సాక్షి, హైదరాబాద్: కరోనా చికిత్స కోసం సూపర్ స్పెషాలిటీ, కార్పొరేట్ ఆసుపత్రుల్లోని సగం (50 శాతం) పడకలను స్వాధీనం చేసుకొనే ప్రక్రియలో ప్రతిష్టంభన ఏర్పడింది. ఈ నెల 13న వైద్య, ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్‌తో జరిపిన చర్చల్లో సగం పడకల ను సర్కారుకు ఇవ్వడానికి ఆయా ఆసుపత్రు ల యాజమాన్యాలు అంగీకరించగా ఆ సగం పడకలను ఎలా కేటాయించాలి? వాటికెంత ఫీజు వసూలు చేయాలన్న దానిపై 14న ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాసరావు ఆసుపత్రుల యాజమాన్యాలతో చర్చలు జరిపారు.
ఆ చర్చల అనంతరమే విధివిధానాలు ఖరారు చేసి ప్రకటిస్తామని అంతకుముందు రోజే మంత్రి ఈటల ప్రకటించారు. కానీ ఎలాంటి స్పష్టమైన నిర్ణయం తీసుకోకుండానే యాజమాన్యాలతో చర్చలు అర్ధాంతరంగా వాయిదా పడ్డాయి. దీనిపై శని, ఆదివారాల్లో సమావేశం జరుగుతుందని అందరూ భావించినా అలా జరగకపోగా ఇక వారితో చర్చలు ఉండబోవని వైద్య, ఆరోగ్యశాఖ వర్గాలు చెబుతున్నాయి. తాము సూచించినట్లుగా యాజమాన్యాలు ప్రతిపాదనలు పంపితే వాటిని సీఎంకు నివేదించి తర్వాత విధివిధానాలు ఖరారు చేస్తామని అంటున్నాయి.
‘సీలింగ్’పై కార్పొరేట్ల తర్జనభర్జన...
సగం పడకలను సర్కారుకు బదలాయిస్తే వాటికి ఎంత ఫీజులుండాలన్న దానిపైనే సూపర్ స్పెషాలిటీ, కార్పొరేట్ ఆసుపత్రుల యాజమాన్యాలు తర్జనభర్జన పడుతున్నాయి. పాత జీవో ప్రకారం రోజుకు ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రుల్లోని సాధారణ వార్డుల్లో కరోనా చికిత్సకు రూ. 4 వేలు, ఐసీయూలో రూ. 7,500, వెంటిలేటర్ అమరిస్తే రూ. 9 వేలు వసూలు చేయాలన్నది నిబంధన. పీపీఈ కిట్లు, మందులకు అదనంగా వసూలు చేసుకోవచ్చని జీవోలో సర్కారు చెప్పింది. దీన్నే అలుసుగా తీసుకొని యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా డబ్బులు వసూలు చేశాయన్న ఫిర్యాదులు వెల్లువెత్తాయి. అందుకే డాక్టర్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరిగిన చర్చల్లో ఈ ఫీజుతో సంబంధం లేకుండా అన్నీ కలిపి ఫీజు సీలింగ్ ప్రతిపాదనను సర్కారు తెరపైకి తెచ్చింది.
దాని ప్రకారం 14 రోజులకు కలిపి కరోనా చికిత్సకు సాధారణ వార్డులో రూ. లక్ష, ఆక్సిజన్ వార్డులో రూ. 2 లక్షలు, ఐసీయూ వార్డులో రూ. 3–4 లక్షలను సీలింగ్ ఫీజుగా పేర్కొంటూ సర్కారు ప్రతిపాదించింది. ఐసీయూలో ఉన్నప్పుడు బాధితుడిని ఒక్కోసారి రెండు, మూడు రోజులు అదనం గా ఉంచాల్సి రావొచ్చు. అత్యవసర, ఖరీదైన మందులు వాడాల్సి రావొచ్చు. అలాగే ఎవరికైనా కిడ్నీలు ఫెయిలైనా, సీటీస్కాన్లు తీ యాల్సి వస్తే ఐసీయూకు గరిష్టంగా రూ. 4 లక్షల వరకు సీలింగ్‌ను ప్రభుత్వం ప్రతిపాదించింది. వాటి ప్రకారమే ప్రతిపాదన లు తీసుకొని రావాలని మేనేజ్‌మెంట్లను ప్రభుత్వం ఆదేశించింది.
మిగిలిన సగం ఫీజుల్లో జోక్యం ఉండదు!
సర్కారుకు అప్పగించే సగం పడకలపైనే తమ ఆధిపత్యం ఉంటుందని, సూపర్ స్పెషాలిటీ, కార్పొరేట్ యాజమాన్యాల ఆధ్వర్యంలోని మిగిలిన సగం పడకలకు వసూలు చేసే ఫీజులతో తమకు ఎలాంటి సంబంధం లేదని వైద్య, ఆరోగ్యశాఖ వర్గాలు చెబుతున్నాయి. ధనవంతులు ఆ ఫీజులను భరిస్తే తమకు అభ్యంతరం లేదని అంటున్నాయి. ప్రభుత్వానికి అప్పగించే పడకలను తామే నింపుతామని, వాటిని పేదలు, మధ్యతరగతికి చెందిన కరోనా బాధితులెవరికైనా కేటాయిస్తామని అధికారులు అంటున్నారు. దీనికోసం ప్రత్యేక యాప్ తయారు చేస్తామని, అందరికీ అందుబాటులో ఉండేలా స్మార్ట్‌ఫోన్లలో డౌన్‌లోడ్ చేసుకోవచ్చని చెబుతున్నారు. యాప్‌లో ఎప్పటికప్పుడు సర్కారు అధీనంలోని కార్పొరేట్ కరోనా పడకల వివరాలు, ఖాళీలు అప్‌డేట్ చేస్తామని, ఆ మేరకు కసరత్తు జరుగుతుందని ఒక ఉన్నతాధికారి తెలిపారు.
మేనేజ్‌మెంట్లలో మూడు ఆలోచనలు
సర్కారు సూచించిన సీలింగ్ ప్రతిపాదనపై సూపర్ స్పెషాలిటీ, కార్పొరేట్ యాజమాన్యాల్లో గందరగోళం నెలకొంది. ఒక్కో ఆసుపత్రి ఒక్కో రకంగా ఆలోచిస్తోంది. అందులో మొదటిది ఏమిటంటే సర్కారు సీలింగ్ ప్రకారం యథావిధిగా ఆయా ఫీజులకు ఒప్పుకోవడం. దానికి షరతుగా తమ అధీనంలో ఉండే మిగిలిన సగం పడకల ఫీజుల్లో జోక్యం చేసుకోకూడదని సర్కారుకు చెప్పడం. వాటికి ఎంత వసూలు చేసుకున్నా సర్కారు వేలు పెట్టవద్దని స్పష్టం చేయడం. ఇక రెండోది ఒకవేళ మొదటి ప్రతిపాదన సరేననుకున్నా ఆచరణలోనూ, న్యాయపరంగా చిక్కులు వచ్చే అవకాశం ఉన్నందున ఫీజు సీలింగ్‌ను పెంచాలని ప్రతిపాదించడం.
మూడో ఆలోచన ఏమిటంటే ప్రైవేటు ఆరోగ్య బీమా, ప్రభుత్వ ఉద్యోగులు, జర్నలిస్టుల ఆరోగ్య పథకం (ఈజేహెచ్‌ఎస్) వంటి వాటిని అమలు చేయాల్సి వస్తే బీమా పోను మిగిలిన సొమ్ము ఎవరు కడతారన్న దానిపైనా స్పష్టతకు రావడం. ఇవిగాక ఇంకా ఒకట్రెండు ఆలోచనలను కూడా యాజమాన్యా లు తెరపైకి తెస్తున్నాయి. తాము సోమ వారం సమావేశమై ఒక నిర్ణయం తీసుకున్నా క సర్కారుకు ప్రతిపాదనలు ఇవ్వడంతో పాటు నేరుగా మీడియా సమావేశం ఏర్పా టు చేసి ప్రకటిస్తామని ఒక సూపర్ స్పెషాలిటీ కార్పొరేట్ యజమాని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment