ప్రతీకాత్మక చిత్రం
గాంధీఆస్పత్రి: కడుపులో పెరుగుతున్న శిశువులను మోస్తూ వృత్తిధర్మాన్ని నిర్వర్తిస్తున్నారు. బాధితులకు మేమున్నామనే భరోసా కల్పిస్తున్నారు. పేగుబంధం.. పడకపై ఉన్న ప్రాణం రెండూ తమకు ముఖ్యమేనంటున్నారు కరోనా విధులు నిర్వహిస్తున్న కాబోయే అమ్మలు. కోవిడ్ నోడల్ కేంద్రమైన సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో పలువురు గర్భిణులు రెండు ప్రాణాలను పణంగా పెట్టి నర్సింగ్ విధులు నిర్వహిస్తూ నైటింగేల్ వారసులుగా నిరూపించుకుంటున్నారు.
గర్భంతో ఉండి కరోనా డ్యూటీ చేస్తున్నావా? అని ముక్కున వేలేసుకున్న ఇరుగుపొరుగువారి మాటలు పట్టించుకోకుండా, కుటుంబ సభ్యులు, సన్నిహితులు వారిస్తున్నా లెక్కచేయలేదు. కడుపులో పెరుగుతున్న శిశువుకు ఎటువంటి హాని కలగకుండా.. తాము ఒత్తిడికి గురికాకుండా అన్ని జాగ్రత్తలు పాటిస్తూ బాధ్యతలు సమపాళ్లలో నిర్వహిస్తూ శభాష్ అనిపించుకుంటున్నారు. గాంధీఆస్పత్రిలో నర్సింగ్ విధులు నిర్వహిస్తున్న వారిలో పదిమంది గర్భిణులు ఉన్నారు.
నాలుగు నుంచి ఎనిమిది నెలలు నిండినవారు కరోనాను లెక్క చేయకుండా విధులు నిర్వహించడం విశేషం. గర్భిణులైన నర్సింగ్ సిస్టర్స్ అశ్వినీ, రాణి, అనిత, అఖిల, గంగా, కవిత, సరోజ, రవళిలు అందిస్తున్న సేవలను గాంధీ సూపరింటెండెంట్ రాజారావు, నర్సింగ్ సూపరింటెండెంట్ మంగమ్మల అభినందనలు అందుకుంటున్నారు. ఈ సందర్భంగా వారు ఏమంటున్నారంటే..
తగిన జాగ్రత్తలు తీసుకున్నా..
వృత్తిధర్మాన్ని గౌరవించి భర్త నందకిషోర్, కుటుంబ సభ్యులు సహకరించారు. గాంధీ గైనకాలజీ విభాగంలో విధులు నిర్వర్తిస్తున్నాను. కడుపులో పెరుగుతున్న శిశువు ఆరోగ్య విషయమై ఆందోళన ఉన్నప్పటికీ కరోనా విధుల నిర్వహణలో తగిన జాగ్రత్తలు తీసుకున్నాను. డ్యూటీలో చేరిన నాడు చేసిన ప్రమాణానికి కట్టుబడి ఉన్నాను. కరోనా పాజిటివ్ వచ్చిన సమయంలో తీవ్ర మానసిక ఆందోళనకు గురయ్యా. కొన్ని రోజుల్లోనే నెగెటివ్ రావడం, కడుపులో పెరుగుతున్న శిశువు ఆరోగ్యంగా ఉన్నట్లు తెలుసుకుని, తిరిగి విధుల్లో చేరాను. –అశ్వినీ
సేవలు అందించేందుకే..
ఇప్పుడు నాకు ఏడో నెల. గాంధీఆస్పత్రిలో కాంట్రాక్టు పద్ధతిపై నర్సింగ్ విధులు నిర్వహిస్తున్నాను. ఫస్ట్ ప్రెగ్నెన్సీ కావడంతో కోవిడ్ నోడల్ సెంటరైన గాంధీఆస్పత్రిలో డ్యూ టీ చేసేందుకు కుటుంబసభ్యులు అంగీకరించలేదు. సేవలు అందించేందుకే ఈ వృత్తిని ఎంచుకున్నానని అందరినీ ఒప్పించాను. నెలల నిండేంత వరకు డ్యూటీకి హాజరవుతాను. శిశువు ఆరోగ్యంపై ఆందోళన ఉన్నప్పటికీ అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాను. భర్త సాయిబాబా, కుటుంబసభ్యుల ప్రోత్సాహం మరువలేనిది. – రాణి
మా శ్రమను గుర్తిస్తే చాలు..
కడుపులో పెరుగుతున్న శిశువుతో పాటు రెండు ప్రాణాలకు తెగించి అందిస్తున్న సేవలను గుర్తించి ప్రోత్సహిస్తే సహచరులు కూడా రెట్టించిన ఉత్సాహంతో విధులు నిర్వహిస్తారు. కరోనాను జయించి బాధితులు డిశ్చార్జి అవుతున్న క్షణాలు మరిచిపోలేనివి. నేను విధులు నిర్వహించే వార్డులో గర్భిణీ బాధితులు ఉన్నారు. నేను కూడా ప్రెగ్నెన్సీతో మీతోపాటే వార్డులో ఉన్నాను అంటూ ధైర్యం చెప్పడంతో వారంతా త్వరితగతిన కోలుకోవడం ఓ గొప్ప అనుభవం. పీపీఈ కిట్ వేసుకుని విధులు నిర్వహించాలంటే ఓర్పు, సహనంతోపాటు మానసికబలం ఎంతో అవసరం. – అనిత
Comments
Please login to add a commentAdd a comment