ఆసుపత్రుల్లో మంచాలైనా లేవు
భీమవరం అర్బన్ : ‘ప్రభుత్వ ఆసుపత్రుల్లో సదుపాయాలు లేవు. కనీసం మంచాలు కూడా లేవు. పేదలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు రాష్ట్రం పరి స్థితీ ఇలాగే ఉంది. అయినా ఆసుపత్రుల అభివృద్ధికి పాటుపడతాను. వైద్యుల జీతాలు పెంచేందుకు కృషి చేస్తాను’ అని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఎన్నికల విధానం సక్రమంగా లేదని, నిజాయితీగా ఎన్నికలు నిర్వ హించే పరిస్థితులు లేవని ఆవే దన వ్యక్తం చేశారు. స్థానిక వీఎస్‌ఎస్ గార్డెన్స్‌లో లయన్స్ క్లబ్ ఆఫ్ ఆకివీడు ఆధ్వర్యంలో మంగళవారం వైద్యుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కామినేని, కేర్ హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ బి.సోమరాజు, భీమవరం హాస్పిటల్స్ ఎండీ డాక్టర్ జి.గోపాలరాజును సత్కరించారు.
ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి కామినేని మాట్లాడుతూ రాష్ట్రంలో ఎయిమ్స్ ఏర్పాటుకు కృషి చేస్తున్నామని, త్వరలో నిపుణుల కమిటీ వస్తుందని చెప్పారు. మనకు ఎన్నో వనరులు ఉన్నాయని, సముద్ర ప్రాంతం, విస్తరించిన వ్యవసాయం మన ఆస్తులని పేర్కొన్నారు. వీటిని ఉపయోగించుకోవడం ద్వారా రాష్ట్రా న్ని అభివృద్ధిపథంలో నడిపించేందుకు తనవంతు కృషి చేస్తానన్నారు. కేర్ హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ సోమరాజు మాట్లాడుతూ వైద్యరంగంలో చాలా సమస్యలు ఉన్నాయని, ప్రభుత్వం వాటిని పరిష్కరించే దిశగా కృషి చేయాల్సిన అవసరం ఉందని అన్నారు.
వైద్య రంగంలో వస్తున్న విప్లవాత్మక మార్పులు, అభివృద్ధిని కూలంకషంగా వివరించారు. ఉండి ఎమ్మెల్యే వేటుకూరి శివరామరాజు, మాజీ ఎమ్మెల్యే త్సవటపల్లి సత్యనారాయణమూర్తి, కేర్ హాస్పిటల్స్ ఆర్థోపెడిక్ నిపుణుడు డాక్టర్ బీఎన్ ప్రసాద్, లయన్స్ క్లబ్ ఆఫ్ ఆకివీడు, లయన్స్ క్లబ్ ఆఫ్ ఆకివీడు ఆదర్శ, లయన్స్ క్లబ్ ఆఫ్ ఆకివీడు అభయ నిర్వాహకులు దాట్ల రామరాజు, ఎం.శివసుబ్రహ్మణ్యం, కె.సాంబశివరావు, హరనాథరావు, ఆరిఫ్, సురేష్, శ్రీనివాస వరప్రసాద్, శ్రీనివాస్, దుర్గాప్రసాద్, ఎంవీఎస్ రాజు, కృష్ణంరాజు, డీసీసీ మాజీ అధ్యక్షుడు గోకరాజు రామరాజు, డీఎం హెచ్‌వో శంకర్రావు పాల్గొన్నారు.