సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు నాయుడు వంద రోజుల పాలన అంతా మోసమేనని మాజీ సీఎం, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. చంద్రబాబు వంద రోజుల పాలనలో సూపర్ సిక్స్ లేదు.. సెవెనూ లేదంటూ విమర్శించారు వైఎస్ జగన్. చంద్రబాబు పాలనలో వ్యవస్థలన్నీ తిరోగమనంలో ఉన్నాయన్నారు.
గోరు ముద్దు గాలికి ఎగిరిపోయిందని, ఆరోగ్య శ్రీ బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయనే విషయాన్ని వైఎస్ జగన్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇప్పటివరకూ వసతి దీవెన, విద్యా దీవెను కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. 108, 104 ఉద్యోగులకు ఇప్పటివరకూ జీతాలు ఇవ్వలేని పరిస్థితి దాపురించిందన్నారు. చంద్రబాబు సూపర్ సిక్స్ అంటూ ప్రజల జీవితాలతో ఆటలాడరని వైఎస్ జగన్ ధ్వజమెత్తారు. శుక్రవారం( సెప్టెంబర్ 20) తాడేపల్లిలో ప్రెస్‌మీట్ నిర్వహించిన వైఎస్ జగన్.. చంద్రబాబు 100 రోజుల పాలనను తూర్పారబట్టారు.
ఇదీ చదవండి : చంద్రబాబు ‘లడ్డూ’ పాలిటిక్స్‌పై .. వైఎస్ జగన్ రియాక్షన్
ప్రెస్‌మీట్‌లో వైఎస్ జగన్ ఏమన్నారంటే..
స్టిక్కర్లు వేస్తారట!
- ఎన్నికల ముందు చంద్రబాబు చెప్పిన మాటలు, ఆ తర్వాత చేసిన మోసం. తన 100 రోజుల పరిపాలన మీద తనది మంచి ప్రభుత్వం అంటూ ప్రచారం చేసుకుంటున్నారు.
- ప్రతి ఇంటికి సచివాలయాల సిబ్బంది వెళ్లి ఆ స్టిక్కర్లు అతికించాలంట.
సూపర్ సిక్స్ లేదు. సెవెన్ లేదు
నిజానికి ఈ 100 రోజుల్లో సూపర్ సిక్స్ లేదు. సూపర్ సెవెన్ లేదు. ప్రజలకు ఇచ్చిన మాటలన్నీ అబద్ధాల మూటలు. దీంతో ఆయన ప్రజల ముందు దోషిగా నిలబడ్డారు.
ఎన్నికల ముందు చంద్రబాబు, ఆయన పార్టీ నేతలు ఎలా ప్రచారం చేశారు? ఇంటింటికి వెళ్లి పిల్లలు కనిపిస్తే నీకు రూ.15 వేలు అని, మహిళలు కనిపిస్తే నీకు ఏటా రూ.18 వేలు అని, రైతు కనిపిస్తే నీకు రూ.20 వేలు అంటూ.. ప్రతి ఇంటికి వెళ్లి, దుర్మార్గంగా ప్రచారం చేసి నమ్మించారు.
ఈ 100 రోజుల్లో చంద్రబాబు చేసింది ఏమిటంటే.. మోసం మోసం.
మొత్తం తిరోగమనం
ఒకవైపున దారుణ పరిపాలన. మరోవైపు అన్ని రంగాల్లో తిరోగమనం.
పిల్లలకు మూడు క్వార్టర్ల నుంచి విద్యాదీవెన అందడం లేదు. వసతి దీవెన కూడా లేదు.
పిల్లలు ఫీజులు కట్టలేకపోతున్నారు. వారికి కాలేజీల యాజమాన్యాలు సర్టిఫికెట్స్ ఇవ్వడం లేదు.
బడులన్నీ నిర్వీర్యం అయ్యాయి. గోరుముద్ద పోయింది. టోఫెల్ శిక్షణ లేదు. ఇంగ్లిష్ మీడియమ్నూ నీరు గారుస్తున్నారు.
వైద్య రంగం కూడా నాశనమై పోతోంది. ఆరోగ్యశ్రీలో దాదాపు రూ.2 వేల కోట్ల బిల్లులు పెండింగ్. చంద్రబాబు సీఎం అయిన నాటి నుంచి 108, 104 సర్వీసుల సిబ్బందికి జీతాలు లేవు.
ప్రభుత్వం కడుతున్న కొత్త మెడికల్ కాలేజీలను, స్కామ్‌లు చేస్తూ, ప్రైవేటుపరం చేసేందుకు అడుగులు పడుతున్నాయి.
చంద్రబాబు హయాంలో రైతు పూర్తిగా రోడ్డున పడ్డాడు. పెట్టుబడి సాయం రూ.20 వేలు ఇస్తానని మోసం చేశాడు. చివరకు మా హయాంలో ఇచ్చిన రూ.13,500 కూడా లేకుండా పోయాయి.
ఉచిత పంటల బీమా లేదు. సున్నా వడ్డీ పంట రుణాలు లేవు. ఆర్బీకే వ్యవస్థ నిర్వీర్యం అయింది. ఎరువులు, విత్తనాల కోసం రైతుల క్యూలు కనిపిస్తున్నాయి.
ఏ రంగం చూసినా తిరోగమనమే.
మా హయాంలో అన్నీ డోర్ డెలివరీ. ఇప్పుడన్నీ పోయాయి. ఎక్కడా పారదర్శకత లేదు.
జన్మభూమి కమిటీలు వస్తున్నాయి. పెన్షన్ కోసం కూడా వారి ఇంటికే వెళ్లాలట.
రెడ్ బుక్ పాలన. శాంతి భద్రతలు క్షీణించాయి.
న్యాయానికి పాతర వేశారు. ధర్మానికి రక్షణ లేదు. ఆస్తులకు రక్షణ లేదు. దొంగ కేసులు పెడుతున్నారు. వేధిస్తున్నారు.
అన్నింటా ౖడైవర్షన్ పాలిటిక్స్
రాష్ట్రంలో అరాచక, ఆటవిక పాలన మీద మేము ఢిల్లీలో ధర్నా చేస్తే, అదే రోజు మదనపల్లెలో ఏదో అగ్ని ప్రమాదం జరిగితే, దాన్ని సెన్సేషన్ చేసి, ఉన్నతాధికారులను ఛాపర్లో పంపించారు.
ఆ ఘటన వెనక మా కుట్ర ఉందని దుష్ప్రచారం చేశారు.
స్కూళ్లు, కాలేజీలు, గురుకుల విద్యా సంస్థల్లో ఆహారం బాగాలేదని విద్యార్థులు ఆందోళనకు దిగితే.. దాన్ని డైవర్ట్ చేసే విధంగా చంద్రబాబు తొలిసారి సీఎం అయి, 30 ఏళ్లు అయిందంటూ వేడుకలు.
స్కిల్ స్కామ్‌లో తనను అరెస్టు చేశారని, తనకు బాగా దగ్గర, తనకు బంధుత్వం ఉన్న ఈనాడు గ్రూప్‌వాళ్ల, మార్గదర్శి నేరాలు బయట పెట్టడంతో.. ముంబై సినీ నటి జత్వానీని తీసుకొచ్చారు.
ఆమెతో తప్పుడు ఫిర్యాదు చేయించి, అధికారులను వేధిస్తున్నారు.
ఇక విజయవాడలో భారీ వర్షాలు కురుస్తాయని, తుపాన్ వస్తుందని తెలిసినా, బుడమేరు గేట్లు ఎత్తుతారని ముందుగా తెలిసినా, కనీసం రివ్యూ చేయలేదు. ప్రజలను అప్రమత్తం చేయలేదు. ఫ్లడ్ కుషన్ ఏర్పాటు చేయలేదు.
కానీ చంద్రబాబు అవేవీ చేయకపోవడం వల్ల విజయవాడ మునిగింది. అక్కడ పిఠాపురం నియోజకవర్గంలో ఏలేరు కాల్వ కూడా వరద కూడా గ్రామాలను ముంచెత్తింది.
ఇలా అన్నింటా చంద్రబాబు ఫెయిల్ కావడంతో, దాన్నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు.. బోట్లతో ప్రకాశం బ్యారేజీని ఢీకొట్టి కూల్చాలని కుట్ర చేసినట్లు ఆరోపణలు, దారుణ విమర్శలు చేశారు.
నిజానికి ఆ బోట్లు చంద్రబాబు పార్టీ వారివి. నది నుంచి ఇసుక అక్రమంగా తరలించడం కోసం ఏర్పాటు చేసినవి. అవి వరదకు కొట్టుకొచ్చాయి.
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరించే చర్యలు ముమ్మరం కావడంతో, డైవర్షన్ కోసం ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులను సస్పెండ్ చేశారు.
మరో దారుణ డైవర్షన్ కుట్ర..కోట్లాది భక్తుల మనోభావాలతో ఆట
ఇప్పుడు చంద్రబాబు 100 రోజుల పాలన. వైఫల్యం అన్నీ వెలుగులోకి రావడంతో.. మరో డైవర్షన్.
తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడుతున్నారంటూ, మాపై ఆరోపణలు. విమర్శలు చేస్తున్నారు.
ప్రజలు సూçపర్‌సిక్స్ హామీలపై నిలదీస్తారన్న భయంతో, దుర్మార్గమైన కుట్ర చేస్తున్నారు. రాజకీయాల కోసం చివరకు దేవుణ్ని కూడా చంద్రబాబు వదలడం లేదు.
చంద్రబాబు ఎంత దారుణ విమర్శ చేశారంటే.. తిరుపతి లడ్డూ తయారీలో నాసి రకం నెయ్యి, జంతువుల కొవ్వు నుంచి తయారు చేసిన నెయ్యిని వాడారని అన్నారు.
సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి ఇలా మాట్లాడడం ధర్మమేనా? కొన్ని కోట్ల మంది మనో భావాలతో ఆడుకోవడం ధర్మమేనా?
నెయ్యి, సరుకుల సేకరణలో పక్కా వ్యవస్థ
నిజానికి నెయ్యి సేకరణ ఎలా జరుగుతుంది? దాని విధివిధానాలు ఏమిటి? అందరూ తెలుసుకోవాలి.
తిరుమలలో నెయ్యి సేకరణ రెగ్యులర్‌గా జరిగే కార్యక్రమం. ప్రతి ఆరు నెలలకు టెండర్లు పిలుస్తారు. కంపెనీలు కోట్ చేస్తాయి. ఎల్–1గా ఎవరు ఉంటే, బోర్డు దాన్ని ఆమోదిస్తుంది.
ఇది రొటీన్‌గా జరిగే కార్యక్రమం. కొత్తగా నియమాలు ఎవరూ మార్చలేదు.
ఎన్‌ఏబీఎల్ సర్టిఫికెట్
తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వరస్వామి వారి లడ్డూకి ఎంత ప్రాశస్త్యం ఉందో అందరికీ తెలుసు. దాని కోసం వస్తువుల సేకరణ ఎప్పుడూ రొటీన్‌గా, పక్కా పద్ధతిలో జరుగుతుంది.
మెటేరియల్ ఎవరు సరఫరా చేసినా.. వారు పంపించిన నెయ్యి ట్యాంకర్‌తో పాటు, వారు ఎన్‌ఏబీఎల్ (నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ ల్యాబ్స్) సర్టిఫై చేసిన ల్యాబ్ నుంచి క్వాలిటీ సర్టిఫికెట్ తీసుకురావాలి.
అలా దాంతో వచ్చిన ట్యాంకర్ నుంచి మూడు శాంపిల్స్ తీసి, మూడు టెస్టులు చేస్తారు. అవన్నీ పాస్ అయితేనే, ఆ ఇంగ్రేడియంట్స్ కానీ, నెయ్యిని కానీ వాడడానికి ఆ ట్యాంకర్‌ను, వాహనాన్ని ముందుకు పంపిస్తారు. మూడు శాంపిల్స్‌లో పక్కాగా క్వాలిటీ తేలితేనే వాడుతారు. లేకపోతే వెనక్కు పంపిస్తారు.
మరి అలాంటప్పుడు కల్తీ నెయ్యి వాడారని, నాసి రకం సరుకులు వాడారని చెప్పడం అబద్ధం కాదా? అది ధర్మమేనా? న్యాయమేనా?
టీటీడీలో మూడు టెస్టులు
నెయ్యి, ఇతర సరుకులు సరఫరా చేసేవాళ్లు ఎన్‌ఏబీఎల్ నుంచి సర్టిఫికెట్ తేవడంతో పాటు, టీటీడీలో చేసే మూడు టెస్టులు పాస్ అయితేనే.. వాటిని టీటీడీ వాడుతుంది.
ఇది కొత్తగా వచ్చిన నియమం కాదు.
2014–19 మధ్య చంద్రబాబు పాలనలో దాదాపు 15 సార్లు ఇలా నెయ్యి, ఇతర సరుకులను వెనక్కు పంపారు.
ఆ తర్వాత 2019–24 మధ్య కూడా 18 సార్లు ట్యాంకర్లను వెనక్కు పంపారు. ఎందుకంటే క్వాలిటీ టెస్టులో మంచి రిపోర్టు రాలేదు.
అంటే తిరుమలలో ఇలా ఒక గొప్ప వ్యవస్థ, పద్ధతి, సంప్రదాయం ఉందన్న విషయాన్ని ప్రపంచానికి చెప్పాల్సింది పోయి, ఇలా పచ్చి అబద్ధాలు చెప్పడం దారుణం.
అంత పచ్చిగా మాట్లాడడం ధర్మమేనా?
తిరుమలలో కల్తీ నెయ్యి వాడారని, దాంతో లడ్డూలు తయారు చేశారని, ఆ లడ్డూలు ప్రజలు తిన్నారని చెప్పడం ఎంత దారుణం.
ఈ రిపోర్టులు ఎవరి హయాంలోనివి?
ఇక్కడ మరో విషయం చెప్పాలి.
ఇప్పుడు రిపోర్టు వచ్చిన శాంపిల్స్ ఎప్పుడు తీసుకున్నారు? చంద్రబాబు సీఎంగా జూన్ 12న ప్రమాణస్వీకారం చేస్తే.. ఒక ట్యాంకర్ వస్తే, జూలై 12న శాంపిల్స్ తీసుకున్నారు.
మూడు టెస్టుల తర్వాత, రిపోర్టులు బాగా రాలేదు కాబట్టి, ఆ శాంపిల్స్‌ను జూలై 17న ఎన్డీడీబీ (నేషనల్ డెయిరీ డెవలప్‌మెంట్ బోర్డు)కి పంపిస్తే.. వారు జూలై 23న నివేదిక ఇచ్చారు.
ఇప్పుడే ఎందుకు బయటపెట్టారు?
మరి ఆరోజు నుంచి చంద్రబాబు ఏం చేస్తున్నారు? 2 నెలల నుంచి ఏం చేశారు? ఆ నివేదిక ఎందుకు దాచి పెట్టారు?.
చంద్రబాబు 100 రోజుల పాలన తర్వాత, సూపర్‌సిక్స్ గురించి ప్రజలు నిలదీస్తుండడంతో, ప్రజల దృష్టి మరల్చేందుకు, రెండు నెలల తర్వాత, ఆ రిపోర్టులోని అంశాలు ప్రస్తావించి.. దాన్ని వక్రభాష్యం చేస్తూ.. నోటికొచ్చినట్లు అబద్ధాలు చెబుతున్నారు. ఇది ధర్మమేనా?
ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే..
– ఈ రిపోర్టులో ఏం కనిపిస్తోంది? స్టాండర్డ్ (ఎస్) వాల్యూ ఉండాలి. కానీ డీవియేషన్ ఉంది.
అలా ఉంటే శాంపిల్ కంటెయిన్ ఫారిన్ ఫ్యాట్.. అంటే ఏమేం ఉండే వీలుందన్న అవకాశాలతో ఉన్న నివేదికను చదివి వినిపించారు.
– ఏదైనా కానీ, ఒక రొబోస్ట్ ప్రక్రియ టీటీడీలో ఉన్నందుకు గర్వపడాలి. అక్కడి ప్రాక్టీసెస్ ఎంత గొప్పవో చెప్పాలి. అందరికీ వివరించాలి.
– కానీ, మనం ఏం చేస్తున్నాం? అక్కడ పక్కాగా ఒక వ్యవస్థ ఉన్నా.. ఇలా పచ్చిగా అబద్ధాలు చెప్పడం దారుణం.
స్వామివారిని అభాసు పాల్జేస్తున్నారు
– నెయ్యిలో నాణ్యత ఉంటేనే ట్యాంకర్‌ను అనుమతించే ఒక పక్కా వ్యవస్థ ఉన్నప్పుడు, మనమేం చేస్తున్నాం.. అబద్ధాలకు రెక్కలు కడుతున్నాం.
కల్తీ నెయ్యి వాడారు. లడ్డూలు తయారు చేశారు. భక్తులకు ఇచ్చారు. వారు వాటిని తిన్నారని ప్రచారం చేస్తున్నారు.
– అంటే మన గుడి, మన వెంకటేశ్వరస్వామిని అభాసుపాలు చేస్తున్నారు.
– ఇంతకంటే దారుణ పరిస్థితి ఎక్కడైనా ఉంటుందా? ప్రజలు ఆలోచించాలి.
మరి వారెందుకు ఇవ్వలేదు?
– వారు చేస్తున్న మరో ఆరోపణ. కర్ణాటక మిల్క్ ప్రొడ్యూసర్స్ ఫెడరేషన్ (కెఎంఎఫ్)కు చెందిన నందిని బ్రాండ్ నెయ్యికి కాంట్రాక్ట్ ఇవ్వలేదంటున్నారు.
– ఎవరైనా టెండర్ వేయొచ్చు. ఎల్–1 కు కాంట్రాక్ట్ ఇస్తారు. ఇది పద్ధతి.
– సరే, మరి ఇప్పుడు ఆ బ్రాండ్ గురించి చంద్రబాబు మాట్లాడుతున్నారు కదా.. మరి వారి పాలనలో 2015 నుంచి 2018 అక్టోబరు వరకు కెఎంఎఫ్‌కు కాంట్రాక్ట్ ఎందుకు ఇవ్వలేదు?
టీడీపీ ఆఫీస్‌లో ఎలా రిలీజ్ చేస్తారు?
– మరో ఆశ్చర్యకరమైన విషయం. ఎన్డీడీబీ రిపోర్టును టీటీడీ ఆఫీస్‌లో ఎలా రిలీజ్ చేస్తారు.
– అది కూడా చంద్రబాబు 100 రోజుల పాలన మంచి అంటూ ప్రకటనలు ఇచ్చిన రోజున. ఈ పద్ధతి ఎక్కడైనా ఉందా?
నిజానికి మా ప్రభుత్వ హయాంలో టీటీడీలో చాలా మార్పులు తీసుకొచ్చాం.
– టీటీడీలో ఉన్న ల్యాబ్‌ను సీఎఫ్‌టీఆర్‌ఐ (సెంట్రల్ ఫుడ్ టెక్నాలజీ అండ్ రీసెర్చ్ ఇన్సి్టట్యూట్) సహకారంతో ఆధునీకరించాం. అక్కడి నుంచి నిపుణులను కూడా తీసుకొచ్చాం.
– మాకు మంత్రివర్గం కూర్పు చాలా ఈజీ. కానీ టీటీడీ బోర్డులో పదవి కోసం కేంద్ర మంత్రులు మొదలు, పొరుగు రాష్ట్రాల సీఎంలు కూడా సిఫార్సు చేస్తారు. ఆ స్థాయిలో ప్రసిద్ధులను బోర్డులో నియమిస్తారు.
– అలాంటి వారు ఈ కాంట్రాక్ట్లను ఆమోదిస్తారు.
– అంత మంచి విధానం, వ్యవస్థ, దేవుడికి సేవ చేయాలన్న తపన ఉన్న వాళ్లు బోర్డులో ఉంటారు.
– బోర్డు ఛైర్మన్‌గా పని చేసిన వారి గురించి చెప్పాలంటే.. వైవీ సుబ్బారెడ్డిగారు ఏకంగా 45 సార్లు అయ్యప్పమాల వేసుకున్నారు. అంత భక్తి ఆయనది.
– అదే విధంగా కరుణాకర్‌రెడ్డిగారు కూడా ఆధ్యాత్మికంగా ఎంతో ఉన్నతంగా విలువలు ఉన్న వారు.
– తిరుపతి తిరుమలలో అంత మంచి వ్యవస్థ ఉంటే.. అక్కడా బురద చల్లుతూ దేవుణ్ని కూడా రాజకీయం చేయడం కేవలం చంద్రబాబుకే సాధ్యం.
– అది మన దౌర్భాగ్యం.
మా ప్రభుత్వం వచ్చిన తర్వాత టీటీడీలో అనేక మంచి కార్యక్రమాలు, పనులు జరిగాయి.
– నవనీత సేవలు మొదలుపెట్టాం. అంటే కొండమీద గోశాల ఏర్పాటు చేసి, సొంతంగా పాలు, వెన్న తయారీ మొదలుపెట్టాం.
– ప్రసాదాలు తయారు చేసే పోటులో కార్మికుల సర్వీస్ క్రమబద్థీకరించాం. వారి జీతాలు రెట్టింపు చేశాం.
– దేశవ్యాప్తంగా అనేకచోట్ల జీర్ణావస్థలో ఉన్న ఆలయాలను పునరుద్ధరించాం.
– హైదరాబాద్‌తో సహా, దేశంలోని పలు చోట్ల, చివరకు అమెరికాలో వెంకటేశ్వరస్వామి ఆలయాలు కట్టింది వైయస్సార్సీపీ ప్రభుత్వ హయాంలోనే.
– టీటీడీలో 9 వేల మంది ఉద్యోగులకు ఇళ్ల పట్టాలు ఇచ్చింది కూడా మా ప్రభుత్వ హయాంలోనే. చంద్రబాబు తన పాలనలో కనీసం ఒక్క సెంటు భూమి కూడా ఇవ్వలేదు.
– మఠాధిపతులతో మూడు విద్వత్ సదస్సులు నిర్వహించింది కూడా మా హయాంలోనే. రెండుసార్లు నాన్నగారి హయాంలో జరిగితే, ఒకసారి మా హయాంలో నిర్వహించాం.
– టీటీడీలో ఏదైనా మంచి జరిగింది అంటే.. ఆనాడు వైయస్సార్‌గారి హయాంలో, ఆ తర్వాత మా ప్రభుత్వ హయాంలోనే. ఇది వాస్తవం.
ప్రధానికి, సీజేఐకి లేఖలు రాస్తాం
– మన రాష్ట్ర పరువును, శ్రీవెంకటేశ్వరస్వామి వారి ఆలయ పరువును బజారుకీడుస్తున్న చంద్రబాబు వైఖరిని అందరూ గుర్తించాలి.
– చంద్రబాబు అనే వ్యక్తి తన రాజకీయ యావ కోసం, దురుద్దేశంతో తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయాన్ని భ్రష్టు పట్టించే ప్రయత్నం చేయడం ధర్మమేనా?
– అందుకే దానికి చంద్రబాబుకు అక్షింతలు వేయాలని చెప్పి.. ప్రధానమంత్రితో పాటు, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కు కూడా లేఖలు రాస్తాను.
నిజమా? కాదా? బేరీజు వేసుకొండి
– ఎంత దారుణం. మంచి చేసి ప్రజల మన్ననలు పొందాలి.
– కానీ ఇదెంత వరకు ధర్మం?. ఒక అబద్ధాన్ని సృష్టించడం, ఆ అబద్దాన్ని అమ్మడం. ఆ అబద్ధం ద్వారా మనుషుల మీద బురద చల్లడం? ఎంత వరకు న్యాయం?.
– నేను ఇప్పటి వరకు చెప్పినవి నిజమా? అబద్ధమా? అని మీరే వెరిఫై చేసుకొండి.
– నా ప్రతి మాట నిజం. వాస్తవం. ప్రతిదీ లాజిక్‌గా చెబుతున్నాను. ఇవన్నీ నేను చెప్పక ముందు, వారు చేసిన దుష్ప్రచారం. చెప్పిన అబద్ధాలు.. అన్నీ బేరీజు వేసుకొండి. తేడా మీరే గమనించండి.
– రాజకీయాల కోసం ఇంతగా దిగజారడం ధర్మమేనా? న్యాయమేనా? రాజకీయాలు చేయాలంటే నేరుగా చేద్దాం.
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ దారుణం
– మెడికల్ కాలేజీలపై ఇప్పటికే రూ.2400 కోట్లకు పైగా ఖర్చు చేశాం. 5 కాలేజీలు ప్రారంభమయ్యాయి. మరో 5 కాలేజీలు ఈ ఏడాది ప్రారంభమై ఉండేది. మనం కట్టిన బిల్డింగ్‌లు వారికి చూపెడితే సరిపోయేది.
– అన్ని పనులు జరిగిన కాలేజీలను ఏకంగా ప్రైవేటుపరం చేయాలనుకోవడం ఎంత వరకు సబబు? అది ధర్మమేనా? న్యాయమేనా?
– ఒక మెడికల్ కాలేజీ వస్తే, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి కూడా వస్తుంది. దాని వల్ల ప్రజలకు మంచి వైద్య సేవలు అందుతాయి.
– అంతే కాకుండా ప్రభుత్వ ఆస్పత్రిలో ఆ సేవలు అందుబాటులోకి వస్తే, పోటీ తత్వం ఏర్పడి, ప్రైవేటు ఆస్పత్రులు కూడా రేట్లు తగ్గిస్తాయి.
– మరోవైపు మెడికల్ సీట్లు పెరుగుతాయి. పిల్లలు ఇచ్చే ఫీజు, అక్కడే ఖర్చు చేస్తారు.
బీజేపీ కూడా గుర్తించాలి
– మన ఖర్మ ఏమిటంటే.. బీజేపీ నాయకులకు పూర్తి సమాచారం లేకపోవచ్చు. వాస్తవాలు తెలియకపోవచ్చు.
– చంద్రబాబు పచ్చి అబద్ధాలు, మోసాల వ్యక్తి.
– టీటీడీ బోర్డులో బీజేపీకి చెందిన వారు కూడా ఉన్నారు కదా? వారిని ఈ ప్రొసీజర్ గురించి తెలుసుకోమనండి. అప్పుడు వారు చంద్రబాబు చేస్తున్న దుష్ప్రచారాన్ని తప్పుబట్టాలి.
– వారిలో సిన్సియారిటీ ఉంటే, చంద్రబాబుకు అక్షింతలు వేయాలి. ఇది ధర్మమేనా? అని అడగాలి.
భావోద్వేగాలు రెచ్చగొడుతున్నాడు
– విషయం తెలియని వారికి భావోద్వేగాలు పెరుగుతాయి. చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారు.
– భావోద్వేగాలు రెచ్చగొట్టే విధంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అందుకే నేను ప్రశ్నిస్తున్నాను. ఈ విధంగా దుష్ప్రచారం చేయడం ధర్మమేనా? మీరే చెప్పండి.
– చంద్రబాబు అనే వ్యక్తికి దేవుడి మీద భక్తి ఉండదు. దేవుణ్ని కూడా రాజకీయాల కోసం వినియోగించుకునే అత్యంత హీనమైన మనసున్న వ్యక్తి.
– ఆ మనిషికి ఏనాడూ భక్తి ఉండదు. ఎక్కడైనా చెడు జరిగితే, కేవలం ఆయన హయాంలోనే జరుగుతుంది. ఎందుకంటే ఆయనకు దేవుడంటే భయం, భక్తి లేదు.
Comments
Please login to add a commentAdd a comment