అమరావతి, సాక్షి: ఏపీలో కొనసాగుతున్న అరాచకాలపై, హింసాత్మక ఘటనలపై నిరసనలు తెలిపేందుకు వైఎస్సార్‌సీపీ సిద్ధమైంది. ఇవాళ్టి నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాలను అందుకు వేదికగా ఎంచుకుంది. పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎమ్మెల్యేలతో కలిసి అసెంబ్లీకి రానున్నారు. గవర్నర్ ప్రసంగించే సమయంలో.. హత్యా రాజకీయాలపై వైఎస్సార్‌సీపీ నిరసన తెలిపే అవకాశం ఉంది.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రాష్ట్రంలో హింసాత్మక ఘటనలు పెరిగిపోయాయి. దీంతో శాంతి భద్రతల అంశంపై వైఎస్సార్‌సీపీ అసెంబ్లీలో చర్చకు పట్టుబట్టనుంది. వినుకొండ వైస్సార్‌సీపీ యువకార్యకర్త రషీద్ హత్యా ఘటనతో పాటు వైఎస్సార్‌సీపీ నేతలపై జరిగిన హత్యాయత్నాలను ప్రధానంగా ఈ సందర్భంగా అసెంబ్లీలో ప్రస్తావించాలని భావిస్తోంది. మరోవైపు కూటమి ప్రభుత్వ సూపర్ సిక్స్ హామీల అమలు జాప్యాన్ని కూడా నిలదీసే అవకాశం లేకపోలేదు. ఇంకోవైపు..
సాధారణంగా.. ఎన్నికల తర్వాత పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెడుతుంటాయి ప్రభుత్వాలు. ఇందుకు భిన్నంగా చంద్రబాబు ప్రభుత్వం మాత్రం మూడు-నాలుగు నెలల ఓటాన్ అకౌంట్ బడ్జెట్ వైపే మొగ్గుచూపిస్తుండడం గమనార్హం. అంతేకాదు.. జగన్ పాలనను బద్నాం చేసే కుట్రలో భాగంగా సంక్షేమాన్ని స్కామ్‌లుగా తప్పుడు లెక్కలు చూపిస్తూ సచివాలయంలో శ్వేత పత్రాలు విడుదల చేశారు సీఎం చంద్రబాబు. ఇప్పుడు అసెంబ్లీ వేదికగా ఆ వ్యవహారం కొనసాగించాలనుకోవడం.. హామీల జాప్యానికే అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఈ అంశంపైనా వైఎస్సార్‌సీపీ నిలదీసే అవకాశం ఉంది. ఇక..
ఇదీ చదవండి: ‘రెడ్‌బుక్’తో అరాచకం.. అదే రాజ్యాంగం అనే రీతిలో పాలన
రషీద్ కుటుంబాన్ని పరామర్శించిన సందర్భంలో.. ఏపీలో చంద్రబాబు ఆటవిక పాలనపై ఢిల్లీలో 24వ తేదీన ధర్నా చేస్తామని జగన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. మరోపక్క అసెంబ్లీలోనూ తమ నిరసన కొనసాగుతుందని ఆ సమయంలోనే ప్రకటించారాయన. అలాగే.. పార్లమెంట్ సమావేశాల్లోనూ ఏపీ పరిస్థితిని వివరించాలని ఎంపీలకు వైఎస్సార్‌సీపీ పార్టీ పార్లమెంటరీ సమావేశాల్లోనూ దిశానిర్దేశం చేశారు కూడా.
ఏపీలో సామాన్యులపై జరుగుతున్న అకృత్యాలతో పాటు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలే లక్ష్యంగా జరుగుతున్న దాడులపై ఆదివారం గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను కలిసి వైఎస్ జగన్ ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగం నడుస్తోందని, ఎంపీల నుంచి సామాన్యుల దాకా ఎవరికీ రక్షణ లేకుండా పోయిందని, ముఖ్యంగా వైఎస్సార్సీపీని అణచివేసే కుట్ర జరుగుతోందని గవర్నర్‌కు నివేదించారు. ఇప్పటిదాకా జరిగిన ఘటనలను వివరాలను ఆధారాలతో సహా గవర్నర్‌కు సమర్పించిన జగన్.. వాటన్నింటిపైనా దర్యాప్తు చేయించాలని కోరారు. కళ్లెదుటే ఘోరాలు జరుగుతున్నా పోలీస్ యంత్రాంగం వాటిని నిలువరించే సాహసం చేయలేకపోతోందని జగన్ ఆ సమయంలో ఆవేదన వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment