లోని దాదాపు అన్ని ఆస్పత్రులపై ఫిర్యాదులు అందడంతో ప్రతి ఆస్పత్రికీ షోకాజ్ నోటీసులు ఇచ్చి వివరణ కోరినట్లు మంత్రి తెలిపారు. ఈ వివరణలను పరిశీలించడానికి ప్రత్యేకంగా కమిటీ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ వివరణలపై విచారణ చేసి తప్పులు చేసిన ఆస్పత్రులపై ఎపిడమిక్ డిసీజ్ యాక్ట్ కింద కఠిన చర్య లు తీసుకోవాలని మంత్రి సూచించారు. డాక్టర్ నరేష్ మృతి బాధాకరం: ఈటల కోవిడ్ చికిత్స అందిస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ నరేష్ చనిపోవడం చాలా బాధాకరమని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ ఆవేదన వ్యక్తంచేశారు. కరోనా వైరస్ సోకినవారికి తమ ప్రాణాలు సైతం పణంగా పెట్టి మరీ వైద్యులు, వైద్య సిబ్బంది చికిత్స అందిస్తున్నారని.. వారి సేవలు వెల కట్టలేనివని అభిప్రాయపడ్డారు. డాక్టర్ నరేష్ కుటుంబానికి అండగా ఉంటామని తెలిపారు. నరేష్ భార్యకు సముచిత స్థానం గల ఉద్యోగం కల్పించాలని సీఎం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. -
కష్టకాలంలో.. కరోనా పరుపు
ఒక సమస్య ఎదురైంది... అంటే, ఆ సమస్యకు పరిష్కారం కూడా తప్పనిసరిగా ఉండి తీరుతుంది. ఆ పరిష్కారం ఎక్కడ ఉందోననే అన్వేషణ మాత్రమే మనిషి చేయాల్సింది. కేరళలోని లక్ష్మీ మెనన్ ఈ కోవిడ్ కష్టకాలంలో పేషెంట్ల కోసం పరుపును కనిపెట్టింది. లక్ష్మి పర్యావరణ కార్యకర్త. ఎర్నాకుళంలో ‘ప్యూర్ లివింగ్’ సంస్థ స్థాపించారామె. ప్రకృతి వనరులను సమర్థంగా వినియోగించుకుంటూ పర్యావరణానికి హాని కలగని జీవనశైలిని ప్రాచుర్యంలోకి తీసుకురావడానికి కృషి చేస్తోంది. గతంలో వేస్ట్ పేపర్‌తో పెన్నుల తయారీ వంటి ప్రయోగాలు చేసింది. ఇప్పుడు సమాజహితమైన శయ్యలకు రూపకల్పన చేసింది. కోవిడ్ నేర్పిన విద్య లక్ష్మి మెనన్ రూపొందించిన శయ్య (పరుపు) తయారీకి వాడే మెటీరియల్ కొత్తదేమీ కాదు. మనకు కోవిడ్‌తోపాటు పరిచయమైనదే. పీపీఈ (పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ )గౌన్ల తయారీలో ఉపయోగించే నాన్‌వోవన్ మెటీరియల్. ఈ గౌన్ల తయారీలో మిగిలిపోయిన నాన్‌వోవన్ మెటీరియల్‌తోనే పరుపును డిజైన్ చేసింది లక్ష్మి. ‘‘ఈ పరుపులను ఒకసారి వాడి పారేయడమే. కరోనా ట్రీట్మెంట్ పూర్తయి ఆ పేషెంట్ డిశ్చార్జ్ అయిన వెంటనే ట్రీట్మెంట్ సమయంలో పేషెంట్ ఉపయోగించిన పరుపును కూడా వైద్యప్రమాణాలకు అనుగుణంగా డిస్పోజ్ చేయడమే. పెరుగుతున్న కోవిడ్ కేసులకు అనుగుణంగా హాస్పిటళ్లలో సౌకర్యాలు లేవు. ఉన్న వసతులను మెరుగు పరిచి మంచాలు వేసి తాత్కాలికంగా ఏర్పాటు చేయగలుగుతున్నారు. కానీ వాటిలో ప్రతి పేషెంట్‌కీ ఒక పరుపును సిద్ధం చేయించడం సాధ్యం కావడం లేదు. అందుకోసమే తక్కువ ఖర్చుతో తయారయ్యే శయ్య ఆలోచనను ఆచరణలో పెట్టాను. ఉదాహరణకు కేరళలో తొమ్మిది వందల పంచాయితీలలో తాత్కాలిక కోవిడ్ కేర్ సెంటర్లు వెలిశాయి. ఒక్కో సెంటర్‌కు యాభై మంచాలుంటాయి. ఇనుప మంచాలనైతే పేషెంట్ మారిన ప్రతిసారీ శానిటైజ్ చేసి మళ్లీ వాడవచ్చు. పరుపును మాత్రం కొత్తది వేయాల్సిందే. ఇప్పుడున్న సంప్రదాయ పరుపులు ఒక్కసారిగా అన్నేసి తయారు కావడం కుదిరేపని కాదు. అందుకే టైలర్లు, పీపీఈ కిట్ మేకింగ్ యూనిట్ల దగ్గర పేరుకుపోతున్న స్క్రాప్ (పీపీఈ గౌన్ డిజైన్‌కు అనుగుణంగా క్లాత్‌ను కత్తిరించగా మిగిలిపోయిన చివరి ముక్కలు)తోనే ఈ ప్రయోగం చేశాను. కేరళలో రోజుకు ఇరవై వేల పీపీఈ గౌన్లు తయారవుతున్నాయి. వాటి స్క్రాప్‌ను వైద్య ప్రమాణాలకు అనుగుణంగా నిర్వీర్యం చేయడం ఎలాగో టైలర్లకు తెలియదు. దాంతో స్క్రాప్ కుప్పలుగా పేరుకుపోతోంది. ఒక చిన్న యూనిట్ నుంచి నేను ఆరు టన్నుల మెటీరియల్ సేకరించగలిగాను. ఆ మెటీరియల్‌తో రెండు వేల నాలుగు వందల శయ్యలు తయారు చేయగలిగాం. ఇన్ని మామూలు పరుపులను మార్కెట్లో కొనాలంటే పన్నెండు లక్షలైనా అవుతుంది. ఇలా తయారు..! నాన్ వోవన్ మెటీరియల్ ముక్కలను జడలుగా అల్లుతారు. ఆ జడలను మెలి తిప్పుతూ ఆరడుగుల పొడవు, నాలుగు అడుగుల వెడల్పు శయ్యలను తయారు చేస్తారు. ఒక మహిళ రోజుకు ఒక శయ్యను అల్ల గలుగుతుంది. ఆ మహిళకు దినసరి వేతనంగా ఇచ్చే మూడు వందల రూపాయలనే శయ్యకు మేము పెట్టిన ధర. కరోనా కష్ట కాలం నుంచి గట్టెక్కడానికి నా వంతు సామాజిక బాధ్యతగా చేస్తున్న పని ఇది’’ అన్నారు లక్ష్మీ మెనన్. -
సీఎం ఇంటి ఎదుట కరోనా బాధితుడి ఆందోళన
బెంగళూరు: దేశంలో కరోనా రోజురోజుకు విజృంభిస్తోంది. ఈ క్రమంలో పాజిటివ్ వచ్చిన ఓ వ్యక్తికి ఆస్పత్రిలో బెడ్ కేటాయించలేదు వైద్యులు. ఇదేంటని ప్రశ్నిస్తే.. బెడ్స్ ఖాళీగా లేవని సమాధానమిచ్చారు. దాంతో ఆ వ్యక్తి ఏకంగా ముఖ్యమంత్రి నివాసం దగ్గరకి వెళ్లి హల్చల్ చేశాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో తెగ వైరలవుతోంది. వివరాలు.. ఈ వీడియోలో ఓ వ్యక్తి భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప ఇంటి బయట నిల్చున్నాడు. ‘నాకు ఆరోగ్యం బాగాలేదు.. నా కుమారుడికి కూడా జ్వరం వస్తోంది. నాకు కరోనా పాజిటివ్ అని వైద్యులకు తెలిపాను. అయినా నాకు బెడ్ కేటాయించలేదు. సీఎం గారు సాయం చేయండి’ అంటూ అరిచాడు. (ఆక్సిజన్ అందకే నా భర్త మృతి చెందాడు) దీని గురించి యడియూరప్ప సన్నిహితులను ప్రశ్నించగా.. వారు ఖండించారు. అంతేకాక సదరు వ్యక్తి ఆస్పత్రికి వెళ్లకుండా సరాసరి ముఖ్యమంత్రి ఇంటి దగ్గరకు వచ్చినట్లు తెలిపారు. వైద్యానికి డబ్బులు లేకపోవడంతోనే అతడు ఇలా చేశాడన్నారు. అనంతరం అంబులెన్స్‌లో ఆ కుటుంబాన్ని ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. కర్ణాటకలో కరోనా కేసులు రోజుకురోజుకు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో బెంగళూరు పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో వారం రోజుల పాటు లాక్డౌన్ విధించిన సంగతి తెలిసిందే. పెరుగుతున్న కేసులకు సరిపడా ఆస్పత్రుల్లో బెడ్స్ అందుబాటులో లేవు. దీనిపై గత కొన్ని రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన వ్యక్తం అవుతోంది.(‘కరోనా నుంచి దేవుడే మనల్ని కాపాడాలి’) -
గాంధీలో పడకల్లేవ్!
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ హైదబాద్‌లో కరోనా కరాళ నృత్యం చేస్తోంది. ఇప్పటికే కోవిడ్ సెంటర్లలోని ఐసోలేషన్ వార్డుల్లోని పడకలన్నీ పాజిటివ్ బాధితులతో నిండిపోవడం.. మరోవైపు రోజుకు సగటున 500 నుంచి 700 కొత్త కేసులు నమోదవుతుండటంతో ఐసీయూల్లో వెంటిలేటర్ పడకలు దొరకని దుస్థితి. అత్యవసర పరిస్థితుల్లో కార్పొరేట్ ఆస్పత్రులకు వెళ్లినవారికి సైతం చేదు అనుభవమే ఎదురవుతోంది. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు చికిత్స చేయడం ఇష్టం లేని పలు కార్పొరేట్ ఆస్పత్రుల యాజమాన్యాలు అత్యవసర పరిస్థితుల్లో ఆస్పత్రికి వచ్చిన రోగులకు పడకలు ఖాళీ లేవంటూ తిప్పిపంపుతుండటం ఆందోళనకు గురిచేస్తోంది. చికిత్సకు నిరాకరించిన ఆస్పత్రులపై చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం తనకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తుండటంపై విమర్శలువెల్లువెత్తుతున్నాయి. గాంధీ.. ఏమిటిదీ? కరోనా చికిత్సల కోసం గాంధీ ఆస్పత్రిని ప్రభుత్వం పూర్తిస్థాయి కోవిడ్ సెంటర్‌గా మార్చింది. ప్రస్తుతం ఆస్పత్రిలో 320 మంది వైద్యులు, 366 మంది పీజీలు, 350 మంది హౌస్సర్జన్లు, 350 మంది స్టాఫ్ నర్సులు పని చేస్తున్నారు. 1000 పడకల సామర్థ్యం ఉన్న ఈ ఆస్పత్రిలో వంద వెంటిలేటర్లు ఏర్పాటు చేశారు. మిగిలిన పడకలకు ఆక్సిజన్ సదుపాయాన్ని కల్పించారు. రోగుల రద్దీ నేపథ్యంతో పడకల సంఖ్యను 1,850కి పెంచుతున్నట్లు ప్రకటించినప్పటికీ.. సిబ్బంది కొరత కారణంగా వీటిని ఇప్పటి వరకు అందుబాటులోకి తీసురాలేదు. వైరస్ లక్షణాల తీవ్రత ఎక్కువగా ఉన్న రోగులను మాత్రమే ఇక్కడ అడ్మిట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆస్పత్రిలోని పడకలన్నీ రోగులతో నిండిపోయాయి. ఐసీయూలో వెంటిలేటర్లు ఖాళీగా లేవు. ప్రస్తుతం 300 మంది రోగుల ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. రోగుల నిష్పత్తికి తగినన్ని వెంటిలేటర్లు లేకపోవడంతో ఆక్సిజన్‌పై నెట్టుకొస్తున్నారు. కొత్తగా వచ్చిన రోగులకు అడ్మిషన్ కూడా కష్టమవుతోంది. సకాలంలో వైద్యసేవలు అందక రోగులు మృత్యువాత పడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఉస్మానియా.. ఇంతేనయా.. ఉస్మానియా ఆస్పత్రి కులీకుతుబ్‌షా భవనంలో 100 పడకలు ఏర్పాటు చేశారు. నాలుగో అంతస్తులో మరో 250 పడకలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. మరో వారం రోజుల్లో ఇవి అందుబాటులోకి రానున్నాయి. ఆస్పత్రిలో ప్రస్తుతం 85 వెంటిలేటర్లు ఉన్నారు. 500 పడకలకు సరిపోను ఆక్సిజన్ లైన్లు ఉన్నాయి. గాంధీ జనరల్ ఆస్పత్రిని పూర్తిస్థాయి కోవిడ్ సెంటర్‌గా మార్చడంతో సాధారణ రోగులంతా ఇక్కడికే వస్తున్నారు. దీంతో జనరల్ మెడిసిన్ విభాగంలో రోగుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. వీరిలో శ్వాస సంబంధ సమస్యలతో బాధపడుతున్నవారు ఉంటున్నారు. అప్పటికే వీరికి కరోనా వైరస్ విస్తరించి ఉండటంతో మృత్యువాత పడుతున్నారు. రోగుల నిష్పత్తికి తగినంత వైద్య సిబ్బంది లేకపోవడంతో పీజీలపై భారం పడుతోంది. వార్డులోని రోగులందరికీ ఒకే నర్సు సేవలు అందించాల్సి వస్తోంది. కళ్లెదుటే రోగులు చనిపోతున్నా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉంటున్నామని.. ఇలాంటి వాతావరణంలో తాము పని చేయలేమని పీజీలు, హౌస్ సర్జన్లు రెండు రోజులుగా విధులు బహిష్కరించి ఆందోళన చేస్తుండటం విదితమే. కింగ్‌కోఠి, ఛాతీ ఆస్పత్రులు ఫుల్.. తీవ్ర లక్షణాలున్న వారిని గాంధీలో అడ్మిట్ చేస్తుండగా, ఏ లక్షణాలు లేకపోయినా పాజిటివ్ వచ్చిన రోగులను కింగ్‌కోఠి, ఎర్రగడ్డ ఛాతీ ఆస్పత్రి, ఆయుర్వేద, నేచర్ క్యూర్ ఆస్పత్రుల్లోని ఐసోలేషన్ వార్డుల్లో అడ్మిట్ చేస్తున్నారు. ఆయా ఆస్పత్రుల్లో సరైన మౌలిక సదుపాయాలు లేకపోవడం, వేళకు పౌష్టికాహారం అందజేయకపోవడంతో రోగులు అక్కడ ఉండేందుకు ఇబ్బంది పడుతున్నారు. వైరస్‌తో ఇంటికి వెళ్లేందుకు ఇష్టం లేకపోయినప్పటికీ.. విధిలేని పరిస్థితుల్లోనే అడ్మిటఅయిన మరుసటి రోజే హోం క్వారంటైన్‌కు వెళ్లిపోతున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించిన తెలంగాణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ (టిమ్స్) ప్రారంభమై ఇప్పటికే నెల రోజులు దాటింది. 14 అంతస్తుల భవనంలో 1,500 పడకలను ఏÆర్పాటు చేశారు. ప్రస్తుతం ఇక్కడ ఉస్మానియా వైద్యులే డిప్యుటేషన్‌పై సేవలు అందిస్తున్నారు. ఓపీకి వచ్చే సాధారణ రోగులకు మందులు రాసి పంపుతున్నారు. నగరంలోని ప్రధాన ఆస్పత్రులన్నీ రోగులతో నిండిపోయాయి. ఇన్‌పేషెంట్ సేవలు ఇంకా ప్రారంభించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వైద్యుడు సహా ఏఎస్ఐ మృతి.. కరోనాతో రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 210 మంది మృతి చెందారు. వీరిలో 190 మంది నగరవాసులే. తాజాగా హిమాయత్‌నగర్‌కు చెందిన డాక్టర్ జ్ఞానేశ్వర్రావు (77)తో మృతి చెందారు. తెలంగాణలో తొలి వైద్యుడి మరణం ఇదే. ఆయన ఇంటి పనిమనిషి (50)కి కూడా కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. కాలపత్తర్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వర్తిస్తున్న ఏఎస్ఐ యూసఫ్ (47) కరోనాతో బాధపడుతూ సోమవారం గాంధీ ఆస్పత్రిలో మృతి చెందారు. మలక్‌పేట్ ఏరియా ఆస్పత్రికి చెందిన ఇద్దరు వైద్యులు సహా మొత్తం 9 మందిలో వైరస్ లక్షణాలు బయటపడ్డాయి. 90 శాతం కేసులు ఇక్కడే.. తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటి వరకు 7802 పాజిటివ్ కేసులు నమోదు కాగా, వీటిలో 5798 కేసులు గ్రేటర్ హైదరాబాద్‌లోనే నమోదయ్యాయి. ఇప్పటి వరకు 3,861 మంది కోలుకోగా.. ప్రస్తుతం 3,731 మంది గాంధీ సహా వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వీరిలో 90 శాతం మంది నగరవాసులే. -
కరోనా వేళ కొత్త జంట ఔదార్యం
సాక్షి, ముంబై : కరోనా సంక్షోభ సమయంలో నూతన వధూవరులు తీసుకున్న నిర్ణయం పలువురి ప్రశంసలందుకుంటోంది. లాక్ డౌన్ నిబంధనలకు అనుగుణంగా తమ వివాహ తంతు పూర్తి చేయడంతో పాటు కరోనా రోగులకు సహాయపడేలా వినూత్న నిర్ణయం తీసుకుంది ఈ కొత్త జంట. కోవిడ్-19 సంరక్షణ కేంద్రానికి 50 బెడ్లు, ఆక్సిజన్ సిలిండర్లతో పాటు ఇతర వస్తువులను దానం చేసింది. అంతేకాదు ఈ సంక్షోభ సమయంలో స్థానికంగా అనేక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడంతోపాటు, కమ్యూనిటీ కిచెన్ ద్వారా బాధితులను ఆదుకున్నారు. అలాగే ప్రభుత్వం ఏర్పాటు చేసిన శ్రామిక్ ప్రత్యేక రైళ్ల ద్వారా సొంత పట్టణాలకు వెళ్లే వలస కార్మికులకు కూడా సాయపడ్డారట. వివరాలను పరిశీలిస్తే..వాసాయిలోని నందాఖల్ గ్రామానికి చెందిన ఎరిక్ అంటోన్ లోబో(28), మెర్లిన్(27) చాలా నిరాడంబరగా పెళ్లి చేసుకున్నారు. కేవలం 22 మంది అతిథులు మాత్రమే ఈ వివాహానికి హాజరయ్యారు. అలాగే అందరూ ఫేస్ మాస్క్‌లు ధరించి భౌతిక దూరాన్ని పాటించారు. అనంతరం సత్పాలా గ్రామంలో కొవిడ్-19 ఆస్పత్రికి అవసరమయ్యే 50 బెడ్లను, ఆక్సిజన్ సిలిండర్లను విరాళంగా ఇచ్చి తమ ఔదారాన్ని చాటుకున్నారు. ఇవే కాకుండా దిండ్లు, బెడ్షీట్లు, కవర్లు తదితర వస్తువులను కూడా విరాళంగా ఇచ్చారు. వివాహ దుస్తుల్లోనే ఈ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించడం విశేషం. (కరోనా రోగి ఆత్మహత్య: కానీ అంతలోనే) మహమ్మారి కారణంగా చాలామంది మరణిస్తున్నారు. పాల్ఘర్ జిల్లాలో, సుమారు 90 మంది మరణించారు.1,500 పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అందుకే తమవంతు సహకారాన్ని అందించాలని నిర్ణయించుకున్నామని లోబో చెప్పారు. ఒక సాధారణ క్రైస్తవ వివాహానికి సుమారు 2వేల మంది అతిథులు హాజరవుతారు. వైన్, మంచి ఆహారం అన్నీ కలిపి భారీగానే ఖర్చవుతుంది. అందుకే భిన్నంగా జరుపుకోవాలని నిర్ణయించుకున్నాం. ఆసుపత్రులలో రోగులకు మెరుగైన సంరక్షణను అందించడంలో సహాయపడటం ద్వారా తమ ఆనందాన్ని పంచుకోవాలనుకున్నామని చెప్పారు. ఈ ఆలోచనతో మార్చిలో స్థానిక ఎమ్మెల్యే క్షితిజ్ ఠాకూర్‌ను సంప్రదించి, దీనికి సంబంధించిన ఏర్పాటు చేసుకున్నామన్నారు. పాల్ఘర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ కైలాస్ షిండే ఆధ్వర్యంలో ఈ ప్రాజెక్టును పూర్తి చేశామని వివరించారు. మరోవైపు సమాజానికి ఒక ఉదాహరణగా నిలిచారంటూ ఎరిక్, మెర్లిన్ వివాహానికి హాజరైన ఎమ్మెల్యే ఠాకూర్ ఈ జంట చేసిన గొప్ప పనికి అభినందనలు తెలిపారు. వాసాయి-విరార్ నివాసితులు సమాజానికి ఎల్లప్పుడూ మద్దతుగా ఉన్నారనీ, రాబోయే రోజుల్లో ఎక్కువ మంది తమ వంతు కృషి చేయడానికి ముందుకు వస్తారని ఆశిస్తున్నానన్నారు. -
గచ్చిబౌలి స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో కోవిడ్-19 ఆసుపత్రి
-
20,000 క్వారంటైన్ పడకలు సిద్ధం
సాక్షి, అమరావతి: కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించే చర్యల్లో భాగంగా ఏపీ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. ఏ రాష్ట్రంలో చేయని విధంగా క్వారంటైన్ వ్యవస్థను బలోపేతం చేసే దిశగా అతిపెద్ద నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో 175 నియోజకవర్గాలుండగా ఒక్కో నియోజకవర్గంలో 100 నుంచి 150 పడకలు క్వారంటైన్ కోసం ఏర్పాటు చేసింది. ఇప్పటికే రాష్ట్రం మొత్తమ్మీద బోధనాస్పత్రులు, జిల్లా ఆస్పత్రుల్లో ఉన్నవి కాకుండా నియోజకవర్గాల వారీగా ఏర్పాటు చేసిన క్వారంటైన్ పడకలు 20 వేల వరకూ అందుబాటులోకి వచ్చినట్టు అధికార వర్గాలు తెలిపాయి. దీనిపై జిల్లా కలెక్టర్లు వైద్య ఆరోగ్య శాఖకు నివేదిక ఇచ్చారు. ప్రతి నియోజకవర్గంలోనూ ఆస్పత్రులు, స్కూళ్లు, కళాశాలలు, ఆర్టీసీ భవనాలు, డిగ్రీ కళాశాలలు ఇలా ఎక్కడ అనుకూలంగా ఉంటుందో ఆ భవనాలన్నిటినీ కరోనా వైరస్ లక్షణాలున్న వారి కోసం సిద్ధం చేశారు. క్వారంటైన్‌కి ఇన్చార్జిగా మెడికల్ ఆఫీసర్ ►నియోజకవర్గంలో పనిచేస్తున్న స్టాఫ్ నర్సులు, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తల విధులు క్వారంటైన్ కేంద్రంలోనే ఉంటాయి. ఒక్కో క్వారంటైన్ కేంద్రానికి ఒక మెడికల్ ఆఫీసర్‌ను ఇన్చార్జిగా నియమిస్తారు. ►ఒక్కో కేంద్రంలో 100 పడకలకు తగ్గకుండా ఏర్పాటు పూర్తయ్యాయి. ఇందులో 10 పడకలు వెంటిలేటర్‌తో కూడినవి. ►ఇవి కాకుండా మరికొన్ని ప్రైవేటు ఆస్పత్రుల్లో వెంటిలేటర్‌తో కూడిన పడకల ఏర్పాటుకు ఆదేశాలు వెళ్లాయి. ►కరోనా అనుమానిత లక్షణాలుంటే వారిని తక్షణమే ఆ నియోజకవర్గాల పరిధిలో ఉన్న క్వారంటైన్‌కు తరలించాలని జిల్లా వైద్యాధికారులకు కలెక్టర్లకు ఆదేశాలిచ్చారు. ►తాజాగా 4 బోధనాస్పత్రులను కేవలం కరోనా ఆస్పత్రులుగా గుర్తిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ►13 జిల్లా ఆస్పత్రులు, మరో 7 బోధనాస్పత్రుల్లోనూ కరోనా వైరస్ లక్షణాలున్న వారికి వైద్యమందిస్తారు. ►ఎలాంటి విపత్కర పరిస్థితులు వచ్చినా మరికొన్ని క్వారంటైన్ కేంద్రాలు పెంచేలా సిద్ధంగా ఉండాలని కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. ►హై రిస్కు ప్రాంతాలు అంటే విశాఖపట్నం, విజయవాడ వంటి ప్రాంతాల్లో మరికొన్ని ప్రత్యేక కేంద్రాలు పెంచాలని యోచిస్తున్నారు. క్వారంటైన్ల వద్ద ఉండే వసతులు ఇవే.. ►ఇన్ఫెక్షన్లు సోకకుండా రోగులకు, వైద్య సిబ్బందికి మాస్క్‌లు, శానిటైజర్లు, పీపీఈ (పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్)లు ఉంటాయి. ►డాక్టర్లు, నర్సులు 24 గంటలూ అందుబాటులో ఉంటారు. ►ఆహారం, మంచినీటి వసతి ఎప్పటికప్పుడు అందిస్తారు. ►24 గంటలూ అంబులెన్సు సదుపాయం అందుబాటులో ఉంటుంది. ►తాత్కాలిక పద్ధతిలో టాయ్లెట్లను ఏర్పాటు చేస్తారు. ►సీసీ కెమేరాల పర్యవేక్షణ 24 గంటలూ ఉంటుంది. ఇంటర్నెట్ సదుపాయం కూడా కల్పిస్తారు. ►క్వారంటైన్లో ఉన్న వారి ఫోన్ నంబర్లు, చిరునామాలు ఇచ్చిన తర్వాత వాటిని పర్యవేక్షించేందుకు ఒక నోడల్ అధికారి ఉంటారు. ►క్వారంటైన్‌కు అనుబంధంగా ఒక రెఫరల్ ఆస్పత్రిని అందుబాటులో ఉంచుతారు. ►ప్రతి పడకకూ కనీసం 2 మీటర్ల దూరం పాటించేలా ఏర్పాటు ఉంటుంది. ►క్వారంటైన్ కేంద్రాల్లో ప్రతిరోజూ పారిశుధ్యం నిర్వహించేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటారు. ►అనుమతి ఉన్న వారు మాత్రమే క్వారంటైన్‌కు వెళ్లేలా నిబంధనలు ఉంటాయి. ప్రైవేటు యాజమాన్యాలు సిద్ధంగా ఉండాలి: డా.ఎ.మల్లికార్జున, సీఈవో, ఆరోగ్యశ్రీ ►పరిస్థితిని బట్టి క్వారంటైన్ కేంద్రాలు పెంచుకుంటూ వెళుతున్నాం. ►అవసరమైతే ప్రైవేటు ఆస్పత్రులను తీసుకుని క్వారంటైన్ లేదా చికిత్సా కేంద్రాలుగా మారుస్తాం. ►ప్రైవేటు ఆస్పత్రుల డాక్టర్లు, సిబ్బంది కూడా చికిత్సకు సిద్ధంగా ఉండాలి. ఎవరికీ సెలవులు ఇవ్వలేదు: డా.కె.వెంకటేష్, వైద్య విద్యా సంచాలకులు ►ఇప్పటికే పీజీ వైద్య విద్యార్థులెవరికీ సెలవులు ఇవ్వలేదు. వాళ్లందరూ పనిచేస్తున్నారు ►అవసరమైతే ఎంబీబీఎస్ విద్యార్థులను రావాలని కోరతాం. ►ప్రైవేటు మెడికల్ కాలేజీలు కూడా కరోనా నియంత్రణకు ముందుకు రావాలని చెప్పాం. సీహెచ్‌సీ, ఏరియా ఆస్పత్రుల్లోనూ చికిత్స: డా.రామకృష్ణారావు, కమిషనర్, వైద్య విధాన పరిషత్ ►మనకు 195 సామాజిక ఆరోగ్య కేంద్రాలున్నాయి. ►ఎక్కడైతే సదుపాయాలు బాగున్నాయో అక్కడ క్వారంటైన్ ఏర్పాటుకు ఆదేశించాం. ►వెంటిలేటర్లు ఉన్న ప్రతి ఏరియా ఆస్పత్రిలోనూ చికిత్సకు ఏర్పాట్లు చేశాం. ►13 జిల్లా ఆస్పత్రుల్లోనూ కరోనా బాధితుల వైద్యానికి ప్రత్యేక పడకలు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. చదవండి : చేతులెత్తి నమస్కరిస్తున్నా.. అర్థం చేసుకోండి -
కుక్కలకు కూడా ఖరీదైన పరుపులు
సాక్షి, న్యూఢిల్లీ : మెత్తటి పరపులపై పడుకోవడం అందరికి సాధ్యం కాకపోవచ్చుగానీ డబ్బున్న మహరాజులకు అదో లెక్కా! అయితే మనుషులు పడుకునేందుకు డబ్బుల గురించి లెక్క చేయలేకపోవచ్చుగానీ, కుక్కల కోసం పరుపులు కొనాలంటే, అందులో ఖరీదైనా పరువులు కొనాలంటే ఎంతటి మహరాజులకైనా లెక్కలెకుండా ఉంటుందా! ఇప్పుడు పెంపుడు కుక్కల పరుపులు కూడా పెద్ద బిజినెస్‌గా మారిపోయింది. అందులో రాయల్ పరుపుల సంగతి చెప్పక్కెర్లేదు. ఈ పరుపులను డిజైన్ చేయడానికి ప్రత్యేక డిజైనర్లు కూడా ముందుకు వస్తున్నారు. ఈ పరుపులు భారతీయ కరెన్సీలో 95 వేల రూపాయల వరకు పలకడం విశేషం. వీటిని రాయల్ కేటగిరీగా పేర్కొంటున్నారు. ఆస్ట్రియా రాకుమారి కటాలిన్ జూ విండిజ్గ్రేజ్ ర్యాన్ వియెన్నాలో సొంత బ్రాండ్‌తో ఈ పరుపుల అమ్మకాలను ప్రారంభించారు. ఆమె తన పేరు స్ఫురించేలా ‘కేజెడ్డబ్లూ పెట్ ఇంటీరియర్స్’ దానికి పేరు పెట్టారు. వాటికి బుల్లి మంచం పరుపు నుంచి కాస్త పెద్ద మంచం పరుపు వరకు, నేల మీద వేసుకునే పరుపులను, వాటికి అనుగుణమైన మెత్తలను కూడా డిజైన్ చేసి అమ్ముతున్నారు. ఈ పరుపులు 800 రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు ఉన్నాయి. వాటికి విడివిడి గౌషన్లు కూడా ఉన్నాయి. వాటిని ఎప్పటికప్పుడు మార్చు కోవచ్చు. ఆ తర్వాత ఆమె పెంపుడు కుక్కలు ఆడుకునే ఆట వస్తువులతో ‘డాగ్ ఫర్నీచర్’ పేరిట వ్యాపారాన్ని విస్తరించారు. మరో పరుపుల కంపెనీ ‘చార్లీ చాహు’ 800 రూపాయలకు విడుదల చేసిన ‘చార్లీ చాహు స్నగుల్ బెడ్’ పాశ్చాత్య దేశాల మార్కెట్లో పిచ్చ పిచ్చగా అమ్ముడుపోతోంది. అందుకు కారణం దాని ధర అందరికి అందుబాటులో ఉండడమే. చార్లీ చాహు కంపెనీని క్రిసై్టన్ చాహు తన సోదరి జెన్నీ చాహుతో కలసి ఏర్పాటు చేశారు. పెంపుడు కుక్కల కోసం ‘పిప్పా అండ్ కంపెనీ’ మధ్యస్థాయి లగ్జరీ పరపులను తయారీచేసి మార్కెట్లో విక్రయిస్తోంది. వీటిని వాషింగ్ మషిన్లో వేసి ఉతికే అవకాశం కూడా ఉండడం విశేషం. పరుపులోని కుషన్‌కు వాసన, నీరు అంటకుండా నిలువరించగల లైనర్లను ఈ పరపుల తయారీలో ఉపయోగించినట్లు కంపెనీ వ్యవస్థాపకుడు జెన్నీఫర్ టేలర్ తెలిపారు. ‘సిగ్నేచర్ బెడ్స్’ పిప్పా అండ్ కంపెనీ పేరిట పెంపుడు కుక్కల పరపులను సరఫరా చేస్తోంది. -
పడకలు లేవని ముప్పు తిప్పలు
సాక్షి,సిటీబ్యూరో: చిత్రంలో కనిపిస్తున్న ఈయన పేరు మొయిజ్. పాతబస్తీకి చెందిన ఇతడు ఓ ప్రైవేటు పాఠశాల బస్సు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఉన్నట్టుండి ఇతడి కూతురు సయిదా ఫజాబేగం(10) తీవ్ర అస్వస్థతకు గురవడంతో స్థానికం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చూపించాడు. పరీక్షించిన అక్కడి వైద్యులు నిలోఫర్‌కు రిఫర్ చేశారు. దీంతో బిడ్డను తీసుకుని రెండు రోజుల క్రితం నిలోఫర్‌కు వచ్చాడు. ఆస్పత్రిలో పడకలు ఖాళీ లేకపోవడంతో బాలికను చేర్చుకునేందుకు నిరాకరించిన వైద్యులు.. ఉస్మానియాకు తీసుకెళ్లాల్సిందిగా సూచించారు. దాంతో బిడ్డను తీసుకుని ఉస్మానియాకు వెళ్లగా ఆస్పత్రిలో చిన్నపిల్లల వైద్యులు లేరని చేర్చుకునేందుకు నిరాకరించారు. దీంతో చేసేది లేక మొయిజ్.. బాలల హక్కుల సంఘ అధ్యక్షుడు అచ్యుతరావును ఆశ్రయించాడు. బాలికకు మానవతా దృక్పధంతో చికిత్స చేయాల్సిందిగా బంజారాహిల్స్‌లోని ఓ చిన్నపిల్లల కార్పొరేట్ ఆస్పత్రి యాజమాన్యాన్ని కోరారు. తీవ్ర జాప్యం వల్ల అప్పటికే బాలిక కాలుతో పాటు మాట కూడా పడిపోయింది. ఇన్ఫెక్షన్ మరింత ముదిరింది. బాలిక కండరాల క్షీణతకు సంబంధించిన గుయిల్లిన్ బారో సిండ్రోమ్ (జీబీఎస్)తో బాధపడుతోందని, వెంటనే ఇంజక్షన్ ఇవ్వాలని, ఒక్కో ఇంజక్షన్‌కు రూ.27 వేల చొప్పున మొత్తం రూ.12.50 లక్షలకు పైగా ఖర్చవుతుందని సదరు ఆస్పత్రి యాజమాన్యం స్పష్టం చేసింది. ఆర్థిక స్తోమత లేక పోవడంతో శుక్రవారం మధ్యాహ్నం కూతురును తీసుకుని మరోసారి ఉస్మానియాకు పరుగులు తీశాడు. అప్పటికే పడకలన్నీ నిండిపోవడంతో చేర్చుకునేందుకు నిరాకరించి, మళ్లీ నిలోఫర్‌కు రిఫర్ చేశారు. దీంతో మధ్యాహ్నం ఆయన మరోసారి తన బిడ్డను నిలోఫర్‌కు తీసుకొచ్చాడు. సాయంత్రం పొద్దుపోయే వరకు ఆస్పత్రిలో చేర్చుకోలేదు. అదే మంటే పడకలు ఖాళీ లేవని చెప్పుతున్నారని, ఏం చేయాలో అర్థం కావడం లేదని బాలిక తండ్రి మొయిజ్ బోరున విలపించడం అక్కడున్న వారందరినీ కలిచివేసింది. ఒక్క మొయిజ్ మాత్రమే కాదు.. వైరల్ జ్వరాలతో బాధపడుతూ కార్పొరేట్ ఆస్పత్రుల్లో చికిత్స పొందే ఆర్థిక స్తోమత లేక ప్రభుత్వ ఆస్పత్రులకు చేరుకుంటున్న అనేక మంది సామాన్యులకు ఇదే అనుభవం ఎదురవుతోంది. -
ఏమంటాం..ఇష్ట‘పడక’!
ఖమ్మం, నేలకొండపల్లి: గురుకుల పాఠశాలల్లో రాత్రివేళ కటిక నేలపై అటూఇటూ బొర్లుతూ నిద్రపట్టక అవస్థ పడుతున్న విద్యార్థులు ఇక హాయిగా..మెత్తటి పరుపుల(స్లిమ్‌బెడ్స్)పై పడుకోనున్నారు. చాప లేదా పల్చటి దుప్పటి గచ్చుపై వేసుకొని..ఇంతకాలం కష్టంగా నిద్దరోయిన పిల్లలు ఆ అవస్థకు దూరమై చక్కటి స్లిమ్బెడ్లపై పడుకుంటున్నారు. ఈ ఏడాది కొత్తగా ప్రారంభించిన దానవాయిగూడెం, ఎర్రుపాలెం, కూసుమంచి, ముదిగొండ, మధిర, సత్తుపల్లి, తిరుమలాయపాలెం, దానవాయిగూడెం(డిగ్రీ)గురుకులాల్లో మెత్తటి పరుపులను అందజేశారు. ప్రస్తుతం అద్దె భవనాల్లో నడుస్తున్న విద్యాలయాలకు తగిన సౌకర్యాలు కల్పించే ఉద్దేశంతో..జిల్లా వ్యాప్తంగా 8విద్యాలయాల్లోని 2,752 మందికి పరుపులు పంపిణీ చేశారు. అద్దె భవనాలు విశాలంగా లేకపోవడం, అందరికీ సరిపడా మంచాలు వేసే వీలు ఉండకపోవడంతో ఒక రకమైన పడక (స్లిమ్‌బెడ్స్)ను రూపొందించి అందజేశారు. అవసరమైనప్పు డు వేసుకుని, తర్వాత మలుచుకుని దా చుకునే విధంగా ఉన్నాయి. నేలపై చాప పరుచుకుని, ఆపైన పరుపు వేసుకుంటే బెడ్(పడక)పై నిద్రపోతున్న భావన కలిగేలా రూపొందించారు. రూ.15.14 లక్షలతో కొనుగోలు.. రాష్ట్ర ప్రభుత్వం గురుకుల విద్యార్థులకు పరుపుల కోసం రూ.15.14 లక్షలు ఖర్చు చేసింది. జిల్లాలో 8 గురుకుల పాఠశాలలు నూతనంగా ఏర్పాటు అయ్యాయి. ఒక్క పరుపు ఖరీదు దాదాపు రూ.550 విలువ చేస్తుంది. మొత్తం 2,752 మంది విద్యార్థులకు రూ.15.14 లక్షలతో గురుకులాల సంస్థ హైదరాబాద్‌లో కొనుగోలు చేసి..ఇక్కడికి పంపించింది. విద్యార్థులు రాత్రివేళ ఈ పరుపులపై నిద్రించి, ఉదయం లేచాక ఎంచక్కా మలిచి పెట్టెల్లో భద్ర పరుచుకుంటున్నారు. కార్పొరేట్ స్థాయిలో అందించాం.. కార్పొరేట్ హాస్టళ్లల్లో మాదిరి..విద్యార్థులకు సౌకర్యాలు కల్పించేందుకు సంస్థ కృషి చేస్తోంది. అందులో భాగంగానే పరుపులు (స్లిమ్‌బెడ్స్)ను అందించాం. గురుకుల విద్యాలయాల బలోపేతానికి గురుకులాల సంస్థ కార్యదర్శి ఆర్ఎస్.ప్రవీణ్‌కుమార్ ఎంతో శ్రద్ధ పెడుతున్నారు. – పుల్లయ్య, ఆర్సీఓ చాలా సంతోషంగా ఉంది.. మొన్నటి దాకా కింద పడుకున్నాం. ఇప్పుడు పరుపులు వచ్చాక వాటిని వేసుకుని నిద్ర పోతున్నాం. చాలా హాయిగా నిద్ర పడుతోంది. పెట్టెలో దాచుకుంటున్నాం. – వివేక్, గురుకుల విద్యార్థి, ముదిగొండ ప్రవీణ్‌కుమార్ సార్‌కు థాంక్స్.. గురుకుల సంస్థ కార్యదర్శి ఆర్ఎస్.ప్రవీణ్‌కుమార్ సార్‌కు రుణపడి ఉంటాం. ఇంట్లో లెక్కనే..మంచిగా పరుపులు అందజేశారు. స్టూడెంట్స్ అంతా హ్యాపీగా ఉన్నారు. – యశ్వంత్, గురుకుల విద్యార్థి, ముదిగొండ -
సర్కారు ఆస్పత్రిలో మంచాల్లేవు..!
డయేరియా బాధితులతో నిండిన ఆస్పత్రి అదుపులోకి రాని వాంతులు, విరేచనాలు, జ్వరాలు స్పందించని అధికారులు సిరిసిల్ల : స్థానిక పెద్దాస్పత్రిలో మంచాలు లేవు. వాంతులు, విరేచనాలు, జ్వరాలతో బాధితులు చేరారు. దీంతో మంచాలేక వ్యాధిగ్రస్తులు ఇబ్బందులు పడుతున్నారు. కార్మిక వాడల్లో డయేరియా ప్రబలింది. ప్రభుత్వ ప్రాంతీయ ఆస్పత్రిలోనే వంద మంది చికిత్స పొందుతుండగా.. ప్రై వేటు ఆస్పత్రులు, ఆర్ఎంపీ, పీఎంపీ వద్ద వందలాది మంది వైద్యం చేయించుకుంటున్నారు. అసలు వర్షాకాలం.. కొత్త నీరు రావడంతో వాంతులు, విరేచనాలు వ్యాపిస్తున్నాయి. ఖాళీ చేయమంటున్నారు.. ఈఫొటోలో కనిపిస్తున్న దంపతుల పేర్లు బండి శ్రీనివాస్, సుజాత, వారి కూతురు అమూల్య(8). సిరిసిల్ల శాంతినగర్‌లో కిరాయి ఇంట్లో ఉండే శ్రీనివాస్ అనారోగ్యంతో ప్రభుత్వ ఆస్పత్రిలో నాలుగు రోజుల కింద చేరారు. శ్రీనివాస్ డయింగ్ కార్మికుడు. ఆరోగ్యం ఇంకా మెరుగుకాలేదు. కానీ డాక్టర్లు బెడ్ ఖాళీ చేసి కరీంనగర్ ఆస్పత్రికి వెళ్లాలని సూచిస్తున్నారు. చేతిలో చిల్లిగవ్వలేక.. ఎలా వెళ్లాలో తెలియక శ్రీనివాస్, సుజాత దంపతులు కన్నీళ్లు పెడుతున్నారు. ఇక్కడి ఆస్పత్రిలో మంచాలు ఖాళీ లేక ఆరోగ్యం మెరుగు పడకపోయినా మంచం ఖాళీ చేయించేందుకు పంపించేస్తున్నారు. తెల్లవార్లూ ఇదే గోస.. శుక్రవారం తెల్లవారుజామున బీవై నగర్‌కు చెందిన కేశవరాజు లక్ష్మయ్య(50) వాంతులు, విరేచనాలతో బాధపడుతూ సర్కారు ఆస్పత్రికి వచ్చాడు. పెద్దూరు స్పిన్నింగ్ మిల్లులో పని చేసే లక్ష్మయ్య డయేరియా బారిన పడగా.. ఆయన భార్య నిర్మల ఆస్పత్రిలో చేర్చింది. విద్యానగర్‌కు చెందిన షేక్ నయీమ్(30) గురువారం రాత్రి వాంతులు, విరేచనాలతో బాధపడుతూ ఆస్పత్రిలో చేరారు. బీవై నగర్‌కు చెందిన తడక దత్తాద్రి(60) సైతం శుక్రవారం తెల్లవారుజామున సర్కారు ఆస్పత్రిలో చేరారు. ఆస్పత్రిలో మంచాలు ఖాళీ లేక బెంచీపై ఉన్నాడు. డయేరియా బాధితులకు గ్లూకోజ్‌లు పెట్టలేక తెల్లవార్లు నిద్రలేకుండా గడిపామని ఆస్పత్రి సిస్టర్ ఒకరు అన్నారు. కొత్త వారికి జాగేదీ..? ప్రాంతీయ ఆస్పత్రిలో కొత్తగా వచ్చే డయేరియాపీడితులకు జాగలేకుండా పోయింది. ఓపీ రికార్డుల ప్రకారం రోజూ 50 మంది డయేరియా, జ్వరంతో బాధపడుతూ ఆస్పత్రిలో చేరుతున్నారు. తగ్గే వరకు అడ్మిట్ ఉండడంతో ఆస్పత్రిలో మంచాలు లేవు. మరోవైపు బాధితులు, వారి బంధువులతో కిటకిటలాడుతోంది. డయేరియా, విషజ్వరాలు తీవ్రంగా ఉన్నా నివారణ చర్యలు తీసుకోవడంలో అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ప్రత్యేక చర్యలు తీసుకోవడం లేదు. ఇప్పటికైనా డయేరియాను కట్టడి చేసేందుకు మున్సిపల్, వైద్య, ఆరోగ్య శాఖ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. -
30 శాతం పడకలు అత్యవసర సేవలకే
- ప్రతి ఆస్పత్రిలోనూ కేటాయించాలి: లక్ష్మారెడ్డి - ఆహార పదార్థాల కల్తీని అరికట్టాలని ఆదేశం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని అన్ని ఆస్పత్రుల్లో 30 శాతం పడకలను అత్యవసర సేవా విభాగానికే (ఐసీయూ) కేటాయించాలని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి అధికారులను ఆదేశించారు. ఆస్పత్రుల్లో అత్యవసర సేవలు, మౌలిక సదుపాయాల కల్పనపై వైద్యవిధాన పరిషత్ కమిషనర్, వైద్య విద్యా సంచాలకులు, ఐపీఎం డెరైక్టర్, నిమ్స్ తదితర అధికారులతో మంత్రి శనివారం సమీక్ష నిర్వహించారు. పూర్తి స్థాయి అత్యవసర సేవలను ఆస్పత్రుల్లో అందుబాటులో ఉంచాలని, ఇందుకోసం కావాల్సిన పరికరాలు, మానవ వనరులకు సంబంధించిన ప్రతిపాదనలు పంపాలన్నారు. నిమ్స్‌లో ‘ఎమర్జెన్సీ మెడిసిన్’ పీజీ కోర్సును ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. కల్తీపై తడాఖా చూపించండి కల్తీ ఆహార పదార్థాలు, పానీయాలు విక్రయిస్తున్న దుకాణాల్లో తనిఖీలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు. మ్యాగీలో ప్రమాదకర పదార్థాలు ఉన్న నేపథ్యంలో మంత్రి ఈ చర్యలకు ఉపక్రమించారు. మామిడికాయలను కృత్రిమంగా మగ్గబెట్టడానికి కార్బైడ్ వాడుతున్నారని పేర్కొన్నారు. పాలల్లో కల్తీ జరుగుతోందని, చిన్న పిల్లలు తాగే పాలల్లో కల్తీ జరిగితే ఉపేక్షించకూడదన్నారు. -
‘గాంధీ’లో మామూలే...
బెడ్లు లేవని రోగిని బయటకు నెట్టేసిన సిబ్బంది గాంధీ ఆస్పత్రి: రోగులంటే వారికి చిన్నచూపు.. జాలి, దయ, కరుణ వంటివి అక్కడ మచ్చుకైనా కని పించవు. మంచాలు, సెలైన్‌స్టాండ్స్ లేవనే సాకుతో రోగిని బలవంతంగా బయటకు పంపించారు. బాధితురాల కథనం ప్రకారం...ఉప్పల్ చిలుకానగర్‌కు చెందిన నాగరాజు(30) పక్షవాతంలో బాధపడుతున్నాడు. నిరుపేదలైన తల్లిదండ్రులు నాగరాజును వైద్యం కోసం బుధవారం సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రికి తీసుకొచ్చారు. మంచాలు లేవని ఆసుపత్రి సిబ్బంది అతడిని గంటల తరబడి వార్డు బయటే నిల్చోబెట్టారు. కొద్దిసేపటి తర్వాత నాగరాజు చేతికి సిరంజీ గుచ్చి.. సెలైన్ బ్యాటిల్‌ను పట్టుకోమని వృద్ధురాలైన అతడి తల్లి లక్షి చేతికిచ్చారు. తనకు నిల్చోడానికే శక్తి చాలడంలేదని, సెలైన్‌బ్యాటిల్‌ను పట్టుకునే పరిస్థితి లేదని చెప్పడంతో, మేము పటుకుని నిల్చోవాలా? అంటూ వైద్య సిబ్బంది అసహనం వ్యక్తం చేశారు. ఆస్పత్రిలో స్టాండ్లు కూడా అందుబాటులో లేవంటూ.. నాగరాజు చేతికి పెట్టిన సెలైన్‌ను ఊడపీకి, ఇక్కడి నుంచి వెళ్లిపొమ్మని గద్ధించారు. చేసేదిలేక తల్లి నడలేవని స్థితిలో ఉన్న తన కొడుకుని తీసుకుని, నానా తంటాలు పడి ఏఎంసీ వార్డు ముందుకు తీసుకొచ్చి బోరుమంది. రోదిస్తున్న ఆమెను మీడియా ప్రతినిధులు ఏం జరిగిందని ఆరా తీయగా... అసలు విషయం చెప్పింది. తాము వైద్యం చేయిస్తామని చెప్పగా, బతికుండగా గాంధీ ఆస్పత్రికి రానని చెప్పి కొడుకుని తీసుకుని ఆటోలో ఇంటికి వెళ్లిపోయింది. -
ఆసుపత్రుల్లో మంచాలైనా లేవు
భీమవరం అర్బన్ : ‘ప్రభుత్వ ఆసుపత్రుల్లో సదుపాయాలు లేవు. కనీసం మంచాలు కూడా లేవు. పేదలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు రాష్ట్రం పరి స్థితీ ఇలాగే ఉంది. అయినా ఆసుపత్రుల అభివృద్ధికి పాటుపడతాను. వైద్యుల జీతాలు పెంచేందుకు కృషి చేస్తాను’ అని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఎన్నికల విధానం సక్రమంగా లేదని, నిజాయితీగా ఎన్నికలు నిర్వ హించే పరిస్థితులు లేవని ఆవే దన వ్యక్తం చేశారు. స్థానిక వీఎస్ఎస్ గార్డెన్స్‌లో లయన్స్ క్లబ్ ఆఫ్ ఆకివీడు ఆధ్వర్యంలో మంగళవారం వైద్యుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కామినేని, కేర్ హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ బి.సోమరాజు, భీమవరం హాస్పిటల్స్ ఎండీ డాక్టర్ జి.గోపాలరాజును సత్కరించారు. ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి కామినేని మాట్లాడుతూ రాష్ట్రంలో ఎయిమ్స్ ఏర్పాటుకు కృషి చేస్తున్నామని, త్వరలో నిపుణుల కమిటీ వస్తుందని చెప్పారు. మనకు ఎన్నో వనరులు ఉన్నాయని, సముద్ర ప్రాంతం, విస్తరించిన వ్యవసాయం మన ఆస్తులని పేర్కొన్నారు. వీటిని ఉపయోగించుకోవడం ద్వారా రాష్ట్రా న్ని అభివృద్ధిపథంలో నడిపించేందుకు తనవంతు కృషి చేస్తానన్నారు. కేర్ హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ సోమరాజు మాట్లాడుతూ వైద్యరంగంలో చాలా సమస్యలు ఉన్నాయని, ప్రభుత్వం వాటిని పరిష్కరించే దిశగా కృషి చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. వైద్య రంగంలో వస్తున్న విప్లవాత్మక మార్పులు, అభివృద్ధిని కూలంకషంగా వివరించారు. ఉండి ఎమ్మెల్యే వేటుకూరి శివరామరాజు, మాజీ ఎమ్మెల్యే త్సవటపల్లి సత్యనారాయణమూర్తి, కేర్ హాస్పిటల్స్ ఆర్థోపెడిక్ నిపుణుడు డాక్టర్ బీఎన్ ప్రసాద్, లయన్స్ క్లబ్ ఆఫ్ ఆకివీడు, లయన్స్ క్లబ్ ఆఫ్ ఆకివీడు ఆదర్శ, లయన్స్ క్లబ్ ఆఫ్ ఆకివీడు అభయ నిర్వాహకులు దాట్ల రామరాజు, ఎం.శివసుబ్రహ్మణ్యం, కె.సాంబశివరావు, హరనాథరావు, ఆరిఫ్, సురేష్, శ్రీనివాస వరప్రసాద్, శ్రీనివాస్, దుర్గాప్రసాద్, ఎంవీఎస్ రాజు, కృష్ణంరాజు, డీసీసీ మాజీ అధ్యక్షుడు గోకరాజు రామరాజు, డీఎం హెచ్‌వో శంకర్రావు పాల్గొన్నారు.