కర్నూలు నుంచి లోకాయుక్త, మానవ హక్కుల కమిషన్ అమరావతికి తరలింపునకు సిద్ధం
ఏపీఈఆర్సీ, వక్ఫ్ ట్రిబ్యునల్, సీబీఐ కోర్టు కూడా అమరావతికే!
శ్రీబాగ్ ఒడంబడిక తుంగలోకి.. ‘సీమ’కు మరోసారి అన్యాయం
కొప్పర్తి ఇండ్రస్టియల్ హబ్ ఎంఎస్‌ఎంఈ టెక్నాలజీ సెంటర్ సైతం అమరావతికే తరలింపు
నేషనల్ లా యూనివర్సిటీపై కూడా నీలినీడలు
అది కూడా అమరావతిలోనే అంటూ సీఎం చంద్రబాబు ప్రకటన.. ‘సీమ’ వాసుల 7 దశాబ్దాల ఆశలను సాకారం చేస్తూ గత సర్కారు అడుగులు
హైకోర్టుతో పాటు 43 ట్రిబ్యునల్స్ ఏర్పాటుకు చర్యలు
కర్నూలులో జ్యుడీషియల్ సిటీ కోసం 273 ఎకరాలు కేటాయించిన వైఎస్ జగన్ ప్రభుత్వం
నేషనల్ లా వర్సిటీ కోసం 100 ఎకరాలు, రూ.వెయ్యి కోట్ల నిధులు మంజూరు
న్యాయం జరిగిందనుకునేలోపే మరోసారి అన్యాయం..!
ప్రాంతీయ సమతుల్యతకు పాతరేస్తూ.. ఒకేచోటకు సంస్థలన్నీ తరలింపు..!!
మొన్న.. కర్నూలులో ఏర్పాటు కావాల్సిన లా యూనివర్సిటీ..
నిన్న.. కొప్పర్తికి మంజూరైన ఎంఎస్‌ఎంఈ టెక్నాలజీ సెంటర్..
నేడు.. కర్నూలులో ఇప్పటికే కార్యకలాపాలు నిర్వహిస్తున్న హెచ్‌ఆర్‌సీ.. ఏపీఈఆర్సీ.., వక్ఫ్ ట్రిబ్యునల్.. సీబీఐ కోర్టు..
అన్నీ.. ఒకే చోటకే.. ఒకదాని తరువాత మరొకటిగా అన్నీ అమరావతికే తరలింపు..!!
సాక్షి ప్రతినిధి కర్నూలు: కర్నూలు కేంద్రంగా పని చేస్తున్న లోకాయుక్త, మానవ హక్కుల కమిషన్‌ను అమరావతికి తరలించేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమైంది. చట్టసవరణ చేసి కర్నూలు నుంచి తరలించనున్నట్లు హైకోర్టుకు నివేదించి రాయలసీమకు మరోసారి అన్యాయం తలపెట్టింది. ఏడు దశాబ్దాల నాటి శ్రీబాగ్ ఒడంబడిక ప్రకారం కర్నూలులో హైకోర్టు ఏర్పాటుకు పెద్దమనుషులు కుదుర్చుకున్న ఒప్పందాన్ని దశాబ్దాలుగా అమలు చేయకుండా ప్రభుత్వాలు తాత్సారం చేశాయి. 2019లో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కర్నూలును న్యాయ రాజధానిగా చేయాలని సంకల్పించి ఆ దిశగా అడుగులు వేశారు.
అందులో భాగంగానే లోకాయుక్త, మానవహక్కుల కమిషన్ ఏర్పాటు చేశారు. ఆపై ఏపీఈఆర్సీ, వక్ఫ్ ట్రిబ్యునల్, సీబీఐ కోర్టును కర్నూలులో ఏర్పాటు చేశారు. ఏపీఈఆర్సీకి శాశ్వత భవనాలు నిర్మించారు. ఈ క్రమంలో ‘న్యాయ రాజధాని’ కల సాకారం అవుతోందని అంతా భావించారు. అయితే ఇప్పటికే ఏర్పాటు చేసిన న్యాయ సంస్థలను సైతం అమరావతికి తరలించేందుకు చంద్రబాబు ప్రభుత్వం సిద్ధమైంది.
శ్రీబాగ్ ఒప్పందం బుట్టదాఖలు
భాషా ప్రయుక్త రాష్ట్రాల్లో భాగంగా తమిళనాడు నుంచి విడిపోయినప్పుడు కర్నూలు రాజధానిగా ‘ఆంధ్ర రాష్ట్రం’ ఏర్పాటైంది. ఆపై హైదరాబాద్ విలీనం తర్వాత ‘ఆంధ్రప్రదేశ్’ ఆవిర్భావం సమయంలో పెద్ద మనుషుల సమక్షంలో ‘శ్రీబాగ్ ఒడంబడిక’ కుదిరింది. దీని ప్రకారం పరిపాలన రాజధాని, హైకోర్టు ఏర్పాటులో ‘సీమ’కే ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించారు. అయితే రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా పరిపాలన రాజధాని హైదరాబాద్‌లో నెలకొల్పేలా నిర్ణయించారు. ఈ క్రమంలో హైకోర్టు కర్నూలులో ఏర్పాటు కావాల్సి ఉండగా ఒప్పందాన్ని వీడి అది కూడా హైదరాబాద్‌లోనే ఏర్పాటు చేశారు. 2014లో రాష్ట్ర విభజన అనంతరం కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామన్న సీఎం చంద్రబాబు ప్రతిపాదనను న్యాయవాదులు తిరస్కరించారు.
లా వర్సిటీపై సందిగ్ధం..
దేశంలో ఏ రాష్ట్రంలోనూ రెండు లా యూనివర్సిటీలు లేవు. వైజాగ్‌లో ఇప్పటికే నేషనల్ లా యూనివర్సిటీ ఉండగా గత ప్రభుత్వ కృషితో కర్నూలుకు మరో యూనివర్సిటీ మంజూరైంది. ఈ ఏడాది ఆగస్టులో బీసీఐ (బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా) ప్రతినిధులతో సమావేశం సందర్భంగా అమరావతిలో ‘నేషనల్ లా యూనివర్సిటీ’ ఏర్పాటు కానున్నట్లు సీఎం తన ‘ఎక్స్’ ఖాతాలో ప్రకటించారు. మరి కర్నూలులో ఇప్పటికే యూనివర్సిటీని నిలిపివేస్తారా? లేదా రెండు చోట్లా నిరి్మస్తారా? అనేది ప్రభుత్వం స్పష్టత ఇవ్వాల్సి ఉంది. అమరావతి తెరపైకి వచి్చనందువల్ల కర్నూలులో యూనివర్సిటీ ఏర్పాటుకు శుభం కార్డు పడినట్లేనని న్యాయవాదులు చర్చించుకుంటున్నారు.
సీమ టీడీపీ నేతల మౌనవ్రతం..
అభివృద్ధి విషయంలో రాజకీయాలకు అతీతంగా ఏకం కావాల్సిన కూటమి పారీ్టలకు చెందిన ప్రజాప్రతినిధులు సీమకు పదేపదే జరుగుతున్న అన్యాయంపై గళం విప్పకపోవడంపై ప్రజల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కర్నూలులో ఇప్పటికే ఏర్పాటైన సంస్థలను తరలిస్తున్నట్లు హైకోర్టుకు సర్కారు తేల్చి చెప్పినా ఏ ఒక్క టీడీపీ ఎంపీ, ఎమ్మెల్యే, మంత్రులు స్పందించకపోవడంపై మండిపడుతున్నారు.
అందరూ హైకోర్టు కావాలన్నవారే
కర్నూలులో హైకోర్టు ఏర్పాటుకు బీజేపీ, జనసేన సైతం గతంలో మద్దతు పలికాయి. మంత్రి టీజీ భరత్ తండ్రి, బీజేపీ నేత, రాయలసీమ హక్కుల వేదిక అధ్యక్షుడు టీజీ వెంకటేశ్ కూడా కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ‘సీమ’లో హైకోర్టు ఏర్పాటు కోసం న్యాయవాదులు, బార్ కౌన్సిల్ సభ్యులు వంద రోజులకుపైగా రిలే దీక్షలు, ఆందోళనలు నిర్వహించారు. ‘సీమ’ జిల్లాల ప్రజలు, ప్రజాప్రతినిధులు ‘రాయలసీమ గర్జన’ పేరుతో కర్నూలులో పెద్ద ఎత్తున ఉద్యమించారు.
కొప్పర్తి కడుపుకొట్టి..
వైఎస్సార్ జిల్లా కొప్పర్తిలో కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన ఎంఎస్‌ఎంఈ టెక్నాలజీ కేంద్రాన్ని సైతం అమరావతికి తరలిస్తున్నట్లు కూటమి సర్కారు ఇప్పటికే ఉత్తర్వులిచి్చంది. ప్రాంతీయ సమతుల్యతలో భాగంగా వెనుకబడిన రాయలసీమలోని కొప్పర్తిలో ఎంఎస్‌ఎంఈ టెక్నాలజీ సెంటర్‌ను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. కొప్పర్తిలోని మెగా ఇండ్రస్టియల్ హబ్ వద్ద 19.5 ఎకరాల విస్తీర్ణంలో రూ.250 కోట్లతో ఈ సెంటర్ ఏర్పాటుకు వైఎస్సార్‌సీపీ హయాంలో కేంద్రం ఆమోదం తెలిపింది. అయితే దీన్ని అమరావతికి తరలిస్తున్నట్లు సెపె్టంబర్‌లో కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అమరావతిలో మరో సెంటర్ ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరటానికి బదులుగా ఇప్పటికే మంజూరైన దాన్ని తరలించడం సమంజసం కాదన్న పారిశ్రామిక, అధికార వర్గాల సూచనను పెడచెవిన పెట్టింది.
న్యాయ రాజధాని దిశగా వైఎస్ జగన్ అడుగులు
2019లో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి రాగానే కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేసి ‘సీమ’కు న్యాయం చేయాలని సంకల్పించారు. అనివార్య కారణాలతో ఇందులో జాప్యం జరగడంతో లోకాయుక్త, మానవ హక్కుల కమిషన్, ఏపీఈఆర్సీ, వక్ఫ్ ట్రిబ్యునల్, సీబీఐ కోర్టును ఏర్పాటు చేశారు. హైకోర్టు ఏర్పాటైతే అనుబంధంగా ఏపీ అడ్మిని్రస్టేటివ్ ట్రిబ్యునల్, డెట్స్ రికవరీ ట్రిబ్యునల్, క్యాట్ (సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్), రైల్వే అడ్మిని్రస్టేటివ్ ట్రిబ్యునల్, ఏసీబీ కోర్టు, కో ఆపరేటివ్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్, ఆంధ్రప్రదేశ్ రెగ్యులేటరీ కమిషన్, ఎండోమెంట్ ట్రిబ్యునల్‌తో పాటు 43 అనుబంధ కోర్టులు ఏర్పాటయ్యేవి. ఇందుకోసం కర్నూలులోజగన్నాథగట్టుపై జ్యుడీషియల్ సిటీ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం 273 ఎకరాలను సైతం కేటాయించింది. ఇందులో 100 ఎకరాల్లో రూ.వెయ్యి కోట్లతో నేషనల్ లా యూనివర్సిటీ నిర్మాణానికి వైఎస్ జగన్ శంకుస్థాపన కూడా చేశారు. అయితే చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం న్యాయ సంస్థలను అమరావతికి తరలిస్తుండటంతో ‘సీమ’ వాసుల ఆశలు మరోసారి అడియాసలయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment