సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ హైదబాద్‌లో కరోనా కరాళ నృత్యం చేస్తోంది. ఇప్పటికే కోవిడ్ సెంటర్లలోని ఐసోలేషన్ వార్డుల్లోని పడకలన్నీ పాజిటివ్ బాధితులతో నిండిపోవడం.. మరోవైపు రోజుకు సగటున 500 నుంచి 700 కొత్త కేసులు నమోదవుతుండటంతో ఐసీయూల్లో వెంటిలేటర్ పడకలు దొరకని దుస్థితి. అత్యవసర పరిస్థితుల్లో కార్పొరేట్ ఆస్పత్రులకు వెళ్లినవారికి సైతం చేదు అనుభవమే ఎదురవుతోంది. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు చికిత్స చేయడం ఇష్టం లేని పలు కార్పొరేట్ ఆస్పత్రుల యాజమాన్యాలు అత్యవసర పరిస్థితుల్లో ఆస్పత్రికి వచ్చిన రోగులకు పడకలు ఖాళీ లేవంటూ తిప్పిపంపుతుండటం ఆందోళనకు గురిచేస్తోంది. చికిత్సకు నిరాకరించిన ఆస్పత్రులపై చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం తనకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తుండటంపై విమర్శలువెల్లువెత్తుతున్నాయి.
గాంధీ.. ఏమిటిదీ?
కరోనా చికిత్సల కోసం గాంధీ ఆస్పత్రిని ప్రభుత్వం పూర్తిస్థాయి కోవిడ్ సెంటర్‌గా మార్చింది. ప్రస్తుతం ఆస్పత్రిలో 320 మంది వైద్యులు, 366 మంది పీజీలు, 350 మంది హౌస్‌సర్జన్లు, 350 మంది స్టాఫ్ నర్సులు పని చేస్తున్నారు. 1000 పడకల సామర్థ్యం ఉన్న ఈ ఆస్పత్రిలో వంద వెంటిలేటర్లు ఏర్పాటు చేశారు. మిగిలిన పడకలకు ఆక్సిజన్ సదుపాయాన్ని కల్పించారు. రోగుల రద్దీ నేపథ్యంతో పడకల సంఖ్యను 1,850కి పెంచుతున్నట్లు ప్రకటించినప్పటికీ.. సిబ్బంది కొరత కారణంగా వీటిని ఇప్పటి వరకు అందుబాటులోకి తీసురాలేదు. వైరస్ లక్షణాల తీవ్రత ఎక్కువగా ఉన్న రోగులను మాత్రమే ఇక్కడ అడ్మిట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆస్పత్రిలోని పడకలన్నీ రోగులతో నిండిపోయాయి. ఐసీయూలో వెంటిలేటర్లు ఖాళీగా లేవు. ప్రస్తుతం 300 మంది రోగుల ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. రోగుల నిష్పత్తికి తగినన్ని వెంటిలేటర్లు లేకపోవడంతో ఆక్సిజన్‌పై నెట్టుకొస్తున్నారు. కొత్తగా వచ్చిన రోగులకు అడ్మిషన్ కూడా కష్టమవుతోంది. సకాలంలో వైద్యసేవలు అందక రోగులు మృత్యువాత పడుతుండటం ఆందోళన కలిగిస్తోంది.
ఉస్మానియా.. ఇంతేనయా..
ఉస్మానియా ఆస్పత్రి కులీకుతుబ్‌షా భవనంలో 100 పడకలు ఏర్పాటు చేశారు. నాలుగో అంతస్తులో మరో 250 పడకలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. మరో వారం రోజుల్లో ఇవి అందుబాటులోకి రానున్నాయి. ఆస్పత్రిలో ప్రస్తుతం 85 వెంటిలేటర్లు ఉన్నారు. 500 పడకలకు సరిపోను ఆక్సిజన్ లైన్లు ఉన్నాయి. గాంధీ జనరల్ ఆస్పత్రిని పూర్తిస్థాయి కోవిడ్ సెంటర్‌గా మార్చడంతో సాధారణ రోగులంతా ఇక్కడికే వస్తున్నారు. దీంతో జనరల్ మెడిసిన్ విభాగంలో రోగుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. వీరిలో శ్వాస సంబంధ సమస్యలతో బాధపడుతున్నవారు ఉంటున్నారు. అప్పటికే వీరికి కరోనా వైరస్ విస్తరించి ఉండటంతో మృత్యువాత పడుతున్నారు. రోగుల నిష్పత్తికి తగినంత వైద్య సిబ్బంది లేకపోవడంతో పీజీలపై భారం పడుతోంది. వార్డులోని రోగులందరికీ ఒకే నర్సు సేవలు అందించాల్సి వస్తోంది. కళ్లెదుటే రోగులు చనిపోతున్నా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉంటున్నామని.. ఇలాంటి వాతావరణంలో తాము పని చేయలేమని పీజీలు, హౌస్ సర్జన్లు రెండు రోజులుగా విధులు బహిష్కరించి ఆందోళన చేస్తుండటం విదితమే.
కింగ్‌కోఠి, ఛాతీ ఆస్పత్రులు ఫుల్..
తీవ్ర లక్షణాలున్న వారిని గాంధీలో అడ్మిట్ చేస్తుండగా, ఏ లక్షణాలు లేకపోయినా పాజిటివ్ వచ్చిన రోగులను కింగ్‌కోఠి, ఎర్రగడ్డ ఛాతీ ఆస్పత్రి, ఆయుర్వేద, నేచర్ క్యూర్ ఆస్పత్రుల్లోని ఐసోలేషన్ వార్డుల్లో అడ్మిట్ చేస్తున్నారు. ఆయా ఆస్పత్రుల్లో సరైన మౌలిక సదుపాయాలు లేకపోవడం, వేళకు పౌష్టికాహారం అందజేయకపోవడంతో రోగులు అక్కడ ఉండేందుకు ఇబ్బంది పడుతున్నారు. వైరస్‌తో ఇంటికి వెళ్లేందుకు ఇష్టం లేకపోయినప్పటికీ.. విధిలేని పరిస్థితుల్లోనే అడ్మిటఅయిన మరుసటి రోజే హోం క్వారంటైన్‌కు వెళ్లిపోతున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించిన తెలంగాణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ (టిమ్స్) ప్రారంభమై ఇప్పటికే నెల రోజులు దాటింది. 14 అంతస్తుల భవనంలో 1,500 పడకలను ఏÆర్పాటు చేశారు. ప్రస్తుతం ఇక్కడ ఉస్మానియా వైద్యులే డిప్యుటేషన్‌పై సేవలు అందిస్తున్నారు. ఓపీకి వచ్చే సాధారణ రోగులకు మందులు రాసి పంపుతున్నారు. నగరంలోని ప్రధాన ఆస్పత్రులన్నీ రోగులతో నిండిపోయాయి. ఇన్‌పేషెంట్ సేవలు ఇంకా ప్రారంభించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
వైద్యుడు సహా ఏఎస్‌ఐ మృతి..
కరోనాతో రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 210 మంది మృతి చెందారు. వీరిలో 190 మంది నగరవాసులే. తాజాగా హిమాయత్‌నగర్‌కు చెందిన డాక్టర్ జ్ఞానేశ్వర్‌రావు (77)తో మృతి చెందారు. తెలంగాణలో తొలి వైద్యుడి మరణం ఇదే. ఆయన ఇంటి పనిమనిషి (50)కి కూడా కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. కాలపత్తర్ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వర్తిస్తున్న ఏఎస్‌ఐ యూసఫ్ (47) కరోనాతో బాధపడుతూ సోమవారం గాంధీ ఆస్పత్రిలో మృతి చెందారు. మలక్‌పేట్ ఏరియా ఆస్పత్రికి చెందిన ఇద్దరు వైద్యులు సహా మొత్తం 9 మందిలో వైరస్ లక్షణాలు బయటపడ్డాయి.
90 శాతం కేసులు ఇక్కడే..
తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటి వరకు 7802 పాజిటివ్ కేసులు నమోదు కాగా, వీటిలో 5798 కేసులు గ్రేటర్ హైదరాబాద్‌లోనే నమోదయ్యాయి. ఇప్పటి వరకు 3,861 మంది కోలుకోగా.. ప్రస్తుతం 3,731 మంది గాంధీ సహా వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వీరిలో 90 శాతం మంది నగరవాసులే.
Comments
Please login to add a commentAdd a comment