‘అమరావతి మునిగిపోతోందని చెబుతున్న వాళ్లు బుద్ధి, జ్ఞానం లేని వాళ్లు’’. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటీవలే ఆగ్రహంతో రగిలిపోతూ అన్నమాటలివి. చంద్రబాబు మనసులో తాను వైఎస్సార్‌సీపీని విమర్శిస్తున్నానని అనుకుని ఉంటారేమోగానీ.. వాస్తవానికి ఈ విమర్శ నేరుగా తగిలేది ఆయన మంత్రివర్గ సహచరుడు పి.నారాయణకే. ఎందుకంటే.. వరదొస్తే అమరావతి మునిగిపోతుందని, రాజధాని నగర నిర్మాణానికి అనువైన ప్రాంతం కాదని ప్రపంచ బ్యాంకు తన నివేదికలో వెల్లడించిన విషయాన్ని బహిరంగంగా ప్రకటించింది ఈ నారాయణ గారే. ఈ విషయాన్ని బుద్ధీ, జ్ఞానం లేకుండా మంత్రి బయటపట్టేశాడన్న కోపం బాబుకు ఉండి ఉండవచ్చు. కానీ నారాయణతో తనకున్న ఆర్థిక సంబంధాలు, ఇతర కారణాల రీత్యా నేరుగా ఏమీ అనలేక నెపాన్ని వైఎస్సార్‌సీపీపైకి నెట్టినట్టు కనిపిస్తోంది.
అమరావతికి సంబంధించి పాపం చంద్రబాబు బాధ అర్థం చేసుకోదగ్గదే. ఓ రియల్ ఎస్టేట్ వెంచర్‌గా రాజధాని నిర్మాణాన్ని మార్చేసి తన వారికి మేలు చేయాలన్న ‘విజన్’కు గండి పడేలా ఎవరు మాట్లాడినా కోపం రాకపోతుందా మరి! వరదలొస్తే అమరావతి ప్రాంతం మొత్తం నీట మునుగుతుందన్నది బాబు ఆత్మకూ తెలిసిన విషయమే. కానీ మనసు చెప్పినట్లు నడుచుకునే నైజం బాబుది కాదు కాబట్టి... అమరావతికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా ఒంటికాలిపై లేస్తూంటారు. ‘‘నాలుకలు కత్తిరించాలి’’ అనబోయి తమాయించుకుని తాళాలు వేయాలని సెలవిచ్చారు. అయితే నోళ్లకు తాళాలు వేయాలన్నది నానుడి. నాలుకలకు కాదు. ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో కురిసన భారీ వర్షాలకు అమరావతిలోని అనేక ప్రాంతాలు మునిగిపోయినట్లు స్పష్టంగా ఫొటోలూ, కథనాలు వచ్చాయి. అంతెందుకు.. చంద్రబాబు కరకట్టపై అక్రమంగా కట్టిన ఇంట్లోకి నీరు వచ్చిన సంగతి ఆయనకు తెలియకుండానైతే ఉండదు.
కరకట్ట నివాసానికి దగ్గర్లోనే ఉండే ప్రకృతి చికిత్స కేంద్రంలోకి పెద్ద ఎత్తున కృష్ణా నది వరద నీరు చేరడం కూడా అందరి కళ్లెదుట జరిగిన ఘటనే. బుడమేరు రెగ్యులేటర్ షట్టర్లు అకస్మాత్తుగా ఎత్తేసి నీరంతా వదిలేయడంతో విజయవాడ మునిగింది కానీ లేదంటే బుడమేరు వరద నీరు మొత్తం కృష్ణలోకి చేరి అమరావతి ప్రాంతంలో వరదనీటి మట్టం మరింత ఎక్కువగా ఉండేది. అయినా... ప్రపంచ బ్యాంకు వంటి అంతర్జాతీయ సంస్థ కూడా ఈ ప్రాంతం రాజధాని నిర్మాణానికి అనువైంది కాదని విస్పష్టంగా చెప్పినా... వాళ్లక్కూడా బుద్ధీ, జ్ఞానం లేదని చంద్రబాబు చెప్పదలిచారా? 201419 మధ్యకాలంలో చంద్రబాబు సీఎంగా ఉండగా ప్రధాన కార్యదర్శిగా పని చేసిన ఐవైఆర్ కృష్ణ రావు వంటి ఐఏఎస్ అధికారి కూడా ఒక ఇంటర్వ్యూలో అమరావతిలోని పలు ప్రాంతాలు వరదనీటిలో మునిగాయని స్పష్టంగా చెప్పారు.
ఎగువన భారీ వర్షాలు కురవలేదు కనుక గుంటూరు జిల్లాలో కొండవీటి వాగు, ఇతర వాగుల నుంచి వరద ఎక్కువగా లేదని, కృష్ణకు వచ్చిన 11 లక్షల క్యూసెక్కుల వరదకు తోడు కొండవీటి వాగుకూ వరద వచ్చి ఉంటే పరిస్థితి మరింత తీవ్రంగా ఉండేదని ఆయన వివరించారు కూడా. నిజంగా అలాంటి పరిస్థితే వచ్చి ఉంటే వరదను కృష్ణా నదిలోకి మళ్లించడమూ సాధ్యమయ్యేది కాదని.. ఫలితంగా అమరావతి ప్రాంతం మరింత జలమయమయ్యేదని కృష్ణారావు ఆ ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. రాజధానిగా అమరావతి అన్న విషయంపై ప్రభుత్వం సమీక్షించాల్సిన అవసరముందని కూడా ఆయన అభిప్రాయపడ్డారు. గతంలో అమరావతి ప్రాంతంలో సింగపూర్ కంపెనీకి కట్టబెట్టాలని యోచించిన భూమికి కూడా వరద ముప్పు ఉందని ఆయన తెలిపారు.
ఇలా చెప్పినందుకు ఐవైఆర్ కృష్ణారావుకు కూడా బుద్ది లేదని అంటే ధర్మంగా ఉంటుందా? అమరావతిపై అనేక కోణాలలో అవగాహన కలిగిన కృష్ణారావు వంటివారు ఏపీ శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని మాట్లాడతారే తప్ప రియల్ ఎస్టేట్ ప్రయోజనాలను ఆశించి కాదని అందరికి తెలుసు. ‘‘తా వలచింది రంభ.. తా మునిగింది గంగ’’ అన్నట్లు, చంద్రబాబుకు ఇష్టమైనది కనుక అమరావతి గురించి అంతా ఆహా, ఓహో అని పొగడాలని ఆయన కోరుకుంటు ఉండవచ్చు. కానీ ప్రజాస్వామ్యంలో అది సాధ్యం కాదు. ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల నోళ్లకు తాళాలు వేయడం చంద్రబాబుకు సాధ్యం కాకపోవచ్చు. ‘‘నీళ్లు కిందకు ప్రవహిస్తాయని ఆకాశంలో కట్టుకుంటామా!’’ అని బాబు వ్యాఖ్యానించడమే కాకుండా... ఏ మహా నగరం మునగలేదో చెప్పాలని విచిత్ర, వితండ వాదానికి దిగడం ఆయనకే చెల్లింది.
అమరావతికి మల్లే కర్నూలు, బెంగళూరు, ముంబై వంటి నగరాలను లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కట్టలేదు. కాలక్రమంలో అవి ఎదుగుతూ మహా నగరాలయ్యాయి. కొన్ని సమస్యలూ వచ్చి ఉండవచ్చు. కాదనలేము. కానీ లక్షల కోట్ల రూపాయల ప్రజల సొమ్మును ఖర్చు పెట్టి ముంపు ప్రాంతంలో రాజధానిని కట్టాలన్న బాబు మంకుపట్టుతోనే వస్తోంది సమస్య మొత్తం! మూడు పంటలు పండే ప్రదేశాన్ని ధ్వంసం చేయవద్దని గతంలోనే శివరామకృష్ణన్ కమిటీ చాలా స్పష్టంగా చెప్పినా వినకుండా ఇష్టారాజ్యంగా ప్రవర్తించింది చంద్రబాబు కాదా? పోనీ నాగార్జున యూనివర్శిటి సమీపంలో జాతీయ రహాదారికి రెండో వైపులా అందుబాటులో ఉన్న రెండు వేల ఎకరాల ప్రభుత్వ భూమిలో రాజధానికి కావాల్సిన భవనాలను నిర్మించినా ఈ రచ్చ ఈ స్థాయికి చేరేది కాదు.
అమరావతి సంక్షోభానికి చంద్రబాబే కారణం కనుక, ఆ విషయం బయటపడకుండా ఎదుటివారిపై ,ముఖ్యంగా వైఎస్సార్‌సీపీపై ఆరోపణలు చేస్తూ డబాయిస్తుంటారు. తెలుగుదేశంతో అక్రమ సంబంధం ఏర్పరచుకున్న ఈనాడు, ఆంద్రజ్యోతి వంటి పత్రికలు అమరావతి మునగలేదని అబద్దపు ప్రచారం చేసినా, ప్రజలకు అక్కడ ఏమి జరిగిందో సోషల్ మీడియా ద్వారా తెలిసిపోతోంది. హైదరాబాద్, ముంబై వంటి నగరాలు మునిగాయి కనుక అమరావతి మునిగినా ఫర్వాలేదని ముఖ్యమంత్రి స్థాయిలోని వారు చెప్పవచ్చా? అక్కడ భూమి స్వతహాగా భారీ నిర్మాణాలకు అనువు కాదని 201419 హయాంలోనే తెలిసినా మొండిగా ముందుకు వెళ్లడం వల్ల ఏపీకి ఎంత ప్రయోజనమో తెలియదు.
ఒక వైపు తాము ఇచ్చిన హామీల అమలుకు అసలు డబ్బులు లేవని, ఖజానా ఖాళీగా ఉందని చెబుతూ, మరో వైపు వేల కోట్లు అమరావతిలో వెచ్చిస్తామని అనడంలో తర్కమూ కనిపించదు. తొలి దశలో రూ.60 వేల కోట్లు ఖర్చు చేస్తామని మంత్రి నారాయణ ఇప్పటికే వెల్లడించారు. అంత డబ్బు ఎలా సమకూరుతుందో ఇంతవరకు క్లారిటీ రాలేదు. అసలు ఇదంతా సెల్ఫ్ ఫైనాన్స్ నగరమని, పైసా డబ్బు రాష్ట్ర ప్రభుత్వం వ్యయం చేయవలసిన అవసరం లేదని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రచారం చేసిన చంద్రబాబు ఇప్పుడు వేల కోట్ల అప్పులు తెచ్చి ఒక చిన్న ప్రాంతంలో ఖర్చు చేయాలని సంకల్పించారు. అందులో భాగంగా రూ.10 15 వేల కోట్ల అప్పు ఆర్ధిక సంస్థల ద్వారా సమకూర్చడానికి కేంద్రం అంగీకరించింది.
కానీ ఇప్పుడు ప్రపంచ బ్యాంక్ భిన్నమైన నివేదికను ఇచ్చింది. అయినా ఎక్కడో చోట మేనేజ్ చేసి అప్పులు తెస్తారేమో తెలియదు. దీనివల్ల రాష్ట్రంలో మళ్లీ అసమానతలు వచ్చే ప్రమాదం ఉంది. అంతేకాదు. అనేక విద్యా సంస్థలను అమరావతిలోనే ఏర్పాటు చేస్తామని, లక్ష మంది విద్యార్ధులు చదివే అవకాశం ఉంటుందని మంత్రివర్గం అభిప్రాయపడిందట. వినడానికి ఎంత హాస్యాస్పదంగా ఉందో తెలియడంలా? వాటిలో ఎన్ని వస్తాయో, రావో కాని, నిజంగా వస్తే వికేంద్రీకకరించకుండా అన్ని ఇక్కడే ఏర్పాటు చేస్తామనడం అన్యాయం అవుతుంది. కర్నూలులో ఏర్పాటు కావల్సిన లా యూనివర్శిటీని కూడా అమరావతిలోనే నెలకొల్పుతారట. ఇక్కడ మరో సంగతి చెప్పాలి.
కృష్ణా నది వరదలలో కొట్టుకు వచ్చి ప్రకాశం బారేజీని ఢికొట్టిన ఉదంతంలో వైఎస్సార్‌సీపీ కుట్ర ఉందని చంద్రబాబు ముందుగా డిటెక్టివ్ మాదిరి కనిపెట్టి ప్రకటించారు. దాంతో టీడీపీ మంత్రులు కూడా అదే పల్లవి అందుకుని ప్రచారం చేశారు. ఇంత నీచంగా టీడీపీ నేతలు ఇలా కుట్ర స్కీమ్ అమలు చేస్తున్నారేమిటా అని ఆలోచిస్తే అసలు విషయం బోదపడింది. కృష్ణానది వెంబడి ప్రకాశం బారేజీ ఎగువన భారీ గోడ నిర్మిస్తామని, తద్వారా అమరావతి వైపు వరద రాకుండా పరిరక్షిస్తామని ప్రభుత్వ పెద్దలు ప్రకటించారు. అదన్నమాట అసలు సంగతి. నేరుగా ఆ గోడ కడతామని అంటే నది వరద జోన్ లో కరకట్టలోపల ఉన్న చంద్రబాబు, మరికొందరు ప్రముఖుల భవనాలు నీట మునగకుండా ఈ రిటైనింగ్ వాల్ కట్టబోతున్నారని ప్రజలు భావించి విమర్శించవచ్చు.
దానికి ముందుగా ఈ బోట్ల కుట్ర ప్రచారం చేసి, వైఎస్సార్‌సీపీ ఏదో చేసిందన్న తప్పుడు వాదనలు వినిపించాక ఈ గోడ ప్రతిపాదన తెస్తే పెద్దగా వ్యతిరేకత రాదని అనుకుని ఉండవచ్చు. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రకాశం బారేజీకి దిగువన ఉన్న విజయవాడలోని కృష్ణలంక తదితర ప్రాంతాలు మునగకుండా భారీ వాల్ నిర్మించారు. దాంతో గత వరదలలో అనూహ్యమైన రీతిలో నీటి ప్రవాహం ఉన్నా ఈ ప్రాంతం సేఫ్ అయింది. కాని ప్రకాశం బారేజీ ఎగువన ఇలా గోడ కట్టడం శాస్త్రీయంగా కరెక్టా, కాదా?అన్నది ప్రభుత్వం పరిశీలించాలి.
తొందరపడి, తమ ఇళ్లు కాపాడుకోవడానికి ఇలాంటి నిర్మాణం చేస్తే ప్రవాహ వేగం పెరిగి ,అప్పుడు నిజంగానే బారేజీకి ఏమైనా ప్రమాదం జరిగే అవకాశం ఉందేమో అధ్యయనం చేసిన తర్వాతే సరైన నిర్ణయం చేయాలని చెప్పక తప్పదు. ఏది ఏమైనా అమరావతో, భ్రమరావతో,గ్రాఫిక్స్ మోజులో పడి చంద్రబాబు అక్కడ ముంపే లేదని,ముప్పు లేదని తనను తాను సంతృప్తి పరచుకునే యత్నం చేసుకుంటే,ఆత్మ వంచనే అవుతుంది. అది ఆయననే కాదు ..రాష్ట్ర ప్రజలను కూడా మోసం చేసినట్లు అవుతుంది. ఈ విషయాన్ని గమనంలోకి తీసుకుని చంద్రబాబు హేతుబద్దంగా వ్యవహరించాలి.
కొమ్మినేని శ్రీనివాస రావు, సీనియర్ జర్నలిస్ట్,
రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.
Comments
Please login to add a commentAdd a comment