20,000 క్వారంటైన్‌ పడకలు సిద్ధం | 20,000 Quarantine Beds Ready In Andhra Pradesh | Sakshi
Sakshi News home page

20,000 క్వారంటైన్‌ పడకలు సిద్ధం

Published Fri, Mar 27 2020 4:53 AM | Last Updated on Fri, Mar 27 2020 8:58 AM

20,000 Quarantine Beds Ready In Andhra Pradesh - Sakshi

సాక్షి, అమరావతి: కరోనా వైరస్‌ వ్యాప్తిని నిరోధించే చర్యల్లో భాగంగా ఏపీ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. ఏ రాష్ట్రంలో చేయని విధంగా క్వారంటైన్‌ వ్యవస్థను బలోపేతం చేసే దిశగా అతిపెద్ద నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో 175 నియోజకవర్గాలుండగా ఒక్కో నియోజకవర్గంలో 100 నుంచి 150 పడకలు క్వారంటైన్‌ కోసం ఏర్పాటు చేసింది. ఇప్పటికే రాష్ట్రం మొత్తమ్మీద బోధనాస్పత్రులు, జిల్లా ఆస్పత్రుల్లో ఉన్నవి కాకుండా నియోజకవర్గాల వారీగా ఏర్పాటు చేసిన క్వారంటైన్‌ పడకలు 20 వేల వరకూ అందుబాటులోకి వచ్చినట్టు అధికార వర్గాలు తెలిపాయి. దీనిపై జిల్లా కలెక్టర్లు వైద్య ఆరోగ్య శాఖకు నివేదిక ఇచ్చారు. ప్రతి నియోజకవర్గంలోనూ ఆస్పత్రులు, స్కూళ్లు, కళాశాలలు, ఆర్టీసీ భవనాలు, డిగ్రీ కళాశాలలు ఇలా ఎక్కడ అనుకూలంగా ఉంటుందో ఆ భవనాలన్నిటినీ కరోనా వైరస్‌ లక్షణాలున్న వారి కోసం సిద్ధం చేశారు.

క్వారంటైన్‌కి ఇన్‌చార్జిగా మెడికల్‌ ఆఫీసర్‌
►నియోజకవర్గంలో పనిచేస్తున్న స్టాఫ్‌ నర్సులు, ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తల విధులు క్వారంటైన్‌ కేంద్రంలోనే ఉంటాయి. ఒక్కో క్వారంటైన్‌ కేంద్రానికి ఒక మెడికల్‌ ఆఫీసర్‌ను ఇన్‌చార్జిగా నియమిస్తారు. 
►ఒక్కో కేంద్రంలో 100 పడకలకు తగ్గకుండా ఏర్పాటు పూర్తయ్యాయి. ఇందులో 10 పడకలు వెంటిలేటర్‌తో కూడినవి. 
►ఇవి కాకుండా మరికొన్ని ప్రైవేటు ఆస్పత్రుల్లో వెంటిలేటర్‌తో కూడిన పడకల ఏర్పాటుకు ఆదేశాలు వెళ్లాయి. 
►కరోనా అనుమానిత లక్షణాలుంటే వారిని తక్షణమే ఆ నియోజకవర్గాల పరిధిలో ఉన్న క్వారంటైన్‌కు తరలించాలని జిల్లా వైద్యాధికారులకు కలెక్టర్లకు ఆదేశాలిచ్చారు. 
►తాజాగా 4 బోధనాస్పత్రులను కేవలం కరోనా ఆస్పత్రులుగా గుర్తిస్తూ నిర్ణయం తీసుకున్నారు. 
►13 జిల్లా ఆస్పత్రులు, మరో 7 బోధనాస్పత్రుల్లోనూ కరోనా వైరస్‌ లక్షణాలున్న వారికి వైద్యమందిస్తారు. 
►ఎలాంటి విపత్కర పరిస్థితులు వచ్చినా మరికొన్ని క్వారంటైన్‌ కేంద్రాలు పెంచేలా సిద్ధంగా ఉండాలని కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. 
►హై రిస్కు ప్రాంతాలు అంటే విశాఖపట్నం, విజయవాడ వంటి ప్రాంతాల్లో మరికొన్ని ప్రత్యేక కేంద్రాలు పెంచాలని యోచిస్తున్నారు.

క్వారంటైన్‌ల వద్ద ఉండే వసతులు ఇవే.. 
►ఇన్‌ఫెక్షన్లు సోకకుండా రోగులకు, వైద్య సిబ్బందికి మాస్క్‌లు, శానిటైజర్లు, పీపీఈ (పర్సనల్‌ ప్రొటెక్షన్‌ ఎక్విప్‌మెంట్‌)లు ఉంటాయి. 
►డాక్టర్లు, నర్సులు 24 గంటలూ అందుబాటులో ఉంటారు. 
►ఆహారం, మంచినీటి వసతి ఎప్పటికప్పుడు అందిస్తారు. 
►24 గంటలూ అంబులెన్సు సదుపాయం అందుబాటులో ఉంటుంది. 
►తాత్కాలిక పద్ధతిలో టాయ్‌లెట్‌లను ఏర్పాటు చేస్తారు. 
►సీసీ కెమేరాల పర్యవేక్షణ 24 గంటలూ ఉంటుంది. ఇంటర్నెట్‌ సదుపాయం కూడా కల్పిస్తారు. 
►క్వారంటైన్‌లో ఉన్న వారి ఫోన్‌ నంబర్లు, చిరునామాలు ఇచ్చిన తర్వాత వాటిని పర్యవేక్షించేందుకు ఒక నోడల్‌ అధికారి ఉంటారు. 
►క్వారంటైన్‌కు అనుబంధంగా ఒక రెఫరల్‌ ఆస్పత్రిని అందుబాటులో ఉంచుతారు. 
►ప్రతి పడకకూ కనీసం 2 మీటర్ల దూరం పాటించేలా ఏర్పాటు ఉంటుంది. 
►క్వారంటైన్‌ కేంద్రాల్లో ప్రతిరోజూ పారిశుధ్యం నిర్వహించేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటారు. 
►అనుమతి ఉన్న వారు మాత్రమే క్వారంటైన్‌కు వెళ్లేలా నిబంధనలు ఉంటాయి.

ప్రైవేటు యాజమాన్యాలు సిద్ధంగా ఉండాలి: డా.ఎ.మల్లికార్జున, సీఈవో, ఆరోగ్యశ్రీ 
►పరిస్థితిని బట్టి క్వారంటైన్‌ కేంద్రాలు పెంచుకుంటూ వెళుతున్నాం. 
►అవసరమైతే ప్రైవేటు ఆస్పత్రులను తీసుకుని క్వారంటైన్‌ లేదా చికిత్సా కేంద్రాలుగా మారుస్తాం. 
►ప్రైవేటు ఆస్పత్రుల డాక్టర్లు, సిబ్బంది కూడా చికిత్సకు సిద్ధంగా ఉండాలి.

ఎవరికీ సెలవులు ఇవ్వలేదు: డా.కె.వెంకటేష్, వైద్య విద్యా సంచాలకులు 
►ఇప్పటికే పీజీ వైద్య విద్యార్థులెవరికీ సెలవులు ఇవ్వలేదు. వాళ్లందరూ పనిచేస్తున్నారు 
►అవసరమైతే ఎంబీబీఎస్‌ విద్యార్థులను రావాలని కోరతాం. 
►ప్రైవేటు మెడికల్‌ కాలేజీలు కూడా కరోనా నియంత్రణకు ముందుకు రావాలని చెప్పాం.

సీహెచ్‌సీ, ఏరియా ఆస్పత్రుల్లోనూ చికిత్స: డా.రామకృష్ణారావు, కమిషనర్, వైద్య విధాన పరిషత్‌ 
►మనకు 195 సామాజిక ఆరోగ్య కేంద్రాలున్నాయి. 
►ఎక్కడైతే సదుపాయాలు బాగున్నాయో అక్కడ క్వారంటైన్‌ ఏర్పాటుకు ఆదేశించాం. 
►వెంటిలేటర్లు ఉన్న ప్రతి ఏరియా ఆస్పత్రిలోనూ చికిత్సకు ఏర్పాట్లు చేశాం. 
►13 జిల్లా ఆస్పత్రుల్లోనూ కరోనా బాధితుల వైద్యానికి ప్రత్యేక పడకలు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి.

చదవండి : చేతులెత్తి నమస్కరిస్తున్నా.. అర్థం చేసుకోండి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement